ఏషియన్ బార్డ్ ఔలెట్
| ఏషియన్ బార్డ్ ఔలెట్ | |
|---|---|
| ఏషియన్ బార్డ్ ఔలెట్ – సత్తాల్, ఉత్తరాఖండ్, భారతదేశం | |
| Scientific classification | |
| Unrecognized taxon (fix): | Glaucidium |
| Species: | Template:Taxonomy/GlaucidiumG. cuculoides |
| Binomial name | |
| Template:Taxonomy/GlaucidiumGlaucidium cuculoides (Vigors, 1830) | |
| జీవన ప్రాంత పటం (ఆకుపచ్చ రంగు స్థిర నివాస ప్రాంతాన్ని సూచిస్తుంది) | |
ఏషియన్ బార్డ్ ఔలెట్ (Glaucidium cuculoides), దీనిని కుకూ ఔలెట్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రధాన భూభాగమైన ఆగ్నేయ ఆసియా అడవులు, పొద కాదాల నుండి పాకిస్తాన్ ఉత్తర భాగాన గల హిమాలయాల అడుగుభాగాల వరకు విస్తరించి ఉన్న ఒక చిన్న గుడ్లగూబ (పిగ్మీ ఔల్) జాతి. ఇది 22-25 సెంటీమీటర్ల పొడవుతో, పిగ్మీ గుడ్లగూబల రకాల్లో కొంచెం పెద్ద పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఇవి ఎక్కువగా కీటకాలను తింటాయి. కొన్నిసార్లు బల్లులు, చిన్న ఎలుకలు, పక్షులను సైతం ఆహారంగా తీసుకుంటాయి.
వివరణ
[మార్చు]ఏషియన్ బార్డ్ ఔలెట్ 22-25 సెంటీమీటర్ల పొడవుండే చిన్న పక్షి.[3] మగ పక్షులు 150-176 గ్రాములు, ఆడ పక్షులు 240 గ్రాముల వరకు బరువుంటాయి.[4] నిజామైన గుడ్లగూబల కుటుంబానికి (Strigidae) చెందిన మిగిలిన పక్షుల లాగే, వీటిలో కూడా మగవాటి కంటే ఆడ పక్షులు పెద్దవిగా ఉంటాయి. ఇవి తెల్లటి గొంతు భాగంతో, దట్టమైన చారలు గల ముదురు గోధుమ లేదా ఒలివ్-గోధుమ రంగును కలిగి ఉంటాయి. రొమ్ము, పొత్తికడుపు భాగాలు తెల్లగా ఉండి, వాటిపై ముదురు గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. తోక, రెక్కలు ముదురు గోధుమ రంగులో తెల్లటి గీతలతో ఉంటాయి. ఇతర పిగ్మీ గుడ్లగూబల వలె వీటికి తల వెనుక భాగంలో నకిలీ కళ్లు (false eyes) ఉండవు. చిన్న వయసు పక్షుల రొమ్ము భాగంలో చారలకు బదులుగా గీతలు ఉంటాయి, తల భాగం ఎరుపు-గోధుమ రంగులో ఉంటుంది. ఇవి జావాన్ ఔలెట్, కాలర్డ్ ఔలెట్ పక్షులను పోలి ఉంటాయి.
ఇవి పగటిపూట ఎక్కువగా సంచరిస్తాయి. వేట కోసం ఎండిన చెట్ల కొమ్మలపై కూర్చుని పగటిపూట స్వేచ్ఛగా తిరుగుతాయి. పగలు క్రియాశీలంగా ఉండటం వల్ల చిన్న పక్షులు వీటిని చుట్టుముట్టి అరుస్తూ వేధిస్తాయి (mobbing). అటువంటప్పుడు ఇవి కదలకుండా నిశ్శబ్దంగా కూర్చుంటాయి. ఇతర చిన్న గుడ్లగూబల వలె ఇవి కూడా గాల్లో వేగంగా రెక్కలు ఆడిస్తూ, మధ్యమధ్యలో రెక్కలు మూసి విరామం తీసుకుంటూ అలల ఆకారంలో (undulating) ఎగురుతాయి.[5]
వర్గీకరణ
[మార్చు]ఏషియన్ బార్డ్ ఔల్ (Glaucidium cuculoides) అనేది నిజామైన గుడ్లగూబల కుటుంబమైన 'స్ట్రిగిడే' (Strigidae) లో ఒక భాగం.[6] ఈ కుటుంబంలో 28 ప్రజాతులు, 194 జాతులు ఉన్నాయి. గ్లూసిడియమ్ (Glaucidium) ప్రజాతిలో పిగ్మీ గుడ్లగూబలు ఉంటాయి, ఇది ఎథీన్ (Athene) ప్రజాతికి దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది.[6] గ్లూసిడియమ్ ప్రజాతిలో గల 26 జాతులలో ఏషియన్ బార్డ్ ఔలెట్ ఒకటి. ఈ జాతిని మొదట 1831లో వివరించి, 'నాక్టువా కుక్యులోయిడ్స్' (Noctua cuculoides) అని నామకరణం చేశారు. ఆ తర్వాత దీనిని గ్లూసిడియమ్ ప్రజాతిలోకి మార్చారు.[5] కొన్ని సందర్భాల్లో దీనిని 'టేనియోగ్లాక్స్ కుక్యులోయిడ్స్' (Taenioglaux cuculoides) అనే పర్యాయపదంతో కూడా పిలుస్తారు.[5]
ప్రస్తుతం ఈ జాతిలో ఎనిమిది గుర్తింపు పొందిన ఉపజాతులు ఉన్నాయి:[7]
- G. c. cuculoides (Vigors, 1830) – పశ్చిమ, మధ్య హిమాలయాలు
- G. c. austerum Ripley, 1948 – ఈశాన్య భారతదేశం, భూటాన్, వాయువ్య మయన్మార్
- G. c. rufescens Baker, ECS, 1926 – ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్, దక్షిణ యునాన్ (దక్షిణ చైనా)
- G. c. whiteleyi (Blyth, 1867) – దక్షిణ చైనా నుండి ఈశాన్య వియత్నాం
- G. c. persimile Hartert, EJO, 1910 – హైనాన్ (దక్షిణ చైనా తీరం)
- G. c. delacouri Ripley, 1948 – ఈశాన్య లావోస్, వాయువ్య, మధ్య వియత్నాం
- G. c. deignani Ripley, 1948 – ఆగ్నేయ థాయిలాండ్, దక్షిణ వియత్నాం, కంబోడియా
- G. c. bruegeli (Parrot, 1908) – ఆగ్నేయ మయన్మార్, థాయిలాండ్
ఆవాసం - విస్తరణ
[మార్చు]
ఏషియన్ బార్డ్ ఔలెట్లు సాధారణంగా పైన్, ఓక్ అడవులు, ఉపఉష్ణమండల, ఉష్ణమండల సదాహరిత అడవులు వంటి అరణ్య ప్రాంతాలలో నివసిస్తాయి. ఇవి కొండల దిగువ ప్రాంతాల నుండి 2100 మీటర్ల ఎత్తు గల ఉప-పర్వత ప్రాంతాల వరకు కనిపిస్తాయి.[5] ఉత్తర పాకిస్తాన్ హిమాలయాలలో గరిష్టంగా 2700 మీటర్ల ఎత్తులో ఇవి కనిపించినట్లు రికార్డులు ఉన్నాయి.[8] ఇవి కొన్నిసార్లు మానవ నివాసాల సమీపంలోని తోటలు, పార్కులలో కూడా జీవిస్తాయి.[5] ప్రాథమిక అడవుల (primary forests) కంటే ద్వితీయ శ్రేణి అడవులలో (secondary forests) నివసించడానికే ఇవి ఎక్కువ మొగ్గు చూపుతాయి.[3]
ఇవి ఆగ్నేయ ఆసియాలోని ప్రధాన భూభాగంలో విస్తృతంగా ఉన్నాయి. దక్షిణ చైనా, భూటాన్, మయన్మార్, లావోస్, వియత్నాం, థాయిలాండ్, నేపాల్, బంగ్లాదేశ్, ఈశాన్య భారతదేశం, పాకిస్తాన్ లోని హిమాలయ పర్వత ప్రాంతాలలో ఇవి కనిపిస్తాయి.[4]
ప్రవర్తన
[మార్చు]శబ్దాలు
[మార్చు]మగ పక్షి పాడే పాట ఒక విధమైన గిలక శబ్దం వలె (trill) ఉండి 5-20 సెకన్ల పాటు సాగుతుంది. క్రమంగా శబ్దం పెరుగుతూ, కఠినమైన స్వరాలతో అకస్మాత్తుగా ఆగిపోతుంది. దీని సాధారణ పిలుపు మృదువైన "హూట్" శబ్దం వలె ఉంటుంది. ఇవి తెల్లవారుజామున, సూర్యోదయమైన కొన్ని గంటల వరకు చాలా చురుగ్గా శబ్దాలు చేస్తాయి, పగటిపూట ఏ సమయంలోనైనా అరువగలవు.[5]
ఆహారం
[మార్చు]వీటి ప్రధాన ఆహారం బీటిల్స్, మిడతలు, సికాడాలు వంటి కీటకాలు. ఇవి బల్లులు, చిన్న ఎలుకలు, చిన్న పక్షులను కూడా తింటాయి. చెట్టు కొమ్మలపై కూర్చుని వేటాడే ఇవి, గాల్లో ఎగురుతున్న పక్షులను సైతం పట్టుకోగలవు. గాల్లో ఎగిరిపోయే జపాన్ కాడె కోళ్లను (common quail) ఇవి వేటాడినట్లు పరిశోధనల్లో తేలింది.[5]
సంతానోత్పత్తి
[మార్చు]వీటి సంతానోత్పత్తి కాలం థాయిలాండ్‌లో జనవరి నుండి ఫిబ్రవరి వరకు, మిగిలిన ప్రాంతాలలో మార్చి నుండి జూన్ వరకు ఉంటుంది.[4] ఇవి చెట్ల తొర్రలలో, వడ్రంగి పిట్టలు (woodpeckers) లేదా బార్బెట్ పక్షులు వదిలివేసిన పాత గూళ్లలో నివసిస్తాయి.[4][5] కొన్నిసార్లు కాలర్డ్ స్కోప్స్ గుడ్లగూబల పాత గూళ్లను కూడా వాడుకుంటాయి.[9] గూటి స్థలం కోసం ఇవి వడ్రంగి పిట్టలను చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి.[5] 2017లో థాయిలాండ్‌లో చెట్లపై సరైన తొర్రలు దొరకకపోవడం వల్ల ఇవి నేలపై గూళ్లు పెట్టినట్లు గుర్తించారు.[4] ఒక జంట సంవత్సరానికి ఒకేసారి 3 నుండి 5 వరకు తెల్లటి, గుండ్రటి గుడ్లను పెడుతుంది.[4][5] పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులిద్దరూ కలిసి వాటికి ఆహారం అందిస్తూ సంరక్షిస్తాయి.[5] థాయిలాండ్‌లో ఏప్రిల్ నాటికే, ఇతర ప్రాంతాలలో జూలై ప్రారంభం నాటికి పిల్లలు ఎగరడం నేర్చుకుంటాయి.[4]
వలస
[మార్చు]ఇవి ఒకే చోట స్థిరంగా ఉండే పక్షులు, సుదూర ప్రాంతాలకు వలస వెళ్లవు. సంతానోత్పత్తి లేని కాలంలో కొండ ప్రాంతాల నుండి దిగువ మైదాన ప్రాంతాలకు స్థానికంగా మాత్రమే కొద్దిపాటి దూరాలు ప్రయాణిస్తాయి.[5]
మానవులతో సంబంధం
[మార్చు]ఈ పక్షులు తిరిగే కొన్ని ప్రాంతాలలో గుడ్లగూబలను అమంగళకరమైనవిగా, చెడు వార్తలకు సంకేతంగా భావిస్తారు. ఈ మూఢనమ్మకాల వల్ల ప్రజలు వీటిని కాల్చి చంపడం, గుడ్లను దొంగిలించడం, పురుగుల మందులు చల్లడం వంటి పనులు చేస్తుంటారు. పట్టణీకరణ, అడవుల నరికివేత వల్ల ఇప్పటికే ఆవాసాలను కోల్పోతున్న ఈ పక్షులకు, ఇటువంటి మానవ చర్యలు మరింత ముప్పుగా మారి స్థానిక పరిరక్షణ ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తున్నాయి.[9]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ BirdLife International (2016). "Glaucidium cuculoides". IUCN Red List of Threatened Species. 2016 e.T22689277A93224900. doi:10.2305/IUCN.UK.2016-3.RLTS.T22689277A93224900.en. Retrieved 12 November 2021.
- ↑ "Appendices | CITES". cites.org. Retrieved 2022-01-14.
- 1 2 Sarkar, Aritri; Sailas, S. Sangeeth; Babu, Santhanakrishnan; Karunakaran, P. V.; Kumara, Honnavalli N.; Shanmugavel; Pramod, Padmanaban (2022-12-19). "Community Reserves Serve as Refugia Sites for Cavity-Nesting Owls in Northeast India". Journal of Raptor Research. 57 (1): 22–29. doi:10.3356/JRR-21-48. ISSN 0892-1016.
{{cite journal}}:|first7=missing|last7=(help) - 1 2 3 4 5 6 7 Sankamethawee, Wangworn; Pierce, Andrew J (2019). "Ground-nesting attempt by asian barred owlet glaucidium cuculoides". Natural History Bulletin of the Siam Society. 63 (2): 157–160.
- 1 2 3 4 5 6 7 8 9 10 11 12 König, Claus; Weick, Friedhelm; Becking, Jan-Hendrick (2008). Owls of the world. Helm identification guides (2nd ed.). London: Bloomsbury. pp. 699–702. ISBN 978-0-7136-6548-2.
- 1 2 Sun, Cheng-He; Liu, Hong-Yi; Min, Xiao; Lu, Chang-Hu (2020-02-22). "Mitogenome of the little owl Athene noctua and phylogenetic analysis of Strigidae". International Journal of Biological Macromolecules. 151 (1): 924–931. doi:10.1016/j.ijbiomac.2020.02.238. ISSN 0141-8130. PMID 32097733.
- ↑ Gill, Frank; Donsker, David; Rasmussen, Pamela, eds. (July 2023). "Owls". IOC World Bird List Version 13.2. International Ornithologists' Union. Retrieved 25 October 2023.
- ↑ Rasmussen, Pamela C.; Anderton, John C.; Alderfer, Jonathan; Burn, Hilary; Gilbert, Albert E. (2005). Birds of South Asia: the Ripley Guide. Smithsonian Institution (1. Aufl. ed.). Barcelona: Lynx Ed. ISBN 978-84-87334-67-2.
- 1 2 Leadprathom, Kumron; Chimchome, Vijak; Bumrungsri, Sara (2009-12-01). "Nesting Ecology of the Collared Scops Owl Otus lettiain Thailand". Ardea. 97 (4): 457–461. doi:10.5253/078.097.0409. ISSN 0373-2266.
వెలుపలి లింకులు
[మార్చు]
Media related to Glaucidium cuculoides at Wikimedia Commons
Data related to Glaucidium cuculoides at Wikispecies- మూస:BirdLife
- మూస:Avibase
- మూస:InternetBirdCollection
- మూస:VIREO
- మూస:IUCN Map
- మూస:Xeno-canto species