ఏ.బి. నాగేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏ.బి. నాగేశ్వరరావు గా ప్రసిద్ధుడైన డాక్టర్ అంబడిపూడి బాలనాగేశ్వరరావు (1901 నవంబరు 1 - 1982 నవంబరు 6, 1982) భారత స్వాతంత్య్ర సమరయోధుడు, రాజమండ్రి నుంచి తొలి కేబినెట్ మంత్రి. ఇతను పుట్టింది కృష్ణా జిల్లా  మచిలీపట్నం దగ్గర కొజ్జిలపేట అయినా, కార్యక్షేత్రం మాత్రం  రాజమండ్రి అయింది. సేవాభావంతో, నీతి నిజాయితీతో  రాజకీయాలు నడిపిన ఏ.బి.  జీవన పర్యంతం  అదే ఒరవడి కొనసాగించి, ప్రజల హృదయాల్లో నిలిచారు.

అంబడిపూడి రాజమండ్రి నగరానికి తొలి మునిసిపల్ ఛైర్మన్. 1955 రాజమండ్రి జనరల్ స్థానం నుండి సీపీఐ పార్టీ తరఫున శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.[1][2] అంతకు ముందు, టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. ఇతనికి విరాళాలు వేసుకొని రాజమండ్రిలో ప్రజలే ఇళ్ళు కట్టించారు.

జననం, బాల్యం

[మార్చు]

మచిలీపట్నం, కొజ్జిలపేటలో ఎ. బి మధ్యతరగతి, వ్యవసాయ, వెలనాడు బ్రాహ్మణ కుటుంబంలో 1901 నవంబర్ 1న (ప్లవంగ నామ సంవత్సర, ఆశ్వయుజ మాసం,పూర్ణిమనాడు) సుబ్బారాయుడు, నాంచారమ్మ దంపతులకు ముగ్గురు కుమారుల్లో రెండవ వానిగా జన్మించారు. తండ్రి స్వస్థలం కృష్ణా జిల్లా అవనిగడ్డ. ఆయన మచిలీపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గుమస్తాగా పనిచేసేవారు. తల్లి సాంప్రదాయ గృహిణి.  పినతండ్రి రామకృష్ణయ్య, కామేశ్వరమ్మ దంపతులకు ఇద్దరూ కుమార్తెలే కావడంతో మూడేళ్ళ వయస్సులో ఉన్న ఏబిని దత్తత తీసుకోవాలని అనుకున్నారు. అయితే రామకృష్ణయ్య చనిపోవడంతో కుదరలేదు. తర్వాత పదేళ్ల వయస్సులో  తండ్రి సుబ్బారాయుడు కూడా మరణించారు. దాంతో తన అన్న సాంబశివరావుకు తండ్రి ఉద్యోగం ఇవ్వడం, అయన పోషణలోనే ఏబి పెరిగారు. అయితే ఏ.బి.కి 16 సంవత్సరాల వయస్సు వచ్చాక హైస్కూలు విద్య పూర్తయ్యాక పినతండ్రి భార్య కామేశ్వరమ్మ  దత్తత తీసుకున్నారు.

విద్య, వివాహం

[మార్చు]

ఏ.బి.కి 18 సంవత్సరాల వయస్సులో తన అక్క కూతురు సూరమ్మతో వివాహమైంది. అయితే ప్రసవవేదనతో సూరమ్మ, పుట్టినబిడ్డ ఇద్దరూ కూడా మరణించారు. చిన్న వయస్సులోనే భార్యను పోగొట్టుకున్న ఏ.బి.కి తల్లి ప్రోత్సాహంతో కామేశ్వరమ్మతో ద్వితీయ వివాహమైంది. ఏ.బి. దత్తత తల్లి పేరు, రెండవ భార్య పేరు కూడా కామేశ్వరమ్మయే. ఏ.బి. దంపతులకు ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు.  ఎ. బి తన అన్నయ్య సాంబశివరావు పోషణలో బందరులోని జాతీయ పాఠశాలలో ప్రాథమిక, హైస్కూలు విద్య పూర్తిచేసారు. 1918-20లో బందరులోని నోబుల్ కళాశాలలో ఇంటరు పూర్తయిన తదనంతరం లైసెన్ద్స్ మెడికల్ ప్రాక్టీషనర్(ఎల్.ఎమ్.పి.) కోర్సు చదవడానికి విశాఖపట్నం వైద్య విద్యాలయంలో చేరారు. ఏ.బి. వైద్యవిద్య బాధ్యతను ఆయన  బావ సత్యనారాయణ  తీసుకొని విశాఖపట్నం మెడికల్ స్కూలుకి పంపించారు.

స్వాతంత్య్ర ఉద్యమం

[మార్చు]

చదువు కొనసాగిస్తున్న సమయంలోనే గాంధీజీ స్పూర్తితో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా  విదేశీ వస్త్రాలను, వస్తువులను తగులబెట్టారు. లక్ష్మీబాయమ్మ వంటి జాతీయోద్యమ నాయకులు గాంధీటోపీ ఉద్యమాన్ని ప్రబోధించారు.  ఖద్దరు  టోపీ ధరించినందుకు ఎబితో సహా 142మంది విద్యార్థులు  కాలేజీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయితే  క్షమాపణ చెప్పడానికి తిరస్కరించడంతో ఏబీతో సహా 39మంది 1921 అక్టోబర్ 23న కళాశాల నుంచి శాశ్వత బహిష్కరణకు గురయ్యారు. దాంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఖద్దరు అమ్మడం, వ్యంగంగా పాటలు పాడడం, నాటికలు ప్రదర్శించడం  వంటివి  చేసారు. జలియన్ వాలా బాగ్ మారణ హోమం, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా 144 సెక్షన్ ధిక్కరించి, 'పంజాబు దురంతాలు' నాటిక ప్రదర్శించిన ఎబితో సహా మరికొందరికి   నాలుగు నెలల జైలు శిక్ష విధించి, రాజమండ్రి జైలుకి తరలించారు. మొత్తానికి  విశాఖలో 1926 నాటికి  వైద్య విద్య పూర్తి చేసి, కృష్ణాజిల్లా కైకలూరు తాలూకా నరసాయపాలెం గ్రామంలో డాక్టరుగా ప్రాక్టీసు ప్రారంభించారు.

రాజమండ్రికి మకాం

[మార్చు]

వైద్య విద్య చదువుతుండగా స్నేహితుడైన వంగవేటి వెంకట రామ దీక్షితులు (వి.వి.ఆర్.దీక్షితులు) జాతీయోద్యమంలో చురుగ్గా ఉండటం వలన తన ఆసుపత్రికి వచ్చే రోగులకు సేవ చేయడానికి రావాలని ఎ. బిని ఆహ్వానించారు. దాంతో 24-05-1929 నాడు రాజమండ్రికి మకాం మార్చిన ఎ. బి అర్థ శతాబ్దం పాటు ఈ పట్టణానికే మకుటంలేని మహారాజుగా తన జీవితాంతం  సేవలందించారు. 1930 ఉప్పు సత్యాగ్రహ సమయంలో క్రొవ్విడి లింగరాజు వంటి పెద్దలు అరెస్టు కావడంతో రాజమండ్రి కాంగ్రెస్ కార్యక్రమాల ఇంచార్జ్ గా ఉన్న ఎబి సారధ్యంలో కొందరు మద్రాసు చేరుకొని చైనా బజారులో పికెటింగ్ చేసి, అరెస్టయ్యారు. 12 నెలలు కఠిన కారాగార శిక్ష పూర్తిచేసుకుని విడుదలయ్యారు.

క్విట్ ఇండియా ఉద్యమం, జైలు జీవితం

[మార్చు]

  1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో 144 సెక్షన్ కి వ్యతిరేకంగా  రాజమండ్రి మున్సిపల్ ఆఫీస్ దగ్గర  నిరసన చేపట్టిన ఎ.బి.ని పోలీసులు అరెస్టు చేసారు. 18 మాసాల కఠిన కారాగార శిక్ష విధించి,  బళ్ళారిలోని అలీపూర్ క్యాంపు జైలుకి తరలించారు. 'సి' క్లాసు ఖైదీగా ఉన్న ఏ.బి. జైలులో కూడా అనేక విషయాల్లో జైలు అధికారుల తీరును ప్రతిఘటించేవారు. 'మానవతే' జీవిత ధ్యేయంగా మలుచుకున్న ఏ.బి. జైలులోని ఖైదీలకు వైద్యం చేసేవారు. విసుగు లేకుండా ఖైదీలను ఆదరించి, పలకరించి, వారి మంచి చెడ్డలు విచారించి, ధైర్యం, ఉత్సాహం  నింపేవారు. మందులిచ్చి మనశ్శాంతి కలుగజేసి,ఎం  జైలులోని సత్యాగ్రహుల ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు.   వైద్య కార్యక్రమంలో ఇంజక్షన్ సిరంజి మరిగించడానికి  స్టవ్ వెలిగించి శరీరం కూడా కాల్చుకున్నారు. అయినా తన కర్తవ్యాన్ని వీడలేదు. ఈ జైలులో ఉండగా ఆంధ్రా, కర్నాటక, తమిళ, మళయాళ ప్రాంతాల వేలాది రాజకీయ ఖైదీలు ఏ.బి.ని నాయకునిగా భావించేవారు. 1943లో జైలు నుంచి విడుదలయ్యారు. బళ్ళారి కేంపు జైలులో  తీవ్ర లాఠీచార్జీకి గురై ఏ.బి. అస్వస్థులుగా కొన్నాళ్ళు లేవలేనిస్థితి కూడా అనుభవించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పోలీసు లాఠీ దెబ్బలకు ఎముకలు చిట్లి పోవడంతో   చివరి రోజుల్లో ఎ. బిచాలా ఇబ్బంది పడ్డారు.(“బ్రిటిష్ ప్రభుత్వం మిగిల్చిన జ్ఞాపకాలు ఈనాటికీ మోకాలు బాధిస్తూనే ఉందమ్మా” అని .. 'రాజమహేంద్రవర వరపుత్రుడు, శతాబ్ది మహనీయుడు ఎ. బి నాగేశ్వరరావు' శీర్షికతో  పుస్తకం రాసిన డా.(మేజరు)చల్లా సత్యవాణికి స్వయంగా ఎ. బి చెప్పారు)

రాజకీయ జీవితం

[మార్చు]

ఏబికి టంగుటూరి ప్రకాశం పంతులు అంటే వల్లమాలిన అభిమానం. సీతానగరం ఆశ్రమాన్ని ముస్తాఫలీ ధ్వంసం చేయడంతో కాంగ్రెస్ కార్యక్రమాలకు రాజమండ్రి వేదిక అయింది.ప్రధాన నాయకుడు క్రొవ్విడి లింగరాజు జైలులో ఉండడంతో, బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం అనారోగ్యం కారణంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఎదగడానికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఏబి తన సత్తా నిరూపించుకున్నారు. 1936లో లక్నో కాంగ్రెస్ సమావేశం నాటికి జాతీయ స్థాయి గ్రూపు ముఠా తత్వాలు ప్రారంభం కావడంతో  ఉమ్మడి మద్రాసు, ఆంధ్ర నాయకులపై కూడా దాని ప్రభావం పడింది. భోగరాజు పట్టాభి సీతారామయ్య గ్రూపు, టంగుటూరి ప్రకాశం గ్రూపుగా చీలాయి. దాంతో రాజమండ్రిలో పట్టాభి గ్రూపు తరపున కె.ఎల్. నరసింహారావు గ్రూపు, ప్రకాశం గ్రూపు తరపున ఎ. బి గ్రూపు ఏర్పడడంతో టౌన్ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. 1937లో రాజమండ్రి మున్సిపల్ రాజకీయాల్లో ప్రవేశించి, 22 సంవత్సరాలు పురపాలక సభ్యులుగా ఉన్నారు. అందులో 14 సంవత్సరాలు కౌన్సిలర్ గా, 8 సంవత్సరాలు చైర్మన్ గా ఉన్నారు. 1947, 1952 లలో రెండు దఫాలు మున్సిపల్ చైర్మన్ అయ్యారు. వైద్యునిగా నే కాకుండా వ్యక్తిగా  ప్రజలకు చేసిన సేవలు, నిజాయితీ, నిస్వార్ధ సేవలకు ప్రతిఫలంగా 1947లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో  చైర్మన్ అయ్యారు. అయితే 1952లో రాష్ట్ర రాజకీయాల్లో ముఠాతత్వం, పెచ్చుమీరడంతో బచ్చు సత్యానందంపై గెలుపొంది చైర్మన్ అయ్యారు. అందుకు కారణం ఏబి ప్రజాపార్టీలో ఉండడం. 1918నుంచి 1949వరకు దాదాపు 30 సంవత్సరాలు  కాంగ్రెస్ కార్యకర్తగా, రాజమండ్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా, తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ మెంబర్ గా,రాష్ట్ర కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, వివిధ హోదాల్లో కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ఎ. బి వేలాదిమందిని కాంగ్రెస్ లో కార్యకర్తలుగా నమోదుచేయించారు. కాంగ్రెస్ లో ఏర్పడిన వర్గ రాజకీయాలు 1951లో ఆంధ్రా ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల అనంతరం అంతిమ చీలిక ఏర్పడింది. దాంతో ప్రకాశం,ఎన్.జి.రంగా కాంగ్రెస్ కి రాజీనామా చేసి, ప్రజాపార్టీ పెట్టారు. అయితే 1953లో ప్రకాశం కాంగ్రెస్ లో చేరినప్పటికీ ఏబి చేరకుండా ప్రజాపార్టీలోనే ఉన్నారు. అయితే ప్రకాశం అంటే ప్రేమ తగ్గలేదు. అలాగే ప్రకాశం తర్వాత ప్రజాపార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన తెన్నేటి విశ్వనాథం అంటే ఏబికి ఎంతో గౌరవం ఉండేది. 1947 నుంచి 1952 వరకు మద్రాసు డిస్ట్రిక్ట్ మున్సిపల్ చట్టం 1920 ప్రకారం 3 సంవత్సరాలు చైర్మన్ పదవీ కాలం ఉండేది. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి సాధారణ ఎన్నికల కారణంగా ఒక ఏడాది పదవి పొడిగించారు. దాంతో తొలిసారి చైర్మన్ గా నాలుగేళ్లు ఎ. బికొనసాగారు. కొత్తచట్టం ప్రకారం ఐదేళ్లు పదవీ కాలంతో 1952లో నెగ్గినప్పటికీ 1955 శాసనసభ ఎన్నికల కారణంగా రాజీనామా చేయడంతో రెండేళ్ల ముందే తప్పుకున్నారు.

కేబినెట్ మంత్రిగా

[మార్చు]

1953 వరదల్లో ఏబి విస్తృత వైద్య సేవలు అందించారు. 1955 అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో ప్రజా పార్టీ తరపున  ఎం ఎల్ ఏ గా  ఘన విజయం సాధించారు.[3]  ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని ఎదుర్కోడానికి ప్రజాపార్టీ, కర్షక్ లోక్ పార్టీ లతో కాంగ్రెస్ పార్టీ  పొత్తు పెట్టుకుని 196 స్థానాల్లో పోటీ చేయగా, 119 స్థానాలు గెలుచుకుంది. బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. పొత్తులో భాగంగా ప్రజాపార్టీ నుంచి 12 మంది పోటీ చేస్తే, ఐదుగురు గెలుపొందారు. అందులో అత్యధిక మెజారిటీ ఏబికి దక్కింది. దాంతో కేబినెట్ లో చోటు దక్కింది. మార్చి 28న స్థానిక స్వపరిపాలన, ప్రొహిబిషన్, ఎక్సైజ్  మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాజమండ్రి నుంచి తొలి కేబినెట్ మంత్రిగా చరిత్ర సృష్టించారు. .అయితే మంత్రిగా ఆయన ఒకటిన్నర సంవత్సర కాలమే ఉన్నారు.

ప్రతిపక్ష సభ్యునిగా

[మార్చు]

హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే 9 జిల్లాలను ఆంధ్ర రాష్ట్రంలో  విలీనం చేయడంతో 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ (విశాలాంద్ర)గా అవతరించింది. దాంతో అప్పటికే అంటే 1955 ఫిబ్రవరిలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరగడంతో 1957లో దేశం మొత్తానికి భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాల్లో శాసన సభలకు సాధారణ ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఆంధ్రాలో మాత్రం ఎన్నిక జరగలేదు. అప్పటికే ఉన్న శాసనసభ కొనసాగించేలా ఎన్నికల సంఘం ఆమోదం తెల్పింది. దాంతో 1962 వరకు ఎన్నిక జరగలేదు. దీంతో ఏబి శాసన సభ్యత్వం 7సంవత్సరాల 3 నెలల కాలం కొనసాగింది. ఇదీ ఒక రికార్డు. అయితే 1957నాటికి కాంగ్రెస్ లో ఏర్పడిన విబేధాల కారణంగా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికై, ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ప్రజాపార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఫలితంగా ఏబి మంత్రి పదవి కోల్పోయి, 10-03-1962 వరకు ప్రతిపక్ష సభ్యునిగా కొనసాగారు. అయితే ఏబి మంత్రిగా 18 నెలల స్వల్పకాలమే ఉన్నా, రాజమండ్రి పట్టణ మాస్టర్ ప్లాన్ ఆమోదంతో పాటు విజయవాడ, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు పట్టణ ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్ ఆమోదం లభించింది. రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీలో బీఈడీ కోర్సుగా ఉండగా, ఎంఈడీ కోర్సు మంజూరు చేయించారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు అమలు చేసారు. ప్రతిపక్ష సభ్యునిగా ఉన్నప్పటికీ సభలో వివిధ సమస్యలపై ప్రశ్నించేవారు. గంటల తరబడి మాట్లాడే సభ్యునిగా శాసనసభలో పేరుతెచ్చుకున్నారు.

పౌరసమితి

[మార్చు]

సంకీర్ణ రాజకీయాలు, ఎన్నికల్లో పొత్తులకు ఆనాడే ఏబి శ్రీకారం చుట్టారు. 1955-62మధ్య కాలంలో రాష్ట్ర శాసన సభ కార్యకలాపాల కారణంగా మున్సిపల్ ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోయినా,  1959మున్సిపల్ ఎన్నికల సమయంలో పరోక్షంగా చక్రం తిప్పారు. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని పౌరసమితి బ్యానర్ పై పోటీచేయించారు. ఆ ఎన్నికల్లో 36స్థానాలకు గాను 24చోట్ల సమితి గెలవడంతో నిడమర్తి వెంకట నరసింహం ను చైర్మన్ గా, కమ్యూనిస్టు నాయకుడు జి ఎస్ బాలాజీదాస్ ను వైస్ చైర్మన్ గా ఎన్నికవడానికి ఏబి కృషి, పట్టుదలే కారణం. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.  అయితే 17నెలలకే  పౌరసమితి  కుప్పకూలింది. ఈ బ్యానర్ పై ఎన్నికైన వాళ్ళు కాంగ్రెస్ గూటికి చేరడమే ఇందుకు కారణం. 1962 శాసనసభ ఎన్నికల్లో ఏబి ఓటమి చెందడంతో ఉద్యమాల్లో , ప్రజాహిత కార్యక్రమాల్లో చురుగ్గానే వ్యవహరించేవారు. 67సంవత్సరాల వయస్సులో 1968లో కౌన్సిలర్ గా పోటీచేసి అత్యధిక మెజార్టీతో గెలిచారు. పోతుల వీరభద్రరావు చైర్మన్ గా ఎన్నికవడంతో ఏబి తొలిసారి ప్రజాపార్టీ, సిపిఎం, సిపిఐ పిఎస్పీ లతో పొత్తు కుదుర్చుకుని యునైటెడ్ ఫ్రంట్ సభ్యునిగా ప్రతిపక్ష హోదాలు కార్యకలాపాలు సాగించారు. మంత్రి చేసిన అనంతరం కూడా  స్థానిక రాజకీయాల్లో చురుగ్గా ఉండొచ్చని నిరూపించారు. కొన్సిలర్ గా చేసినా, చైర్మన్ గా చేసినా సమావేశాలకు వచ్చినపుడు గానీ, ఇతర మున్సిపల్ కార్యకలాపాలకు వచ్చినపుడు గానీ  ప్రయాణ చార్జీలు సైతం సొంతంగా భరించారే తప్ప, ఎప్పుడూమున్సిపల్ ఫండ్ నుంచి వాడుకోలేదు. అంతటి నిజాయితీ గల నాయకుడాయన. ఇంతెందుకు రెండో దఫా మున్సిపల్  చైర్మన్ గా ఎన్నికైనపుడు స్నేహితులు, జిల్లా , రాష్ట్రస్థాయి నాయకులు అందరూ కల్సి 10తులాల బంగారు పతకం చియించి, దానిపై బాపూజీ ఫోటో ముద్రించి బహుకరించారు. 1962లో భారత్ - చైనా యుద్ధ సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి నిధుల సేకరణకు రాజమండ్రి  వస్తే,భరతమాత రక్షణ నిధికి, యుద్ధనిధికి ఆ పతకాన్ని  సమర్పించేసిన నిస్వార్థ నాయకుడు ఏబి. 

1975లో కాంగ్రెసు ప్రభుత్వం ప్రకటించిన "జాతీయ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జయప్రకాశ్ నారాయణ పిలుపు మేరకు పౌరహక్కుల రక్షణ కోసం సత్యాగ్రహం చేసి 75 సంవత్సరాల వయస్సులో కూడా జైలు శిక్ష అనుభవించారు. 1977లో ప్రజాపార్టీ జనతా పార్టీ విలీనం అయినందున ఆయన రాజకీయ కార్యక్రమాలు జనతా పార్టీ ద్వారా కొనసాగాయి. పార్టీలకంటే ప్రజాపేవే ధ్యేయంగా కొనసాగిన ఏ.బి. పార్టీ రాజకీయాలు, ముఠా రాజకీయాలకి ఎప్పుడూ దూరంగానే ఉన్నారు.  సేవే లక్ష్యంగా జీవితాంతం కొనసాగారు. సేవా భావంతో పార్టీ విజయానికి కృషి చేశారు. 1972లో భారత స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్బంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన వారికి భారత ప్రభుత్వం తామ్రపత్రం అందించి, గౌరవించాలని నిర్ణయించింది. ఎ. బి కూడా ఆ సన్మానాన్ని పొంది, తామ్రపత్రం అందుకున్నారు.

1982 నవంబరు 1న పురజనుల నుంచి 'రాజమండ్రి వర పుత్రునిగా' బ్రహ్మాండమైన సన్మానం అందుకున్నారు. కులమత వర్గాలకు అతీతంగా అందరూ హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన పేదరికాన్ని చూసి, రాజమండ్రి పౌరులు విరాళాలు పోగుచేసి, పర్సు బహూకరించడానికి సిద్ధమైతే  నిర్ద్వందంగా తిరస్కరించిన నిరాడంబరుడు. నిస్వార్ధ నాయకుడు ఎబి. ఆయన పేదరికాన్ని అమితంగా  ప్రేమించారని, అందుకే అంతటి నిజాయితీగా ఉన్నారని పలువురు చెప్పేమాట.     సన్మానం అందుకున్న ఐదు రోజుల తర్వాత అంటే నవంబర్ 6న మరణించిన ఏబి పేరును రాజమండ్రి ఆర్యాపురం మొదటి వీధికి పెట్టారు. రాజమండ్రి సీతంపేటలో ఆయన విగ్రహాన్ని పెట్టారు. ఆర్యాపురం పార్కుకి నామకరణం చేసి, విగ్రహం పెట్టారు. ఎ. బిసతీమణి కామేశ్వరమ్మ 2002 ఆగస్టు 9న కన్నుమూశారు. 

బిరుదులు

[మార్చు]

 అజాత శత్రువు, అన్ కామన్ 'కామనర్, దీనజన బాంధవుడు, పూర్ణ పురుషుడు, లోక్ సేవక్ వంటి బిరుదులు పొందిన ఎ. బి తుదిశ్వాస వరకు పేదలకోసం వైద్య వృత్తి కొనసాగించిన నిస్వార్థ జీవి. రాజమండ్రి రాజకీయాల్లో స్వాతంత్య్ర సమరయోధులుగానే కాకుండా స్వాతంత్య్ర అనంతరం రాజకీయ, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎ. బి నాగేశ్వరరావు,క్రొవ్విడి లింగరాజు, వంగవేటి వెంకట దీక్షితులు నాయకత్రయంగా కీర్తిపొందారు.

ఏబి దాదాపు చాలా ఉద్యమాల్లో, సేవా సంస్థల కార్యకలాపాల్లో పాల్గొన్నారు. దాదాపు 50సంస్థలకు నాయకత్వం వహించి, మార్గ నిర్దేశం చేశారు.

  1. ఆంధ్రరాష్ట్ర ఉద్యమం: కన్వీనర్
  2. విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యమం: కన్వీనర్, అధ్యక్షుడు
  3. ఆంధ్రా పేపర్ మిల్లు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పడ్డ కమిటీ: కన్వీనర్
  4. సుబ్రహ్మణ్య మైదానం ప్రైవేటు వ్యక్తుల పరం కాకూడదని ఏర్పడ్డ సంఘం: కన్వీనర్
  5. గోదావరినది వరద నిధులు సహాయ కమిటీ: కన్వీనర్
  6. అగ్నిబాధితుల పునరావాస నిర్మాణ కమిటీ: కన్వీనర్
  7. గోదావరినది వరద బాధితుల పునరావాస నిర్మాణ కమిటి: అధ్యక్షుడు
  8. ల్యాండ్ టాక్స్ రెమిషన్ కోసం ఏర్పడ్డ అఖిలపక్ష సంఘ జాతీయ సత్యాగ్రహ సమితి : కన్వీనర్
  9. గోదావరి రైలు కం రోడ్డు  బ్రిడ్జి సాధించడానికి ఏర్పడిన ఎగ్జిక్యూటివ్ కమిటీ:అధ్యక్షుడు
  10. పాల్ చౌక్ లీజుకి  ఇవ్వకూడదన్న కమిటీ: చైర్మన్
  11. కుష్టురోగనివారణ సంఘం: కన్వీనర్
  12. గౌతమీ జీవకారుణ్య సంఘం: అధ్యక్షుడు, కార్యదర్శి  
  13. విక్రమహాలు గాంధీ నిర్మాణాత్మక కార్యక్రమం: కన్వీనర్, అధ్యక్షుడు
  14. కుటీర పరిశ్రమల ఎగ్జిబిషన్ కమిటి: అధ్యక్షుడు
  15. శంకరమఠం: అధ్యక్షుడు
  16. ఆంధ్రప్రదేశ్ కుష్టురోగనివారణా ఎగ్జిక్యూటివ్ కమిటి : సహాయకార్యదర్శి
  17. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూదాన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ: మెంబరు
  18. హిందీ ప్రేమీ మండలి: అధ్యక్షుడు
  19. మద్రాసు దక్షిణ భారత హిందీ సభ: సభ్యులు
  20. హిందీ మహా విద్యాలయ్: అధ్యక్షుడు
  21. ఆల్ ఇండియా హిందీ భాషా సమ్మేళనం: అధ్యక్షుడు
  22. చైనా వార్ యాక్టివిటీ రాష్ట్ర మహాసభ: ఎగ్జిక్యూటివ్ మెంబర్
  23. తూర్పుగోదావరి జిల్లా రక్షణశాఖ కమిటి: అధ్యక్షుడు , ఉపాధ్యక్షుడు
  24. రక్షణ కమిటి ఆహార సరఫరా కమిటి: అధ్యక్షుడు
  25. గౌతమీ ఉమామార్కండేయ లక్ష కుంకుమార్చన సంఘం:అధ్యక్షుడు
  26. గీతా మహాసభ: అధ్యక్షుడు
  27. సివిల్ వెల్ఫేర్ కమిటి:అధ్యక్షుడు
  28. జాతీయ మసూచి నివారణ జిల్లా కమిటీ: అధ్యక్షుడు
  29. తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ: ఉపాధ్యక్షుడు
  30. కేంద్రవాణిజ్య సంస్థ సంఘం: అధ్యక్షుడు
  31. తూర్పు గోదావరి జిల్లా వరకట్న నిషేధ కమిటి: అధ్యక్షుడు
  32. గిల్డు ఆఫ్ సర్వీసు: అధ్యక్షుడు
  33. జిల్లా ప్రిజనర్స్ ఎయిడ్ సర్వీస్: సభ్యులు
  34. దివిసీమ ఉప్పెన బాధితుల సహాయ సంఘం: అధ్యక్షుడు  
  35. దివిసీమ ఉప్పెన బాధితుల సహాయ సంఘం పునరావాస సంక్షేమ సంఘం: కన్వీనర్
  36. తోటపల్లి శాంతి ఆశ్రమం: అధ్యక్షుడు
  37. వేదశాస్త్ర పరిషత్: ఎగ్జిక్యూటివ్ మెంబరు
  38. తూర్పు గోదావరి జిల్లా స్వాతంత్య్ర ఉద్యమ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్: ఉపాధ్యక్షులు
  39. తూర్పు గోదావరి జిల్లా స్వాతంత్య్ర ఉద్యమ అడ్ హాక్ కమిటీ: సభ్యులు

మూలాలు

[మార్చు]
  1. "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలెక్షన్స్ రిజల్ట్స్ ఇన్ 1955". Archived from the original on 2019-07-02.
  2. https://web.archive.org/web/20190702124143/https://archives.aplegislature.org/documents/archives/A-000044-03-12-1956.pdf#search=%22%22
  3. "Andhra Pradesh Assembly Election Results in 1955". Elections in India. Retrieved 2024-11-08.

వెలుపలి లంకెలు

[మార్చు]

చల్లా సత్యవాణి రచించిన 'రాజమహేంద్రవర వరపుత్రుడు, శతాబ్ది మహనీయుడు ఎ. బి నాగేశ్వరరావు 'పుస్తకం(14-02-2012), స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ పత్రికల్లో కథనాలు.