ఆలూరు వెంకటరావు
ఆలూరు వెంకట రావు | |
|---|---|
| జననం | 1880 జూలై 12 బీజాపూర్, బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటిష్ భారతదేశం |
| మరణం | 1964 ఫిబ్రవరి 25 (వయసు: 83) |
| చదువు | బి.ఏ ఎల్.ఎల్.బి |
| పాఠశాల/కళాశాలలు | ఫెర్గూసన్ కళాశాల |
| వృత్తి |
|
| పేరుపడ్డది | కర్ణాటక ఏకీకరణ |
ఆలూరు వెంకట రావు (కొన్నిసార్లు ఆలూరు వెంకట రాయ అని కూడా పిలుస్తారు) (12 జూలై 1880 – 25 ఫిబ్రవరి 1964) భారతీయ చరిత్రకారుడు, రచయిత, జర్నలిస్ట్. ప్రత్యేక కర్ణాటక రాష్ట్ర సాధనకు ఇతడు చేసిన కృషికి గాను కర్ణాటక ప్రాంతంలో ఇతడిని కర్ణాటక కులపురోహితుడు (కన్నడ కుటుంబ ప్రధాన అర్చకుడు) అని గౌరవిస్తారు. మైసూరు రాజ్యం, బొంబాయి ప్రెసిడెన్సీ, నిజాం హైదరాబాద్లోని కన్నడ మాట్లాడే ప్రజల కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కర్ణాటక ఏకీకరణ ఉద్యమాన్ని చేపట్టి ఇతడు ప్రసిద్ధి చెందాడు.
రావు జయ కర్ణాటక అనే వార్తాపత్రికను ప్రారంభించాడు, కర్ణాటక రాష్ట్ర సాధన కోసమే ఈ పత్రికను ప్రారంభించినట్లు పేర్కొన్నాడు.[1]
ప్రారంభ జీవితం
[మార్చు]వెంకట రావు రెవెన్యూ శాఖలో షిరస్తాదార్‌గా పనిచేసిన భీమారావుకు 12 జూలై 1880న జన్మించాడు. వీరి కుటుంబం కర్ణాటకలోని బీజాపూర్ లో నివసించేది. ఇతడు ఫెర్గూసన్ కళాశాలలో బి.ఏ, ఎల్.ఎల్.బి చదివాడు. అక్కడ ఇతనికి వినాయక్ దామోదర్ సావర్కర్, సేనాపతి బాపట్, బాలగంగాధర తిలక్ లతో పరిచయం ఏర్పడింది. రావు తిలక్‌కు సన్నిహిత మిత్రుడు, అతని గీతా రహస్యం ను కన్నడలోకి అనువదించాడు.[2][3][4][5]
రచనలు
[మార్చు]రావు చంద్రోదయ, కర్ణాటక పాత్ర, రాజహంస, కర్ణాటక వృత్త వంటి పత్రికలకు వ్యాసాలు రాయడం ప్రారంభించాడు. 1906లో ఇతడు వాగ్భూషణ అనే మాసపత్రికకు సంపాదకుడిగా పని చేయడం ప్రారంభించాడు.[6] నవంబర్ 1922లో, ఇతడు అనేక అంశాలపై వ్యాసాలను ప్రచురించే జయ కర్ణాటక అనే మాసపత్రికను ప్రారంభించాడు.[7] రావు రాసిన సుమారు 27 పుస్తకాలు ప్రచురించబడ్డాయి, వాటిలో మొదటిది 1907లో వచ్చిన విద్యారణ్య చరిತ್ರೆ. ఇతని ఇతర రచనలలో కర్ణాటక గాథా వైభవ, కర్ణాటక వీరరత్నగళు, కర్ణాటకత్వ సూత్రగళు, కర్ణాటకత్వ వికాస ఉన్నాయి.[3] 1907లో ఇతడు కన్నడ రచయితల సదస్సును నిర్వహించాడు, మరుసటి సంవత్సరం కర్ణాటక గ్రంథ ప్రసారద మండలిని ప్రారంభించాడు. 1930లో మైసూరులో జరిగిన కన్నడ సాహిత్య సమ్మేళనానికి ఇతడు అధ్యక్షత వహించాడు. తిలక్ కోరిక మేరకు, ఇతడు అతని రచన గీతా రహస్యంను మరాఠీ నుండి కన్నడలోకి అనువదించాడు.[8][9] ఇతడు స్వతంత్రంగా భగవద్గీతను అన్వయించి కన్నడలో గీతా ప్రకాశ, గీతా పరిమళ, గీతా సందేశ, గీతా కుసుమ మంజరి పుస్తకాలను రచించాడు.
కర్ణాటక కులపురోహితుడు
[మార్చు]1 నవంబర్ 1956న కర్ణాటక ఏకీకరణ జరిగినప్పుడు రావు చాలా ఆనందించాడు. ఇతడు హంపి వెళ్లి విరూపాక్ష దేవాలయంలో భువనేశ్వరి దేవికి పూజలు చేసి కర్ణాటక కులపురోహితుడిగా పేరు పొందాడు. జాతీయ గీతంలో పేర్కొన్న రాష్ట్రాల జాబితాలో కర్ణాటక పేరు లేకపోవడం పట్ల ఇతడు విచారం వ్యక్తం చేస్తూ, దానిని చేర్చాలని ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతులకు లేఖ రాశాడు. 1963లో రాష్ట్ర ఆవిర్భావ ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా రాజధాని బెంగుళూరులో ఇతనిని సత్కరించారు.[2]
రావు 25 ఫిబ్రవరి 1964న ధార్వాడ్‌లోని తన నివాసంలో మరణించాడు, ఇతనికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.[10][11][full citation needed]
గ్రంథ పట్టిక
[మార్చు]రావు అనేక పుస్తకాలు రాశాడు, వాటిలో కొన్ని:
- విద్యారణ్య చరిತ್ರೆ (1907)
- కన్నడిగర భ్రమనిరసన (1915)
- కర్ణాటక గాథా వైభవ (1917)
- కర్ణాటకత్వద సూత్రగళు (కర్ణాటకవాద సూత్రాలు) (1950)
- కర్ణాటకత్వద వికాస (కర్ణాటకవాద పరిణామం) (1957)
- గీతా రహస్య, తిలక్ మరాఠీ రచనకు కన్నడ అనువాదం (1918)
- నన్న జీవన స్మృతిగళు, ఇతని ఆత్మకథ (1941)
- ఇతడు ద్వైత తత్వశాస్త్రంపై ఆరు పుస్తకాలు రాశాడు[2]
మరణం
[మార్చు]ఆలూరు వెంకట రావు 25 ఫిబ్రవరి 1964న 83 సంవత్సరాల వయస్సులో ధార్వాడ్ లోని తన నివాసంలో మరణించాడు.
వారసత్వం
[మార్చు]- రావుకు నివాళిగా, కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరులోని ఆల్బర్ట్ విక్టర్ రోడ్ పేరును ఆలూరు వెంకట రావు రోడ్ (A V రోడ్) గా మార్చింది.[12]
- ఇతని జీవితం, రచనలపై కన్నడ, ఆంగ్ల భాషలలో రూపొందించిన CDని ఇతని 49వ వర్ధంతి సందర్భంగా సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ విడుదల చేసింది.[13]
మూలాలు
[మార్చు]- ↑ "Who is Alur Venkat Rao?". The Hindu. 2 June 2015.
- ↑ 2.0 2.1 2.2 Datta, Amaresh (1987). Encyclopaedia of Indian Literature: A-Devo. Sahithya Akademi. p. 145. ISBN 9788126018031.
- ↑ 3.0 3.1 Ganga Ram Garg (1992). Encyclopaedia of the Hindu World. Concept Publishing Company. p. 351. ISBN 9788170223757.
- ↑ Anjali Gera Roy, Chua Beng Huat (2014). Travels of Bollywood Cinema: From Bombay to LA. Oxford University Press. ISBN 978-0-19-908862-1.
- ↑ Harish Ramaswamy (2007). Karnataka Government and Politics. Concept Publishing Company. p. 39. ISBN 9788180693977.
- ↑ Grover, Verinder; Arora, Ranjana (1996). Encyclopaedia of India and her states: Karnataka, Kerala and Tamil Nadu, Volume 8. Deep & Deep. p. 40. ISBN 9788171007271.
- ↑ Alexander, Paul; Parthasarathy, Rangaswami (1995). Sri Lankan Fishermen: Rural Capitalism and Peasant Society. Sterling Publishers. p. 207. ISBN 9788120718074.
- ↑ Khajane, Muralidhara (1 November 2015). "Karnataka: State of diverse cultures, but language is the binding factor". The Hindu. Retrieved 2017-10-20.
- ↑ Suryanath U. Kamath (1996). A Handbook of Karnataka. Government of Karnataka, Karnataka Gazetteer Department. p. 46.
- ↑ "Kannada savant". The Indian Express. 26 February 1964. p. 5.
- ↑ India), Mythic Society (Bangalore (1989). The Quarterly Journal of the Mythic Society (in ఇంగ్లీష్). Mythic Society. p. 193.
- ↑ "The mystery behind naming Bengaluru's AV Road revealed". The Economic Times. 2015.
- ↑ "Death anniversary of Alur Venkata Rao". The Hindu. 2013.