ఉప్ప చెట్టు
| ఉప్ప చెట్టు | |
|---|---|
| ఉప్ప చెట్టు | |
| Scientific classification | |
| Kingdom: | ఇండోమలయన్ |
| Family: | కలోఫిలేసి |
| Genus: | మెసువా |
| Species: | ఫెర్రియా |
| Synonyms | |
|
ఎసువా కోరమాండలినా | |
ఉప్ప చెట్టును మెసువా ఫెర్రియా, సిలోన్ ఐరన్‌వుడ్ లేదా కోబ్రా సాఫ్రాన్ అని పిలుస్తారు. ఇది ఇండోమలయన్ రాజ్యానికి చెందిన కలోఫిలేసి కుటుంబానికి చెందినది.[1] ఇది శ్రీలంక జాతీయ వృక్షం, అలాగే మిజోరాం రాష్ట్రానికి రాష్ట్ర వృక్షం, ఈ చెట్టు పుష్పాలు త్రిపుర రాష్ట్రానికి రాష్ట్ర పుష్పం.[2] ఈ చెట్టు ఏడాదికి రెండు సార్లు రంగులు మారుతుంది. ఇవి ఉష్ణమండల వాతావరణంలో బాగా పెరుగుతాయి. ఈ చెట్లు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతంలో అరకులోయ నియోజక వర్గంలోని హుకుంపేట మండలం దుర్గం గ్రామ పంచాయతీ బంగారం గురువు సమీపంలోని ఉప్ప గ్రామంలో ఉన్నాయి. ఉప్ప చెట్లు ఉన్న ప్రాంతాన్ని 'పింక్ ఫారెస్ట్' అని కూడా పిలుస్తారు.[3]
ఆవాసం
[మార్చు]ఈ చెట్టు 30 మీటర్ల (98 అడుగులు) కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతుంది, అడుగున 2 మీటర్ల (6 అడుగుల 7 అంగుళాలు) వ్యాసం కలిగిన కాండంతో ఉంటుంది. వీటి ఆకులు 7–15 సెం.మీ (2.8–5.9 అంగుళాలు) పొడవు, 1.5–3.5 సెం.మీ (0.59–1.38 అంగుళాలు) వెడల్పుతో, తెల్లటి అడుగు భాగంతో ఉంటాయి. కొత్తగా వచ్చే ఆకులు ఎరుపు నుండి పసుపురంగు గులాబీ రంగులో ఉంటాయి. కొమ్మలు సన్నగా, గుండ్రంగా ఉంటాయి. పువ్వులు 4–7.5 సెం.మీ (1.6–3.0 అంగుళాలు) వ్యాసంలో ఉంటాయి. ఇవి నాలుగు తెల్ల రేకులు, అనేక నారింజ పసుపు కేసరాలతో ఉంటాయి. ఇది శ్రీలంక, భారతదేశం, దక్షిణ నేపాల్, బర్మా, థాయిలాండ్, ఇండోచైనా, ఫిలిప్పీన్స్, మలేషియా, సుమత్రా తడి, ఉష్ణమండల ప్రాంతాలకు చెందినది, ఇది సతతహరిత అడవులలో, ముఖ్యంగా నదీ లోయలలో పెరుగుతుంది. భారతదేశంలోని తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమలలో ఇది 1,500 m (4,900 ft) ఎత్తు వరకు పెరుగుతుంది, శ్రీలంకలో 1,000 m (3,300 ft) వరకు పెరుగుతుంది.[4] శ్రీలంకలో కాండీ సమీపంలోని 14వ శతాబ్దపు ఎంబెక్కే పుణ్యక్షేత్రం స్తంభాలు ఈ చెట్టు కలపతో తయారు చేయబడ్డాయి.[5] పూలు, ఆకులు, విత్తనాలను భారతదేశం, మలేషియా మొదలైన దేశాలలో మూలికా ఔషధాలుగా ఉపయోగిస్తారు.[6][7]
ఆకుల రంగు మార్పు
[మార్చు]ఈ చెట్ల ఆకులు ఏడాదికి రెండు సార్లు రంగులు మారుతాయి. సాధారణంగా ఆకులన్నీ ఆకుపచ్చగానే ఉంటాయి. ప్రతి సంవత్సరం జనవరి-ఫిబ్రవరిలో ఒకసారి, సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో మరోసారి రంగులు మారుతుంటాయి. మొదట ఆకులు తెలుపు వర్ణంలోకి ఆ తరువాత లేతగులాబీ రంగులోకి మారి చివరిగా ఎరుపు రంగులోకి మారుతాయి. ఈ చెట్టు పువ్వులు తెల్లగా ఉండి చాల సువాసన కలిగి ఉంటాయి.
పిక్కలు
[మార్చు]ఉప్పకాయలని పగులకొడితే లోపల పిక్కలు ఉంటాయి. అవి సాదాగా ఉంటె మగ పిక్కలు అని, త్రికోణ ఆకారంలో ఉంటె ఆడపిక్కలు అని గిరిజనులు నమ్ముతారు.[8] పూర్వకాలంలో విద్యుత్ సౌకర్యం, కిరోసిన్ కూడా అందుబాటులో లేనప్పుడు పిక్కకు రంధ్రము చేసి ఒత్తి గుచ్చి వెలిగించేవారు. ఈ పిక్కల నుండి తీసిన నూనె తలకు, దీపం పెట్టడానికి, శరీరంపై దద్దుర్లు వస్తే పై పూతగా ఉపయోగిస్తారు. ఈ చెట్లకు దివిటీల చెట్లు అని పేరు కూడా ఉంది. ఈ చెట్ల నుంచి వచ్చే కాయలతో నూనెను తయారు చేసి, దాన్ని దివిటీలు వెలిగించుకునేందుకు వాడేవారు. వీటిని ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చింది జైపూర్ ప్రాంతాన్ని పాలించిన మహారాజ్ విక్రమ్ దేవ్ వర్మ. ఇతను తన రాజ్యంలోని దివిటీలు ఎక్కువ సేపు వెలగడానికి పనికొచ్చే నూనెను ఇచ్చే ఈ మొక్కలను హిమాలయాల నుంచి తీసుకుని వచ్చారు. అవి ఒడిశా సమీపంలోనే ఉన్న మన్యంలోని కొన్ని ప్రాంతాలలో పెంచారు. అయితే ఇవి కేవలం పాడేరు ప్రాంతంలోనే బతికాయి.
చరిత్ర
[మార్చు]17వ శతాబ్దంలో ఒక సాధువు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఇంటికి వెళ్లి అన్నం పెట్టాలని అడగ్గా వాళ్ళు తిరస్కరించారు. ఆ తరువాత కొంత దూరం ప్రయాణించి ఇంకో ఇంటికి వెళ్లి అడగ్గా వాళ్ళు భోజనం పెట్టారు. ఆ భోజనం తిని తృప్తి చెంది ఇక్కడ బంగారం పండుతుందని ఆశీర్వదించి, అన్నం పెట్టని చోట ఉప్ప చెట్లు పెరుగుతాయని శాపం పెట్టినట్లు నానుడి. ఆ తరువాత అవే బంగారం గురువు, ఉప్ప గ్రామాలు అయ్యాయని నమ్ముతారు. గిరిజనులు ఈ చెట్లను చాల పవిత్రంగా చూసుకుంటారు. ఈ వనాన్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా మార్చారు. ఈ చెట్ల బాధ్యత గ్రామ దేవత అయిన గుణాలమ్మ తల్లి చూసుకుంటుందని గిరిజనులు నమ్ముతారు.[9]
రవాణా
[మార్చు]పాడేరుకు 30 కి.మీ, అరకు నుండి 39 కి.మీ దూరంలో ఉప్ప గ్రామం ఉంది. విశాఖపట్నం నుండి 130 కి.మీ దూరంలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామానికి సబ్బవరం మీదుగా పాడేరు-అరకు మార్గంలో చేరుకోవచ్చు.
గ్యాలరీ
[మార్చు]- ఆకు
- చిగురుటాకులు
- పువ్వులు
- పక్వానికి వచ్చిన పండు
- పండిన పండ్లు
మూలాలు
[మార్చు]- ↑ "Nag Kesar". Flowers of India.
- ↑ "State Symbols of Tripura | Tripura Tourism Development Corporation Ltd". tripuratourism.gov.in. Retrieved 2017-04-28.
- ↑ "పింక్ ఫారెస్ట్: హిమాలయాల్లోని ఈ చెట్లు పాడేరుకు ఎలా వచ్చాయి?". BBC News తెలుగు. 2025-03-02. Retrieved 2025-04-08.
- ↑ "Mesua ferrea L. – Clusiaceae". biotik.org. Archived from the original on 2016-03-04. Retrieved 2012-12-06.
- ↑ "Sri Lanka: Embekke".
- ↑ "Mesua ferrea L. – Clusiaceae". biotik.org. Archived from the original on 2016-03-04. Retrieved 2012-12-06.
- ↑ "Nag Kesar". Flowers of India.
- ↑ "Mesua ferrea L. – Clusiaceae". biotik.org. Archived from the original on 2016-03-04. Retrieved 2012-12-06.
- ↑ "Sakshi | Funday District Edition - 06/04/2025, Funday Today Telugu News ePaper Online". epaper.sakshi.com. Retrieved 2025-04-08.