ఎం.ఎన్. రావు
| ఎం.ఎన్. రావు | |
|---|---|
| జననం | 1924 బందరు, కృష్ణా జిల్లా |
| మరణం | 1978 ఫిబ్రవరి 15 |
| ఇతర పేర్లు | మద్దూరి నరసింహారావు |
| ఉద్యోగం | ఎమెస్కో ప్రచురణ సంస్థ |
| ప్రసిద్ధి | ప్రచురణ కర్త |
| భార్య / భర్త | లీలావతి |
| పిల్లలు | ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు |
| తండ్రి | మద్దూరి శేషాచలం |
ఎం.ఎన్. రావు ఎమెస్కో ప్రచురణ సంస్థ ద్వారా తెలుగు వారి ఇంట పుస్తక దీపాలు వెలిగించిన మార్గదర్శి.
జననం
[మార్చు]ఎం.ఎన్. రావు 1924 బందరులో జన్మించిన ఎం. నరసింహారావు ఎస్.ఎస్.ఎల్.సి. వరకు బందరు నోబెల్ హైస్కూలులోనే చదువుకొన్నారు. హైస్కూలు ప్రధానోపాధ్యాయులైన దర్భా నిత్యానందశాస్త్రి సలహామేరకు మద్రాసు వెళ్ళి తాంబరం క్రిస్టియన్ కాలేజీలో చేరి అర్థశాస్త్రంలో బి.ఏ. ఆనర్స్ పట్టా పొందారు. ఎం.ఏ. మొదటి శ్రేణిలో పాసైయ్యారు.[1]
ఎమెస్కో ప్రస్థానం
[మార్చు]1946 లో తండ్రి మద్దూరి శేషాచలం ఆరంభించిన పుస్తక ప్రచురణపై మనసు పడింది. ఎం.శేషాచలం అండ్‌కో పేరును ఎమెస్కో(EMESCO) గా మార్చి బందరు కేంద్రంగా గ్రంథ ప్రచురణలో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు ఎం.ఎన్. రావు. ఈయన అన్ని రకాల సాహిత్యాన్నీ తెలుగు పాఠకలోకానికి అందించారు. ఎక్కడా అసభ్యతకూ, జుగుస్సకూ, మితిమీరిన శృంగారాన్నికీ తావియ్యలేదు.
ప్రచురణలో ప్రయోగాలు
[మార్చు]ఇంటింటా స్వంత గ్రంథాలయం పథకం ప్రారభించి, దాదాపు 50 వేల మందిని సభ్యులుగా చేర్చగలిగారు. అన్నిటికన్నా ఆయన చేసిన పాకెట్ బుక్స్ ఆలోచన ఎంతో విజయవంతమయ్యింది. పుస్తక ప్రపంచం అనే ఒక చిన్న మాసపత్రికను ప్రారంభించి అందులో ఇంటింటా గ్రంథమాల అనే హోం లైబ్రరీ ప్లాన్ రూపొందించారు. పథకం వివరాలు, ఎలా చేరాలి?, ఆయా పుస్తకాలు ఎలా పొందాలి? వంటి వివరాలతో పాటు సబ్యుల సందేహాలకు సమాధానాలు చెప్పి వారిలో పఠనాసక్తి కలిగేలా చేశారు.[2] దాదాపు 450 పుస్తకాలు ప్రచురించారు.
పుస్తకాల విలువ పాఠకులకు తెలియాలంటే ప్రజల వద్దకు పుస్తకాలు తీసుకెళ్ళాలని ఆంధ్రదేశమంతటా మూడేసి రోజులు పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. అందులో సాయంకాలాలు సాహితీ సదస్సులు ఉండేవి. ఒకరోజు పిల్లలకి ప్రత్యేకించి కేటాయించి వాళ్ళకి చాక్లెట్లు పంచిపెట్టేవారు. మారు మూల పల్లెటూర్లలో ఇలాంటివి ప్రదర్శించేవారు.
భానుమతి కథానికలు, అక్కినేని నాగేశ్వరరావు నేను నా జీవితం, ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం, కొంటె బొమ్మల బాపు, ముళ్ళపూడి రాధాగోపాలం పుస్తకాలు ప్రచురించి సినీ ప్రముఖులకు కూడా ఆంతరంగికుడయ్యారు. ఘంటశాలగారి అమెరికా ప్రయాణానికి చేయూత నిచ్చి, తన కంపెనీ మేనేజర్ అయిన కె.జి. కృష్ణమూర్తిని వాళ్ళ ట్రూప్ కి మేనేజర్ పంపారు.
యాజమాన్యం మార్పు
[మార్చు]1989 లో ఎమెస్కో సంస్థను ధూపాటి విజయకుమార్ స్వంతం చేసుకొని నిరాటకంగా నడిపిస్తున్నారు. అయితే నాటి ఇంటింటా గ్రంథాలయం వంటి పథకాలు లేవు.
ప్రచురణ రంగానికి సేవ
[మార్చు]పుస్తక ప్రచురణల కార్యక్రమాల నిమిత్తం ఆయన అమెరికాలో దాదాపు నాలుగు నెలలు పర్యటించారు. 1978లో ఆయన చనిపోవడానికి రెండు నెలల ముందు (అంటే. 1977 డిశంబర్ ప్రాంతంలో), లండన్లో వివిధ ఔత్సాహిక ప్రచురణకర్తలకు క్రైస్తవ గ్రంథ ముద్రణలో శిక్షణనివ్వడానికి వెళ్లి వచ్చారు. ఆయన రాసిన బుక్ పబ్లిషింగ్ మాన్యువల్ అనే గ్రంథం వివిధ దేశాల్లో గ్రంథ ప్రచురణ కళ కోర్సులలో పాఠ్యపుస్తకంగా ఉంది.
మద్రాసు, ఢిల్లీ విశ్వవిద్యాలయాల్లో పుస్తక పరిశ్రమ అనే అంశంలో డిగ్రీ కోర్సులు ఆరంభం కావడానికి రావుగారు చేసిన కృషి ఇంతా అంతా కాదు. విలువలతో కూడిన గ్రంథాల ప్రచురణ అనే అంశాన్ని ఆరాధించి, ఒక తపస్సులా ఆచరించి ఎందరికో మార్గదర్శకులైనారు ఎం.ఎన్.రావు. ఆయన నిర్వహించిన సభలూ, సమావేశాలూ కోకొల్లలు. ఆంధ్రప్రదేశ్ పుస్తక ప్రచురణ కమిటీ, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ వంటి వాటిలో సభ్యునిగా క్రియాశీలకంగా వ్యవహరించారు. పబ్లిషర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక సభ్యులుగా కూడా పనిచేశారు. ఈ విధంగా ప్రభుత్వ స్థాయిలో, పరిశ్రమ స్థాయిలో ఆయన ఎన్నో ఉన్నత పదవులను ఎంతో అంకితభావంతో నిర్వహించారు.
వీరు 1978 సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీలో ప్రపంచ పుస్తక ప్రదర్శనలో అంతర్జాతీయ సెమినారు నిర్వహించడానికి వెళ్లారు. ఐతే, 1978 ఫిబ్రవరి 15 నాటి రాత్రి నిద్రలో శాశ్వతంగా వెళ్లిపోయారు.
మూలాలు
[మార్చు]- ↑ "M N Rao the doyen of Telugu Publishing". www.telugubhakti.com. Retrieved 2026-02-04.
- ↑ "Sweet Memories of EMESCO M N RAO". www.telugubhakti.com. Retrieved 2026-02-04.
వెలుపలి లంకెలు
[మార్చు]- ↑ వేణుగోపాల్, నాగసూరి (2025). దక్షిణాంధ్ర దారిదీపాలు. గుంటూరు: బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్. p. 397.