ఇటికాల మధుసూదనరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇటికాల మధుసూదనరావు
దస్త్రం:Madhusudhan Rao.png
జననంఎప్రిల్ 5, 1918
భీంపల్లి గ్రామం, వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
వృత్తిరాజకీయ నాయకుడు
మతంహిందూ
భార్య / భర్తఅనసూయాదేవి

వరంగల్ జిల్లాకు చెందిన ఇటికాల మధుసూదనరావు ప్రముఖ ఉద్యమకారుడు, రాజకీయవేత్త.

జీవిత విశేషాలు[మార్చు]

వరంగల్ జిల్లా భీంపల్లి గ్రామంలో ఇటికాల బుచ్చయ్య, గోవిందమ్మ దంపతులకు 1918 ఎప్రిల్ 5న మధుసూదనరావు జన్మించారు. హన్మకొండలో విద్యభ్యాసం గావించారు. అప్పటి రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఉన్నత చదువులు కొనసాగించలేకపోయారు. యవ్వనప్రాయంలోనే ఆర్యసమాజ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఉర్దూ అధికార భాషగా ఉన్న ఆ రోజుల్లో హిందీ ప్రచారోద్యమంలో పాల్గొన్నారు. పోరాటంలో తనతో పాటు తన జీవిత సహచరి అనసూయాదేవిని కూడా భాగస్వామిని చేశారు. ఉద్యమ అవసరాల రీత్యా దేశమంతా పర్యటించారు. కొంతకాలం ఆర్యసమాజ్ వీరదళ్ కమాండర్ పనిచేశారు. రజాకార్ల దాడులను ఎదుర్కొనేందుకు మూడువేల మంది యువకులకు మిలిటరీ తర్ఫీదునిచ్చారు. విద్యాలయాల్లో గ్రంథాలయాలతో పాటు వ్యయామశాలలను ఏర్పాటు చేయించేందుకు పెద్ద ఎత్తున ఉద్యమమే నడిపారు. మధుసూదనరావు వరంగల్ జిల్లాలోని మానుకోట నియోజకవర్గం నుంచి రెండుసార్లు (1957, 1962) పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. విద్యావ్యవస్థ అభివృద్ధిలోనే ప్రజల నిజమైన అభివృద్ధి దాగుందని నమ్మారాయన. తిరుపతికి వెళ్లాల్సిన రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (నేటి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్ ) ని కేంద్రంతో పోరాడి వరంగల్లో నెలకోల్పేలా చేశారు. నాటి ప్రధాని నెహ్రూను వరంగల్ కు రప్పించి ఆయన చేతుల మీదుగా ప్రారంభింపచేశారు. వైద్య, విద్యసంస్థల ఏర్పాటుతో పాటు పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్థాపనలోనూ కీలకపాత్ర పోషించారు. పోరాటాలతోనే ఆయన జీవితం కొనసాగించారు. పోలీస్ దెబ్బలు, కఠినకారాగార శిక్షతో ఆరోగ్యం క్షీణించి 46 ఏళ్ల వయసులోనే అమరులయ్యారు. రెండుసార్లు ఎంపీ అయినా తనకోసం చిల్లిగవ్వ కూడా దాచుకోని నిస్వార్థజీవి మధుసూదనరావు. ఆయన అంత్యక్రియలకు సైతం డబ్బులు లేకపోతే ప్రజలు చందాలు వేసుకొని మరీ తమ ప్రియతమనాయకుడిని సాగనంపారు.