ఎం. ఎల్. ఏ. ఏడుకొండలు
ఎం. ఎల్. ఏ. ఏడుకొండలు (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
తారాగణం | దాసరి నారాయణరావు, సుజాత |
నిర్మాణ సంస్థ | హిమా మూవీస్ |
భాష | తెలుగు |
ఎం.ఎల్.ఏ ఏడుకొండలు 1983లో విడుదలైన తెలుగు సినిమా. హిమా మూవీస్ పతాకంపై హిమబిందు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. దాసరి నారాయణరావు, సుజాత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
సమీక్ష[మార్చు]
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం . ప్రజలే నాయకులను, ప్రభుత్వాధినేతలను ఎన్నుకొంటారు. వాళ్లు ప్రజల సంక్షేమాన్ని కోరుతూ దేశాన్ని పరిపాలిస్తారు. సహజంగా జరిగేది ఇదే. కానీ ప్రస్తుత రాజకీయాలు దేశాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నాయి? దీనికి జవాబు వెతకడానికి బయలుదేరిన ఏడుకొండలు అనే క్షురకుడు రాజకీయ ప్రక్షాళన కోసం చేసిన ప్రయత్నమే 'ఎమ్.ఎ. ఏ. ఏడుకొండలు'. ఓటును నోటుకు అమ్ముకోవద్దనీ, దానిని కుటిల రాజకీయ నాయకులపై బల్లెపు వేటుగా ప్రయోగించాలని కోరుతూ రచయితగా, దర్శకుడిగా దాసరి నారాయణరావు పేల్చిన సెల్యులాయిడ్ డైనమైట్ ఈ చిత్రం. అయితే ఈ సినిమాలో వ్యక్తిగత దూషణలు లేవు. పార్టీల ప్రస్తావన లేదు.
చెప్పదలుచుకొన్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పాడు దాసరి. వ్యంగ్యం ఈ సినిమాకు బలం. ఆ వ్యంగ్యానికి కల్పన జోడించినా ప్రజలకు చెప్పదలచుకొన్న ప్రధాన సందేశం మాత్రం మరుగున పడుకుండా దాసరి జాగ్రత్త పడ్డారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దాసరి రూపొందించిన చిత్రమిది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది అప్పటికింకా తేలక పోవడంతో 1982 నవంబర్ 11న చెన్నైలోని కృష్ణవేణి హౌస్‌లో 'ఎమ్.ఎల్.ఏ ఏడుకొండలు' చిత్రం షూటింగ్ ప్రారంభించాడు దాసరి. మహానటుడు ఎన్టీఆర్ నటనకు స్వస్తి పలికి,రాజకీయాలోకి ప్రవేశించిన తరుణమది. 'తెలుగుదేశం' పార్టీ నెలకొల్పి, కాంగ్రెసు పాలనకు చరమగీతం పాడాలని కోరుతూ చైతన్యరథంపై ఆయన ఊరురూ తిరుగుతున్న ఆ సమయంలో, అనూహ్యంగా 1983 జనవరి 5న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగడానికి ఇంకా కావలసినంత సమయం ఉండటంతో ఎన్నికల లోపే సినిమా విడుదల చేయాలనే అభిప్రాయంతో 12 రోజుల పాటు యుద్ధప్రాతిపదికన పగలు, రాత్రి పనిచేసి 'ఎమ్.ఎల్.ఏ ఏడుకొండలు' చిత్రం పూర్తి చేశాడు. ఎంత వేగంగా నిర్మాణం పూర్తి చేసినా, సెన్సార్ కారణంగా ఎన్నికలైన నాలుగు రోజుల తర్వాత ఈ చిత్రం విడుదలైంది. ఈ ఎన్నికల్లోనే 'తెలుగుదేశం' పార్టీ ఘనవిజయం సాధించింది. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే తనదైన ముద్ర వేశారు.'ఎమ్.ఎల్.ఏ ఏడుకొండలు' చిత్రంలో దాసరి ప్రధాన పాత్ర పోషించాడు. 25 వారాలు ప్రదర్శితమైన ఈ చిత్రాన్ని నిర్మాత క్రాంతికుమార్ రాజేశ్‌ఖన్నా హీరోగా దాసరి దర్శకత్వంలోనే 'ఆజ్ కా ఎమ్.ఎల్.ఏ' పేరుతో హిందీలో రీమేక్ చేశారు.[2]
తారాగణం[మార్చు]
- దాసరి నారాయణరావు
- సుజాత
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- పేకేటి శివరాం
- అల్లు రామలింగయ్య
- మందాడి ప్రభాకర రెడ్డి
- సూర్యకాంతం
- జయమాలిని
- శ్రీగీత
- దేవి
- రాణిసుధ
- బేబీ విజయలక్ష్మి
- వంకాయల సత్యనారాయణమూర్తి
- ఏలేశ్వరం రంగా
- నారాయణమూర్తి
- బాలాజీ
- మూర్తి
- హరిప్రసాద్
సాంకేతిక వర్గం[మార్చు]
- కథ, చిత్రానువాదం, సంభాషణలు, దర్శకత్వం: దాసరి నారాయణరావు
- బ్యానర్: హిమా మూవీస్
- నిర్మాత: డి.హిమబిందు
- స్టుడియో: అన్నపూర్ణ స్టుడియోస్
- పాటలు: శ్రీశ్రీ, పాలగుమ్మి విశ్వనాథం, దాసరి నారాయణరావు
- గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, జి.ఆనంద్
- నృత్యాలు: సలీం, శివ-సుబ్రహ్మణ్యం
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: శేషు
- కళ: పి.శ్రీనివాసరావు
- కూర్పు: డి.రాజగోపాల్
- ఛాయాగ్రహణం: కె.ఎస్.మణి
- సంగీతం: కె.చక్రవర్తి
- సమర్పణ: రాయప రాజు
- విడుదల తేదీ: 1983 జనవరి 9
పురస్కారాలు[మార్చు]
- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నేపథ్య గాయని - పి.సుశీల (1984)[3]
- నంది పురస్కారాలు ఉత్తమ మాటల రచయిత - దాసరి నారాయణరావు (1983)
మూలాలు[మార్చు]
- ↑ "M L A Edukondalu (1983)". Indiancine.ma. Retrieved 2020-08-20.
- ↑ "సెల్యులాయిడ్ వ్యంగ్యాస్త్రం - Andhrajyothy". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-08-20.
- ↑ Sumitra (2019-11-13). "మధుర స్వరాల మహరాణి సుశీలమ్మ". www.hmtvlive.com (in ఇంగ్లీష్). Retrieved 2020-08-20.
బాహ్య లంకెలు[మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఎం. ఎల్. ఏ. ఏడుకొండలు
- "MLA YEDUKONDALO | TELUGU FULL MOVIE | DASARI NARAYANA RAO | SUJATHA | TELUGU MOVIE CAFE - YouTube". www.youtube.com. Retrieved 2020-08-20.