ఆరుట్ల కమలాదేవి
ఆరుట్ల కమలాదేవి | |||
![]()
| |||
నియోజకవర్గము | భువనగిరి, ఆలేరు | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1920 మంతపురి | ||
మరణం | 2001, జనవరి | ||
జీవిత భాగస్వామి | ఆరుట్ల రామచంద్రారెడ్డి |
ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు.
జీవిత విశేషాలు[మార్చు]
ఈమె అసలుపేరు రుక్మిణి. 1920లో నల్గొండ జిల్లా మంతపురి గ్రామంలో జన్మించింది. 11 సంవత్సరాల వయస్సులో మేనమామ కుమారుడు ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహం జరిగింది. వివాహం సమయంలోనే ఈమె పేరు కమలాదేవిగా మార్చబడింది.[1] వివాహం అనంతరం హైదరాబాదులోని ఆంధ్రా గర్ల్స్ హైస్కూలులో విద్యనభ్యసించడమే కాకుండా ఉద్యమాలలొ కూడా భర్తతో పాటు పాల్గొంది. ఆంధ్రమహాసభలకు కూడా హాజరై ఉత్తేజాన్ని పొందింది. నిరంకుశ నిజాం విమోచనోద్యమంలో పాల్గొని అరెస్టు కాబడి జైలుకు వెళ్ళిది. 1946-48లో రజాకార్ల దురాగతాలను ఎదుర్కోడానికి మహిళా గెరిల్లా దళాన్ని ఏర్పాటుచేసింది.[2] 1952 ఎన్నికలలో భువనగిరి నుంచి హైదరాబాదు శాసనసభకు ఎన్నికైనది. ఆ తర్వాత వరుసగా 3 పర్యాయాలు ఆలేరు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎనికైనది. శాసనసభలో కమ్యూనిస్టు పార్టీ ఉప నాయకురాలిగా, పుచ్చలపల్లి సుందరయ్య చికిత్సకోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలు నిర్వహించింది.
విరోచిత తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం జాతీయోద్యమ చరిత్రలో నూతనాధ్యాయాన్ని తెరచింది. ఈ పోరాటానికి నాయకత్వ పాత్ర వహించింది కమ్యూనిస్టుపార్టీ. అందులో మహిళల పాత్ర అపూర్వం, అనిర్వచనీయం. దానికి ప్రత్యక్ష నిదర్శనం వీరవనిత ఆరుట్ల కమలాదేవి. తన తరం మహిళలు గృహిణులుగా కాలం వెళ్ళదీస్తున్న సమయంలో పెళ్ళికి ముందు "రుక్మిణి" గా వుండి ఆ తరువాత కమలాదేవిగా మారి కమ్యూనిస్టు ఉద్యమ వీరనారీమణులలో ఒకరిగా 2001 జనవరి 1 న కన్నుమూశారు. ఎ.ఆర్ గా అంతా పిలుచుకునే సాయుధపోరాట సేనాని ఆరుట్ల రామచంద్రారెడ్డి భార్యగా, రాజకీయరంగంలో కూడా భర్తతోపాటు కొంగుబిగించి తుపాకీ చేబూని గెరిల్లాపోరాటం సాగించిన పోరాట వీరగాథలు నేటికీ యువతరానికి ఒక ఉత్తేజం.
పోరాట జీవితం[మార్చు]
చలూరు గ్రామం గెరిల్లా దళాలకు ఆనాడు ఒక ముఖ్యకేంద్రం. చల్లూరు-వెంకటాపురం గుట్టలను చుట్టుముట్టి రిజర్వు పోలీసులు సాగించిన తుపాకీగుళ్ళ దెబ్బలకు ఎదురుకాల్పులు జరుపుతూ దళాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా విప్లవ దంపతులు కమలాదేవి, ఎ.ఆర్. శత్రు మూకలను అమెరికన్ రైఫిల్ తో తిప్పికొట్టిన తీరు నాటి పోరాట యోధుల స్మృతి పథంలో చెరగని ముద్రలు వేశాయి. పురిటిబిడ్డను వదిలి ఉద్యమకార్యకర్తగా ఆమె సాగించిన గెరిల్లా పోరాటం, కొనసాగించిన అజ్ఞాతవాసం, ఆ తరువాత వరంగల్ ,ఔరంగాబాద్, హైదరాబాద్లలో మూడు సంవత్సరాలకుపైగా ఆరుట్ల కమలాదేవి అనుభవించిన జైలుజీవితం - పోరాట వటివులో ధైర్యసాహసాలలో ఆమెను మరో రూన్సీలక్ష్మిగా నిలబెట్టింది. జైలునుండి విడుదల కాగానే 1952లో ఆలేరు నియోజకవర్గం నుండి శాసనసభకు ఆమె ఘనవిజయం సాధించారు. ఆ తరువాత రెండు పర్యాయాలు అదే నియోజకవర్గం నుండి కమ్యూనిస్టు ఆభ్యర్ధిగా ఎన్నికై పార్టీ శాసనసభాపక్షం ఉపనాయకులుగా (కామేడ్ పుచ్చలపల్లిసుందరయ్య నాయకులు) ఎన్నిక కావడం కమలాదేవి విశిష్ట వ్యక్తిత్వానికి నిదర్శనం. కమ్యూనిసు పార్టీలో చీలిక అనంతరం సిపిఐ శాసన సభాపక్షం నాయకురాలిగా కొనసాగారు. శాసనసభాపక్ష నాయకత్వం ఒక మహిళకు దక్కడం అదే మొదటిసారి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అదే ఆఖరిసారి కూడా, తన జీవిత కాలంలోనే ప్రీ శక్తికి, విప్లవస్పూర్తికి ప్రతీకగా నిలిచిన వ్యక్తిత్వం కమలాదేవిది. కాకతీయ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ అందజేసినపుడు ప్రశంసాపత్రంలో ఆమెను అపరరుద్రమదేవిగా కీర్తించడంలో అతిశయోక్తి లేశమాత్రం కూడా లేదు. తెలంగాణా సాయుధ సమరం రోజులలో ఆమెచూపిన చొరవ, ధైర్యసాహసాలు ఆశ్చర్యం గొలిపేవి. విన్గవదీక్షలోను, కార్యాచరణలోనూ ఆమె కున్న-విశ్వాసం అనన్యసామాన్యమైనవి. పోరాట రంగంలో వీరవనితగాను, శాసనసభలో ప్రజాపాణిగా ప్రతిబింబించడంలోనూ, ఆ తరువాత మహిళా సమాఖ్య నాయకురాలిగా స్త్రీల సమస్యలపై కొనసాగించి పోరాటంలోనూ, ఆమె కనబరచిన దీక్షాదక్షతలు నేటితరానినే గాక భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకమైనవి.[3]
మూలాలు[మార్చు]
- ↑ స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు, ప్రచురణ 2010, పేజీ 209
- ↑ నల్లగొండ జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర, సీహె ఆచార్య, కాటం రమేష్,2001 ప్రచురణ
- ↑ విశాలాంధ్ర పత్రికలో 4-1-2001 ఆర్టికల్[permanent dead link]
ఇతర లింకులు[మార్చు]
- full biography of arutla kamaladevi - official website Archived 2016-04-05 at the Wayback Machine
- assembly sppeches of arutla kamaladevi - official website Archived 2017-04-21 at the Wayback Machine
- Telangana Hero - Arutla Kamala Devi - Agni Pushpam - Brave Lady
- Telugu velugulu Arutla kamaladevi
- కమలాదేవి జీవిత సంగ్రహం[permanent dead link]
- వీరోచిత పోరాటనారి కమలాదేవి[permanent dead link]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2021
- Articles with permanently dead external links
- తెలంగాణ విమోచనోద్యమం
- 1920 జననాలు
- తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్న నల్గొండ జిల్లా మహిళలు
- 2001 మరణాలు
- పేరు మార్చుకున్న తెలంగాణ వ్యక్తులు
- నల్గొండ జిల్లా మహిళా రాజకీయ నాయకులు
- యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ మహిళా శాసన సభ్యులు