ఆవుల జయప్రదాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆవుల జయప్రదాదేవి
జననంజూలై 18, 1920
బొమ్మలూరు, కృష్ణా జిల్లా
జీవిత భాగస్వామిఆవుల సాంబశివరావు
పిల్లలుఆవుల మంజులత

ఆవుల జయప్రదాదేవి (జూలై 18, 1920 - 2004) మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. ఈమె ఆవుల సాంబశివరావు గారి భార్య. వీరి కుమార్తె ఆవుల మంజులత.

ఈమె కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా, బొమ్ములూరు గ్రామంలో 1920 జూలై 18 తేదీన జన్మించింది. ఈమె గుంటూరు ఉన్నత పాఠశాలలో చదివి, తర్వాత ప్రవీణ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు.

వీరు గుంటూరులో అంధుల, వికలాంగుల పాఠశాల, శిక్షణా సంస్థను స్థాపించారు. అనేక మంది బాలబాలికలు ఇందులో విద్యనభ్యసించి ప్రయోజనకరమైన జీవితాలను గడుపుతున్నారు. సుధా మెమోరియల్ శిశు విహార్ ను స్థాపించి నిర్వహించారు. ఇప్పుడు అదే సంస్థ లైన్సు క్లబ్ వారి సహకారంతో విలువైన సేవలనందిస్తుంది.

భర్తతో హైదరాబాదు వచ్చిన పిమ్మట బర్కత్పురా లోని ఆంధ్ర యువతీ మండలికి సహాయ కార్యదర్శిగా పనిచేస్తూ అందులో మహిళలకు వసతిగృహాన్ని నిర్మించడానికి కృషిచేసి నిర్వహణ బాధ్యతను కూడా వహించారు. ఆంధ్ర మహిళాసభ కు చెందిన వికలాంగుల విభాగానికి 1983 నుండి 1994 వరకు అధ్యక్షురాలిగా ఉన్నారు. అన్నపూర్ణ మానవ సంక్షేమ సమితిని స్థాపించి హైదరాబాదు, విశాఖపట్టణంలో నిర్వహిస్తున్నారు. వృద్ధులకు డే కేర్ సెంటరును నిర్వహిస్తున్నారు.

ఈమె 1957 నుండి 1964 వరకు ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ సలహా మండలిలో సభ్యురాలిగా ఉన్నారు. వీరు నిర్వహించిన "సుభాషిణి" అను మాసపత్రికకు సంపాదకురాలిగా ఉన్నారు.

ఆవుల సాంబశివరావుగారు "నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లయిండ్"కు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఈమె కార్యనిర్వహణ సభ్యులుగా అంధుల సంక్షేమం, విద్య, ఉపాధి కల్పనకు కృషిచేశారు.