ఆధునిక భారతీయ చిత్రకళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆధునిక భారతీయ చిత్రకళ (ఆంగ్లం: Modern Indian Painting) 19వ శతాబ్దంలో సాంప్రదాయిక పద్ధతులలో చిత్రీకరణ కనుమరుగవుతుండగా బ్రిటీషు వారిచే కొత కళాశాలలు నెలకొల్పబడుతోన్న సమయంలో కలకత్తాలో ఉద్భవించిన ఒక కళా ఉద్యమం. రాజా రవివర్మ వంటి మహామహులు తైల వర్ణ చిత్రాలను ఏటవాలు బల్లపై పాశ్చాత్య సాంప్రదాయిక పద్ధతులు అవలంబించేవారు. ఈ పాశ్చాత్య ప్రభావానికి వ్యతిరేకంగా ప్రాథమికవాద పునరుజ్జీవనానికి దారి తీసినది. భారతదేశపు సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకొనే ఈ శైలియే బెంగాలీ శైలి చిత్రకళ. కావ్యం లాగా సాగిపోయే గ్రామీణ సన్నివేశాలను చిత్రీకరించటం రవీంద్రనాధ టాగూరు మరల తిరిగి ప్రారంభించగా, శాంతినికేతన్ ఈ శైలిని కొనసాగించింది.

బ్రిటీషు కళాశాలలు[మార్చు]

18వ శతాబ్దంలో జొహాన్ జొఫ్ఫాని, టిల్లీ కెటిల్, విలియం హాడ్జెస్, థామస్ డేనియల్, విలియం డేనియల్, జోషువా రేనాల్డ్స్, ఎమిలీ ఈడెన్, జార్జ్ చిన్నరీ వంటీ ఐరోపాకు చెందిన అనేక చిత్రకారులు తమ కీర్తిప్రతిష్ఠలు పెంచుకోవటానికి, అదృష్టాన్ని వెదుక్కొంటూ భారతదేశం వచ్చారు. ఆ సమయంలోనే ఇక్కడ ఏటవాలు బల్లపై తైలవర్ణ చిత్రాలు మొదలయ్యాయి.

ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకులు స్థానిక సహజ కళకు చక్కని విపణిని సృష్టించారు. 18వ శతాబ్దపు ద్వితీయార్థంలో కాగితం, మైకాలపై దైనందిన జీవితంలో కనబడే దృశ్యాలు, రాజప్రాసాదాలు, స్థానిక సంబరాలు, ఆచారాలు చిత్రీకరించటంతో ఒక ప్రత్యేక శైలి ఏర్పడినది. కంపెనీ శైలి చిత్రకళ లేదా పాట్నా శైలి చిత్రకళగా పేరొందిన ఈ కళ మొదట ముర్షీదాబాద్లో ప్రారంభమై ఇతర ప్రదేశాలకు వ్యాపించింది. అధికారవర్గం ఈ శైలిని అసమాన్య నాణ్యతా ప్రమాణాలుగల మిశ్రమ శైలిగా పరిగణించింది.

1857 తర్వాత జాన్ గ్రిఫిత్స్, జాన్ లాక్ వుడ్ కిప్లింగ్ (రుడ్యార్డ్ కిప్లింగ్ తండ్రి) భారతదేశానికి కలిసి వచ్చారు. గ్రిఫిత్ సర్ జే. జే స్కూల్ ఆఫ్ ఆర్ట్ కు నాయకత్వం వహించి భారతదేశానికి పయనించిన అత్యుత్తమ విక్టోరియన్ చిత్రకారులలో ఒకరిగా పేరొందాడు. కిప్లింగ్ 1878 లో లాహోర్లో స్థాపించబడ్డ మేయో స్కూల్ ఆఫ్ ఆర్ట్ కు నాయకత్వం వహించారు.

తొలిశకం బ్రిటీషు వారు భారతదేశ చరిత్ర, శిల్పాలు, సాహితీసంస్కృతులపై చూపిన శ్రద్ధ 19వ శతాబ్దంలో మెల్లగా సన్నగిల్లినది. పాశ్చాత్య విలువలను భారతీయ కళలలో చొప్పించటానికి బ్రిటీషు వారు కలకతా, మద్రాసులలో 1854లో, బొంబాయిలో 1857లో కళాశాలలను నెలకొల్పినది.

రాజా రవివర్మ[మార్చు]

రవివర్మ కళాఖండం - శకుంతల

రాజా రవివర్మ (1848-1906) ట్రావంకూరుకు చెందిన అద్భుతమైన చిత్రకారుడు. 1873లో వియన్నా కళాప్రదర్శనలో మొదటి బహుమతి అందుకొన్నప్పటి నుండి పాశ్చాత్య శైలి చిత్రకళపై వారికి ఆసక్తి కలిగినది. 1893 చికాగోలో జరిగిన కొలంబియన్ అంతర్జాతీయ కళాప్రదర్శనలో రవివర్మ కళాఖండాలకు రెండు బంగారు పతకాలు వచ్చినవి. ఆధునిక భారతీయ చిత్రకారులలో రవివర్మ ఆద్యులలో ఒకరిగా పరిగణించబడుతోన్నారు.

రవివర్మ కళాఖండాలు భారతదేశపు సంప్రదాయాలు-కళను అభ్యాసాలుగా పరిగణించే ఐరోపా సాంకేతిక పద్ధతుల సంగమంగా కొనియాడబడ్డాయి. భారతీయ సాంప్రదాయమైన చీరలను ధరించిన సరళమైన, సొగసైన స్త్రీల చిత్రపటాలకు ఆయన చిరస్మరణీయుడైనాడు. రామాయణం, మహాభారతం లోని సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లుగా చిత్రీకరించాడు.

రవివర్మ తన కళాఖండాలు 19వ శతాబ్దంలో భారతదేశానికి ఒక నూతన నాగరిక గుర్తింపును తీసుకువస్తాయని భావించాడు. శాస్త్రీయ గ్రీకు, రోమను నాగరికతలో కళ ఒక విభాగంగా కలిగి ఉన్నట్లు భారతదేశపు నాగరికతలో కూడా కళ అలా అంతర్భాగం అవ్వాలని తపించాడు. భారతదేశంలో జాతీయ జాగరూకతను పెంపొందించటంలో వర్మ కళాఖండాలు కీలక పాత్ర వహించినవి. తన కళాఖండాలు సగటు మనిషికి చేరువ అవ్వాలనే ఉద్దేశంతో ఒక ముద్రణాయంత్రాన్ని కొనుగోలు చేసి వాటి కాపీలను ముద్రించాడు. కానీ వర్మ మరణించిన పలు దశాబ్దాలకు గానీ ఇవి మధ్యతరగతి కుటుంబీకుల ఇళ్ళలోకి చేరలేదు. తాను జీవించినంతకాలం వర్మ చిత్రకళలో ఉద్దండుడు అని కీర్తింపబడ్డనూ, కాలం చేసిన కొన్నేళ్ళకి, పాశ్చాత్య కళను అనుకరించినవాడుగా నిందింపబడ్డాడు.

1906లో 58వ ఏట రవివర్మ మరణించాడు. కొన్ని విమర్శలున్ననూ భారతదేశపు చిత్రకళ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొన్నాడు.

బెంగాలీ శైలి చిత్రకళ[మార్చు]

కళా ఉద్యమానికి ఆద్యుడైన అబనీంద్రనాధ టాగూరు బెంగాలీ శైలిలో చిత్రీకరించిన భారతమాత

బ్రిటీషు సామ్రాజ్యం భారతీయ కళలోకి తమ పద్ధతులను చొప్పించటం పై కళారంగంలో నిరసనలు వెల్లువెత్తాయి. దీనికి బెంగాలీ కళాకారులు మార్గదర్శకత్వం వహించారు.

భారతీయ ఆధ్యాత్మిక చింతన పాశ్చాత్య దేశాలపై ప్రభావం చూపనారంభించింది. ఈ నిరసనల నేపథ్యంలో అప్పటి బ్రిటీషు ఉపాధ్యాయులు ఎర్నెస్ట్ బిన్ఫీల్డ్ హ్యావెల్ కలకత్తా కళాశాలలో సంస్కరణలు చేపట్టే ప్రయత్నాలలో భాగంగా విద్యార్థులను ముఘల్ శైలి చిత్రకళను అభ్యసించమని సలహా ఇచ్చారు. ఇది పెనువివాదంగా మారినది. విద్యార్థులు సమ్మెకు దిగారు. జాతీయ వాదులు, స్థానిక ప్రసారమాధ్యమాలు దీనిని తిరోగమనంగా వ్యాఖ్యానించాయి. రవీంద్రనాధ టాగూరు వంశానికి చెందిన అబనీంద్రనాధ టాగూరు హ్యావెల్ ను సమర్థించాడు.

ముఘల్ శైలి చిత్రకళ స్ఫూర్తిగా చాలా కళాఖండాలను సృష్టించాడు. పాశ్చాత్య శైలిలో భౌతికత కనబడుతుందని, ఈ శైలిలో భారతదేశపు విభిన్న ఆధ్యాత్మిక భావాలు తొణికిసలాడుతాయని హ్యావెల్ భావించాడు. అబన్ చిత్రీకరించిన భారతమాత కళాఖండంలో దైవం వలె ఆమెకు నాలుగు చేతులు ఉంటాయి. వాటితో భారతదేశాన్ని సూచించే శ్వేతాంబరము, తాళపత్ర గ్రంథాలు, మూలికలు, రుద్రాక్షను భారతమాత పట్టుకొని ఉంటుంది. ఈ శైలిలో ఇతర చిత్రకారులు కూడా కళాఖండాలను సృష్టించటం ప్రారంభం అయినది. కొండొకచో, శిల్పాకారులు కూడా ఈ శైలిలో శిల్పాలు చెక్కసాగారు. అయితే బెంగాలీ శైలిని, అందులోని ఆధ్యాత్మిక మూలాలని కొందరు బెంగాలీలే వ్యతిరేకించారు.

అబనీంద్రనాథ్ కు ఇతర దేశపు కళాకారులతో పెరిగిన పరిచయాలు, స్వాతంత్ర్యానంతరం పెరిగిన ఆధునిక భావాల వలన బెంగాలీ శైలి చిత్రకళ విస్తరించింది.

శాంతినికేతన్[మార్చు]


స్వాతంత్య్రానంతరం[మార్చు]

స్వతంత్రం ప్రాప్తించిన నాటికి భారతదేశంలో చాలా కళాశాలలు ఆధునిక సాంకేతిక పద్ధతులు బోధించసాగాయి. అనేక కళాప్రదర్శనశాలలు నెలకొల్పబడ్డాయి. ఆధునిక భారతీయ చిత్రకళ పాశ్చాత్య శైలిని పుణికిపుచ్చుకొన్ననూ అందులో భారతీయ మూలాలను మాత్రం చెరగనివ్వదు. ఈ శైలి కళాకారులు మొదట భారతదేశంలో మాత్రమే పేరు గడించినా, తర్వాత అంతర్జాతీయ కళాపోషకుల మెప్పును కూడా పొందినది.