ఉపాంత ఉత్పాదకతా పంపిణీ సిద్ధాంతము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నవ్య సంప్రదాయ ఆర్థికవేత్తలు ప్రతిపాదించిన పంపిణీ సిద్ధాంతమే ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతము (Marginal Productivity Theory). ఈ సిద్ధాంతం ప్రకారం ఒక ఉత్పత్తి కారకం యొక్క పారితోషికం ఆ కారకం యొక్క ఉపాంత ఉత్పాదకతకు సమానంగా ఇవ్వబడుతుంది. ఉద్యమదార్లు ఒక ఉత్పత్తి కారకానికి దాని ఉత్పాదకతకు మించి ధరను చెల్లించలేరు. ఉపాంత ఉత్పాదకతను మించి ఉత్పత్తి కారకం ధరను చెల్లించినచో ఉద్యమదారులకు లాభాలు క్షీణిస్తాయి. అదే విధంగా ఉత్పత్తి కారకాలు ఉపాంత ఉత్పాదకతకు తక్కువగా పారితోషికాన్ని తీసుకోడానికి అంగీకరించవు.

ప్రమేయాలు[మార్చు]

ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతము క్రింది ప్రమేయాలపై ఆధారపడు ఉంది.

  • ఉత్పత్తి కారకాల వివిధ యూనిట్లు సజాతీయమైనవి.
  • ఉత్పత్తి కారకం, వస్తు మార్కెట్‌లో సంపోర్ణ పోటీ ఉంటుంది.
  • ఒక ఉత్పత్తి కారకానికి బదులుగా మరో ఉత్పత్తి కారకాన్ని వినియోగించుటకు ఎలాంటి ప్రతిబంధకాలు లేవు.
  • ఉత్పత్తి కారకాన్ని విభజించడాని వీలుంది.
  • ఉత్పత్తి కారకాలకు అపరిమిత సప్లై ఉంటుంది.

ఉత్పత్తి కారకాలకు పూర్తి గమనశీలత ఉంటుంది.

ఉపాంత ఉత్పాదకత[మార్చు]

ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతములో అతి ముఖ్యమైన భావన ఉపాంత ఉత్పాదకత. ఒక ఉత్పత్తి కారకాన్ని అదనంగా ఉపయోగించడం వలన మొత్తం ఉత్పత్తిలో వచ్చిన పెరుగుదలనే ఉపాంత ఉత్పాదకత అంటారు. ఉత్పత్తి కారకాలను ఎక్కువగా ఉపయోగించే కొద్దీ ఉపాంత ఉత్పాదకత అనేది సాధారణంగా పెరుగుతుంది. కాని ఒకానొక దశ అనంతరం ఉపాంత ఉత్పాదకత క్షీణించడం ప్రారంభిస్తుంది. దీన్నే క్షీణోపాంత ప్రతిఫల సిద్ధాంతం అంటారు. కాబట్టి ఉపాంత ఉత్పాదకత క్షీణదశకు రాకమునుపే ఉద్యమదారుడు అదనపు ఉత్పత్తి కారకాలను వినియోగించడం ఆపివేస్తాడు.

భౌతిక, రాబడి ఉపాంత ఉత్పత్తులు[మార్చు]

ఒక ఉత్పత్తి కారకం యొక్క ఉపాంత ఉత్పాదకతను భౌతిక యూనిట్లలో తెలియజేస్తే దాన్ని భౌతిక ఉపాంత ఉత్పత్తి అంటారు (MPP). భౌతిక ఉపాంత ఉత్పత్తిని మార్కెట్ ధరతో గుణిస్తే వచ్చేది రాబడి ఉపాంత ఉత్పత్తి (MRP). ఉత్పత్తి కారకం యొక్క అదనపు యూనిట్ వలన వచ్చే అదనపు ఆదాయాన్నే రాబడి ఉపాంత ఉత్పత్తిగా చెప్పవచ్చు.

MRP=MPP X మార్కెట్ ధర

సంపూర్ణ పోటీలో ఉపాంత ఉత్పాదకత నిర్ణయం[మార్చు]

సంపూర్ణ పోటీ మార్కెట్‌లో వస్తువు ధరను ఒక ఉద్యమదారుడు గానీ, ఒక వినియోగదారుడు గానీ నిర్ణయించడు. మొత్తం ఉత్పత్తి కారకం యొక్క సప్లై, డిమాండ్ అంశాలే ధరను నిర్ణయిస్తాయి. అ ధర ప్రకారము ఉత్పత్తి కారకం యొక్క ఉపాంత ఉత్పాదకత సమానమయ్యే వరకు ఉద్యమదారుడు వినియోగిస్తాడు. అప్పుడే ఉద్యమదారుల లాభాలు కూడా గరిష్ఠంగా ఉంటాయి. సంపూర్ణ పోటీలో ఉత్పత్తికారకాలకు పూర్తి గమనశీలత ఉంటుంది. అందువల్ల ఉపాంత ఉత్పాదకత ఎందులో అధికంగా ఉంటే అక్కడికి తరలివెళతాయి. కాబట్టి అన్ని నియామకాలుత్పత్తి కారకం యొక్క ఉత్పాంత ఉత్పాదకత సమానంగా ఉంటుంది.

ఉపాంత ఉత్పత్తి పంపిణీ సిద్ధాంతముపై విమర్శలు[మార్చు]

  • సంపూర్ణ పోటీ ఉన్నప్పుడే ఈ సిద్ధాంతం నిజమౌతుంది. కాని మార్కెట్‌లో పూర్తి సంపూర్ణ పోటీ ఉండకపోవచ్చు. ఏకస్వామ్యపు పోటీలు ప్రస్తుత మార్కెట్‌లో సహజంగానే అధికంగా ఉంటున్నాయి.
  • ఉత్పత్తి కారకం యొక్క యూనిట్లు సజాతీయమైనవి కాకపోవచ్చు. ఉదాహరణకు శ్రామికులు ఏ ఇద్దరు సమానంగా అని చెప్పడానికి వీలులేదు. వారి సామర్థ్యము, నైపుణ్యం, తెలివితేటలలో తేడాలుంటాయి. కాబట్టి సహజంగానే వారి ఉత్పత్తిలో ఇవి ప్రభావం చూపిస్తాయి.
  • ఉత్పత్తి కారకాలను పూర్తిగా విభజించడానికి వీలుండదు.
  • ఉత్పత్తి కారకాలను పూర్తి గమనశీలత ఉండక పోవచ్చు. భూమికి అసలే గమనశీలత ఉండదు. శ్రామికుల గమనశీలతకు కూడా హద్దు ఉంటుంది.

కీన్సు విమర్శ[మార్చు]

జాన్ మేనార్డ్ కీన్స్ ఈ సిద్ధాంతము సరైనది కాదని విమర్శించాడు. ఉత్పత్తి కారకాన్ని అధికంగా ఉపయోగించాలంటే ధరను తగ్గించాలి. శ్రామికులను అధికంగా వినియోగించాలంటే వేతనాలపై కోత విధించాలి. కాని వేతనాలు తగ్గించుకొనుటకు శ్రామికులు అంగీకరించరు. వేతనాల ఖర్చు తగ్గించుటకు శ్రామికులను తగ్గించినా ఉద్యోగిత క్షీణిస్తుంది. శ్రామికుల వేతనాలపై కోత విధించి ఒక సంస్థలో ఉత్పత్తి అధికం చేయవచ్చు కాని దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమలలో వేతనాల కోతవలన ఆర్థిక వ్యవస్థలో వస్తుసేవలకు సార్థక డిమాండు క్షీణిస్తుంది. కాబటి ఈ సిద్ధాంతం సరైనది కాదని కీన్సు అభిప్రాయం.

హాబ్సన్ విమర్శ[మార్చు]

ఆర్థికవేత్త హాబ్సన్ కూడా ఈ సిద్ధాంతాన్ని విమర్శించాడు. ఉత్పత్తి ప్రక్రియలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్చలేమనీ, అలా చేస్తే ఉత్పత్తి ప్రక్రియ దెబ్బతింటుందనీ హాబ్సన్ అభిప్రాయం. మార్చడానికి వీలు లేని ఉత్పత్తి కారకాల ఉపాంత ఉత్పాదకత కొలవడానికి వీలుండడు. ఈ సిద్ధాంతం ఊహాజనితంగానే నిజం కావచ్చు కాని ఆచరణలో సరికాదని హాబ్సన్ విమర్శించాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]