Jump to content

ఆల్కలోసిస్

వికీపీడియా నుండి
ఆల్కలోసిస్
అసిడోసిస్ అల్కాలోసిస్ లక్షణాలు
ప్రత్యేకతఎండోక్రినాలజీ
లక్షణాలువిరేచనాలు, వాంతులు, జలదరింపు లేదా తిమ్మిరి, కండరాల నొప్పులు, తీవ్రమైన సందర్భాలలో గందరగోళం లేదా దిక్కుతోచని పరిస్థితి, ఆందోళన, మూర్ఛలు
రకాలుశ్వాసకోశ ఆల్కలోసిస్ (respiratory alkalosis)
జీవక్రియ ఆల్కలోసిస్ (metabolic alkalosis) లేదా
ఉమ్మడి శ్వాసకోశ/జీవక్రియ ఆల్కాలోసిస్
కారణాలుఅధిక వాంతులు, వాంతులు పునరావృతం అవడం
నిర్జలీకరణం, క్షార వినియోగం, మూత్రవిసర్జన మందులు (డైయూరటిక్స్)
ప్రమాద కారకములుహృదయ స్పందన రేటు అధికం అవడం, లేదా గుండె ఆగిపోవడం, శ్వాస రేటు తగ్గడం లేదా శ్వాస పూర్తిగా ఆగిపోవడం, తీవ్రమైన ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, మూత్రపిండాలు దెబ్బతినడం కోమా లోకి వెళ్లడం
చికిత్సఇంట్రావీనస్ (IV) ద్రవాలు, ఇతర లవణాలను అందించడం, సెలైన్ ఇన్ఫ్యూషన్, పొటాషియం, మెగ్నీషియం భర్తీ, క్లోరైడ్ ఇన్ఫ్యూషన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ఫ్యూషన్. ఈ పరిస్థితికి కారణమైన అధిక మందులను వైద్యుని సలహాపై ఆపివేయడం

ఆల్కలోసిస్ అంటే శరీరంలో రక్తం, ద్రవాల pH స్థాయిల అసమతుల్యతకి సంబంధించిన ఒక దేహ పరిస్థితి. రక్తం చాలా ఆమ్లంగా ఉన్నప్పుడు, దానిని అసిడోసిస్ అంటారు. ఇది చాలా క్షారం (ఆల్కలీన్‌)గా ఉన్నప్పుడు, దానిని ఆల్కలోసిస్ అంటారు. ‍ ఆల్కలీ (ఆల్కలీన్ రసాయనాలు) పెరుగుదల అంటే సాధారణంగా బైకార్బోనేట్ పెరుగుదల, ఆమ్ల స్థాయిలు తగ్గడం లేదా కార్బన్ డయాక్సైడ్ తగ్గడం అని అంటారు.[1] ఆల్కలోసిస్ అనేది ధమనుల రక్త ప్లాస్మా (ఆల్కలీమియా) ఉదజని అయాన్ గాఢతను తగ్గించే ప్రక్రియ ఫలితం. అసిడెమియాకు (సీరం pH 7.35 లేదా అంతకంటే తక్కువ) విరుద్ధంగా, ఆల్కలీమియా సీరం pH సాధారణ 7.45 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు సంభవిస్తుంది.

రకాలు

[మార్చు]

ఆల్కలోసిస్ ను జీవక్రియ ఆల్కలోసిస్ (metabolic alkalosis), శ్వాసకోశ ఆల్కలోసిస్ (respiratory alkalosis) లేదా ఉమ్మడి శ్వాసకోశ/జీవక్రియ ఆల్కాలోసిస్ వర్గాలుగా విభజించారు.[2]

జీవక్రియ ఆల్కలోసిస్

[మార్చు]

జీవక్రియ ఆల్కలోసిస్ అంటే శరీరంలో ఏర్పడే యాసిడ్-బేస్ బ్యాలెన్స్‌లో అసమతుల్యత. ఇది రక్తంలో అధిక pH స్థాయిలకు దారితీస్తుంది. లక్షణాలు తేలికపాటివి లేదా తీవ్రంగా ఉండవచ్చు. కండరాల తిమ్మిరి, గందరగోళం క్రమరహిత హృదయ స్పందన వంటివి ఉంటాయి. అయితే చికిత్స వలన శరీరం యాసిడ్-బేస్ సమతుల్యతకు తిరిగి తీసుకురావడం జరుగుతుంది.[3]

కారణాలు:

వాంతులు పునరావృతం అవడం వల్ల సంభవించే జీవక్రియ ఆల్కలోసిస్, ఫలితంగా శరీరం కడుపులో ఉన్న హైడ్రోక్లోరిక్ ఆమ్లం కోల్పోతుంది. తీవ్రమైన నిర్జలీకరణం, క్షార వినియోగం వంటివి ఇతర కారణాలు.[4] అధిక వాంతులు, మూత్రవిసర్జన మందులు (డైయూరటిక్స్) తీసుకోవడం వలన రక్తంలోని ఆమ్ల-క్షార సమతుల్యత దెబ్బతీస్తుంది. తేలికపాటి సందర్భాల్లో, ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు అయితే వ్యాధి తీవ్రమయితే మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది.

  • ప్రధానంగా జీవక్రియ ఆల్కలోసిస్ కు కారణం కడుపు ఆమ్లం కోల్పోవడం, పదే పదే వాంతులు చేసుకోవడం లేదా కడుపులో ద్రవం బయటకు పంపడం వల్ల కడుపు ఆమ్లం కోల్పోతుంది. మీ శరీరంలో ఆమ్లం కోల్పోవడం అంటే రక్తం క్షారత పెరుగుదల.
  • ఎక్కువ యాంటాసిడ్లు తీసుకోవడం అంటే సోడియం బైకార్బోనేట్ కలిగిన యాంటాసిడ్లు మూత్రపిండాల వైఫల్యం ఉన్నవారిలో జీవక్రియ ఆల్కలోసిస్‌కు కారణమవుతాయి.
  • మూత్రవిసర్జన మాత్రలు వాడటం వల్ల శరీరం మూత్రంలో చాలా ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. ఇది రక్తాన్ని మరింత క్షారంగా మారుస్తుంది.
  • భేదిమందులు తీసుకోవడం అనేది అధిక విరేచనాలకు కారణమవుతాయి. తద్వారా పొటాషియం, క్లోరైడ్ వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్‌లను కోల్పోవడం జరుగుతుంది.
  • నిర్జలీకరణం చేసినప్పుడు కీలక ఎలక్ట్రోలైట్‌లను కోల్పోవడం అనేది రక్తం క్షారతను పెంచుతుంది.
  • ఇతర కారణాలు: జన్యుపరమైన పరిస్థితులు, అడ్రినల్ హార్మోన్ ఆల్డోస్టెరాన్ అధిక స్థాయిలో ఉండడం (హైపరాల్డోస్టెరోనిజం), రక్తంలో క్లోరైడ్ తక్కువ స్థాయి లో ఉండడం, పొటాషియం లోపం (హైపోకలేమియా), గుండె, మూత్రపిండాలు లేదా కాలేయ వైఫల్యం.[3]
రేఖా చిత్రం

లక్షణాలు:

విరేచనాలు, వాంతులు, జలదరింపు లేదా తిమ్మిరి, కండరాల నొప్పులు, తీవ్రమైన సందర్భాలలో గందరగోళం లేదా దిక్కుతోచని పరిస్థితి, ఆందోళన, మూర్ఛలు ఉండవచ్చు. జీవక్రియ ఆల్కలోసిస్‌ను భర్తీ చేసే శరీర యంత్రాంగం అంటే ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఈ పరిస్థితి ప్రభావాలను ఎదుర్కోవడానికి ప్రతిస్పందిస్తాయి. ఊపిరితిత్తుల శ్వాస నెమ్మదిస్తుంది, తద్వారా ఇది రక్తంలో బైకార్బోనేట్ అయాన్ల సాంద్రతను మారుస్తుంది. మూత్రపిండాలు బైకార్బోనేట్ అయాన్‌లను మూత్రం ద్వారా విడుదల చేసి వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాయి.[5]

సమస్యలు

సాధారణంగా ఈ లక్షణాలని నియంత్రించవచ్చు, అయితే పరిస్థితి తీవ్రతరమైనప్పుడు అసాధారణ హృదయ స్పందన రేటు (అరిథ్మియా) లేదా గుండె ఆగిపోవడం, శ్వాస రేటు తగ్గడం లేదా శ్వాస పూర్తిగా ఆగిపోవడం, తీవ్రమైన ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా మూత్రపిండాలు దెబ్బతినడం, ఇంకా కోమా లోకి వెళ్లడం సంభవించవచ్చు.

చికిత్స

చికిత్సలో ఇంట్రావీనస్ (IV) గొట్టం ద్వారా ద్రవాలు, ఇతర లవణాలను అందిస్తారు, అవి: సెలైన్ ఇన్ఫ్యూషన్, పొటాషియం, మెగ్నీషియం భర్తీ, క్లోరైడ్ ఇన్ఫ్యూషన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ఫ్యూషన్. ఈ పరిస్థితికి కారణమైన అధిక మందులను వైద్యుని సలహాపై ఆపివేయడం కూడా జరుగుతుంది.

చికిత్స తర్వాత చాలా మంది కోలుకుంటారు అయితే కడుపులో ఆమ్లం తగ్గినా, ద్రవాలు లేదా ఎలక్ట్రోలైట్ స్థాయిలు యాసిడ్-బేస్ సమతుల్యతను ప్రభావితం చేస్తే పరిస్థితి తిరగపెట్టవచ్చు.

జీవక్రియ ఆల్కలోసిస్ రకాలు

జీవక్రియ ఆల్కలోసిస్ 2 రకాలుగా ఉంటుంది.

  • క్లోరైడ్-ప్రతిస్పందించే (రెస్పాన్సివ్) ఆల్కలోసిస్ - ఇది శరీరంలో అధికంగా ఆమ్లం కోల్పోయినప్పుడు సంభవిస్తుంది. ఇది సాధారణంగా వాంతులు లేదా తీవ్రమైన నిర్జలీకరణం వల్ల హైడ్రోజన్ అయాన్లు కోల్పోవడం ద్వారా జరుగుతుంది. సెలైన్ ద్రావణం కలిగిన ఇంట్రావీనస్ ద్రవాలతో చికిత్స చేయడం లేదా ఎక్కువ ఉప్పు తీసుకోవడం ఈ రకానికి సహాయపడుతుంది.
  • క్లోరైడ్-నిరోధక ఆల్కలోసిస్ - సాధారణంగా కొన్ని మందులను అధికంగా తీసుకోవడం వలన లేదా ఇతర ఆరోగ్య సమస్య వలన సంభవిస్తుంది. అయితే దీనిలో ఉప్పు ఎక్కువ తినడం ఇక్కడ సహాయపడదు. దానికి బదులుగా, ఎక్కువ పొటాషియం తీసుకోవలసి ఉంటుంది.[3]

శ్వాసకోశ ఆల్కలోసిస్

[మార్చు]

హైపర్వెంటిలేషన్ (శ్వాస వేగం వలన శరీరం ఉత్పత్తి చేయగల దానికంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను పంపినప్పుడు సంభవించే క్రమరహిత శ్వాస) వల్ల శ్వాసకోశ ఆల్కలోసిస్ ఏర్పడుతుంది, దీని ఫలితంగా కార్బన్ డయాక్సైడ్ ను కోల్పోతుంది.[5] దీనికి పరిష్కార విధానాలలో కణజాలాల నుండి హైడ్రోజన్ అయాన్ విడుదల, మూత్రపిండాలలోకి బైకార్బోనేట్ విడుదల వంటివి రక్తంలో pHను తగ్గిస్తాయి.[4] హైపర్వెంటిలేషన్-ప్రేరిత ఆల్కలోసిస్ పరిస్థితి స్ట్రోక్స్ (మెదడుకు రక్త ప్రసరణ తక్కువగా ఉండడం వలన కణాలు చచ్చు పడిన స్థితి) లేదా రెట్ సిండ్రోమ్ (జన్యు సంబంధిత వ్యాధి - భాష, మాట, పునరావృత చర్యలకు అనుసంధానం లేకపోవడం) వంటి అనేక తీవ్ర కేంద్ర నాడీ వ్యవస్థ వ్యాధులలో చూడవచ్చు.

శ్వాసకోశ ఆల్కలోసిస్ చికిత్సలో మొదటగా శ్వాస తీసుకోవడంలో సహాయం అందించడం, తగినంత ఆక్సిజన్ అందించడం. హైపర్‌వెంటిలేటింగ్ చేస్తుంటే, శ్వాసను నెమ్మదింపజేయడం, ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం, ఆందోళనను తగ్గించడం వల్ల ఆక్సిజన్‌ను సమతుల్యతలో ఉంచడం సాధ్యపడుతుంది.[1]

కార్బన్ డయాక్సైడ్ లోపం వలన రక్తప్రవాహంలో తగినంత కార్బన్ డయాక్సైడ్ లేనప్పుడు, శ్వాసకోశ ఆల్కలోసిస్ వస్తుంది. ఇది సాధారణంగా హైపర్‌వెంటిలేషన్ వేగంగా, లోతుగా శ్వాస తీసుకునేలా చేసే ఇతర పరిస్థితుల ఫలితంగా సంభవిస్తుంది. శ్వాసకోశ ఆల్కలోసిస్‌కు ఇతర కారణాలు: జ్వరం, ఎత్తైన ప్రదేశాలలో ఉండడం, ఆక్సిజన్ తక్కువగా ఉండటం, ఊపిరితిత్తుల వ్యాధి, కాలేయ వ్యాధి[1]

శ్వాసకోశ ఆమ్లత, జీవక్రియ ఆల్కలోసిస్ తో సంబంధం ఉంటుంది. ఈ రెండు పరిస్థితుల మధ్య సున్నితమైన సమతుల్యత ఉంటుంది- బైకార్బోనేట్ పెరగడం, ఆమ్లం తగ్గడం. మూత్రపిండాలు శరీరంలో pH సమతుల్యత నిర్వహించడంలో ముఖ్య పాత్ర నిర్వహిస్థాయి. ఎక్కువ క్షారంగా మారకుండా చూసుకుంటాయి. బైకార్బోనేట్‌లో ఈ అసమతుల్యతను జీవక్రియ ఆల్కలోసిస్ అంటారు. అయితే కొన్ని పరిస్థితులు సమతుల్యతని ప్రభావితం చేసి ఆల్కలోసిస్‌కు దారితీయవచ్చు. ‌ఆల్కలోసిస్‌కు ఒక సాధారణ కారణం జీర్ణ సమస్యలు. అధిక వాంతులు శరీరంలోని ఆమ్లాన్ని ఎక్కువగా తొలగించడంవలన అసమతుల్యత ఏర్పడుతుంది. గుండె, కాలేయం లేదా మూత్రపిండాలను ప్రభావితం చేసే పరిస్థితులు కూడా శరీరంలో ఆల్కలీనిటీని మారుస్తాయి. ‌[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 Swiner, Carmelita (2023-07-06). "What Is Alkalosis?". WebMD. Retrieved 2025-12-31.
  2. Mosby's Paramedic Textbook – Mick J. Sanders
  3. 3.0 3.1 3.2 "Metabolic Alkalosis". Cleveland Clinic. Retrieved 2025-12-31.
  4. 4.0 4.1 Norman G. Levinsky (1987). Eugene Braunwald; et al. (eds.). Harrison's Principles of Internal Medicine (11 ed.). McGraw-Hill. pp. 212–214. ISBN 0-07-100134-4.
  5. 5.0 5.1 Yee AH, Rabinstein AA (February 2010). "Neurologic presentations of acid-base imbalance, electrolyte abnormalities, and endocrine emergencies". Neurol Clin. 28 (1): 1–16. doi:10.1016/j.ncl.2009.09.002. PMID 19932372.