ఇగ్నాజ్ సెమెల్‌వెయ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇగ్నాజ్ సెమెల్‌వెయ్స్
డా॥ ఇగ్నాజ్ సెమెల్‌వెయ్స్, 1860లో తన 42వ యేట
జననం(1818-07-01)1818 జూలై 1
బుడా, కింగ్‌డం ఆఫ్ హంగరీ (ప్రస్తుతం బుడాపేస్ట్ లో భాగం)
మరణం1865 ఆగస్టు 13(1865-08-13) (వయసు 47)
ఓబెర్‌డోబ్లింగ్, ఆస్ట్రియా రాజ్యం (ప్రస్తుతం వియన్నాలో భాగం)
పౌరసత్వంహంగరీ రాజ్యం
రంగములుప్రసూతి, శస్త్రచికిత్సలు
చదువుకున్న సంస్థలువియన్నా విశ్వవిద్యాలయం
బుడాపేస్ట్ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధి1847 నుండి ప్రసూతి క్లినిక్‌లలో చేతి క్రిమిసంహారక ప్రమాణాలను పరిచయం

ఇగ్నాజ్ ఫిలిప్ప్ సెమెల్‌వెయ్స్ [A] (జర్మన్ ఉచ్చారణ: ఇగ్నాౘ్ జెమౢవైస్, హంగేరియన్ ఉచ్చారణ: సెమ్మెల్‌వెయ్స్ ఇగ్నాౘ్ ఫ్యులుప్) ( 1818 జూలై 1 – 1865 ఆగస్టు 13) హంగేరియన్ వైద్యుడూ, శాస్త్రవేత్తా. అతనిని ఆంటీసెప్టిక్ విధానాల ప్రారంభ మార్గదర్శకుడిగా పిలుస్తారు. చేతులు కడుక్కోవడం వల్ల కలిగే వైద్య ప్రయోజనాలను కనుగొన్న మొట్టమొదటి వ్యక్తిగా అతను పేర్కొనబడ్డాడు. ప్రసూతి క్లినిక్‌లలో వైద్య సిబ్బంది చేతులపైనుండే రోగకారక (Etiology (en)) క్రిముల నిర్మూలన ద్వారా బాలింతలకు ప్యూర్పెరల్ జ్వరం (దీనిని "చైల్డ్ బెడ్ ఫీవర్" అని కూడా పిలుస్తారు. తెలుగులో ప్రసవ జ్వరంగా అర్థం చేసుకోవచ్చు) వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయని సెమ్మెల్విస్ కనుగొన్నాడు. ఇందుకుగాను అతన్ని "తల్లుల రక్షకుడు"గా పిలుస్తారు.[1] 19 వ శతాబ్దం మధ్యభాగంలో ఆసుపత్రులలో ప్యూర్పెరల్ జ్వరం సర్వసాధారణం. ఈ జబ్బు తరచుగా ప్రాణాంతకం అయ్యేది. 1847 లో వియన్నా జనరల్ హాస్పిటల్ (Vienna General Hospital (en)) ప్రసూతి క్లినిక్‌లో పనిచేస్తున్నప్పుడు ఈ ప్యుర్పెరల్ సెప్సిస్ ను అరికట్టడానికి పురుడు పోసేముందు వైద్యులు "క్లోరినేటెడ్ సున్నం ద్రావణం" (కాల్షియం హైపోక్లోరైట్) తో చేతులు కడుక్కోవాలని సెమెల్‌వెయ్స్ ప్రతిపాదించాడు. ఈ ఆసుపత్రిలో వైద్యుల వార్డులలో మరణాలు, మంత్రసాని వార్డుల మరణాల కంటే మూడు రెట్లు ఎక్కువ.[2] అతను ఎటియాలజీ, కాన్సెప్ట్, ప్రొఫిలాక్సిస్ ఆఫ్ చైల్డ్బెడ్ ఫీవర్ (Etiology, Concept and Prophylaxis of Childbed Fever (en)) పేరుతో తన పరిశోధనలను తెలియజేస్తూ ఒక పుస్తకాన్ని ప్రచురించాడు.

చేతులు కడుక్కోవడంతో మరణాలను 1% కన్నా తక్కువకు తగ్గించవచ్చని అతడు ఆధారాలతో సహా పలుమార్లు ప్రచూరించినప్పటికీ, సెమెల్‌వెయ్స్ పరిశీలనలు ఆ కాలానికి ఆమోదించబడిన వైద్యశాస్త్ర అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉండడంతో అతని ఆలోచనలను వైద్య సమాజం తిరస్కరించింది. అంతే కాక సెమెల్‌వెయ్స్ తన పరికల్పనకు బలమైన శాస్త్రీయ వివరణ ఇవ్వలేదు. కొంతమంది వైద్యులు చేతులు కడుక్కోవాలన్న అతని సూచనతో మనస్తాపం చెంది, అతనిని ఎగతాళి చేశారు. 1865 లో మానసిక రుగ్మతతో పిచ్చి ఆసుపత్రిలో చేర్చబడ్డ సెమెల్‌వెయ్స్, కేవలం 14 రోజుల తరువాత, 47 సంవత్సరాల వయస్సులో మరణించాడు. బహుశ భద్రతా సిబ్బందిచే కొట్టబడుట వలన అతని కుడి చేతిలో ఏర్పడ్డ గ్యాంగ్రేనస్ గాయం మరణానికి కారణం అయ్యుండవచ్చు. చివరికి లూయిస్ పాశ్చర్ సూక్ష్మక్రిమి సిద్ధాంతాన్ని నిరూపించినప్పుడు, సెమెల్‌వెయ్స్ విధానం విస్తృత ఆమోదం పొందింది. ఈ సిద్దాంతం ఆధారంగా జోసెఫ్ లిస్టర్ వైద్య సిబ్బంది పరిశుభ్రత పై విధి విధానాలను సూత్రీకరించి, చికిత్సా విధానాల్లో అవలంబించడం ద్వారా గొప్ప ఫలితాలను పొందారు.

కుటుంబం, బాల్య జీవితం[మార్చు]

At left, a painted portrait of a woman in a black dress with a frilled hood and ruffled collar. At right, a painted picture of a man in a black coat wearing a cravat.
ఇగ్నాజ్ సెమెల్‌వెయ్స్ తల్లిదండ్రులు టెరెజ్ ముల్లర్, జోజ్సెఫ్ ముల్లర్లు
A painted portrait of a boy in a black coat and a red shirt, holding a book in his right hand.
1830లో ఇగ్నాజ్ సెమెల్‌వెయ్స్ బాల్య చిత్రం

ఇగ్నాజ్ సెమెల్‌వెయ్స్ 1818 జూలై 1న హంగేరిలోని (Kingdom of Hungary (en)) బుడాకు (Buda (en)) పొరుగున ఉన్న టాబన్‌లో (Tabán (en)) జన్మించాడు. ఇప్పుడు అది బుడాపెస్ట్‌లో భాగం. అతను జోజ్సెఫ్ సెమెల్‌వెయ్స్, టెరెజ్ ముల్లెర్ దంపతులకు గల 10 మంది సంతానంలో ఐదవ వానిగా, సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఇగ్నాజ్ సెమెల్‌వెయ్స్ 1837లో వియన్నా విశ్వవిద్యాలయంలో (University of Vienna (en)) న్యాయవిద్యను అభ్యసించడం ప్రారంభించాడు. కాని తరువాతి సంవత్సరమే అతను, తెలియని కారణాల వల్ల, వైద్య విద్యకు మారిపోయాడు. అతను 1844 లో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పట్టాని పొందాడు. ఇంటర్నల్ మెడిసిన్ చదవడం కోసం ఒక క్లినిక్‌లో అపాయింట్‌మెంట్ పొందడంలో విఫలమైన తరువాత, సెమెల్‌వెయ్స్ ప్రసూతి శాస్త్రంలో నైపుణ్యత సాధించాలని నిర్ణయించుకున్నాడు.

చైల్డ్బెడ్ ఫీవర్ పై పరిశోధనలు[మార్చు]

1846 జూలై 1 [3][4][B]న వియన్నా జనరల్ హాస్పిటల్ మొదటి ప్రసూతి క్లినిక్‌లో ప్రొఫెసర్ జోహన్ క్లైన్‌కు (Johann Klein (en)) సహాయకుడిగా సెమెల్‌వెయ్స్ నియమించబడ్డాడు. ఇది నేటి యునైటెడ్ స్టేట్స్ ఆసుపత్రులలో "చీఫ్ రెసిడెంట్"[5] స్థానం లాంటిదని చెప్పవచ్చు. ప్రొఫెసర్ రౌండ్లలో ప్రతి ఉదయం రోగులను పరీక్షించడం, కష్టమైన ప్రసవాలను పర్యవేక్షించడం, ప్రసూతి శాస్త్ర విద్యార్థులకు బోధించడం, రికార్డుల "గుమస్తా"గా ఉండటం అతని విధులు.

అక్రమ సంతాన శిశుహత్యల (infanticide (en)) సమస్యను పరిష్కరించడానికి ఐరోపా అంతటా ప్రసూతి సంస్థలను ఏర్పాటు చేయబడ్డాయి. ఉచిత సంస్థలు కావడంతో వేశ్యలతో సహా ప్రసూతి సేవలు అవసరమైన ఇతర అణగారిన మహిళలకు ఇవి ఆకర్షణీయంగా మారాయి. ఉచిత సేవలకు బదులుగా, వైద్యులు, మంత్రసానుల శిక్షణకు మహిళలు బోధనాంశంగా ఉండేవారు. రెండు ప్రసూతి క్లినిక్‌లు వియన్నా ఆసుపత్రిలో ఉన్నాయి. ప్యూర్పెరల్ జ్వరం కారణంగా మొదటి క్లినిక్‌లో సగటు తల్లుల మరణాలు 10% కాగా రెండవ క్లినిక్ లో సగటు గణనీయంగా తక్కువ అనగా 4% కన్నా తక్కువ ఉండేది. ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది. ఒక రోజుకు ఒక క్లినిక్ చొప్పున రెండు క్లినిక్‌లు వంతులు వేసుకుని రోజు మార్చి రోజు రోగులను చేర్చుకునేవి. కానీ మొదటి క్లినిక్ కు గల చెడ్డ పేరు కారణంగా మహిళలు రెండవ క్లినిక్‌లోనే చేరతామని వేడుకునేవారు.[6] మొదటి క్లినిక్‌లో చేర్చవద్దని కొంతమంది మహిళలు మోకరిల్లి వేడుకునేవారని సెమెల్‌వెయ్స్ పేర్కొన్నాడు.[7] కొందరు మహిళలు అయితే వీధుల్లో ప్రసవించి, ఆసుపత్రికి వెళ్లే మార్గంలో ఆకస్మిక ప్రసవమైనట్లు నటిస్తుండేవారు. ఎందుకంటే ఆకస్మికంగా ప్రసవించిన తల్లులు క్లినిక్‌లో చేరనప్పటికీ పిల్లల సంరక్షణ ప్రయోజనాలను పొందడానికి అర్హులు. వీధి ప్రసవాలు చేయించుకునే మహిళల్లో ప్యూర్పెరల్ జ్వరం చాలా అరుదు అని గమనించిన సెమెల్‌వెయ్స్ అవాక్కయ్యాడు. "నాకు హేతుబద్దంగా ఆలోచిస్తే వీధి ప్రసవాలకు గురైన మహిళలు కనీసం క్లినిక్‌లో ప్రసవించిన వారితో సమానంగా అయినా అనారోగ్యానికి గురవ్వాలి కదా అనిపించింది. [...] క్లినిక్ వెలుపల ప్రసవించిన వారిని ఈ తెలియని విధ్వంసకరమైన స్థానిక ప్రభావాల నుండి రక్షిస్తున్నది ఏమిటి?"[8] అని ఆలోచించాడు.

టెహ్రాన్ విశ్వవిద్యాలయంలో సెమెల్‌వెయ్స్ విగ్రహం

రెండవ క్లినిక్ కంటే ప్యూర్పెరల్ జ్వరం కారణంగా తన మొదటి క్లినిక్లో మరణాల శాతం చాలా ఎక్కువగా ఉందని సెమెల్‌వెయ్స్ చాలా బాధపడ్డాడు. ఇది "నన్నెంత కలవరపాటుకు గురి చేసిందంటే జీవితం నిష్ప్రయోజకంగా అనిపించింది". రెండు క్లినిక్‌లు దాదాపు ఒకే పద్ధతులను ఉపయోగించాయి. సెమెల్‌వెయ్స్ మతపరమైన పద్ధతులతో సహా అన్ని తేడాలను పరిశీలించడం ప్రారంభించాడు. చివరికి అతని పరిశీలనలో తేలింది ఏమిటంటే అక్కడ పనిచేసే వ్యక్తులు మాత్రమే చెప్పుకోదగ్గ తేడా అని. మొదటి క్లినిక్ వైద్య విద్యార్థులకు బోధనా సేవకు కాగా, రెండవ క్లినిక్ 1841 లో మంత్రసానుల బోధన కోసం మాత్రమే ఎంపిక చేయబడింది.

వియెన్న జెనరల్ హాస్పిటల్లోని రెండు ప్రసూతి క్లినిక్లలో 1841–46 మధ్యకాలంలోని ప్యుర్పెరల్ ఫీవర్ రోగుల మరణ శాతాలు: మొదటి క్లినిక్లో మరణాలు ఎక్కువగా ఉన్నాయి
1841-1846 మధ్యకాలంలో వియన్నా జనరల్ హాస్పిటల్లోని రెండు క్లినిక్లలో ప్యూర్పెరల్ జ్వరం వ్యాధిగ్రస్తుల మరణశాతాలు. మరింత సమాచారం కోసం: Historical mortality rates of puerperal fever (en )
  మొదటి క్లినిక్   రెండవ క్లినిక్
సంవత్సరం జననాలు మరణాలు రేటు (%)   జననాలు మరణాలు శాతం (%)
1841 3,036 237 7.8   2,442 86 3.5
1842 3,287 518 15.8   2,659 202 7.6
1843 3,060 274 9.0   2,739 164 6.0
1844 3,157 260 8.2   2,956 68 2.3
1845 3,492 241 6.9   3,241 66 2.0
1846 4,010 459 11.4   3,754 105 2.8

రెండవ క్లినిక్ ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇంకా మరణాలు తక్కువగా ఉన్నందున అతను "రద్దీ" కారణం కాదని నిర్దారించుకున్నాడు. వాతావరణం ఒకే విధంగా ఉన్నందున అతను దీనికి వాతావరణాన్ని ఒక కారణంగా పరిగణించలేదు. 1847 లో, అతనికి మంచి స్నేహితుడైన జాకోబ్ కొల్లెట్‌స్కా (Jakob Kolletschka (en)) మరణంతో సెమెల్‌వెయ్స్ విశ్లేషణ కీలక మలుపు తిరిగింది. అతడు శవపరీక్ష చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు విద్యార్థి వైద్యుని కత్తి గుచ్చుకుని అనారోగ్యం పాలై మరణించాడు. కొల్లెట్‌స్కాపై చేసిన శవపరీక్షలో ప్యూర్పెరల్ జ్వరంతో మరణిస్తున్న మహిళలలో కనబడే మార్పులే కనిపించాయి. సెమెల్‌వెయ్స్ వెంటనే శవకాలుష్యం, ప్యూర్పెరల్ జ్వరం మధ్య సంబంధాన్ని ప్రతిపాదించాడు.

వైద్య విద్యార్థులు శవపరీక్ష గది నుండి మొదటి ప్రసూతి క్లినిక్‌లోనికి వెళ్ళి రోగులకు పరీక్షించినపుడు శవపరీక్ష గదిలో వారి చేతులకు అంటుకున్న "శవ కణాల"ను రోగులకు అంటిస్తున్నారని అతను ప్రతిపాదించాడు. రెండవ క్లినిక్‌లోని విద్యార్థి మంత్రసానులు, శవపరీక్షలతో కాని, శవాలతో కానీ సంబంధం లేనివారు. అందువలన మరణాల శాతం చాలా తక్కువగా ఉందని వివరించాడు.

అప్పటికి వ్యాధి యొక్క సూక్ష్మక్రిమి సిద్ధాంతం వియన్నాలో ఇంకా అంగీకరించబడలేదు. అందువల్ల, సెమెల్‌వెయ్స్ చైల్డ్ బెడ్ జ్వరం తెలియని "శవ పదార్థం" వలన కలుగుతుందని నిర్ధారించాడు. ఈ సిద్దాంతం ఆధారంగా శవపరీక్షకు, రోగుల పరీక్షలకు మధ్య చేతులు కడుక్కోవడానికి క్లోరినేటెడ్ సున్నం (కాల్షియం హైపోక్లోరైట్) ఉపయోగించే విధానాన్ని అతను ప్రవేశపెట్టాడు. శవ కణజాలం యొక్క కుళ్ళిన వాసనను తొలగించడానికి ఈ క్లోరినేటెడ్ ద్రావణం ఉత్తమంగా పనిచేస్తుంది కనుక ఊహాజనితంగా వ్యాప్తి చెందుతున్న "విషపూరిత" లేదా కలుషితమైన శవకణాలను కూడా ఈ ద్రావణం నాశనం చేస్తుందని అతను భావించాడు.

ఈ చర్య ఫలితంగా మొదటి క్లినిక్‌లో మరణాలు 90% క్షీణించి రెండవ క్లినిక్‌తో దాదాపు సమానమయ్యాయి. 1847 ఏప్రిల్ లో మరణాల శాతం 18.3%. మే మధ్యలో చేతులు కడుక్కోవడం ప్రారంభించిన తరువాత, జూన్‌లో 2.2%, జూలై 1.2%, ఆగస్టు 1.9%గా మరణాల శాతాలు నమోదయ్యాయి. ఈ ఆవిష్కరణ తరువాతి సంవత్సరంలో, శరీర నిర్మాణ అవగాహన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తరువాత, మొదటిసారి మరణ శాతం రెండు నెలల పాటు సున్నా వచ్చింది.

చైల్డ్బెడ్ ఫీవర్ నివారణకై కృషి[మార్చు]

స్థూలంగా చైల్డ్ బెడ్ జ్వరానికి ఒకే ఒక కారణం ఉంది. దీని నివారణకు పరిశుభ్రత తప్ప మరేదీ అవసరం లేదు అనేది సెమెల్‌వెయ్స్ పరికల్పన. ఆ కాలానికి ఇది చాలా విపరీత భావన. కనుక ఆ రోజుల్లో ఈ పరికల్పన విస్మరించబటమో తిరస్కరించబడటమో లేదా ఎగతాళి చేయబడటమో జరిగింది. ఇంతలో రాజకీయ కారణాల వల్ల అతన్ని ఆసుపత్రి నుండి తొలగించారు. వియన్నాలోని వైద్య సమాజం వేధింపులకు గురిచేసింది. చివరికి బుడాపేస్టు వెళ్ళవలసి వచ్చింది.

అప్పటి వైద్య సమాజం యొక్క ఉదాసీనతపై కోపోద్రిక్తుడైన సెమెల్‌వెయ్స్ ప్రముఖ యూరోపియన్ ప్రసూతి వైద్యులకు కఠిన స్వరంలో బహిరంగ లేఖలు రాయడం ప్రారంభించాడు. వారిని బాధ్యతారహిత హంతకులుగా పేర్కొన్నాడు. అతని భార్యతో సహా, అతని సమకాలీకులందరు అతనికి మతి భ్రమించిందని భావించారు. 1865లో అతనిని లాండెసిరెనన్‌స్టాల్ట్ డోబ్లింగ్ (ప్రాంతీయ మతిస్థిమితం లేనివారి ఆశ్రయం) లో చేర్చారు. అక్కడ చేర్చిన 14 రోజుల తరువాత సెప్టిక్ షాక్‌తో మరణించాడు. సెప్టిక్ షాక్‌కు కారణం బహుశా భద్రతా సిబ్బందిచే తీవ్రంగా కొట్టబడటం కావచ్చు. అతను మరణించిన కొన్ని సంవత్సరాలకు లూయిస్ పాశ్చర్ వ్యాధి సూక్ష్మక్రిమి సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసి, సెమెల్‌వెయ్స్ పరిశోధనలకు సైద్ధాంతిక వివరణను అందించిన తరువాతే అతడి పరిశోధనలకు గుర్తింపు లభించింది. అతను క్రిమినాశక ప్రక్రియల యొక్క మార్గదర్శకుడిగా పరిగణించబడ్డాడు.

ఆనాటి వైద్య అభిప్రాయాలతో విభేదాలు[మార్చు]

[permanent dead link] .1841–49 మధ్యకాలంలో వియెన్న ప్రసూతి సంస్థలోని మొదటి క్లినిక్లో ప్యుర్పెరల్ ఫీవర్ వ్యాధిగ్రస్తుల నెలవారీ మరణశాతాలు. 1847 మే మధ్యభాగంలో సెమెల్‌వెయ్స్ క్లోరిన్ వాషింగ్ పద్ధతిని అమలు చేసినప్పుడు గణాంకాలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది

సెమెల్‌వెయ్స్ పరిశీలనలు ఆ సమయంలో ఆమోదించబడిన శాస్త్రీయ, వైద్య అభిప్రాయాలతో విభేదించాయి. ఆ కాలంలో శరీరంలోని ప్రాథమిక "నాలుగు దేహరసాల" అసమతుల్యత (Humorism (en)) ఆధారంగా వ్యాధి సిద్ధాంతం సూత్రీకరించబడింది. దీనిని డిస్క్రాసియా (dyscrasia (en)) అని పిలుస్తారు. దీనికి ముఖ్య చికిత్స రోగి నుండి రక్తం బయటకు తీయడం (Bloodletting (en)). ఆ సమయంలో వైద్య గ్రంథాలు ప్రతి వ్యాధి ప్రత్యేకమైనదని, వ్యక్తిగత అసమతుల్యత యొక్క ఫలితం అని, వైద్య విధానంలో కష్టమైన భాగం ప్రతి రోగి యొక్క ప్రత్యేక పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయడం అని నొక్కిచెప్పేవి.

అంతేకాక మరణించిన మహిళల శవపరీక్షలో కనిపించే మార్పలు కూడా రోగులందరిలో ఒకేలాగా ఉండేవి కావు. రోగి రోగికీ మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. కనుక ప్యూర్పెరల్ జ్వరం అనేది ఒకే వ్యాధి కాదని, అప్పటికి ఇంకా గుర్తించబడని అనేక వ్యాధుల సమూహానికి వారు పెట్టుకున్న పేరని భావించేవారు.

సెమెల్‌వెయ్స్ అనుభావిక పరిశీలనల తిరస్కరణకు కారణం అపఖ్యాతి పాలైన నమ్మకాలకు ఇంకా అతుక్కుపోయే మానసిక ధోరణి (Belief perseverance (en)). కొంతమంది చరిత్రకారులు పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేని శాస్త్రవేత్తల విప్లవాత్మక పరిశోధనా ఫలితాలకు వ్యతిరేకత సాధారణమని, ఇది "శాస్త్రీయ పురోగతికి అత్యంత బలీయమైన ఏకైక ప్రతిబంధకం" అని అభిప్రాయపడ్డారు.

ఇవి కాక వ్యతిరేకతకు ఇతర కారణాలు కూడా ఉండి ఉండవచ్చు. ఉదాహరణకు, కొంతమంది వైద్యులు తమ చేతులు కడుక్కోవాలన్న సూచనతో మనస్తాపం చెందారు. సమాజంలో గౌరవనీయులు, పెద్దమనుషులు అయిన వారి చేతులు అపరిశుభ్రంగా ఉంటాయనే ఆలోచన వారికి మూర్ఖంగా అనిపించింది. [9][C]

సెమెల్‌వెయ్స్ ఫలితాలకు ఆ సమయంలో శాస్త్రీయ వివరణ లేదు. కొన్ని దశాబ్దాల తరువాత, లూయిస్ పాశ్చర్, జోసెఫ్ లిస్టర్, ఇతరులు వ్యాధి యొక్క సూక్ష్మక్రిమి సిద్ధాంతాన్ని మరింత అభివృద్ధి చేసినప్పుడే అది సాధ్యమైంది.

పరిశోధనా ఫలితాల ప్రచురణ, దాని పరిణామాలు[మార్చు]

తీవ్ర స్థాయి పర్ప్యురెల్ ఫీవర్ కు ముఖ్య కారకమైన స్ట్రెప్టొకోకస్ పయెజీన్స్ క్రిమి (చిత్రంలో ఎర్రటి గోళాలతో సూచించబడుతోంది). ఈ క్రిములు చాలా మంది ఆరోగ్యవంతుల్లో కూడా గొంతులో, నాసికాగ్రసనిలో ఉంటాయి

1847 చివరినాటికి, సెమెల్‌వెయ్స్ పరికల్పన ఐరోపా అంతటా వ్యాపించసాగింది. సెమెల్‌వెయ్స్, అతని విద్యార్థులు వారి ఇటీవలి పరిశీలనలను వివరిస్తూ అనేక ప్రముఖ ప్రసూతి క్లినిక్‌ల వైద్యులకు లేఖలు రాశారు. ప్రముఖ ఆస్ట్రియన్ మెడికల్ జర్నల్ సంపాదకుడు ఫెర్డినాండ్ వాన్ హెబ్రా (Ferdinand Ritter von Hebra (en)), మెడికల్ జర్నల్ 1847 డిసెంబరు, [10] 1848 ఏప్రిల్[11] సంచికలలో సెమెల్‌వెయ్స్ యొక్క ఆవిష్కరణను ప్రచురించారు. మశూచిని నివారించడానికి ఎడ్వర్డ్ జెన్నర్ కౌపాక్స్ టీకాల ఆవిష్కరణతో సమానమైన ఆచరణాత్మక ప్రాముఖ్యత సెమెల్‌వెయ్స్ పరిశీలనలకు ఉందని హెబ్రా పేర్కొన్నారు.[12]

1848 చివరలో, సెమెల్‌వెయ్స్ పూర్వ విద్యార్థులలో ఒకడు సెమెల్‌వెయ్స్ పరికల్పనను వివరిస్తూ ఒక ఉపన్యాసం రాశారు. ఈ ఉపన్యాసం లండన్‌లోని రాయల్ మెడికల్ అండ్ సర్జికల్ సొసైటీ ముందు ప్రదర్శించబడింది. ది లాన్సెట్ (The Lancet (en)) అనే వైద్య పత్రికలో ప్రచురించబడింది[D]. కొన్ని నెలల తరువాత, సెమెల్‌వెయ్స్ పూర్వ విద్యార్థులలో మరొకరు ఫ్రెంచ్ పత్రికలో ఇలాంటి వ్యాసాన్ని ప్రచురించారు.[14]

వియన్నాలో మరణాల రేటు గణనీయంగా తగ్గినట్లు ఐరోపా అంతటా తెలిసింది. క్లోరిన్‌ శుభ్రత విస్తృతంగా అవలంబిస్తారని, వేల మంది ప్రాణాలు కాపాడబడతాయని సెమెల్‌వెయ్స్ ఆశించాడు. అతని పరికల్పనకు ప్రారంభ స్పందనలు రాబోయే ఇబ్బందికి స్పష్టమైన సంకేతాలను ఇచ్చాయి. కొంతమంది వైద్యులు అతని పరిశోధనలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఉదాహరణకు, జేమ్స్ యంగ్ సింప్సన్ (James Young Simpson (en)), సెమెల్‌వెయ్స్ యొక్క సంచలనాత్మక ఫలితాలకు, 1843 లో ఆలివర్ వెండెల్ హోమ్స్ (Oliver Wendell Holmes Sr. (en)) ప్రతిపాదనకు మధ్య ఎటువంటి తేడా లేదని, చైల్డ్బెడ్ జ్వరం అంటువ్యాధి అనే (అనగా సోకిన వ్యక్తులు ఇతరులకు సంక్రమింపజేయవచ్చు) [15] ఇద్దరు తెలియజేసారని అన్నాడు. స్థూలంగా సెమెల్‌వెయ్స్ కనుగొన్న వాటికి ప్రారంభ స్పందనలు ఏమిటంటే, "అతను కొత్తగా చెప్పింది ఏమీ లేదు."[16]"

వాస్తవానికి, చైల్డ్బెడ్ జ్వరం బాధితుల నుండి ఉద్భవించే శవ కణాలే కాకుండా, కుళ్ళిపోతున్న అన్ని జీవపదార్థాల గురించి సెమెల్‌వెయ్స్ హెచ్చరించాడు. సెమెల్‌వెయ్స్ యొక్క పరిశోధన, అతని సహచరులు, విద్యార్థులు రాసిన నివేదికల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందడం ఈ అపార్థాలు, అస్పష్టతలు పుట్టుకు రావడానికి ఒక ముఖ్య కారణం. ఈ కీలక దశలో, సెమెల్‌వెయ్స్ స్వయంగా ఏమీ ప్రచురించలేదు. ఇది మొదలు ఒక శతాబ్దం పాటు ఇలాంటి అనేక వక్రీకరణలు అతని పరిశోధనలపై జరిగిన చర్చలు, విశ్లేషణలను పీడించాయి.[5]

సెమెల్‌వెయ్స్ తన పరిశోధన ఫలితాలను వియన్నాలోని[17] ఇతర నిపుణులకు అధికారికంగా తెలియజేయడానికి నిరాకరించాడని, వాటిని వ్రాతపూర్వకంగా తెలియజేయడానికి కూడా ఆసక్తి చూపలేదని కొన్ని వర్గాల ఉవాచ.

రాజకీయ గందరగోళం, వియన్నా ఆసుపత్రి నుండి తొలగించడం[మార్చు]

1848 లో, ఐరోపా అంతటా అనేక విప్లవాలు (Revolutions of 1848 (en)) సంభవించాయి. ఫలితంగా ఏర్పడిన రాజకీయ గందరగోళం సెమ్మెల్విస్ వైద్య ప్రస్థానాన్ని ప్రభావితం చేసింది. 1948 మార్చి 13 న వియన్నాలో విద్యార్థులు మరిన్ని పౌర హక్కులు (Civil and political rights (en)) కల్పించాలని కోరుతూ ప్రదర్శనలిచ్చారు. వీరు కోరిన వాటిలో ధర్మాసనంతో విచారణ, భావ ప్రకటనా స్వేచ్ఛ (Freedom of speech (en)) వంటి హక్కులతో పాటు ఇంకా అనేకం ఉన్నాయి. వైద్య విద్యార్థులు, యువ అధ్యాపకులు ఈ ప్రదర్శనలు నిర్వహించగా శివారు ప్రాంతాల కార్మికులు కూడా వీరికి తోడయ్యారు. రెండు రోజుల తరువాత హంగేరిలో 1848 నాటి హంగేరియన్ విప్లవం (Hungarian Revolution of 1848 (en)) ఆరంభమై, ఆస్ట్రియన్ సామ్రాజ్య (Austrian Empire (en)) పాలక వంశం అయిన హౌస్ ఆఫ్ ఆస్ట్రియాతో (House of Habsburg (en)) పూర్తి స్థాయి యుద్ధం మొదలైంది. వియన్నాలో, మార్చి ప్రదర్శన తరువాత నగరవ్యాప్తంగా అశాంతి నెలకొంది[18].
1848 నాటి సంఘటనలలో సెమెల్‌వెయ్స్ వ్యక్తిగతంగా పాల్గొన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు. హంగేరియన్ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నందుకు అతని సోదరులలో కొందరిని శిక్షించారు. హంగేరియాలో జన్మించిన సెమెల్‌వెయ్స్ ఉద్యమానికి సానుభూతిపరుడు అయ్యుండవచ్చు. సెమెల్‌వెయ్స్ ఉన్నతాధికారి, ప్రొఫెసర్ జోహన్ క్లైన్, సాంప్రదాయిక ఆస్ట్రియన్. అతడు హంగేరి ఉద్యమంతో సహా, ఆస్ట్రియా సామ్రాజ్యంలో, 1848లో మొదలైన స్వాతంత్ర్య ఉద్యమాల (Revolutions of 1848 in the Austrian Empire (en)) వ్యతిరేకి అయ్యుండొచ్చు. కనుక అతడికి బహుశా సెమెల్‌వెయ్స్‌పై అనుమానాలు ఉండుండవచ్చు.[19]

సెమెల్‌వెయ్స్ పదవీకాలం ముగియబోతున్నప్పుడు, కార్ల్ బ్రాన్ (Carl Braun (obstetrician) (en)), బహుశా క్లైన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు, మొదటి క్లినిక్‌లో "అసిస్టెంట్" స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సెమెల్‌వెయ్స్, బ్రాన్ లు ఇద్దరే ఈ పదవికి దరఖాస్తుదారులు. సెమెల్‌వెయ్స్ కు ముందు అతని స్థానంలో ఉన్న ఫ్రాంజ్ బ్రెయిట్‌కు (Franz Breit (en)) రెండేళ్ల పొడిగింపు మంజూరు చేయబడింది.[20] పొడిగింపు కోసం సెమెల్‌వెయ్స్ దరఖాస్తుకు జోసెఫ్ స్కోడా (Joseph Škoda (en)), కార్ల్ వాన్ రోకిటాన్‌స్కీతో (Carl von Rokitansky (en)) పాటు చాలా మంది వైద్య అధ్యాపకులు మద్దతు ఇచ్చారు. కాని క్లీన్ ఈ పదవికి బ్రాన్‌ను ఎంచుకున్నారు. 1949 మార్చి 20 న పదవీకాలం ముగిసినప్పుడు సెమెల్‌వెయ్స్ ప్రసూతి క్లినిక్ నుండి నిష్క్రమించవలసి వచ్చింది.[21]

తన పదవీకాలం ముగిసిన రోజే తనను ప్రసూతి శాస్త్ర డోసెంట్‌గా (Privatdozent (en)) నియమించమని సెమెల్‌వెయ్స్ వియన్నా అధికారులకు వినతి సమర్పించారు. విద్యార్థులకు బోధిస్తూ, కొన్ని విశ్వవిద్యాలయ సౌకర్యాలను పొందే స్వతంత్ర అధ్యాపకుని డోసెంట్ అంటారు. మొదట క్లీన్ వ్యతిరేకత కారణంగా, సెమెల్‌వెయ్స్ వినతి తిరస్కరించబడింది. అతను తిరిగి దరఖాస్తు చేసుకున్నాడు. చివరికి 1850 అక్టోబరు 10 వరకు (18 నెలల కన్నా ఎక్కువ) వేచి చుసాక 'సైద్ధాంతిక' ప్రసూతి శాస్త్రంలో డోసెంట్‌గా నియమించబడ్డాడు.[22] ఈ నియామక నిబంధనలు అతనికి మృతదేహాలకు అనుమతిని నిరాకరించి, విద్యార్థులకు బోధించడానికి జంతు తోలు నమూనాలను (Mannequin (en)) మాత్రమే ఉపయోగించుకోగలిగేలా అతన్ని పరిమితం చేశాయి. తన నియామకం గురించి తెలియజేసిన కొద్ది రోజుల తరువాత, సెమెల్‌వెయ్స్ వియన్నాను అకస్మాత్తుగా వదిలి పెస్టుకు తిరిగి వచ్చాడు. అతను తన మాజీ స్నేహితులు, సహోద్యోగులకు వీడ్కోలు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఈ చర్య వారిని బాధపెట్టి ఉండవచ్చు.[23] అతను "వియన్నా వైద్య వ్యవస్థతో వ్యవహరించడంలో మున్ముందు కలిగే చిరాకులను భరించే ఓపిక లేక" వియన్నాను విడిచిపెట్టినట్టు పేర్కొన్నాడు.[24]

బుడాపెస్ట్ లో జీవితం[మార్చు]

At left, a painting of a balding, mustachioed middle-aged man in black-tie formal attire standing beside a red table. At right, a painting of a woman in a blue dress with white stripes, standing beside a red table.
ఇగ్నాజ్ సెమెల్‌వెయ్స్, మారియా వీడెన్హోఫర్ ల పెళ్ళి చిత్రాలు (1857)

1848–1849 సమయంలో, హబ్స్‌బర్గ్ పాలిత ఆస్ట్రియన్ సామ్రాజ్యం నుండి 70,000 మంది సైనికులు, హంగేరియన్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని అడ్డుకుని, ఉద్యమ నాయకులను అయితే ఉరితీశారు లేదా కారాగారంలో బంధించారు. ఈ ప్రక్రియలో పెస్ట్ లో కొన్ని భాగాలను నాశనం చేశారు. 1850 లో హాబ్స్‌బర్గ్ వియన్నా నుండి వచ్చిన సెమెల్‌వెయ్స్‌ను ఎవరూ హృదయపూర్వకంగా స్వాగతించుండకపోవచ్చు.

1851 మే 20 న, పెస్ట్‌లోని స్జెంట్ రోకస్ అనే ఒక చిన్న హాస్పిటల్లో ప్రసూతి వార్డ్ లో చిన్న, వేతనం లేని, గౌరవ ప్రధాన వైద్యుడి స్థానాన్ని సెమెల్‌వెయ్స్ చేపట్టాడు. 1857 జూన్ వరకు అతను ఆరు సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నాడు. ఆ క్లినిక్‌లో చైల్డ్ బెడ్ జ్వరం ప్రబలంగా ఉండేది;[25] 1850 లో పెస్టుకు తిరిగి వచ్చిన వెంటనే, అతడు వైద్యశాలను సందర్శించడానికి వచ్చినప్పుడు, సెమెల్‌వెయ్స్ అప్పుడే ఒక రోగి మరణించగా, మరొక రోగి తీవ్ర వేదనలో, ఇంకో నలుగురు ఈ వ్యాధితో తీవ్రంగా అనారోగ్యానికి గురి కాబడడాన్ని గమనించాడు. 1851 లో బాధ్యతలు స్వీకరించిన తరువాత, సెమెల్‌వెయ్స్ ఈ వ్యాధిని దాదాపుగా నిర్మూలించాడు. 1851–1855 సమయంలో, 933 జననాలలో (0.85%) ఎనిమిది మంది రోగులు మాత్రమే చైల్డ్ బెడ్ జ్వరంతో మరణించారు.[26]

అద్భుతమైన ఫలితాలు ఉన్నప్పటికీ, బుడాపెస్టు లోని ఇతర ప్రసూతి వైద్యులు సెమెల్‌వెయ్స్ ఉద్దేశ్యాలతో ఏకీభవించలేదు.[27] పెస్ట్ విశ్వవిద్యాలయంలో ప్రసూతి శాస్త్ర అధ్యాపకుడు, ఈడ్ ఫ్లోరియన్ బిర్లీ (Ede Flórián Birly (en)), సెమెల్‌వెయ్స్ యొక్క పద్ధతులను ఎప్పుడూ అవలంబించలేదు. ప్రేగు యొక్క అపరిశుభ్రత కారణంగా ప్యూర్పెరల్ జ్వరం వచ్చిందని, [28] అందువల్ల, భేది మందులతో విస్తృతమైన పేగు ప్రక్షాళనే ఈ వ్యాధికి తగిన చికిత్స అని అతను భావించేవారు.

1854 లో బిర్లీ మరణించిన తరువాత, సెమెల్‌వెయ్స్ ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. సెమెల్‌వెయ్స్‌తో పాటు అతని చిరకాల ప్రత్యర్థి కార్ల్ బ్రాన్ కూడా ఆ కొలువుకు దరఖాస్తు చేసుకున్నాడు. బ్రాన్ తన హంగేరియన్ సహచరుల నుండి సెమెల్‌వెయ్స్ కంటే ఎక్కువ ఓట్లను పొందాడు. అయితే బ్రాన్‌కు హంగేరియన్ భాష రాదు. అందుచేత వియన్నా అధికారులు ఎన్నికల ఫలితాలను పక్కన పెట్టి చివరికి 1855 లో ఆ స్థానాన్ని సెమెల్‌వెయ్స్‌కు ఇచ్చారు. సెమెల్‌వెయ్స్ అధ్యాపక స్థానాన్ని చేపట్టగానే పెస్ట్ విశ్వవిద్యాలయ ప్రసూతి వార్డ్ లో క్లోరిన్ వాషింగ్‌ పద్ధతిని అమలు చేసాడు. మరోసారి, ఫలితాలు ఆకట్టుకున్నాయి.[27]

1857 లో సెమెల్‌వెయ్స్‌కు జురిచ్ విశ్వవిద్యాలయంలో (University of Zurich (en)) ప్రసూతి శాస్త్ర అధ్యాపక పదవికి అవకాశం రాగా అతను తిరస్కరించాడు.[29] అదే సంవత్సరం, సెమెల్‌వెయ్స్ తనకంటే 19 ఏళ్ళు చిన్నదైన, పెస్ట్‌లో ప్రముఖ వ్యాపారవేత్త కూతురు, మారియా వీడెన్హోఫర్ (1837-1910) ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదుగురు పిల్లలు.

వైద్య సమాజ స్పందన (మరింత సమాచారం కోసం: Contemporary reaction to Ignaz Semmelweis (en))[మార్చు]

సెమ్మెల్విస్ ప్రధాన రచన: "డై ఎటియోలాజీ, డెర్ బెగ్రిఫ్ ఉండ్ డై ప్రొఫిలాక్సిస్ డెస్ కిండ్‌బెట్‌ఫైబర్స్", 1861 (ముందు పేజీ)

సెమెల్‌వెయ్స్ అభిప్రాయాలకు యునైటెడ్ కింగ్‌డమ్‌లో చాలా మద్దతు లభించింది. కాని అతని పరికల్పన అర్థం చేసుకున్నవారికంటే ఉదహరించిన వారే ఎక్కువ. బ్రిటీష్ వారు సెమ్మెల్విస్‌ను తమ అంటువ్యాధి సిద్ధాంతానికి మద్దతు ఇచ్చినట్లుగా భావించారు. ఒక విలక్షణ ఉదాహరణ సెమెల్‌వెయ్స్ "శవపరీక్ష గది నుండి రోగ కారకాలు వెలువడి వ్యాధులను ప్రేరేపిస్తాయి" అని కచ్చితత్వంతో నిరూపించాడని డబ్ల్యూ. టైలర్ స్మిత్ పేర్కొన్నాడు.[30] 1848లో సెమెల్‌వెయ్స్ సంప్రదింపులకు తొలినాళ్లలో స్పందించిన వారిలో ఒకరైన జేమ్స్ యంగ్ సింప్సన్ (James Young Simpson (en)) అతనికి ఒక ఘాటైన లేఖ రాశాడు. వియన్నాలో బ్రిటిష్ ప్రసూతి శాస్త్ర సాహిత్యం గురించి కనీస అవగాహన కూడా ఉన్నట్లు లేదని, అందుకే బ్రిటీష్ వారు చాలా కాలం నుండే చైల్డ్ బెడ్ ఫీవర్ ను అంటువ్యాధిగా భావించేవారన్న విషయం సెమెల్‌వెయ్స్‌కు తెలిసుండకపోవచ్చని సింప్సన్ ఆ లేఖలో అభిప్రాయపడ్డాడు.[31]

1856 లో, సెమెల్‌వెయ్స్ సహాయకుడు జోసెఫ్ ఫ్లీషర్ వియన్నా వైద్య వార పత్రికలో (వీనర్ మెడిజినిస్చే వోచెన్‌స్క్రిట్ (Wiener Medizinische Wochenschrift (en)) ) లో సెయింట్ రోచస్, పెస్ట్ ప్రసూతి సంస్థలలో సెమెల్‌వెయ్స్ పద్ధతుల యొక్క అద్భుత ఫలితాలను ప్రచూరించాడు.[27] ఈ వ్యాసం పై స్పందిస్తూ, ఆ పత్రిక సంపాదకుడు ప్రజలు క్లోరిన్ వాషింగ్ సిద్ధాంతంతో దారి మళ్ళడం మానుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రెండు సంవత్సరాల తరువాత, సెమెల్‌వెయ్స్ చివరకు "ది ఎటియాలజీ ఆఫ్ చైల్డ్బెడ్ ఫీవర్" (అనువా: చైల్డ్బెడ్ ఫీవర్ కు కారణం) అనే వ్యాసంలో తన పరిశోధనల గురించి తన స్వంత అభిప్రాయలను ప్రచురించాడు[E]. ఇంకో రెండు సంవత్సరాల తరువాత, అతను "ద డిఫెరెన్స్ ఇన్ ఒపీనియన్ బెట్వీన్ మైసెల్ఫ్ అండ్ ద ఇంగ్లీష్ ఫిజీషియన్స్ రిగార్డింగ్ చైల్డ్‌బెడ్ ఫీవర్" (అనువా: చైల్డ్‌బెడ్ ఫీవర్ విషయంలో నాకు, ఆంగ్ల వైద్యులకు మధ్య అభిప్రాయ భేదాలు) అనే రెండవ వ్యాసాన్ని ప్రచురించాడు[F]. 1861 లో, సెమెల్‌వెయ్స్ చివరకు తన ప్రధాన రచన "డై ఎటియోలాజీ, డెర్ బెగ్రిఫ్ ఉండ్ డై ప్రొఫిలాక్సిస్ డెస్ కిండ్‌బెట్‌ఫైబర్స్" (అనువా: చైల్డ్‌బెడ్ ఫీవర్ రోగ కారణాలు, వివరణ, నివారణ) ప్రచురించాడు[G]. 1861లో ప్రచురించిన తన పుస్తకంలో, సెమెల్‌వెయ్స్ తన పద్ధతులు అవలంబించడం పట్ల అప్పటి వైద్య సంఘ ఉదాసీనత పై విచారం వ్యక్తం చేసాడు: "చైల్డ్బెడ్ ఫీవర్ పై జరిగే అనేక వైద్యవిద్య బోధనా తరగతులు ఇప్పటికీ నా సిద్దాంతాన్ని వ్యతిరేకించే విశ్లేషణలతో మార్మోగుతున్నాయి. [...] ప్రచురించిన వైద్య రచనలలో నా బోధనలు విస్మరించబడ్డాయి లేదా ఖండించబడ్డాయి. వర్జ్‌బర్గ్‌లోని వైద్య అధ్యాపకులు 1859 లో రాసిన ఒక వ్యాసానికి బహుమతిని ప్రదానం చేశారు. ఇందులో నా బోధనలు ఖండించబడ్డాయి ".[33][H]

1861లో వ్రాసిన తన పుస్తకంలో సెమెల్‌వెయ్స్, 1823లో వియెన్ (వియెన్న) లో శవపరీక్షలు మొదలుపెట్టడంతో (నిలువు గీత) ప్రాణాంతక చైల్డ్బెడ్ ఫీవర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిందనడానికి ఆధారాలను పొందుపరిచాడు. రెండవ నిలువు గీత 1847లో క్లోరిన్ హ్యాండ్ వాషింగ్ పద్ధతిని అమలు చేయడాన్ని సూచిస్తుంది. పోలికకై శవపరీక్షల సౌలభ్యం లేని డుబ్లిన్ లోని రొటుండ ప్రసూతి ఆసుపత్రి (Rotunda Hospital (en)) గణాంకాలు ఇవ్వబడ్డాయి

ఒక పాఠ్యపుస్తకంలో, మొదటి క్లినిక్‌లో సెమెల్‌వెయ్స్ తరువాత సహాయకుడిగా నియమితుడైన కార్ల్ బ్రాన్, చైల్డ్బెడ్ జ్వరానికి 30 కారణాలను గుర్తించాడు; వీటిలో 28వ కారణంగా మాత్రమే శవకణాల సంక్రమణ పేర్కొనబడింది. ఇతర కారణాలు గర్భధారణ, యురేమియా, కుంచించుకుపోతున్న గర్భాశయం వలన ప్రక్కనే ఉన్న అవయవాలపై ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆహారంలో పొరపాట్లు, వాతావరణం, అంటువ్యాధుల ప్రభావాలు.[35][I] 1849 ఏప్రిల్ నుండి 1853 వేసవి వరకు బ్రాన్ సహాయకుడిగా ఉన్న మొదటి విభాగంలో మరణాల శాతం, దాదాపుగా సెమెల్‌వెయ్స్ కాలంలో ఉన్నంతే ఉంది. దీన్ని బట్టి, సెమెల్‌వెయ్స్ సిద్దాంతాన్ని వ్యతిరేకించినప్పటికీ, బ్రాన్ అతడి పద్ధతులను కొనసాగించాడని తెలుస్తోంది.

జర్మన్ వైద్యులు, ప్రకృతి శాస్త్రవేత్తల సమావేశంలో, చాలా మంది వక్తలు అతని సిద్ధాంతాన్ని తిరస్కరించారు. వారిలో ఆ కాలపు అత్యున్నత శాస్త్రవేత్త రుడాల్ఫ్ విర్చో (Rudolf Virchow (en)) కూడా ఉన్నారు. వైద్య వర్గాలలో విర్చోకి ఉన్న పేరు, ప్రఖ్యాతలు సెమెల్‌వెయ్స్ కు గుర్తింపు లభించకపోవడానికి ఒక ముఖ్య కారణం.[37] సెమెల్‌వెయ్స్‌కు ముందు పెస్ట్ విశ్వవిద్యాలయంలో ప్రసూతి శాస్త్ర అధ్యాపకుడిగా ఉన్న ఈడ్ ఫ్లోరియన్ బిర్లీ, సెమెల్‌వెయ్స్ బోధనలను ఎప్పుడూ అంగీకరించలేదు; అతను ప్రేగు అపరిశుభ్రత కారణంగా ప్యూర్పెరల్ జ్వరం వచ్చిందని గట్టిగా నమ్మేవాడు.[38] ప్రేగ్‌లోని ప్రసూతి వైద్యుడు ఆగస్టు బ్రీస్కీ, (August Breisky (en)) సెమెల్‌వెయ్స్ పుస్తకాన్ని "అజ్ఞానం" అని కొట్టిపారేసాడు. అతను దానిని "ప్రసవ భక్తి శాస్త్రానికి ఖురాన్"గా పేర్కొన్నాడు. ప్యూర్పెరల్ జ్వరం, పైయేమియా (Pyaemia (en)) ఒకేలా ఉన్నాయని సెమెల్‌వెయ్స్ నిరూపించలేదని బ్రీస్కీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. కుళ్ళిపోతున్న జీవ పదార్థం కాక ఇతర కారకాలను కూడా కచ్చితంగా రోగకారకాలలో చేర్చవలసి ఉందని అతను బలంగా అభిప్రాయపడ్డాడు.[39]

కోపెన్‌హాగన్ ప్రసూతి ఆసుపత్రి అధిపతి కార్ల్ ఎడ్వర్డ్ మారియస్ లెవీ (Carl Edvard Marius Levy (en)) సెమెల్‌వెయ్స్ సిద్దాంతానికి ముఖ్య వ్యతిరేకుల్లో ఒకరు. నిర్దిష్ట గుణగుణాలు ఏవి లేని శవ కణాలు, అంత సూక్ష్మ మోతాదులలో వ్యాధి కారకాలుగా వ్యవహరిస్తాయి అనే సిద్దాంతం అతనికి సబబుగా అనిపించలేదు. అయితే, తరువాతి కాలంలో సరిగ్గా ఈ వాదనను ఉపయోగించే రాబర్ట్ కోచ్ వ్యాధి కారక పదార్థాలు మానవ శరీరంలో పునరుత్పత్తి చేయగల శక్తి ఉన్న సూక్ష్మ జీవులను కలిగి ఉంటాయని నిరూపించారు. విషతుల్య వ్యాధికారక పదార్థాలు రసాయనాలు లేదా భౌతిక పదార్థాలో కాదు కాబట్టి అది జీవ పదార్థమే అయ్యుండాలని అతడి అభిప్రాయం.[40]

అప్పటి వైద్య సమాజ వ్యతిరేకతకు కఠినంగా, ఆక్రోశంతో ప్రతిస్పందించకుండా, సెమెల్‌వెయ్స్ తన పరిశోధనలను మరింత సమర్థవంతంగా తెలియజేసుంటే, ఆ కాలంలో పాతుకుపోయిన నమ్మకాలకు విరుద్దంగా ఉన్నప్పటికీ, అతని సిద్దాంతాలు మరింత ప్రభావాన్ని చూపగలిగేవని ఒక ఉవాచ.[41]

మరణం[మార్చు]

1862లో ప్రసూతి శాస్త్ర అధ్యాపకులందరినీ ఉద్దేశిస్తూ సెమెల్‌వెయ్స్ వ్రాసిన బహిరంగ లేఖ

1861 నుండి, సెమెల్‌వెయ్స్ వివిధ మానసిక రుగ్మతలకు గురయ్యాడు. అతను తీవ్ర మానసిక నిస్పృహకు గురై, ఎప్పుడూ అన్యమనస్కంగా ఉండేవాడు. 1857 నుండి 1864 వరకు అతని చిత్రాల్లో వృద్ధాప్యం యొక్క పురోగతిని చూడవచ్చు[J]. అతను ప్రతి సంభాషణను చైల్డ్బెడ్ జ్వరం విషయం వైపే మళ్ళించేవాడు.

తన 1861 పుస్తకానికి అనేక అననుకూల విదేశీ సమీక్షల తరువాత, సెమెల్‌వెయ్స్ తన విమర్శకులపై వరుస బహిరంగ ఉత్తరాలలో విరుచుకుపడ్డాడు[K]. అవి స్పాత్ (Joseph Späth (en)), స్కాన్ౙొని (Friedrich Wilhelm Scanzoni von Lichtenfels (en)), సైబోల్డ్‌ (Eduard Caspar Jacob von Siebold (en)) లతో సహా అనేక ప్రముఖ ఐరోపా ప్రసూతి వైద్యులతో పాటు ప్రసూతి వైద్యులందరికీ ఉద్దేశించి వ్రాయబడేవి.[42] ఆవేశోద్రేకంతో, ఆక్రోశంతో నిండి ఉండే ఆ లేఖల్లో అతను వారందరిని బాగా తూర్పారబట్టి, తీవ్రంగా కించపరిచేవాడు. అతను కొన్ని సార్లు అతని విమర్శకులను బాధ్యతారహితమైన హంతకులుగా, అజ్ఞానులుగా పేర్కొనేవాడు.[43][44] జర్మన్ ప్రసూతి వైద్యులనందరినీ సమావేశపరిచి, ప్యూర్పెరల్ జ్వరంపై చర్చాగోష్ఠి ఏర్పాటు చేయాలని సెమెల్‌వెయ్స్ సిబోల్ట్‌కు పిలుపునిచ్చారు. అక్కడ "అందరూ తన సిద్ధాంతాన్ని ఒప్పుకునే వరకు" అక్కణ్ణుంచి కదలనని అనేవారు.[37]

1865 సంవత్సర మధ్యభాగానికి, అతని సామాజిక ప్రవర్తన అతని సహచరులకు ఇబ్బందికరంగా, విసుగెత్తించేలా తయారైంది. అతను కూడా మితిమీరిన మద్యపానానికి అలవాటు పడి; క్రమంగా తన కుటుంబం నుండి దూరంగా ఎక్కువ సమయం గడిపసాగాడు. కొన్నిసార్లు వేశ్యలతో గడిపేవాడు; అతని భార్య కూడా అతని లైంగిక ప్రవర్తనలో మార్పులను గమనించింది. 1865 జూలై 13 న, సెమెల్‌వెయ్స్ కుటుంబం స్నేహితులను సందర్శించింది. ఆ సమయంలో సెమెల్‌వెయ్స్ ప్రవర్తన వారందరికీ మరీ అభ్యంతరకరంగా అనిపించింది.[45]

సెమెల్‌వెయ్స్ రుగ్మత ఏమిటనేది చర్చనీయాంశమైంది. కే కోడెల్ కార్టర్ తను రచించిన సెమెల్‌వెయ్స్ జీవిత చరిత్రలో, అతనిది ఏ వ్యాధన్నది కచ్చితంగా తెలియరాలేదని పేర్కొన్నాడు:

సెమెల్‌వెయ్స్ రుగ్మత ఏమిటనేది కచ్చితత్వం తో అంచనా వేయడం అసాధ్యం. ... ఇది మతిమరపు వ్యాధి అయ్యుండొచ్చు. మతిమరపు వ్యాధి ఒక రకమైన చిత్తవైకల్యం. వేగంగవంతమైన అభిజ్ఞా క్షీణత, భావోద్వేగ మార్పులు ఈ వ్యాధి లక్షణాలు. ఇది మూడవ దశ సిఫిలిస్ (Syphilis (en)) కావచ్చు.[46] ధర్మాసుపత్రులలో వేలాది మంది మహిళలకు చికిత్స చేసిన ప్రసూతి వైద్యులకు ఆరోజుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వచ్చేది. ఇవేవి కాక పని ఒత్తిడి, మానసిక ఒత్తిళ్ళ వల్ల కలిగిన తీవ్ర మానసిక అలసట కూడా అయ్యుండొచ్చు[47].

1865 లో, జెనోస్ బాలస్సా (János Balassa (en)) సెమెల్‌వెయ్స్‌ను మానసిక వైద్య సంస్థలో (Psychiatric hospital (en)) చేరాల్సిందిగా సిఫార్సు చేస్తూ ఒక పత్రాన్ని రాశాడు. జూలై 30 న, ఫెర్డినాండ్ రిట్టర్ వాన్ హెబ్రా తన "కొత్త సంస్థలలో" ఒకదానిని చూపించే నెపంతో సెమెల్‌వెయ్స్‌ను లాజారెట్‌గాస్సేలో ఉన్న వియన్నా మానసిక వ్యాధిగ్రస్తుల ఆశ్రయానికి తీసుకువెళ్ళాడు. ఏమి జరుగుతుందో గ్రహించిన సెమెల్‌వెయ్స్ పారిపోవడానికి ప్రయత్నించగా, [48]అక్కడి కాపలాదారులు అతన్ని చితకబాది స్ట్రెయిట్‌జాకెట్‌తో కట్టి, చీకటి గదికి పరిమితం చేశారు. అక్కడ అతనికి అందించిన ఇతర చికిత్సలు చన్నీళ్ళలో ముంచడం, భేదిమందైన ఆముదం నూనెను ఇవ్వడం. అతను రెండు వారాల తరువాత, 1865 ఆగస్టు 13 న, 47 సంవత్సరాల వయస్సులో, అతని కుడి చేతి గాయానికి చీము పట్టడంతో మరణించాడు. శవపరీక్షలో మరణానికి కారణం పైమియా-బ్లడ్ పాయిజనింగ్ అని తేలింది.[49]

1865 ఆగస్టు 15 న సెమెల్‌వెయ్స్‌ను వియన్నాలో ఖననం చేశారు. కొద్దిమంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అతని మరణం గురించి సంక్షిప్త ప్రకటనలు వియన్నా, బుడాపెస్ట్ లోని కొన్ని వైద్య పత్రికలలో వెలువడ్డాయి. హంగేరి వైద్యులు, ప్రకృతి శాస్త్రవేత్తల సంఘం నియమాల ప్రకారం మునుపటి సంవత్సరంలో మరణించిన సభ్యుల గౌరవార్థం స్మారక ప్రసంగం చేయాలని పేర్కొన్నప్పటికీ, సెమెల్‌వెయ్స్‌కు ఆ గౌరవం దక్కలేదు సరికదా; కనీసం అతని మరణం యొక్క ప్రస్తావన కూడా లేదు.[50]

పెస్ట్ విశ్వవిద్యాలయ ప్రసూతి క్లినిక్‌లో సెమెల్‌వెయ్స్ వారసుడిగా జెనోస్ డీషర్ నియమితుడయ్యాడు. వెంటనే, మరణాల శాతం ఆరు రెట్లు పెరిగి 6%కి చేరుకుంది. కాని బుడాపెస్ట్ వైద్యులెవ్వరూ నోరు మెదపలేదు; విచారణలు, నిరసనలు లేవు. వియన్నాలో గాని బుడాపెస్ట్‌లో గాని దాదాపు ఎవరూ సెమెల్‌వెయ్స్ జీవితాన్ని, పరిశోధనలను గుర్తించినట్లు లేదు.[50]

అతని అస్తికలు 1891లో బుడాపెస్ట్‌కు పంపించారు. 1964 అక్టోబరు 11న, అతను జన్మించిన ఇంటికి మరోసారి పంపించారు. ఇగ్నాజ్ సెమెల్‌వెయ్స్ గౌరవార్థం ఈ ఇల్లు ఇప్పుడు చారిత్రక సంగ్రహశాల, గ్రంథాలయంగా మార్చబడింది.[51]

ఫుట్ నోట్స్[మార్చు]

 1. ఆంగ్లంలో సెమెల్‌వెయ్స్ "Semmelweis"గా వ్రాయబడుతుంది. weissలో మాదిరిగా రెండు sలు ఉండవు. సెమెల్‌వెయ్స్ అంటే తెల్లటి రొట్టె ముక్క అని అర్థం.
 2. సెమెల్‌వెయ్స్ 1844 జులై 1న, వియెన్న ప్రసూతి క్లినిక్ లో వైద్య సహాయకుడిగా (జర్మన్ భాషలో Aspirant Assistentarztes an der Wiener Geburtshilflichen Klinik) శిక్షణ ప్రారంభించారు. 1846 జులై 1న శిక్షణ పూర్తి చేసుకుని వైద్య సహాయకుడిగా (జర్మన్: ordentlicher Assistentarzt) నియమించబడ్డారు. అయితే 1846 అక్టోబర్ 20న, తనకంటే ముందు ఆ స్థానంలో ఉన్న డా॥ ఫ్రాంజ్ బ్రైట్ (Franz Breit (en)) అనుకోకుండా ఆసుపత్రికి తిరిగి రావడంతో అతడిని క్రింది స్థానానికి పరిమితం చేసి, బ్రైట్ ను వైద్య సహాయకుడిగా నియమించడం జరిగింది. 1847 మార్చి 20న, డా. బ్రైట్ టూబింజెన్ (Tübingen (en)) లో అధ్యాపకునిగా చేరడంతో సెమెల్‌వెయ్స్ మళ్ళీ సహాయకునిగా బాధ్యతలు చేపట్టారు. [3]
 3. మరింత సమాచారం కోసం: Charles Delucena Meigs (en).
 4. ఉపన్యాసాన్ని చాళ్స్ హెన్రి ఫెలిక్స్ రౌత్ వ్రాయగా, అతడు రాయల్ మెడికల్ & సర్జికల్ సొసైటిలో సభ్యుడు (ఫెలొ) కానందున, ఎడ్వడ్ విల్యమ్ మర్ఫి ఆ ఉపన్యాసాన్ని ఉపన్యసించారు (ఉపన్యాసం: "ఆన్ ద కాజెస్ ఆఫ్ ది ఎండమిక్ ప్యుర్పెరల్ ఫీవర్ ఆఫ్ వియెన్న" (On the Causes of the Endemic Puerperal Fever of Vienna, Medico-chirurgical Transactions 32(1849): 27–40. Review: Lancet 2(1848): 642f.)) మరిన్ని సమీక్షల కోసం ఫ్రాంక్ పి. మర్ఫి వ్రాసిన సెమెల్‌వెయ్స్ జీవిత చరిత్ర చూడండి. (Frank P. Murphy, "Ignaz Philipp Semmelweis (1818–1865): An Annotated Bibliography," Bulletin of the History of Medicine 20 (1946), 653–707: 654f).[13]
 5. ఆ వ్యాసం "A gyermekágyi láz kóroktana" ("చైల్డ్బెడ్ ఫీవర్ రోగకారకం"). Orvosi hetilap 2 (1858) లో ప్రచురించబడింది. టిబెర్యస్ వాన్ గ్యోరి వ్రాసిన Semmelweis's gesammelte Werke (Jena: Gustav Fischer, 1905), 61–83 లో ఈ వ్యాస జర్మన్ అనువాదం ఉంది. ఇది ప్యుర్పెరల్ ఫీవర్ పై సెమెల్‌వెయ్స్ మొదటి రచన. గ్యోరి ప్రకారం ఈ వ్యాస సారాంశాన్ని 1858 శరదృతువు లో Budapester Königliche Ârzteverein లో సెమెల్‌వెయ్స్ ఉపన్యసించారు. [32]
 6. వ్యాస ప్రచురణ వివరాలు: Ignaz Philipp Semmelweis, "A gyermekágyi láz fölötti véleménykülönbség köztem s az angol orvosok közt" Orvosi hetilap 4 (1860), 849–851, 873–876, 889–893, 913–915.[28]
 7. Digital copy of Semmelweis' book
 8. సెమెల్‌వెయ్స్ చెబుతున్న వ్యాసం ఎరెలాంగన్ (Erlangen (en))లో 1859లో ప్రచురించబడింది. దీన్ని వ్రాసిన వారు హైన్రిక్ సిల్బర్ష్మిడ్ట్. ఇందులో సెమెల్‌వెయ్స్ ప్రస్తావన ఉన్నప్పటికీ అతని పరికల్పనను గురించి ఈ వ్యాసం వివరాల్లోకి వెళ్ళలేదు. వ్యాస ప్రచురణ వివరాలు: "Historisch-kritische Darstellung der Pathologie des Kindbettfiebers von den ältesten Zeiten bis auf die unserige". ఫ్రెడ్రిక్ విల్హెల్మ్ స్కాన్ౙొని వాన్ లిక్టెన్ఫెల్స్ (Friedrich Wilhelm Scanzoni von Lichtenfels (en)) ప్రోద్బలంతో వూర్ౙ్బర్గ్ లోని వైద్య అధ్యాపకులు ఈ వ్యాసానికి బహుమతిని ఇచ్చారు.[34]
 9. ఆ 30 కారణాలు బ్రాన్ వ్రాసిన పుస్తకం Lehrbuch der Geburtshülfe. లో పేర్కొనబడ్డాయి. 1855లో ప్రచురితమైన సంచికలో శవకణాల కారణం గురించి వివరిస్తూ, సెమెల్‌వెయ్స్ పేరు ప్రస్తావించబడింది. తరువాతి సంచికల్లో కూడా వివరణ పొల్లు పోకుండా అదే అయినప్పటికీ, సెమెల్‌వెయ్స్ మాత్రం ప్రస్తావించబడలేదు.[36]
 10. ఈ చిత్రాలు తన పుస్తకము చైల్డ్‌బెడ్ ఫీవర్ రోగ కారణాలు, వివరణ , నివారణ (Etiology, Concept and Prophylaxis of Childbed Fever) 1983 సంచికలోనూ, [42] Wikimedia Commonsలోనూ చూడవచ్చు.
 11. 1862లో వ్రాసిన బహిరంగ లేఖను వెబ్సైట్‌లో చూడవచ్చు.

మూలాలు[మార్చు]

 1. Semmelweis Society International.
 2. Hanninen, Farago & Monos 1983.
 3. 3.0 3.1 Benedek 1983, p. 72.
 4. Semmelweis 1983, p. 34; Schmidt 1850, p. 501.
 5. 5.0 5.1 Carter & Carter 2005, p. 56.
 6. Semmelweis 1983, p. 69.
 7. Semmelweis 1983, p. 70.
 8. Semmelweis 1983, p. 81.
 9. Carter & Carter 2005, p. 9.
 10. Hebra 1847.
 11. Hebra 1848.
 12. Carter & Carter 2005, p. 54–55.
 13. Semmelweis 1983, p. 175.
 14. Wieger 1849.
 15. Semmelweis 1983, pp. 10–12.
 16. Semmelweis 1983, p. 31.
 17. Reid 1975, p. 37.
 18. Carter & Carter 2005, p. 57.
 19. Carter & Carter 2005, p. 59.
 20. Semmelweis 1983, pp. 61, 105.
 21. Carter & Carter 2005, p. 61.
 22. Semmelweis 1983, p. 105.
 23. Semmelweis 1983, p. 52.
 24. Carter & Carter 2005, p. 67.
 25. Semmelweis 1983; Carter & Carter 2005, p. 68.
 26. Semmelweis 1983, pp. 106–108.
 27. 27.0 27.1 27.2 Carter & Carter 2005, p. 69.
 28. 28.0 28.1 Semmelweis 1983, p. 24.
 29. Semmelweis 1983, p. 56.
 30. Semmelweis 1983, p. 176; Tyler Smith 1856, p. 504.
 31. Semmelweis 1983, p. 174.
 32. Semmelweis 1983, p. 112.
 33. Semmelweis 1983, p. 169.
 34. Hauzman 2006; Semmelweis 1983, p. 212.
 35. Braun 1857.
 36. Semmelweis 1983, p. 34*.
 37. 37.0 37.1 Hauzman 2006.
 38. Semmelweis 1983, p. 4.
 39. Semmelweis 1983, p. 41; Breisky 1861, p. 1.
 40. Semmelweis 1983, p. 183.
 41. Nuland 2003.
 42. 42.0 42.1 Semmelweis 1983, p. 57.
 43. Carter & Carter 2005, p. 73.
 44. Semmelweis 1983, p. 41.
 45. Carter & Carter 2005, p. 74.
 46. Nuland 2003, p. 270.
 47. Carter & Carter 2005, p. 75.
 48. Benedek 1983, p. 293.
 49. Carter & Carter 2005, p. 76–78.
 50. 50.0 50.1 Carter & Carter 2005, p. 79.
 51. Semmelweis 1983, p. 58.

మరింత సమాచారం కోసము[మార్చు]

 • Antall, József; Szebellédy, Géza (1973), Aus den Jahrhunderten der Heilkunde, Budapest: Corvina Verlag, pp. 7–8
 • Ataman, A. D.; Vatanoğlu-Lutz, E. E.; Yıldırım, G (2013). "Medicine in stamps-Ignaz Semmelweis and Puerperal Fever". Journal of the Turkish German Gynecological Association. US National Library of Medicine. 14 (1): 35–39. doi:10.5152/jtgga.2013.08. PMC 3881728. PMID 24592068.
 • Benedek, István (1983), Ignaz Phillip Semmelweis 1818–1865, Druckerei Kner, Gyomaendrőd, Hungary: Corvina Kiadó (Translated from Hungarian to German by Brigitte Engel), ISBN 963-13-1459-6
 • Braun, Carl (1857), Lehrbuch der Geburtshülfe : mit Einschluss der operativen Therapeutik, der übrigen Fortpflanzungs-Functionen der Frauen und der Puerperalprocesse (in జర్మన్), Vienna, Austria: Braumüller, OCLC 991553285
 • Breisky, August (1861), "Semmelweis", Vierteljahrschrift für die praktische Heilkunde, Literarischer Anzeiger, 18: 1–13
 • Carter, K. Codell; Carter, Barbara R. (2005), Childbed fever. A scientific biography of Ignaz Semmelweis, Transaction Publishers, ISBN 978-1-4128-0467-7
 • Fleischer, J. (1856), "Statistischer Bericht der Gebärklinik an der kk. Universität zu Pest im Schuljahre 1855–56", Wiener medizinische Wochenschrift (in German), 6: 534–536, retrieved May 11, 2008, Wir glaubten diese Chlorwaschungs-Theorie habe sich längst überlebt; die Erfahrungen und statistischen Ausweisse der meisten geburtshilflichen Anstalten protestieren gegen ubige Anschanung; es wäre an der Zeit sich von dieser Theorie nicht weiter irreführen zu lassen.{{citation}}: CS1 maint: unrecognized language (link)
 • Hanninen, O.; Farago, M.; Monos, E. (September–October 1983), "Ignaz Philipp Semmelweis, the prophet of bacteriology", Infection Control, 4 (5): 367–370, doi:10.1017/S0195941700059762, PMID 6354955, archived from the original on April 4, 2008, retrieved October 26, 2009, Only the clinical facts proved him right during his lifetime; the triumph of bacteriology which began after his death made him not only the "savior of mothers" but also a genial ancestor of bacteriology.
 • Hauzman, Erik E. (August 26–30, 2006), Semmelweis and his German contemporaries, Budapest, Hungary, archived from the original (DOC) on March 24, 2009, retrieved March 24, 2009{{citation}}: CS1 maint: location missing publisher (link)
 • Hebra, Ferdinand (1847), "Höchst wichtige Erfahrungen über die Aetiologie der an Gebäranstalten epidemischen Puerperalfieber", Zeitschrift der K.k. Gesellschaft der Ärzte zu Wien, 4 (1): 242–244
 • Hebra, Ferdinand (1848), "Fortsetzung der Erfahrungen über die Aetiologie der in Gebäranstalten epidemischen Puerperalfieber", Zeitschrift der K.k. Gesellschaft der Ärzte zu Wien, 5: 64f
 • Levy, Karl Edouard Marius (1848), "De nyeste Forsög i Födselsstiftelsen i Wien til Oplysning om Barselfeberens Aetiologie", Hospitals-Meddelelser, 1: 199–211
 • Muenze Oesterreich AG (2017), "50 Euro – Ignaz Philipp Semmelweis (2008)", Austrian Mint website, Vienna, archived from the original on December 13, 2010, retrieved October 27, 2009, The new gold coin with a face value of 50 Euro has a portrait of the celebrated doctor himself together with the staff of Aesculapius, which is the logo for the entire series. The reverse has a bird's-eye view of the old General Hospital in Vienna, where Semmelweis was stationed in the childbirth clinic. An insert to the right shows a doctor and a student in the act of disinfecting their hands before examining a patient.
 • Musil, Steven (2020-03-19). "Google Doodle honors handwashing pioneer Dr. Ignaz Semmelweis". CNET. Retrieved 2020-03-22.
 • Nissani, M. (1995). "The Plight of the Obscure Innovator in Science". Social Studies of Science. 25: 165–183. doi:10.1177/030631295025001008.
 • Nuland, Sherwin B. (2003), The Doctors' Plague: Germs, Childbed Fever and the Strange Story of Ignac Semmelweis, W. W. Norton, ISBN 0-393-05299-0
 • Obenchain, Theodore G. (2016). Genius Belabored: Childbed Fever and the Tragic Life of Ignaz Semmelweis. University of Alabama Press. ISBN 978-0-81731-929-8.
 • Piper, John (2007). Motherkillers. Brighton: Book Guild. ISBN 978-1-84624-087-4. Retrieved 27 February 2015.
 • "Recognizing Ignaz Semmelweis and Handwashing". Google (in లాటిన్). 2020-03-20. Retrieved 2020-03-22.
 • Reid, Robert William (1975), Microbes and Men, New York: Saturday Review Press, ISBN 978-0-8415-0348-9, OCLC 1227698
 • Schmidt, Joseph Hermann (1850), "Die geburtshülfliche-klinischen Institute der königlichen Charité", Annalen des Charité-Krankenhauses zu Berlin, 1: 485–523
 • Semmelweis Society International. "Dr Semmelweis' Biography". Archived from the original on 22 జూలై 2019. Retrieved 2 September 2016.
 • Semmelweis, Ignaz (1983) [1983], Etiology, Concept and Prophylaxis of Childbed Fever, translated by Carter, K. Codell, University of Wisconsin Press, ISBN 0-299-09364-6 (references to Carter's foreword and notes indicated )
 • "Semmelweis Orvostörténeti Múzeum". Semmelweis.museum.hu. Archived from the original on 2012-05-10. Retrieved 2012-05-19.
 • Tyler Smith, W. (1856), "Puerperal Fever", The Lancet, 2 (1732): 503–505, doi:10.1016/s0140-6736(02)60262-4
 • Wieger, Friedrich (1849), "Des moyens prophylactiques mis en U.S.A. ge au grand hôpital de Vienne contre l'apparition de la fièvre puerpérale", Gazette Médicale de Strasbourg (in French), 9: 99–105{{citation}}: CS1 maint: unrecognized language (link)

బాహ్య లంకెలు[మార్చు]