Jump to content

ఎం. కులశేఖరరావు

వికీపీడియా నుండి
ఎం.కులశేఖరరావు
ఎం. కులశేఖరరావు
తెలుగు సాహిత్య విమర్శకులు
జననం(1932-11-14)1932 నవంబరు 14
మేడిపల్లి, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా
మరణం2019 May 25(2019-05-25) (వయసు: 86)
కెనడా
వృత్తిఆచార్యులు


ఎం.కులశేఖరరావు కవి, రచయిత, సాహిత్య విమర్శకులు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా, తెలుగుశాఖకు అధ్యక్షులుగా పనిచేశారు. వారు సాహిత్యం, విమర్శ రంగాలలో కృషి చేశారు. తెలంగాణ తొలితరం సాహితీ విమర్శకులలో ఒకరుగా వీరిని భావిస్తారు, ముఖ్యంగా "విజయవిలాసం" వంటి కావ్యాలపై వారి వ్యా్ఖ్యానాలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి.  

కుటుంబ నేపథ్యం

[మార్చు]

ఆచార్య మడుపు కులశేఖర రావు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కెర్త (మేడిపల్లి) గ్రామంలో  మడుపు జానకమ్మ, మడుపు పరాంకుశరావు దంపతులకు జన్మించారు.  1932 నవంబర్ 14 వ తేదీన మేడిపల్లి గ్రామంలో జన్మించిన ఆయన  2019 మే 25న  కెనడాలోని బ్రాఫ్టన్‌లో కన్నుమూశారు. భార్య ఇందిరాదేవి.

విద్యాభ్యాసం

[మార్చు]

స్వగ్రామం మేడిపల్లిలో 3వ తరగతి వరకు చదివారు. హైదరాబాద్ పాతబస్తీలోని రిఫా-ఎ- ఎమ్ పాఠశాలలో 4వ తరగతి నుండి 7 వ తరగతి వరకు, అదే బస్తీలో ఉన్న ముఫిదుల్లనామ్ లో 8 నుండి 10 వ తరగతి వరకు చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ.(తెలుగు) పూర్తిచేశాకా, 1953-55 మధ్యకాలంలో ఎం.ఏ.(తెలుగు) పూర్తి చేశారు. 1964 లో ‘ఆంధ్రవచన వాఙ్మయం-ఉత్పత్తి, వికాసములు’ అను అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్డీ. పట్టా పొందారు.

ఉద్యోగజీవితం

[మార్చు]

కులశేఖరరావు ఉపాధ్యాయుడిగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించారు. హైదరాబాదులోని నిజాం కళాశాల, సైఫాబాద్ పిజి కళాశాల, వరంగల్ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలోనూ తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. 1965లో రీడర్ గా పదోన్నతి పొందారు. 1975లో ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో రీడర్ గా ప్రవేశించి, ఆచార్యులుగా, తెలుగు శాఖాధ్యక్షులుగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా వివిధ హోదాలలో సేవలు అందించి, 1992లో పదవీ విరమణ పొందారు. తెలంగాణ సారస్వత పరిషత్ కార్యవర్గ సభ్యుడిగా సంస్థ అభివృద్ధికి చేయూతను అందిస్తూ, తెలుగు భాషా సాహిత్య వికాసానికి కృషి చేశారు. విశ్వవిద్యాలయ ఆచార్యులుగా ఉన్నప్పుడు వారు సంప్రదాయ సాహిత్య అంశాలను పరిశోధక వస్తువులుగా ఇచ్చి ఎందరో ఎంఫిల్, పీ.హెచ్ డి. పరిశోధక విద్యార్థులకు మార్గ దర్శకత్వం వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులుగాను పనిచేశారు.

సాహిత్య సేవ

[మార్చు]

కులశేఖరరావు తెలుగు సాహిత్యం, విమర్శ రంగాలలో కృషి చేశారు,  ‘విజయవిలాసం’ మరికొన్ని కావ్యాలకు వ్యాఖ్యానాలను రచించారు. 14 వ శతాబ్దిలో రచింపబడిన, తెలుగులో తొలి గద్య రచన కృష్ణమాచార్యులు రచించిన 'సింహగిరి వచనాలు' పై వీరు పరిశోధన చేసి అనేక విషయాలను వెలుగులోకి తెచ్చారు. తంజావూరు గ్రంథాలయంలో భద్రపరిచిన ఈ ప్రతిలో ఉన్న 60 సంకీర్తనా వచనాలను కులశేఖరరావు పీఠికతో 1968లో ఆంధ్ర రచయితల సంఘం, 1980లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, 2018లో తెలంగాణ సాహిత్య అకాడమీ వారు ముద్రించారు.

తెలుగు సాహిత్య చరిత్రను  'ఏ హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్'[1]  పేరిట ఆంగ్లంలో ఒక విమర్శనా గ్రంథాన్ని రాశారు.  ప్రముఖ రచయిత్రి డాక్టర్ పాకాల యశోదా రెడ్డితో కలిసి  'కావ్యానుశీలం'  అనే గ్రంథాన్ని రచించారు. యువ పరిశోధకులకు ఉపయుక్తమయ్యే విధంగా 'తెలుగు సాహిత్యం పరిశోధన'  అనే గ్రంథాన్ని, 'సాహిత్య పరిశోధనా పద్ధతులు' అనే మరొక గ్రంథాన్ని వెలువరించారు.  జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డిపై ఉండే అభిమానంతో, వారి బహుముఖ పాండిత్యాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఆంగ్లంలో  'Dr.C.Narayana Reddy a literary profile' [2] అనే గ్రంథాన్ని  'Towards multitude'(selected poems of Dr C Narayana Reddy) [3]అనే మరో గ్రంథముతోపాటు, విదేశాలలోని వారికి మన పురాణాలలోని విశిష్టతను తెలియజేసే విధంగా మహాభారతంలోని 18 పర్వాలను ఆంగ్లంలోకి అనువాదం చేశారు. ఇవే కాకుండా చేమకూర వెంకటకవి కవితా వైభవం, తెలుగు వచన వికాసం, రుచిరాలోకం వంటి విమర్శనా గ్రంథాలను, సీతాసతి, శ్రీనివాస శతి, శ్రీ కృష్ణ చరిత్ర, యశోధర చరిత్ర, శ్రీకృష్ణ విలాసం[4] మొదలైన  పద్య కావ్యాలను రచించారు.

'ఆంధ్ర వచన వాఙ్మయం - ఉత్పత్తి వికాసములు' అనే అంశంపై డాక్టర్ దివాకర్ల వెంకటావధాని  పర్యవేక్షణలో  పరిశోధన చేశారు. వారు భాగ్యనగరం, వందేమాతరం,  ఆలోకనం, దర్శనం, లోక గీత, కలియుగం మొదలైన పద్య సంపుటులను వెలువరించారు.

ఆచార్య మడుపు కులశేఖర రావు ఉద్యోగ రీత్యా, కుటుంబ పరిస్థితుల కారణముగా అమెరికా, కెనడా వంటి దేశాలలో పర్యటించినపుడు, వారు దర్శించిన చారిత్రక విశేషాలను, అద్భుత దృశ్యాలను, అపురూప కట్టడాలను పద్య రూపములో పశ్చిమం, వైదేశికం[5] వంటి గ్రంథాలలో వర్ణించారు.  వీటిని చూసిన తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ కులపతి డా.పేర్వారం జగన్నాథం  పద్య రూపములో వచ్చిన మొట్టమొదటి యాత్రా చరిత్రలుగా పేర్కొన్నారు.

పురస్కారాలు

[మార్చు]
  1. పల్లా దుర్గయ్య సాహితీ పురస్కారం (దుర్గయ్య గారి కుమారులచే ఇవ్వబడినది)
  2. ఆచార్య దివాకర్ల వేంకటావధాని సాహిత్య పురస్కారం (యువభారతి సంస్థచే ఇవ్వబడినది)
  3. బూర్గుల రామకృష్ణారావు సాహిత్య పురస్కారం
  4. తెలుగు విశ్వవిద్యాలయం వారి విశిష్ట విద్వాంసుడి కీర్తి పురస్కారం

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. A History of Telugu Literature by Prof. M. Kulasekhara Rao, Master Arts Printers, Hyderabad,March,1988
  2. Dr.C.Narayana Reddy a literary profile by Prof. M. Kulasekhara Rao, IndiraDevi Publications, Hyderabad, 1993
  3. 'Towards multitude' (selected poems of Dr C Narayana Reddy) by M. Kulasekhara Rao, Maitreya Arts & Printers, Hyderabad
  4. శ్రీకృష్ణ విలాసం- ఆచార్య కులశేఖరరావు, నవయుగ ప్రచురణలు, హైదరాబాద్,2004
  5. వైదేశికం- ఆచార్య కులశేఖరరావు, పార్థసారథి ప్రింటర్స్, హైదరాబాద్,2006