ఏల్చూరి సుబ్రహ్మణ్యం
ఏల్చూరి సుబ్రహ్మణ్యం | |
---|---|
![]() ఏల్చూరి సుబ్రహ్మణ్యం చిత్రం | |
జననం | ఆగష్టు 26, 1920 |
మరణం | ఫిబ్రవరి 25, 1995 |
వృత్తి | కవి, రచయిత, పాత్రికేయుడు, సినిమా గీత రచయిత |
పిల్లలు | ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు |
తల్లిదండ్రులు |
|
ఏల్చూరి సుబ్రహ్మణ్యం ( జ:ఆగష్టు 26, 1920 - మ:ఫిబ్రవరి 25, 1995) ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు. ఆయన తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత వహించిన అభ్యుదయ కవిత్వోద్యమానికి ఆద్యుల్లో ఒకరు. నయాగరా కవులుగా ప్రసిద్ధి పొందిన ముగ్గురిలో ఒకరు.
జీవితవిశేషాలు[మార్చు]
నయాగరాకవులలో ఒకరుగా ప్రసిద్ధులయిన ఏల్చూరి సుబ్రహ్మణ్యం జననం ఆగష్టు 25, 1920. తండ్రి రామయ్య. తల్లి సుబ్బాయమ్మ. ప్రముఖ వేణుగాన కళావిద్వాంసులు ఏల్చూరి విజయరాఘవరావు వీరి సోదరులు[1]. ఏల్చూరి మురళీధరరావు వీరి కుమారుడు. సహజకవిగా, మహావక్తగా, ఉద్యమప్రవక్తగా, అజాతశత్రువుగా, అఖిలాంధ్ర కవిలోకానికి ఆత్మీయ మిత్రునిగా మెలగారు.
విద్య[మార్చు]
మద్దులపల్లి గురుబ్రహ్మశర్మ, భాగవతుల వెంకట సుబ్బారావు, అక్కిరాజు రామాపతిరావు, నాయని సుబ్బారావులు చిన్ననాటి గురువులు. బి.ఎ. చదువుతున్న రోజులలో కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసులతో పరిచయమై, తరువాతికాలంలో “నయాగరా” కవితాసంకలనం సమకూర్చడానికి దోహదమయింది. బి.ఎ. డిగ్రీ (యస్.ఆర్.ఆర్ కళాశాల), విజయవాడ
సాహిత్యప్రస్థానం[మార్చు]
సుబ్రహ్మణ్యం గారు నయాగరా కవిత్రయంలో ఒకరు. మిగిలిన ఇద్దర్లో ఒకరు బెల్లంకొండ రామదాసు గారు కాగా మరొకరు వచన కవి కుందుర్తి ఆంజనేయులు గారు[2] .‘త్రివేణి’ ఆంగ్లపత్రిక సంపాదకులు కోలవెన్ను రామకోటేశ్వరరావు, దేశిరాజు కృష్ణశర్మ, బెల్లంకొండ రాఘవరావు, గుడిపాటి వెంకటచలం, గుఱ్ఱం జాషువాల ప్రభావపరిధిలో స్ఫూర్తిని పొంది, పులుపుల శివయ్య, కొల్లా వెంకయ్యల మూలాన కమ్యూనిస్టు ఉద్యమప్రవేశం చేశారు. 1940 లో నరసరావుపేటలో ‘సన్యాసి’ అన్న పత్రికను స్థాపించి అనిసెట్టి సుబ్బారావు, దండమూడి కేశవరావు (ఆ తర్వాత సన్న్యసించి శ్రీ కేశవతీర్థస్వామి అయ్యారు, బహుగ్రంథకర్త), బెల్లంకొండ రామదాసు, దేవరకొండ బాలగంగాధర తిలక్ మొదలైన కవుల తొలిరచనలను అచ్చువేశారు. అదే సంవత్సరం ‘చిత్ర’ అన్న పత్రికను ప్రారంభించారు. 1941 లో ‘నవ్యకళాపరిషత్తు’ను స్థాపించి అనిసెట్టి సుబ్బారావు, కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, సముద్రాల రామానుజాచార్య, దేవరకొండ బాలగంగాధర తిలక్, రెంటాల గోపాలకృష్ణ మొదలైన అభ్యుదయకవులను సభ్యులుగా చేర్చుకొన్నారు. వారి రచనలతో 1943 లో ‘మాఘ్యమాల’ కవితాసంపుటాన్ని ప్రకటించారు. శ్రీశ్రీ కవిత్వప్రభావస్ఫూర్తితో 1944 ఆగస్టులో బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం సంయుక్త కృషిఫలితంగా సుప్రసిద్ధకవితాసంకలనం ‘నయాగరా’ వెలువడి అభ్యుదయ సాహిత్యోద్యమంలో అచ్చయిన తొలి కవితాసంపుటంగా పేరుపొందింది.[3] అనిసెట్టి సుబ్బారావు, లక్ష్మీదేవి ("అని-ల") లకు పెళ్ళికానుకగా గుంటూరులో వీరి గురుదేవులు విశ్వనాథ సత్యనారాయణగారి చేతుల మీదుగా విడుదలయింది. ఇందులోనే వీరి సుప్రసిద్ధకవిత ‘ప్రజాశక్తి’[4], 'ఠాకూర్ చంద్రసింగ్'[5], 'విజయముద్ర'[6] మొదలైనవి ఉన్నాయి. ‘సకలప్రజా సముద్ధర్త, సుప్తోద్ధృత జీవశక్తి’, ‘తమసగర్భ దళనహేతి’, ‘బంధీకృత ధనికశక్తి’, ‘రక్తారుణకుసుమం’, ‘బానిస సంద్రం’, ‘జనవిపంచి పాడిన జాబిల్లి పాట’ వంటి పదబంధాలు దీనిలోనివే.
1956 లో వీరిది తెలుగు సాహిత్యంలో తొలి దీర్ఘకవిత ‘నవంబరు 7’ విశాలాంధ్ర పత్రికలో వెలువడింది. తల్లావఝుల శివశంకరశాస్త్రి గారితోడి సన్నిహితత్వం వల్ల నవ్యసాహిత్యపరిషత్తు సభ్యునిగా ఆ సమావేశాలకు హాజరయ్యారు. అనేక ప్రగతిశీల ఉద్యమాలలో పాల్గొన్నారు. వందలాది రష్యన్ కవితలను ఆంగ్లమాధ్యమం ద్వారా అనువదించారు. శ్రీరంగం శ్రీనివాసరావు, ఆరుద్ర, అబ్బూరి వరదరాజేశ్వరరావు సంయుక్తంగా రాసిన “మేమే” కావ్యాన్ని సుబ్రహ్మణ్యంగారికి అంకితం చేసేరు.
"ఏల్చూరి సుబ్రమణ్యం, తొల్చూలు నయాగరాసుతుడు తానెపుడూ, పల్చనకొప్పడు అరసం, కేల్చూపిన కవుల దిట్ట కేరాలక్ష్మీ" అని ఆరుద్ర వీరిపై చెప్పిన సుప్రసిద్ధ చాటువు.
ఉద్యోగాలు[మార్చు]
పాత్రికేయుడుగా[మార్చు]
- 1940 లో నరసరావుపేటలో ‘సన్యాసి’ అన్న పత్రికను స్థాపించి, అనేక ప్రముఖ కవులరచనలు ప్రచురించేరు.
- ఆంధ్రసర్వస్వము (సం. మాగంటి బాపినీడు¬¬) సుబ్రహ్మణ్యం సహాయసంపాదకుడు, 1941-42.
- 'క్రాంతి' పత్రిక (సం. బొందలపాటి శివరామకృష్ణ)లో 1947
- 'పొగాకులోకం' (గుంటూరు) పత్రిక సంపాదకులు
- సోషలిస్టు పత్రిక, 1952
- 'తెలుగుదేశం' (సూర్యదేవర రాజ్యలక్ష్మి)
- ఆకాశవాణిలో స్క్రిప్టు రైటరు, 1954-56, రాయప్రోలు రాజశేఖర్, జలసూత్రం రుక్మీణనాథశాస్త్రిగారలతో కలిసి పని చేసేరు.
- 'నేత' పత్రిక సంపాదకులు, 1956.
- 'సోవియట్ భూమి' పత్రిక సంపాదకవర్గంలో, 1961-1988.
- 'అభ్యుదయ' పత్రిక మద్రాసులో నిర్వాహకసభ్యునిగా.
సినిమా రంగంలో[మార్చు]
కవితలు, కావ్యాలు[మార్చు]
- “శాంతిపత్రంమీద సంతకం చేసిన చెయ్యి” కావ్యం
- “మాఘ్యమాల” కవితా సంపుటం, 1943. నవ్యకళాపరిషత్ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖ కవుల కవితాసంకలనం.
- నయాగరా కవితాసంపుటి. కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు రాసిన ఖండికల సంపుటి. 1944, 1975.
- “నవంబరు 7” తొలి దీర్ఘకవిత. 1956లో విశాలాంధ్ర'లో వెలువడింది.
కథలు[మార్చు]
- నా ప్రేయసి (మూలం: ఎల్ సోబలేవ్) (కథ) [అభ్యుదయ - 01.10.46] అజంతా/ఏల్చూరి సుబ్రహ్మణ్యం/బెల్లంకొండ రామదాసు/నెల్లూరి కేశవస్వామి –
- చతురస్రం (సీరియల్) తెలుగు స్వతంత్ర, 18.01.57, 25.01.57, 01.02.57. అజంతా, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, నెల్లూరి కేశవస్వామి.
ఆయన రచనలు[మార్చు]
నా ప్రేయసి | చతురస్రం |
మూలాలు[మార్చు]
- ↑ "రచ్చ గెలిచి ....ఇంట తెలియని మా వూరి వేణువు". narasaraopet-bloggers.blogspot.in. Thursday, February 9, 2012. Retrieved 7April2014.
{{cite web}}
: Check date values in:|accessdate=
and|date=
(help) - ↑ "అభిప్రాయకదంబం 03". sites.google.com/site/siraakadambam/home/abhiprayakadambam/abhiprayakadambam-03. 05-04-2012. Retrieved 7April2014.
{{cite web}}
: Check date values in:|accessdate=
and|date=
(help) - ↑ [ http://www.andhrabharati.com/vachana/vyAsamulu/nayAgarA_GVS.html Archived 2013-10-28 at the Wayback Machine]
- ↑ "8. ప్రజాశక్తి (జూన్ 41) - సుబ్రహ్మణ్యం". andhrabharati.com/kavitalu/nayAgarA/nayAgarA8.html. Retrieved 7April2014.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help) - ↑ "7. ఠాకూర్ చంద్రసింగ్ (జులై 43) - సుబ్రహ్మణ్యం". andhrabharati.com. Retrieved 7April2014.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help) - ↑ "9. విజయముద్ర (మార్చి 41) - సుబ్రహ్మణ్యం". andhrabharati.com. Retrieved 7April2014.
{{cite web}}
: Check date values in:|accessdate=
(help)
వెలుపలి లంకెలు[మార్చు]
- Pages using infobox person with unknown parameters
- Pages using Infobox person with deprecated parameter home town
- Infobox person using residence
- Infobox person using home town
- తెలుగు రచయితలు
- తెలుగు కథా రచయితలు
- 1920 జననాలు
- 1995 మరణాలు
- తెలుగు సినిమా పాటల రచయితలు
- తెలుగు పాత్రికేయులు
- అభ్యుదయ సాహిత్య ఉద్యమం
- గుంటూరు జిల్లా కవులు
- గుంటూరు జిల్లా రచయితలు
- గుంటూరు జిల్లా పాత్రికేయులు
- నయాగరా కవులు
- నరసరావుపేట