Jump to content

కన్యాకుమారి

అక్షాంశ రేఖాంశాలు: 8°05′18″N 77°32′19″E / 8.088300°N 77.538500°E / 8.088300; 77.538500
వికీపీడియా నుండి
(కన్యాకుమారి అగ్రము నుండి దారిమార్పు చెందింది)
కన్యాకుమారి
కేప్ కొమోరిన్
City
కన్యాకుమారి లోని వివేకానంద రాక్ మెమోరియల్
కన్యాకుమారి లోని వివేకానంద రాక్ మెమోరియల్
Nickname(s): 
కేప్ కొమోరిన్, కుమారి, తిరువేణిసంగం
కన్యాకుమారి is located in Tamil Nadu
కన్యాకుమారి
కన్యాకుమారి
తమిళనాడు పటంలో కన్యాకుమారి
Coordinates: 8°05′18″N 77°32′19″E / 8.088300°N 77.538500°E / 8.088300; 77.538500
దేశంభారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాకన్యాకుమారి
Named forకన్యాకుమారి దేవి
Government
 • Typeనగర పంచాయితీ
 • Bodyకన్యాకుమారి నగర పంచాయితీ
విస్తీర్ణం
 • Total25.89 కి.మీ2 (10.00 చ. మై)
Elevation
60 మీ (200 అ.)
జనాభా
 (2012)
 • Total29,761
 • జనసాంద్రత665/కి.మీ2 (1,720/చ. మై.)
భాషలు
 • అధికారికతమిళం
Time zoneUTC+05:30 (IST)
PIN
629 702
Telephone code91-4652 & 91-4651
Vehicle registrationTN 74 & TN 75

కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా లోని ఒక పట్టణం. ఇది భారత ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున గల చిట్టచివరి ప్రదేశం లేదా అగ్రం (Cape). దీనిని కన్యాకుమారి అగ్రం అని కూడా పిలుస్తారు. ఇంగ్లీషు వారు కేప్ కొమోరిన్ అనేవారు.[1] ఇది భారతదేశానికి దక్షిణ దిక్కున గల చిట్టచివరి జిల్లాప్రాంతం. భారతదేశంలోని ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. పడమటి కనుమలలో ప్రకృతిసిద్ధమైన ప్రదేశం. మూడు సముద్రాల అరుదైన మేలుకలయిక కన్యాకుమారి ప్రధాన ఆకర్షణ. భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్యభగవానుడు, అప్పుడే సముద్ర గర్భం నుంచి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తుంటాడు. ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రిపూట ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయం, చంద్రోదయాలను చూసి పులకించని యాత్రికులు ఉండరు.

త్రివేణి సంగమ క్షేత్రం

[మార్చు]

కన్యాకుమారిలో బంగాళాఖాతం, మరోవైపు అరేబియా మహాసముద్రం, దిగువన హిందూ మహాసముద్రం.. వీక్షకుల్ని పరవశింపజేస్తుంటాయి. సముద్రతీర ప్రకృతి రమణీయతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని థోరియం ధాతువుతో కూడిన ఇసుక రేణువులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాళ్లుగా చెబుతుంటారు. అలాగే వారణాసి పరమశివుడికి నివాస స్థలమైనట్లుగా, కన్యా కుమారి పార్వతిదేవికి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు.[2]

కన్యాకుమారిలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నా, ప్రధాన ఆకర్షణ త్రివేణి సంగమం. వాటిలో ముఖ్యమైనవి వివేకానంద రాక్‌, తిరువళ్లువర్‌ విగ్రహం, గాంధీజీ స్మారక మంటపం, కుమారి ఆలయం ముఖ్యమైనవి. అలాగే ఈ ప్రాంతంలో అనేక రకాల అరుదైన పుష్పాలు, వృక్షాలను కూడా చూడవచ్చు. ఇంకా పెలికాన్‌, ఫ్లెమింగ్‌, స్పూన్‌బిల్‌, అనేక రకాల బాతులు.. కన్యాకుమారికి వలస వస్తుంటాయి. ఈ విదేశీ పక్షులు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

వివేకానంద విగ్రహం

[మార్చు]
కన్యాకుమారిలో వివేకానంద స్మారక మందిరం

కన్యాకుమారి పర్యాటనలో ముందుగా చెప్పుకోవాల్సింది వివేకానంద రాక్‌.[3] ఇక్కడ సా. శ. 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. అతను ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల చలువరాతితో స్మారక కేంద్రం నిర్మించారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 1970వ సంవత్సరంలో అప్పటి రాష్టప్రతి వి.వి. గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఈ వివేకా నందుడి రాక్‌కు కొంత దూరంలో పార్వతీదేవి పరమశివుడిని పెళ్లాడేందుకు తపస్సుచేసిన ప్రాంతం, అక్కడ శిలారూపంలోని ఆమె పాద ముద్రిలు కూడా మనకు దర్శనమిస్తాయి.

తిరువళ్లువర్‌ విగ్రహం

[మార్చు]

వివేకానంద రాక్‌కు సమీపంలోని ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనిని 2000 సంవత్సరంలో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఆవిష్కరించారు. ఈ తిరువళ్లువర్‌ విగ్రహం బరువు ఏడువేల టన్నులు. ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు పడవలలో వెళ్లాల్సిందే. ఇది ఆసియా లోని ఎత్తైన న విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది.

మహాత్ముని స్మారక చిహ్నం

[మార్చు]

కన్యాకుమారిలో చూడదగిన మరో అద్భుత పర్యాటక క్షేత్రం మహాత్మా గాంధీ స్మారక మంటపం. గాంధీజీ అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో 1954వ సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు.[4] మహాత్ముడి జయంతి రోజు అక్టోబరు 2 మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యకిరణాలు అస్థికలను స్పృశించేలా అద్భుతంగా నిర్మించడం విశేషం.

ఇందిరా పాయింట్‌

[మార్చు]

కన్యాకుమారి చివరి సరిహద్దును ఇందిరాపాయింట్‌ అని పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని చూసేందుకు దేశం నలుమూలలనుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. అలాగే కన్యాకుమారి శివార్లలోని ఉదయగిరి కోట, విట్టకొట్టాయ్‌ కోటలు ఇక్కడ మరో ఆకర్షణ. కన్యాకుమారికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే తమిళులకు ప్రీతిపాత్రమైన స్వామితోప్‌ పతి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది.

కన్యాకుమారి ఆలయం

[మార్చు]
సముద్రం నుంచి కన్యాకుమారి పట్టణం వ్యూ

ఇది దక్షిణ భారత దేశాగ్రమున వెలసిన పవిత్ర క్షేత్రం. మూడు సముద్రాలైన బంగాళా ఖాతం, హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రం కలిసే చోట నిర్మితమైన ఈ ఆలయం అతి పవిత్రమైంది. ఈ ఆలయంలోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇక్కడ అమ్మ వారు కన్యాకుమారి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది.

ఈ విశాలమైన ఆలయాన్నంతటినీ నల్లని గ్రానేట్ తో నిర్మించారు. ఆలయం, అందులోని కన్యాకుమారి గర్బాలయం తూర్పునకు అభిముఖంగా వున్నా సాధారణంగా భక్తులకు ఆలయ ప్రవేశం ఆలయ ఉత్తర ద్వారం ద్వారానే జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే తూర్పు ద్వారం తెరుస్తారు. పురుషులు పైనున్న అంగవస్త్రాన్ని తీసి లోనికి ప్రవేశించాలి. ఈ ఆచారం తమిళనాట చాల ఆలయాల్లో ఉంది. ఆలయం అంతా నల్లరాతి నిర్మాణమైనందున, వెలుతురు తక్కువగావున్నందున అంతా చీకటిమయంగా వుంటుంది.

ఈ ఆలయ ప్రధాన ద్వారం అనగా తూర్పు వైపున వున్న మహాద్వారాన్ని మూసి వుంచడానికి ఒక కథను చెప్తారు. అదేమంటే గతంతలో తూర్పు వైపున వున్న మహాద్వారం ద్వారానే భక్తులకు ప్రవేశం వుండేది. అనగా బంగాళాఖాత సముద్రానికి ఎదురుగా ఆలయంలోని అమ్మవారి ముక్కుపుడక నుండి వెలువడే కాంతి సముద్రంలో సుదూరంలో వున్న ఓడలకు చేరి ... ఇది సురక్షితమైన రేవుగా భావించి నావికులు ఆ వెలుగు ఆధారంగా తీరానికి రావడానికి ప్రయత్నించి .... సముద్రంలో అక్కడున్న నల్ల రాతి గుట్టలకు ఢీకొని ప్రమాదాలకు గురయ్యేవని..... దానివలన తూర్పు ద్వారం మూసివేశారని అంటుంటారు. సంవత్సరంలో కేవలం నాలుగు రోజులు అదీ మహోత్సవాల సందర్భంలో మాత్రమే తూర్పు వాకిలి తెరుస్తారు. మిగతా రోజులలో ఉత్తర దిక్కున వున్న ద్వారం ద్వారానే భక్తులకు ప్రవేశం

ఆలయ చరిత్ర

[మార్చు]

పురాణ కథనం ప్రకారం కుమారి కన్యాకుమారి, పరమశివుడిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడిందట. అయితే ముహూర్తం సమయానికి కూడా శివుడు రాకపోవటంతో విందుకు సిద్ధంచేసి పెట్టుకున్న బియ్యం రాశులను, మిగిలిన వస్తువులను అలాగే వుండి పోయాయట. కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్లుగా, బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటిరాళ్లు కనిపిస్తుంటాయని స్థానికులు చెపుతుంటారు.

ప్రయాణ సౌకర్యం

[మార్చు]

ఇది చెన్నై నగరానికి 743 కిలోమీటర్ల దూరంలో ఉండే కన్యాకుమారి[5] ఎలా వెళ్లాలంటే, విమాన మార్గంలో అయితే, మదురై నుంచి 250 కిలోమీటర్లు, తిరువనంతపురం నుంచి 90 కిలో మీటర్ల దూరం ప్రయాణించి వెళ్లవచ్చు. చెన్నై నుంచే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల నుంచి కన్యాకుమారికి నేరుగా రైలు సౌకర్యం ఉంది.[6] తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాలనుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారి చేరుకోవచ్చు. ఇక వసతి విషయానికి వస్తే.. కన్యాకుమారిలో పలు చిన్న, పెద్ద హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖవారి హోటల్‌, దేవస్థానంవారి కాటేజీలు, ట్రావెలర్స్‌ బంగళా, అతిథి గృహాలు.. పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి.

సముద్ర జీవరాసులు

[మార్చు]

రొయ్యలు

[మార్చు]

ప్రముఖ పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతున్న కన్యాకుమారి ‘రాక్‌ లాబ్‌స్టర్స్‌’ అని పిలిచే భారీ సైజు రొయ్యలకు కూడా ప్రసిద్ధి చెందింది. సగటున రెండు కేజీల బరువుండే ఈ లాబ్‌స్టర్ల ధర 5 వేల రూపాయల పైమాటే. కేంద్ర సముద్ర మత్స్య పరిశోధనా సంస్థ వాణిజ్య ప్రాతిపదికన కేజ్‌ కల్చర్‌ద్వారా ప్రత్యేకంగా పెంచబడే ఈ లాబ్‌స్టర్లను ఎక్కువగా జపాన్‌, హాంకాంగ్‌ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు.

ఎండ్రకాయలు

[మార్చు]

కేరళలోని విళింజం వంటి తీర ప్రాంతాల్లోనే ఈ ఎండ్రకాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి. తీరం నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలో ఉండే రాళ్ల చుట్టూనే ఉంటాయి. కాబట్టి వీటికి రాక్‌ లాబ్‌స్టర్స్‌ అనే పేరు వచ్చింది. ఇవి రాళ్ల చుట్టూ ఉంటాయి కాబట్టి రొయ్యల్లా ట్రాలింగ్‌ చేసి మొత్తం ఊడ్చి పట్టేయడం సాధ్యపడదు. వేరే చేపల కోసం వేసిన వలల్లో ఇవి పడుతూ ఉంటాయి. సెప్టెంబరు-జనవరి మధ్య ఎక్కువగా లభించే వీటిని పట్టుకునేందుకు మత్స్యకారులు కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంభిస్తుంటారు.

చిత్రమాలిక

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]
  1. Bawa, Sameer (11 March 2019). "Comorin with a casual vibe is offering comfort food that one just can't say no to". The New Indian Express. Retrieved 20 April 2024.
  2. "The eternal charm of Kanyakumari, that is situated at the tip of peninsular India..." The Hindu Images. Retrieved 14 October 2023.
  3. Gopal, Madan (1990). K.S. Gautam (ed.). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. p. 179.
  4. Gopal, Madan (1990). K.S. Gautam (ed.). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. p. 179.
  5. "Kanyakumari District". Archived from the original on 4 February 2012. Retrieved 22 February 2012.
  6. "Kanyakumari railway station needs better infrastructure". The Hindu. 18 February 2013. Retrieved 27 September 2013.