Jump to content

కద్మత్ ద్వీపం

కద్మత్ ద్వీపం (దీవి), ఇది అమినిదివి దీవులకు కుడి వైపు దిగువన ఉంది

కద్మత్ ద్వీపం (Kadmat Island), దీనిని కార్డమమ్ (యాలకుల) దీవి అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశంలోని లక్షద్వీప్ ద్వీపసమూహానికి చెందిన అమినిదివి ద్వీపాల ఉపవిభాగానికి చెందిన పగడపు ద్వీపం. 9.3 కి.మీ. పొడవు గల ఈ ద్వీపం, 1.5 కి.మీ. వెడల్పుతో 25 చ.కి.మీ. వైశాల్యంలో ఉన్న ఒక సరస్సును (మడుగును) కలిగి ఉంది. ఈ ద్వీపం పర్యావరణ లక్షణం సముద్రపు గడ్డితో ఉన్న పగడపు దిబ్బ, అలాగే ఇక్కడ నివసించే సముద్ర తాబేళ్లు. ద్వీపం లోని జంతువులు, మొక్కలు లేదా ఇతర జీవులు, వనరుల సంరక్షణను నిర్ధారించడానికి పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (భారతదేశం) ఈ ద్వీపాన్ని సముద్ర రక్షిత ప్రాంతంగా గుర్తించింది.

ఈ ద్వీపంలో జనావాసాలు ఉన్న ఏకైక గ్రామం కద్మత్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 5,389 జనాభా ఉంది. చేపలు పట్టడం ఈ ద్వీపంలో ప్రధాన ఆర్థిక కార్యకలాపం, వ్యవసాయం ఇక్కడి భూభాగంలో 5 శాతానికి మాత్రమే పరిమితం చేయబడింది. పర్యాటకానికి ఇక్కడ చట్టబద్ధమైన అనుమతి ఉంది, స్కూబా డైవింగ్ కోసం కయాకింగ్, స్నార్కెలింగ్, గ్లాస్-బాటమ్ బోట్ (అడుగు భాగం అద్దంతో ఉన్న పడవ) విహారయాత్రలు ఇక్కడి ఆకర్షణలు.

భౌగోళికం, వాతావరణం

[మార్చు]
కద్మత్ ద్వీపంలోని బీచ్ సైడ్ రిసార్ట్

అమినిదివి తహసీల్ పరిధిలోని కద్మత్ దీవి టౌన్‌షిప్‌కు చెందిన కద్మత్ ద్వీపం,[1] లక్షద్వీప్ ద్వీపసమూహంలో అత్యంత కేంద్రంగా ఉన్న ద్వీపం. ఇది 3.5 చ.కి.మీ. వైశాల్యంతో కన్నీటి బిందువు ఆకారంలో ఉంటుంది, ఇది పగడపు దిబ్బపై ఉంది. ఉత్తరం నుండి దక్షిణానికి 9.3 కి.మీ. పొడవుతో,[a] గరిష్ఠంగా 0.57 కి.మీ. వెడల్పుతో[4] అమినిదివి సమూహంలో ఇది అతిపొడవైన ద్వీపం.[5] దీని దక్షిణ కొన సుమారు 10 మీటర్ల వెడల్పుతో ఇరుకుగా ఉంటుంది. ద్వీపపు స్థలాకృతి సగటు సముద్ర మట్టానికి తూర్పు వైపున 2 నుండి 3 మీటర్లు, పశ్చిమ భాగంలో 2 నుండి 4 మీటర్లు ఉంటుంది. దీని ఉపరితల నిర్మాణం పగడపు, పగడపు ఇసుక ముక్కలపై ఉన్న కోరల్ కాంగ్లోమరేట్ (పగడపు గులకరాళ్ళ సమూహం) తో ఉంటుంది.[6]

ద్వీపం పశ్చిమ వైపున ఉన్న సరస్సు (మడుగు)[7] 37 చ.కి.మీ. వైశాల్యంతో,[6] గరిష్ఠంగా 2 కి.మీ. వెడల్పుగా విస్తరించి ఉంది,[8] నీటి లోతు సుమారు 2 నుండి 3 మీటర్ల లోతు ఉంటుంది.[9][10] ఇది తీరరేఖ, ఇసుకతో కూడిన బీచ్‌ను కలిగి ఉంది. పగడపు దిబ్బ వెడల్పు సుమారు 50 మీటర్లు ఉంటుంది. టైడల్ రేంజ్ (సముద్రపు ఆటుపోట్ల స్థాయి) 0.6 నుండి 1.6 మీటర్ల మధ్య ఉంటుంది.[9][10][11][6] ద్వీపం తూర్పు వైపున ఉన్న బీచ్ 100 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ బీచ్ బ్రేకింగ్ జోన్ (అలలు విరిగిపడే ప్రదేశం) వద్ద 100 మీటర్ల వెడల్పు గల పగడపు శైవలాల శిఖరం ఉంది.[7]

కద్మత్ ద్వీపానికి వాయవ్యంగా 67 కి.మీ. దూరంలో కవరత్తి ద్వీపం ఉంది. ఇది కిల్తాన్ ద్వీపం నుండి 32 కి.మీ. దూరంలో ఉంది. పిట్టి బ్యాంక్ నిర్మాణానికి వాయవ్య భాగాన్ని సూచించే అమిని దీవి, నైరుతి దిశలో 5 కి.మీ. దూరంలో ఉంది.[6] ఇది కన్నూర్ నుండి 292 కి.మీ., కోజికోడ్ నుండి 327 కి.మీ., కొచ్చి నుండి 407 కి.మీ. దూరంలో ఉంది.[12]

సమీపంలోని అగట్టి ద్వీపంలో విమానాశ్రయం ఉంది, ఇక్కడికి కొచ్చి నుండి విమానాలు నడుస్తాయి. అగట్టి నుండి కద్మత్‌కు పడవలో రెండున్నర గంటల ప్రయాణం. కేరళ తీరంలోని కొచ్చి నుండి ఫెర్రీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి, అయితే ఇందుకు 16 గంటల ప్రయాణ సమయం పడుతుంది.[13]

శీతోష్ణస్థితి, పర్యావరణం

[మార్చు]
కద్మత్ తీరంలో పడవలు

ఈ ద్వీపంలో సగటు వార్షిక ఉష్ణోగ్రత 24.2 - 34.4 °C మధ్య ఉంటుంది. సమీప అమిని ద్వీపం రికార్డుల ప్రకారం సగటు వార్షిక వర్షపాతం 1237 మి.మీ. కాగా, ఇక్కడ మే నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలం ఉంటుంది.[14] ఒక రోజులో నమోదైన గరిష్ఠ వర్షపాతం 241.8 మి.మీ. సగటు తేమ 72.5% గా ఉంటుంది.[12]

జనాభా వివరాలు

[మార్చు]

కద్మత్ ద్వీపంలో మతాలు (2011)[15]

  ఇస్లాం (97.65%)
  ఇతరులు (0.15%)
  చెప్పనివారు (0.04%)

ఈ ద్వీపంలో ప్రధానంగా మేలచ్చెరి కులానికి చెందిన వ్యక్తులు నివసిస్తున్నారు.[16] ద్వీపంలో జనావాసాలు ఉన్న ఏకైక గ్రామం కద్మత్.[13] 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ ద్వీపంలో 2,676 మంది పురుషులు, 2,713 మంది స్త్రీలు కలిపి మొత్తం 5,389 జనాభా ఉన్నారు.[17] జనసాంద్రత చ.కి.మీ.కు 1,727 గా ఉంది. 2001-2011 మధ్య కాలంలో దశాబ్దపు వృద్ధి రేటు 1.03 శాతంగా నమోదైంది.[17] 2001లో అక్షరాస్యత రేటు 87.88 శాతంగా ఉంది, ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 91.78, స్త్రీల అక్షరాస్యత 92.53; ఈ రెండు సందర్భాల్లోనూ లక్షద్వీప్ ద్వీప సగటు అక్షరాస్యత కంటే ఇది చాలా ఎక్కువ.[18] ద్వీప ప్రజల ప్రధాన భాష జసరి/జజరీ, ఇక్కడ అక్షరాస్యత రేటు 90.4% గా ఉంది.[12]

ద్వీపంలో రోడ్ల నెట్‌వర్క్, అనేక చెరువులు, బావులు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, విద్యుత్, టెలిఫోన్, ఆరోగ్య కేంద్రాలు మొదలైన సదుపాయాలు ఉన్నాయి.[18]

1960లో ఒక నాణేల గుట్ట బయటపడింది, దానిని పరిశీలించిన మీదట కనీసం క్రీ.శ. 200 నుండి ఈ ద్వీపంలో జనావాసాలు ఉన్నట్లు వెల్లడైంది. కద్మత్ ద్వీపం రోమన్లతో వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది, 1948లో ద్వీపంలోని ఒక క్వారీలో ఒక బాలికకు రోమన్ నాణెం దొరికింది.[19]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]
కద్మత్‌లో ఆక్టోపస్‌ను ఆరబెడుతున్న దృశ్యం

చేపలు పట్టడం ద్వీప ప్రజల ప్రధాన వృత్తి. సముద్ర తీరంలో, వర్షాకాలంలో సరస్సులో, దిబ్బల ప్రాంతంలో చేపలు పడతారు. మహాసముద్ర టూనా ఫిషింగ్ కోసం ట్రాల్ వలలు, పోల్ లైన్‌లను ఉపయోగిస్తారు. సరస్సులో స్థానికంగా చేపలు పట్టడానికి చెక్క పడవలను ఉపయోగిస్తారు. ఇక్కడ కారాంగిడ్స్, సెఫలోపాడ్స్, పెర్చ్‌లు, రెయిన్‌బో సార్డిన్, రేస్, సెయిల్ ఫిషెస్, సొరచేపలు, స్కిప్‌జాక్ టూనా, టూనా చేపలు ఉన్నట్లు నివేదించబడింది.[20] వ్యవసాయం సాగులో ఉంది, భూభాగంలో దాదాపు 5% సాగు కిందకు తీసుకురాబడింది. కొబ్బరి తోటలతో పాటు కొబ్బరి పీచు సంబంధిత పనులు ఇక్కడ సాధారణం. పండించే పంటలలో ఎర్ర గడ్డి, వేరుశనగ, మొక్కజొన్న, చిలగడదుంప, ధాన్యాలు, తృణధాన్యాలు, చిరుధాన్యాలు, బొప్పాయి, అరటి ఉన్నాయి.[21]

ద్వీపంలో పర్యాటకం ఊపందుకుంది, అయితే 50 మంది అతిథుల కోసం ఇక్కడ కేవలం ఒక బీచ్ రిసార్ట్ మాత్రమే ఉంది. కయాకింగ్, స్నార్కెలింగ్ సౌకర్యాలు, స్కూబా డైవింగ్ కోసం గ్లాస్-బాటమ్ బోట్ విహారయాత్రలు ఉన్నాయి.[13] 1998లో మొదటి వాటర్ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ లక్కదీవ్స్ డైవింగ్ సెంటర్‌తో పాటు కద్మత్‌లో స్థాపించబడింది.[22]

వన్యప్రాణులు

[మార్చు]

ఈ ద్వీపం మూడు రకాల ఆవాసాలను కలిగి ఉంది: పగడపు దిబ్బ, సముద్రపు గడ్డి, సముద్ర తాబేళ్లు నివసించే ప్రదేశం.[14] పగడపు దిబ్బల జోనింగ్ రీఫ్ ఫ్లాట్, రీఫ్ స్లోప్, సరస్సు అని మూడు జోన్‌ల కింద మ్యాప్ చేయబడింది. తీర రేఖ పక్కన ఫ్రింగింగ్ రీఫ్‌లు ఉన్నాయి, ఇక్కడ ఫిన్, షెల్ ఫిష్ జాతులు గుడ్లు పెడతాయి, ఇవి ఇక్కడ సమృద్ధిగా కనిపిస్తాయి. 1986 నాటికి, దిబ్బలో 45 పగడపు జాతులు ఉన్నాయి. మానవ జోక్యం, సహజ కారణాల వల్ల వీటికి ముప్పు పొంచి ఉంది.[23] సజీవ పగడాలు 1% కంటే తక్కువ ప్రాంతంలో ఉన్నట్లు నివేదించబడింది. సరస్సు, రీఫ్ స్లోప్ ప్రాంతంలో 9 జాతుల సజీవ పగడాలు ఉన్నాయి. నివేదించబడిన సజీవ పగడపు జాతులు: ఆక్రోపోరా ఫార్మోసా (స్టాగ్‌హార్న్ పగడం), ఆక్రోపోరా రోబస్టా, ఆక్రోపోరా, ఆక్రోపోరా సబ్‌గ్లాబ్రా, ఆక్రోపోరా టోర్టుయోసా, ఆక్రోపోరా వౌఘని, ఫావిట్స్, పోసిలోపోరా వెర్రుకోసా, లోబోఫైటమ్[24] బెంథిక్ జీవులు రీఫ్ స్లోప్, సరస్సు ప్రాంతంలో నివేదించబడ్డాయి. మాక్రోబెంతోస్ ఇంటర్-టైడల్, సబ్-టైడల్ ప్రాంతంలో కనిపిస్తాయి. 23 జాతుల పాలికీట్లు, 3 జాతుల బివాల్వ్‌లు, 3 జాతుల క్రస్టేసియన్‌లు, 3 జాతుల గ్యాస్ట్రోపాడ్‌లు నమోదయ్యాయి.[25]

ద్వీపం అంతటా సుమారు 13.8 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న సముద్రపు గడ్డి పడకలు,[26] తాబేళ్లు, డుగాంగ్‌లకు కీలకమైన ఆహారాన్ని అందిస్తాయి. ఇక్కడ నాలుగు జాతుల సముద్ర తాబేళ్లు నివేదించబడ్డాయి: చెలోనియా మైడాస్ (ఆకుపచ్చ సముద్ర తాబేలు), డెర్మోచెలిస్ కొరియాసియా (లెదర్‌బ్యాక్ సముద్ర తాబేలు), ఎరెట్మోచెలిస్ ఇంబ్రికాటా (హాక్స్‌బిల్ సముద్ర తాబేలు), లెపిడోచెలిస్ ఒలివేసియా (ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేలు).[27] లక్షద్వీప్ దీవులలో కనిపించే 14 జాతులలో తలాసియా హెంప్రిచి, సైమోడోసియా రొటుండాటాతో సహా ఇక్కడ 7 జాతుల సముద్రపు గడ్డి నివేదించబడింది.[27] నమోదు చేయబడిన సముద్రపు కలుపు మొక్కలు 34 జాతులను కలిగి ఉన్నాయి, వాటిలో 14 జాతులు రోడోఫైసీ (ఎర్ర ఆల్గే), 13 జాతులు క్లోరోఫైసీ (ఆకుపచ్చ ఆల్గే), 7 జాతులు ఫెయోఫైసీ (గోధుమ రంగు ఆల్గే).[28] 20 జాతుల ఫైటోప్లాంక్టన్, 19 గ్రూపుల జూప్లాంక్టన్ రీఫ్ స్లోప్, సరస్సు ప్రాంతంలో నమోదు చేయబడ్డాయి;[29] 33 జాతుల బెంథిక్ జీవులు కూడా ఇక్కడే గుర్తించబడ్డాయి.[25]

కద్మత్ బీచ్

[మార్చు]

కద్మత్ బీచ్ కద్మత్ ద్వీపపు ప్రముఖ ఆకర్షణలలో ఒకటి. ఈ బీచ్ దాని స్పష్టమైన జలాలు, గొప్ప సముద్ర జీవనానికి ప్రసిద్ధి చెందింది, ఇది స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ కు ప్రసిద్ధ గమ్యస్థానంగా మారింది. పర్యావరణ స్థిరత్వం, భద్రతా ప్రమాణాల పట్ల నిబద్ధతకు గాను కద్మత్ బీచ్ ప్రతిష్ఠాత్మక బ్లూ ఫ్లాగ్ బీచ్ సర్టిఫికేషన్ కూడా పొందింది.[30]

గమనికలు

[మార్చు]
  1. ↑ వివిధ మూలాలు పొడవును నివేదించడంలో విభిన్నంగా ఉంటాయి. అనేక మూలాలు 8 కి.మీ. అని పేర్కొంటుండగా,[2] జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 9.25 కి.మీ. అని పేర్కొంది.[3]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Tehsils info" (PDF). Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 18 January 2009.
  2. ↑ Athawale 1991, p. 69.
  3. ↑ Records of the Geological Survey of India. The Survey. 1998. p. 218.
  4. ↑ "Kadmat Island, Lakshadweep". Government of Lakshadweep. Retrieved 6 July 2016.
  5. ↑ Prakash, Nair & Hameed 2014, p. 48.
  6. 1 2 3 4 "Kadmat". Ocean Dots: The Island Encyclopaedia. Archived from the original on 28 September 2010.
  7. 1 2 Green & Short 2003, p. 106.
  8. ↑ "Kadmat Iland: Ar a glance". Government of Lakshadweep. Retrieved 6 July 2016.
  9. 1 2 Sri 2001, p. 10.
  10. 1 2 "Critical Habitat Information System of Kadmat Island" (PDF). Government of India, Department of Ocean Development. Archived from the original (PDF) on 25 July 2011. Retrieved 2009-01-18.
  11. ↑ Sri 2001, p. 9.
  12. 1 2 3 "Kadmat - At a Glance". National Informatics Center.
  13. 1 2 3 "Lakshadweep: All quiet on India's secret islands". The Independent. 9 August 2015.
  14. 1 2 Sri 2001, p. 4.
  15. ↑ "Kadmat Island  population". Census India 2011. Retrieved 15 January 2024. {{cite web}}: no-break space character in |title= at position 14 (help)
  16. ↑ The Eastern Anthropologist. Ethnographic and Folk Culture Society. 1989. p. 287.
  17. 1 2 "Islandwise Area and Population - 2011 Census" (PDF). Government of Lakshadweep. Archived from the original (PDF) on 2016-07-22.
  18. 1 2 "Kadmat Island" (PDF). Government of LakshadweEp. p. 247. Retrieved 6 July 2016.
  19. ↑ Mukerji 1992, p. 40.
  20. ↑ Sri 2001, pp. 20–21.
  21. ↑ Sri 2001, pp. 10, 23.
  22. ↑ Carlsen & Butler 2011, p. 61.
  23. ↑ Sri 2001, pp. 4–5.
  24. ↑ Sri 2001, p. 12.
  25. 1 2 Sri 2001, p. 17.
  26. ↑ Sri 2001, p. 13.
  27. 1 2 Sri 2001, pp. 5–6.
  28. ↑ Sri 2001, p. 18.
  29. ↑ Sri 2001, p. 13–14.
  30. ↑ "Explained: What is Blue Flag all about? Lakshadweep's Minicoy, Thundi and Kadmat beaches that won the coveted award". Zee Business. Retrieved 2023-09-02.

గ్రంథ పట్టిక

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]

11°13′23″N 72°46′34″E / 11.223°N 72.776°E / 11.223; 72.776