Jump to content

ఎం. ఎస్. కృష్ణన్

వికీపీడియా నుండి
ఎం. ఎస్. కృష్ణన్
ఎం. ఎస్. కృష్ణన్ చిత్రపటం
జననంమహారాజపురం సీతారామన్ కృష్ణన్
24 ఆగస్టు 1898
తంజావూరు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం1970 ఏప్రిల్ 24(1970-04-24) (వయసు: 71)
వృత్తిభూగర్భ శాస్త్రవేత్త

మహారాజపురం సీతారామన్ కృష్ణన్ (24 ఆగస్టు 1898 – 24 ఏప్రిల్ 1970) ఒక భారతీయ భూగర్భ శాస్త్రవేత్త. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్‌గా పనిచేసిన తొలి భారతీయుడు.[1]

తొలినాళ్లలో

[మార్చు]

కృష్ణన్ 1898 ఆగస్టు 24న మద్రాసు ప్రెసిడెన్సీలోని తంజావూరులో జన్మించాడు. తంజావూరులో పాఠశాల విద్య పూర్తయ్యాక, తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో చదువు కొనసాగించాడు. 1919లో చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి భూగర్భ శాస్త్రంలో బి.ఎ. ఆనర్స్ పట్టా పొందాడు. 1921లో ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లో ఏఆర్సీఎస్ (అసోసియేట్-షిప్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సైన్స్)[2] స్కాలర్‌షిప్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణ, పరిశోధనలు చేపట్టాడు. 1923లో ఇంపీరియల్ కాలేజ్ డిప్లొమా (డిఐసి) పొందాడు, 1924లో లండన్ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టా అందుకున్నాడు.

వృత్తి జీవితం

[మార్చు]

ఆనర్స్ డిగ్రీ పొందిన తరువాత రెండేళ్లపాటు డాక్టర్ కృష్ణన్ మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో జియాలజీ డిమాన్‌స్ట్రేటర్‌గా పనిచేశాడు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉన్నత సర్వీసులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ (జియాలజిస్ట్) గా నియమితుడై 1924 డిసెంబరులో ఆ విభాగంలో చేరాడు [2]. అక్కడ డాక్టర్ కృష్ణన్ లూయిస్ ఫెర్మర్, సి. ఎస్. ఫాక్స్, జె. ఎ. డన్, అలెగ్జాండర్ ఎం. హెరాన్, హెచ్. సి. జోన్స్, జె. బి. ఆడెన్ వంటి వారితో కలిసి పనిచేశాడు. 1943లో సూపర్ ఇంటెండింగ్ జియాలజిస్ట్‌గా పదోన్నతి పొంది, కొత్తగా ఏర్పాటైన ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌కు డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు.[2] జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాశ్వత డైరెక్టర్‌గా (ఈ పదవిని అధిష్టించిన తొలి భారతీయుడు) బాధ్యతలు చేపట్టేందుకు 1951 ఫిబ్రవరిలో ఆ పదవిని విడిచిపెట్టాడు. నాలుగేళ్ల తర్వాత 1955 ఆగస్టులో న్యూఢిల్లీకి ఖనిజ సలహాదారుగా, భారత ప్రభుత్వ (శాస్త్రీయ పరిశోధన మంత్రిత్వ శాఖ) ఎక్స్-అఫీషియో జాయింట్ సెక్రటరీగా బదిలీ అయ్యాడు. 1957 ఏప్రిల్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ కు దాని మొదటి డైరెక్టర్‌గా బదిలీ చేయబడ్డాడు. అక్కడ మైనింగ్‌లో విస్తృతమైన కోర్సులను, అప్లైడ్ జియోఫిజిక్స్, పెట్రోలియం టెక్నాలజీలో కొత్తగా ప్రారంభించిన కోర్సులను నిర్వహించాడు.[2]

గాంగ్‌పూర్, బోనాయ్, బామ్రా, కియోంజర్ (ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంలోని భాగాలు) ప్రాంతాలలో స్ట్రాటిగ్రాఫిక్ మ్యాపింగ్‌పై పనిచేశాడు. జిఎస్ఐ మెమోయిర్ 71 (1937) లో ప్రచురించిన 'గాంగ్‌పూర్ సిరీస్' ను గుర్తించాడు. ఇనుము, మాంగనీస్ ఖనిజాలు, జిప్సం, మైకా, సున్నపురాయి వంటి ఆర్థిక ప్రాముఖ్యత ఉన్న ఖనిజాలపై కూడా పనిచేశాడు. తన అధ్యయనాలను జిఎస్ఐ మెమోయిర్ 80 (1952) లో ప్రచురించాడు. గిర్నార్, సౌరాష్ట్రలోని ఓషమ్ కొండల (ప్రస్తుతం గుజరాత్‌లో ఉంది) శిలలు, ఖోండాలైట్ అనబడే విచిత్రమైన మెటాసెడిమెంటరీ శిలల లేటరైజేషన్, పూర్వపు సెంట్రల్ ప్రావిన్సెస్, బేరార్ (ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో భాగాలు) ఖనిజ వనరులు, ఉత్తర భారతదేశ వింధ్య నిర్మాణాల భూగర్భశాస్త్రం, దక్కన్ ట్రాప్స్, తంజావూరు (తమిళనాడు) టెర్టియరీలపై పనిచేశాడు. ఇండోబ్రహ్మ, సరస్వతి వంటి పౌరాణిక నదులపైనా పరిశీలనలు చేశాడు.

మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల (1920–21), డెహ్రాడూన్ అటవీ కళాశాల (1928–30), కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాల (1933–35) లలో భూగర్భ శాస్త్రాన్ని బోధించాడు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ) కి చెందిన సిరిల్ ఎస్. ఫాక్స్ సూచన మేరకు భారతీయ స్ట్రాటిగ్రాఫీపై ఒక పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నాడు. దీని ఫలితంగా 1943లో జియాలజీ ఆఫ్ ఇండియా అండ్ బర్మా, 1944లో ఇంట్రడక్షన్ టు జియాలజీ ఆఫ్ ఇండియా ప్రచురితమయ్యాయి. మొదటి పుస్తకం 6 ముద్రణలు పొందింది, రష్యన్ భాషలోకి కూడా అనువదించబడింది. కృష్ణన్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (న్యూఢిల్లీ) డైరెక్టర్‌గా 1948 నుండి 1951 వరకు, జిఎస్ఐ డైరెక్టర్‌గా[1], ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ డైరెక్టర్‌గా 1957–58 మధ్యకాలంలో, వాల్తేరులోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భూగర్భ శాస్త్రం, భౌగోళిక భౌతిక శాస్త్ర విభాగానికి అధిపతిగా 1958 నుండి 1960 వరకు పనిచేశాడు. హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ స్థాపనలో సహాయపడ్డాడు. దానికి 1961 నుండి 1963 వరకు డైరెక్టర్‌గా ఉన్నాడు.

1970 జనవరిలో రాష్ట్రపతి ఎస్. రాధాకృష్ణన్ చేతులమీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. 2025లో అంగారక గ్రహంపై ఉన్న 3.5 బిలియన్ సంవత్సరాల నాటి బిలానికి ఆయన పేరు పెట్టారు. [3]

మూలాలు

[మార్చు]
  1. 1 2 "Dr. M. S. Krishnan takes over as Director". The Indian Express. 1 February 1951. Retrieved 28 April 2017.
  2. 1 2 3 4 Indian Science Congress Association, Volume II - Presidential Address (2003). The Shaping of Indian Science: 1948-1981. Hyderabad: Universities Press. p. 769. ISBN 81-7371-433-9.
  3. ↑ https://www.thehindu.com/news/national/kerala/names-proposed-by-kerala-based-researchers-approved-for-martian-landforms/article70324823.ece

బయటి లింకులు

[మార్చు]

మరింత చదవడానికి

[మార్చు]
  • శంకరన్, ఎ. వి. ఎం. ఎస్. కృష్ణన్: జియాలజిస్ట్ పార్ ఎక్సలెన్స్. కరెంట్ సైన్స్ 75(10):1084
  • జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా: 'ఎం.ఎస్.కృష్ణన్, పెన్ పోర్ట్రెయిట్', జిఎస్ఐ న్యూస్, సంపుటి.4, నం.6, జూన్ 1972, పేజీలు 5-10
  • ఎం.ఎస్.కృష్ణన్ ద్వారా సాత్తనూర్ ట్రీ ఫాసిల్ ఆవిష్కరణ