ఆనంద్ (1971 హిందీ సినిమా)
ఆనంద్ (ఆంగ్లంలో:జాయ్, తెలుగులో సంతోషం అని అర్ధం) 1971లో విడుదలైన హిందీ భాషా చిత్రం. దీనికి హృషికేశ్ ముఖర్జీ సహ రచయిత, దర్శకత్వం వహించాడు. దీనికి గుల్జార్ సంభాషణలు రాశారు. ఇందులో రాజేష్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించగా, అమితాబ్ బచ్చన్, సుమితా సన్యాల్, రమేష్ డియో, సీమా డియో నటించారు.
ఈ చిత్రం 1972లో ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ ఫేర్ అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది. 2013లో అనుపమ చోప్రా తను రాసిన '100 ఫిల్మ్స్ టు సీ బిఫోర్ యు డై' అనే పుస్తకంలో ఈ చిత్రాన్ని జాబితా లో చేర్చింది.[1] 1969 1971 సంవత్సరాల మధ్య వరుసగా 17 బాక్సాఫీస్ విజయాలలో రాజేష్ ఖన్నా నటించిన 'మర్యాద' (1971), 'అందాజ్' (1971), ''ఆనంద్' వంటి భారీ తారాగణం ఉన్న చిత్రాలను పరిగణించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధారణ విజయాన్ని సాధించింది.[2] అప్పటి నుండి ఇది గొప్ప హిందీ చిత్రాలలో ఒకటిగా పరిగణించబడింది. ఇండియా టైమ్స్ దీనిని "తప్పక చూడవలసిన 25 బాలీవుడ్ చిత్రాలలో" జాబితా లో చేర్చింది .[3] రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన రెండు చిత్రాలలో ఆనంద్ ఒకటి. మరొకటి హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించిన 1973లో విడుదలైన 'నమక్ హరామ్' అనే చిత్రం.[4][5][6]
కథ
[మార్చు]తన మొదటి పుస్తకం ‘ఆనంద్’కు సంబంధించిన పురస్కార ప్రదానోత్సవంలో ముంబైకి చెందిన డా. భాస్కర్ బెనర్జీని ఆ పుస్తకం గురించి మాట్లాడమని అడుగుతారు. భాస్కర్, ఆనంద్‌ను కలిసినప్పుడు తన డైరీలో రాసుకున్న అనుభవాల ఆధారంగా ఆ పుస్తకం రాశానని చెబుతూ, ఆనంద్‌తో తన అనుభవాలను ప్రేక్షకులకు వివరించడం మొదలు పెడతాడు.
భాస్కర్ ఒక ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ వైద్యుడు). అతను పేదలకు ఎటువంటి ఫీజు తీసుకోకుండా చికిత్స చేస్తాడు. కానీ ప్రపంచంలోని అన్ని రోగాలను నయం చేయలేనని భావిస్తూ తరచూ నిరాశకు గురవుతాడు. చుట్టూ కనిపించే బాధ, వ్యాధులు, పేదరికం చూసి అతను నిరుత్సాహపడతాడు. అతను సూటిగా మాట్లాడే స్వభావం కలవాడు; ధనికుల ఊహాజనిత రోగాలకు చికిత్స చేయడు. అతని స్నేహితుడు డా. ప్రకాష్ కులకర్ణి మాత్రం కొద్దిగా భిన్నమైన మార్గాన్ని అనుసరిస్తాడు. అతను ధనికులకు రోగాలకు చికిత్స చేసి, వచ్చిన డబ్బుతో పేదలకు చికిత్స చేస్తాడు.
ఒక రోజు కులకర్ణి, భాస్కర్‌కు ఆనంద్‌ను పరిచయం చేస్తాడు. ఆనంద్‌కు పేగులలో వచ్చే అరుదైన క్యాన్సర్ అయిన లింఫోసార్కోమా ఉంది. తాను ఆరు నెలలకు మించి జీవించలేనని తెలిసినా, ఆనంద్ ఎప్పుడూ ఆనందంగా, నిర్లిప్తంగా ఉంటూ చుట్టూ ఉన్నవారందరినీ సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తాడు. అతని ఉల్లాసభరితమైన స్వభావం, భాస్కర్‌కు పూర్తి భిన్నంగా ఉండి, భాస్కర్‌కు ఓదార్పునిస్తుంది. ఇలా ఇద్దరూ మంచి స్నేహితులవుతారు.
ఆనంద్‌కు ప్రజలను ఆకర్షించి స్నేహితులుగా చేసుకునే ప్రత్యేక గుణం ఉంటుంది. అలాంటి ఒక సందర్భంలో, అతను రంగస్థల నటుడు అయిన ఈసా భాయ్‌తో స్నేహం చేస్తాడు. ఇద్దరూ కలిసి సమయం గడుపుతూ భావోద్వేగ అనుబంధాన్ని ఏర్పరుచుకుంటారు.
కాలక్రమేణా ఆనంద్ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. కానీ మిగిలిన రోజులు ఆసుపత్రి మంచంలో గడపాలని అతనికి ఇష్టం ఉండదు; స్వేచ్ఛగా తిరుగుతూ అందరికీ సహాయం చేస్తాడు. భాస్కర్‌కు గతంలో న్యుమోనియా కు చికిత్స చేసిన రేణు పట్ల బలమైన అభిప్రాయాలు ఉన్నాయని ఆనంద్ తెలుసుకుంటాడు. భాస్కర్ తన ప్రేమను వ్యక్తపరచేలా సహాయం చేసి, రేణు తల్లిని ఒప్పించి వారి వివాహానికి ఆశీర్వాదం పొందేలా చేస్తాడు. తనను క్యాన్సర్ రోగిగా కాకుండా, ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే వ్యక్తిగా అందరూ గుర్తుంచుకోవాలని ఆనంద్ భాస్కర్‌కు చెబుతాడు.
ఇంకా, ఆనంద్ గతంలో ఢిల్లీలో ఒక అమ్మాయిని ప్రేమించాడని, కానీ తన అనారోగ్యం కారణంగా ఆమె మరొకరిని పెళ్లి చేసుకుందని తెలుస్తుంది. ఆమె పెళ్లైన రోజున, ఆమెను మరిచిపోవడానికి ఆనంద్ ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చాడు. ఆమె జ్ఞాపకంగా తన పుస్తకంలో ఒక పువ్వును దాచుకుంటాడు.
కాలంతో పాటు ఆనంద్ మరింత బలహీనమవుతూ ఇంటికే పరిమితమవుతాడు. అతను భాస్కర్ ఒక కవిత చదువుతుండగా, తాను సంభాషణలు చెబుతుండగా ఇద్దరూ కలిసి నవ్వుతున్న దృశ్యాన్ని టేప్‌లో రికార్డు చేస్తాడు. తన చివరి శ్వాసలను లెక్కపెడుతూ, స్నేహితులందరూ చుట్టూ చేరుతారు. కానీ భాస్కర్ అతనికి మందులు తీసుకురావడానికి బయటికి వెళ్లి ఉంటాడు. ఆనంద్ అతన్ని పిలుస్తూ ప్రాణాలు విడిచిపెడతాడు. కొద్ది నిమిషాల తర్వాత భాస్కర్ తిరిగి వచ్చి, ఆనంద్ తనతో మాట్లాడమని వేడుకుంటాడు. ఆ క్షణంలో టేప్‌లో ఆనంద్ స్వరం వినిపిస్తుంది. స్నేహితులంతా అతని కోసం కన్నీరు పెట్టుకుంటారు. ఆకాశంలోకి ఎగిరిపోతున్న రెండు బెలూన్లు కనిపిస్తాయి—ఆనంద్ ఈ లోకాన్ని విడిచి ఆకాశంలోకి ఎగిరిపోయినట్లుగా చూపిస్తారు.
తారాగణం
[మార్చు]- రాజేష్ ఖన్నా - ఆనంద్ సెహగల్ గా
- అమితాబ్ బచ్చన్ - డా. భాస్కర్ బెనర్జీ (బాబూ మోషాయ్ / మున్నా)
- సుమితా సన్యాల్ - రేణు భాస్కర్ బెనర్జీగా
- రమేష్ డియో - డా. ప్రకాష్ కులకర్ణిగా
- సీమ దేవ్ - సుమన్ కులకర్ణిగా
- లలితా పవార్ - మాట్రాన్ డి'సాగా
- దుర్గా ఖోటే - రేణు తల్లిగా
- జానీ వాకర్ - ఇసా భాయ్ సూరత్వాలా / మొరారిలాల్
- అసిత్ సేన్ - చంద్ర నాథ్‌గా
- రఘు కాకాగా - దేవ్ కిషన్
- దారా సింగ్ - రెజ్లింగ్ కోచ్ అకా పాపాజీగా
- మౌని బాబాగా - బ్రహ్మ భరద్వాజ్
చిత్ర నిర్మాణం
[మార్చు]ముఖర్జీ ఈ చిత్రాన్ని Ikiru ఆధారంగా రూపొందించారు. 1960ల ప్రారంభంలో ప్రధాన పాత్ర కోసం మొదటగా శశి కపూర్, అతని సోదరుడు రాజకపూర్ లను పరిగణలోకి తీసుకున్నారు.[7][8] ఆనంద్ పాత్రకు రాజ్ కపూర్ నుంచే ప్రేరణ లభించింది. ఎందుకంటే రాజ్ కపూర్ ముఖర్జీని “బాబు మోషాయ్” అని పిలిచేవారు.[8] ఒక సందర్భంలో కపూర్ తీవ్రంగా అనారోగ్యానికి గురైనప్పుడు, ఆయన మరణిస్తారేమోనని భావించిన ముఖర్జీ ఈ కథను రాశారని అనుకుంటుంటారు. ఈ చిత్రాన్ని కపూర్‌కు, ముంబై ప్రజలకు అంకితం చేశారు.[9][10]
తర్వాత ముఖర్జీ ఈ చిత్రాన్ని బెంగాలీ భాషలో తీయాలని, బాబు మోషాయ్ పాత్రకు ఉత్తమ్ కుమార్ ను ఎంపిక చేయాలని భావించారు.[7] కానీ ఈ ప్రణాళిక ఫలించలేదు. ఆ తరువాత ప్రధాన పాత్రల కోసం కిషోర్ కుమార్, మోహమూద్ లను (బాబు మోషాయ్ పాత్రకి) పరిగణనలోకి తీసుకున్నారు.[11][7] నిర్మాతల్లో ఒకరైన ఎన్. సి. సిప్పి గతంలో మెహమూద్‌కు ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశారు. ప్రాజెక్ట్ గురించి మాట్లాడేందుకు ముఖర్జీ కిషోర్ కుమార్ ఇంటికి వెళ్లినప్పుడు, తెలియక గేటు కాపలాదారు ఆయనను పంపివేశాడు. కిషోర్ కుమార్ (తానే ఒక బెంగాలీ) ఒక స్టేజ్ షోకు సంబంధించిన ఆర్థిక వివాదంలో ఒక బెంగాలీ ఈవెంట్ మేనేజర్‌తో గొడవలో ఉన్నాడు. అందువల్ల ఆ “బెంగాలీ” వ్యక్తిని అనుమతించవద్దని గేటు కాపలాదారునికి ఆదేశించాడు. గేటు కాపలాదారు హృషికేష్ ముఖర్జీనే ఆ “బెంగాలీ”గా పొరబడి, లోపలికి అనుమతించలేదు. ఈ సంఘటన ముఖర్జీని బాధించింది. దాంతో కిషోర్ కుమార్‌తో పని చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఫలితంగా మెహమూద్ కూడా ఈ చిత్రాన్ని వదిలివేయాల్సి వచ్చింది.[12]
ప్రధాన పాత్ర కోసం ధర్మేంద్ర తనను కూడా పరిగణలోకి తీసుకున్నారని, కానీ చివరకు ఆ పాత్ర రాజేశ్ ఖన్నాకు దక్కిందని చెప్పారు.[13] ఆ సమయానికి రాజేష్ ఖన్నా కు ప్లేబ్యాక్ గాయకుడిగా కిషోర్ కుమార్ ఉన్నప్పటికీ, ఆనంద్ చిత్రంలో ఆయన పాటలు ఏవీ లేవు.[7]
ముఖర్జీ మొదట బాబు మోషాయ్ పాత్రకు సంజీవకుమార్ ను ఒప్పందం చేసుకున్నారు. కానీ ఖన్నా, సంజీవ్ కుమార్‌తో కలిసి పనిచేయడానికి ఇష్టపడలేదు. ఖన్నా పట్టుబట్టడంతో, ముఖర్జీ సంజీవ్ కుమార్ స్థానంలో అమితాబ్ బచ్చన్ ను తీసుకున్నారు.[14]
హృషికేష్ ముఖర్జీ ఈ చిత్రాన్ని కేవలం 28 రోజుల్లో చిత్రీకరించారు.[9] ఆనంద్ చిత్ర కథనాన్ని గుల్జార్ (సంభాషణలు, కొన్ని పాటల సాహిత్యాన్ని కూడా రాశారు), బిమల్ దత్, డి.ఎన్. ముఖర్జీ, హృషికేష్ ముఖర్జీ కలిసి రచించారు.[15]
తర్వాత ఆనంద్ చిత్రాన్ని మలయాళం భాషలో చిత్రశలభం అనే పేరుతో మళ్లీ తీశారు.[16]
సంగీతం
[మార్చు]ఈ చిత్రానికి నేపథ్య సంగీతం, పాటలను సలిల్ చౌధురి స్వరపరిచారు. పాటల సాహిత్యాన్ని గుల్జార్, యోగేష్ రాశారు. గుల్జార్ రాసిన కవిత 'మౌత్ టు ఏక్ కవితా హై' ను అమితాబ్ బచ్చన్ చదువుతాడు.
పాటల స్వరరచన కోసం సలీల్ చౌదరీని ఖరారు చేయడానికి ముందు, ముఖర్జీ లత మంగేష్కర్ ను సంప్రదించారు. ఆమె గతంలో ‘ఆనంద్‌ఘన్’ అనే కలం పేరుతో మరాఠీ చిత్రాలకు సంగీత దర్శకురాలిగా పనిచేశారు. అయితే, ఆమె పాటలకు స్వరరచన చేయాలనే ప్రతిపాదనను వినయపూర్వకంగా తిరస్కరించి, చిత్రంలో పాటలు పాడటానికే మొగ్గు చూపారు. ఈ చిత్రంలోని పాటల్లో ఒకటైన 'కహీ డోర్ జబ్ దిన్ ధల్' మొదటగా 20 సంవత్సరాల క్రితం బెంగాలీ పాటగా 'అమయ్ ప్రోష్ణో కోర్ నీల్ ధృబతర' అనే శీర్షికతో స్వరపరిచారు. ఆ పాటను హేమంతకుమార్ పాడారు.[17]
ఈ చిత్రంలోని భావోద్వేగ సన్నివేశాల్లో వినిపించే నేపథ్య సంగీతం, అదే సంవత్సరంలో తర్వాత విడుదలైన 'మేరే అప్నే' చిత్రంలోని "కోయీ హోతా జిస్కో అప్నా" పాట స్వరంపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండు చిత్రాలకు సంగీతం సలీల్ చౌదరీనే స్వరపరిచారు. రాజేశ్ ఖన్నా నటించిన చిత్రాల్లో, ఆయన దీర్ఘకాల గాత్ర సహకారిగా ఉన్న కిషోర్ కుమార్ పాటలు లేని కొన్ని చిత్రాల్లో 'ఆనంద్' ఒకటి.
| సంఖ్య | శీర్షిక | సాహిత్యం | గానం | నిడివి |
|---|---|---|---|---|
| 1 | కహిన్ డోర్ జబ్ | యోగేష్ | ముఖేష్ | 05:40 |
| 2 | మైనే తేరే లియే" | గుల్జార్ | ముఖేష్ | 03:09 |
| 3 | జిందగీ కైసీ హై పహేలీ | యోగేష్ | మన్నా డే | 03:30 |
| 4 | నా జియా లగే నా" | గుల్జార్ | లతా మంగేష్కర్ | 03:22 |
| 5 | మౌత్ తూ ఏక్ కవితా హై | గుల్జార్ | అమితాబ్ బచ్చన్ | 00:47 |
| మొత్తం పొడవు | 16:28 | |||
పురస్కారాలు
[మార్చు]| సంవత్సరం. | అవార్డు | వర్గం | పురస్కార గ్రహీత/లు |
|---|---|---|---|
| 1971 | జాతీయ చలనచిత్ర పురస్కారాలు | హిందీలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ | హృషికేశ్ ముఖర్జీ,
ఎన్. సి. సిప్పీ |
| 1972 | బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డ్స్ | ఉత్తమ నటుడు (హిందీ) | రాజేష్ ఖన్నా |
| 19వ ఫిల్మ్ఫేర్ అవార్డులు | ఉత్తమ చిత్రం | హృషికేశ్ ముఖర్జీ,
ఎన్. సి. సిప్పీ | |
| ఉత్తమ దర్శకుడు (నామినేషన్ ) | హృషికేశ్ ముఖర్జీ | ||
| ఉత్తమ కథ | |||
| ఉత్తమ ఎడిటింగ్ | |||
| ఉత్తమ నటుడు | రాజేష్ ఖన్నా | ||
| ఉత్తమ సహాయ నటుడు | అమితాబ్ బచ్చన్ | ||
| ఉత్తమ సంభాషణ | గుల్జార్ |
ప్రభావం
[మార్చు]'ఆనంద్' , చిత్రం విడుదలైన సమయానికి, ఆ చిత్రంలో నటించిన అమితాబ్ బచ్చన్ కు ఇంకా పెద్దగా గుర్తింపు లేదు. ఈ సంఘటనను ట్విట్టర్‌లో పంచుకుంటూ, అతని అభిమాని అయిన ఆశిష్ పలొడ్ ఈ చిత్రం ద్వారా ఆయనకు ఎలా గుర్తింపు లభించిందో గుర్తు చేశాడు. చిత్రం విడుదలైన రోజున, బచ్చన్ తన కారుకు పెట్రోల్ నింపించుకోవడానికి ఒక పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. ఆ సమయంలో ఎవ్వరూ ఆయనను గుర్తించలేదు. కానీ అదే రోజు సాయంత్రం చిత్రం విడుదలైన తరువాత, మళ్లీ అదే పెట్రోల్ బంక్‌కు వెళ్లినప్పుడు ప్రజలు ఆయనను గుర్తించడం ప్రారంభించారు. ఈ విషయాన్ని బచ్చన్ ట్విట్టర్‌లో పంచుకుంటూ, “ఇది నిజంగా జరిగిన సంఘటనే.. అది ఎస్.వి. రోడ్డులోని ఇర్లా వద్ద ఉన్న పెట్రోల్ బంక్” అని పేర్కొన్నారు.[17]
మూలాలు
[మార్చు]- ↑ Mazumdar, Arunima (16 October 2013). "Anupama Chopra's 100 favourite films!". The Times of India. Archived from the original on 11 August 2016. Retrieved 28 December 2015.
- ↑ "BoxOffice India.com". 2009-06-02. Archived from the original on 2 June 2009. Retrieved 2021-04-06.
- ↑ "Eight lesser known facts about Rajesh Khanna on his death anniversary". Hindustan Times. 18 July 2015. Archived from the original on 29 August 2016. Retrieved 5 October 2016.
- ↑ "Revisiting Prakash Mehra's Zanjeer: The film that made Amitabh Bachchan". The Indian Express. 20 June 2017. Archived from the original on 1 December 2017. Retrieved 8 December 2017.
- ↑ Raghavendra, M. K. (2014). Seduced by the Familiar: Narration and Meaning in Indian Popular Cinema (in ఇంగ్లీష్). Oxford University Press. ISBN 978-0199456307.
- ↑ "It was Kishore, not Rajesh Khanna, who was to do the role of Anand". INDIA TV NEWS. 19 July 2012. Archived from the original on 30 May 2023. Retrieved 5 July 2018.
- ↑ 7.0 7.1 7.2 7.3 Anuj) Kumar (March 18, 2021). "Hrishikesh Mukherjee's 'Anand' lives on". The Hindu.
- ↑ 8.0 8.1 Kaul, Vivek (19 June 2012). "A hand-me-down role in 'Anand' crowned Khanna's career". Firstpost. Archived from the original on 16 March 2017. Retrieved 28 December 2015.
- ↑ 9.0 9.1 "It was Kishore, not Rajesh Khanna, who was to do the role of Anand". India TV. 19 June 2012. Archived from the original on 24 September 2015. Retrieved 23 April 2015.
- ↑ "Anand was based on my relationship with Raj Kapoor, I wrote it when he wasn't well: Hrishikesh Mukherjee". The Indian Express (in ఇంగ్లీష్). 2022-09-30. Archived from the original on 8 October 2022. Retrieved 2022-10-08.
- ↑ Zaveri 2005, p. 133.
- ↑ Jha, Subhash K (2005). The Essential Guide to Bollywood. Lustre Press. ISBN 9788174363787. Archived from the original on 26 July 2024. Retrieved 21 September 2016.
- ↑ "50 years of Anand: When Dharmendra was upset with Hrishikesh Mukherjee for casting Rajesh Khanna, drunk dialled him all night". The Indian Express (in ఇంగ్లీష్). 2021-03-12. Archived from the original on 10 October 2022. Retrieved 2022-10-10.
- ↑ "'Rajesh Khanna is shakki, nobody can live with him,' Sanjeev Kumar warned Anju Mahendru about him; he thought they were dating". https://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/rajesh-khanna-is-shakki-nobody-can-live-with-him-sanjeev-kumar-warned-anju-mahendru-about-him-he-thought-they-were-dating/articleshow/124622766.cms
- ↑ Malhotra, A.P.S. (13 December 2008). "Anand (1971)". The Hindu. Archived from the original on 26 July 2024. Retrieved 28 December 2015.
- ↑ "It was Kishore, not Rajesh Khanna, who was to do the role of Anand". Indiatvnews. 19 July 2012. Archived from the original on 21 November 2017. Retrieved 24 March 2017.
- ↑ 17.0 17.1 Dwyer, Rachel. "March 15, 2021". The Wire. Archived from the original on 13 March 2023. Retrieved March 12, 2023.