మాగంటి బాపినీడు

వికీపీడియా నుండి
(ఎమ్. బాపినీడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అన్నపూర్ణ, బాపినీడు

మాగంటి బాపినీడు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అగ్రశ్రేణి నాయకుడు. తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని "ఆంధ్ర సర్వస్వము" అన్న పేరుతో ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రచురించాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన తొలితరం నాయకులలో ఒకడు. ఇతని భార్య మాగంటి అన్నపూర్ణాదేవి కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నది. ఆమె మంచి రచయిత్రి, సమాజ సేవిక.

బాపినీడు 1895లో ఆగస్టు 14న చాటపర్రు గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. కె. వెంకటరత్నంరెడ్డి వంటి సంఘసంస్కర్తల ప్రభావం, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి రాజకీయ నాయకుల ప్రభావం అతనిపై బలంగా పడింది. ముందు చూపు కలిగిన అతని కుటుంబం కలకత్తాలో అతని విద్యాభ్యాసానికి ఏర్పాటు చేసింది. అక్కడ అనేక రచయితల పరిచయం లభించింది. తరచు శాంతినికేతన్ సందర్శించేవాడు. తరువాత అతను "ఇండియన్ డిఫెన్సు కార్ప్స్"లో చేరాడు. అలాంటి మిలిటరీ శిక్షణ పొందిన మొదటి ఆంధ్రుడు అతనే. కలకత్తాలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేవాడు. బెంగాల్ ఆంధ్రా అసోసియేషన్‌కు కార్యదర్శిగా పని చేశాడు. తరువాత అతను అన్నపూర్ణాదేవిని పెండ్లాడాడు.

"మల్లాది సత్యలింగం ప్రతిభా విద్యార్ధి"గా అతను అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్ళాడు. అక్కడ "న్యూయార్క్ స్టేట్ కాలేజి ఆఫ్ అగ్రికల్చర్"లో బి.ఎస్‌.సి చదివాడు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎస్‌.సి పూర్తి చేశాడు. ప్రొఫెసర్ వెబర్ అనే పండ్ల నిపుణుని వద్ద పని చేశాడు. కార్నెల్ విశ్వవిద్యాలయం స్కాలర్‌షిప్పు లభించింది. కార్నెల్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ వ్యవసాయక సంఘం (International Agricultural Society of the Cornell University) కి అతను స్థాపకుడు, మొదటి ప్రెసిడెంట్ కూడాను. కాలిఫోర్నియాలో హిందూస్తాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు.

తరువాత బాపినీడు భారత దేశం తిరిగి వస్తూ మధ్యలో జపాన్ దేశాన్ని సందర్శించాడు. 1923లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కిసాన్ ఉద్యమం ప్రాంభించాడు. "ఆంధ్ర రైతు సభ" మొట్టమొదటి కార్యదర్శిగా పనిచేశాడు. గోదావరి-కృష్ణా సెటిల్మెంట్ సెంట్రల్ కమిటీలో చురుకుగా పనిచేశాడు. కిసాన్ ఉద్యమాలు నడిపినందుకు ఆరు నెలలు జైలు శిక్ష అననుభవించాడు.

1926లో అతని భార్య మరణం అతనికి పెద్ద దెబ్బ. ఆమె అతని దీక్షాకార్యక్రమాలలో చేదోడుగా ఉన్న ప్రతిభాశాలిని. బాపినీడు ఆంధ్ర విశ్వవిద్యాలయం సిండికేట్ మెంబరుగాను, ఆంధ్ర హరిజన సేవక సంఘం కార్యదర్శిగాను కూడా పనిచేశాడు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. ఎ.ఐ.సి.సి. మెంబరుగా ఉన్నాడు. 1937లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశాడు.

బయటి లింకులు[మార్చు]