Jump to content

ఎకరార్ నామా

వికీపీడియా నుండి

హైదరాబాదు రాజ్యంలో పత్రికలపై ఆంక్షలు విధించే క్రమంలో నిజాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధన, ఎకరార్ నామా. ఈ నిబంధనను 1891 లో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ హోం సెక్రెటరీగా ఉన్న ఫతేనవాబ్‌జంగ్‌ బహద్దూర్‌, పోలీస్‌ కమీషనరుకు ఒక ఆదేశాన్ని పంపించాడు. ఆ నోటీసు ప్రకారం పత్రికలు ప్రభుత్వానికి ఒక “ఎకరార్‌ నామా” రాసి ఇవ్వాలి. అప్పట్లో ప్రచురణలో ఉన్న “దక్కన్‌పంచ్‌”, “హైద్రాబాదు గెజెటొ అనే పత్రికలు ఈ “ఎకరార్‌నామా”లను దాఖలు చేయాలని ఆ నోటీసులో ఆదేశించాడు. “ఎకరార్‌నామా”ను ఉల్లంఘించిన పత్రికలపై పోలీస్‌ కమిషనరు ప్రభుత్వానికి రిపోర్టు చేయాలి. అవసరమైతే పత్రికను మూసివేసేందుకు కూడా పోలీస్‌ కమిషనరుకు ఆజ్ఞ ఇచ్చారు. అలా మూసివేతకు గురైన తొలిపత్రిక షౌకతుల్ ఇస్లాం.

నిబంధనలు

[మార్చు]

ఉర్దూలో ఎకరార్‌ నామా అంటే ఒప్పుకోలు పత్రం అని అర్థం. ఇందులో ఏడు నిబంధనలున్నాయి. అవి:[1]

  1. బ్రిటిష్‌ ప్రభుత్వమునకు వ్యతిరేకంగా ఏమీ రాయరాదు.
  2. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసలే రాయగూడదు.
  3. బ్రిటిషు భారతదేశంలో గానీ హైదరాబాదు రాజ్యంలో గానీ ప్రజలలో మత సంఘర్షణలు, వర్గ సంఘర్షణలకు దారితీసే రాతలు రాయకూడదు. ఈ రాతల ధోరణిని నిర్ణయించేది పోలీసు అధికారులే.
  4. ప్రజలకు భయం, బెదిరింపు, విచారమూ కలిగించే రచనలు ప్రచురించరాదు
  5. ప్రభుత్వోద్యోగులను బెదిరించే రాతలు ప్రచురించరాదు. వారి నడవడిని గూర్చి వ్యాఖ్యానించరాదు.
  6. ఆకాశరామన్న ఉత్తరాలు ప్రచురించరాదు. విలేఖరి పేరులేకుండా వార్తలు రాయగూడదు.
  7. ప్రభుత్వం మీదగానీ ప్రభుత్వ ఉద్యోగుల మీదగానీ ప్రజలకు చెడ్డ అభిప్రాయము కలిగించేలా రాయగూడదు.

ఈ నిబంధనలను ఉల్లంఘించే పత్రికలను మూసేసేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.[2] అలా మూసేసినందువలన పత్రికలకు కలిగే నష్టానికి ప్రభుత్వ బాధ్యత ఉండదు.

ఈ “ఎకరార్‌నామా”లను దాఖలు చేయాలని అప్పట్లో ప్రచురణలో ఉన్న “దక్కన్‌పంచ్‌”, “హైద్రాబాదు గెజెటొ అనే పత్రికలను ఆదేశించగా, అవి సమర్పించాయి. ఆ ఆదేశాలను పాటించని షౌకతుల్ ఇస్లాం అనే ఉర్దూ పత్రికను ప్రభుత్వం మూసివేయించింది.[3]

మూలాలు

[మార్చు]
  1. జె., చెన్నయ్య, ed. (2017). "19వ శతాబ్దమున హైద్రాబాదులో పత్రికా స్వాతంత్ర్యం". డా. దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి. హైదరాబాదు: తెలంగాణ సారస్వత పరిషత్తు. pp. 425, 426.
  2. వెలగా, వెంకటప్పయ్య (2012). తెలుగునాట గ్రంథాలయోద్యమం. హైదరాబాదు: తెలుగు అకాడమీ. p. 47.
  3. దేవులపల్లి రామానుజరావు (1991). తెలంగాణలో జాతీయోద్యమాలు. హైదరాబాదు: దేవులపల్లి రామానుజరావు గారి అభినందన సమితి. p. 32.