Jump to content

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్

వికీపీడియా నుండి
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
Chairpersonఎన్.వేలప్పన్ నాయర్
స్థాపకులుసుభాస్ చంద్ర బోస్
స్థాపన తేదీ22 జూన్ 1939 (85 సంవత్సరాల క్రితం) (1939-06-22)[1]
ప్రధాన కార్యాలయంనేతాజీ భవన్, T-2235/2, అశోక్ నగర్, ఫైజ్ రోడ్, కరోల్ బాగ్, న్యూ ఢిల్లీ-110005[2]
విద్యార్థి విభాగంఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్
యువత విభాగంఆల్ ఇండియా యూత్ లీగ్
మహిళా విభాగంఆల్ ఇండియా అగ్రగామి మహిళా సభ
కార్మిక విభాగంట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్
రైతు విభాగంఆల్ ఇండియా అగ్రగామి కిసాన్ సభ
రాజకీయ విధానంవామపక్ష జాతీయ వాదం
Socialism
సామ్రాజ్యవాద వ్యతిరేకత
మార్క్సిజం[3]
రాజకీయ వర్ణపటంవామపక్షం
రంగు(లు)ఎరుపు
ఈసిఐ హోదాState Party (West Bengal)[4]
కూటమిలెఫ్ట్ ఫ్రంట్
(West Bengal)
United Democratic Front
(Kerala)
Secular Progressive Alliance
(Tamil Nadu)
Election symbol
Website
www.forwardbloc.org

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) భారతదేశానికి చెందిన వామపక్ష జాతీయవాద రాజకీయ పార్టీ. ఇది 1939 లో సుభాష్ చంద్రబోసు నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో ఒక వర్గంగా ఆవిర్భవించింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజకీయ పార్టీగా దాన్ని తిరిగి స్థాపించారు. ఈ పార్టీకి ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లో బలమైన ఉనికి ఉంది. పార్టీ ప్రస్తుత సెక్రటరీ జనరల్ దేబబ్రత బిశ్వాస్ . స్వాతంత్ర్యానంతర కాలంలో, శరత్ చంద్రబోసు (సుభాష్ చంద్రబోసు సోదరుడు), చిత్త బసులు పార్టీ నాయకులుగా ప్రఖ్యాతి గాంచారు.

స్వాతంత్ర్య పూర్వ చరిత్ర

[మార్చు]

ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పాటు

[మార్చు]

భారత జాతీయ కాంగ్రెసు లోని ఫార్వర్డ్ బ్లాక్ 1939 మే 3 న ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్, మాకుర్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోసు ఏర్పాటు చేసాడు. అతను మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పన్నిన వ్యూహంలో ఓడిపోయి, ఏప్రిల్ 29 న కాంగ్రెసు అధ్యక్ష పదవికి రాజీనామా చేసాడు. కలకత్తాలో జరిగిన ర్యాలీలో ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పాటును బహిరంగంగా ప్రకటించాడు. పార్టీలో చేరాక వారు ఎన్నటికీ బ్రిటిషు వారి వైపు తిరగాల్సిన అవసరం ఉండదని, వారి రక్తంతో సంతకం చేసి, ప్రతిజ్ఞ ఫారమ్‌ను పూర్తి చెయ్యాలని బోసు చెప్పాడు. ముందుగా, పదిహేడు మంది యువతులు వచ్చి ప్రతిజ్ఞా పత్రంలో సంతకం చేశారు. ప్రారంభంలో ఫార్వర్డ్ బ్లాక్ లక్ష్యం కాంగ్రెస్‌లోని అన్ని వామపక్ష విభాగాలను సమీకరించడం, కాంగ్రెస్ లోపల ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం. బోసు ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడయ్యాడు. ఎస్ఎస్ కవిషర్ ఉపాధ్యక్షుడయ్యాడు. జూన్ చివరిలో బొంబాయిలో ఫార్వర్డ్ బ్లాక్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పార్టీ రాజ్యాంగాన్ని, కార్యక్రమాన్నీ ఆమోదించారు. [5] 1939 జూలైలో సుభాష్ చంద్రబోసు ఫార్వర్డ్ బ్లాక్ కమిటీని ప్రకటించాడు. దీనికి అధ్యక్షులుగా సుభాష్ చంద్రబోసు , ఉపాధ్యక్షులుగా పంజాబ్‌కు చెందిన ఎస్ఎస్ కవిషర్, ఢిల్లీకి చెందిన లాల్ శంకర్ లాల్ ప్రధాన కార్యదర్శిగా, బొంబాయికి చెందిన విశ్వంభర్ దయాళు త్రిపాఠి, ఖుర్షీద్ నారిమన్‌లు కార్యదర్శులు గానూ ఎంపికయ్యారు. ఇతర ప్రముఖ సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మద్దూరి అన్నపూర్ణయ్య, బొంబాయికి చెందిన సేనాపతి బాపట్, హరి విష్ణు కమ్నాథ్, తమిళనాడుకు చెందిన పసుంపన్ యు.ముత్తురామలింగం తేవర్, బీహార్ నుండి షీల్ భద్ర యాగీ ఉన్నారు. సత్య రంజన్ బక్షి, పార్టీ బెంగాల్ ప్రావిన్సు కార్యదర్శిగా నియమితుడయ్యాడు. [6]

అదే సంవత్సరం ఆగస్టులో బోసు , ఫార్వర్డ్ బ్లాక్ పేరుతో ఒక వార్తాపత్రికను ప్రచురించడం ప్రారంభించాడు. అతను తన కొత్త రాజకీయ పార్టీకి మద్దతు కూడగడుతూ దేశవ్యాప్తంగా పర్యటించాడు.వెబ్ సైట్ వివరాలు http://www.allindiaforwardbloc.com/ [6]

మొదటి కాన్ఫరెన్స్

[మార్చు]

మరుసటి సంవత్సరం, 1940 జూన్ 20–22 న, ఫార్వర్డ్ బ్లాక్ తన మొదటి అఖిల భారత సమావేశాన్ని నాగపూర్‌లో నిర్వహించింది. ఈ సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్‌ను సామ్యవాద రాజకీయ పార్టీగా ప్రకటించారు. జూన్ 22 ను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వ్యవస్థాపక తేదీగా తీసుకున్నారు. బ్రిటిషు వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం కోసం మిలిటెంట్ చర్యను కోరుతూ 'అధికారమంతా భారతీయులకే' అనే తీర్మానాన్ని ఈ సమావేశం ఆమోదించింది. పార్టీ అధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోసు , ప్రధాన కార్యదర్శిగా హెచ్‌వి కామత్ ఎన్నికయ్యారు. [7]

బోసు అరెస్టు, బహిష్కరణ

[మార్చు]

ఆ తర్వాత, జూలై 2 న, బోసు ‌ను అరెస్టు చేసి, కలకత్తా ప్రెసిడెన్సీ జైలులో నిర్బంధించారు. 1941 జనవరిలో అతను గృహ నిర్బంధం నుండి తప్పించుకుని, రహస్యంగా ప్రవాసానికి వెళ్ళాడు. భారత స్వాతంత్ర్య పోరాటానికి సోవియట్ల మద్దతు కోరుతూ ఆఫ్ఘనిస్తాన్ మీదుగా సోవియట్ యూనియన్‌ వెళ్లాడు. బోసు అభ్యర్థనను స్టాలిన్ తిరస్కరించాడు. ఆ తరువాత బోసు జర్మనీ వెళ్లాడు. బెర్లిన్‌లో అతను ఫ్రీ ఇండియా సెంటర్‌ను స్థాపించాడు. భారత సైనిక దళాన్ని తయారు చేశాడు. [8]

భారతదేశం లోపల, ఫార్వర్డ్ బ్లాక్ స్థానిక కార్యకర్తలు కేంద్ర సమన్వయం లేకుండానే బ్రిటిషు వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగించారు. ఉదాహరణకు, బీహార్‌లో సభ్యులు ఆజాద్ దస్తా అనే ప్రభుత్వ వ్యతిరేక సమూహాలలో పాలుపంచుకున్నారు. బోసుకు, భారత జాతీయ సైన్యానికీ మద్దతుగా ప్రచారం చేశారు. అయితే, వారికి బోసుతో గానీ, ఐఎన్‌ఎతో గనీ ఎలాంటి సంబంధమూ లేదు. [9]

యుద్ధానంతర పునర్వ్యవస్థీకరణ

[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో, ఫార్వర్డ్ బ్లాక్‌ను పునర్వ్యవస్థీకరించారు. 1946 ఫిబ్రవరిలో RS రుయికర్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఆల్ ఇండియా యాక్టివ్ వర్కర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. ఈ సమావేశంలో 'FB వర్కర్స్ అసెంబ్లీ' ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు, అప్పటికి ఇంకా చట్టవిరుద్ధంగానే ఉన్న ఫార్వర్డ్ బ్లాక్‌కు ఇది చట్టబద్ధమైన ముఖం లాంటిది. ముఖ్యంగా బొంబాయి నుండి KN జోగ్లేకర్, సోలి బట్లీవాలీ వంటి ప్రముఖ కమ్యూనిస్టులు 'FB వర్కర్స్ అసెంబ్లీ'లో చేరారు. వర్కర్స్ అసెంబ్లీ సమావేశంలో "ఫార్వర్డ్ బ్లాక్ ఒక సామ్యవాద రాజకీయ పక్షం. వర్గరహిత సమాజానికి దారితీసే సామ్యవాద సాధన కోసం ఇది వర్గ పోరాట సిద్ధాంతాన్ని దాని పూర్తి ప్రభావాలతో స్వీకరిస్తుంది. విప్లవాత్మక బహుళ చర్యల కార్యక్రమాన్ని స్వీకరిస్తుంది." [10]

1946 శాసనసభ ఎన్నికలకు ముందు, ఆ సంవత్సరం జూన్‌లో, బ్లాక్‌పై నిషేధాన్ని ఎత్తివేసారు. ఫార్వర్డ్ బ్లాక్ వర్కింగ్ కమిటీ జూన్ 10 న సమావేశమైంది. [11]

రాజ్యాంగ పరిషత్తుకు, రాష్ట్రాల శాసనసభలకూ 1946 డిసెంబరులో ఎన్నికలు జరిగాయి. ఫార్వర్డ్ బ్లాక్ ఎన్నికల్లో పోటీ చేసింది. HV కామత్ రాజ్యాంగ పరిషత్‌లో ఒక స్థానాన్ని గెలుచుకున్నాడు. జ్యోతిష్ చంద్ర ఘోష్, హేమంత కుమార్ బసు, లీలా రాయ్ బెంగాల్ శాసనసభకు ఎన్నికయ్యారు. [12]

అర్రా కాన్ఫరెన్స్

[మార్చు]

పార్టీ 2 వ అఖిల భారత సమావేశాన్ని 1947 జనవరి 12-14 తేదీల్లో బీహార్ లోని అర్రాలో నిర్వహించారు. ఎస్‌ఎస్ కవిషర్ (సుభాసిస్ట్ సెక్టార్‌లో ప్రముఖ సభ్యుడు) అధ్యక్షుడిగాను, షీల్ భద్ర యాగీ (మార్క్సిస్ట్ సెక్టార్‌లో ప్రముఖ సభ్యుడు) ప్రధాన కార్యదర్శిగానూ ఎన్నికయ్యారు. [13]

స్వాతంత్ర్యానంతరం

[మార్చు]

యాగీ రుయికార్ లు పార్టీని చీల్చారు

[మార్చు]

స్వాతంత్ర్యం తరువాత, పార్టీ జాతీయ కౌన్సిల్ 1948 ఫిబ్రవరిలో వారణాసిలో సమావేశమైంది. కాంగ్రెస్‌తో ఇంకా ఏవైనా సంబంధాలుంటే వాటిని విడిచిపెట్టి, స్వతంత్ర ప్రతిపక్ష పార్టీగా పునర్నిర్మించుకోవాలని పార్టీ నిర్ణయించుకుంది. [14] అంతేకాకుండా, భారతదేశానికి, పాకిస్తాన్‌కూ విడివిడిగా శాఖలు ఏర్పాటు చేసుకోవాలని తీర్మానం చేసింది. త్వరలోనే ఇది చాలా వివాదాస్పదంగా మారింది. ప్రధాన కార్యదర్శి యాగీ వారణాసి తీర్మానానికి అనుగుణంగా, ఫార్వార్డ్ బ్లాక్ బెంగాల్ కమిటీని రద్దు చేసి, పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్‌ల కోసం విడివిడిగా తాత్కాలిక కమిటీలను ఏర్పాటు చేశాడు. దాంతో 'మార్క్సిస్టులు', 'సుభాసిస్టులు' మధ్య విభజన మళ్లీ పుంజుకుంది. 'సుభాషిస్టులు', మరీ ముఖ్యంగా ఎస్ఎస్ కావేషీర్, యాగీ చర్యలను విమర్శించాడు. [15]

చీలిక జరిగిపోయింది. రూయికర్, కేవ్‌షీర్ నేతృత్వంలోని 'సుభాసిస్ట్' బృందం పశ్చిమ బెంగాల్‌లోని చందన్నగర్‌లో డిసెంబరు 29–31 తేదీలలో సమావేశం జరిపారు. అదే తేదీలలో యాగీ కలకత్తాలో ఒక సమావేశాన్ని నిర్వహించాడు. ఇప్పుడు, రూయికర్ నేతృత్వంలో ఒకటి (ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (రుయికర్)), యాగీ నేతృత్వంలో మరొకటీ -రెండు ఫార్వర్డ్ బ్లాక్‌లు ఉన్నాయి. యాగీ ప్రధాన కార్యదర్శిగా, కెఎన్ జోగ్లేకర్ ఛైర్మన్‌గా యాగీ పార్టీకి ఎన్నికయ్యారు.

దేశ్ సేవక్ పార్టీ 1949 అక్టోబరులో ఈ పార్టీలో విలీనమైంది.

యాగీ, సింగ్‌ల బహిష్కరణ

[మార్చు]

1955 లో భారత జాతీయ కాంగ్రెసు పార్టీ సామ్యవాదాన్ని తన విధానంగా స్వీకరించింది. దాంతో యాగీ, సింగ్ వంటి నాయకులు, ఫార్వర్డ్ బ్లాక్‌ను దానితో విలీనం చెయ్యాలని ప్రతిపాదించారు. సింగ్, యాగీలు, కేంద్ర కమిటీని గానీ, పార్టీ సభ్యులను గానీ సంప్రదించకుండా, ఫార్వర్డ్ బ్లాక్‌ను కాంగ్రెసులో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్యతో పార్టీలోని అనేక వర్గాలు విభేదించాయి. మే 11–15 లో నాగ్‌పూర్‌లో జరిగిన సమావేశంలో సింగ్, యాగీలను బహిష్కరించాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. కొత్త చైర్మన్ గా హేమంత కుమార్ బోసు , ప్రధాన కార్యదర్శిగా ఆర్కే హల్దూల్కర్ ఎన్నికయ్యారు. [16]

తమిళనాడులో తేవర్ మరణం, పార్టీ చీలిక

[మార్చు]

1963 అక్టోబరు 30 న పార్టీ తమిళనాడు నాయకుడు యు. ముత్తురామలింగం తేవర్ మరణించాడు. ఆ తరువాత జరిగిన ఆధిపత్య పోరాటంలో మూకయ్య తేవర్‌ నెగ్గగా, పార్టీ లోని ఒక వర్గం శశివర్ణ తేవర్ నేతృత్వంలో చీలి సుభాషిస్టు ఫార్వర్డ్ బ్లాకు అనే పార్టీ రూపుదిద్దుకుంది.

త్రిపురలో ప్రగతిశీల ఫ్రంట్

[మార్చు]

1965 లో పార్టీ త్రిపురలో 'ప్రోగ్రెసివ్ ఫ్రంట్' లో చేరింది. ఫ్రంట్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఫార్వర్డ్ బ్లాక్, సోషలిస్ట్ పార్టీ నుండి విడిపోయిన వర్గం ఉన్నాయి. దేశవ్యాప్తంగా భూ సంస్కరణలు, జాతీయ రక్షణను బలోపేతం చేయడం, కామన్వెల్త్ నుండి వైదొలగడం, విదేశీ మూలధనాన్ని జాతీయం చేయడం, హేతుబద్ధమైన ఆహార విధానం, రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయడం, ఇండో-అమెరికన్ ఆహార సరఫరా ఒప్పందాన్ని రద్దు చేయడం వంటి డిమాండ్లను ఫ్రంట్ చేపట్టింది. నవంబరు 17 న అగర్తలాలో జరిగిన సమావేశంలో కొత్త ఫ్రంట్ ఏర్పాటైనట్లు ప్రకటించారు. నవంబర్ 28 న బెలోనియాలోను, ఆ తరువాత డిసెంబర్ 1 న బీర్చంద్ర బజార్ (బెలోనియా సమీపంలో) లోనూ ఫ్రంటు భారీ ర్యాలీలు జరిపింది. [17] 1967 ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ నుండి చీలిన సమూహంతో జతకట్టినప్పటికీ, ఫ్రంటు ఎక్కువ రోజులు మనలేదు. ఫార్వర్డ్ బ్లాక్ ఆ ఎన్నికల్లో అభ్యర్థులను నిలపనేలేదు. [18]

కాంగ్రెసు పార్టీలో చీలిక

[మార్చు]

1969 లో భారత జాతీయ కాంగ్రెస్‌లో పెద్ద చీలిక ఏర్పడింది. ఇందిరా గాంధీ సాంప్రదాయిక కాంగ్రెసు నాయకత్వంతో బహిరంగ వివాదానికి దిగింది. ఇందిరా నేతృత్వంలోని కాంగ్రెస్ (R), కామరాజ్ నేతృత్వంలోని కాంగ్రెస్ (O) అనే రెండు వేర్వేరు కాంగ్రెస్ పార్టీలు సుస్పష్టంగా కనిపించాయి. ఇందిర స్థాపించిన పార్టీ ఉన్నత వర్గాలకు వ్యతిరేకంగా ప్రజాదరణను పొందింది. ఫార్వర్డ్ బ్లాక్ ఈ కొత్త పరిణామాలను స్వాగతించింది. ఇందిర తీసుకున్న వైఖరులను ప్రశంసించింది. కాంగ్రెసు పట్ల తన వ్యతిరేకతను కాంగ్రెస్ (O) పై కేంద్రీకరించింది. 1969 రాష్ట్రపతి ఎన్నికల్లో AIFB, ఇందిర అభ్యర్థి వివి గిరికి మద్దతు ఇచ్చింది. ఈ వైఖరి తమిళనాడులోని స్వతంత్ర పార్టీ-AIFB కూటమి (స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్ (O) కు అనుకూలంగా ఉన్నందున) అకస్మాత్తుగా విడిపోవడానికి కారణమైంది. [19]

1971-72 ఎన్నికలు

[మార్చు]

1971 సాధారణ ఎన్నికలకు కొద్దిగా ముందు, ఫిబ్రవరి 20 న, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చైర్మన్ హేమంత కుమార్ బోసు కలకత్తాలో హత్య చేయబడ్డాడు. ఫిబ్రవరి 24 న కేంద్ర కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. పార్టీ కొత్త ఛైర్మన్‌గా పికె మూకయ్య తేవర్‌ను నియమించింది. [20]

1971 లోక్ సభ ఎన్నికల్లో, ఫార్వర్డ్ బ్లాక్ దేశవ్యాప్తంగా 24 మంది అభ్యర్థులను నిలబెట్టగా, ఇద్దరు - రామంతపురం నుండి PK మూకయ్య తేవర్, [21] నాగపూర్ నుండి జంబూవంతరావు ధోతే. [22] - ఎన్నికయ్యారు. మహారాష్ట్ర అంతర్భాగంలో పార్టీ 3 స్థానాల్లో పోటీ చేసింది, అక్కడ అది బాగా పనిచేసింది. అప్పుడు విదర్భ కా షేర్ (విదర్భ సింహం) గా పేరుబడ్డ ధోతే, ఫార్వర్డ్ బ్లాక్‌లో చేరాడు. ఫార్వర్డ్ బ్లాక్ వేదికగా ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం ప్రచారం చేశాడు. ఆ సమయంలో ధోతే ఈ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందాడు. అతని సమావేశాలకు వందల వేల మందిని హాజరయ్యేవారు. [23] [24] [25]

1977 ఎన్నికలు

[మార్చు]

1977 భారత రాజకీయ చరిత్రలో కీలకమైన సంవత్సరం. స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా, కాంగ్రెసు పార్టీ జాతీయ ఎన్నికల్లో ఓడిపోయింది. లోక్ సభ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ నాలుగు స్థానాల్లో పోటీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్ ఫ్రంట్ మద్దతు ఇచ్చిన ముగ్గురు అభ్యర్థులు ఉండగా, ఈ ముగ్గురూ ఎన్నికయ్యారు. అంతేకాకుండా, పార్టీ హర్యానాలో ఒక స్థానంలో పోటీ చేసింది. [26]

ఇటీవలి చరిత్ర

[మార్చు]

2000 బీహార్ శాసనసభ ఎన్నికలకు ముందు AIFB భారతీయ జన్ కాంగ్రెస్, బీహార్ వికాస్ పార్టీ, జనతాదళ్ (సెక్యులర్), సమాజ్ వాది జనతా పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలతో కలిసి ఒక ఫ్రంటును ఏర్పాటు చేసింది. బీహార్ రాజకీయాలలో రాష్ట్రీయ జనతాదళ్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనే రెండు ప్రధాన బ్లాక్‌ల పట్ల సమతౌల్యతను కొనసాగిస్తామని ఫ్రంట్ ప్రతిజ్ఞ చేసింది, ఆ రెంటినీ 'కులతత్వం, మతతత్వం' పార్టీలని విమర్శించింది. [27]

2002 లో లక్ష్మీ సహగల్‌ను భారత రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేసిన నాలుగు వామపక్ష పార్టీలలో AIFB ఒకటి. ప్రధాన అభ్యర్థి ఎపిజె అబ్దుల్ కలాంను సవాలు చేసిన సెహగల్‌కు దాదాపు 10% ఓట్లు వచ్చాయి.

2004 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ 0.4% ఓట్లు, మూడు సీట్లు పొందింది (అన్నీ పశ్చిమ బెంగాల్ నుండే).

2006 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు, మాజీ AIFB రాజ్యసభ సభ్యుడు జయంత రాయ్, పశ్చిమ బెంగాల్ మాజీ వ్యవసాయ మంత్రి ఛాయా ఘోష్ నేతృత్వంలో పార్టీలోని ఒక విభాగం విడిపోయి ఇండియన్ పీపుల్స్ ఫార్వర్డ్ బ్లాక్‌ను ఏర్పాటు చేసింది. ఈ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌తో జతకట్టింది. మాజీ ఫార్వర్డ్ బ్లాక్ లోని ఒక చిన్న సమూహమైన భారతీయ ఫార్వర్డ్ బ్లాక్, 2006 ఎన్నికలకు ముందు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌లో విలీనమైంది.

వివిధ రాష్ట్రాల్లో

[మార్చు]

పశ్చిమ బెంగాల్

[మార్చు]

AIFB కి దేశవ్యాప్తంగా శాఖలు ఉన్నప్పటికీ, ప్రధానంగా పార్టీ బలం పశ్చిమ బెంగాల్‌లో కేంద్రీకృతమై ఉంది. 2011 సంవత్సరానికి ముందు ఇది లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వంలో భాగంగా ఉండేది. 2011 లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెసు పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. AIFB కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌లో భాగం కాదు.

త్రిపుర

[మార్చు]

త్రిపురలో ఫార్వార్డ్ బ్లాక్ 1944 లో కమలా రంజన్ తాళపత్ర స్థాపించడంతో ఉనికిని ఏర్పరచుకుంది. శైలేష్ సేన్, గోపి బల్లవ్ సాహా, ద్విజెన్ దేవ్, అనిల్ దాస్‌గుప్తా, హిరేన్ నంది, సతీ భరద్వాజ్ వంటి వలస వచ్చిన బెంగాలీలు పార్టీలో ఇతర క్రియాశీల సభ్యులు. వారు వివిధ రాజకీయ ప్రచారాలలో పాల్గొన్నారు. అయితే, 1955-1956లో త్రిపురలో పార్టీ వ్యవస్థాపక ప్రధాన భాగం ఆర్‌ఎస్‌పిలో చేరింది. [28] [29] 2003 త్రిపుర శాసనసభ ఎన్నికల్లో త్రిపుర రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు బ్రజగోపాల్ రాయ్ లెఫ్ట్ ఫ్రంట్ తరపున టౌన్ బోరోవాలి నియోజకవర్గంలో పోటీ చేశారు. రాయ్ 9844 ఓట్లు (43.57%) పొందారు, కానీ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. [30] AIFB రాష్ట్ర యూనిట్ త్రిపుర బాణిని ప్రచురిస్తుంది.

ఉత్తర ప్రదేశ్

[మార్చు]

2007 ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో AIFB అభ్యర్థులు- బిసల్‌పూర్‌లో రామ్ లఖన్ (732 ఓట్లు, 0.51%), ఫతేపూర్ సిక్రీలో సమర్ సింగ్ (870 ఓట్లు, 0.69%), హస్తినాపూర్‌లో జబర్ సింగ్ (503 ఓట్లు, 0.42%) సాధించారు. [31]

హర్యానా

[మార్చు]

AIFB కి హర్యానాలో ఒక చిన్న శాఖ ఉంది. హర్యానా రాష్ట్ర కమిటీ చైర్మన్ నవీన్ అంటిల్. 2005 లో హర్యానా శాసనసభకు జరిగిన ఎన్నికలో AIFB నిలోఖేరి నియోజకవర్గంలో ముక్తియార్ సింగ్ కౌశిక్ అనే ఒకే అభ్యర్థిని నిలబెట్టింది. కౌశిక్‌కు 442 ఓట్లు (0.44%) వచ్చాయి. [32]

ఆంధ్రప్రదేశ్

[మార్చు]

1950 లలో ఆంధ్రప్రదేశ్‌లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి గణనీయమైన ఉనికి ఉండేది, కానీ తర్వాత అది క్షీణించి పోయింది. 2005 లో పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీని పునరుద్ధరించడానికి చొరవ తీసుకుంది. వెబ్ సైట్ వివరాలు http://www.allindiaforwardbloc.com/ [33] [34]

అనుబంధ సంస్థలు

[మార్చు]
  • ఆల్ ఇండియా యూత్ లీగ్ (యువజన సంస్థ)
  • ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ (విద్యార్థి సంస్థ)
  • ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ కమిటీ (ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్)
  • ఆల్ ఇండియా అగ్రగామి కిసాన్ సభ (రైతుల సంస్థ)
  • ఆల్ ఇండియా అగ్రగామి మహిళా సమితి (మహిళా సంస్థ)
  • ఇండియన్ నేషనల్ సైబర్ ఆర్మీ (సోషల్ మీడియా ఆర్గనైజేషన్) [35]
  • అగ్రగామి ఆదివాసీ సమితి (గిరిజన సంస్థ)

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

 

  1. The Calcutta Historical Journal. Vol. 3. University of Calcutta. 1978. p. 59.
  2. Administrator, Rajat Kumar Das, Web. "Forward Bloc".{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  3. "Party constitution". India: All India Forward Bloc. 2017. Retrieved 22 April 2017.
  4. "List of Political Parties and Election Symbols main Notification Dated 18.01.2013" (PDF). India: Election Commission of India. 2013. Retrieved 9 May 2013.
  5. Ghosh, Asok (ed.
  6. 6.0 6.1 Misra, Chitta Ranjan (2012). "Forward Bloc". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh.
  7. Ghosh, Asok (ed.
  8. Ghosh, Asok (ed.
  9. Ruud, Arild Engelsen (1 January 1994). "Land and Power: The Marxist Conquest of Rural Bengal". Modern Asian Studies. 28 (2): 357–380. doi:10.1017/s0026749x00012440. JSTOR 312891.
  10. Ghosh, Asok (ed.
  11. The members of the Working Committee at the time were Subhas Chandra Bose (Sr. Founder President), S.S. Cavesheer (President), R.S. Ruikar (Vice-President), Sheel Bhadra Yagee (Vice-President), Hari Vishnu Kamath (general secretary), Mukundalal Sarkar (Secretary), Vishwanbhar Dayal Tripathi (Secretary), Prof.
  12. Ghosh, Asok (ed.
  13. Ghosh, Asok (ed.
  14. Bose, K.; Forward Bloc.
  15. Notably, the Forward Bloc faction led by Ruiker and Cavesheer was the last group in the West Bengal left to raise the slogan of a united Bengal.
  16. Ghosh, Asok (ed.
  17. Basu, Pradip Kumar; The Communist Movement in Tripura, Calcutta: Progressive Publishers, 1996. p. 124.
  18. "ECI" (PDF). Archived from the original (PDF) on 16 June 2007. Retrieved 19 July 2006.
  19. Now two poles emerged in Tamil politics.
  20. Bose, K.; Forward Bloc.
  21. Thevar got 208 431 votes (58.16%), defeating the Congress(O) candidate S. Balakrishnan.
  22. Dhote got 125 552 (37.09%).
  23. As mentioned the party won the Nagpur seat.
  24. The Hindu 16 March 2004 Archived 2 డిసెంబరు 2007 at the Wayback Machine.
  25. Rediff 12 October 2006.
  26. K.K. Toofan of the Forward Bloc contested the Mahendragarh seat in Haryana.
  27. SJP leader Ramsunder Das was chosen as the convenor of the front.
  28. Majumder, Benimadhab; The Legislative Opposition in Tripura, Agartala: Tripura State Tribal Cultural Research Institute & Museum, 1997. p. 19
  29. Mohanta, Bijan.
  30. "ECI". Archived from the original on 30 September 2007.
  31. "Archived copy". Archived from the original on 30 September 2007. Retrieved 11 May 2007.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  32. "ECI" (PDF). Archived from the original (PDF) on 16 June 2007. Retrieved 18 July 2006.
  33. The Hindu, 9 May 2006.
  34. The Hindu, 19 July 2005.
  35. "Archived copy". Archived from the original on 18 February 2017. Retrieved 17 February 2017.{{cite web}}: CS1 maint: archived copy as title (link)