ఐఎన్‌ఎస్ కమోర్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐఎన్‌ఎస్ కమోర్తా

భారత నౌకాదళం కోసం నిర్మించిన నాలుగు జలాంతర్గామి విధ్వంసక యుద్ధనౌకల శ్రేణిలో మొదటిది ఐఎన్‌ఎస్ కమోర్తా. ఇది అత్యాధునిక యుద్ధనౌక, దీనిని భారత నౌకాదళంలోని తూర్పు తీరంలో ప్రవేశ పెట్టనున్నారు. దీనికి వేదిక విశాఖ నావల్ డాక్ యార్డ్ కానుంది. దీనిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ 23-08-2014న లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నౌక ఎన్నో విశిష్టతలను కలిగి ఉంది. ఇది శత్రుదేశాల యుద్ధనౌకలకు ప్రత్యేకించి జలాంతర్గాములకు సింహస్వప్నం వంటిది. భారతదేశ నౌకాదళ శక్తి సామర్థ్యాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో నౌకాదళానికే చెందిన "డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్" అధికారులు కమోర్తాను రూపొందించారు. ప్రాజెక్ట్-28 పేరున మొదలు పెట్టిన నాలుగు జలాంతర్గామి విధ్వంసక యుద్ధనౌకల (ఎ.ఎస్.డబ్ల్యు.) శ్రేణిలో ఇది మొదటిది. 2006లో మొదలైన ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో విజయవంతమవడంతో మొదటి నౌక ఆవిష్కృతమైంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అందునా 90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకను భారత నౌకాదళానికి అప్పగించారు. ఇది కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌యార్డ్ (జి.ఆర్.ఎస్.ఇ.)లో నిర్మితమైంది.ఐ.ఎన్.ఎస్. కమోర్తా శత్రుదేశ జలాంతర్గాములను 200 కిలోమీటర్ల పైగా దూరంలోనే గుర్తించి, వాటిపై దాడులు చేసి ధ్వంసం చేయగల శక్తి సామర్థ్యాలను కలిగి ఉంది.ఈ యుద్ధనౌక పొడవు 110 మీటర్లు, బరువు 3,500 టన్నులు, వేగం గంటకు 25 కిలోనాట్లు. ఇది ఏకధాటిగా 3,500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు. యుద్ధనౌక ఉపరితలం నుంచి గాలిలో లక్ష్యాల్ని ఛేదించేందుకు క్షిపణులనూ ప్రయోగించవచ్చు. దీనిపై ఒక హెలికాప్టర్ కూడా ఉంటుంది. ఈ యుద్ధనౌకలో అధికార సిబ్బంది 13 మంది, నావికులు 173 మంది, వీరు తమ విధులను నిర్వర్తిస్తారు.