Jump to content

ఆహార పటిష్టత

వికీపీడియా నుండి

ఆహార పదార్థాలకు పోషకాలను చేర్చడాన్ని పటిష్టీకరణం (ఫోర్టిఫికేషన్) అంటారు. ఆహారాన్ని పటిష్టం చేయడం అంటే ఆహార పదార్థాలకు సూక్ష్మపోషకాలను (ట్రేస్ ఎలిమెంట్స్), విటమిన్లు కలపడం. ఆహారాన్ని సుసంపన్నం చేయడం అంటే ప్రాసెసింగ్ సమయంలో కోల్పోయిన పోషకాలను తిరిగి చేర్చడం, అయితే పటిష్టం చేయడంలో సహజంగా లేని పోషకాలను కలపడం జరుగుతుంది.[1] 1920ల నుండి, పోషక లోపాలను నివారించడానికి ఆహార తయారీదారులు, ప్రభుత్వాలు ఈ పద్ధతులను ఉపయోగిస్తున్నాయి. ఒక ప్రాంతంలో పోషక లోపాలు తరచుగా నేల పరిస్థితులు లేదా స్థానిక ప్రధాన ఆహారాల పరిమితుల వల్ల ఏర్పడుతాయి. ముఖ్యమైన ఆహారాలు, మసాలా దినుసులకు సూక్ష్మపోషకాలను జోడించడం వల్ల పెద్ద ఎత్తున వచ్చే పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులను నివారించవచ్చు.[2]

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) ప్రపంచవ్యాప్తంగా పోషక లోపాలను తగ్గించడానికి ఆహార పటిష్టత (Food Fortification) ను కీలకమైన ప్రక్రియగా గుర్తించాయి. ఆహార, వ్యవసాయ సంస్థ ధాన్యాలు, పాల ఉత్పత్తులు, కొవ్వులు, నూనెలు, అనుబంధ ఆహార పదార్థాలు, తేయాకు, ఇతర పానీయాలు, శిశువుల ఆహారంతో సహా అనేక ఆహార పదార్థాలను పటిష్టం చేస్తోంది.[3] పోషకాహార లోపం, ముఖ్యంగా సూక్ష్మపోషకాల లోపాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 3 నుండి 5 మిలియన్ల మంది మరణిస్తున్నారని అంచనా. ఈ ఆహార పటిష్టత ప్రక్రియ పోషక ఆహార లోపం తగ్గించడంలో, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.[2]

ఈ పటిష్టీకరణ అనేది స్వచ్ఛందంగా లేదా చట్టపరంగా జరగవచ్చు. ఏదైనా ఆహార ఉత్పత్తిని బలోపేతం చేయడానికి ముందు, ఆహార సంస్థలు అది ఆరోగ్యానికి మేలు చేస్తుందా, సురక్షితమైనదా, సమర్థవంతమైన పద్ధతిలో పోషకాలను అందిస్తుందా అని నిరూపించాలి. అలాగే, అన్ని ఆహార లేబులింగ్ నిబంధనలను పాటించాలి. ఆహార అభివృద్ధిదారులు ఈ కొత్త ఉత్పతుల కయే ఖర్చులు, అంగడి (మార్కెట్‌)లో దానికి ఎంత గిరాకీ ఉంటుందో కూడా పరిగణించాలి.[4]

ఆహార పటిష్టీకరణ ప్రక్రియ

[మార్చు]

సాధారణ ఆహార పదార్థాలలో బలపరిచే ప్రక్రియ రెండు రకాలుగా ఉంటుంది - ఒకటి తిరిగి జోడించడం, రెండవది అదనంగా జోడించడం. ధాన్యాలను ప్రాసెస్ చేసే ప్రక్రియలో ఆహారం పిండి పోషక విలువను కోల్పోతుంది. దీనికి ఇనుము, ఫోలిక్ ఆమ్లం, నియాసిన్, రిబోఫ్లేవిన్, థయామిన్ వంటివి తిరిగి జోడించి పటిష్టంగా బలవర్థకంగా చేస్తారు. కొన్ని ఇతర బలవర్థకమైన ఆహారపదార్ధాలలో సహజంగా కొన్ని సూక్ష్మపోషకాలుండవు. ఉదాహరణకి నారింజ రసంలో అదనపు కాల్షియం చేరుస్తారు.[5]

ఇంతే కాకుండా ఆహార పటిష్టతను ఈ క్రింది రకాలుగా కూడా వర్గీకరించవచ్చు.

  1. వాణిజ్య, పారిశ్రామిక పటిష్టీకరణ (గోధుమ పిండి, మొక్కజొన్న పిండి, వంట నూనెలు)
  2. బయోఫోర్టిఫికేషన్ [గమనిక 1]
  3. గృహ పటిష్టత (ఉదాహరణ - విటమిన్ డి చుక్కలు [6]

ఈ ప్రక్రియ ద్వారా ఏ, బి12, డి, విటమిన్లతో పాటు జింక్, అయోడిన్, ఐరన్ వంటి ఖనిజాల (మినరల్స్) తో సమృద్ధి పరచి పోషక విలువలు పెంచుతారు. ఉప్పు, వంట నూనె, పాలు, గోధుమ పిండి, బియ్యం వంటివి ఈ రకమైన ఉత్పత్తులుగా లభిస్తున్నాయి. ఈ ప్రక్రియ వలన దృష్టి లోపాలు, ఎముకల బలహీనత, రక్త హీనత వంటి లోపాలు అధిగమించడమే కాకుండా, శరీరంలో థైరాయిడ్, మెదడు, నాడీ మండలం మొదలైన వ్యవస్థలు సక్రమంగా పనిచేసేందుకు తోడ్పడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ పోషకాల మోతాదు పెరగకుండా జాగ్రత్త వహించాలి. ఈ పటిష్ట (ఫోర్టిఫైడ్) ఆహారం సంచి (కవరు) పై ఒక ప్రత్యేక చిహ్నం (లోగో) ఉంటుంది. అది +F. [7]

విటమిన్ ఫోర్టిఫికేషన్ కార్యక్రమాలలో ఫోలేట్, నియాసిన్, రిబోఫ్లేవిన్, థయామిన్, విటమిన్ -ఎ, విటమిన్- బి6, విటమిన్- బి12, -డి, -ఇ వంటి విటమిన్లను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో ఉపయోగిస్తాయి. ఖనిజాల ఫోర్టిఫికేషన్ కార్యక్రమాలలో కాల్షియం, ఫ్లోరైడ్, అయోడిన్, ఇనుము, సెలీనియం, జింక్ వంటి ఖనిజాలను ఉపయోగిస్తాయి.[8]

ప్రపంచ వ్యాప్తంగా కార్యాచరణ

[మార్చు]
అయొడైజ్డ్ ఉప్పు వాడకం భాగం

ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఇనిషియేటివ్ ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆహార పటిష్టీకరణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. ఏ దేశంలో, ఏ ఆహారాలకు ఏ పోషకాలు జోడించబడతాయి అవి స్వచ్ఛందంగానా లేదా తప్పనిసరిగా ఉంటాయో కూడా నిర్ణయిస్తుంది.[9]

సూక్ష్మపోషకాలు శరీర అభివృద్ధిలో, పెరుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ సూక్ష్మపోషకాల లోపాలు వ్యాధులకి కూడా కారణం అవుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆహార, వ్యవసాయ సంస్థ (FAO)తో పాటు అనేక జాతీయ సంస్థలు గుర్తించిన దాని ప్రకారం, ఈ లోపాలలో ముఖ్యంగా అయోడిన్, విటమిన్ ఎ, ఇనుము లోపాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 మందిలో 1 వ్యక్తికి ఈ లోపం ఉందని వచ్చే ప్రమాదం ఉందని కనుగొనబడడము వలన 1992లో 159 దేశాలు FAO/WHO అంతర్జాతీయ ఆహారపదార్థాల సంరక్షణ సమావేశంలో ఈ సూక్ష్మపోషకాల లోపాలను తగ్గించడానికి ప్రయత్నిస్తామని ప్రతిజ్ఞ చేశాయి.[1] ఆహారాన్ని పటిష్టం చేయడం (Food Fortification) అనేది ఈ పోషక ఆహార లోపం వలన ఏర్పడే వ్యాధుల ప్రాబల్యాన్ని, సంబంధించిన ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో దీనిని ఒక ముఖ్యమైన ముందడుగుగా పరిగణించారు.[10] 2018 డిసెంబర్ 21 నాటికి, 81 దేశాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విటమిన్లతో ఆహారాన్ని బలోపేతం చేయాలి అనే నిర్ణయానికి వచ్చాయి.[11]

2017 అక్టోబరు 16న ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా భారత కుటుంబ ఆరోగ్య శాఖామంత్రి ఆహార పటిష్టీకరణ వేదికను ఆవిష్కరిస్తున్న చిత్రం

ఆన్లైన్ గ్లోబల్ ఫోర్టిఫికేషన్ డేటా ఎక్స్ఛేంజ్ వెబ్సైట్ ప్రపంచవ్యాప్తంగా సమగ్రమైన సమాచారాన్ని అందిస్తుంది.[12] 197 దేశాలలో ఏయే దేశం వారి డేటాసెట్లు, దేశ ప్రొఫైల్లలో తప్పనిసరి, స్వచ్ఛంద ఆహార పటిష్టతను కలిగి ఉందో ఇది సూచిస్తుంది. ఈ వెబ్సైట్ను ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఇనిషియేటివ్, లాభాలు, అయోడిన్ గ్లోబల్ నెట్వర్క్ లు, మైక్రోన్యూట్రియంట్ ఫోరం నిర్వహిస్తున్నాయి.[13][14]

భారతదేశంలో కూడా 6 నుంచి 59 నెలలు వయస్సు పిల్లలు 58.4% రక్తహీనత తోనూ, 35.7% మంది ఐదు ఏళ్ల లోపు పిల్లలు తక్కువ బరువుతోను, 53% మంది మహిళలు రక్త హీనత తోనూ బాధ పడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలియ చేసింది. ఈ నేపథ్యంలో పోషకాహార లోపాల వలన ఏర్పడే రుగ్మతలను అరికట్టడానికి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం 2018లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్) రెగ్యులేషన్ 2018 చట్టాన్ని తీసుకువచ్చింది. తయారీదారులు ఏయే ఆహార పదార్ధాలలో, ఎంత పరిమాణంలో సూక్ష్మ పోషకాలను జోడించవచ్చో పేర్కొంది.[7]

సమస్యలు

[మార్చు]

ప్రభుత్వాలు ఆదేశాలతో పాటు, విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాయి. కొన్ని ఆహార సంస్థలు వాణిజ్య ప్రయోజనాల కోసం ఆహారాన్ని విచక్షణారహితంగా సుసంపన్నం చేస్తున్నాయని విమర్శలు వచ్చాయి. ఆహార భద్రత ఆందోళనలు 2004లో డెన్మార్క్ అదనపు విటమిన్లు లేదా ఖనిజాలతో బలవర్థకమైన ఆహారాలను పరిమితం చేసే చట్టానికి దారితీశాయి. నిషేధించబడిన ఉత్పత్తులలో రైస్ క్రిస్పీస్, ష్రెడ్డీస్, హార్లిక్స్, ఓవల్టైన్, మార్మైట్ లు వంటివి ఉన్నాయి.[15]

ఆహార పటిష్టీకరణ అంటే ప్రాసెస్ చేసిన ఆహారాలకు పోషకాలను తిరిగి చేర్చడం అయితే, ఇలా చేర్చిన పోషకాలు అసలు, సహజ ఆహారాలలో ఉండేంత జీవ లభ్యత (Bioavailability) కలిగి ఉండకపోవచ్చు. అంటే, శరీరం వాటిని సమర్థవంతంగా ఉపయోగించలేకపోవచ్చు అనే వాదన ఉంది. ఉదాహరణకు, స్కిమ్ పాల[గమనిక 2]లో కొవ్వును తొలగించిన తరవాత విటమిన్-ఎ, డి, విటమిన్లు కొవ్వులోనే కరిగేవి కాబట్టి , కొవ్వు లేని స్కిమ్ పాలలో వాటిని పూర్తిగా గ్రహించడం కష్టం. అదే పాలు మొత్తంగా (whole milk) తాగినప్పుడు ఈ విటమిన్లను శరీరం మెరుగ్గా గ్రహించగలుగుతుంది. కాబట్టి ఈ ఆహార పటిష్టీకరణ ఒక ముఖ్యమైన ప్రక్రియ అయినప్పటికీ, చేర్చిన పోషకాల జీవ లభ్యత, ఇతర ఆహార భాగాల ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం అవసరం.[16]

మరోవైపు, కొన్ని సందర్భాల్లో, ఫోలిక్ ఆమ్లం వంటి జోడించిన పోషకాలు అసలు ఆహారాల్లోని వాటికంటే ఎక్కువ జీవ లభ్యతను కలిగి ఉండవచ్చు. అలాగే, తృణధాన్యాలలో ఉండే వృక్ష సంబంధమైన ఫైటిక్ ఆమ్లం వంటి రసాయనాలు (ఫైటోకెమికల్స్) కూడా పోషకాల శోషణను ప్రభావితం చేస్తాయి. ఇవి ఆహారాలలో పటిష్టీకరణ కార్యక్రమాల ప్రభావాన్ని తగ్గిస్తాయి.

అనేక సందర్భాల్లో, పటిష్టీకరణలో ఆహారాలకు జోడించిన సూక్ష్మపోషకాలు కృత్రిమం (సింథటిక్)గా ఉంటాయి. కొన్ని సూక్ష్మపోషకాలు (మైక్రోన్యూట్రియెంట్స్) అధిక మోతాదులో, శరీరానికి విషతుల్యంగా మారవచ్చు. అయితే, అవే సూక్ష్మపోషకాలకు చెందిన ఇతర రూపాలు ఎక్కువ మోతాదులో కూడా సురక్షితంగా ఉండవచ్చు. ఉదాహరణకి విటమిన్ ఎ (రెటినాల్), బీటా కెరోటిన్ వంటి 'విటమిన్-ఎ' యొక్క ఇతర రూపాల కంటే తక్కువ మోతాదులోనే విషంగా మారే అవకాశం ఉంది. అలాగే, 'విటమిన్-కె' (మెనాడియోన్)ను కూడా విషపూరితమైనదిగా గుర్తించి క్రమంగా తొలగించారు.

జాగ్రత్తలు

[మార్చు]

పోషకాహార లోపాలను ఎదుర్కోవడానికి ఆహారంలో పోషకాలను కలపడం (ఫోర్టిఫికేషన్) వల్ల ప్రధానంగా ప్రయోజనాలు ఏమంటే - జనాభా మొత్తానికి పోషకాహార ప్రయోజనం కలుగుతుంది. వ్యక్తిగతంగా ఎవరికీ ప్రత్యేక చికిత్సలు చేయకుండానే, ప్రజలందరికీ పోషకాలు అందుతాయి. దీనికి ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. శరీరానికి నిరంతరం పోషకాలు అందుతాయి. మాత్రలు లేదా ఇతర విటమిన్ మాత్రల మాదిరిగా కాకుండా, పటిష్టం చేసిన ఆహారాన్ని తినడానికి ప్రత్యేకంగా ఎవరి అనుమతి అవసరం లేదు. ప్రజలు సాధారణంగా తినే ఆహారం ద్వారానే పోషకాలు లభిస్తాయి, శరీరంలో పోషకాల నిల్వలు సమర్థవంతంగా నిర్వహించబడతాయి.[17] అయితే తాజా ఆహారంలో మాత్రమే లభించే ఆంటి ఆక్సిడెంట్లు , మొక్కల నుండి లభించు పోషకాలు ఈ పటిష్టీకరణ ప్రక్రియలో నష్టపోయే సంభావ్యత ఉండడము వలన తాజా పండ్లు, కూరగాయలు రోజువారీ ఆహారంలో వీటిని తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచిస్తున్నారు.[7]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 World Health Organization and Food and Agriculture Organization of the United Nations Guidelines on food fortification with micronutrients. Archived 26 డిసెంబరు 2016 at the Wayback Machine 2006 [cited on 2011 Oct 30].
  2. 2.0 2.1 "Micronutrient Fortification and Biofortification Challenge". Copenhagen Consensus Center (in ఇంగ్లీష్). Archived from the original on 2019-03-28. Retrieved 2017-06-14.
  3. "ANNEX 4 - MICRONUTRIENT FORTIFICATION OF FOOD: TECHNOLOGY AND QUALITY CONTROL*". www.fao.org. Archived from the original on September 2, 2016.
  4. Richardson, D. P. (28 February 2007). "Food Fortification". Proceedings of the Nutrition Society. 49 (1): 39–50. doi:10.1079/PNS19900007. PMID 2190226.
  5. (2015-01-07). "Fortification and Health: Challenges and Opportunities1234".
  6. Liyanage, C.; Hettiarachchi, M. (2011). "Food fortification". Ceylon Medical Journal. 56 (3): 124–127. doi:10.4038/cmj.v56i3.3607. PMID 22164753.
  7. 7.0 7.1 7.2 సుష్మ, గుమ్మా (2025-06-04). "పోషకాలు కలిపి ఔషధంగా మలిచి". ఈనాడు.
  8. "Map: Count of Nutrients In Fortification Standards". Global Fortification Data Exchange. Archived from the original on 11 ఏప్రిల్ 2019. Retrieved 4 February 2019.
  9. "Why fortify?". Food Fortification Initiative. 2017. Archived from the original on 4 April 2017. Retrieved 3 February 2019.
  10. Darnton-Hill E (1998). "Overview: Rationale and elements of a successful food-fortification programme". Food Nutr Bull. 19 (2): 92–100. doi:10.1177/156482659801900202.
  11. "Map: Count of Nutrients In Fortification Standards". Global Fortification Data Exchange. Archived from the original on 11 ఏప్రిల్ 2019. Retrieved 4 February 2019.
  12. "Global Fortification Data Exchange | GFDx – Providing actionable food fortification data all in one place" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-07-28.
  13. "Full GFDx Datasets – Global Fortification Data Exchange | GFDx" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-06-14. Retrieved 2021-07-28.
  14. "Country Fortification Dashboard – Global Fortification Data Exchange | GFDx" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-07-25. Retrieved 2021-07-28.
  15. Bruno Waterfield (24 May 2011). "Marmite made illegal in Denmark".
  16. McNulty, Helene; Pentieva, Kristina (2007). "Folate bioavailability". Proceedings of the Nutrition Society. 63 (4): 529–536. doi:10.1079/PNS2004383. ISSN 0029-6651. PMID 15831124.
  17. Liyanage, C.; Hettiarachchi, M. (2011). "Food fortification". Ceylon Medical Journal. 56 (3): 124–127. doi:10.4038/cmj.v56i3.3607. PMID 22164753.

గమనిక

[మార్చు]
  1. బయోఫోర్టిఫికేషన్ అంటే పోషక విలువలను పెంచడానికి పంటల పెంపకం చేసే పద్ధతి. ఇది ఎంపిక చేసిన సాంప్రదాయ పంటల పెంపకం ద్వారా కానీ జన్యు మార్పిడి ద్వారా కానీ చేయవచ్చు.
  2. స్కిమ్డ్ మిల్క్ అంటే మొత్తం పాల నుండి పాలకొవ్వును తొలగించి తయారు చేస్తారు. ఈ పాలలో దాదాపు 0.1% నుండి 0.3% కొవ్వు ఉంటుంది.