ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి
Akundi vm sastry.jpg
జననం1860
మరణం1916 ఫిబ్రవరి 2
వృత్తికవి
తల్లిదండ్రులు
 • వేంకటశాస్త్రి (తండ్రి)
 • వేంకమాంబ (తల్లి)

ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి (1860-1916) ప్రముఖ కవి, పండితులు.

వీరు ఆరామద్రావిడ శాఖీయులు, ఆశ్వలాయన సూత్రులు, ఆత్రేయస గోత్రులు. వీరి జన్మస్థానము:కాకరపర్రు (తణుకు తాలూకా), నివాసస్థానము:ఖండవల్లి. రాజమహేంద్రవరమున నుద్యోగము. వీరి తల్లి: వేంకమాంబ. తండ్రి: వేంకటశాస్త్రి. జననము: 1860 సం. నిర్యాణము: 2-2-1916 స.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

వ్యాసమూర్తి శాస్త్రి గారు కాకరపర్రు గ్రామంలో తన మాతామహుల ఇంట సౌమ్య నామ సంవత్సరం క్రీ.శ.1860లో ఒక శుభముహూర్తాన ఆకుండి వేంకటశాస్త్రి, వేంకమాంబ దంపతులకు జన్మించారు. వీరు తమ తండ్రి వద్ద అమరము, ఆంధ్రనామ సంగ్రహము, రఘువంశము, భట్టి కావ్యము, వరదరాజుల లఘు కౌముది మొదలైన గ్రంథాలను చదివారు. వేదుల సోమనాథశాస్త్రి వద్ద నాటకాలంకార సాహిత్య గ్రంథాలను చదివారు. ఆణివిళ్ల శంభుశాస్త్రి వద్ద కారికావళి, ముక్తావళులను అభ్యసించారు. నివటూరి సోమనాథశాస్త్రి దగ్గర సిద్ధాంత కౌముది, తత్త్వ బోధినులను; ఆదిభట్ట రామమూర్తి శాస్త్రి వద్ద ఉపనిషత్ భాష్యాన్ని, బ్రహ్మసూత్ర భాష్యాన్ని, ఆనందగిరిని, రామానంద రత్నప్రభా బ్రహ్మవిద్యాభరాణాదులను సాంప్రదాయబద్ధంగా చదివారు. వీటికి తోడుగా ఆణివిళ్ల వేంకటశాస్త్రి వద్ద పారాశరి, కాలామృతము, ఉమామహేశ్వర సంవాదము మొదలైన జ్యోతిష గ్రంథాలను; పురాణపండ భద్రయ్యశాస్త్రి వద్ద తెలుగు లక్షణములను, గోవిందవజ్ఝల రాజన్నశాస్త్రి సమక్షంలో ఆంధ్ర శబ్దచింతామణిని, వృత్తరత్నాకరాది గ్రంథాలను చదివారు. గీర్వాణాంధ్ర భాషలతో పాటు ఆంగ్లభాషలో కూడా కొంత ప్రావీణ్యమును సంపాదించారు.

ఉద్యోగం[మార్చు]

వీరు క్రీ.శ.1872-1874ల మధ్య తమ స్వగ్రామం ఖండవల్లిలో ఆంధ్రోపాధ్యాయులుగా పనిచేసి, తరువాత క్రీ.శ.1874 నుండి 1880 వరకు ఆరేండ్లు కొత్తపేటలో తెలుగు పండితులుగా పనిచేసారు. పిమ్మట రాజమండ్రి చేరి అక్కడి ప్రాథమిక పాఠశాలలో సంస్కృతభాషా పండిత పదవిని సంపాదించి పనిచేస్తూ, ఆ తరువాత దొరతనమువారి బోధనాభ్యసన కళాశాలా సంస్కృతోపాధ్యాయ పదవిని పొంది, కొంత కాలానికి శాస్త్ర కళాశాలా సంస్కృత భాషా పండితుడై చివరి వరకు ఆ పదవి నందే కొనసాగారు. ఇతడు రాజా మంత్రిప్రగడ భుజంగరావు జమీందారు సంస్థానంలో ఆస్థాన పండితుడిగా ఉన్నాడు. ఇతని జీవితచరిత్రను ఇతని దౌహిత్రుడు వేదుల రామకృష్ణశాస్త్రి 1960లో వేదుల రామచంద్రకీర్తి అనే పేరుతో రచించాడు[1].

రచించిన గ్రంథాలు[మార్చు]

 • శ్రీమహాభారత నవనీతము (పదమూడు పర్వములు),
 • ప్రబోధచంద్రోదయము
 • అనర్ఘరాఘవము
 • శుద్ధాంధ్ర ఋతుసంహారము
 • గంగాలహరీ స్తోత్రము
 • భామినీ విలాసము
 • ఆధ్యాత్మ రామాయణము,
 • మయూర సూర్యశతకము (ఆంధ్రీకృతము)
 • భారతఫక్కి (విమర్శ)
 • పరాశరస్మృతి[2] (తెనుగువచనము)
 • కృష్ణా పుష్కర మహాత్మ్యము.
 • ఆంధ్ర నైషదము
 • విదుల

మూలాలు[మార్చు]

 1. తణుకు తళుకులు. తణుకు: కానూరి బదరీనాథ్. 17 December 2010. p. 20.
 2. ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి (1902). పరాశరస్మృతి. మద్రాసు: మన్నవ సింహాచలము. Retrieved 15 September 2020.