ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

వికీపీడియా నుండి
(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ is located in India
మద్రాసు
మద్రాసు
ఢిల్లీ
ఢిల్లీ
గౌహతి
గౌహతి
కాన్పూర్
కాన్పూర్
ఖరగ్‍పుర్
ఖరగ్‍పుర్
బాంబే
బాంబే
రూర్కీ
రూర్కీ
వారాణాసి
వారాణాసి
భువనేశ్వర్
భువనేశ్వర్
గాంధీనగర్
గాంధీనగర్
హైదరాబాద్
హైదరాబాద్
ఇండోర్
ఇండోర్
రాజస్థాన్
రాజస్థాన్
మండి
మండి
పాట్నా
పాట్నా
రోపడ్
రోపడ్
పాలక్కడ్
పాలక్కడ్
పంజిమ్
పంజిమ్
భిలాయి
భిలాయి
తిరుపతి
తిరుపతి
జమ్మూ
జమ్మూ
ధార్వాడ్
ధార్వాడ్
ధన్‌బాద్
ధన్‌బాద్
భారతదేశంలో ఐఐటీలు ఉన్న ప్రాంతాలు. అధికారిక ఐఐటీ పేరు (నగరం/ప్రదెశం, పేరు-ఊరు ఒకటి కాకపోతే). నీలం రంగు చుక్కలు రాబొతున్నవి.

భారతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆంగ్లభాష లో Indian Institute of Technology) భారతదేశం యొక్క ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యా సంస్థలు. ప్రస్తుతం భారతదేశంలో ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి. వీటన్నింటికీ స్వయంప్రతిపత్తి అధికారాలు ఉన్నాయి. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడ్డ ఈ కళాశాలలకు భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యతను కల్పించింది. ఐఐటీలు ప్రాథమికంగా శాస్త్రవేత్తలనూ, ఇంజనీర్లనూ సమాజం యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఏర్పరచబడ్డాయి. ఐఐటీ విద్యార్థులు సాధారణంగా ఐఐటియన్లుగా వ్యవహరించబడతారు.

వీటిన స్థాపించిన తేదీల ప్రకారం చూస్తే, ఖరగ్ పూర్, ముంబై, చెన్నై, కాన్పూర్, ఢిల్లీ, గౌహతి, రూర్కీ వరసలో ఏర్పరచబడ్డాయి. కొన్ని ఐఐటీలు యునెస్కో, జర్మనీ, అమెరికా, సోవియట్ యూనియన్ సహకారంతో ప్రారంభించబడ్డాయి. 2008లో హైదరాబాద్, రాజస్తాన్, భువనేశ్వర్, పాట్నా, గాంధీనగర్, పంజాబ్ లలో కొత్త ఐఐటీలు ఏర్పరచబడ్డాయి. 2009లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండిలో, ఇండోర్లో మరో రెండు కొత్త ఐఐటీలు స్థాపించబడ్డాయి. 2012 లో వారాణసి లోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకి ఐఐటీ హోదా కల్పించి ఐఐటీ (బనారస్ హిందూ యూనివర్సిటీ) వారాణసిగా మార్చబడింది.

ఐఐటిలలో చదివిన విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండి, ఆయా రంగాలలో తమదైన ముద్ర వేశారు. వీటికున్న స్వయంప్రతిపత్తి అధికారం వలన ఇవి ఇతర భారతీయ యూనివర్సిటీల్లో ఇచ్చే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (BE) కాక (B.Tech) డిగ్రీని బ్యాచిలర్ విద్యార్థులకు అందజేస్తాయి. ఐఐటీలు విజయవంతం కావడంతో, వీటిని పోలిన ఐఐఎమ్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్), ఎనైటీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఐఐఐటీ మొదలైన సంస్థలు కూడా ప్రారంభించేందుకు వీలు కలిగింది.

విద్యాసంస్థలు

[మార్చు]
  1. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌
  2. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ
  3. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్
  4. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ
  5. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి
  6. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూరు
  7. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్
  8. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే
  9. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారణాశి
  10. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్
  11. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్
  12. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇందౌర్
  13. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజస్థాన్
  14. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి
  15. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా
  16. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపడ్
  17. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి
  18. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలక్కాడ్
  19. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధన్‌బాద్
  20. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భిలాయ్
  21. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా
  22. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్ము
  23. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడ్

చరిత్ర

[మార్చు]

పాత ఐఐటీలు

[మార్చు]

మొట్ట మొదటిదైన ఐఐటీ ఖరగ్‌పూర్ని 1951లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కలకత్తాకు దగ్గరలో ఉన్న ఖరగ్‌పూర్ లో స్థాపించారు. ఇది 2,100 ఎకరాల సువిశాల విస్తీర్ణం కలిగినది. మొత్తం 29 విభాగాలు ఉన్నాయి. ఇందులో 450 అధ్యాపకులు, 2,200 మంది ఉద్యోగులు, 3,000 అండర్ గ్రాడ్యుయేట్లు, 2,500 పోస్టు గ్రాడ్యుయేట్లు ఉంటారు. ఇక్కడున్న కేంద్ర గ్రంథాలయం ఆసియా లోనే అతిపెద్ద సాంకేతిక గ్రంథాలయం.[1]

దస్త్రం:IITB Main Building.jpg
ఐఐటి బొంబాయి ప్రధాన భవనం

ఇక రెండవ ఐఐటీని మహారాష్ట్ర రాజధాని అయిన ముంబై సమీపంలో పోవై అనే ప్రాంతంలో 1958లో స్థాపించారు. దీనికోసం యునెస్కో, సోవియట్ యూనియన్ సాంకేతిక సహకారాన్ని అందించాయి.మిగతా ఖర్చును భారత ప్రభుత్వం భరించింది.ఇందులో నిర్మాణ పరమైన ఖర్చులు, మొదలైనవి ముఖ్యమైనవి.[2] 550 ఎకరాల విస్తీర్ణంతో 24 విభాగాలతో ఇది మహారాష్ట్రలో అతి పెద్ద విశ్వవిద్యాలయం.అంతేకాకుండా ఈ ఐఐటీలో 13 హాస్టల్ భవనాలున్నాయి. వీటిలో 2,200 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 2,000 పోస్టు గ్రాడ్యుయేట్లు ఉంటారు. ఇక్కడ శైలేష్ మెహతా స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ అనే మేనేజ్ మెంట్ విద్యా కేంద్రం, కన్వల్ రేఖీ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ప్రత్యేక విభాగం కూడా ఉంది. బొంబాయి పేరు ముంబైగా పేరు మారిన ఇది ఐఐటీ బొంబాయి గానే పేరుంది.

మూడవ ఐఐటీ తమిళనాడు రాజధాని అయిన చెన్నైలో ఉంది. దీనిని కూడా ఇప్పటికీ ఐఐటీ మద్రాసు గానే సంబోధించడం జరుగుతుంది.దీన్ని 1959లో పశ్చిమ జర్మనీ సహకారంతో వ్యవస్థాపన గావించారు.[3] ఇందులో సుమారు 360 మంది అధ్యాపకులు, 2,500 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 2,000 పోస్టు గ్రాడ్యుయేట్లు ఉంటారు. విస్తీర్ణం 620 ఎకరాలు. ఇక్కడ 15 విభాగాలు, సుమారు 100 ప్రయోగశాలలు,, 14 హాస్టల్ భవనాలు ఉన్నాయి.

నాలుగవదైన ఐఐటీని ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో 1959లో స్థాపించారు. మొదటి పది సంవత్సరాలపాటు ఈ ఐఐటీ భారత అమెరికా పథకంలో భాగంగా 9 అమెరికా యూనివర్సిటీ లతో కూడిన బృందం ఇక్కడ పరిశోధనాలయాలనూ, కోర్సులను రూపొందించడంలో సహాయపడింది.[4] దీని విస్తీర్ణం 1200 ఎకరాలు. 10 హాస్టల్ భవనాలు ఉన్నాయి. ఇక్కడ 500 మంది అధ్యాపకులు, సుమారు 2,000 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, అంతే సంఖ్యలో పోస్టు గ్రాడ్యుయేట్లు కూడా ఉంటారు.

ఐఐటీ గౌహతి పైనుంచి చూస్తే

ఈశాన్య రాష్ట్రమైన అస్సాం రాజధాని గౌహతిలో బ్రహ్మపుత్రా నది ఉత్తరపు ఒడ్డున ఐదవ ఐఐటీని 1994లో స్థాపించారు. చుట్టూ కొండల మధ్య రమణీయమైన ప్రకృతి ఒడిలో సుమారు 700 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఇది కొలువు తీరి ఉండటం వలన ఇక్కడికి పర్యాటకులు కూడా విచ్చేస్తుంటారు.[5] ఇక్కడ సుమారు 1,300 అండర్ గ్రాడ్యుయేట్లు, 500 మంది పిజి విద్యార్థులు, 18 విభాగాలు,, 152 మంది అధ్యాపకులు ఉన్నారు.

ఆరవదైన ఐఐటీ రూర్కీ ముందు రూర్కీ విశ్వవిద్యాలయంగా పిలవబడేది. రూర్కీ విశ్వవిద్యాలయం 1847లో ఆంగ్లేయుల కాలంలో ఏర్పడ్డ మొట్ట మొదటి విశ్వవిద్యాలయం.[6] ఇది ఉత్తరాఖండ్ లో ఉంది. 1854 నుంచీ థామ్సన్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అనే పేరుతో ఉన్న సంస్థ 1949లో రూర్కీ విశ్వవిద్యాలయంగా పేరు మార్చుకొంది.మరలా 2001 ఐఐటీ రూర్కీగా రూపాంతరం చెందింది.

కొత్త ఐఐటీలు

[మార్చు]

ఐఐటీ తిరుపతి - ఐఐటీ మద్రాసు పరిధిలోనిది

ఐఐటీ పాలక్కాడ్ - ఐఐటీ మద్రాసు పరిధిలోనిది

ఐఐటీ రోపార్ (పంజాబ్) - ఐఐటీ ఢిల్లీ పరిధిలోనిది

ఐఐటీ మండీ (హిమాచల్ ప్రదేశ్) - ఐఐటీ రూర్కీ పరిధిలోనిది

ఐఐటీ భువనేశ్వర్ - ఐఐటీ ఖరగ్‌పూర్ పరిధిలోనిది

ఐఐటీ హైదరాబాద్ - ఐఐటీ మద్రాస్ పరిధిలోనిది

ఐఐటీ గాంధీనగర్ - ఐఐటీ బాంబే పరిధిలోనిది

ఐఐటీ పాట్నా

ఐఐటీ రాజస్థాన్ - ఐఐటీ కాన్పూర్ పరిధిలోనిది

ఐఐటీ ఇందోర్ - ఐఐటీ బాంబే పరిధిలోనిది

ఐఐటీ (బనారస్ హిందూ యూనివర్సిటీ) వారాణసి - ఐఐటీ కాన్పూర్ పరిధిలోనిది

ఐఐటీ (ఐస్ఎం) ధన్‌బాద్

రాబోయే ఐఐటీలు

[మార్చు]

కేరళ రాష్ట్ర విద్యాశాఖామంత్రి పి.కె అబ్దు రబ్బ్ గారి ప్రకటన ప్రకారం, కేరళలోని పాలక్కాడ్ వద్ద కొత్త ఐఐటీ ప్రతిపాదించబడింది. అలాగే కర్ణాటకలోని ముద్దెనహళ్ళి వద్ద కూడా ఐఐటీ ఏర్పాటు చేసే ప్రతిపాదన 2009లో చేయబడింది. 2011, జనవరిలో విశ్వేశ్వర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకి ఐఐటీ హోదా కల్పించి కర్ణాటక ఐఐటీగా చేయాలని ప్రతిపాదించబడింది.

పరిపాలనా వ్యవస్థ

[మార్చు]
దస్త్రం:IIT-Organisational-structure.svg.png
ఐఐటీల పరిపాలనా వ్యవస్థ

ఐఐటిల పరిపాలనా వ్యవస్థలో భారత రాష్ట్రపతి అతున్నత స్థాయిలో ఉంటాడు. ఆయన క్రింద ఐఐటీ కౌన్సిల్ ఉంటుంది. ఈ కౌన్సిల్ లో కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖా మంత్రి, అన్ని ఐఐటీల ఛైర్మన్లు, అన్ని ఐఐటీల డైరెక్టర్లు, యూనివర్సిటీ గ్రాంట్సు కమీషన్ ఛైర్మన్, CSIR (కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) ఛైర్మన్, IISc (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) ఛైర్మన్,, డైరెక్టర్, ముగ్గురు పార్లమెంటు సభ్యులు, మానవ వనరుల అభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వం, AICTE ( ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్),, రాష్ట్రపతి ప్రతిపాదించిన ముగ్గురు సభ్యులు ఉంటారు.

ఐఐటీ కౌన్సిల్ క్రింద ప్రతి ఐఐటీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. వీరి క్రింద సంస్థ యొక్క డైరెక్టర్ ఉంటాడు. సంస్థ మొత్తానికీ ఈయనే ముఖ్య నిర్వహణాధికారి. డైరెక్టర్ల క్రింద డిప్యూటీ డైరెక్టర్లు ఉంటారు. ఇంకా క్రిందకు వెళితే డీన్లు, విభాగాధిపతులు, రిజిస్ట్రార్లు, విద్యార్థి సంఘం యొక్క ఛైర్మన్, హాల్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ ఉంటారు. విభాగాధిపతుల కింద ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఉంటారు. వార్డెన్లు హాల్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ క్రింద ఉంటారు.

ప్రవేశార్హతలు

[మార్చు]
ఐఐటీ ఢిల్లీలో గణితశాస్త్ర విభాగం

అన్ని ఐఐటీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE) ద్వారా బ్యాచిలర్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతాయి. ప్రతియేటా సుమారు 350000 మంది పరీక్షకు హాజరయితే అందులోంచి కేవలం 5000 మంది విద్యార్థులు మాత్రమే ఐఐటీలలో ప్రవేశం దక్కుతుంది. ఎంటెక్ కోర్సులకు GATE (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) పరీక్ష ద్వారానూ, ఎంఎస్సీ కోర్సులకు JAM పరీక్ష ద్వారా, M.Des కోర్సులకు CEED పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. అన్ని ఐఐటీలలో కలిపి సుమారు 15 వేల మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 12 వేలమంది పోస్టు గ్రాడ్యుయేట్లు,, పరిశోధనా విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటారు.

రిజర్వేషన్లు

[మార్చు]

భారతీయ రాజ్యాంగాన్ని అనుసరించి అన్ని ఐఐటీలలో 1973 నుంచి షెడ్యూల్డు కులాల వారికి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఐఐటిల ప్రవేశ విధానం ప్రకారం మొత్తం సీట్లలో 15% షెడ్యూల్డు కులాల వారికీ 7.5% షెడ్యూల్డు తెగల వారికీ కేటాయించ బడ్డాయి.

ఇతర వెనుకబడిన వర్గాలవారికి రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమీషన్ నివేదిక సమర్పించినా 2006 వరకూ ఈ వర్గానికి ఎటువంటి రిజర్వేషన్లు కల్పించబడలేదు. ఐఐటీలు ఈ సీట్లు కచ్చితంగా నింపాలి అనే నియమమేమీ లేదు. ఐఐటీలు విద్యార్థులను ఎంపిక చేసే విధానాల్ని బట్టి వీటిలో చాలా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. 2004 వ సంవత్సరంలో షెడ్యూల్డు తెగల వారికీ కేటాయించ బడ్డ 279 సీట్లలో 112, షెడ్యూల్డు కులాల వారికి కేటాయించబడ్డ 556 సీట్లలో 11 ఖాళీగానే ఉండిపోయాయి.

విద్య

[మార్చు]
కేల్కర్ గ్రంథాలయం, ఐఐటీ కాన్పూర్

ఐఐటీలకు భారతదేశంలో మరే ఇతర ఇంజనీరింగ్ కళాశాల పొందనన్ని నిధులు భారత ప్రభుత్వం సమకూరుస్తుంది.[7] ఐఐటీలకు తప్ప మిగతా ఇంజనీరింగ్ కళాశాలలకు భారత ప్రభుత్వం ఇచ్చే వార్షిక బడ్జెట్ రూ-100 - 200 మిలియన్లయితే ఒక్కో ఐఐటీకీ ప్రభుత్వం ఇచ్చే నిధులు రూ- 900-1,300 మిలియన్ల మధ్యలో ఉంటుంది. ఇంకా విద్యార్థుల ఫీజుల రూపంలో, పరిశోధనల కోసం పరిశ్రమలు ఇచ్చే నిధులు కూడా అధనంగా సమకూరుతాయి. ఈ నిధుల వల్ల ఐఐటీలలో సదుపాయాలు మెరుగవడమే కాకుండా మంచి అధ్యాపకులనూ సమకూర్చుకోగలుగుతోంది.దీని వలన విద్యార్థులలో కూడా ఐఐటీలలో ప్రవేశం పొందాలనే పోటీ తత్వం కూడా పెరుగుతోంది. ఐఐటీలలో అధ్యాపకులు-విద్యార్థి నిష్పత్తి 1:6 నుంచి 1:8 మధ్యలో ఉంటుంది.[8]

ఈ నిష్పత్తి అథమ పక్షంలో ప్రతి విభాగానికీ 1:9 కి దాటరాదని ఐఐటీ కౌన్సిల్ ప్రతిపాదిస్తోంది. ఐఐటీలలో అండర్ గ్రాడ్యుయేషన్ చేసేవారికి 80% ఫీజు రాయితీ ఉంటుంది. ఉన్నత విద్యను ప్రోత్సహించడం కోసం టక్కర్ కమిటీ (1959-1961) సిఫారసు మేరకు పిజి, పరిశోధనా విద్యార్థులందరికీ ఉపకారవేతనాలను అందించడం జరుగుతుంది.[9] ఇక యుజి విద్యార్థులకు సంవత్సరానికి సాలీనా ఖర్చయ్యేది (ఉండడానికి, భోజన సదుపాయాలు) సుమారు యాభై వేల రూపాయలు.

అన్ని ఐఐటీలు స్వయంప్రతిపత్తితోనే పని చేస్తాయి. వాటికి కల్పించిన జాతీయ ప్రాముఖ్యత వలన నిర్వహణాపరమైన సౌలభ్యం సమకూరడమే కాకుండా ప్రాంతీయ, కేంద్ర రాజకీయాలకు అతీతంగా నడిపే అధికారం కూడా కలిగింది. ఈ అధికారాల వలన ఐఐటీలు ప్రభుత్వ జోక్యం లేకుండా వేటికవే సిలబస్ ను రూపొందించుకోగలవు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా తన విద్యా విధానాన్ని మార్చుకోగలవు. ప్రభుత్వానికి అధ్యాపకుల నియామకం, సిలబస్ వంటి విషయాలపై ప్రత్యక్షంగా అధికారం లేక పోయినా ఐఐటీ కౌన్సిల్ రూపంలో ప్రాతినిధ్యం లభిస్తుంది. అన్నీ ఐఐటీలలోనూ ఆంగ్ల మాధ్యమం లోనే విద్యా బోధన జరుగుతుంది.[10] సాధారణంగా తరగతులు ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ జరుగుతుంటాయి. కొన్ని ఐఐటీలు ఇందుకు మినహాయింపు కావచ్చు. అన్ని ఐఐటీలలో అందరు విద్యార్థులకు అందుబాటులో గ్రంథాలయాలు ఉంటాయి. సిలబస్ లో నిర్దేశించిన పుస్తకాలే కాక ఇతర సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రానిక్ విప్లవం ఇప్పుడు అన్ని గ్రంథాలయాల్లో ఆన్‌లైన్ లో పరిశోధనా పత్రాలను చదువుకోగలిగే సౌకర్యం కలిగింది.

ఐఐటీలలో అకాడమిక్ విధానాలను అకాడమిక్ సెనేట్ నిర్ణయిస్తుంది. ఈ సెనేట్ లో ప్రొఫెసర్లందరూ, విద్యార్థుల నుంచి ప్రతినిథులు ఉంటారు. పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో ఈ సెనేట్ ను వోటు ద్వారా ఎన్నుకుంటారు. ఈ సెనేట్ సిలబస్ నూ కోర్సులనూ, పరీక్షలనూ, ఫలితాలనూ, నియామకాలనూ కొన్ని క్రమశిక్షణా చర్యలనూ పర్యవేక్షిస్తుంది.విద్యా ప్రమాణాలు పాటించడానికి బోధన, శిక్షణ, పరిశోధనా కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.[11] డైరెక్టరు ఈ సెనేట్ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు.

అన్ని ఐఐటీలలో విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడానికి క్రెడిట్ విధానాన్ని అవలంభిస్తారు. కోర్సుల యొక్క ప్రాముఖ్యతను బట్టి ఒక్కో కోర్సుకు ఎన్ని క్రెడిట్లు ఉండాలో నిర్ణయిస్తారు. 100 మార్కులకు ఎన్ని మార్కులు వచ్చాయన్నదాన్ని బట్టి గ్రేడ్ ను నిర్ణయించడం జరుగుతుంది. ఒక్కో మార్కుల రేంజికి ఒక్కో గ్రేడ్ (10 లోపు) ఉంటుంది. ఒక్కోసారి తరగతి మొత్తం ప్రతిభను పరిగణనలోకి తీసుకుని రిలేటివ్ గ్రేడింగ్ విధానాన్ని కూడా అనుసరించడం జరుగుతుంది. ప్రతీ అర్థ సంవత్సరానికి (సెమిస్టర్) ఒకసారి పరీక్షలు నిర్వహించి ఆ సెమిస్టర్ లోని కోర్సులలో ఒక విద్యార్థి సాధించిన గ్రేడ్ల సగటును లెక్కిస్తే వచ్చేది సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (SGPA). అలాన్ని SGPA లకు సగటును లెక్కిస్తే క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (CGPA) వస్తుంది.

అండర్ గ్రాడ్యుయేట్ విద్య

[మార్చు]
దస్త్రం:IITM Library.JPG
ఐఐటీ మద్రాసు గ్రంథాలయం

ఐఐటీల నుంచి ఎక్కువగా బిటెక్ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా బయటకు వస్తుంటారు. కొద్ది మంది డ్యుయల్ డిగ్రీ కోర్సులకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. బిటెక్ కోర్సు కాల వ్యవధి నాలుగు సంవత్సరాలు. విద్యార్థి ఎనిమిది సెమిస్టర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది.[12] డ్యుయల్ డిగ్రీ కోర్సు కాల వ్యవధి ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది. మొదటి సంవత్సరం అన్ని బిటెక్, డ్యుయల్ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు ఒకే కోర్సు స్ట్రక్చర్ ఉంటుంది.[13] కొన్ని విభాగాలలో దానికి సంబంధించిన ప్రాథమిక సబ్జెక్టులను కూడా చేరుస్తారు.[14] ఈ కామన్ కోర్సులు అన్ని ఇంజనీరింగ్ విభాగాలకు (ఎలక్ట్రానిక్స్, యాంత్రిక శాస్త్రము, రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము) సంబంధించిన ప్రాథమిక భావనలను విద్యార్థులకు పరిచయం చేస్తారు. మొదటి సంవత్సరం తరువాత విద్యార్థుల ప్రతిభను ఆధారంగా చేసుకుని వేరే విభాగానికి మారడానికి కూడా అవకాశం కల్పించబడుతుంది.[15] కానీ ఈ విధానం కేవలం మెరిట్ విద్యార్థులకు, కచ్చితమైన విధానాలతో కూడుకొన్నది కావున దీని ద్వారా కొద్ది మార్పులు మాత్రమే జరుగుతాయి.[15]

రెండవ సంవత్సరం నుంచి విద్యార్థులు తమ తమ విభాగాలలోని సబ్జెక్టులను అభ్యసిస్తారు.[16] ఇవికాక అందరు విద్యార్థులు తమ విజ్ఞాన పరిధిని పెంచడం కోసం ఇతర విభాగాల నుంచి కూడా కొన్ని తప్పనిసరి సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ కోర్సులు హ్యుమానిటీస్ నుంచి గానీ సోషియల్ సైన్సెస్ నుంచి గానీ మేనేజ్‌మెంట్ విభాగాల నుంచి ఉంటాయి.[17] మాడవ సంవత్సరం చివరలో విద్యార్థులు సమ్మర్ ప్రాజెక్టును ఏదైనా పేరొందిన కంపెనీ నుంచి గానీ పేరొందిన విద్యాసంస్థ నుంచి గానీ కోర్సులో భాగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. చాలామంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా కంపెనీలకు సెలెక్ట్ అయినా కొద్ది మంది ఉన్నత విద్యకోసం లేక వారికి ఇష్టం వచ్చిన కంపెనీలో చేరడానికి వీలుగా వీటికి దూరంగా ఉంటారు.[18]

ఉన్నత విద్య

[మార్చు]

ఐఐటీలలో ఎంటెక్, ఎంబీయే, ఎమ్మెస్సీ, PGDIT, MMST, MCP, PGDIPL, M.Des, PGDMOM మొదలైన అనేక పోస్టుగ్రాద్యుయేట్ కోర్సులను అందిస్తాయి. పరిశోధనా విద్యార్థుల కోసం పీహెచ్‌డీ లను కూడా అందిస్తాయి. పీహెచ్‌డీలో విద్యార్థి ఒక ప్రొఫెసర్ సూచించిన సమస్య పైన లేదా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రాజెక్టు పైన పని చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సు యొక్క కాలవ్యవధి నిర్దిష్టంగా ఉండదు. ఇది విద్యార్థులు పరిశోధన చేసే అంశాలపై ఆధారపడి ఉంటుంది. పరిశోధన అనంతరం వారు పరిశోధనావ్యాసాన్ని సమర్పించాల్సి ఉంటుంది, వారి పరిశోధనను సమర్థించుకోవాల్సి ఉంటుంది. పరిశోధన సమయంలో బోధనావకాశాలను కూడా కల్పించడం జరుగుతుంది. కొన్ని ఐఐటీలు ఎమ్మెస్ (M.S) కోర్సును కూడా అందిస్తున్నాయి. ఎంటెక్, ఎమ్మెస్ కు తేడా ఉన్నదల్లా వ్యాసాన్ని (Thesis) ను సమర్పించడమే. ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎనైటీలు కలిపి ఇంజనీరింగ్ లో 80% PhD లను విడుదల చేస్తున్నాయి.[19]

ఐఐటీలు బిటెక్, ఎంటెక్ కోర్సులకు కలిపి కొన్ని డ్యుయల్ డిగ్రీ కోర్సులను కూడా అందిస్తున్నాయి. వీటిలో అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ కోర్సులను మిళితం చేస్తారు. దీని కాలవ్యవధి ఐదు సంవత్సరాలు.[20] విడివిడిగా బిటెక్, ఎంటెక్ చేయడం వలన ఆరు సంవత్సరాలు పడుతుంది.[21] ఈ విధమైన కోర్సు విధానం ఐఐటీ విద్యార్థులు పోస్టుగ్రాడ్యుయేషన్ కు వేరే విద్యాసంస్థకు వెళ్ళకుండా ఉండేందుకు ఉపకరిస్తుంది. ఒక్క ఐఐటీ గౌహతి తప్ప మిగిలిన ఐఐటీలన్నీ మేనేజ్‌మెంట్ పై కోర్సులను అందిస్తున్నాయి (చూడండి: భారతదేశంలో విద్య )

సంస్కృతి , విద్యార్థి జీవితం

[మార్చు]
అన్ని ఐఐటీలు విద్యార్థులకూ, ఉపాధ్యాయులకూ, పరిశోధనా విద్యార్థులకూ క్యాంపస్ లోపలే వసతి సౌకర్యాలు కల్పించబడతాయి. విద్యార్థులు తాము చదివినంతకాలం హాస్టళ్ళలోనే ఉంటారు. విద్యార్థులు తమ మొదటి సంవత్సరంలో NSS కానీ, NCC కానీ , NSO కానీ ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. అన్ని ఐఐటీలలో క్రికెట్,వాలీబాల్,హాకీ,బాస్కెట్ బాల్,లాన్ టెన్నిస్, బ్యాడ్మింటన్ మొదలైన ఆటలకోసం మైదానలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఐఐటీలలో వినోద సౌకర్యాలకూ కొదవలేదు. అన్ని భాషల సినిమాలు ప్రదర్శించడానికి అనువుగా ఓపెన్ ఎయిర్ థియేటర్లు కూడా ఉంటాయి. ఇవి కాక ప్రతీ ఐఐటీ ప్రతీ యేటా సాంస్కృతిక సంబరాలను కూడా జరుపు కొంటుంటాయి. ఈ సంబరాలలో బయటి కళాశాలల్ విద్యార్థులు కూడా విచ్చేసి తమ కళలను ప్రదర్శిస్తారు.

సాంకేతిక ఉత్సవాలు

[మార్చు]
ప్రతీ ఐఐటీలో ప్రతీ ఏడాదీ సాధారణంగా మూడు రోజుల నుంచి నాలుగు రోజుల పాటు సాంకేతిక ఉత్సవాలు (Technical Festivals) జరుపుకుంటారు. ఐఐటీ రూర్కీలో కోగ్నిజన్స్ (Cognizance), ఐఐటీ మద్రాసులో శాస్త్ర (Shaastra), ఐఐటీ కాన్పూర్ లో టెక్‌కృతి (Techkriti), ఐఐటీ ఖరగ్పూర్ లో క్షితిజ్ (Kshitij), ఐఐటీ బాంబే లో టెక్‌ఫెస్ట్ (Techfest), ఐఐటీ ఢిల్లీ లో ట్రిస్ట్ (Tryst), ఐఐటీ గౌహతిలో టెక్నిక్ (Techniche) అనే పేర్లతో నిర్వహించబడతాయి. వీటిలో చాలావరకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించబడతాయి. ట్రిస్ట్ ఉత్సవానికి ఎక్కువ మంది హాజరవడమే కాకుండా ఇక్కడ అనేక విధాలైన కార్యక్రమాలు కూడా చూపరులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఐఐటీ మద్రాసులో కేవలం విద్యార్థులచే నిర్వహించబడే శాస్త్ర ప్రపంచ నాణ్యతా పరమైన ప్రమాణాలు పాటిస్తూ ISO 9001:2000 సర్టిఫికేట్ ను సంపాదించింది.[22]

సాంస్కృతిక సంభరాలు

[మార్చు]

కేవలం సాంకేతిక ఉత్సవాలే కాక ఐఐటీలలో సాంస్కృతిక ఉత్సవాలు కూడా మూడు నాలుగు రోజుల పాటు జరుపుతారు. ఐఐటీ రూర్కీలో థామ్సో (Thomso), ఐఐటీ మద్రాసులో సారంగ్ (Saarang), ఐఐటీ కాన్పూరులో అంతరాగ్ని (Antaragni), ఐఐటీ ఖరగ్‌పూర్లో స్ప్రింగ్ ఫెస్టివల్ (Spring Fest), ఐఐటీ బాంబేలో మూడ్ ఇండిగో (Mood Indigo ), ఐఐటీ ఢిల్లీలో రెండెజ్వస్ (Rendezvous), ఐఐటీ గౌహతిలో ఆల్కెరింగా (Alcheringa) అనే పేర్లతో నిర్వహించబడతాయి.

దస్త్రం:Illumination festival.JPG
ఐఐటీ ఖరగ్పూర్ లో ప్రమిదలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన

ఇవి కాకుండా ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ బాంబే ప్రత్యేకంగా ఉత్సవాలు జరుపుతాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ దీపావళి రోజున ఇల్యూమినేషన్ ఫెస్టివల్, రంగోలి ఫెస్టివల్ జరుపుతారు. ఈ ఉత్సవంలో ఎత్తుగా నిర్మించిన వెదురు కట్టడాల మీద మట్టితో చేసిన ప్రమిదలతో మనుషుల రూపాలు, కట్టడాల రూపాలు మొదలైన ఆకారాలు ఏర్పాటు చేస్తారు.[23] ఇవి ప్రధానంగా హాస్టళ్ళ మధ్యనే జరిగినా బయటి వాళ్ళు కూడా పాల్గుంటుంటారు. ఇక రంగోలి ఉత్సవాలలో భాగంగా మెత్తటి పొడితో గానీ, పగిలి పోయిన గాజు ముక్కలతోగానీ ఏర్పాటు చేసిన కళారూపాలను ప్రదర్శిస్తారు.

ఐఐటీ బాంబే ప్రత్యేకంగా నిర్వహించేది పర్ఫామింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్ (Performing Arts Festival). దీనిలో నాటకాలు, సాహిత్య ప్రక్రియలు, వక్తృత్వపు పోటీలు, నృత్య పోటీలు, చిత్ర లేఖనం, సంగీతం మొదలైనవి నిర్వహించబడతాయి. ఇవన్నీ ఐఐటీ బాంబే లోగల ఓపెన్ ఎయిర్ థియేటర్ లో ప్రదర్శించబడతాయి.

గుర్తింపు

[మార్చు]

ఐఐటీలు ఇచ్చే డిగ్రీలు AICTE గుర్తింపు కలిగి ఉండటం వలన వీటికి దేశంలో ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది. పూర్వ విద్యార్థులు విదేశాలలో తమ సత్తా చాటడం వలన అక్కడ కూడా వీటికి చాలా గుర్తింపు ఉంది. భారత ప్రభుత్వం IIT చట్టం ద్వారా వీటికి ప్రత్యేక గుర్తింపునివ్వడం ఐఐటీల విజయంలో కీలకమైన అంశం.

విమర్శ

[మార్చు]

ఎన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నా ఐఐటీలు విమర్శలకూ లోనయ్యాయి. విద్యారంగం లోనుండి, వెలుపలి నుండి కూడా ఐఐటీలు విమర్శలను ఎదుర్కుంటున్నాయి. ఐఐటీలపై ప్రధాన విమర్శ మేధో వలస ( Brain Drain), ఇంకా వాటి కఠిన ప్రవేశపరీక్ష, అది ప్రోత్సాహించే ఒత్తిడి. ఇంకా కొద్దిమంది విమర్శకులు స్త్రీ శాతం తక్కువగా ఉండటం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిని పట్టించుకోకపోవడం వంటి అంశాలను లేవనెత్తుతుంటారు. కొంతమంది ఇటీవలి బోధన, పరిశోధన నాణ్యతను కూడా ప్రశ్నిస్తున్నారు.[24]

పూర్వ విద్యార్థులు

[మార్చు]

ఐఐటీలలో చదివిన పూర్వ విద్యార్థులు తాము చదివిన విద్యాసంస్థల పట్ల గౌరవాన్ని చాటుకోవడం కోసం వివిధ రకాలైన కార్యక్రమాలను చేపడుతుంటారు. స్వదేశం లోనూ, విదేశాలలోనూ ఎన్నో పూర్వ విద్యార్థుల సంఘాలు ఈ సంస్థల అభివృద్ధికి ఇతోధికంగా సహాయ పడుతున్నాయి. పూర్వ విద్యార్థులు కొందరు ప్రస్తుత ఐఐటి విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా,, ధన సహాయం చేయడం ద్వారా తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

ప్రముఖ ఐఐటియన్లు

[మార్చు]

ఐ.ఐ.టీ. 2012 ఫలితాలు

[మార్చు]
  • ఐ.ఐ.టీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జె.ఇ.ఇ.) ఫలితాలు 2012 మే 18 న విడుదల చేసారు. దేశవ్యాప్తంగా 5 లక్షలమంది ఈ పరీక్ష రాసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 55 వేలమంది విద్యార్థులు ఈ పరీక్ష రాసారు. ఐ.ఐ.టీ, ఢిల్లీ, ఈ పరీక్షను జరిపింది. 2012 మే 6 నాడు మార్కులను ప్రకటించింది. 2012 మే 18 నాడు స్థానాలను (ర్యాంకులు) ప్రకటించారు. ఈ ర్యాంకుల వివరాలను, ఐ.ఐ.టీ వెబ్ సైట్లలో విద్యార్థులకు తెలియటానికి ఉంచారు. ఈ విద్యార్థులు, 15 ఐ.ఐ.టీలు, రెండు ఐ.ఐ.టీకి సంబంధించిన విద్యాసంస్థలలో వీరు ప్రవేశం పొందుతారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు 4, 5, 7, 9 స్థానాలు పొందారు. ప్రథమస్థానం (385/408 మార్కులు) అర్పిత్ అగర్వాల్ (ఢిల్లీ), రెండవ స్థానం విజయ్ కొచ్చర్ (చండీగడ్ ), మూడవ స్థానం నిషాంత్ కౌషిక్ (భిలాయ్ )

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఇండియా టుడే (June 2003). "ఇండియా టుడే: ఇంజనీరింగ్ లో 10 అత్యుత్తమ కళాశాలలు". India Today (mirrored on IIT Bombay website). Archived from the original on 2007-03-29. Retrieved 2006-05-14.
  2. Sukhatme, S. P. (2005-07-27). "The Growth of an Institute for Higher Technological Education". ఐఐటీ ముంబై. Archived from the original on 2006-05-01. Retrieved 2006-05-26.
  3. Madras, Indian Institute of Technology (2006-01-18). "The Institute". Archived from the original on 2006-04-27. Retrieved 2006-05-14.
  4. కేల్కర్, పి.కె (2006-03-17). "IIT Kanpur — History". IIT Kanpur. Archived from the original on 2009-10-10. Retrieved 2006-05-27.
  5. "About - Indian Institute of Technology Guwahati". IIT Guwahati. 2006-08-12. Archived from the original on 2007-06-11. Retrieved 2006-08-25.
  6. "Indian Institute of Technology, Roorkee". National Informatics Centre. 2002-06-29. Archived from the original on 2006-05-02. Retrieved 2006-05-14.
  7. "Performance based funding of IITs" (PDF). IISc. 2004-02-10. p. 3. Archived from the original (PDF) on 2018-11-13. Retrieved 2006-05-14.
  8. Rajguru, Suvarna (2005-12-30). "What makes the IITs so chic". LittleINDIA. Archived from the original on 2006-09-03. Retrieved 2006-08-27.
  9. Natarajan, R. "The Evolution of Postgraduate Engineering Education and Research in India" (PDF). CAGS 2005 Conference. Canadian Association for Graduate Studies. p. 12. Archived from the original (PDF) on 2006-05-10. Retrieved 2008-03-09.
  10. "Structure of B.Tech Programme (Ordinance under R.2.9)". Ordinances. IIT Madras. Archived from the original on 2006-05-17. Retrieved 2007-01-07.
  11. Prabhu, S.S. (2000). "Engineering Education in a Flux". Report of the Review Committee. IIT Kanpur. Archived from the original on 2006-09-04. Retrieved 2006-08-27.
  12. "Structure of B.Tech Programme (Ordinance No.3)". Ordinances. IIT Madras. Archived from the original on 2006-05-17. Retrieved 2007-01-07.
  13. "Structure of B.Tech Programme (Ordinance under R.2.0)". Ordinances. IIT Madras. Archived from the original on 2006-05-17. Retrieved 2007-01-07.
  14. "Structure of B.Tech Programme (Ordinance under R.4.2:Class Committee)". Ordinances. IIT Madras. Archived from the original on 2006-05-17. Retrieved 2007-01-07.
  15. 15.0 15.1 "Structure of B.Tech Programme (Ordinance under R.5.0:Change of Branch)". Ordinances. IIT Madras. Archived from the original on 2006-05-17. Retrieved 2007-01-07.
  16. "Structure of B.Tech Programme (Ordinance under R.2.0 (ii))". Ordinances. IIT Madras. Archived from the original on 2006-05-17. Retrieved 2007-01-07.
  17. "Structure of B.Tech Programme (Ordinance under R.2.0 (iii))". Ordinances. IIT Madras. Archived from the original on 2006-05-17. Retrieved 2007-01-07.
  18. Senate, IIT Madras. "B.Tech Ordinances". Senate Ordinances. IIT Madras. Archived from the original on 2006-05-17. Retrieved 2006-05-26.
  19. Natarajan, R. "The Evolution of Postgraduate Engineering Education and Research in India" (PDF). CAGS 2005 Conference. Canadian Association for Graduate Studies. p. 25. Archived from the original (PDF) on 2006-05-10. Retrieved 2008-03-09.
  20. http://www.iitm.ac.in/Academics/Ordinances.html#DUAL Archived 2006-05-17 at the Wayback Machine Ordinance under Ordinance No. 3
  21. Natarajan, R. "The Evolution of Postgraduate Engineering Education and Research in India" (PDF). CAGS 2005 Conference. Canadian Association for Graduate Studies. p. 6. Archived from the original (PDF) on 2006-05-10. Retrieved 2008-03-09.
  22. The Director, IIT Madras (2005-05-08). "Director's Report" (PDF). IIT Madras. p. 36. Archived from the original (PDF) on 2006-05-15. Retrieved 2008-03-09.
  23. "Illumnination Contest". IIT Foundation, USA. Archived from the original on 2006-05-19. Retrieved 2006-05-26.
  24. నారయణ మూర్తి. "ఐఐటీలలో దిగజారుతున్న నాణ్యత". TOI. Retrieved 8 Oct 2011.