Jump to content

ఊర ఈశ్వరరెడ్డి

వికీపీడియా నుండి
mallureddy eswar
mallureddy eswar
దస్త్రం:Mallu Reddy eswar
జననం03.04.1993
గ్రామం : pileru nagireddy colony
నివాస ప్రాంతంpileru
ఇతర పేర్లుchinnaiah
వృత్తిrailway department & agriculture
ప్రసిద్ధికవి
మతంహిందూ

రచనలు

[మార్చు]

1.వేంకటేశ్వర ద్విశతి[1].

2.చెన్నకేశవ శతకం[2].

3.కవితాలహరి

4. సమస్యా పూరణం

5.ముక్తిపథం[3].

6. వేణిసోంపురం వేణుగోపాలస్వామి[4]

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

2.చెన్నకేశవ శతకం[2].

ప్రార్థన

కం. ప్రతినిత్యము నీసేవయె

     అతిముఖ్యంబనుచు దలతు నంభుజనాభా!

     గతినీవే యని నమ్మితి

     వెతలను తొలగించుమయ్య వేంకట రమణా!

కం. విద్యలకెల్లను నొజ్జవు

     పద్యములను వ్రాయజేయు ప్రతిభయు నీదే

     హృద్యముగ సాగునటులను

     సద్యోగంబొసగుమయ్య శంకరతనయా!

కం. పలకయు బలపము నిచ్చియు

     తెలవారకముందె లేపి తీయని వాక్కుల్

     పలికించి చదువు నేర్పిరి

     తలిదండ్రుల మరువ కెపుడు దలచెదను మదిన్!

కం. సతతము నా యభివృధ్ధికి

     హితవును బోధించి నన్ను విఙ్ఞుని జేయన్

     ప్రతిఫలముగ నంకితమీ

     కృతి వేంకట రామిరెడ్డి కృష్ణమ్మలకున్!

కం. రామా! రాక్షస మర్దన!

     రామా! సుగుణాభిరామ! రాజిత కరుణా

     ధామా! తారక నామా!

     రామా! మది దలతునెపుడు రఘుకులసోమా!

కం. ముదనోళ్ళ గోత్రజుడ సం

     పద మాకిదియేను బహుళ ప్రాచుర్యముగా

     నదె ఊరవారి వంశము

     నదె బ్రోవగ రావ దేవ! నందకిశోరా!

చం. దినమునకొక్క పద్యమును దిగ్విజయంబుగ వ్రాయజేసినన్

     ఘనముగ పండితాళి కడు గౌరవమొందగ జేసినట్టియో

     వనరుహలోచనా! మధుర వాఙ్మయ రూప విధాతృసేవితా!

     ప్రణతులు జేతు నీకిపుడె పాద్యమొసంగుచునమ్మ భారతీ!

చం. చదువులతల్లి! నీదు కడు చల్లని చూపులు మేను సోకగా

     పదముల మ్రొక్కి నీదు పదపద్యములల్లగ బూనితిన్ మదిన్

     ముదముగ సాగజేసి మది మోదమొసంగవె నిల్చి నా యెదన్

     సదమలభక్తి గొల్తు నిను సత్కృప జూపవె శారదామణీ!

చెన్నకేశవ శతకము

ఉ.     శ్రీలను మించు జ్ఞానమును శీఘ్రమొసంగెడు శారదాపతిన్

శ్రీలను గూర్చు లక్ష్మికిని శ్రేయము గూర్చెడు శేషశాయికిన్

శ్రీ లయకార శంకరుని శ్రీసతు లిర్వుర గంగ గౌరినిన్

శ్రీల సుమంబులే యిడుదు చేకొను మింపుగ చెన్నకేశవా!     1

చం.   ధనమది వెంట రాదు తన ధర్మమె పృథ్విని శాశ్వతమ్ముగా,

తనమన భావనల్ మదిని దల్చక సర్వము నొక్కడే యనన్,

మనమున దల్చుచున్ హరిని తన్మయతన్ననుభూతి పొందగా,

వనముననున్న ముక్తి నిజ వైభవ మంబదె చెన్నకేశవా!        2

ఉ.     ఛీ యని రోసి కాపురము శీఘ్రమే శ్రీహరి పాదసేవలో

బాయకనుండినన్ పరమ పావనమౌ రఘురామ మంత్రమున్

హాయిగ మానసంబునను ధ్యానము జేసిన నెల్లవారికిన్

పాయదె పాపపంకిలము పాహి యనంగనె చెన్నకేశవా!      3

ఉ.     లోపల వెల్పలన్ గనిన లోకమునందున సర్వవ్యాపియౌ

నా పరమేశునిన్ గనక నంతమొనర్చుచు నన్ని ప్రాణులన్

దాపలనుంచ గోరినను దక్కునెమోక్షము మానవాళికిన్

పాపము బోవునెట్టులిక పన్నగ భూషణ చెన్నకేశవా!           4

చం.   తిరిగితి రాజకీయమున తీరును గాంచితి స్వార్థమందులో

నెరిగితి కుట్రలన్నియును నెక్కడ జూసిన నన్ని ప్రాణుల

న్నరయగ నీవె సర్వమని నమ్మితి నన్యుల జేరబోక నీ

దరికిని జేర వచ్చితిని ధన్యుని జేయవె చెన్నకేశవా!             5

ఉ.    ప్రాపన నీవెగా సకల ప్రాణులకున్నభయంబునిచ్చి మా

      కాపదలొచ్చినన్ చెలగి కష్టములన్నెడబాపివేగమే

      నీపదసన్నిధిన్ మనసు నిశ్చలరీతిగనుండజేయుమా

      మోపికలేదునాకికను ముక్తినొసంగుము చెన్నకేశవా!           6

చం.   ఘనముగ తల్లిదండ్రులను గన్పడు దైవములంచుదెల్పగా,

      వినయముతోడ వారికిని వేదనలన్గలుగంగ జేయకన్,

      ననవరతంబు ప్రేమగను నాత్మ దలంచుచు సేవ జేయగన్

      గనుమిదె ముక్తిధామమగు గానగ నీభువి చెన్నకేశవా!         7

ఉ.    తల్లియె తొల్లి దైవముర తా గురుకన్నను తండ్రికన్న తా

      నెల్లలు లేని ప్రేమ గురిపించెడి చల్లని కల్పవల్లిరా,

      కల్లయుగాదునిక్కమిది కష్టమునింతయు కల్గనీనిజా,

      బిల్లియెతల్లిరానెపుడు బిడ్డకు దేవత చెన్నకేశవా!                8

ఉ.    తక్కినమాటలేటికిక తల్లియు దండ్రియు లేక లేముగా

      చక్కని జన్మనిచ్చి మరి సత్యము ధర్మము నీతిమార్గమున్,

      మక్కువతోడ దెల్పి మహి మాన్యుల జేసిన పూజ్యనీయులన్,

      మ్రొక్కిన చాలదే శిలల మ్రొక్కగనేటికి చెన్నకేశవా!             9

ఉ.    అల్పుడు గాడు మానవున కన్యము లేదననంతమీవనన్

      దెల్పెనె యాదిశంకరుడు దేవుని జీవుని మేనుభేదముల్

      కల్పిత దృశ్యమానభవ కారణకర్మను వీడ వేగ నా

      వేల్పును జేరు మార్గమిదె వేగమె గావగ చెన్నకేశవా!         10

చం.   చెదరని గుండె ధైర్యమున చిత్తమునందున నిల్పి మాధవున్

       సదమలభక్తితోడ మది సత్యము ధర్మము లాచరించుచున్

       వదలక దుష్టకార్యములు భావ్యము కాదని మానసంబునన్,

       ముదమున వీడెనేని యది మోక్షమె జూడగ చెన్నకేశవా!    11

ఉ.     చిమ్మని చీకటుల్ దొలగ చిత్తమునందున జ్ఞానరూపదీ

       పమ్మును వెల్గ జేసి భవబంధములన్ పెడబాపి నీదు రూ

       పమ్మును జూపునట్టి ఘన పండితులైన గురూపదేశసా

       రమ్ము సుధీజనాళికి శరణ్యము జూడగ చెన్నకేశవా!         12

చం.   కరివరదుండ వీవనుచు గ్రన్నన జేరితి పాదసన్నిధిన్

       మరిమరి జెప్పుచుంటి నిక మందుడనన్ చెలగాటమాయెనా

       సరిసరి నీ విలాసములు చక్కగ నిప్పుడె జెప్పెదమ్మకున్,

       హరిహరి! వీ డసాధ్యుడని యప్పుడు గావవె చెన్నకేశవా!    13

చం.   సరసిజనాభ! నీదు కరుణామృత మించుక సోక మాయ దొం

       తరలవి వీడగాను నను ధన్యుడనైతిని నాదు మానసం

       బపరిమితంబుగా మురికి నంతయు బాసిన ముత్యమైన ని

       న్నెరిగితి నీదు రూపమును నిక్కము సుమ్ముది చెన్నకేశవా!  14

ఉ.     శ్రీరఘురామ రామ యని చిత్తమునందున నెంత వేడినన్

       తీరికలేదొకింత యని తీర్చగ రావది యేమి చిత్రమో

       నేరములేమి జేసితిని నీరజలోచన! నన్ను గావగా

       భారమ నీకు భక్తజనబాంధవ! దెల్పుము చెన్నకేశవా!        15

ఉ.     శ్రీసతి పత్నియై ప్రజల శ్రేయము తోడను కోర్కె దీర్చగా

       భూసతి దారయై జనుల భోగము కల్గగ తాను చూచెగా

       మా సుఖశాంతులన్గనగ మాతలు చెంతను నుండి చూడగా

       మీ సరి దైవమింకొకరు మేదిని కాంతుమె చెన్నకేశవా!      16

చం.   హృదయము మందిరంబుగను నూయల జేతును వెన్నుభాగమున్

       పదముల పుష్పమాలికల పద్యములల్లుచు భక్తి మీర నే

       ముదముగ జోలపాడుచును ముద్దుగ నో యదుభూషణా! యనన్

       పెదవుల పల్కజేయగను ప్రేమనొసంగుము చెన్నకేశవా!    17

ఉ.     వేచితి వేణువైతి నునువెచ్చని నీకరమందునుండగా

       పూచితి పూవునై పుడమి పొందుగ నీ మృదుపాదసేవకై

       జూచితి జున్ను మీగడయి జుఱ్ఱగ నీవెపుడేగుదెంతువో

       దాచకుమింక నాకడను దాగుడు మూతలు చెన్నకేశవా!    18

ఉ.     పెంచిన తల్లిదండ్రులకు ప్రేమగ బుక్కెడు బువ్వ బెట్టకన్

       కంచికి చేరి యమ్మకును కమ్మని విందు నివేదనంబుగా

       పంచిన కల్గునే ఫలము పాతకులున్ పరమాత్మచెంతకే,

       తెంచగ సాధ్యమౌనె కన దేబెలకున్ భువి చెన్నకేశవా!        19

ఉ.     శ్రీకర! శ్రీధరా! విబుధశేఖర! ఓ మధుసూధనా! హరీ!

       శ్రీకర! వాసుదేవ! సురసేవిత! దానవమర్దనా! విభో!

       శ్రీకమలాసతీశ! సువిశేషగుణాకర! భక్తవత్సలా!

       శ్రీకర! సన్నుతింతునిదె! శీఘ్రమె బ్రోవుము! చెన్నకేశవా!    20

ఉ.     ఎవ్వని గొల్వ భక్తి గలు గెవ్వని గొల్వ హరించు పాతకం

       బెవ్వని గొల్వ ముక్తి గలు గెవ్వని గొల్వగ శాంతచిత్తమౌ

       నెవ్వని చూపు సోక తనువెల్లయు తన్మయమొందజేయు వా

       నెవ్విధి గొల్వగావలెనొ నేర్పున దెల్పుము చెన్నకేశవా!        21

చం.   పరమవిశేషపావన కృపామృత సాగర! భక్తసేవితా!

       స్థిరముగ నాదు చిత్తమున తీయని నీమృదునామమంత్రమున్

       నిరతము పల్కజేయుమయ నిర్గుణగానవశీకరుండవో,

       సరిగమరాగమున్ శృతిగ సన్నుతి జేసెద చెన్నకేశవా!      22

చం.   మది నిను దల్చి బూనితిని పద్యములల్లగ పార్వతీసుతా!

       పదములయందు దోషగుణ భావములేమియు లేక యీకృతిన్

       చదువగ పాఠకుల్ మిగుల చక్కగనున్నవటంచు మెచ్చగన్

       పదముల వ్రాలి మ్రొక్కెదను వ్రాయ వరమ్మిడు చెన్నకేశవా! 23

ఉ.     పత్రమొ పుష్పమో ఫలమొ పాయక తోయమొ భక్తితోడ నే

       మాత్రము శంక లేకయు సమర్పణ జేసిన చాలునంచు తా

       మిత్రుని రీతిగా నుడివె మేదిని పార్థునితోడ దేవకీ

       పుత్రుని నమ్మినన్ గలుగు మోక్షము తప్పక చెన్నకేశవా!    24

చం.   నిలువదు నాదు మానసము నిత్యము గొల్వగ నేమిజేతునే

       వల విసిరేసి పట్టెదవొ బాధ్యత నీదె నిమిత్తమాత్రుడన్

       పలుచన జేయకయ్య పరమార్థిక తత్వము దెల్పి సార్థకం

       గలుగగ జేయు జీవితము కారణభూతుడ చెన్నకేశవా!       25

ఉ.     నామములన్ ధరించి యెగనామము బెట్టెడు వారు భక్తులా?

       స్వాముల పేర జంతువుల జంపి భుజించెడువారు భక్తులా?

       నీమముతోడ నిష్ఠగను నిన్ను భజించెడువారు భక్తులా?

       యేమిది చోద్యమో యెరుగ నేమని దెల్పుదు చెన్నకేశవా!   26

చం.   సిరులనొసంగువాడవని చిత్తమునందు భజించలేదు నే

       వరముల కోరలేదు నిను వందలు వేలుగ లక్షకోటులన్

       పరమును పొందుమార్గమును పారవశమ్మున పొందజేసి నీ

       దరిశనమిచ్చి బ్రోవగదె ధన్యుడనయ్యెద చెన్నకేశవా!        27

ఉ.     వంచన జేయునట్టి నయవంచకులైన నరాధముల్ గనన్

       పెంచెదవీవు వారలకు పెంపుగ లక్షలు కోట్లుకోట్లుగ

       న్నెంచగ నేమి జేసితిమి యింతటి దోష మటంచు లోకులున్

       మంచితనంబుతో నడుగ మాటలు రావయ చెన్నకేశవా!    28

ఉ.     ముక్తి యనంగ కర్మలను బూనికచే విడువంగ రాదు నీ

       శక్తికి మూలమేదొ యది సత్యమెరుంగగ జేయ సాధనన్

       యుక్తిగ సద్గురూత్తముని యొద్దకు జేరి పరంబు మార్గమున్

       భక్తిగ గొల్వ దెల్పు భవ బంధము బాయగ చెన్నకేశవా!    29

చం.   యమనియమాది యాసనము లన్నియు సాధన జేసి లోపలన్

       విమలమనస్కులై భువి వివేకముతో చరియించుచుండి కా

       మములను జ్ఞానఖడ్గమున ఖండన జేసి ప్రశాంతచిత్తమున్

       క్రమముగ ముక్తి మార్గమదె గ్రన్నన జేరగ చెన్నకేశవా!      30

ఉ.     విత్తము గోరి పూజ లవివేకముతో జనులెట్లు సల్పిన

       న్నిత్తువు భోగభాగ్యముల నింపుగ వారికి వేడ్క మీరగన్

       చిత్తమునందు నిన్ను దరిశింపగ గోరెడు నీదు భక్తులన్

       హత్తుకొనంగ రావుగదె యచ్యుత వేగమె చెన్నకేశవా!        31

చం.   జగములనేలు సాధుజన సజ్జన పోషక! సన్నుతాంగ! ఓ

       సుగుణ సుధాకరా! పరమ శోభితసుందర సారసాక్ష! నే

       తగనని వీడబోకు హరి! తక్కిన దిక్కెవరింక నాకు నే

       పగతుడ కాదు నీ పరమ భక్తుడ బ్రోవుము చెన్నకేశవా!    32

చం.   సిరి గద శంఖచక్రములు చిత్తమునన్ దలపోయలేక నా

       కరి మొరవెట్ట వేగమున కావగ నా మకరీంద్రు ద్రుంచి యా

       వెరపును బాపితీవె పరివేష్టిత పావన పద్మలోచనా!

       దరిశనమిచ్చి బ్రోవగదె ధన్యుడనయ్యెద చెన్నకేశవా!         33

చం.   యమనియమాది యాసనములందున మానసమున్ పదేపదే

       యేమరుపాటు లేక నిను నెప్పుడు చిత్తమునన్ దలంచగన్

       ధీమతి నాకొసంగి భవదీయుని విన్నపమాలకించు నా

       తామసమున్ హరించి చను దారిని జూపుము చెన్నకేశవా! 34

ఉ.     ఎయ్యది నిన్ను జేరుటకు నెయ్యది మార్గము నేది ధర్మమో

       యెయ్యది సత్యమో, నెయ్య దసత్యమొ గానలేను నే

       నెయ్యది మంచియో, నెయ్యది చెడ్డయొ నాకు దెల్పుమా

       యయ్యవు గాద మ్రొక్కెద నయంబుగ బ్రోవవె చెన్నకేశవా!  35

ఉ.     చప్పుడు చేయకన్ దొలగు సత్యము కాయము నమ్మబోక నన్

       చెప్పిరి పెద్దలున్ దొలుత చిత్తమునందున నిన్ను గొల్చుటే

       ముప్పు దొలంగు మార్గమని ముందు గ్రహించిన తప్పు బాధల

       న్నప్పవు నీవె యంచు మది నమ్మితి గావవె చెన్నకేశవా!    36

ఉ.     పద్యసుశబ్దభావముల వ్రాయగ నీదయ లేక యున్న నే

       విద్యను నేర్చియుంటి నను వేదికలందున గౌరవించగా

       సద్యశవైభవమ్మునిడి శాంతిసుఖమ్ముల నోలలాడగా

       హృద్యముగాను దోచె మది రేబవలున్ గన చెన్నకేశవా!    37

ఉ.     దేనిని పొంద యోగ్యమగు దేనిని పొందగ శాంతి గూర్చునో

       దేనిని పొంద మోదమగు దేనిని పొందగ సౌఖ్యమబ్బునో

       దేనిని పొందగా నరులు దేనిని గోరక నూరకుందురో

       దానిని పొందు మార్గమును ధారుణి దెల్పుము చెన్నకేశవా! 38

చం.   తనువె యశాశ్వతమ్మనుచు తప్పదు మృత్యువు దప్పదంచు తా

       మనిశము నోట బల్కుచును నంతములేని దురాశతో జనుల్

       దినదినమొక్క గండముగ తీరగు జీవనమార్గమందునం

       జను మనుజాళినెవ్విధిని జక్కగ జేసెదొ చెన్నకేశవా!         39

ఉ.     నామము రూపమేమియును నాదను నీదను బేధమేమియున్

       కామము క్రోధమున్, కార్యము కారణమేమి లేకయున్

       నీమములేమి లేక భువి నిత్యము నూత సనాతనుండునై

       యీ మహి వెల్గు వాని గన నీయవె జ్ఞానము చెన్నకేశవా!   40

చం.   తరగని భక్తి శ్రద్ధలను దైవికచర్చలయందు రక్తియున్

       పరమును జేరు మార్గమును బాహ్యమునందు విరక్తి గల్గగన్

       స్థిరమగు చిత్తవృత్తులను చిత్తమునందున జేరనీయకన్

       ధర నిను గొల్వ ముక్తినిడి ధన్యుని జేయవె చెన్నకేశవా!     41

చం.   శరణని యంటి నిన్ను భువి సారధివై నడిపించు రీతి నీ

       చరణములంటి యున్న నను చక్కగ నీదరి జేరు మార్గమున్

       కరమును పట్టి తోడుకొని కానగ దర్శనమిచ్చి నీవు నీ

       సరసన జేర్చుకొమ్ము నను సైపగ లేనిక చెన్నకేశవా!         42

ఉ.     బుక్కెడు కూటికై జనుల మోసము జేయుచు వేషధారులై

       టక్కుటమార విద్యలను డాంబిక రూపముచేత జూపుచున్

       రొక్కము పెక్కు లాగుచును రూఢిగ నిద్ధరనుండునూహతో

       నిక్కము నిన్ను గొల్వరిల నిచ్చలు చిత్రము చెన్నకేశవా!      43

ఉ.     మానవజాతిలక్షణము మచ్చునకైనను కానరాదుగా

       దానవజాతి యయ్యె ధర ధర్మమదెట్టుల దాగిపోయెనో

       కానమునిట్టి ఘోరమును కావగ సజ్జనరక్షణార్థమై

       మానవదుష్టచర్యలను మార్చగ రాగదె చెన్నకేశవా!          44

చం.   పలుపలు రీతులన్ మిగుల పద్యసమస్యల నేకధాటిగా

       గలగల పారు నేరువలె గానకళాదరహాసభాసితన్

       సలలితరాగరంజితవిశాలవివేకవిరాజపూజితా!

       పలుకుల పారిజాతముల పాద్యము నీకిదె చెన్నకేశవా!      45

ఉ.     బుద్భుదమైన జీవితము బుద్ధిగనన్ నడిపించి చిత్తమం

       దద్భుతరీతి గొల్వ నిను త్వత్కృప నాపయి ధారబోయవే

       తద్భవనాశకారహర! దాసుని బ్రోవగ జాగదేల లిం

       గోద్భవపాపనాశకర! కోరి భజించెద చెన్నకేశవా!           46

చం.   కలియుగ ధర్మమో నలువ ఘంటమునందుదయించు వ్రాతయో

       మలినమనస్కులై ప్రజల మానము ప్రాణము తీయునట్టి యా

       తులువల ఘోరకృత్యముల ద్రుంచగ నీభువినుద్భవించి యీ

       కలుషమడంచి మాన్యులను గావవె శీఘ్రమె చెన్నకేశవా!    47

చం.   జగములనేల జూచుచును జాబిలిపై తిరుగాడ జూచు నా

       మృగముల పట్ట జూచు ఘన మృత్యువునే యెదిరింప జూచు నా

       నగములనెక్క జూచును ఘనంబగు నాకసమెక్క జూచు నా

       నిగమము సాక్షి నిన్ను గన నేరరు చిత్రము చెన్నకేశవా!    48

ఉ.     కప్పిన మేఘముల్ తొలగగా నెలఱేడు వెలుంగు రీతిగా

       గప్పిన మాయదొంతరలు గప్పున మాకు తొలంగ జేసి మా

       ముప్పును బాపి మమ్ములను ముక్తిని పొందగ జేయుమయ్య నీ

       గొప్పదనంబుఁ జాటెదము కోరిక తీరగ చెన్నకేశవా!        49

ఉ.     సందియమేల సత్యమది సద్గురు దైవ కృపాకటాక్షముల్

       పొందినగాని ముక్తిపథ మొందగ లేరని చెప్ప శాస్త్రమా

       నందముఁ బొందగోర గురునాథుని సేవల భక్తిశ్రద్ధలన్

       పొందుగ జేరి గొల్చి నను  పుణ్య ప్రదంబదె చెన్నకేశవా!    50

ఉ.     కూటికి లేనివాడు శతకోటిని పొందిన సంతసంబునే

       మాటికి పొందజేయు నను మాధవ! మోహనకేళిరూప! నే

       పాటికి కల్గదింత దయ పాండవపాలక! పాహి యంటి నీ

       చాటున చేర్చుకొమ్ము నిక చాచితి చేతులు చెన్నకేశవా!     51

ఉ.       పాపిని నేలుకొమ్మనుచు ప్రార్థన జేసిన బ్రోవవేమిరా

       యోపిక లేదు నాకునిక నోయదుభూషణ! యోనరాధిపా!

       దీపితతేజ! మెచ్చగను దీనుని గావుము దీనబంధు! నా

       తాపము దీర్చ రావె వడి తప్పుల నెంచక చెన్నకేశవా!        52

చం.   సమముగ జూచు వారలను సృష్టిగ జేసిన నేమి బోవునో

       తమసము గల్గు వారు గన ధారుణి గూర్తురె శాంతి సౌఖ్యముల్

       సమరస సాధుపుంగవుల సజ్జనులన్ భువి నెల్లవేళల

       న్నమరగ జేయుమయ్య నరకాసుసంహర! చెన్నకేశవా!     53

ఉ.     దోసిలి యొగ్గి వేడితిని తోయజ నేత్రుడ! తోడు నీవె నీ

       దాసుని పట్ల యింత దయ దాల్చవె దానవమర్దనా! ప్రభూ!

       దోసములెంచకయ్య హరి దూషణభూషణధూర్తుడంచు నన్

       వాసము చేర్చుకొమ్మికను వాసవవంద్యుడ! చెన్నకేశవా!    54

ఉ. తొందరపాటుతోడ మది తోచక నోటను మాట జారినన్

       పొందును బాధలెన్నొ భువి పొందగ తప్పవు నేరికైననున్

       మంధరకిచ్చి పొందె కద మానక రాముని తండ్రి కష్టముల్

       ఎందును దాగినన్ వదలకేడ్పును గూర్చవె చెన్నకేశవా!      55

ఉ.     కాసులు కాంత సత్యమని కాటికి చేరెడుదాక నాశచే

       మోసము చేయుచున్ తిరుగు మూర్ఖులకెల్లగచాట్లు దప్పునే

       మోసము జేసి రావణుడు మూర్ఛిలె రాముని బాణధాటికిన్

       బాసను జేసి చెప్పితిని బాగుగ దెల్పుము చెన్నకేశవా!        56

ఉ.     సారధివైతివర్జునకు సాయము జేయగ పోరునందు నా

       కౌరవదుర్మధాంధులను కాటికి పంపగ ముందు నిల్చి నీ

       ధీరత చాట జేసితివి ధీమతి గీతను బోధజేసి నా

       భారము బాపరావు గద పాపమదేలనొ చెన్నకేశవా!         57

చం.   చొరబడు నన్నికష్టముల చోద్యమటంచును జూడ బోక నో

       పరమదయాసముద్ర! భవబంధవిమోచన! పాహి యంచు నిన్

       నిరతము నీదు నామమును నీమము నా రసనాగ్రమందునన్

       తిరముగ పల్క జేసి నను తీరము జేర్చవె చెన్నకేశవా!        58

ఉ.     గాలికి వానకున్ సతము కష్టము జేసిన పాలికాపుకే

       యాలికి రైక గుడ్డలకు యాతన జెందగ వచ్చెనే ప్రభూ!

       చాలిక రైతుజీవనము చల్లని నీ కరుణామృతమ్ముతో

       పాలన జేయుమయ్య భువి పావనమూర్తివి చెన్నకేశవా!     59

ఉ.     విఘ్నము జేయుచున్ నరులు విశ్వమునందున నన్నికార్యముల్

       విఘ్న మవిఘ్నమస్తనుచు విఘ్నవినాయకు వేడగ న్సదా

       విఘ్నము జేయనాతనికి విశ్వముపై గల ద్వేషమేమిటో

       విఘ్నము జేయుమా జనుల వింత కుచేష్టల చెన్నకేశవా!    60

ఉ.     ప్రాకటమైనదంత గన పావనమౌ పరమాత్మ రూప నీ

       యాకృతి యంచెరింగియును నర్చన జేసిన పూర్వకాలమం

       దా కలుషమ్ములెల్ల చని యాగని కష్టములెల్ల బాయగా

       శోకము బోనడంచెదవు సూక్ష్మమెరింగిన చెన్నకేశవా!      61

ఉ.     ప్రాణులనెల్ల జంపుచును పాపము బోవునటంచు జేరి నీ

       యాలయమందు నున్న నిను నర్చన జేసిన నాగ్రహింపకన్

       కాలుని పాఱద్రోలుదువె కానగ భక్తులు వీరు నాకట

       న్నేలనొ వెఱ్ఱి మానవులె యిట్లు నటింతురు చెన్నకేశవా!    62

ఉ.     దారువునందు నగ్నివలె దాగిన రీతిగ ధాత్రినంతటన్

       క్షీరమునందు నాజ్యమది క్షిప్తముగా కనిపించనట్లుగన్

       సౌరభమబ్బి యా కుసుమసారము నెల్లెడ సొంపు గూర్చగా

       సారము నీవె కావ భువి సజ్జనకీర్తికి చెన్నకేశవా!             63

ఉ.     చిత్రపు దర్శకేంద్రు గని చిత్తమునందున గంతులేయుచున్

       చిత్రపు జీవనంబునవి చిత్రపు దర్శకుడైనవాని సత్

       చిత్రము జూడలేక కడు ఛిద్రమునొందిరి జీవితాన నీ

       చిత్రము జూడనిన్విడచి చిత్తము బోవున చెన్నకేశవా!         64

చం.   మమతను వీడక న్నరులు మాయను గెల్వగ సాధ్యమౌనె తా

       సమతను గోరి బుద్ధిగను సద్గురుచే నుపదేశమందినన్

       కుమతియు నైన గాని మృదుకోమలతత్వము పొందు నిప్పుడే

       సుమతిగ వెల్గు తక్షణము క్షోణితలంబున చెన్నకేశవా!       65

చం.   మలినములేని జీవనము మాన్యుల జేయును లోకరక్షకై

       సలుపుము సత్యధర్మపథ సాత్వికపాలన నెల్ల ప్రాణులన్

       నిలిపెద వీవు నెల్లపుడు నిత్యుడవై వెలుగొందు తారగా

       బలి శిబి చక్రవర్తులిల భాసిల గానరె చెన్నకేశవా!            66

చం.   తలుపులు మూసినింట బడి దారియు దిక్కు నెఱుంగనట్లుగా

       తలపుల మాటునన్ త్రివిధ తాపములందున జిక్కనేల నో

       తలపులు నాగినంత తనుదానయి తోచును తథ్యమిద్ది తా

       నలసట జెందనేల నిక ధారుణి యందున చెన్నకేశవా!      67

ఉ.     ఉద్యమకారు లెల్లరకు నూపిరి నిచ్చిన శక్తిదాతవై

       పద్యములల్లగాను కవి పండితవర్యుల జ్ఞానరూపమై

       విద్యలకెల్ల నొజ్జయగు విఘ్నవినాయక గుజ్జరూపమై

       సద్యశమిచ్చి బ్రోవ గదె చక్కగ వారల చెన్నకేశవా!          68

ఉ.     పాడెద నీదు గానమును పారవశమ్మున తోడిరాగమున్

       వేడుక జూడగా జనులు వేదికయందున రామనామమీ

       తోడుగ జెప్పుచున్న నను తోయకు మీభవసాగరమ్మునన్

       వీడను నీదు పాదముల వేదవిదోత్తమ! చెన్నకేశవా!          69

ఉ.     విద్యను నేర్పు నుత్తములె విత్తపుటాశను బానిసత్వమై

       మద్యము నమ్మ శిష్యులకు మాన్యు లటంచును బల్క వచ్చునే

       బాధ్యత లేని వారలిల భారతమాతకు సిగ్గుచేటుగా

       సాధ్యమె యిట్టి వారు భువి సద్గురులౌటను చెన్నకేశవా!     70

ఉ.     గుండెల సానుభూతి యది గుట్టలునుండిన నేమి లాభమౌ

       గుండెను చీల్చి దాటి కడు గోసను బొందెడువారి బాధల

       న్నండగ నిల్తు నేననుచు నాశ్రయమిచ్చిన చాలదా ధృతిన్

       దండగ గాదె వారిటుల ధారుణి నుండిన చెన్నకేశవా!        71

చం.   నదులను మున్గినంతటనె నాశనమౌనని తొల్లి పాపముల్

       ముదమున మున్గ బోవుదురె మూర్ఖులు సత్యము గానలేరు నీ

       పదములె నమ్మి వేడితిని పావనగంగవు నున్నతావునే

       సదమలభక్తి గొల్తు నిను సద్గతి నీయవె చెన్నకేశవా!         72

ఉ.     ఎవ్వని పేరు సోక చెవికింపును గూర్చునొ వానినే నుతిం

       తెవ్వని రూపు గన్న కనులెవ్వని జూడగ కోరకుండునే

       యెవ్వని దృష్టి సోక రజనిమ్మహినంతయు బాసిపోవునో

       యెవ్వని సంగతంబు నివి నేర్పడు దెల్పుము చెన్నకేశవా!    73

ఉ.     కొందరు గుళ్ళలోపలను కొందరు జూడగ గుళ్ళమెట్లపై

       నందర నడ్గుకొందురిల నందురు కొందర బిక్షగాళ్ళట

       న్నందరు బిచ్చగాళ్లె కద యడ్గుట యందున భేదమే కదా

       యందరికండ నీవె కద యండజవాహన! చెన్నకేశవా!      74

చం.   శిలకును రూపమిచ్చితివి శిల్పిగ నీమహిమెన్ననౌనె నా

       తలపున నెల్లవేళలను దల్చగ జేయుము తారకంబునన్

       కల నిను గాంచనిమ్ము నను కల్లయు గాదు నిజమ్మునొట్టు నీ

       వలపున జేరనిమ్మికను వర్ధిల నన్ భువి చెన్నకేశవా!         75

చం.   శతకములెన్ని వ్రాసినను సత్కవి యన్న పదంబు దప్ప నే

       పతకములెన్ని బొందినను పాపపు కర్మచయంబు దొల్గునే

       సతతము రామతారకపు సారము గ్రోలిన మానసంబునన్

       బ్రతుకున కర్థమిచ్చి పరమార్థము దెల్పవె చెన్నకేశవా!       76

చం.   చదువగలేదు శాస్త్రములు సద్గురుదేవుని ఙ్ఞానదీప్తిచే

       కొదువ యొకింత లేకయును కోరిన రీతిగ పద్యభావముల్

       అధరములందు గంగ ప్రవహంబుగ నీకృప జాలువారగా

       ముదమున వ్రాయ జేసితివి మోక్ష ప్రదాయక! చెన్నకేశవా! 77

ఉ.     నిండుగ నామనంబునను నీరజలోచన! ప్రాణికోటికిన్

       దండిగ సంపదాళి నిడ ధారుణి పొందగ భోగభాగ్యముల్

       మెండుగ నిచ్చి బ్రోవగదె మేలు భళా యని సంతసింపగా

       పండగ గాదె లోకమున ప్రాణులకెల్లను చెన్నకేశవా!         78

ఉ.     వేకువతోడ లేచి మది వేసటనొందక వేడ్క మీరగా

       శ్రీకరమొప్పగా సుతుల శ్రీపతికిన్ మరి యత్తమామకున్

       చాకిరి చేయుచున్ గృహము చక్కగనుంచెడు దేవి యున్న నా

       వాకిట శోభ నేమనగ వశ్యమె దెల్పుము చెన్నకేశవా!        79

చం.   చదువులతల్లి వాణి కడు చల్లని చూపులు మేను సోకగా

       పదముల మ్రొక్కి యామె దయ పద్యములల్లగ బూనితిన్ మదిన్

       ముదముగ సాగ జేసి మది మోదమొసంగగ నిల్చి నాయెదన్

       సదమలభక్తి గొల్తు నని సన్నుతి జేసెద చెన్నకేశవా!          80

ఉ.     శ్రీలను మించు ఙ్ఞానమును శీఘ్రమొసంగెడు శారదాపతిన్

       శ్రీలను గూర్చు లక్ష్మికిని శ్రేయమొసంగెడు శేషశాయికిన్

       శ్రీలయకారశంకరుని శ్రీసతులిర్వుర గంగ గౌరికిన్

       శ్రీల సుమంబులన్నిడిదు చేకొను మింపుగ చెన్నకేశవా!     81

చం.   యమనియమాది యాసనములన్ గొని మానసమున్ జయించు నా

       క్రమమున కామ క్రోధ మద మత్సరముల్విడనాడి చిత్తమున్

       భ్రమ యను మోహవారధిని బాయగ జేసిన నిన్ను జేరగా

       నిమిషము చాలదా జగమనిత్యమటందును చెన్నకేశవా!    82

చం.   నను పరులెంత దూరినను నవ్వుచు ముందుకు సాగిపోతినే

       నిను మది నమ్మినాడ నను నీటను ముంచిన పాల ముంచినన్

       తనువు నశాశ్వమ్మనుచు త్వత్పదసన్నిధి జేరనెంచు నా

       మనవిని నాలకింపుమయ మంగళదాయక! చెన్నకేశవా!  83

ఉ.     ద్వాపరమందు కృష్ణునిగ ద్వారకలోన జనించి యేగి యా

       గోపకులాన నందునకు కూరిమి తోడ యశోద పట్టివై

       తాపసు లెవ్వరుం గనని తన్మయ మొందగ జేసితీవె నా

       తాపము దీర్చి వేగ భవ బంధము ద్రుంచవె చెన్న కేశవా!   84

చం.   శివునకు పాలతోడ నభిషేకము జేయుచు కన్నవారికిన్

       చవిగొన గ్రుక్కెడైన నిడ జాలరు భక్తి యటంచు బల్కు మా

       నవులకు సాధ్యమౌనె భువినంతము నాదియు లేని వానినిన్

       ప్రవిమలబుద్ధి లేక గన వచ్చునె దెల్పుము చెన్నకేశవా!      85

ఉ.     అన్నలమిన్న యంచు జనులందరు నిన్నొకరీతి గొల్వ సం

       పన్నులె జూడగా పరమ భక్తులటంచు ననుగ్రహింతువా

       పన్నులనేల దుర్గతుల పాలొనరించుట నీకు న్యాయమా

       యన్నవు నీవె యంటి హరి! యన్యమెరుంగను చెన్నకేశవా!86

ఉ.     మండలదీక్షలున్ సలిపి మాలను దీసిన తక్షణంబు తా

       మెండుగ మద్యమాంసములు మెక్కుచు నావల హింస జేయుచున్

       కొండల కోనలన్ దిరిగి కోవెలలన్ దరిశించినంతనే

       గండము దప్పునే జనులు గంగను మున్గిన చెన్నకేశవా!    87

ఉ.     కంటిని నేనటన్నొకడు కాదని వాదన చేయునొక్కడున్

       వెంటనె పల్కునొక్కడు నివేదన జేసితినిప్పుడే యనున్

       వింటిని మాటలన్నొకడు వేదికలన్ ప్రవచించుచుండ నే

       నంటను వాదనల్ మదిని నార్తిగ గొల్చెద చెన్నకేశవా!      88

ఉ.     విత్తము లేమియున్ ఘనవిభేదవిపత్కరమొందజేసి సం

       పత్తియె తొల్గిపోయినను పట్టెద నీపదపద్మయుగ్మమున్

       మిత్తియె దాపురించినను మేదిని నీమధురానురక్తిచే

       చిత్తమునందునన్ గొలువ జేయుము మానక! చెన్నకేశవా! 89

ఉ.    కంటిని నీదు మోము కలగంటిని నీదగు చిత్సరూపమున్

       కంటిని విశ్వరూపమును కంటిని చిత్రపు చిద్విలాసమే

       యంటిని నండపిండముల నంతట నీవని యన్యమేమి లే

       దంటిని నీదు రూపము యథార్థము జూపవె చెన్నకేశవా!   90

ఉ.     చంచలమైనదీమనము చక్కగనుండదిదొక్కచోట జూ

       పించిన నీదు తేజమును ప్రేమగ జూచుచునుండునేమొ నా

       సంచితమేమొ నేనెరుగ సందియమున్మదిదీర్చినన్ పటా

       పంచలు గాదె మాయ చను ప్రజ్ఞ నొసంగవె చెన్నకేశవా!    91

ఉ.     నిద్దుర లేవగన్ మొదలు నిన్ను దలంచగ జేయుమయ్య నన్

       బుద్ధివిహీనుడన్ వదలబోకుము దిక్కెవరయ్య నాకు నా

       ముద్దుల చిన్నినాయనవు ముగ్ధమనోహర! పాహిపాహి నీ

       కిద్దియె ధర్మమా యిటుల క్రీడగ నాడుట చెన్నకేశవా!        92

చం.  గురుడన గోప్యమైన హరి గుట్టును దెల్పెడివాడటoచు నీ

       నరులెఱుగంగ నెట్టులనొ నాయువు చూడగ బుద్బుదంబుగా

       కరములు మోడ్చి మ్రొక్కెదను కాలము దుర్భరమయ్యె మ

       మ్మరలగజేయుమయ్య గురు మాధవు జేరగ చెన్నకేశవా!    93

చం.   శబరినిగాను నేను ఫల సారరసమ్ముల గ్రోల జేయగా

       గబగబ లంక జేరి ఘనకార్యము జేయగ హన్మ గానుగా

       ప్రబలగ పోరు సల్పగను పక్షి జటాయువు గాను నేను నీ

       యబలుని నేలుకొమ్మిక సహాయవిదూరుడ చెన్నకేశవా!    94

ఉ.     నీకనుదోయికిన్ జగము నిత్యమటంచును దోచు నేకమై

       రాకలు పోకలే గనిన రంజిల జేసెడు దాని జూడగా

       శ్రీకరమొప్ప సద్గురుని చెంతన జేరగ వీడజేయు నా

       చీకటియే! వెలుంగునిడు జీవిత మిద్దియె చెన్నకేశవా!        95

ఉ.     గూడది కూలుటొప్పుగను కోట్లు గడించిన రాజ్యమేలినన్

       ఱేడనిచూడడాయముడు నిక్కడనే క్షణముంచబోడుగా

       మేడలు మిద్దెలన్నియును మిథ్య యటంచును జీవితమ్మునన్

       వీడి చరించినన్ గలుగు వేగమె మోక్షము చెన్నకేశవా!     96

చం.   కులమత భావనా రహిత కోమలమైన విశాలబుద్ధియున్

       కలిగిన నైననొక్క క్షణకాలమునన్ విడదీయగా మదిన్

       పలికిన చాలదా పరుష వాక్కది రూపము లేని బాణమై

       కలహము రేపి తత్క్షణము కాటికి పంపదె చెన్నకేశవా!      97

చం.   తలపున తల్లిదండ్రులను దైవసమాను లటంచు నెంచకన్

       పలుకుల గ్రుచ్చి గ్రుచ్చి కడు బాధల పెట్టుచు నత్తమామలన్

       కలతలు రేపుచున్ జనులు గాంచగ జేసిన సేవలెల్ల ని

       ష్ఫలమని చెప్ప వేదముల భావమెరుంగరు చెన్నకేశవా!    98

చం.   బ్రతుకది భారమైన భగవంతుని దిట్టగ పాడి గాదుగా

       హితమును గోరలేక మితిమీరిన సంపద గోరి లుబ్ధులై

       మతిచెడి మందబుద్ధులిల మంచిని గానక పల్కుచుందు రే

       కతమున నిన్నెరుంగుదురొ గానగ నైతిని చెన్నకేశవా!        99

ఉ.     ధీరుడనంచు పల్కతగదెవ్వరికైనను వేది పైన నా

       తీరుగ నేకధాటిగను దీర్చ సమస్యలు దీరిపోవు నీ

       ధారుణి జీవితమ్మొక వధానము జూడగ కాపురమ్ములో

       పూరణ జేయువాడెపరి పూర్ణుడు నెన్నగ చెన్నకేశవా!       100

ఉ.     పాడయె దేశ సంస్కృతులు పాపపు కార్యములెక్కువయ్యె మా

       టాడగ హద్దులేదు పరిహాస మొనర్తురు పిన్నపెద్దలన్

       వీడుచు దైవభీతి కనుపించదె యించుక నీతి కాని నిన్

       వేడితిమయ్య మాన్పగను వేగమె రాగదె చెన్నకేశవా!       101

ఉ.     అన్యులమీద దాడికిని హత్యలు జేయగ దూరముండు తా

       కన్యను జూడ కన్నతలిగా మది యందునఁ దల్చువాడు రా

       జన్యుడు వాడెపో ప్రజలు సాయము గోరగ నేగువాడెగా

       ధన్యుడు పూజ్యుడున్ ధరణి దైవసమానుడు చెన్నకేశవా!   102

చం.   సుదతి సమర్థురాలు సుతులున్నతమౌ గుణవంతులుండగా

       ముదమున కోర్కెలన్నిటిని ముద్దుగ దీర్చెడి కోడలుండగా

       కదలకనున్నచోట హరి గానసుధామృతసాగరమ్ములో

       ముదముగ సాగదా బ్రతుకు మోహము వీడిన చెన్నకేశవా!         103

ఉ.     అన్నుల మిన్న రూపమున నాశ్రితపక్షపరాత్పరుండు దా

       నెన్నగ పాలనన్ పుడమినెల్లరు సౌఖ్యము పొందు రీతి నా

       పన్నుల బ్రోచునట్టి రఘువంశసుధాంబుధిరత్నమైన రా

       మన్నను గొల్చువారె కద మౌనులనంగను చెన్నకేశవా!    104

ఉ.     భావమునందు నిన్ దలచి పాయక నానల సోమనాద్రియున్

       బ్రోవగనెంచి నీప్రజల పూనికతో గదవాల ప్రాంతమున్

       భూవరు జేసె స్థాపితము భూరిగ నీకును దేవళమ్ములున్

         కోవెలదిన్నె గ్రామమున కూరిమితోడుత చెన్నకేశవా!             105

3.కవితాలహరి

4. సమస్యా పూరణం

5.ముక్తిపథం[3].

సకలదేవతా ప్రార్థన

కం. శ్రీకర! శుభకర! భవహర!

     శ్రీకర! యో భక్తవరద! శ్రితజనపాలా!

     శ్రీకర! యో పాపహరణ!

     శ్రీకర! యో వేంకటేశ! శ్రేయంబిడుమా!

కం. యదుకుల భూషణ కృష్ణా!

     మధుసూదన! యో మురారి! మాధవ! శౌరీ!

     బుధజనమానసచోరా!

     మధురాధిప! భక్తవరద! మమ్మేలుమయా!

కం. పలికెద నీపదములనే

     కొలిచెద నీ చరణములను కూరిమితోడన్

     తలచెద మనముననెప్పుడు

     తిలకించుము నాదు మొరను తీర్చుము వాణీ!

కం. శంకరభగవత్పాదుల

     కంకితముగ ముక్తిపథము కానుకనిత్తున్

     శంకరునద్వైతం బక

     ళంకముగా తెలిపె జగతి లౌక్యపురీతిన్!

కం. కరివరదా! మరిమరి నిను

     పరిపరి విధముల పిలిచిన పలుకవె రామా!

     మొర విని సరగున కరుణను

     పరుగున నను బ్రోవ రావె పావన నామా!

కం. అణువణువున పరతత్త్వపు

     గణనీయంబైన దాని ఘనతను దెల్పెన్

     ప్రణమిల్లెద నేనిప్పుడె

     గుణరహితుని బ్రహ్మయార్య గురుదేవులకున్!

కం. అమ్మా! ముక్తిపథమ్మను

     కమ్మని పొత్తమును వ్రాయ కరుణించితివే

     రమ్మా! చేకొను భారతి

     సమ్మానము జేతు నీకు! శతవందనముల్!

కం. అంజని పుత్రా! హనుమా!

     రంజిల్లగ బ్రోవ రావె రాముని దూతా!

     మంజుల మృదుభాషిత! నే

     నంజలి ఘటియించి నిన్ను నర్చింతు మదిన్.

కం. సాయీ! ద్వారకమాయిని

     బాయక సకలము నొకటని భాయీ భాయీ

     హాయిగ సహజీవనమున

     డాయక దెల్పితివి బ్రతుకు డని మహి సాయీ!

కం. దండమయా సర్వేశ్వర!

     దండమయా సకలపాప దమన! ముకుందా!

     దండమయా స్థితి కారక!

     దండమయా నీకు నెపుడు దండము రామా!

కం. శివశివ! శంభో శంకర!

     భవహర! భయపాపనాశ! భాగ్యప్రదాతా!

     భవభంధ మోక్ష కారక!

     ధవళాచలవాస! నన్ను దయ జూడుమయా!

కం. పరమును పొందెడు మార్గము

     ధర జనులకు దెల్ప గోరి తలచుచు నిన్నున్

     సరళముగ వ్రాయ బూనితి

     మొరవిని జ్ఞానమ్మునొసగు ముదముగ వాణీ!

కం. శరణము శబరిగిరీశా!

     హరిహర పుత్రా! సుగాత్ర! అభయప్రదాతా!

     శరణంటిని నను బ్రోవగ

     శరణము కరుణాలవాల! సరగున రావా!


ముక్తిపథము (జీవ శతకము)

1.         శ్రీకారమునే జుట్టితి

ప్రాకారము లేక పుడమి బయలగు దానిన్

భీకరభవసాగరమున

ప్రాకటముగ జనులు ముక్తి బడయగ జీవా!

2.         భేదంబునెంచ మనమున

ఖేదంబును కలుగ జేసి ఖిన్నుల జేయున్

భేదంబు తొలగ జేసిన

మోదంబును గూర్చనదియె ముక్తియె జీవా!

3.         ప్రణవంబు నెఱుగకున్నను

రణమే యీ జీవనంబు రంజిల గోరన్

అణువణువున పరికించుచు

గుణరహితుండైనవాని గూడుము జీవా!

4.         అహమును వీడిన జనులకు

నిహపరసౌఖ్యములు రెండు నిహమున గల్గున్

మహిలోన ముక్తిపథమదె

రహితోడ వెలుగు సతతము రవివలె జీవా!


5.         బొమ్మలవలె నాడించుచు

నిమ్మహిరూపంబు నామ మేమియు లేకన్

కుమ్మరి పురుగు విధంబున

నెమ్మనమున నున్నదాని నెఱుగుము జీవా!

6.         ఆదియు మధ్యము నంతము

నేదియు గానట్టి నిన్ను నెఱుగక లేకన్

నాదియు నాది యటంచును

మేదిని నిను గానలేవు మేల్కొను జీవా!

7.         కలయందు కలవు నీవే

కలవే జాగ్రత్త యందు గాంచగ నీవే

కలవే సుషుప్తి యందున

కలదానిని గాంచ ముక్తి గలుగున్ జీవా!

8.         మతముల మర్మము నెఱుగక

సతతము వాదించెదీవు సత్యము గనకన్

హితముగ నిను నీవెఱుగక

గతి లేదుర ముక్తి నీకు గనుమో జీవా!

9.         మనసన్నది యల వోలెను

కనగ నొక ఘడియ వచ్చి కలియున్ కడలిన్

అనయమునుండెడి కడలిని

కనగలిగిన వాడె ముక్తి గాంచును జీవా!


10.       కాయము తిరమని నమ్మక

పాయము నిను మ్రింగివైచి పాతరబెట్టున్

ఆయువుగల దినములలో

పాయక నిన్నెఱిగి ముక్తి బడయుము జీవా!

11.       ద్వైతాద్వైతముగాక

న్నేతారక సాంఖ్య మచల మేదియు గాకన్

జాతికులమ్ములు లేకను

భూతలమున పూజ్యనీయ పురుషుడు జీవా!

12.       తలపగ జీవా యొకచో

నెలవన్నది లేక విశ్వమెల్లను నీవే

గలవని సద్గురువు దెలుప

కల మెలకువలందు గాక గనుమా జీవా!

13.       ప్రజ్ఞానము బ్రహ్మంబని

సుజ్ఞానులు దెలుపునట్టి శృతులను వినుమా

యజ్ఞానపు పొరలు దొలగ

సుజ్ఞానపు బ్రహ్మమీవె జూడుము జీవా!

14.       శంకరు నద్వైతంబును

శంకయు మదినింత లేక సత్యము గనినన్

కింకరు నెదిరించ దగును

సంకటములు దరికి రావు సత్యము జీవా!


15.       అర్థముగావొరులకు పర

మార్థపు నైజమ్ము నెఱిగినట్టి జనులికన్

వ్యర్థమని త్రోసిపుచ్చిన

పార్థునివలె పొందగలరు పరమును జీవా!

16.       కర్తయు కర్మయు గాకను

వర్తనమే లేని నీవు వసుధను గరిమన్

నర్తింపజేసితివి ఘన

మూర్తివి నిన్నెఱిగినపుడె  మోక్షము జీవా!

17.       తిరిగెదవు తీర్థయాత్రలు

మరిగితివే మానసమున మరి కోర్కులకున్

తరగవునెన్నటికవియును

సరగున నీ గమ్యమెఱుగు సత్యము జీవా!

18.       బంధము విషయమెఱుంగ సు

గంధమువలె పరిమళించు సుజ్ఞానమదే

అంధత్వము తొలగించును

బంధుత్వము బ్రహ్మతోడ బలపడు జీవా!

19.       చీకటి వెలుగులు కాకను

లోకంబులు వెలుగజేయు లోకేశ్వరుడా

సాకారుండగు జ్ఞానికి

చీకాకులు దొలగజేయు శీఘ్రమె జీవా!


20.       దేహికి దేహము భేధము

సోహంభావమున దెలియు సుఖమును బొందున్

మోహము వీడుచు ముక్తిని

దేహము విడనాడి జూడు ధీగతి జీవా!

21.       హితమెరిగి తెలుసుకొన్నను

మతిమంతుడవౌదువీవు మహిలో జూడన్

వెతలను కొని దెచ్చుకొనిన

వెతికిన ఫలమేమి లేదు వినుమో జీవా!

22.       తెలిసితినని గర్వించకు

దెలుపగనిల నెవరు గలరు దీని నెరుగుమా

దెలియగ నీవే సర్వము

తెలివికి మూలంబగు నిను దెలియుము జీవా!

23.       గుణముల నవరోధంబును

గణుతింపక వానిదాట! ఘనమగు నీవున్

నణువైన సూక్ష్మరూపము

ఘనమై బ్రహ్మాండమెల్ల గనదగు జీవా!

24.       పాలను గలసిన నీటిని

పాలని భ్రమచెందినట్లు పరికింపంగన్

పాలగల నీటి నెరిగెడి

యా లక్షణ మెరుగు పరమహంసవు జీవా!


25.       ఇందుగల డందులేడని

ముందుగ పోతన్న దెలిపె! పొందుగనీవున్

సందేహము విడి కనుమా

సుందరమౌ గనినదెల్ల శూన్యము జీవా!

26.       అణువణువున కణకణమున

మణిహారమునందు దార మగుపడనటులన్

గుణరూపరహితమగు నిన్

గణుతింపగ వశమె బ్రహ్మకైనను జీవా!

27.       చదువులతో దీనర్థము

విదితము కాబోదునెపుడు వివరింపంగన్

పదిలముగ నంతరంబున

కదిలించెడుదాని నిన్ను గనుమో జీవా!

28.       అనుటకు వినుటకు గనుటకు

చనుటకు చనరాని చోట్ల చైతన్యంబున్

నిను నీవు తెలియవలెనన

ఘనమగు ప్రజ్ఞానమదియె కనుమో జీవా!

29.       వెన్న తనచెంత నుండగ

తిన్నగ ఘృతమునకు తాను తిరిగిన రీతిన్

ఎన్నటికి నెరుగ నేర్తువె

యన్నా నిన్నెరుగకున్న వ్యర్థము జీవా!


30.       ఆభరణములకు జూడగ

ప్రాభవముగ మూలమొకటె బంగారమ్మే

యీభంగి సత్యమెరిగిన

శోభిల్లెడు నిన్ను నీవు జూతువు జీవా!

31.       సాగరమున జలము నిజము

వేగిరమున నలలు వచ్చి వెనుకకు బోవున్!

ఈగతి కల నిజము లెరుగ

నీగడబిడలన్ని బోవు నిక్కము జీవా!

32.       సత్వరజస్తమము లనెడి

తత్వమునకు నావలున్న తత్వమసీ నిన్

సత్వరమెరిగిన దోచు మ

హత్వపు నిర్గుణము దాని నరయుము జీవా!

33.       చదువులతో కొనలేనిది

పదవులతో పొందలేని పరమపదంబున్

ముదమార గురుని జేరగ

సదమలమగు దాని దెలుపు సత్యము జీవా!

34.       కులమతమనునది గన వ్యా

కులమౌనే గాని నిన్ను గూలగ జేయున్

నలయక నిజమునెఱింగియు

కులమతరహితంపు దాని గూడుము జీవా!


35.       నేనను నీవను బేధము

మేనునకే కాని నీకు నిసుమంతైనన్

ఈనేల నింగి సాక్షిగ

నీ నిజతత్త్వంబు నొకటె నిత్యము జీవా!

36.       క్రుంగక నిందాస్తులకు

పొంగక స్థితప్రజ్ఞుడనుచు పొందుగ దెలిపెన్

హంగులకు బోవ దగదుర

రంగులలోకమ్మునందు రహి చెడు జీవా!

37.       యుక్తాయుక్తము గాకను

ముక్తికి ప్రతిరూపమీవె మూలము నీవా

సక్తిగ నిను నీవెరిగిన

శక్తియెనది యొకటి నీవు సత్యము జీవా!

38.       భోగానుభవము వీడక

యోగానుభవము కలుగదు యుగయుగములకున్

ధీగతి నాగురు జేరగ

యోగము గుఱుతెరుగజేయు నుర్విని జీవా!

39.       జలజమున నీటి బిందువు

వలె దేహమునందు నంటి యంటక యుండీ

యిల భవసాగరమందున

విలసిల్లెడు విధము నెఱిగి విడివడు జీవా!


40.       కారే నీకెవరు జగతి

లేరెవ్వరు నీవు లేక లేదీజగతిన్

క్షీరమున ఘృతము వలె నీ

తీరుగ నిను గన్నయపుడె తెలియును జీవా!

41.       కదలక మెదలక యంతట

గుదిగొని తానున్న తావు గుర్తెరుగ మదిన్

సదమల మూర్తివి నీవే

పదిలంబగు పరమపదము వశమగు జీవా!

42.       ఖేదము మోదము లేనిది

వాదమ్ములు గాక బేధ భావములేక

న్నాదియు నంతము లేకను

నాదమ్మును గాని దాని నరయుము జీవా!

43.       ఎవరవు? నీ యూరెయ్యది?

ఎవరని యడిగెదవు నీకు నెదురుగ రాగన్

వివరంబెరిగిన నీవే

యవగతమౌనదియె నీవు నదిగను జీవా!

44.       శకునములు గ్రహము లనుచును

నికరంబుగ దిష్టి యనుచు నిల దుడిపెదవే

సకలమున కావలం గల

యకలంకంబైన నిన్ను నరయుము జీవా!


45.       పలురంధ్రమ్ముల ఘటమున

వెలిగెడు దీపంబువోలె వెలిగెడు నిన్నున్

ఇల నవ రంధ్రమ్ములు గల

కలుగనెడు కాయమున నిను గనుమో జీవా!

46.       అందరు నీ రూపము గని

బృందముగా చేరి పూజ ప్రియముగ జేయన్

సుందరమగు నీరూపము

అందంబున వెదుక జూతువజ్ఞత జీవా!

47.       అవయవములు గనవేమియు

భువనమ్ముల‌నేలుచుందువో మహనీయా!

స్తవనీయంబగు దానిని

ప్రవిమలమతివై సరగున బడయుము జీవా!

48.       ఇది యది యని చెప్పగ రా

నిదియౌ దానిని నెరిగిన నిక్కము ముక్తిన్

పదిలముగ పొందగలవే

సదమలమగు నదియె నీవు సత్యము జీవా!

49.       అంతట నీవే గాంచిన

సుంతయు మరి యేది లేదు శోధింపంగన్

వింతగ నేనను యహమును

పంతము విడనాడి నిన్ను బడయుము జీవా!


50.       తెలిసితినని పలికెదవే

తెలియగ నీకన్న నన్య మేదియు లేదే

తెలుప నెదుట నెవరు గలరు

యలరారెడు వెలుగు నీవె యది గను జీవా!

51.       అన్నయు తమ్ముడు తల్లియు

నాన్నయు మరి యక్క చెల్లి నానారీతుల్

ఎన్నెన్ని వరుసలో గద

నెన్నగ మూలంబు నీవె నిజముగ జీవా!

52.       జీవాత్మకు పరమాత్మకు

భావమ్మే భేదమొకటి పరికించినచో

భావాతీతుడు దేవుడు

భావసహితమనగ నీవె బడయుము జీవా!

53.       అందరి యందున గల నిను

సందియమును వీడి సత్యసారమెరిగినన్

పొందెదవానందంబును

బృందావనమౌను బ్రతుకు ప్రియముగ జీవా!

54.       ఆకారమేమి లేకను

చీకాకులు లేక, చింతలు లేకన్

లోకాలనెల్ల నేలెడు

ప్రాకటముగ శక్తి నీవె బడయుము జీవా!


55.       కులమని మతమని యెప్పడు

కలహించిన నిన్ను నీవు కానగ వశమే

కులమతరహితంబగు సద

మల మూర్తివి మాయ దొలగ మహిలో జీవా!

56.       రణమునఁ బోరిన రీతిగ

గుణముల మూటిని జయించి గుణరహితుండై

అణువైన సూక్ష్మరూపము

క్షణమునఁ జూడంగవచ్చు సత్యము జీవా!

57.       కన్నది విన్నది యేదియు

నెన్నగ సత్యంబు గాదు నింగిని నేలన్

మిన్నగ నిండిన దానిని

గ్రన్నన జ్ఞానమ్ముతోడ గనుమోజీవా!

58.       తను మన ధనముల మూటిని

వినయముగా సద్గురునకు వేగమె యిడుమా

గనుమా యావల నిజమగు

ననిశము వెలుగొందుదాని నరయుము జీవా!

59.       మైలని తాకగ వెఱతువు

మైలయె మరి కారణంబు మహి జన్మలకున్

మైలన్నది మనసునకే

మైలను విడనాడి యెఱుగు మహిలో జీవా!


60.       పదిరెండు వత్సరములకు

నదులకు పుష్కరమురాగ నానా యఘముల్

పదిలముగ తొలగుననుచును

ముదముగ నానదుల మునుగ పోవునె జీవా!

61.       గాలికి నీటికి నగ్నికి

నేలకు నింగికిని లేవె యేభేదమ్ముల్

నీలో కలవెందుకు కలి

కాలమ్మో కర్మఫలమొ గనుమో జీవా!

62.       కదలక మెదలక నుండియు

కదిలించును జీవరాశి గణములనెల్లన్

కదిలించు దానినెఱిగిన

పదిలముగా నబ్బు ముక్తి పథమది జీవా!

63.       జీవునకును దేవునకును

భావము భేదమ్మునొకటె పరికింపంగన్

భావాతీతుడు దేవుడు

భావము విడనాడి నిన్ను బడయుము జీవా!

64.       సమరము జేయుము మమకా

రము గుణముల నరుల ద్రుంచి రంజిల్లంగన్

భ్రమ యనెడు మబ్బుతెరవలె

తిమిరముఁ దొలగించి నిన్ను దెలియుము జీవా!


65.       సన్యాసిని నే ననియని

అన్యాయము జేసి జనుల నాపదలందున్

దైన్యుల జేసియు వారిన్

ధన్యతనొందంగ తరమె ధరణిన్ జీవా!

66.       స్నానము సంధ్యల జపముల

కానలకేగినను గాని గన జాలవుగా

మేనున నేనను భావము

మానసమును శుద్ధి జేసి మరి గను జీవా!

67.       కల్లయె లోకంబనుచును

ఉల్లమునను నమ్మి నిజము నూహించినచో

మెల్లగ దోచును మనమున

నెల్లలు లేనట్టి నిన్ను నెఱుగుము జీవా!

68.       వాదము ఖేదమొసంగును

వాదముతో నిశ్చలతకు భంగము కలుగున్

వాదమ్ము‌నకావల గల

వాదము విడనాడి నీవు వరలుము జీవా!

69.       నిద్దుర మెలకువ లేకను

ముద్దుగ నీజగతినెల్ల మోహమునందున్

ఇద్ధర మునుగన్ జేసిన

శుద్ధ పరాత్పరుడవీవు జూడుము జీవా!


70.       కలదని గర్వంబు వలదు

కలదని యనుకున్నదెల్ల కల్లయె జూడన్

కలదా‌నికావలం గల

వెలుగై యలరారుచుండు వినుమో జీవా!

71.       దేహమె దేవాలయమని

దేహమునందున్నవాడె దేవుండనుచున్

బాహటముగ దెలిపె శ్రుతులు

దేహమునన్ గనుము దేశదిమ్మరి జీవా!

72.       ఇందు గల డందు లేడని

సందేహము వలదటంచు సత్యము దెల్పెన్

పొందుగ దేహమునందున

నందముగా వెదుక దోచు నది గను జీవా!

73.       కర్మను జేయుటె నీవిధి

కర్మఫలితమొందగోర కష్టము కల్గున్

ధర్మము నీవిధి నెఱుగుము

మర్మము గని మసలుకొనుము మహిలో జీవా!

74.       కర్మయె నరులకు దైవము

కర్మయె సుఖదుఃఖములకు కారణమనుచున్

మర్మము దెల్పెను పోతన

ధర్మమున చరించ జన్మ ధన్యము జీవా!


75.       తెలిసితినని మదిలోనన్

కలుషితమగు గర్వమున్న కాల్చును నిన్నున్

తెలుపగ నిక నెవరు గలరు

తెలియగ సర్వమ్ము నీవె తెలియుము జీవా!

76.       పిల్లను చంకన నిడుకొని

గొల్లడు తా గొఱ్ఱెమంద గుంపులనెల్లన్

మెల్లగ వెదకిన తీరుగ

నుల్లమునన్ గల్గు నిన్ను నోపవు జీవా!

77.       శిలలందు వెదుక జూతువు

శిలలందున లేడు శివుని శిల్పము నీవే

శిలలందు లేని చేతన

మిలలో నీయందు గలదు మేదిని జీవా!

78.       ముక్తికి ప్రతిరూపమవయి

ముక్తికి పారాడనేల మూర్ఖత్వమునన్

యుక్తిగ నిను నీవెఱిగిన

ముక్తియె నిరతంబు నీకు ముదముగ జీవా!

79.       సాధనజేయగ దేనికి

సాధనమూలమ్ము నీవె సద్గురు కృపచే

బోధన వివరమ్ము దెలియ

బాధలు బంధమ్ము దొలగు పరుగున జీవా!


80.       అష్టమదము లనువాటిని

కష్టమ్మని యెంచబోక కడతేర్చి సుమీ

నిష్టగ నీవుండినచో

స్పష్టముగా నదియె నీవు సత్యము జీవా!

81.       గొప్పలకు పోవగా పెను

ముప్పులు దరిజేరు నీకు మోదమొసంగన్

తిప్పలు దొలగం జేయును

తప్పక సద్గురుని జేరు ధరలో జీవా!

82.       దేవుడవీవని యెఱుగక

దేవుళ్ళాడెదవు నీవు దేశంబెల్లన్

భావరహితుండు దేవుడు

భావము విడనాడి నిన్ను బడయము జీవా!

83.       ముక్తికి రూపమె నీవయి

ముక్తినిఁ బొందంగ గురుని బోధన వినగన్

రక్తిగ జేరెదవచ్చట

యుక్తిగ నిను నీవు దెలియ నొప్పును జీవా!

84.       తెలివిగలవాడ ననుచును

తెలిపెదనని పలికెదీవు తెంపరి గుణమున్

వెలుపల లోపల నీవే

తెలుపగ మరి యెవరు గలరు దెలియుము జీవా!


85.       కొలుతువు కొండలరాయుని

చెలిమియు శ్రేయంబెఱుగవు చిత్తమునందున్

తెలియక మ్రొక్కు విధానము

తలనీలాలొసగ ముక్తి దక్కునె జీవా!

86.       ఇది కాదని యది కాదని

కుదురుగ నీవున్న తావు గుర్తెరుగక నిన్

వెదికెదెవు వెఱ్ఱితనమున

వెదుకగ మూలంబు నీవె వినుమో జీవా!

87.       మలమూత్రాదుల కొంపల

మలినంబిసుమంత లేక మసలుచు నీవున్

వెలుగింతువు రవి చంద్రుల

వెలుగును నీవలన జగము వినుమో జీవా!

88.       లెక్కకు మిక్కిలి కోరిక

లెక్కువగా నున్న చిక్కు లేర్పడు నీకున్

చిక్కులుఁ దొలగన్ గోరిన

నిక్కముగా భ్రాంతి విడువు నేర్పరి జీవా!

89.       మూడుగుణమ్ములకావల

తోడన్నది యేమి లేక తుర్యావస్థన్

కూడును గుడ్డను లేకను

రూఢిగ నంతటను వెలుగు రూపమె జీవా!


90.       యోగము కోరిన మోదము

భోగమ్మును కోర చింత భూమీశులకున్

రోగము కలిగిన చింతయె

త్యాగమ్మున నన్నివిడువ ధన్యము జీవా!

91.       సంచిత ప్రారబ్దములవి

యంచితముగ లేవు నీకు నవలోకింపన్

ఎంచికొని తెచ్చుకున్నవి

వంచనచే పారద్రోలి వరలుము జీవా!

92.       రూపము రస శబ్దమ్ములు

పాపము పుణ్యములు లేవు పనిగొని నీవున్

కోపము తాపము లేకను

కాపల యీ దేహమునకు కనుగొను జీవా!

93.       కన్నది విన్నది యన్నది

సున్నని నిజమెరుగు వరకు సుందరమౌ నీ

వెన్నెలదొర తేజంబును

నెన్నటికినిఁ గానలేవు నిజమిది జీవా!

94.       నాదని నీదని యేడ్చెద

వేదియు నీవెంట రాదు వివరింపంగన్

నాదను మోహము వీడిన

నీదగు తత్వమ్ము దోచు నిజమిది జీవా!


95.       ఏమి గొని వచ్చితిచటకు

నేమిటిఁ గొని యేగెదీవు నీడేరంగన్

నీమముగ నిల్చు ధరలో

కామితఫలసిద్ధి యొకటె గనుమో జీవా!

96.       గండము గలదని భయపడి

దండిగ పూజలను సలుపు దద్దమ్మవుగా

దండయె సృష్టికి నేనని

మెండుగఁ దలపోసి మదిని మెలగుము జీవా!

97.       మ్రొక్కులుఁ దీరగ జీవుల

మక్కువతో తినగ జంపు మనుజులకెల్లన్

గ్రక్కున మోక్షము గల్గునె

నిక్కముగా తప్పు తప్పె యెఱుగుము జీవా!

98.       ఎల్లమ్మకు పొట్టేళ్ళను

మల్లన్నకు పంచభక్ష్య పరమాన్నంబుల్

చల్లగ వారల పేరున

కొల్లగ భుజియించ ముక్తి కుదురునె జీవా!

99.       సంపదలను గని మురువకు

సంపదలన్నియు నశించి చచ్చిరి రాజుల్

సంపదల మూలమీవని

సొంపుగ గ్రహియించునాడె సుదినము జీవా!

100.     పరనిందయు పర ద్రవ్యము

పరభామల పొందుఁ గోర పాపమె యబ్బున్

పరమానందముఁ గోరిన

కరమనురాగమును వీడ గనెదవు జీవా!

101.     ఆకలి దప్పులు లేకను

చీకటి వెలుగులును కాక చిన్మయరూపున్

రాకలు పోకలెరుంగని

యేకలుషములేని దాని నెఱుగుము జీవా!


102.     దూషణ జేయకు మితరుల

భీషణముగ పల్కరాదు ప్రేమగనెపుడున్

భాషింపవలయు మృదువుగ

భూషణమౌ నీదు వాక్కు భువిలో జీవా!


103.     మోసము ద్వేషము రెంటిని

దోషమ్మని పరిగణించి దూరమునుంచన్

బాసను జేయుచు దెల్పెద

నీసములెవ్వరును లేరు నిజముగ జీవా!


104.     చెక్కిన శిల్పము కావుర

చక్కని శిల్పముల జెక్కు చతురుడ వీవే

తక్కిన మాటలవేటికి

మ్రొక్కులు చేకొనగ జ్ఞానమూర్తివి జీవా!


105.     నమ్మకు దేహము నాదని

యిమ్మహినెపుడేగు‌నేమొ యెవరికి తెలియున్

నమ్మిన వారిని చెరుపకు

దమ్మిడి నీవెంట రాదు దలచగ జీవా!


106.     దైవము నీవై యుండియు

దేవుళ్లాడెదవు నీవు దేవుని కొరకు‌న్

దైవంబునెరుగ గోరిన

భావము విడ బయలు దోచు భద్రము జీవా!


107.     తిరిగెదవుగుడుల చుట్టును

వరములనట పొంద గోరి వాంఛలతోడన్

మొరపెట్టుకున్న కరుగదు

యరగని శిల్పముల వెంట నరుగకు జీవా!


108.     భావ్యంబైనది వినగా

శ్రావ్యంబని ముక్తిపథము శ్లాఘించ జనుల్

కావ్యంబై కలకాలము

సవ్యంబుగ వెలుగు గాక సదయుడ జీవా!


6. వేణిసోంపురం వేణుగోపాలస్వామి[4].

మున్నుడి

        2019 వ సంవత్సరంలో ‘గద్వాల సాహితి’ సమూహం నుండి ఒక పద్య సంకలనం వెలువరించాలని అంబటి భాను ప్రకాష్ గారు, మేడిచెర్ల హరనాగభూషణం గారు సంకల్పించినారు. జోగులాంబ గద్వాల జిల్లాలో గల పన్నెండు పుణ్యక్షేత్రాలను ఎన్నుకుని, పన్నెండు మంది కవులకు ఒక్కొక్క పుణ్యక్షేత్రాన్ని కేటాయించి, వారితో పద్యాలు, వ్యాసాలు వ్రాయించి ‘ద్వాదశ పుణ్యక్షేత్రాలు’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. అందులో వేణీసోంపురం వేణుగోపాల స్వామి క్షేత్రంపై వ్రాసే అవకాశం నాకు కలగడం నా అదృష్టం. స్ఫూర్తితో, భక్తుల కోరిక మేరకు ప్రత్యేకంగా వేణుగోపాలస్వామి చరిత్ర అనే ఈ చిన్ని పుస్తకం అచ్చు వేయిస్తే బాగుంటుందని ఆలయ అర్చకులు కోరడం వలన ఈ పుస్తకం రూపు దిద్దుకుంది. నాతో ఈ పుస్తకాన్ని వ్రాయించిన శ్రీ వేణుగోపాలస్వామి వారి పాదారవిందములకు శిరస్సు వంచి ప్రణామాలర్పిస్తున్నాను!

‘సహజకవి’ ఊర ఈశ్వర్ రెడ్డి, కోవెల దిన్నె గ్రామము,

వడ్డేపల్లి మండలం, జోగులాంబ గద్వాల జిల్లా, చరవాణి - 7981497017

వేణిసోంపురం శ్రీ వేణుగోపాలస్వామి

      పూర్వం (17వ శతాబ్దం) గద్వాల ఇలాకాలో ఐజ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ కుటుంబం గద్వాల సంస్థానం రాజా వారికి ఆస్థాన గురువులుగా ఉండేవారు. అందులో ప్రథముడు వెంకట నరసింహాచార్యులు. వారి కుమారులు వెంకట వెంకట్రామాచార్యులు. (వీరే తర్వాతి కాలంలో వ్యాస తత్వజ్ఞ తీర్థులుగా పేరుపొందారు). దురదృష్టవశాత్తు వీరికి ఇరవై రెండు సంవత్సరాల వయసులో వీరి తండ్రిగారు 1726 - 28 మధ్య కాలంలో గతించినారు. అప్పుడు వీరు ఇల్లు వదిలి బీచుపల్లి పుణ్యక్షేత్రంలో నివాసముంటూ 12 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశారు. ఒక రోజు రాత్రి హఠాత్తుగా బీచుపల్లి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై “నీ తపస్సు ఫలించింది. ఇక్కడి నుండి నేరుగా వేణిసోంపురం గ్రామం వెళ్లి అక్కడ తుంగభద్రా నదీ తీరాన ఒక కుటీరం నిర్మించుకుని శిష్యులకు వేద విద్య బోధించు. వాసుదేవ విఠల పేరుతో కొన్ని కృతులు రచించు” అని చెప్పి అంతర్ధానం అయ్యాడు.

      స్వామి ఆజ్ఞ ప్రకారం వేణిసొంపురం గ్రామం చేరుకుని అక్కడ జీవనం సాగించ మొదలుపెట్టాడు. అయితే అక్కడ అంతకుముందే తుంగభద్ర తీరాన నిజాం నవాబు గారి ధాన్యాగారాలు సైన్యానికి విడిదిశాలలు, భోజన శాలలు, బురుజులు, కోటలు ఉండేవి. వాటిని చూసి ఒక రోజు శ్రీ వెంకట్రామాచార్యులు గద్వాల రాజా వారి దగ్గరికి వెళ్లి ఇక్కడ జరిగిన వృత్తాంతం వివరించాడు. అది విన్న రాజావారు నిజాంను ఒప్పించి ఆ ప్రాంతాన్ని బ్రాహ్మణ కుటుంబానికి అగ్రహారంగా మార్చాడు. ఆ విధంగా దాన్ని వేద నిలయంగా మార్చి శిష్యులకు వేదాలు నేర్పుతూ అప్పుడప్పుడు బయటకి వెళ్ళి ప్రవచనాలు కూడా చెప్పుకునే వాడు. అలా వుండగా ఒక రోజు రాజోలి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వైకుంఠ నారాయణస్వామి గుడిలో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి తదనంతర పీఠాధిపతి ఐన భువనేంద్ర తీర్థులవారి దగ్గర సన్యాసం పుచ్చుకున్నారు. నాటినుండి వీరి పేరు ‘వ్యాస తత్త్వజ్ఞ తీర్థులు’గా మారిపోయింది.

      వీరిది ద్వైత మత వ్యవస్థాపకుడైన మధ్వాచార్యుల సంప్రదాయ కుటుంబం. ఆ విధంగా వేణిసోంపురం గ్రామంలో జీవనం సాగిస్తుండగా ఒక రోజు కొంత మంది శిష్యులతో కలిసి ఆధ్యాత్మిక ప్రబోధం విషయమై అలంపూర్ తాలూకా లోని వల్లూరు గ్రామం చేరుకున్నారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయగా వారికి రాత్రి కలలో శ్రీ వేణుగోపాలస్వామి కనిపించి “ఈ గ్రామం చెరువు తూము దగ్గర నా విగ్రహం ఉన్నది. దానిని బయటకు తీసి వేణిసోంపురంలో ప్రతిష్టించు” అని చెప్పారట. మర్నాడు ఉదయం స్వామి గ్రామ ప్రజలకు జరిగిన విషయం చెప్పి కొంత మంది ప్రముఖులతో వెళ్లి అక్కడ తవ్వి తీయగా స్వామి విగ్రహం దొరికిందట. అయితే అక్కడ విశేషమేమిటంటే కుడికాలిపై ఎడమకాలు వేసుకుని ఉన్న స్వామి వారి విగ్రహం కలలో కనిపించిందట! కానీ ఇక్కడ దొరికినది ఎడమ కాలుపై కుడి కాలు వేసుకున్న విగ్రహం. అయితే ఆ రోజు రాత్రి మళ్ళీ అదే ఊరిలో బస చేయగా, మళ్ళీ స్వామి కలలో కనిపించి ఇంకా లోతుగా త్రవ్వితే విగ్రహం దొరుకుతుందని చెప్పారట. మరుసటి రోజు గ్రామ పెద్దలు తీసుకువెళ్లి మళ్ళీ తవ్వగా స్వామి విగ్రహం దొరికింది. అయితే ఇక్కడ సహజ రూపమైన వేణుగోపాలస్వామి విగ్రహాన్ని వల్లూరు గ్రామంలోనే చైత్ర బహుళ పంచమి రోజు దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించారు. ఇప్పటికీ వల్లూరు గ్రామంలో ఆ రోజున ప్రతి సంవత్సరం ఉత్సవాలు దేదీప్యమానంగా జరుగుచున్నవి. ఇక్కడ విశేషమేమిటంటే శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాలను 2017లో పక్కనే ఉన్న రామాపురం గ్రామ వ్యక్తులు దొంగలించారు. ఆ దొంగలు పక్కనే ఉన్న ఆముదలపాడు దగ్గరికి వెళ్ళేసరికి వారికి కళ్లు కనిపించకపోగా, అక్కడ ఉన్న గొర్రెలమంద దగ్గర పడుకోగా ఉదయాన్నే గొర్రెల మంద వారు దొంగలను పట్టుకుని గ్రామస్తులకు ఫోన్ చేయగా, గ్రామస్తులు వెళ్లి విగ్రహాలను స్వాధీనం చేసుకొని, వారిని పోలీసులకు అప్పగించారు. ఇదంతా స్వామివారి మహిమ అని ఇప్పటికీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెప్పుకుంటున్నారు.

      ఇకపోతే కుడికాలుపై ఎడమకాలు వేసుకున్న విగ్రహమును 1742 - 44 సంవత్సరాల మధ్య వైశాఖ శుద్ధ దశమి రోజున వేణిసోంపుర గ్రామంలో ఆలయం నిర్మించి ప్రతిష్టించారు. అక్కడే వ్యాస త్వత్వజ్ఞ తీర్థుల వారు షోడశ బాహు నృసింహమూర్తిని 16 చేతుల్తో, 16 ఆయుధాలతో ప్రతిష్ఠించారు. ఇప్పటికీ వేణిసోంపురం గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దర్శనార్థం కర్ణాటక బెంగుళూరు ప్రాంతాల నుంచి మధ్వ సంప్రదాయ కుటుంబాలు వచ్చి పోవడం విశేషం.

వ్యాస తత్వజ్ఞ తీర్థుల వారి మహిమలు

      తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏటా బ్రహ్మోత్సవాలు జరగడం సహజం. అయితే మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వచ్చినప్పుడు రెండు సార్లు జరుపుతారట. అధిక మాసంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలని, ఆశ్వయుజంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలని జరుగుతుండగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసంలో జరిపే బ్రహ్మోత్సవాలలో శ్రీ స్వామి వారు కొంత మంది శిష్యులతో వెళ్లి, వాసుదేవ విఠల కీర్తన పాడి, ఈ మూడు సంవత్సరములు బోధించిన వేద విద్యకు మంగళం పాడి, రథం లాగేవారట. వీరు అత్యంత పరమ నిష్ఠాగరిష్టులు. వీరు తిరుమలకి వెళ్ళినప్పుడు తిరుమలపై మల మూత్ర విసర్జన చేసే వారు కాదట. కొండ కిందకి వచ్చి కాలకృత్యాలు తీర్చుకుని పైకి వెళ్ళి ఉత్సవంలో పాల్గొనేవారట. అయితే వీరికి అనుకోకుండా ఒక సంవత్సరం వాంతులు, విరేచనాలు మొదలయ్యాయట. “అయ్యో! ఇదేమి ఖర్మ? ఇంత దూరం వచ్చి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలలో పాల్గొనే భాగ్యం లేకపోయేనే” అని చింతించుకుంటూ క్రిందకు వెళ్ళి ఏదో ఒక ఔషధం సేవించి, మూడు నాలుగు గంటల తర్వాత పైకి వస్తున్నారట. కొండమీద వీరు లేకపోయే సరికి రథము కదల లేదట. “ఏమిది రథం కదలడం లేదు?” అని ఆలోచించగా, ఒక వ్యక్తి స్వామి రూపంలో వచ్చి “ఇక్కడ అయిజాచార్యులు అనేవారు ఉన్నారు. వారు వచ్చి లాగితేనే కదులుతుంది” అని చెప్పగా అక్కడ ఉన్న వారంతా తలో దిక్కుకు వెళ్ళి విచారించగా వీరు కనిపించారట. “అయ్యా! మేమే అయిజాచార్యులము. మావల్ల అపచారం జరగలేదు కదా?” అని పలుకగా, “స్వామీ! మీరు వచ్చి లాగితేనే రథం కదులుతుందని స్వామివారే స్వయంగా చెప్పినారు” అని చెప్పగా, అప్పుడు స్వామి వారు వెళ్లి వాసుదేవ విఠల కీర్తనలను ఆలపించి, మంగళం పాడి, లాగితే రథం కదిలిందట.

      అదే విధంగా ఇంకొకసారి హంపీ క్షేత్రంలో విరూపాక్ష స్వామి రథోత్సవం జరుగుచుండగా దివిటీ తగిలి స్వామి వారి వస్త్రములు అంటుకున్నాయట. అప్పుడు ఇక్కడ వ్యాస తత్వజ్ఞ తీర్థుల వారు వేణిసోంపుర గ్రామంలోని తుంగభద్ర నది తీరాన కొంత మంది శిష్యులతో సాయం సంధ్య వార్చుతుండగా దివ్యదృష్టితో ఆ మంటలను చూసి, ఇక్కడి నుంచి నీళ్ళు పైకి చల్లగా పక్కన ఉన్న శిష్య బృందం చూసి “స్వామీ! నీళ్ళు ఆలా పైకి ఎందుకు చల్లుతున్నారు?” అని అడగగా దానికి స్వామి వారు “హంపీ క్షేత్రంలో విరూపాక్ష స్వామి రథయాత్రలో మంటలు రేగితే చల్లి ఆర్పాను” అన్నారట. అప్పుడు శిష్యులు “మీరు ఇక్కడ, మంటలు అక్కడ... ఇది ఎలా సాధ్యం?” అని అడగ్గా “నాయనా! కావాలంటే రేపు తెల్లారి మీరు వెళ్లి కనుక్కురండి” అని చెప్పారట. మరుసటి రోజు శిష్యులు అక్కడికి వెళ్ళి విచారించగా అక్కడి వారు నిజమే అని చెప్పారట. ఇదంతా ఆ మహానుభావుని మహిమ అని అన్నారట.

      ఇంకొకసారి గద్వాల రాజా వారు ఒక విద్వత్ సభ నిర్వహించారట. ఆ సభకు చుట్టూ నలుమూలల నుండి పండితులు వచ్చి సభ జరుపగా, అందులో ఒక ఉత్తరాది పండితుడు అందరినీ పరాజితులను చేసినారట. అప్పుడు రాజు చింతాక్రాంతుడై, బోయిలతో పల్లకినిచ్చి స్వామి వారిని తీసుకు రమ్మని పంపారట. స్వామితో విషయం చెప్పగా స్వామి శిష్యులను పిలిచి “మీరు ఎవరు వెళ్తారు?” అని ఒక్కొక్కరిని అడగగా అందరూ తలలు అడ్డంగా ఊపారట. అప్పుడు స్వామి ఇంట్లో సేవకుడిగా ఉన్న నర్సప్పను పిలిచి విషయం చెప్పి “నువ్వు వెళ్తావా?” అని అడిగారట. అంటే “స్వామీ! మీ ఆజ్ఞ నేనెప్పుడైనా కాదన్నానా? మీరు సరే నంటే వెళ్ళి వస్తాను” అని నిరక్షర కుక్షి ఐన నర్సప్ప అన్నాడట. ఆ విధంగా నర్సప్ప చెవిలో ఏదో మంత్రం ఊది, కొన్ని మంత్రాక్షతలు ఇచ్చి, “అక్కడ సభా కార్యక్రమంలో ముందుగా వీటిని చల్లి సభ ప్రారంభించు” అని చెప్పగా సరేనని మంత్రాక్షతలు పల్లకిలో పెట్టి, బోయిలతో పాటు నరసప్ప నడుచుకుంటూ వెళ్ళి రాజా వారికి నమస్కరించి “గురువు గారు ఈ సభకు నన్ను పంపించారు” అని చెప్పగా ఈ నిరక్షర కుక్షి అయిన నరసప్పను చూసి “ఈ రోజుతో గద్వాల సంస్థానం యొక్క పేరు ప్రతిష్ఠలు గంగలో కలిసినట్లే” అని మనసులో అనుకుంటూ, గురువు గారిపై భారం వేసి సభా కార్యక్రమం జరపడం మొదలు పెట్టారట. అలా సభ మొదలు పెట్టగానే పండితులందరూ ప్రశ్నల వర్షం కురిపించగా ఏమాత్రం జంకు లేక ఆ ఉత్తరాది పండితులను కూడా ఓడించారట. అప్పుడా పండితుడు ఓటమిని ఒప్పుకుని రాజా వారికి నమస్కరించి వెళుతుండగా “మీ వల్లనే మా సంస్థానానికి విజయం లభించింది. మీరు లేకుంటే ఇంత సభ జరిగేది కాదు కదా” అని వారిని కూడా సముచిత రీతిలో సన్మానించి, నరసప్పని కూడా ఘనంగా సన్మానించి పంపారట. నరసప్ప వెళ్ళి, గురువుగారి పాదాల మీద పడి “ఇదంతా మీ మహిమ” అని చెప్పగా గురువుగారు “నీకేం కావాలో కోరుకో” అని అడుగగా నరసప్ప “నాకు ఈ మేడలు మిద్దెలు భౌతికమైనవి. ఏమి వద్దు. మీరు ప్రసాదించిన ఈ జ్ఞానం ఇలాగే ఉంటే నాకు అదే పదివేలు” అనగా స్వామి వారు తథాస్తన్నారట. ఇది ఒక అద్భుతమైన మహిమగా ఇప్పటికే చెప్పుకొనుచున్నారు.

      ఇది ఇలా ఉండగా కర్నూలు నవాబు నిజాం నవాబుకు రాజా వారి మీద లేనిపోని పితూరీలు చెప్పి సంస్థానంపై దండయాత్రకి ప్రయత్నం చేశారట. ఒకరోజు నిజాము నవాబు సైన్యం దండయాత్రకు వచ్చి రాత్రి కృష్ణానది ఆవలి ఒడ్డున బస చేయగా గూఢచారుల వల్ల రాజా వారికి తెలిసి ఏమి దిక్కుతోచక వ్యాస త్వత్వజ్ఞ తీర్థుల వారి దగ్గరికి సేవకులను పంపించి పరిస్థితిని లేఖ ద్వారా వివరించి “ఇప్పుడు మీరే రక్షించాలి” అని కోరగా, అప్పుడు స్వామి వారు ఒక శ్లోకాన్ని వ్రాసి ఇచ్చి వారు విడిది చేసిన చోట ఒక పావు మైలు దూరంలో పైభాగమున కృష్ణానదిలో ఈ శ్లోకాన్ని పఠించి వాటిని ఆ నదిలోవదలమని అన్నారట.

శ్లోకం.     ధర్మో భవతు సద్ధర్మః మార్గణాస్సంతు మార్గణాః ।

           వాహినీ వాహినీ రాజన్ స్వాదరాతి పరాజయః ॥

      స్వామి వారు చెప్పినట్లు రాజా వారి సైన్యం అలాగే చేయగా అప్పుడు కృష్ణానది పూర్ణ ప్రవాహం వచ్చి అక్కడి నుండి కేవలం రెండు కిలోమీటర్ల మేర ప్రవహించగా నిజాం సైన్యం అంతా కృష్ణా నదిలో కొట్టుకు పోయి కేవలం ఆనవాళ్ళు మాత్రమే మిగిలాయట. ఉదయం రాజావారు సేవకులతో సమాచారం తెలుసుకొని సంతోషించి స్వామి వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

శ్రీ వేణుగోపాల స్తుతి (కంద పద్యములు)

1.      ఇల వేణీ సోంపురమున

        నల వైకుంఠమును వీడి, యజ్ఞానంబున్

        తొలగించి, మమ్ము బ్రోవగ

        కొలువైతివి నీవు వేణు గోపాలుడవై.

2.      అల్లదె బృందావనమున

        ఘల్లని యందియలు మ్రోగ గన భక్తులు తా

        ముల్లము ఝల్లున పొంగగ

        మల్లెల వాసనలు వెడలె మందిరమందున్.

3.      ప్రాతః కాలమునందున

        నీ తల వాకిట నిలచితి నీరజ నేత్రా!

        ప్రీతిగ జేరి భజించితి

        నా తలపుల వెలుగుమయ్య నగధర! శౌరీ!

4.      వ్యాపింపగ దశ దిశలను

        దీపింపగ తుంగభద్ర తీరమునందున్

        చూపింపగ తన మహిమను

        స్థాపించెను భువిని వ్యాస తత్త్వజ్ఞుడిలన్.

5.      యదు వంశ రత్నమా! నీ

        పదములె నెర నమ్మినాడ పన్నగ శయనా!

        మది యందు నిన్నె దలచెద

        వదలనికే జన్మకైన వసుదేవ సుతా!

6.      ద్వారక వాసా! కృష్ణా!

        నేరక నే జేసినట్టి నేరము బాపన్

        కోరితి సతతము నిన్నే

        దూరకు పగవాడ ననుచు దుష్ట జనారీ!

7.      తెలుపగ వేదాంతంబును

        నిలుపగ ధర్మమును పుడమి నిర్మల భక్తిన్

        వెలసితివే సోంపురమున

        దలచితివే జనుల నీవు ధన్యుల జేయన్.

8.      కొలిచెద నీ పదములనే

        పలికెద నీ కీర్తనముల పరమార్థ మదే

        సలిపెద సజ్జన సేవను

        దలచెద సతతంబు వ్యాస తత్త్వజ్ఞ నినున్.

9.      వల్లూరు గ్రామమందున

        చల్లగ కొలువైతివయ్య సద్యశ రూపా!

        ఉల్లము ఝల్లున పొంగగ

        నల్లని నీ మేని ఛాయ నయనోత్సవమౌ.

10.    అహమును విడిచిన జనులకు

        నిహపర సౌఖ్యములు రెండు నిపుడే కల్గున్

        సహనంబు తోడ జెప్పిన

        మహిమాన్విత రూప! నీకు మా వందనముల్.

11.    గద్వాల రాజ వంశపు

        విద్వాంసుడ వైతివయ్య విమల చరిత్రా!

        మధ్వాచార్యుల మతమున

        విద్వన్మణి వౌచు నీవు వెలగితి విలలో.

12.    హంపీ క్షేత్రమునందున

        సొంపుగ రథయాత్ర జరుగ చొరగన్ మంటల్

        సోంపురమందున గాంచుచు

        నింపుగ నట నార్పినావె యెల్లరు జూడన్.

శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం, వేణిసోంపురం

స్వామివారి కళ్యాణ మహోత్సవాలు

ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ద్వాదశి నుండి బహుళ పాడ్యమి వరకు

1. ద్వాదశి రోజు దేవతా సమారాధన, ధ్వజారోహణం

2. త్రయోదశి రోజుశ్రీ కృష్ణుని కల్యాణ మహోత్సవం

3. చతుర్దశి రోజు నృసింహస్వామి రథోత్సవం

4. పౌర్ణమి రోజు శ్రీ కృష్ణుని రథోత్సవం

ఇక్కడి స్వామి సంతాన వేణుగోపాలస్వామిగా ప్రసిద్ధి గాంచినాడు. సంతానం లేని వారు స్వామి వారికి మ్రొక్కుకుని సంతానం కలిగిన తరువాత మ్రొక్కులు తీర్చుకుంటారు.


* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

2014 లో వెలువడిన వీరి వెంకటేశ్వర ద్విశతి 208 ఆటవెలది పద్యాలతో రాయబడిన శతకం. విశ్వమందు నిజము వెేంకటేశ  అనునది మకుటం. ఇందులో మొదటి పద్యం-

శ్రీరమాంతరంగ శ్రిత పారిజాతమా

తిరుమలగిరి పైన తిరముగాను

వెలిసినావు నీవు వెేంకటేశుడవయ్యి

విశ్వమందు నిజము వేంకటేశ

2021లో వెలువడిన వీరి చెన్నకేశవ శతకము వృత్తపద్యాలలో రాయబడినది. చెన్నకేశవా అనునది మకుటం.

జోగులాంబ గద్వాల జిల్లా ద్వాదశ పుణ్యక్షేత్రాలు పద్య సంకలనం లో వేణి సోంపురం శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ ప్రశస్థి గురించి రాశారు. జడకందములు, సైనికార్చన, శంకరాభరణం సప్తతి సంచిక,  శార్వరి ఉగాది సంకలనం, పద్య ప్రభంజనం, అష్టవిధ నాయకులు, జలకళ, సురవరం మొగ్గలు, శిరిడి సాయి మొగ్గలు, బతుకమ్మ మొగ్గలు, గాంధీజీ మొగ్గలు తదితర సంకలనాల్లో వీరి రచనలు ప్రచురించబడ్డాయి.

గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిచే సన్మానం పొందుతున్న ఊర ఈశ్వరరెడ్డి

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఊర ఈశ్వరరెడ్డి,వేంకటేశ్వర ద్విశతి, అమృత ప్రింటర్స్, హైదరాబాద్-20, జూన్, 2014
  2. 1 2 ఊర ఈశ్వరరెడ్డి,చెన్నకేశవ శతకం, శంకరాభరణం ప్రచురణలు,హైదరాబాద్, ఫిబ్రవరి, 2021
  3. 1 2 ఊర ఈశ్వరరెడ్డి,ముక్తిపథం, శంకరాభరణం ప్రచురణలు,హైదరాబాద్, ఆగస్టు, 2021
  4. 1 2 ఊర ఈశ్వరరెడ్డి,వేణిసోంపురం వేణుగోపాలస్వామి, శంకరాభరణం ప్రచురణలు,హైదరాబాద్, నవంబర్, 2021