ఆంధ్రమహిళ
| సంపాదకులు | దుర్గాబాయి దేశ్‌ముఖ్ చన్నఘంటమ్మ లక్ష్మీ రఘురాం మాలతీ చందూర్ |
|---|---|
| తరచుదనం | మాస పత్రిక |
| ప్రచురణకర్త | ఆంధ్ర మహిళా సభ |
| మొదటి సంచిక | 1943 |
| దేశం | భారతదేశం |
| కేంద్రస్థానం | మద్రాసు |
| భాష | తెలుగు |
మహిళల కొరకు మహిళలే నడిపిన తెలుగు పత్రిక ఆంధ్రమహిళ. మద్రాసు లోని ఆంధ్ర మహిళా సభ వారు ప్రచురించిన మాస పత్రిక ఇది. 1943 లో ఈ పత్రిక ప్రచురణ మద్రాసులో మొదలైంది. దుర్గాబాయి దేశ్‌ముఖ్ దీనికి సంపాదకురాలు. 1960 వ దశకం మధ్య వరకూ వెలువడి ఆపై ఆగిపోయింది.
చరిత్ర
[మార్చు]1943 లో దుర్గాబాయి దేశ్‌ముఖ్ సంపాదకత్వంలో ఆంధ్రమహిళ మాసపత్రిక ప్రచురణ మొదలైంది. చన్నఘంటమ్మ సహ సంపాదకురాలు. పూర్తిగా మహిళలే ఈ పత్రికను నిర్వహించేవారు. స్త్రీలపట గాంధీజీ వెలువరించే అభిప్రాయాలను పత్రిక ప్రచురించేది. "ఆంధ్ర నారీ నంఘానికి ఆండగా అనుగు సోదరిగా, ఆశయ ఫలంగా ఆంధ్రమహిళ అభ్యుదయ పతాక హస్తమై ఆవతరించి ఆంజలి ఘటిస్తున్నది" ఆని తొలి నంచికలో పత్రిక తన ఆశయం ప్రకటించింది.[1]
"నవ్యమార్గాలలో సాధనచేస్తున్న స్త్రీలు చాలామంది దానిలో వ్రాయడము మొదలుపెట్టినందుచేత భారతిలో వ్రాసే స్త్రీలసంఖ్య తక్కువైంది!" అని నవ్యాంధ్ర సాహిత్యవీథులు పుస్తకంలో పేర్కొన్నారు.[2]
దుర్గాబాయి డిల్లీలో కేంద్ర సాంఘిక సంక్షేమ సంస్థ అధ్యక్షురాలవడంతో 1952 ఆగస్టు నుండి పత్రిక సంపాదకత్వ బాధ్యతలు చన్నఘంటమ్మ తీసుకుంది. ఆమె కూడా ఆంధ్ర రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డులో పదవి స్వీకరించడంతో 1954 అక్టోబరు నుండి పత్రిక సంపాదకత్వ బాధ్యతలను లక్ష్మీ రఘురాం చేపట్టింది.[3] కంచర్ల సుగుణమణి సంయుక్త సంపాదకురాలు. ఆ తరువాత కె.రామలక్ష్మి, సి.ఆనందారామం లు సంపాదకత్వం నిర్వహించారు. 1964 లో ఆంధ్ర మహిళా సభ సెక్రెటరీయే పత్రిక సంపాదకురాలుగా ఉండేవారు.
1960 వ దశకం మధ్యలో పత్రిక ప్రచురణ ఆగిపోయింది.
శీర్షికలు, రచనలు
[మార్చు]ఆంధ్రమహిళలో రచనలు వ్యావహారిక భాషలో ఉండేవి. సంపాదకీయంతో పాటు కథలు, నాటికలూ, వచన కవితలూ, ఛందోబద్ధ పద్యాలూ ప్రచురించేవారు. రాజకీయాలు శీర్షిక కింద సమకాలీన రాజకీయాలపై వ్యాఖ్యానం ఉండేది. బాలానందం శీర్షికన పిల్లలకు ఆసక్తి కలిగించే వ్యాసాలు, పాకకళ శీర్షికలో వంటల విశేషాలు ప్రచురించేవారు. హిందీ నేర్చుకునేవారి సౌలభ్యం కోసం హిందీపాఠాలు ప్రచురించేవారు.[4] వ్యాపార ప్రకటనల భాగం ఎక్కువగానే ఉండేది.
కె. రామలక్ష్మి, కంచర్ల సుగుణమణి, కనుపర్తి వరలక్ష్మమ్మ, కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రసిద్ధ రచయిత్రులూ, రచయితల రచనలు వచ్చేవి.
మూలాలు
[మార్చు]- ↑ డి, పద్మావతి (1989). అస్పష్ట ప్రతిబింబాలు తెలుగులో స్త్రీల పత్రికలు ఒక పరిశీలన. p. 51.
- ↑ కురుగంటి, సీతారామయ్య (1994). కోవెల, సుప్రసన్నాచార్య (ed.). నవ్యాంధ్ర సాహిత్య వీధులు. హైదరాబాదు: తెలుగు విశ్వవిద్యాలయం. p. 392.
- ↑ ఆంధ్రమహిళ. Vol. 11 (6 ed.). మద్రాసు: ఆంధ్ర మహిళా సభ. 1954. p. 1.
- ↑ ఆంధ్రమహిళ. మద్రాసు: ఆంధ్ర మహిళా సభ. 1950. p. 49.