ఆపరేషన్ గ్రాండ్ స్లామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఛంబ్-జౌరియన్-అఖ్నూర్ సెక్టర్

ఆపరేషన్ గ్రాండ్ స్లామ్,  భారత పాక్ యుద్ధంలో పాకిస్తాన్ చేపట్టిన ఒక ఆపరేషన్. 1965 మేలో జమ్మూ కాశ్మీరు లోని అఖ్నూర్ వంతెనను పేల్చివేసేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నం పేరు ఆపరేషన్ గ్రాండ్ స్లామ్‌. ఆ వంతెన జమ్మూ కాశ్మీరు లోని భారత కాల్బలానికంతటికీ జీవనాధారం వంటిది. అంతేకాక ఆ వంతెనను పేల్చివేస్తే జమ్మూపై కూడా గురి పెట్టవచ్చు. ఆ ఆపరేషను ద్వారా తలపెట్టిన లక్ష్యాలను సాధించడంలో పాకిస్తాన్ విఫలమైంది. భారత సైన్యం చేసిన ఎదురుదాడితో పాకిస్తాన్ సైన్యం వెనక్కి పారిపోవలసి వచ్చింది. 

నేపథ్యం[మార్చు]

1965 నాటి రాన్ ఆఫ్ కచ్ ఘటనలో పాకిస్తాన్‌కు కాస్త అనుకూల ఫలితం రావడంతో పాకిస్తాన్‌లో రాజకీయ వాతావరణం ఉత్సాహంగా ఉంది. ఆ ఉత్సాహంలోనే జమ్మూ కాశ్మీరులో తిరుగుబాట్లు జరిపించేందుకు ఆపరేషన్ జిబ్రాల్టర్ తలపెట్టారు. ఈ పథకం కింద 1965 లో చొరబాట్లు మొదలై 4000-5000[1] మంది వరకూ పాకిస్తాన్ సైనికులు చొరబడ్డారు. ఈ చొరబాట్లను ఎదుర్కొనేందుకు భారత సైన్యం అదనపు దళాలను తరలించింది. పాక్ ఆక్రమిత కాశ్మీరులోని చొరబాటు బృందాలపై భారత సైన్యం దాడులు చేసింది.

1965 సెప్టెంబరు 1 న ఉదయం 5 గంటలకు పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ ను మొదలు పెట్టింది. భారత దాడులను ఎదుర్కొంటున్న 12వ డివిజనుపై వత్తిడి తగ్గించడం ఈ ఆపరేషన్ లక్ష్యం. పాక ఆక్రమిత కాశ్మీరులోని హాజీపూర్ వైపు నుండి భారత సైన్యం ద్వారా ముజఫరాబాదు పట్టణానికి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడం మరో లక్ష్యం.

అమలు[మార్చు]

అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్

అఖ్నూర్ సెక్టరు నాలుగు భారత పదాతి దళ బెటాలియన్లతో, ఒక ట్యాంకు స్క్వాడ్రనుతో ఉన్న సైన్యపు రక్షణలో ఉంది. సరిహద్దు పొడవునా మోహరించిన ఈ సైన్యం చాలీచాలని రక్షణ అందిస్తోంది. వీరి వద్ద ఉన్న AMX-13 ట్యాంకులు, పాకిస్తాను వారి M47 పాటన్, M48 పాటన్ ట్యాంకులకు సరిరావు. బలమైన శత్రువు చేస్తున్న దాడి కారణంగా భారత దళాలు రక్షణాత్మక స్థావరాలకు మరలాయి. సైనిక చారిత్రకారుడు మేజర్ (రెటైర్డ్.) ఎ. హెచ్. అమీన్ రాసినదాని ప్రకారం, ఆపరేషన్ గ్రాండ్ స్లామ్‌లో భారత AMX-13 ట్యాంకులపై పాకిస్తాన్‌కు 6-1 అడ్వాంటేజి ఉంది. శతఘ్నుల విషయంలో పాకిస్తాను వారి 8 అంగుళాల గన్‌లు, భారత్ వద్ద ఉన్న ఏ గన్నులకంటే కూడా మెరుగైనవి. మొత్తమ్మీద పాకిస్తాన్‌కు 6-1 అడ్వాంటేజి ఉంది.[2]

రెండవ రోజున ఆ ప్రాంతంలోని సైనిక దళాలకు కమాండరుగా ఉన్న మేజర్ జనరల్ అఖ్తర్ హుసేన్ మాలిక్ ను తొలగించి ఆయన స్థానంలో జనరల్ యాహ్యా ఖాన్‌ను నియమించారు. దీనివలన దాడి ఒకరోజు ఆలస్యమైంది. ఇది పాకిస్తాను అధికారుల్లో తికమక కలిగించడమే కాకుండా, ఈ ఆలస్యంతో భారత సైన్యం అదనపు బలగాలను అక్కడ మోహరించేందుకు తగు సమయం దొరికింది. సెప్టెంబరు 3 న దాడి తిరిగి మొదలైనపుడు, పాకిస్తాన్ దాడి నుండి మారో మూడు రోజుల పాటు కాచుకునేంత పాటవం భారత బలగాల వద్ద ఉంది. కానీ ఎదురుదాడి చేసేంతటి బలం లేదు. దాడి మరో రెండు రోజుల పాటు కొనసాగాక, సెప్టెంబరు 6 న భారత సైన్యం పాకిస్తాను పంజాబు వైపున మరొక యుద్ధ రంగానికి తెరదీసింది. ఇక్కడ భారత సైన్యం వేస్తున్న ముందడుగు కహ్నూర్‌లో పాకిస్తాను సైన్యపు కుడి పార్శ్వాన్ని దెబ్బతీసేలా పరిణమించింది. ఆ ప్రమాదాన్ని గుర్తించిన పాకిస్తాను  సైన్యం, కాశ్మీరు లోకి చొచ్చుకు పోవాలన్న ప్రయత్నాన్ని విరమించుకుని, పంజాబులోకి చొచ్చుకువస్తున్న భారత్‌ను ఎదుర్కొనేందుకు తమ సైన్యాన్ని మరలించింది.

మూలాలు[మార్చు]

  1. Bajwa, Farooq (2013). From Kutch to Tashkent: The Indo-Pakistani War of 1965. Hurst. ISBN 1849042306.
  2. Amin, Major A. H. "Pakistan army till 1965". defence anlyst. pg 41. Archived from the original on 4 జనవరి 2012. Retrieved 27 September 2011.

బయటి లింకులు[మార్చు]