ఎస్.జి.సర్దేశాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎస్.జి. సర్దేశాయిగా సుపరిచితులైన శ్రీనివాస్ గణేష్ సర్దేశాయి భారత జాతీయవాది. స్వాతంత్ర్య సమరయోధుడు. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం సృష్టించిన మహోన్నత నాయకులలో ఒకరు. మహారాష్ట్రలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాణానికి మూలస్తంభమై నిలిచిన వ్యక్తి. మార్క్సిస్ట్ మేధావి. ప్రసిద్ధ పాత్రికేయుడు. తీవ్రమైన సైద్ధాంతిక విశ్లేషణతో, లోతైన పాండిత్యంతో ఈయన రచించిన Progress and conservatism in ancient India (ప్రాచీన భారతదేశంలో ప్రగతి, సాంప్రదాయం) విశిష్ట గ్రంథంగా పేరుగాంచింది.

బాల్యం-విద్యాభ్యాసం

[మార్చు]

ఎస్.జి. సర్దేశాయి 1907, మార్చి 7వ తేదీన జన్మించారు.1927 లో బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి సర్వప్రథముడుగా పట్టభద్రత సాధించారు. బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ ఉదారవాదిగా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రభావితమైనారు.

రాజకీయజీవితం

[మార్చు]
South Asian Communist Banner.svg
భారత కమ్యూనిస్టు పార్టీ

1929 లో భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు. స్వాతంత్ర్య పోరాటంలో, కార్మిక ఉద్యమాలలోను ప్రజలతో మమేకమై సుశిక్షిత పోరాటాలు చేశారు. బ్రిటీష్ పరిపాలనలో 6 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. రాజద్రోహం తదితర నేరారోపణల నేపథ్యంలో చాలాకాలం అజ్ఞాతవాస జీవితం గడిపారు. మహారాష్ట్రలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాణానికి మూలస్తంభమై నిలిచారు. 1942 నుండి భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క సెంట్రల్ కమిటీ సభ్యులుగా చాలాకాలం కొనసాగారు.

స్వాతంత్ర్యానంతరం వివిధ ప్రజాస్వామిక ఉద్యమాలలోను చురుకుగా పాల్గొన్నారు. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (పోలిట్ బ్యూరో) సభ్యుడుగా, 1967-71 మద్యకాలంలో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర సెక్రటేరియట్ సభ్యులుగా కొనసాగారు. 1970-76 లో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. 1982 లో కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ అధ్యక్షులుగా ఎన్నిక అయ్యారు. కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధిగా అనేక అంతర్జాతీయ కమ్యూనిస్టు సమావేశాలలో పాల్గొన్నారు. 1989 లో మాస్కోలో జరిగిన కమ్యూనిస్టు పార్టీల అంతర్జాతీయ సమావేశంలో డ్రాఫ్టింగ్ కమిషన్ సభ్యులుగా నియుక్తులయ్యారు.

తన 60 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో సైద్ధాంతిక నిబద్ధతతో, అవిశ్రాంత యోధుడిలా అలుపెరుగని పోరాట పటిమను ప్రదర్శించిన ఎస్.జి. సర్దేశాయి భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం సృష్టించిన అగ్రగణ్య నాయకులలో ఒకరిగా పేరుగాంచారు. పి.సి. జోషి, ఎస్.ఎ. డాంగె, భవాని సేన్, బి.టి రణదేవ్, మాకినేని బసవపున్నయ్య, ముజఫర్ అహ్మద్, జి.అధికారి, మోహన కుమార మంగళం, ఎన్.కె. కృష్ణన్ తదితర మహోన్నత కమ్యూనిస్ట్ నాయకుల సరసన సుస్థిర స్థానం సంపాదించుకొన్నారు.

పాత్రికేయ, రచనా జీవితం

[మార్చు]

సంస్కృత, మరాఠి, ఆంగ్ల భాషలోను భాషలలోను ప్రావీణ్యం వున్న ఎస్.జి. సర్దేశాయి మార్క్సిస్ట్ విద్వాంసుడుగా, ప్రసిద్ధ పాత్రికేయుడుగా, సంపాదకుడుగా. మార్క్సిస్ట్ రచయితగా వుంటూ రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, చరిత్ర మొదలైన విషయాల గురించి పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు, వ్యాసాలు రచించారు. వీరి గ్రంథాలలో అత్యధిక భాగం కమ్యూనిస్టు పార్టీ పబ్లికేషన్ వారిచే ముద్రించబడినవి. వీరి కలం నుండి 1986 లో వెలువడిన సుప్రసిద్ధ గ్రంథం Progress and conservatism in ancient India. ఎస్.జి. సర్దేశాయి సైద్ధాంతిక విశ్లేషణకు, లోతైన మార్క్సిస్ట్ పాండిత్యానికి అద్దం పట్టిన ఈ పుస్తకం విశేష ప్రజాదరణ పొందింది.

రచనలు

[మార్చు]

వీరు రచించిన పుస్తకాలలో ప్రముఖమైనవి.

  • The Nehru 5-year plan (1951)
  • Forward to the liberation of Goa! (1955)
  • New history of the Marathas (1957)
  • Kashmir; defence, democracy, secularism (1965)
  • India's Path to Socialism (1966)
  • Devaluation : The great betrayal (1966)
  • India and the Russian Revolution (1967)
  • For anti-imperialist unity democratic consolidation (1969)
  • Fascist menace and democratic unity (1970)
  • Student Upsurge and Indian Revolution (1974)
  • Shivaji : contours of a historical evaluation (1974)
  • भारतीय तत्त्वज्ञान: वैचारिक आणि सामाजिक संघर्ष (1974) (మరాఠ భాషలో)
  • Class struggle and caste conflict in rural areas (1979)
  • National integration for democracy and socialism (1981) )
  • Marxism and the role of the working class in India (1982)
  • Marxism and the Bhagvat Geeta (1982)
  • The heritage we carry forward and the heritage we renounce (1984)
  • Progress and conservatism in ancient India (1986)
  • Marathi riyasata (1988)

1974 లో రచించిన Student Upsurge and Indian Revolution గ్రంథంలో ఆనాటి భారతదేశంలో ముఖ్యంగా బీహారీ విద్యార్థి లోకంలో చెలరేగిన అశాంతి తీరు తెన్నులను కమ్యూనిస్టు దృక్పధంతో విశ్లేషించారు.

1974లో రచించిన Shivaji : contours of a historical evaluation గొప్ప మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జరిపిన అధికార పోరాటం యావత్తూ ఆర్థిక, రాజకీయ కారణాలతో ప్రభావితంయ్యిందే తప్ప హిందూ మతపరమైన కారణాలతో కాదని సైద్ధాంతికంగా విశ్లేషించారు.

1982 లో Marxism and the Bhagvat Geeta పేరుతొ భగవద్గీత వికాసాన్ని చారిత్రిక, సామాజిక తులనాత్మక దృష్టితో, శాస్రీయ దృక్పధంతో సమగ్రంగా విశ్లేషిస్తూ అది ప్రమాదకరమైన పరిణామాలకు దారితీసిన అంశంగా గుర్తించారు. పైగా గీతకు వ్యాఖ్యానాలు రాసిన వారందరూ (బాలగంగాధర తిలక్, గాంధీ, అరబిందో, సర్వేపల్లి రాధాకృష్ణన్) అగ్ర కులాలనుంచి వచ్చిన వారేనని, అణగారిన కుల ఉద్యమాలకు చెందిన వారు (కబీర్, గురునానక్, తుకారాం, జ్యోతిబా ఫూలే) గీతను పట్టించుకోక పోవడాన్ని ప్రత్యేకంగా గుర్తించి విశ్లేషించారు.

1986 వ సంవత్సరంలో శాస్రీయ దృష్టితో సమగ్రంగా విశ్లేషిస్తూ Progress and conservatism in ancient India (తెలుగులో ’ ప్రాచీన భారతదేశంలో ప్రగతి, సాంప్రదాయం ’) అనే విశిష్ట గ్రంథాన్ని రచించారు. ఎస్.జి. సర్దేశాయి సైద్ధాంతిక విశ్లేషణకు, అపారమైన పాండిత్యానికి అద్దం పట్టిన ఈ గ్రంథం వీరి పుస్తకాలలో అత్యంత పేరిన్నిక గన్నది, విశేష ప్రజాదరణ పొందింది. గత 25 సంత్సరాలుగా అనేకమంది భారతీయ ఆలోచనాపరులను ప్రభావితం చేసింది. ఈ గ్రంథంలో రచయిత ఋగ్వేద కాలం నుండి సా.శ. 1200 వరకూ వున్న కాలాన్ని సమీక్షిస్తూ ఆ సుదీర్ఘ కాలంలో భారతదేశంలో ఒక సామాజిక విప్లవం కనీసం తలెత్తకపోవడానికి కారణాలను భౌగోళిక కారణాల పరంగా గుర్తించి విశ్లేషించారు.

మన ప్రాచీన భారతీయ సంసృతిలో ఉదాత్తమైన అంశాలు, అభ్యుదయకరమైన అంశాల గురించి, అదే సమయంలో మన ప్రాచీన సంసృతిలో నిరంకుశమైన అంశాలు, అభివృద్ధి నిరోధకమైన అంశాలు గురించి చారిత్రిక, తులనాత్మక దృష్టితో విమర్శనాత్మకంగా పరిశీలించారు. మన సంస్కృతిలో ఏ ఏ విషయాలలో మనం గర్వించ తగినవో, ప్రస్తుత సమస్యల పరిష్కారానికి ఏ ఏ అంశాలు మనకు ప్రేరణ కలిగిస్తాయో పరిశీలిస్తూ చదువరులకు ఒక అవగాహన కలిగించారు. అంతేకాదు. మన ప్రాచీన సంస్కృతిలో త్యజించవలసిన అంశాలు, తిరస్కరించవలసిన విషయాల పై కూడా రచయిత ఈ గ్రంథంలో విశ్లేషించారు. రచయితగా ఎస్.జి. సర్దేశాయి పేరును చిరస్థాయిగా నిలబెట్టిన మేటి విశిష్ట రచన ఇది. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారిచే తెలుగులో అనువదించబడిన ఈ గ్రంథాన్ని “ ప్రాచీన భారతదేశంలో ప్రగతి, సాంప్రదాయం “ అనే పేరుతొ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు.

మరణం

[మార్చు]

ఎస్.జి. సర్దేశాయి 1996 నవంబరు, 21 న మరణించారు.

మూలాలు

[మార్చు]