Jump to content

ఆగ్రా, ఔధ్ సంయుక్త ప్రావిన్సులు

వికీపీడియా నుండి
ఆగ్రా, ఔధ్ సంయుక్త ప్రావిన్సులు
ప్రావిన్సు , బ్రిటిషు భారతదేశం

1902–1937
Flag Coat of arms
Flag Coat of arms
Location of సంయుక్త ప్రావిన్సులు
Location of సంయుక్త ప్రావిన్సులు
సంయుక్త ప్రావిన్సుల మ్యాపు, c.1909
Capital అలహాబాదు
చరిత్ర
 - Established 1902
 - =
 - Disestablished 1937
Today part of భారతదేశం

యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ ఆగ్రా అండ్ ఔధ్ అనేది బ్రిటిష్ భారతదేశంలో ఒక ప్రావిన్స్. ఇది 1902 మార్చి 22 నుండి 1937 ఏప్రిల్ 1 వరకు ఉనికిలో ఉంది. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా దీని పేరును యునైటెడ్ ప్రావిన్సెస్ (UP) అని మార్చారు. ఈ ప్రావిన్సును సాధారణంగా ఈ పేరుతోనే పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా 1950 వరకు ఇది భారతదేశంలో ఇదే పేరుతో ఒక ప్రావిన్స్‌గా ఉండేది.[1]

ఇది సుమారుగా ప్రస్తుత భారత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్ (UP) ఉత్తరాఖండ్‌లు ఉన్న ప్రదేశంలో ఉండేది. అలహాబాద్ ఈ రాష్ట్రానికి రాజధానిగా, పరిపాలనా ప్రధాన కార్యాలయంగా పనిచేసింది. 1856 లో ఔధ్ రాష్ట్రాన్ని విలీనం చేసిన రెండు సంవత్సరాల తర్వాత, అంటే 1858 తర్వాత, 1902 వరకు, ఈ ప్రాంతం వాయవ్య ప్రావిన్సులు, ఔధ్‌గా ఉనికిలో ఉండేది, ఇందులో ఔధ్ ఒక చీఫ్ కమీషనర్‌షిప్‌గా ఉండేది.

1921 తర్వాత కొంతకాలానికి లక్నో దాని రాజధానిగా మారింది. నైనిటాల్రాష్ట్రానికి వేసవి రాజధానిగా ఉండేది.

చరిత్ర

[మార్చు]

18వ శతాబ్దం నాటికి, ఒకప్పుడు విశాలంగా ఉన్న మొఘల్ సామ్రాజ్యం అంతర్గత కలహాల వల్ల, దక్కన్ నుండి మరాఠాల విస్తరణ, బెంగాల్ నుండి బ్రిటిష్ వారి విస్తరణ, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఆఫ్ఘన్‌ల విస్తరణ వలన పతన స్థితిలో ఉంది. శతాబ్దం మధ్య నాటికి, ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ ప్రాంతంలో పలు రాజ్యాలు ఉండేవి: మధ్య, తూర్పున అవధ్, మొఘల్ చక్రవర్తికి విధేయత చూపినప్పటికీ వాస్తవానికి స్వతంత్రంగా ఉన్న ఒక నవాబు పాలనలో ఉండేది. ఉత్తరాన ఆఫ్ఘన్‌లు పాలించే రోహిల్‌ఖండ్ ఉండేది; దక్షిణాన బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని మరాఠాల పాలనలో ఉండేదిచివరిగా మొఘల్ సామ్రాజ్యం మొత్తం దోఆబ్ (గంగా, యమునా నదుల మధ్య ఉన్న భూభాగం)తో పాటు ఢిల్లీ ప్రాంతాన్ని పాలించేది.

1765 లో బక్సర్ యుద్ధంలో అవధ్, మొఘల్ చక్రవర్తి సంయుక్త సైన్యాలు బ్రిటిష్ వారిని ఎదుర్కొన్నాయి. బ్రిటిష్ వారు గెలిచారు గానీ వారు ఏ భూభాగాన్నీ స్వాధీనం చేసుకోలేదు; అవధ్ మొత్తాన్నీ నవాబుకు తిరిగి ఇచ్చేసారు. మొఘల్ చక్రవర్తి షా ఆలంకు దిగువ దోఆబ్‌లోని అలహాబాద్, కోరా సుబాలను తిరిగి ఇచ్చేసారు. అలహాబాద్ కోటలో బ్రిటిష్ సైనిక దళం కూడా ఉండేది. తరువాత గవర్నర్-జనరల్ వారెన్ హేస్టింగ్స్, రోహిల్లా యుద్ధంలో రోహిల్‌ఖండ్‌ను జయించడానికి నవాబుకు సహాయంగా బ్రిటిష్ సైన్యాన్ని అప్పుగా ఇవ్వడం ద్వారానూ, షా ఆలం మరాఠాల వశంలోకి వెళ్ళాడనే కారణంతో అలహాబాద్, కోరాను అవధ్‌కు ఇవ్వడం ద్వారానూ అవధ్ భూభాగాన్ని విస్తరించాడు. అదే సమయంలో బ్రిటిష్ వారు అవధ్ నుండి బెనారస్ రాష్ట్రాన్ని పొందారు.

తదనంతరం, వెల్లెస్లీ (గవర్నర్-జనరల్ 1797–1805) రాక వరకు పెద్దగా మార్పు ఏమీ జరగలేదు. అతను రెండు విడతలలో చాలా పెద్ద భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 1801 లో అతను అవధ్ నవాబు నుండి రోహిల్‌ఖండ్, దిగువ దోఆబ్, గోరఖ్‌పూర్ విభాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తద్వారా ఉత్తరం మినహా అన్ని వైపులా అవధ్‌ను చుట్టుముట్టాడు. 1804 లో రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధంలో లార్డ్ లేక్ సాధించిన విజయాల ఫలితంగా, సింధియా నుండి బుందేల్‌ఖండ్‌లోని కొంత భాగాన్ని, ఆగ్రాతో సహా మిగిలిన దోఆబ్‌ను, అలాగే ఢిల్లీలో వృద్ధుడూ, అంధుడూ ఐన చక్రవర్తి షా ఆలంను సంరక్షించే బాధ్యతనూ పొందాడు. 1815 లో గూర్ఖా యుద్ధం తర్వాత కుమావోన్ విభాగాన్ని, 1817లో మరాఠా పీష్వా నుండి బుందేల్‌ఖండ్‌లోని మరికొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అప్పగించబడిన, జయించబడిన ప్రావిన్సులుగా పిలువబడే ఈ కొత్తగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు, బెంగాల్‌లో భాగంగా గవర్నర్-జనరల్ పరిపాలనలో కొనసాగాయి. 1833లో, ఆగ్రాను రాజధానిగా చేసుకొని ఒక కొత్త ప్రెసిడెన్సీని (ప్రావిన్స్‌ను) ఏర్పాటు చేయడానికి పార్లమెంటు చట్టం చేసింది. కానీ ఈ పథకం ఎప్పుడూ పూర్తిగా అమలు కాలేదు. 1835 లో అప్పటి వాయవ్య ప్రావిన్సులుగా పిలువబడే వాటికి లెఫ్టినెంట్-గవర్నర్‌ను నియమించడానికి మరో శాసనం అధికారం ఇచ్చింది.

వాయవ్య ప్రావిన్సులలో ఢిల్లీ, గుర్గావ్ భూభాగాలు ఉండేవి. 1857 తిరుగుబాటు తర్వాత వీటిని పంజాబ్‌కు బదిలీ చేసారు. 1853 తర్వాత సాగర్, నర్మదా భూభాగాలు కూడా ఇందులో భాగంగా ఉండేవి. 1861 లో ఇవి మధ్య ప్రావిన్సులలో భాగమయ్యాయి. అవధ్ దాని నవాబు ఆధీనంలోనే ఉండిపోయింది. అతనికి 1819లో రాజు అనే బిరుదును స్వీకరించడానికి అనుమతి లభించింది. 1856 లో అవధ్‌ను విలీనం చేసి, దానిని ఒక ప్రత్యేక ప్రధాన కమిషనర్‌షిప్‌గా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1857 తిరుగుబాటు జరిగింది, ఆ సమయంలో ఈ రెండు ప్రావిన్సులలోని చాలా భాగం నుండి బ్రిటిష్ పాలన ఆనవాళ్ళన్నీ కొంతకాలం పాటు తుడిచిపెట్టుకుపోయాయి. లెఫ్టినెంట్-గవర్నరును, ఆగ్రాలోని కోటలో బంధించగా అతను అక్కడే మరణించాడు. పద్దెనిమిది నెలల పాటు సాగిన అనేక పోరాటాల తర్వాత మాత్రమే అవధ్‌ను తిరిగి స్వాధీనం చేసుకోగలిగారు.

1877లో వాయవ్య ప్రావిన్సుల లెఫ్టినెంట్-గవర్నరు, ఔధ్ చీఫ్ కమిషనరు పదవులను ఒకే వ్యక్తికి అప్పగించారు. ఈ పద్ధతి బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలనలో సర్వసాధారణం. దీనిని 'డబుల్-హ్యాటింగ్' (రెండు టోపీలు పెట్టుకోవడం) అని అనేవారు. 1902 లో యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ ఆగ్రా అండ్ ఔధ్ అనే కొత్త పేరును ప్రవేశపెట్టినప్పుడు, చీఫ్ కమిషనర్ పదవిని తొలగించారు. అయినప్పటికీ ఔధ్ తన పూర్వ స్వాతంత్ర్యపు కొన్ని గుర్తులను నిలుపుకుంది. 1937 ఏప్రిల్ 1 న, ప్రావిన్స్ పేరును యునైటెడ్ ప్రావిన్సెస్ (UP)గా కుదించారు.[1]

యునైటెడ్ ప్రావిన్సెస్ 1947లో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారతదేశంలో ఒక రాష్ట్రంగా మారింది. భారతదేశ రాజకీయ ఏకీకరణ తరువాత, 1950 జనవరి 26 న కొత్త భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున, రాంపూర్, బెనారస్, తెహ్రీ గర్వాల్ అనే మూడు పూర్వపు సంస్థానాలను దీనికి చేర్చి, దీనికి ఉత్తర ప్రదేశ్ అని పేరు మార్చారు.[1]

భౌగోళికం

[మార్చు]

ఈ ప్రావిన్సులకు ఉత్తరాన టిబెట్, ఈశాన్యాన నేపాల్ ; తూర్పు, ఆగ్నేయాల్లో బెంగాల్‌లోని చంపారన్, సరన్, షాహాబాద్, పాలామౌ జిల్లాలు; దక్షిణాన సెంట్రల్ ప్రావిన్సులలోని రెండు చోటా నాగ్‌పూర్ సంస్థానాలు, సెంట్రల్ ప్రావిన్సులలోని రేవా, కొన్ని చిన్న సంస్థానాలు; పశ్చిమాన గ్వాలియర్, ధోల్పూర్, భరత్‌పూర్ సంస్థానాలు, పంజాబ్‌లోని గుర్గావ్, ఢిల్లీ, కర్నాల్, అంబాలా జిల్లాలు, పంజాబ్‌లోని సిర్మూర్, జుబ్బల్ సంస్థానాలు సరిహద్దులుగా ఉండేవి. యమునా నది పశ్చిమ సరిహద్దులో భాగంగా, గంగా నది దక్షిణ సరిహద్దులో భాగంగా, గండక్ నది తూర్పు సరిహద్దులో భాగంగా ఉండేవి; ఇతర సరిహద్దులు కృత్రిమమైనవి. జిల్లా సర్వేల ప్రకారం, రెండు ప్రావిన్సుల విస్తీర్ణాలు చదరపు మైళ్లలో: ఆగ్రా, 83,198; ఔధ్, 23,966; మొత్తం, 107,164.9 చ.మై. జిల్లా సరిహద్దులను ఏర్పరిచే, జిల్లా వివరాల నుండి మినహాయించబడిన కొన్ని నదీపాయలతో సహా, 041 మొత్తం వైశాల్యం 107,494 square miles (278,410 km2). ప్రావిన్సులలోని రెండు స్థానిక సంస్థానాల (రాంపూర్, తెహ్రీ) విస్తీర్ణం 5,079 square miles (13,150 km2) కిమీ 2). దీనికి అదనం.

1834లో మొదటిసారిగా ఆగ్రా ప్రెసిడెన్సీ ఏర్పడింది. అప్పటి వరకు వేరుగా ఉన్న ప్రాంతాన్ని బెంగాల్ ప్రెసిడెన్సీలో చేర్చారు. దీనిని కొన్నిసార్లు పశ్చిమ ప్రావిన్సులు అనేవారు. యునైటెడ్ ప్రావిన్సులలో నాలుగు విభిన్న దేశ భాగాలు ఉన్నాయి, అవి హిమాలయాల భాగాలు, ఉప-హిమాలయ ప్రాంతాలు, గంగా మైదానం, మధ్య భారతదేశంలోని కొండ ప్రాంతాల భాగాలు.[2]

పరిపాలనా విభాగాలు

[మార్చు]

ఆగ్రా, ఔధ్ సంయుక్త ప్రావిన్సులలో 48 జిల్లాలతో కూడిన 9 విభాగాలు ఉండేవి.

 

* మీరట్ డివిజన్

సంస్థానాలు

[మార్చు]

ద్వంద్వ పాలన (1920–37)

[మార్చు]

భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం, యునైటెడ్ ప్రావిన్సెస్ శాసన మండలిని 123 స్థానాలకు విస్తరించారు. ఇందులో ఎక్కువ మంది ఎన్నికైన భారతీయ సభ్యులు కూడా ఉన్నారు. ఈ సంస్కరణల పర్యవసానంగా ద్వంద్వాధికారం వచ్చింది. దీని ద్వారా వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, స్థానిక ప్రభుత్వం వంటి కొన్ని బాధ్యతలను ఎన్నికైన మంత్రులకు సంక్రమించాయి. అయితే, ఆర్థిక, పోలీసు, నీటిపారుదల వంటి ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలను మాత్రం గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల వద్దే ఉంచారు. యునైటెడ్ ప్రావిన్సెస్‌లోని ప్రముఖ సభ్యులు, మంత్రులలో కొందరు -మహమ్మద్ అలీ మహమ్మద్ ఖాన్ (హోమ్ సభ్యుడు), సివై చింతామణి (విద్య, పరిశ్రమల మంత్రి), జగత్ నారాయణ్ ముల్లా (స్థానిక స్వయం పరిపాలన మంత్రి) [3], రాజేశ్వర్ బాలి (విద్యా మంత్రి), కుమార్ రాజేంద్ర సింగ్, రాజా జగన్నాథ్ బక్ష్ సింగ్.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • ఆగ్రా, ఔధ్ సంయుక్త ప్రావిన్సుల గవర్నర్ల జాబితా

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 Paxton, John (1988), "Uttar Pradesh", The Statesman's Year-Book Historical Companion, Palgrave Macmillan, pp. 138–139, ISBN 978-1-349-19448-3, In 1902 the name 'United Provinces of Agra and Oudh' came into use, shorted to 'United Provinces' in 1935. After independence the territory was enlarged by the addition of the small states of Rampur, Banaras and Tehri-Garhwal. In 1950 the Provinces became the state of Uttar Pradesh. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "paxton-statesmanyb-historical" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "Imperial Gazetteer2 of India, Volume 24, page 133 -- Imperial Gazetteer of India -- Digital South Asia Library". dsal.uchicago.edu. Archived from the original on 4 March 2016. Retrieved 21 March 2018.
  3. Jafri, Saiyid Zaheer Husain (2009). Transformations in Indian History. Anamika Publishers and Distributors. p. 447. ISBN 9788179752616.
  4. Rau, M. Chalapathi. Govind Ballabh Pant.