Jump to content

కనక్ ముఖర్జీ

వికీపీడియా నుండి
కనక్ ముఖర్జీ
কনক মুখোপাধ্যায়
వ్యక్తిగత వివరాలు
జననం
కనక్ దాస్‌గుప్తా

(1921-12-30)1921 డిసెంబరు 30
జెస్సోర్, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం2005 మార్చ్ 9(2005-03-09) (వయసు: 83)
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
పౌరసత్వంభారతీయురాలు
రాజకీయ పార్టీకమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
ఇతర రాజకీయ
పదవులు
ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్
జీవిత భాగస్వామిసరోజ్ ముఖర్జీ

కనక్ ముఖర్జీ (1921 డిసెంబరు 30 - 2005 మార్చి 9) ఒక కమ్యూనిస్టు, పశ్చిమ బెంగాల్ మహిళా ఉద్యమానికి మార్గదర్శకురాలిగా పరిగణించబడింది. ఆమె కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కేంద్ర కమిటీ సభ్యురాలు. ఆమె ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ స్థాపకురాలు. ఆమె సాహిత్య రంగంలో కూడా కృషి చేసింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

కనక్ ముఖర్జీ 1921 డిసెంబరులో అవిభాజ్య భారతదేశంలోని జెస్సోర్ జిల్లాలో జన్మించింది. ఆమె తండ్రి సతీష్ చంద్ర దాస్‌గుప్తా ప్రముఖ న్యాయవాది. ఆమె తల్లి మోలినా దేవి. ఆమె 1937లో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, కలకత్తా వచ్చి కలకత్తా విశ్వవిద్యాలయం పరిధిలోని బెతున్ కళాశాలలో ప్రవేశం పొందింది. అప్పటికే, ఆమె జెస్సోర్ లోని కృష్ణ బినోద్ రే, సుకుమార్ మిత్రా, శాంతిమోయ్ ఘోష్ వంటి కమ్యూనిస్ట్ నాయకులతో పరిచయం ఏర్పడింది. కలకత్తా వచ్చిన తరువాత ఆమె ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ లో పనిచేసింది. ఆమె 1938లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరింది.

కెరీర్

[మార్చు]

ఆమె సిపిఐ బెంగాల్ మహిళా ఉపసంఘ కన్వీనర్ గా పనిచేసింది. 1964లో ఇది విభజించబడినప్పుడు, ఆమె సిపిఐ (ఎం) లో చేరింది. ఆమె 1978 నుండి 1998 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా, 1989 నుండి 1998 వరకు సీపీఐ కేంద్ర కమిటీ సభ్యురాలిగాను ఉన్నది. 1943లో బొంబాయిలో జరిగిన మొదటి సిపిఐ పార్టీ కాంగ్రెస్ లో ఆమె ప్రతినిధిగా చేరింది. ఆమె కొంతకాలం పార్టీ హోల్ టైమర్ గా పనిచేసింది. ఆమె రెండుసార్లు 1978, 1984లలో రాజ్యసభకు ఎన్నికయ్యింది.

బెంగాల్ లో 1942-43 కరువు కాలంలో, ఆమె బంగియో మహిళా ఆత్మారక్ష సమితి నాయకురాలిగా పనిచేసింది. అదే సమయంలో ఆమె మహిళా ఉద్యమ కార్యకర్తగా మారింది. ఆ తరువాత, ఆమె గణతంత్ర మహిళా సమితి నాయకురాలిగా చేరింది, ఈ సంస్థను స్థాపించడానికి కూడా ఆమె సహాయపడింది.[1] 1957 నుండి 1967 వరకు ఆమె "ఘరే-బైర్" పత్రికకు సంపాదకురాలిగా వ్యవహరించింది. 1968లో, ఆమె "ఎక్సాథే" పత్రికకు వ్యవస్థాపక-సంపాదకురాలిగా ఉన్నది.

ఆమె బి. ఎ. డిగ్రీతో పట్టభద్రురాలై, కొంతకాలం ఒక పాఠశాలలో బోధించింది. 1967 నుండి 1981 వరకు ఆమె కలకత్తా మహిళా కళాశాలలో ఆంగ్ల ప్రొఫెసర్ గా పనిచేసింది. సాహిత్య రంగంలో ఆమె చేసిన కృషికి గాను 1998లో కలకత్తా విశ్వవిద్యాలయం ఆమెకు "భువనేశ్వరి దాసి" అవార్డును ప్రదానం చేసింది.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1941లో ఆమె కమ్యూనిస్టు నాయకుడు సరోజ్ ముఖర్జీని వివాహం చేసుకున్నది.[3]

మరణం

[మార్చు]

ఆమె 2005 మార్చి 9న కోల్‌కాతాలో అనారోగ్యంతో 83 ఏళ్ల వయస్సులో మరణించింది.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "A Pioneer Of The Women's Movement". pd.cpim.org. Archived from the original on 19 June 2009. Retrieved 29 March 2012.
  2. Basu, Anjali, ed. (1996). Samsad Bengali Charitabidhan (Vol. 2). Kolkata: Sishu Sahitya Samsad. p. 76. ISBN 978-81-7955-292-6.
  3. "Remembrance:saroj". ganashakti.tripod.com. Retrieved 2020-04-01.
  4. "Remembering Kanak Mukherjee". www.sacw.net. Retrieved 29 March 2012.