Coordinates: 40°05′08″N 22°21′31″E / 40.08556°N 22.35861°E / 40.08556; 22.35861

ఒలింపయనులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒలింపస్ పర్వతం
అత్యంత ఎత్తైన బిందువు
శిఖరంMytikas
ఎత్తు2,917 m (9,570 ft)
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్2,353 m (7,720 ft)
మాతృశిఖరంMusala
టోపోగ్రాఫిక్ ఐసొలేషన్254 km (158 mi) Edit this on Wikidata
నిర్దేశాంకాలు40°05′08″N 22°21′31″E / 40.08556°N 22.35861°E / 40.08556; 22.35861
భౌగోళికం
ఒలింపస్ పర్వతం is located in Greece
ఒలింపస్ పర్వతం
ఒలింపస్ పర్వతం
Location of Mount Olympus

ఒలింపస్ పర్వతం గ్రీసు దేశంలో మిక్కిలి ఎత్తైన పర్వతం (2,917 మీటర్లు ఎత్తు). దాని ఠీవి, దాని రాజసం, దాని అందంతో పాటు అది అందరికి అందుబాటులో లేని కారణంగా ప్రాచీన గ్రీసు దేశస్తులు దానిని దేవతల ఆలవాలంగా ఆరాధించేరు. ఈ పర్వతం మీదనే ముఖ్యమైన పన్నెండు మంది దేవతలు నివాసమున్నారని ప్రాచీన కాలంలో గ్రీసు దేశస్తులు నమ్మేవారు. ఈ పన్నెండు మందిని “ఒలింపియనులు” అని పిలుస్తారు.

గ్రీసు దేశపు పురాణ గాథలు[మార్చు]

ఈ పన్నెండు మంది ఒలింపియను దేవతలలో --

  • క్రోనస్ కి రేయాకి పుట్టినవారు ఐదుగురు: జూస్, పొసైడన్, హేరా, డిమిటర్, హెస్టియా.
  • జూస్ కి హేరా కి పుట్టిన పిల్లలు ఇద్దరు: ఆరీస్, హెఫాయెస్టస్.
  • జూస్ కి ఇతరులతో ఉన్న వివాహేతర సంబంధాల వల్ల పుట్టినవారిలో ఒలింపియను దేవతలుగా లెక్కలోకి వచ్చేవారు నలుగురు: హెర్మీస్, ఎథీనా, ఆర్టెమిస్, అప్పాలో.
  • చిట్టచివరగా, యూరెనస్ వృషణాల నుండి పుట్టిన ప్రేమ దేవత ఏఫ్రొడైటి. (పాతాళలోకానికి అధిపతి అయిన హేడీస్ ని ఈ పన్నెండు మందిలో లెక్కించరు.)

జూస్ కొలువులో ఉన్న పన్నెండు మంది ఒలింపియను దేవతలని మరొక సారి మరొక కోణంలో చూద్దాం. కొన్ని పేర్లలో పోలిక గట్టిగా ఉంటుంది కనుక అన్ని పేర్లని ఇంగ్లీషు వర్ణక్రమంలో కూడా చూపుతున్నాను. ఉత్సాహం ఉన్నవాళ్లు శోధన యంత్రాలు ఉపయోగించి ఇంకా సమాచారం సేకరించగలరు.

  • జూస్ (Zeus): దేవతలకి అధిపతి; మన ఇంద్రుడి లాంటివాడు; (రోమక పురాణాలలో జూపిటర్, Jupiter)
  • హేరా (Hera): జూస్ పట్టమహిషి, జూస్ చెల్లెలు, క్రోనస్ - రేయాల కూతురు; (రోమక పురాణాలలో జూనో, Juno)
  • పొసైడన్ (Poseidon): సముద్రాలకి అధిపతి; జూస్ తోబుట్టువు; (రోమక పురాణాలలో నెప్ట్యూన్, Neptune)
  • డిమిటర్ (Demeter): పాడి పంటలకి అధిపత్ని, క్రోనస్ - రేయాల కూతురు; జూస్ తోబుట్టువు; జూస్ కీ పొసైడన్ కి ప్రియురాలు; (రోమక పురాణాలలో సీరీస్, Ceres)
  • ఎథీనా (Athena): యుద్ధ విద్యలకి అధిపత్ని; జూస్ శిరస్సు నుండి సచేలంగా, సాలంకృతంగా పుట్టింది; (రోమక పురాణాలలో మినర్వా, Minerva)
  • అప్పాలో (Appolo): జూస్ - లేతో లకి పుట్టిన కొడుకు. ఆర్టెమిస్-అప్పాలోలు కవలలు. (రెండవ తరం ఒలింపియనుడు)
  • ఆర్టెమిస్ (Artemes): జూస్ - లేతో లకి పుట్టిన కూతురు. ఆర్టెమిస్-అప్పాలోలు కవలలు. (రెండవ తరం ఒలింపియని); (రోమక పురాణాలలో డయానా, Diana)
  • ఎరీస్ (Ares): యుద్ధ విద్యలకి అధిపతి; జూస్ - హేరా లకి పుట్టిన కొడుకు; (రోమక పురాణాలలో మార్స్, Mars)
  • ఏఫ్రొడైటి (Aphrodite): లైంగిక ప్రేమకి అధిపత్ని; యూరెనస్ జననాంగాలని కోసి సముద్రంలో పారేసినప్పుడు వాటి నుండి స్రవించిన తెల్లటి నురుగు నుండి పుట్టిన వ్యక్తి అని ఒక కథనం ఉంది. (టైటనుల తరం ఒలింపాయని); (రోమక పురాణాలలో వీనస్, Venus)
  • హెర్మీస్ (Hermes): దేవ దూత; వీణ లాంటి వాయిద్యాన్ని పట్టుకుని విశ్వ పర్యటన చేస్తూ ఇక్కడి వార్తలు అక్కడకి చేర్చుతూ ఉంటాడు; మన నారదుడి పోలిక కొంత ఉంది.; (రోమక పురాణాలలో మెర్కురీ, Mercury)
  • హెఫాయెస్టస్ (Hephaestus): అగ్ని దేవుడు, దేవతల కమ్మరి; ఏఫ్రొడైటిని పెళ్లి చేసుకున్నాడు; హేరాకి కొడుకు; తండ్రి ఎవ్వరో తెలియదు (జూస్ కావచ్చు); (రోమక పురాణాలలో వల్కన్, Vulcan)
  • హేస్టియా కానీ డయనీసిస్ కానీ:
  • క్రోనస్ కి రేయాకి పుట్టిన ప్రథమ సంతానం హేస్టియా.
  • జూస్ కీ మానవ వనితకు పుట్టిన బిడ్డ కనుక డయనీసిస్ సంపూర్ణ దైవత్వం లేని వ్యక్తి (demigod) కనుక ద్వాదశ ఒలింపియనుల జాబితాలో ఇమడక పోవచ్చు.

ఒలింపస్ పర్వతం మీద నివాసం ఉండే ఈ మూడవ తరం దేవతలలో జూస్ - హేరా ల సంతానమే ఎక్కువమంది!

Fragment of a Hellenistic relief (1st century BC–1st century AD) depicting the twelve Olympians carrying their attributes in procession; from left to right, Hestia (scepter), Hermes (winged cap and staff), Aphrodite (veiled), Ares (helmet and spear), Demeter (scepter and wheat sheaf), Hephaestus (staff), Hera (scepter), Poseidon (trident), Athena (owl and helmet), Zeus (thunderbolt and staff), Artemis (bow and quiver), Apollo (lyre), from the Walters Art Museum.[1]

వంశవృక్షం[మార్చు]

ముఖ్యమైన పాత్రల వంశవృక్షం, టూకీగా[మార్చు]

  • యూరెనస్ కీ గాయా కీ → క్రోనస్, రేయా, థేమిస్ (పెద్ద)
  • క్రోనస్ కి రేయా కీ → జూస్, హేరా, పొసైడన్, హేడిస్, డిమిటర్, హేస్టియా
  • జూస్ కి హేరా కీ → ఎరీస్, హెఫాయెస్టస్ (లేదా, హేరా → హెఫాయెస్టస్?)
  • జూస్ కి మేటిస్ కీ → ఎథీనా
  • జూస్ కి లేతో కీ → అప్పాలో, ఆర్టిమిస్
  • జూస్ కి మయియా కీ → హెర్మీస్
  • జూస్ కి సెమిలీ కీ → డయొనీసన్
  • జూస్ కి డయోన్ కీ → ఏఫ్రొడైటి? లేదా యురేనస్ వృషణాల నుండి → ఏఫ్రొడైటి? (లేదా, జూస్ కి డయోన్ కీ → ఏఫ్రొడైటి?)
  • జూస్ కి ఇతరులతో → పెర్సిఫొనీ, పెర్సియస్, హెరాక్లిస్, ట్రోయ్ కి చెందిన హెలెన్, మినోస్, కాకుండా తొమ్మిది మంది మూజ్ లు. (ఈ మూజ్ లు కళలకి, విద్యలకి అధిపత్నులు.)

థేమిస్: క్రోనస్-రేయా ల పుత్రిక. ఈమె ధర్మపరిపాలనకి అధినేత్రి. ఈమె కుడి చేతిలో దుష్ట శిక్షణకి ఒక కత్తి, ఎడమ చేతిలో నిష్పక్షపాత ధర్మపాలనకి గురుతుగా ఒక త్రాసు ఉంటాయి. ఈమె కళ్ళకి కట్టిన గుడ్డ తీర్పు కొరకు వచ్చిన ప్రత్యర్థుల సాంఘిక స్థాయికి అతీతంగా ఆమె తీర్పు ఉంటుందని సూచిస్తుంది.

జాస్ అంతటివాడు తనకి వచ్చిన ధర్మసందేహాలని తీర్చుకుందుకి ఈమెని సంప్రదిస్తూ ఉంటాడు.

గ్రీసు చరిత్రలో మరొక థేమిస్ ఉంది ఈ “పెద్ద” థేమిస్ యూరెనస్-గాయా ల కూతురు. ఈమెకి భవిష్యత్తు లోకి చూడగలిగే శక్తి ఉంది. ఈ శక్తిని ఆమె తన పెరింటిగత్తె అయిన ”చిన్న” థేమిస్ కి ధారపోసిందని ఒక ఐతిహ్యం ఉంది.

హిందూ పురాణాలతో పోలిక[మార్చు]

జూస్ ని పోలిన వ్యక్తి ఇంద్రుడు అని అనుకున్నాం కదా. హిందూ పురాణాలలోని దత్తాత్రేయ పురాణం ప్రకారం బ్రహ్మ మానసపుత్రులలో ఒకడైన మరీచి కొడుకు కశ్యపుడు. ఇతను (బ్రహ్మ మానసపుత్రులలో మరొకడైన) దక్ష ప్రజాపతి యొక్క ఎనమండుగురు కూతుళ్ళని పెళ్లి చేసుకుంటాడు. వీరిలో పెద్ద కూతురు అదితికి పుట్టిన వారిలో ఆదిత్యులు పన్నెండుమంది, వసువులు ఎనమండుగురు, రుద్రులు పదకొండుమంది, అశ్వినీ దేవతలు ఇద్దరు. జూస్ పన్నెండుగురు ఒలింపాయనులలో ఒకడైతే, ఇంద్రుడు పన్నెండుగురు ఆదిత్యులలో (అనగా, అదితి కొడుకులలో) ఒకడు.

ఋగ్వేదం (1.164.33) ప్రకారం ఇంద్రుడు ద్యయుస్ (ఆకాశం) కి, పృధ్వి (భూదేవి) కి పుట్టిన కొడుకు.

మూలాలు[మార్చు]