ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

వికీపీడియా నుండి
(ఏ.పి.జె.అబ్దుల్ కలాం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఎ. పి. జె. అబ్దుల్ కలామ్
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

2014 తిరువనంతపురం అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో


11వ భారత రాష్ట్రపతి
పదవీ కాలం
2002 జూలై 25 – 2007 జూలై 24
ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి
మన్మోహన్ సింగ్
ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్
భైరాన్‌సింగ్ షెకావత్
ముందు కె.ఆర్.నారాయణన్
తరువాత ప్రతిభా పాటిల్

వ్యక్తిగత వివరాలు

జననం (1931-10-15)1931 అక్టోబరు 15 [1]
ధనుష్కోడి, రామేశ్వరం,
తమిళనాడు, భారత దేశము
మరణం 2015 జూలై 27(2015-07-27) (వయసు 83)
షిల్లాంగ్, మేఘాలయ, భారత దేశము
రాజకీయ పార్టీ ఏ పార్టీకి చెందరు
జీవిత భాగస్వామి అవివాహితుడు
పూర్వ విద్యార్థి సెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై
వృత్తి ప్రొఫెసర్
రచయిత
శాస్త్రవేత్త
మతం ఇస్లాం

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందాడు.

భారత రాష్ట్రపతి పదవికి ముందు, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో-ISRO)లో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశాడు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్ (missile man) గా పేరుగాంచాడు. కలామ్ ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషిచేశాడు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించాడు. 2002 రాష్ట్రపతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతన్ని అభ్యర్థిగా ప్రతిపాదించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్ధతు తెలిపింది. ఆ ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచాడు. కలామ్ తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించాడు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నాడు.

2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్  భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను రెండవ స్థానంలో ఎంపికైయ్యాడు.[2]

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) షిల్లాంగ్‌లో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు, కలామ్ కుప్పకూలిపోయాడు. 2015 జూలై 27 న, 83 సంవత్సరాల వయసులో, గుండెపోటుతో మరణించాడు.[3] తన స్వస్థలమైన రామేశ్వరంలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి జాతీయ స్థాయి ప్రముఖులతో సహా వేలాది మంది హాజరయ్యారు, అక్కడ ఆయనను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు.[4]

బాల్యం, విద్యాభ్యాసం

అవుల్ పకీర్ జైనులబ్ధీన్ కలామ్ తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931, అక్టోబరు 15 న జన్మించాడు. తండ్రి జైనులబ్ధీన్, పడవ యజమాని. తల్లి ఆషియమ్మ గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాల కోసం కలామ్ చిన్న వయసులోనే పని చేయడం ప్రారంభించాడు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండటానికి వార్తా పత్రికలు పంపిణీ చేసేవాడు.

పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవాడు. ఎక్కువ సమయం కష్టపడేవాడు. రామనాథపురం స్క్వార్ట్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలామ్ తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్స్ కళాశాలలో చేరి, 1954 లో భౌతికశాస్త్రంలో పట్టా పొందాడు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు. నాలుగు సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించాడు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగులో చేరాడు. కలామ్ సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా, పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి మూడు రోజుల్లో పూర్తి చేయకపోతే తన ఉపకారవేతనం రద్దుచేస్తాను అని బెదిరించాడు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తిచేసి డీన్ ను ఆకట్టుకున్నాడు. తరువాత డీన్ "కలామ్ నీకు తక్కువ గడువు ఇచ్చి, ఎక్కువ ఒత్తిడి కలిగించాను" అన్నాడు. ఎనిమిది స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో తొమ్మిదో స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను సాకారం చేసుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.

శాస్త్రవేత్తగా

మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT - చెన్నై) నుండి ఏరోనాటికల్ ఇంజినీరింగులో పట్టా పొందిన తరువాత 1960 లో, కలామ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డివో) వారి ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లో శాస్త్రవేత్తగా చేరాడు. కలామ్ భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు, కానీ డిఆర్‌డివోలో ఉద్యోగం చేయడంతో అతను సంతృప్తి చెందలేదు.

1969 లో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో (ఇస్రో) చేరి, ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) తయారీలో పనిచేసాడు. 1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చింది. SLV-III పరీక్ష విజయం తరువాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ సతీశ్ ధావన్ను పిలిచినప్పుడు, ఆయనతో పాటు వెళ్ళిన వారిలో అబ్దుల్ కలామ్ కూడా ఒకడు. అయితే మొదట ఈ ఆహ్వానం వచ్చినప్పుడు కలామ్ భయపడ్డాడు. 'నాకు బూట్లు లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఎలా రావాలి..?' అని సతీశ్ ధావన్ ను అడగగా.. ఆయన 'మీరు ఇప్పటికే విజయాన్ని ధరించి ఉన్నారు., కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా వచ్చేయండి' అని అన్నాడు.[5] ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నాడు. 1970, 1990 మధ్య కాలంలో, కలామ్ పిఎస్‌ఎల్‌వి, ఎస్‌ఎల్‌వి-III ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశాడు. ఈ రెండు ప్రాజెక్టులు విజయవంతం అయ్యాయి. 1970 లలో SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి.

1992 జూలై నుండి 1999 డిసెంబరు వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా, డిఆర్‌డివో ముఖ్యకార్యదర్శిగా పనిచేసాడు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్ అణు పరీక్షలలో కలామ్ రాజకీయ, సాంకేతిక పాత్ర నిర్వహించాడు. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి.

1998 లో హృద్రోగ వైద్య నిపుణుడైన డాక్టరు సోమరాజుతో కలిసి సంయుక్తంగా ఒక స్టెంటును (stent) అభివృద్ధి చేసారు. దీనిని "కలామ్-రాజు స్టెంట్" అని అంటారు.[6][7] 2012లో, వీరిద్దరూ కలిసి, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడమ్లో సహాయకంగా ఉండేందుకు ప్రత్యేకంగా ఒక ట్యాబ్లెట్ (tablet) కంప్యూటరును తయారు చేసారు. దీన్ని "కలామ్&-రాజు ట్యాబ్లెట్" అని అంటారు.[8]

రాష్ట్రపతిగా

ప్రధాని మన్మోహన్ సింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లతో రాష్ట్రపతి కలామ్

2002 జూలై 18 న కలామ్ బ్రహ్మాండమైన ఆధిక్యతతో (90% పైగా ఓట్లతో) భారత రాష్ట్రపతిగా ఎన్నికై, జూలై 25న ప్రమాణ స్వీకారం చేశాడు.[9] ఆ పదవికి తమ అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికార పక్షమైన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) కాగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ తమ మద్దతు తెలిపింది. ఆ పోటీలో వామపక్షవాదులు బలపరచిన 87-ఏళ్ళ లక్ష్మీ సెహగల్ అతని ఏకైక ప్రత్యర్థిగా నిలిచింది. ఆమె, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ నాయకత్వం క్రింద పోరాడిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) లో మహిళా విభాగానికి నేతృత్వం వహించిన వీర వనిత.

అతడు ప్రజల రాష్ట్రపతిగా పేరుపొందాడు,[10][11][12] లాభదాయక పదవుల చట్టంపై తీసుకున్న నిర్ణయం తన పదవీ కాలంలో తీసుకున్న అత్యంత క్లిష్టమైన నిర్ణయంగా అతను భావించాడు.[13][14][15] తన పదవీ కాలంలో, 21 క్షమాభిక్ష అభ్యర్థనల్లో, 20 అభ్యర్థనల్లో నిర్ణయం తీసుకోకపోవడం పట్ల అతను విమర్శలు ఎదుర్కొన్నాడు.[16]

2003 సెప్టెంబరులో, చండీగఢ్‌లో జరిగిన ఒక ప్రశ్నోత్తర కార్యక్రమంలో కలాం, దేశా జనాభాను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని అభిప్రాయపడ్డాడు.[17][18][19][20]

కలామ్ 2002 నుంచి 2007 వరకు భారత రాష్ట్రపతిగా తన సేవలను అందించాడు. కలామ్ ఎప్పుడూ ప్రజల వ్యక్తిగా మెలిగాడు, ప్రజలు కూడా కలామ్‌ను ఆదరించారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులలో కలామ్ 3వ వాడు. 2007 జూన్ 20 తో తన పదవి కాలం పూర్తి అయింది. రెండవసారి రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేయాలనుకున్నాడు కానీ చివరి క్షణాలలో వద్దని నిర్ణయించుకున్నాడు.

పురస్కారాలు, గౌరవాలు

కలామ్ 40 విశ్వవిద్యాలయాల నుండి 7 గౌరవ డాక్టరేట్లను పొందాడు.[21][22] ఇస్రో, డిఆర్డిఓలతో కలిసి పనిచేసినందుకు, ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 1981 లో పద్మ భూషణ్, 1990 లో పద్మ విభూషణ్తో సత్కరించింది. భారతదేశంలో రక్షణ సాంకేతిక పరిజ్ఞానం యొక్క శాస్త్రీయ పరిశోధన, ఆధునీకరణకు చేసిన కృషికి 1997 లో కలామ్ భారతదేశపు అత్యున్నత పౌర గౌరవం భారత్ రత్నాను అందుకున్నాడు.[23] 2013 లో "అంతరిక్ష-సంబంధిత పథకానికి నాయకత్వం వహించి విజయవంతంగా నిర్వహించినందుకు" అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ నుండి వాన్ బ్రాన్ అవార్డును అందుకున్నాడు.[24]

కలామ్ మరణం తరువాత అనేక నివాళులు అందుకున్నాడు. అతని పుట్టినరోజైన అక్టోబరు 15 ను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం యువ పునరుజ్జీవనోద్యమ దినోత్సవంగా జరుపుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం "డాక్టర్ ఎ. పి. జె. అబ్దుల్ కలామ్ పురస్కారం"ను ఏర్పాటు చేసింది. ఇందులో 8 గ్రాముల బంగారు పతకం, ప్రశంసాపత్రం, ₹5,00,000 నగదు బహూకరిస్తారు. శాస్త్రీయ వృద్ధిని, మానవీయ శాస్త్రాలను, విద్యార్థుల సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో కృషి చేసిన రాష్ట్రప్రజలకు 2015 నుంచి ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ఇస్తోంది.[25]

కలామ్ పుట్టిన 84వ వార్షికోత్సవం సందర్భంగా, 2015 అక్టోబరు 15 న ప్రధాని నరేంద్ర మోడీ, న్యూఢిల్లీలోని డిఆర్‌డిఓ భవన్‌లో కలామ్ జ్ఞాపకార్థం తపాలా బిళ్ళలను విడుదల చేశాడు. నాసా వారి జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (jet propulsion laboratory, జెపిఎల్) పరిశోధకులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్- ISS) ఫిల్టర్లలో కనుగొన్న కొత్త బాక్టీరియాకు కలామ్ గౌరవార్థం సోలిబాసిల్లస్ కలామీ అని పేరు పెట్టారు.[26] 2015 అక్టోబరు 15న భారతదేశ రక్షణశాఖా మంత్రి మనోహర్ పారికర్ హైదరాబాద్‌లోని డిఆర్డీవో మిస్సైల్ కాంప్లెక్స్ పేరును, డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్‌గా మార్చాడు.

సంవత్సరం పురస్కారం అందచేసినవారు
2014 సైన్స్ డాక్టరేట్ ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం,UK[27]
2012 గౌరవ డాక్టరేట్ సైమన్ ఫ్రేజర్ విశ్వవిద్యాలయం[28]
2011 IEEE గౌరవ సభ్యత్వం IEEE[29]
2010 ఇంజనీరింగ్ డాక్టర్ వాటర్లూ విశ్వవిద్యాలయం[30]
2009 గౌరవ డాక్టరేట్ ఓక్లాండ్ విశ్వవిద్యాలయం[31]
2009 హూవర్ పతకం ASME ఫౌండేషన్, USA[32]
2009 ఇంటర్నేషనల్ వాన్ కర్మాన్ వింగ్స్ అవార్డు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, USA[33]
2008 ఇంజనీరింగ్ డాక్టర్ నాణ్యంగ్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, సింగపూర్[34]
2007 కింగ్ చార్లెస్ II పతకం రాయల్ సొసైటీ, UK[35][36][37]
2007 సైన్సు రంగంలో గౌరవ డాక్టరేట్ వోల్వర్థాంప్టన్ యొక్క విశ్వవిద్యాలయం, UK[38]
2000 రామానుజన్ పురస్కారం ఆళ్వార్లు రీసెర్చ్ సెంటర్, చెన్నై [39]
1998 వీర్ సావర్కర్ పురస్కారం భారత ప్రభుత్వం
1997 ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం భారత జాతీయ కాంగ్రెస్
1997 భారతరత్న భారత ప్రభుత్వం[39][40]
1994 గౌరవనీయులైన ఫెలోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (భారతదేశం)[41]
1990 పద్మ విభూషణ్ భారత ప్రభుత్వం[39][42]
1981 పద్మ భూషణ్ భారత ప్రభుత్వం[39][42]

మరణం

రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్‌ కలామ్ 2015 జూలై 27 సోమవారం సాయంత్రం హఠాన్మరణానికి గురయ్యాడు. షిల్లాంగ్‌ లోని ఐఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్‌ అబ్దుల్‌ కలామ్ హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్‌ కలామ్ను స్థానిక బెథాని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అతను గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధిలోనే కలామ్ కన్నుమూశాడు. అప్పటికి ఆయన వయస్సు 84 సంవత్సరాలు.

స్మారక చిహ్నం

డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ జాతీయ స్మారక చిహ్నాన్ని కలామ్ జ్ఞాపకార్థం తమిళనాడులోని రామేశ్వరం ద్వీప పట్టణంలోని పేయ్‌కరుంబు గ్రామంలో డిఆర్డిఓ నిర్మించింది.[43] దీనిని 2017 జూలైలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.[44] కలామ్ పనిచేసిన రాకెట్లు, క్షిపణుల ప్రతిరూపాలు ప్రదర్శనలో ఉన్నాయి. ఈ జన నాయకుని జీవితాన్ని వివరించే వందలాది చిత్రాలతో పాటు అతని జీవితం గురించి యాక్రిలిక్ పెయింటింగ్స్ (Acrylic paintings) కూడా ప్రదర్శించబడుతున్నాయి. ప్రవేశద్వారం వద్ద కలామ్ విగ్రహం ఉంది. కూర్చుని, నిలబడి ఉన్న భంగిమలో కలామ్గారి మరో రెండు చిన్న విగ్రహాలు ఉన్నాయి.[45]

వ్యక్తిగత విశేషాలు, తదితరాలు

కలామ్ గురించిన కొన్ని వ్యక్తిగత విశేషాలు

  • కలామ్ నిజాయితీకి సరళమైన జీవన విధానానికీ ప్రసిద్ధి.[46][47] రాత్రి 2 గంటలకు నిద్రించి, ఉదయం 6:30 - 7 మధ్య లేచేవాడు.[48] అతనికి టెలివిజన్ లేదు. తన వ్యక్తిగత ఆస్తుల్లో పుస్తకాలు, వీణ, దుస్తులు, ఒక సిడి ప్లేయరు, ఒక ల్యాప్‌టాప్ ఉండేవి. అతను వీలునామా ఏమీ రాయలేదు. మరణానంతరం అతని ఆస్తులు అతని పెద్దన్నకు చెందాయి.[49][50]
  • "ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేవాడ్ని. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్ర లేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్‌కి వెళ్లేవాడిని. స్నానం చేసి రాకపోతే మా మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదు. నేను ట్యూషన్ పూర్తి చేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను నమాజ్‌కు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక రైల్వేస్టేషన్‌కి వెళ్లేవాణ్ణి. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్‌ని తీసుకొని వాటిని పంపిణీ చేసేవాడ్ని. ఈ విధంగా పనిచేస్తూనే చదువుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు. మా అమ్మ మాత్రం నాకు మిగితా వారికన్నా ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను చివరివాడిని. దానికి తోడు చదువుకుంటూ పని చేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ చూపేది. మా ఇంట్లో ఆనందం, విషాదం రెండూ ఉండేవి"
  • ముగ్గురమ్మల కథ-ఆ ముగ్గురు అమ్మలు నాకెంతో ఇష్టం తనకు ముగ్గురు అమ్మలంటే చాలా ఇష్టమని.. వారందరిని తాను కలవగలిగానని కలామ్ చెప్పాడు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. 'ఒకరు మా సొంత అమ్మ. మరొకరు భారత సంగీతానికి అమ్మ, ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిస్సా' అని చెప్పాడు. 1950లో తిరుచ్చిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని.. అప్పటి నుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించానన్నాడు. 'ఆమె భారతరత్న పురస్కారాన్ని తీసుకునే సమయంలో నా తల నిమిరింది. ఆ ఘటనను నేనెప్పటికీ మరవలేను' అని ఉద్వేగంతో చెప్పాడు. దేశం కాని దేశంలో పుట్టి, మన దేశానికి నలభైఏళ్ల పాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ థెరిస్సా తాను అభిమానించే మూడో అమ్మగా కలామ్ చెప్పాడు. (ఈనాడు 3.8.2008)
  • 1962లో అతను (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) ఇస్రోకు మారాడు. అక్కడ అతను ఇతర శాస్త్ర వేత్తలతో కలసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించాడు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా అతని కృషి ఎంతో ఉంది. 1982 లో, అతను DRDO కు డైరెక్టరుగా తిరిగి వచ్చి, క్షిపణుల మీద దృష్టి కేంద్రీకరించాడు. అగ్ని క్షిపణి, పృథ్వి క్షిపణుల అభివృద్ధీ, ప్రయోగాలకు అతనే సూత్రధారి. దీంతో అతనికి భారత దేశపు "మిస్సైల్ మాన్" అని పేరు వచ్చింది. జూలై 1992లో అతను భారత దేశపు రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారు అయ్యాడు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా అతనికి క్యాబినెట్ మంత్రి హోదా వచ్చింది. అతను కృషి ఫలితంగానే 1998లో పోఖ్రాన్-II అణుపరీక్షలు విజయవంతంగా జరిగాయి.
  • కలామ్ శాకాహారి, మద్యపాన వ్యతిరేకి, బ్రహ్మచారి. కచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటించేవాడు. "ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు" అంటూ అతను పెళ్ళి చేసుకోలేదు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. ఖురాన్తో బాటు, భగవద్గీతను కూడా చదువుతాడు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడు, మానవతావాది. అతను తిరుక్కురళ్లో చెప్పిన మార్గాన్ని అనుసరిస్తాడు. అతను చేసే ప్రతి ప్రసంగంలోనూ కనీసం ఒక్క "పాశురం" నైనా ప్రస్తావిస్తాడు.
  • కలామ్ రాజకీయంగా భారత దేశం అంతర్జాతీయ సంబంధాలలో మరింత దృఢమైన నిర్ణయాలు తీసుకుని నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుకున్నాడు. తాను సుదీర్ఘ కాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం, కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా అతను భావించాడు. అతను భారత దేశపు యువతను వెన్ను తట్టి ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేసే తన ఆత్మ కథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు అనేకం వ్రాశాడు. 2020 సంవత్సరానికల్లా భారత దేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను అతను చాలా బలంగా ముందుకు తెచ్చాడు. శాస్త్ర సాంకేతిక రంగాలలో అతను చాలా చురుకైన పాత్ర పోషించాడు. బయో ఇంప్లాంట్స్ (bio-implants) వాడడం ద్వారా తెలివిని పెంచడానికి ఒక పరిశోధనా కార్యక్రమాన్ని అతను ప్రతిపాదించాడు. అతను ప్రొప్రైటరీ సాఫ్ట్‌వేర్ కంటే ఓపెన్ సోర్సు సాఫ్ట్‌వేర్ నే సమర్థించాడు. ఓపెన్ సోర్సు సాఫ్ట్‌వేర్ ను పెద్ద ఎత్తున వాడడం ద్వారానే సమాచార విప్లవం ఫలాలు ఎక్కువ మందికి అందుతాయని ఆయన విశ్వసించాడు.

రచనలు

  • ఇండియా 2020 - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, వై.ఎస్.రాజన్ (పెంగ్విన్ బుక్స్ ఆఫ్ ఇండియా, 2003) ISBN 0-14-027833-8
  • ఇగ్నైటెడ్ మైండ్స్: అన్లీషింగ్ ద పవర్ వితిన్ ఇండియా by ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (పెంగ్విన్ బుక్స్, 2003) ISBN 0-14-302982-7
  • ఇండియా-మై-డ్రీం - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (Excel Books, 2004) ISBN 81-7446-350-X
  • ఎన్విజనింగ్ ఎన్ ఎంపవర్డ్ నేషన్ : టెక్నాలజీ ఫర్ సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (టాటా మెక్‌గ్రా-హిల్ పబ్లిషింగ్ కంపెనీ లిమిటెడ్, 2004) ISBN 0-07-053154-4

జీవితచరిత్రలు

  • వింగ్స్ ఆఫ్ ఫైర్: ఎన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అరుణ్ తివారీ (ఓరియంట్ లాంగ్మన్, 1999) ISBN 81-7371-146-1
  • సైంటిస్ట్ టు ప్రెసిడెంట్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (గ్యాన్ పబ్లిషింగ్ హౌస్, 2003) ISBN 81-212-0807-6
  • ఎటర్నల్ క్వెస్ట్: లైఫ్ అండ్ టైంస్ ఆఫ్ డా. అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్ - ఎస్.చంద్ర (పెంటగాన్ పబ్లిషర్స్, 2002) ISBN 81-86830-55-3
  • ప్రెసిడెంట్ ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ - ఆర్.కె.ప్రుథి (అన్మోల్ పబ్లికేషన్స్, 2002) ISBN 81-261-1344-8
  • ఏ.పి.జె.అబ్దుల్ కలామ్: ది విజనరీ ఆఫ్ ఇండియా' - కె.భూషన్, జీ.కట్యాల్ (ఏ.పీ.హెచ్.పబ్లిషింగ్ కార్పోరేషన్, 2002) ISBN 81-7648-380-X

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "A Brief Biography of Dr. A. P. J. Abdul Kalam". Archived from the original on 2008-01-05. Retrieved 2008-01-17.
  2. "A Measure Of The Man | Outlook India Magazine". web.archive.org. 2021-07-24. Archived from the original on 2021-07-24. Retrieved 2021-10-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "India Pays Tribute to 'People's President' APJ Abdul Kalam". Time (in ఇంగ్లీష్). Retrieved 2021-07-11.
  4. IBTimes (2015-07-30). "'People's President' APJ Abdul Kalam Buried with Full State Honours in Rameswaram". www.ibtimes.co.in (in ఇంగ్లీష్). Retrieved 2021-07-11.
  5. "APJ Abdul Kalam Biography Famous Quotes in Telugu". తెలుగు మధురం (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-14. Archived from the original on 2021-07-13. Retrieved 2021-07-13.
  6. "Story of indigenous stents". The Hindu-Businessline. India. 15 August 2001. Archived from the original on 28 May 2012.
  7. "The stent man". Rediff-News. India. 19 December 1998. Archived from the original on 18 May 2013.
  8. Gopal, M. Sai (22 March 2012). "Now, 'Kalam-Raju tablet' for healthcare workers". The Hindu. India. Archived from the original on 25 April 2012. Retrieved 19 April 2012.
  9. Ved, Mahendra (26 July 2002). "Kalam is 11th President in 12th term". The Times of India. Archived from the original on 30 May 2013. Retrieved 4 July 2012.
  10. Tyagi, Kavita; Misra, Padma (23 May 2011). Basic Technical Communication. PHI Learning Pvt. Ltd. p. 124. ISBN 978-81-203-4238-5. Archived from the original on 3 June 2016. Retrieved 9 October 2015.
  11. "APJ Abdul Kalam is people's president: Mamata Banerjee". CNN-IBN. Press Trust of India. 19 June 2012. Archived from the original on 20 June 2012. Retrieved 4 July 2012.
  12. Perappadan, Bindu Shajan (14 April 2007). "The people's President does it again". The Hindu. Chennai, India. Archived from the original on 25 January 2012. Retrieved 1 March 2012.
  13. "My toughest decision as president was returning the Office of Profit Bill to Parliament". Archived from the original on 31 July 2015.
  14. "how a 110 years old became friend of APJ Kalam". Archived from the original on 19 August 2016.
  15. "Signing office of profit bill was toughest decision: A P J Kalam". The Economic Times. Coimbatore. 18 July 2010. Archived from the original on 11 May 2013. Retrieved 2 May 2012.
  16. "The journey of a mercy plea". The New Indian Express. 21 May 2010. Archived from the original on 28 November 2012. Retrieved 5 July 2012.
  17. "President Kalam votes for uniform civil code". Archived from the original on 30 July 2015.
  18. "Kalam calls for uniform civil code". Archived from the original on 5 March 2016. Retrieved 1 January 2020.
  19. "Uniform Civil Code essential: Kalam". Archived from the original on 28 September 2015.
  20. "Puri seer rallies for uniform civil code". Archived from the original on 9 October 2015. Retrieved 4 December 2018.
  21. "www.abdulkalam.com". web.archive.org. 2012-04-24. Archived from the original on 2012-04-24. Retrieved 2021-07-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  22. "Kalam receives honorary doctorate from Queen's University Belfast - Oneindia News". web.archive.org. 2013-05-15. Archived from the original on 2013-05-15. Retrieved 2021-07-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  23. "Rediff On The NeT: Bharat Ratna conferred on Dr Abdul Kalam". web.archive.org. 2012-07-17. Archived from the original on 2012-07-17. Retrieved 2021-07-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  24. "National Space Society". web.archive.org. 2015-02-02. Archived from the original on 2015-02-02. Retrieved 2021-07-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  25. "Award in APJ Abdul Kalam's name; birthday to be observed as 'Youth Renaissance Day'". The Economic Times. Retrieved 2021-07-14.
  26. "NASA pays tribute to APJ Abdul Kalam by naming new species after him". web.archive.org. 2017-05-21. Archived from the original on 2017-05-21. Retrieved 2021-07-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  27. "Ex-President of India Abdul Kalam visits the Forum". University of Edinburgh. Archived from the original on 2014-05-28. Retrieved 27 మే 2014.
  28. "Honorary Degrees – Convocation – Simon Fraser University". Simon Fraser University. Retrieved 31 ఆగస్టు 2012.
  29. "IEEE Honorary Membership Recipients" (PDF). IEEE. p. 1. Archived from the original (PDF) on 2011-06-29. Retrieved 28 ఆగస్టు 2011.
  30. "Yet another honorary doctorate for Kalam". Rediff.com. 6 October 2010. Retrieved 13 March 2012.
  31. "A.P.J Abdul Kalam – Honorary Degree, 2009". Oakland University.
  32. "Former President Kalam chosen for Hoover Medal". New York: Indiatimes. 27 March 2009. Archived from the original on 13 నవంబరు 2013. Retrieved 30 October 2010.
  33. "Caltech GALCIT International von Kármán Wings Award". galcit.caltech.edu. Retrieved 1 March 2012.
  34. "Dr Abdul Kalam, former President of India, receives NTU Honorary Degree of Doctor of Engineering". Nanyang Technological University. 26 ఆగస్టు 2008. Archived from the original on 2011-08-23. Retrieved 28 ఆగస్టు 2011.
  35. "King Charles II Medal for President". The Hindu. Chennai, India. 12 July 2007. Archived from the original on 13 నవంబరు 2013. Retrieved 1 March 2012.
  36. "King Charles II Medal for Kalam". The Economic Times. India. 11 July 2007. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 1 March 2012.
  37. "Royal Society King Charles II Medal". Royal Society. Retrieved 14 November 2012.
  38. "Kalam conferred Honorary Doctorate of Science". The Economic Times. India. 23 October 2007. Archived from the original on 13 నవంబరు 2013. Retrieved 1 March 2012.
  39. 39.0 39.1 39.2 39.3 "Dr. Abdul Kalam's Diverse Interests: Prizes/Awards". Indian Institute of Technology Madras. Archived from the original on 28 మే 2012. Retrieved 1 March 2012.
  40. "List of recipients of Bharat Ratna" (PDF). Ministry of Home Affairs, Government of India. Archived from the original (PDF) on 3 ఫిబ్రవరి 2013. Retrieved 1 March 2012.
  41. "List of Distinguished Fellows". Institute of Directors (India). Retrieved 9 November 2014.
  42. 42.0 42.1 "Bharat Ratna conferred on Dr Abdul Kalam". Rediff.com. 26 November 1997. Retrieved 1 March 2012.
  43. "కలాం కాంస్య విగ్రహం ఆవిష్కరణ". Samayam Telugu. Retrieved 2021-07-11.
  44. Karunakar (2017-07-27). "అబ్దుల్ కలాం స్మారక మండపం ప్రారంభం". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-07-11. Retrieved 2021-07-11.
  45. "What is the Abdul Kalam memorial row?". The Indian Express (in ఇంగ్లీష్). 2017-07-31. Retrieved 2021-07-11.
  46. "Man of integrity, Kalam insulated family from trappings of power". The Times of India. 31 July 2015. Archived from the original on 3 August 2015. Retrieved 3 August 2015.
  47. Scott, D. j Walter (4 November 2016). "Kalam's brother turns 100, says takes life as it comes". The Hindu (in Indian English). Archived from the original on 23 February 2020. Retrieved 23 February 2020. Kalam never accepted gifts when he attended functions and when Uttar Pradesh Chief Minister Akilesh Yadav offered the perfumes, he accepted saying his brother was fond of perfumes and he would gift the box on his 100th birthday. Kalam paid a token sum before accepting the gift from Mr. Yadav
  48. "Kalam Tribute: Sir Never Had a TV at Home, Recalls Secretary of 24 Years". NDTV.com. 28 July 2015. Archived from the original on 31 July 2015. Retrieved 3 August 2015.
  49. "Kalam had no property". The Hindu. 3 August 2015. Archived from the original on 22 December 2016. Retrieved 3 August 2015.
  50. "Guru Kalam's assets, royalties to go to elder brother". OneIndia.com. 3 August 2015. Archived from the original on 5 August 2015. Retrieved 3 August 2015.

బయటి లింకులు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.


ఇంతకు ముందు ఉన్నవారు:
కె.ఆర్.నారాయణన్
భారత రాష్ట్రపతి
2002 జూలై 252007 జూలై 25
తరువాత వచ్చినవారు:
ప్రతిభా పాటిల్