ఇరుకుల కుమారిలస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇరుకుల కుమారిలస్వామి
జననం1924, నవంబరు 24
ముల్కనూరు, చిగురుమామిడి మండలం, కరీంనగర్‌ జిల్లా, తెలంగాణ
ప్రసిద్ధిచిత్రకారుడు

ఇరుకుల కుమారిలస్వామి తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. శాంతినికేతన్‌లో పెయింటింగ్‌లో శిక్షణ పొంది, స్వయం ప్రతిభతో చిత్రకళారంగంలో ప్రపంచంలోనే మెరుగైన కళాకారుడిగా గుర్తింపు పొందాడు. జీవితకాలం ఢిల్లీలోనే ఉంటూ వివిధ పెయింటింగ్‌ కళాశాలల్లో ఎంతోమంది నూతన కళాకారుల్ని తీర్చిదిద్దాడు.[1]

జననం, విద్య[మార్చు]

కుమారిలస్వామి 1924, నవంబరు 24కరీంనగర్‌ జిల్లా, చిగురుమామిడి మండలం, ముల్కనూరులోని పేద దళిత కుటుంబంలో జన్మించాడు. ముల్కనూరులోని పాఠశాలలో ప్రాథమిక విద్యను చదివాడు. తరువాత కరీంనగర్‌కు వెళ్ళి చదువుకున్నాడు. ఢిల్లీలోని శారద ఉకిల్‌ ఆర్ట్స్‌ స్కూల్‌ నుంచి కూడా పెయింటింగ్‌లో శిక్షణ పొందాడు. విశ్వభారతి, శాంతినికేతన్‌ నుంచి పెయింటింగ్‌లో పట్టా సాధించాడు. ఢిల్లీలోని కాలేజ్‌ ఆఫ్ ఆర్ట్స్‌లో పనిచేసి, 1982లో ప్రొఫెసర్‌గా రిటైరయ్యాడు.[1]

చిత్రకళారంగం[మార్చు]

చిన్నప్పుడు తల్లి వేస్తున్న ముగ్గులను అనుకరిస్తూ, తాను కూడా ముగ్గులు వేసేవాడు. హైదరాబాదులోని ఒక పాఠశాలలో చదువుతున్పుడు బంకమట్టితో ఎడ్లబండిని తయారుచేసి అందరి మన్ననలను పొందాడు. ఆ తురవాత ప్రముఖ చిత్రకారుడు 'చిన్న స్వామి' దగ్గర శిష్యుడిగా చేరి, చిత్రకళలో మెళకువలు నేర్చుకున్నాడు. ఈ సందర్భంలో రావి నారాయణరెడ్డితో స్నేహం ఏర్పడింది. చిత్రకళపై ఉన్న ఆసక్తిని గమనించి 'హరిజన సేవక్‌ సంఘ్' ఆదుకున్నది. తెలుగునాట తొలి దళిత చిత్రకారుడైన కుమారిలస్వామి, మ్యూరల్‌ (కుఢ్య) ఫ్రెస్కో విభాగంలో చిత్రాలు వేయడంలో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాడు. కుమారిలస్వామి గీసిన చిత్రాలు 1943 నుంచి దేశంలోని అన్ని ప్రఖ్యాత దినపత్రికలు, మ్యాగజైన్స్‌, జర్నల్స్‌, పుస్తకాల్లో ప్రచురితమయ్యాయి.[1]

గుర్తింపు[మార్చు]

1977లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కుమారిలస్వామి వేసిన 'వేమన' చిత్రాన్ని ప్రదర్శనకు పెట్టబడింది. తెలుగు విశ్వవిద్యాలయం, ఢిల్లీలోని జాతీయ మోడరన్‌ ఆర్ట్‌ గ్యాలరీ, లలితకళా అకాడమీ, చండీగఢ్‌ మ్యూజియం, బిర్లా మ్యూజియం, రష్యన్‌ మ్యూజియం, సాహిత్య కళాపరిషత్‌, కొరియన్‌ ఎంబసీ, శ్రీలంక ప్రభుత్వ మ్యూజియం, మ్యూజిరు ఆఫ్‌ హ్యూమర్‌ అండ్‌ సెటైర్‌ (బల్గేరియా), హైదరాబాద్‌ మ్యూజియం, కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌ (ఢిల్లీ), సాలార్జంగ్‌ మ్యూజియం, సంగారియా మ్యూజియం (జైపూర్‌), శాంతినికేతన్‌ మ్యూజియంలలో కుమారిలస్వామి గీసిన చిత్రాలు ఉన్నాయి. భారత ప్రభుత్వ సంస్థ పబ్లికేషన్స్‌ విభాగం కోసం ఈయన 'భారతీయ కళా ఔర్‌ కళాకార్‌' అనే పుస్తకాన్ని అర్ధనారీశ్వర చిత్రంతో వెలువరించాడు. 'కళా కే సాధక్‌' పేరుతో మరో పుస్తకం రాశాడు.[1]

అవార్డులు[మార్చు]

1977లో 'హాస్యం-వ్యంగ్యం' విభాగంలో బల్గేరియా ప్రభుత్వం నుంచి అంతర్జాతీయ అవార్డు[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 సంగిశెట్టి, శ్రీనివాస్‌ (2018-07-31). "గుర్తింపుకు నోచుకోని తెలంగాణ బిడ్డ | జాతర |". NavaTelangana. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.