Jump to content

కన్యాశుల్కం (నాటకం)

వికీపీడియా నుండి
'
కృతికర్త: గురజాడ అప్పారావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నాటకం
ప్రచురణ: కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు
విడుదల: 1961
పేజీలు: 203


కన్యాశుల్కం (నాటకం)

నాటక రచయిత

గురజాడ అప్పారావు

పాత్రలు

గిరీశం
మధురవాణి
రామప్ప పంతులు
అగ్నిహోత్రావధానులు

సంవత్సరం

1892

స్థలం

విజయనగరం

భాష

తెలుగు

విషయం

వితంతు వివాహం

శైలి

హాస్యము

కన్యాశుల్కం గురజాడ అప్పారావు రచించిన తెలుగు నాటకం. తెలుగులో తొలి ఆధునిక రచనల్లో ఒకటిగా పేరుపొందింది. కన్యాశుల్కం నాటకం రెండు కూర్పులను రాసి ప్రచురించారు. మొదటి కూర్పు 1897 లో ప్రచురించబడింది. ఈ నాటకం మొట్టమొదటి ప్రదర్శన 1892 ఆగస్టు 13న విజయనగరం లో జరిగింది.[1] అంతకు ముందు 5 సంవత్సరాల క్రితం ఈ రచన జరిగిందని తెలుస్తోంది. అయితే 1909లో ప్రచురించిన రెండవ కూర్పే ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొంది, ప్రజాదరణ పొందిన కన్యాశుల్కం.

అగ్నిహోత్రావధాన్లు తన చిన్న కుమార్తెకు చిన్నతనంలోనే ధనాశతో కన్యాశుల్కం తీసుకుని ముసలివాడైన లుబ్ధావధాన్లకు రామప్పంతులు మధ్యవర్తిత్వంతో పెళ్ళిచేయ నిశ్చయిస్తారు. తన మేనకోడలికి ఆ అవస్థ తప్పించేందుకు అగ్నిహోత్రుని బావమరిది కరటకశాస్త్రి గుంటూరు శాస్త్రులుగా పేరుమార్చుకుని రామప్పంతులు వద్ద ఉంటున్న సహృదయురాలైన సాని మనిషి మధురవాణి సాయంతో తన శిష్యుడికి ఆడవేషం వేసి లుబ్దావధాన్లుకు పెళ్ళిచేస్తారు. గుంటూరుశాస్త్రి కన్యాశుల్కంతో ముందు, మారువేషంలోని శిష్యుడు నగలు, బట్టలతో తర్వాత పారిపోతారు. మరోవైపు గిరీశం అనే మోసగాడు అగ్నిహోత్రావధాన్లు మొదటి కుమార్తె, విధవరాలు అయిన బుచ్చెమ్మను మాయచేసి లేవదీసుకుని పోతారు. వీటన్నిటితో జరిగిన గలాభాలో లుబ్దావధాన్లు, అగ్నిహోత్రావధాన్లు దావాలు తెస్తారు. నిజాయితీపరుడు, సంఘసంస్కర్త అయిన సౌజన్యరావు పంతులు ఈ సమస్యను పరిష్కరిస్తాడు. మధురవాణి సౌజన్యరావు పంతులుకు గిరీశం నిజస్వరూపం తెలియజేయగా, అతనితో బుచ్చెమ్మ పెళ్ళి తప్పించి శరణాలయానికి పంపడంతో నాటకం ముగుస్తుంది. ఇది కన్యాశుల్కంగా ప్రాచుర్యం పొందిన రెండవ కూర్పు కథ. మొదటి కూర్పుకు ఇతివృత్తంలోనూ, పాత్రల స్వరూప స్వభావాల్లోనూ తీవ్రమైన భేదం ఉంది.

నాటక రచనా కాలానికి నాటకాల్లో అరుదుగా కానవచ్చే సజీవమైన వాడుక భాషనే నాటక రచనకు వినియోగించుకున్నాడు గురజాడ.

కన్యాశుల్కంలో ప్రధానమైన ఇతివృత్తం సంఘ సంస్కరణ. అగ్నిహోత్రావధాన్లు తన రెండవ కుమార్తెను చిన్న పిల్ల అని చూడకుండా 70 ఏళ్ళు నిండుతూన్న ముసలివాడు లుబ్దావధాన్లకి ఇచ్చి కన్యాశుల్కం కోసం పెళ్ళి చేయబోతాడు. అగ్నిహోత్రావధాన్లు కుమారుడికి ట్యూషన్ చెప్తానంటూ అప్పులు చేస్తూ, గొప్పలు చెప్పుకుంటూన్న గిరీశం అనే మోసకాడు ఆ ఇంట్లో ప్రవేశిస్తాడు. అగ్నిహోత్రావధాన్లు అప్పటికే పెద్ద కూతురు బుచ్చెమ్మకి కన్యాశుల్కం తీసుకుని ముసలివాడికి కట్టబెట్టగా, ఆ పెళ్ళిచేసుకున్న వ్యక్తి పెళ్ళి పూర్తికాకుండానే మరణిస్తాడు. విధవగా ఇంట్లో ఉన్న బుచ్చెమ్మ అందానికి ముగ్ధుడైన గిరీశం ఆమెను మోసగించి వివాహమాడదామని ప్రయత్నిస్తాడు. మరోవైపు గతంలో గిరీశం పోషణలో ఉండే మానవత్వం కలిగిన సాని మనిషి మధురవాణి, లుబ్దావధాన్లును మోసం చేసి పెళ్ళికి ఒప్పించి డబ్బు తీసుకుందామని ప్రయత్నిస్తున్న రామప్పంతులు వద్దకు చేరారు. కుమార్తెకు ఆ పెళ్ళి చేస్తే, చనిపోతానని అగ్నిహోత్రావధాన్లు భార్య బెదిరించగా, ఆమె అన్నగారు కరటకశాస్త్రి ఆ పెళ్ళి తప్పించేందుకు ప్రయత్నిస్తాడు. తన శిష్యుడికి ఆడవేషం వేసి రామప్పంతులుకు గుంటూరుశాస్త్రులుగా పరిచయం చేసుకుని, అగ్నిహోత్రావధాన్లు కుమార్తెతో లుబ్దావధాన్లుకు పెళ్ళి తప్పించి ఆడవేషం వేసిన శిష్యునికి ఇచ్చి పెళ్ళిచేసి కన్యాశుల్కం తీసుకునివెళ్ళిపోతాడు. కనిపెట్టినా, కరటకశాస్త్రి చేసే పని మంచిదన్న ఉద్దేశంతో పెళ్ళికి మధురవాణి సాయం లభిస్తుంది. ఆడవేషంలోని శిష్యుడు సాధ్యమైనంత బాధపెట్టి, నగలు, బట్టలు మూటకట్టుకుని వెళ్ళిపోతాడు. ఈలోగా పెళ్ళికి తరలివచ్చిన అగ్నిహోత్రావధాన్లు బంధుకోటిలోంచి బుచ్చెమ్మను తీసుకుని గిరీశం లేచిపోతాడు. అగ్నిహోత్రావధాన్లు ఈ పరిణామాలకు ఆగ్రహం చెంది, రామప్పంతులుతో కలిసి లుబ్దావధాన్లుపై దావా తెస్తాడు. ఈ కేసులో లుబ్దావధాన్లు పక్షాన్ని ధర్మాత్మునిగా, సంఘసంస్కర్తగా, వేశ్యా వ్యతిరేకిగా పేరొందిన లాయరు సౌజన్యారావు పంతులు వకాల్తా పుచ్చుకుంటాడు. చివరికి నిజం తేలడంతో పాటుగా, మధురవాణి సౌజన్యారావు పంతులుకి గిరీశం నిజస్వరూపం తెలియజేయడంతో బుచ్చెమ్మను శరణాలయానికి పంపడంతో నాటకం ముగుస్తుంది.[2]

రచన నేపథ్యం

[మార్చు]

గురజాడ కన్యాశుల్కము నాటకానికి రెండు కూర్పులు ఉన్నాయి. తొలి కూర్పును 1895లో రచించగా, 1909లో మలికూర్పు వెలువడింది. అయితే సాహిత్యలోకంలో విస్తృతంగా ప్రాచుర్యం పొంది, ఆధునిక సాహిత్యంలో గొప్ప రచనల్లో ఒకటిగా పేరొందినది కన్యాశుల్కము రెండవ కూర్పే. కన్యాశుల్కము మొదటి కూర్పు ప్రచురితమైన దాదాపు పదేళ్ళు గడిచిన తర్వాత 1908లో కన్యాశుల్కము విజయనగరంలో ప్రదర్శితమైందన్న ప్రోత్సాహకరమైన వార్తను మహారాజా ద్వారా తెలుసుకోవడంతో గురజాడ కొద్ది మార్పులతో రెండవ ముద్రణకు పూనుకున్నాడు. అయితే ఎస్.శ్రీనివాస అయ్యంగార్ సూచన మేరకు, ఆ నడుమ కాలంలో గురజాడ దృక్పథంలోనూ, అనుభవంలోనూ వచ్చిన పరిణతి మేరకు కొద్ది మార్పులు కాక, నాటకం చాలావరకూ మార్చివేసి రెండవ కూర్పు చేసి ప్రచురించాడు.
రెండవ కూర్పులో సంభాషణల నైపుణ్యం, వ్యావహారిక శైలి అభివృద్ధి చెందడం, కొన్ని పాత్రలు తీసివేయడం, కొన్ని చేరడం, రామప్పంతులు వైదీకి నుంచి నియోగి కావడం, అనేక పాత్రల ప్రవర్తనల్లో ఔచిత్యం పెరగడం, సంభాషణల హాస్యస్ఫోరకత అభివృద్ధి అవడం వంటి మార్పులు జరిగాయి. ప్రధానంగా మొదటి కూర్పులో చౌకబారు వేశ్య పాత్ర నుంచి అత్యుత్తమమైన వివేకం, నీతి కలిగిన పాత్రగా రెండవ కూర్పు నాటికి మధురవాణి రూపొందడం ప్రధానమైన విశేషం. అలానే రెండవ కూర్పులో సంభాషణలు, సన్నివేశాలు పెరిగి నాటకం చాలా విస్తరించిందనీ, తద్వారా ఏకోన్ముఖత, ప్రదర్శన యోగ్యత దెబ్బతిందని విమర్శకులు కొందరు భావించారు.

వస్తువు

[మార్చు]

కన్యాశుల్కం తెలుగుజీవనాన్నీ, వాతావరణాన్నీ,మనుషుల శ్వాసనిశ్వాసాల్నీ, ఆంతరిక వ్యధల్నీ, భ్రష్టు పట్టిన మానవస్వభావాల్నీ ఆవిష్కరించే మొదటి సాంఘిక నాటకం. ఆనాటి హేయమైన మానవ నైజాలూ, జీవచ్ఛవాల్లాంటి బాలవితంతువులూ, సారామత్తులో ఉండే బైరాగులూ, దొంగ సాక్షులూ, వేశ్యలూ, లాయర్లూ, … నాటి సంక్షుభిత సమాజ సమగ్ర స్వరూపాన్ని గురజాడ ఫొటో తీసి మన ముందుంచాడు.

తెలుగు సమాజంలో వేళ్లూనుకుంటున్న వినిమయ సంస్కృతిని, పాతుకుపోయిన పితృస్వామిక భావజాలాన్ని, జుగుప్స కలిగించే కట్టుబాట్లను, ఆంగ్లభాషపై పెరుగుతున్న మోజుని అద్భుతంగా పట్టుకున్నారు గురజాడ.

ఈ నాటక కథలో ఎక్కువ భాగపు సంఘటనా స్థలాలు విజయనగరానికి చేరువగా ఉన్న అగ్రహారాలు. నాటకం అప్పటి సామాజిక స్థితిగతులకు దర్పణంగా నిలచింది. కన్యాశుల్కం లో చిత్రించిన అనేక రుగ్మతలు ఇప్పటికీ సమాజంలో పేరుకుపోయి ఉన్నాయి.(?).

ఈ నాటకంలోని కథావస్తువు ” సంఘసంస్కరణ”కి ఉద్దేశించింది. అందులో ముఖ్యాంశాలివి. చిన్న పిల్లల్నిముసలివాళ్ళకిచ్చి పెళ్ళిచేయడం,వేశ్యావృత్తి హైన్యత, స్త్రీల దుస్థితి, పెద్ద మనుషులుగా చెలామణీ అయే కుహనామేధావులు.

ఐదేళ్ళకే బాలికలకి పెళ్ళిచేసేవారు. ఈ అన్యాయాన్నిఎత్తి చూపాడు గురజాడ. పసిపిల్లల్ని కాలం గడిచినవాళ్ళకిచ్చి పెళ్ళిచేస్తే వైధవ్యం రాక తప్పదు. బాలవితంతువులుగా జీవితం వెళ్ళబుచ్చవల్సిందే. ఈ నాటకంలో అగ్నిహోత్రావధాన్లు తన చిన్న కూతురిని లుబ్ధావధాని కివ్వడంలో ప్రేమ లేక కాదు ధనాశ వల్లనే. ఎందుకంటే తన కొడుక్కి కూడా డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళి చెయ్యాలనుకుంటాడు కాబట్టి.

కన్యాశుల్కం తీసుకోవడంలో ఉచితానుచితాలూ,న్యాయాన్యాయాలూ లేవు. అభం శుభం తెలియని ఆడపిల్లకి అమానుషంగా పెళ్ళి చెయ్యడం వెనుక ఉన్నది ధనవ్యామోహం. వీటిని గురజాడ వెల్లడించాడు.

పెద్ద మనుషులుగా, విద్యావంతులుగా నటిస్తూ,ఆదర్శాలకీ ఆచరణలకీ పొంతనలేని వ్యక్తుల్ని గురజాడ చూసి “గిరీశం” “రామప్పంతులు” వంటి పాత్రల్నికథలో పొందు పరచాడు. మోసాలు, అబద్ధాలు,సొంతడబ్బా, ఎలాగో అలా పబ్బం గడుపుకోవడాలు …. వీటిని నాటక వస్తువులో ఉపాంగాలుగా చేసాడు. “ఆధునికత” పేరుతో ఇంగ్లీషు చదువుపై గల వ్యామోహాన్ని వ్యక్తం చేసాడు. ఈ నాటకంలోని వస్తువు మన సంస్కృతీరుగ్మతను హెచ్చరిస్తూ సంఘ సంస్కరణ ఎంత అవసరమో వెల్లడిస్తుంది.

ఈనాటి వాళ్ళకి కన్యాశుల్కంలోని వస్తువు పాతది.అందులోని ప్రధాన సమస్య అయిన కన్యాశుల్కం ఈనాడు లేనేలేదు. చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు కూడా లేవు. కన్యాశుల్కం స్థానంలో వరకట్నం వచ్చింది. వేశ్యలకి చదువు, తెలివి, సంపద పోయి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా ఈనాటికీ ఈ నాటకం జనాదరణ పొందడానికి కారణం, ఈ నాటకాన్ని ఒక “సజీవసాహిత్య ప్రక్రియ” గా గురజాడ రూపొందించడమే. ఆయనలోని కళాప్రతిభ కూడా ఒక ముఖ్యకారణం. పాత్రల తీరుతెన్నులు,సంభాషణల్లోని నైపుణ్యం, నాటకాన్ని సజీవం చేసాయి.”గిరీశం” పాత్ర నాటకానికి పుష్టి కలిగించింది. హాస్యం అన్ని కాలాల్లో అందరూ ఆనందించేటట్టు పోషింపబడింది. ఈ రోగిష్టి సమాజం, మనసు పుచ్చిన మనుషులు ఉన్నంతవరకూ ఈ నాటకం నిలుస్తుంది. నిలిచి శస్త్ర చికిత్స చేస్తుంది కూడా. ఈ నాటకం ఆధునిక నాటకసాహిత్యానికి “విఙ్ఞాన సర్వస్వం” వంటిది. ఈ నాటకాన్ని ఒక సాంఘిక అధిక్షేప నాటకమని గాని, సాంఘిక ఇతిహాస నాటకమని గాని అనవచ్చు.

పాత్రపోషణ

[మార్చు]

ఏ నాటకానికైనా ఇతివృత్తానికైనా ప్రాణాలు పాత్రలే. ఈ నాటకంలోని పాత్రలు సజీవంగా ప్రకాశిస్తూంటాయి. ఒక పాత్ర మరొక పాత్రతో పోటీ పడుతూంటుంది. ఇవి మన సమాజంలో మనకు కనుపించే పాత్రలే. రామప్పంతులు వంటి దగాకోరులు, స్వార్ధపరులు, గిరీశంలాంటి బడాయి కోరులూ మాటకారులు, అగ్నిహోత్రావధాన్లులాంటి ధనాశాపరులు, సంస్కర్తలకి కూడా బుద్ధి చెప్పగల మధురవాణి వంటి సమయోచిత ప్రఙ్ఞగల స్త్రీలు నేటి సమాజంలో అడుగడుగునా కన్పిస్తారు. ఇంతటి వైవిధ్యం, సహజత్వం గల పాత్రపోషణ వల్ల నాటకం సజీవంగా నిలిచింది. కన్యాశుల్కం నాటకం లో ఎవరి ప్రవృత్తికి తగ్గట్టుగా ఆ యా పాత్రలకు పేర్లు పెట్టడం గురజాడ చతురతకు నిదర్శనం. లుబ్దావధాన్లు, కరటక శాస్ర్తి, మధురవాణి, గిరీశం, పోలిశెట్టి, వెంకటేశం, పండా సిద్ధాంతి వంటి పేర్లకు తగ్గట్టే వారి ప్రవర్తన ఉంటుంది. సౌజన్యరావు పంతులు వంటి సౌజన్య మూర్తి వంటి న్యాయవాదులు కూడా ఉంటారు. నిరంతరం మధువు, గంజాయి వంటి వాటితో కాలక్షేపం చేసే బైరాగులు అప్పుడే కాదు, నేడూ మనకు దర్శనమిస్తారు. నాటి కన్యాశుల్కంలోని పాత్రలన్నీ నేటికీ వివిధ వ్యక్తుల్లో సజీవంగానే ఏదో రూపంలో మనకు కనుపిస్తుంటాయి. కవి క్రాంత దర్శి అంటారు. అందులోనూ మహాకవి నాలుగు రాళ్ళు ఎక్కువే చదివారు. అందుకే అడుగుజాడ గురజాడదిగా పేర్కొన్నారు.

సర్దేశాయి తిరుమల రావు “కన్యాశుల్క నాటకకళ” అనే విమర్శలో నాటకంలోని పాత్రల్నిరెండు వర్గాలుగా విభజించాడు మంచి పాత్రలూ, చెడ్డ పాత్రలు. మనిషిలోని మంచి,చెడ్డల మేలుకలయిక మంచితనంగానూ, చెడ్డ,మంచిల కీడుకలయిక చెడ్డతనంగానూ తెలిపారు. మధురవాణి, బుచ్చమ్మ, కరటక శాస్త్రి, సౌజన్యారావు పంతులు పాత్రలు మంచివి. గిరీశం, రామప్పంతులు, అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్లు చెడ్డపాత్రలు. సుబ్బి రంగస్థలంపైకి రాని “నాయిక” వంటిది. సుబ్బిని రంగం మీదకి తీసుకురాకపోవడానికి కారణం ప్రేక్షకుడిలో సెన్టిమెంటాలిటీ పుట్టకుండా చెయ్యడాని కనిపిస్తుంది.కన్నీళ్ళు ,వెక్కిళ్ళూ కనుపించనీయకూడదని నాటక కర్త ఉద్దేశం కావచ్చు. ఇంకా ఇతర పాత్రలున్నాయి. కొందరన్నట్టు అసలు నాటకంలో కనుపించని పాత్ర గురజాడ. “సామూహిక పాత్రీకరణ” అంటే, పాత్రశీలానికి ఒక్క పాత్రను గాక, రెండుగాని అంతకంటె ఎక్కువగాని పాత్రలని ప్రతినిధులుగా నిలబెట్టే విధానం కన్యాశుల్కంలో కనుపిస్తుంది.ఇందుకు ఉదాహరణలు అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్ల పాత్రలే. గురజాడ గొప్పదనానికి ఇదొక నిదర్శనం.

ఈ నాటకాని ప్రసిద్ధి తెచ్చిందీ, అందరినీ ఆకర్షించిందీ గిరీశం పాత్ర. ఇది నాయక పాత్ర కాకపోయినా నాటకమంతా పరచుకొంది. నాటకం మొదలు, ముగింపూ ఈ పాత్రతోనే కాబట్టి రచయిత ఈ పాత్రవిషయంలో ఒక ఆద్యంతసమత పాటించాడనవచ్చు. గిరీశంవల్ల రచయిత ఏ ప్రయోజనాన్ని ఆశించాడు? ఇది కేవలం ఒక హాస్య పాత్రా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి మనలో. నాటకంలో గిరీశం చాలాపనులు చేసినట్టు కనుపించినా, ఆ పనులవల్ల ఏ ప్రయోజనం, మార్పూ కనుపించదు.

గిరీశం సమాజంలోని దొంగ పెద్ద మనుషులకి ప్రతీక,.మాయమాటల్తో పబ్బం గడుపుకోవడమే గాని, ఇతనికి ఒక సిద్ధాంతం, ఆశయం ఉన్నట్టు కనుపించవు. స్వప్రయోజనం కోసం ఇతరులకి కష్టాల్నితెచ్చిపెట్టడానికి కూడా వెనుకాడడు. తాను చేసే ప్రతిపనీ అన్యాయమని తెలిసే చేస్తాడు. వేడుకొని, భయపెట్టి, నవ్వించి, ఏడిపించి, ఏడ్చి ఇతరుల్ని తన దారిలోకి తిప్పుకోగల లౌక్యుడు. నాటకంలో జరిగే సంఘటలపై వ్యతిరేకంగా వ్యాఖ్యానించే గిరీశం పాత్ర సాంఘిక, సాంస్కృతిక ప్రయోజనాల్నిఆశించి గురజాడ సృష్టించి ఉండవచ్చు. “డామిట్‌ ! కథ అడ్డం తిరిగింది” అంటూ నాటక రంగం నుంచి నిష్క్రమించినా సమాజంలో కనుపిస్తూ నేటికీ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు.

ఈ నాటకంలోని రెండవ ముఖ్య పాత్ర “మధురవాణి”. ఈ పాత్రలో అసాధారణత, పరిణామం, శీఘ్రప్రగతీ కన్పిస్తాయి. మొదట్లో సామాన్య వేశ్యగా కన్పించే మధురవాణి, నాటకం ముగిసేసరికి గొప్ప మనిషిగా కనబడుతుంది. ఇది గురజాడ ఇంద్రజాలం. రామప్పంతులు తన బుగ్గ గిల్లినప్పుడు, “మొగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి. తాకవద్దంటే చెవిని బెట్టరు గదా” అని మందలించడంలోనే ఆమె మనసు అర్ధమవుతుంది.

వ్యక్తి స్వాతంత్య్రాన్ని, పట్టుదలను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కోల్పోని గుండె నిబ్బరం గలది. విమర్శనాఙ్ఞానం, విశ్లేషణ కలది. ఎదుటి వాళ్ళగురించి ఆలోచిస్తుంది. తృతీయాంకంలో రామప్పంతులు పైన పటారం లోన లొటారం అని పసిగడుతుంది. ఇతర వేశ్యలు ధనం గుంజాలని చూస్తూంటే, మధురవాణి తనని ఉంచుకున్నవాడు బాగు పడాలనీ, అదే తనకు ఎక్కువ గొప్పనీ చెబుతుంది.ఆమె సంస్కారవతి. దురాచారాల్ని సహించదు. కన్యావేషంలో ఉన్నశిష్యుణ్ణి లుబ్ధావధానికి కట్టబెట్టి, సుబ్బి పెళ్ళి తప్పించడంలో ఆమె వ్యూహాశక్తి మనకి తెలుస్తుంది. కరటక శాస్త్రితో “వృత్తి చేత వేశ్యని గనక చెయ్యవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తాను గాని మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్న అని తలిచారా?” అనడం ప్రత్యక్షర సత్యం. నాటకం చివర కరటక శాస్త్రిని జైలు నుంచీ,లుబ్ధావధానిని మరణ శిక్ష నుంచీ తప్పిస్తుంది. “ఆహా! ఏమి యోగ్యమైన మనిషి” అని రామప్పంతులు కూడా అనకుండా ఉండలేక పోతాడు. అయితే నాలుగో అంకంలో “నీకు సిగ్గులేదే లంజా!” లాంటి మాటలు ఈ పాత్రచేత అనిపించడం సబబుగా లేదు.

ఆరవ అంకంలో మధురవాణి సంఘం మీద దాడి చేస్తుంది. స్త్రీస్వాతంత్ర్యోద్యమానికి మధురవాణి పాత్ర నాందిగా చెప్పవచ్చు. పొరుగువారికి సాయపడుతూ, ఈ పాపపు లోకంలో కూడా మంచి ఉందని నిరూపించిన త్యాగజీవి మధురవాణి. ఈ పాత్ర ఒక్కొక్క సారి నాటక పరిధిని దాటిపోయి విశ్వరూపాన్ని చూపిస్తుంది.

డబ్బు గడించి దానిపై వ్యామోహం లేకుండా ప్రేమకోసం పరితపించే పాత్ర మధురవాణి. “కాపు మనిషినై పుట్టి మొగుడి పొలంలో వంగ మొక్కలకూ, మిరప మొక్కలకూ దోహదం చేస్తే యావజ్జీవం కాపాడే తన వాళ్లైనా ఉందురేమో” అనుకోవటంలో పాత్రలో పరివర్తన కనుపిస్తుంది. దీన్ని గురజాడ హఠాత్తుగా కాక క్రమంగా వచ్చిన మార్పుగా చిత్రించడంలో తన కళాప్రతిభ, సహజత్వం చూపించారు.

మిగిలిన పాత్రల గురించి

[మార్చు]

రామప్పంతులు పాత్ర చాలా ఆసక్తికరమైనది. ఇతను కుటిల దృష్టికలవాడు. “నమ్మిం చోట చేస్తే మోసం, నమ్మం చోట చేస్తే లౌక్యవూఁను” అనే అవకాశవాద, కపట బుద్ధి ఉంది. అయినా మధురవాణి వ్యూహంలో చిక్కుకుపోయాడు. ఇతను ఎవళ్ళెక్కువ డబ్బిస్తే వాళ్ళ పక్షం. ఒక మాటమీద నిలబడడు.

అగ్నిహోత్రావధాన్లు వేద వేత్త, అమాయక బ్రాహ్మణుడు,ధనాశాపరుడు, సనాతనాచారాలున్నవాడు.

సౌజన్యారావు న్యాయవాది . వివిధ స్వభావాలున్నమనుషుల్ని చూసినవాడు. వ్యవహారాన్ని నేర్పుగా చక్కబెట్టే ప్రవృత్తి గలవాడు. మొదట్లో గిరీశం పెద్ద మనిషని నమ్మినా, విషయం తెలిసాక, అతన్ని “గెట్‌ అవుట్‌ “అంటాడు. మధురవాణి వ్రతం సౌజన్యా రావుని పెద్దవాడిగా నిలిపిందా? లేక సౌజన్యా రావు ప్రవర్తన మధురవాణిని మంచిదానిగా చేసిందా అనిపిస్తుంది.

ఇకపోతే తనకు తానుగా చెడు చెయ్యని లుబ్ధావధాని, మంచి స్వభావంగల కరటక శాస్త్రి, తండ్రికి బుద్ధి చెప్పే పాత్రలో మీనాక్షి.. ఇలా ఎన్నో.మొత్తం మీద కొన్ని లోపాలున్నా పాత్ర పోషణా నైపుణ్యం కన్యాశుల్కం సజీవంగా నిలబడడానికి దోహదం చేసింది.

హాస్యం - ఎత్తిపొడుపు

[మార్చు]

కన్యాశుల్కం అనగానే హాస్యం గుర్తొస్తుంది. నాటకంలో పాత్రలే ఒకరికిఒకరు పేర్లు పెట్టుకొని హాస్యమాడుకున్నారు.గిరీశం అగ్నిహొత్రావధానిని “అగ్గిరావుఁడ” న్నాడు. కరటక శాస్త్రి “మూర్ఖపగాడ్దె కొడుక” న్నాడు. గిరీశాన్ని రామప్పంతులు “గిర్రడు” “బొట్లేరు” అని కొట్టిపారేశాడు. అగ్నిహోత్రావధాన్లు కూడా గిరీశాన్ని “హనుమాన్లు”గా ఆట పట్టించాడు. మధురవాణి దృష్టిలో రామప్పంతులు,లుబ్ధావధాని లొట్టిపిట్టలు. లుబ్ధావధాని పెళ్ళి ముసలి మనువు కాబట్టి హాస్యాన్ని కల్గిస్తుంది. మధురవాణి ఇంట్లో రామప్పంతుల్నీ, గిరీశాన్ని పూటకూళ్ళమ్మ చీపురుతో కొట్టడం,గిరీశం లుబ్ధావధానికి వ్రాసిన లేఖ,గిరీశం,వెంకటేశాల సంభాషణలూ మొదలైనవి హాస్యాన్ని పుట్టించాయి. రామప్పంతులు “నాకు యింగిలీషే వస్తే దొరసాన్లు నా వెనకాల పరిగెత్తరా?” అన్నప్పుడు, మధురవాణి లుబ్ధావధానిని “ఓ పన్ను కదిలిందా? కన్నుకు దృష్టి తగ్గిందా?, చూడండి మీ కండలు కమ్మెచ్చులు తీసినట్టు యెలా వున్నాయో” అన్నప్పుడూ నవ్వుకుంటాం.

సంఘంలోని కొన్ని లోపాల్ని ఎత్తిచూపడం కోసం గురజాడ హాస్యాన్ని ఆయుధంగా వాడాడు. ఉదాహరణకి, గిరీశం “లెక్చర్లు ఎంతసేపూ సిటీల్లోనే గాని పల్లెటూళ్ళలో ఎంతమాత్రం పనికిరావు” అంటాడు. అలాగే ” నీ మాస్టరుకు నన్ను చూస్తే గిట్టదు. అందుచేత నిన్ను ఫెయిల్‌ చేసాడు గానీ..” అనడం గూడా. “పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్‌”, “మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే!” అన్నప్పుడు సరదాగా నవ్వుకుంటాం. అలాగే, “సత్యం చ మే, ధర్మం చ మే” వంటి వేద మంత్రాలకు “చేగోడిం చ మే” లాంటి పేరడీలు హాస్యస్ఫోరకాలు.

సంభాషణలు

[మార్చు]

సంభాషణలు భాష ఈ నాటకానికి జవజీవాలు. తెలుగు పలుకుబడులతో, పాత్రోచిత భాషతో, వ్యంగ్యంతో, హాస్యంతో సంభాషణల్ని నడిపించిన గురజాడ ప్రతిభ అసామాన్యం. “నా దగ్గర చదువుకున్న వాడు ఒహడూ అప్రయోజకుడు కాలేదు. పూనా డక్కన్‌ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది ఇలెవెన్‌ కాజెస్‌ ఫర్ది డీజనరేషన్‌ ఆఫ్‌ ఇండియాను గూర్చి మూడు గంటలు వక్క బిగిన లెక్చరిచ్చేసరికి ప్రొఫెసర్లు డంగై పోయినారు” వంటి మాటలు గిరీశం పాత్రపోషణకు బలాన్నిచ్చాయి. గిరీశం సంభాషణలు తెలుగు వాళ్ళ నోళ్ళల్లో సామెతలుగా నిలబడిపోయాయి. ” మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్‌", “డామిట్‌ కథ అడ్డం తిరిగింది” లాంటివి సాక్ష్యాలు.

పూటకూళ్ళమ్మ గురించి “మీరుండగా వెధవెలా అవుతుంది” అనడం, కన్య వేషంలోని కరటక శాస్త్రి శిష్యుణ్ణి గురించి “ఈ కన్నెపిల్ల నోరు కొంచెం చుట్ట వాసన కొడుతోంది” అనడం లాంటి వాటి ద్వారా మధురవాణి సంభాషణా నైపుణ్యాన్ని చూపించాడు గురజాడ. “వీళ్ళమ్మా శిఖా తరగా! ప్రతిగాడిద కొడుకూ తిండిపోతుల్లాగా నా ఇంట జేరి నన్ననే వాళ్ళే! తాంబూలం ఇచ్చేశాను, ఇహ తన్నుకు చావండి” అన్న వాక్యం నేటికీ ప్రజల్లో వినబడడమే గురజాడ సంభాషణల్ని నడిపిన చాతుర్యానికి నిదర్శనం.

కన్యాశుల్కం వాడుకభాషలో రాయబడ్డ మొదటి సాంఘిక నాటకం.ఒక్క వాడుక భాషేకాక, మాండలికాలు, పాత్రోచిత ప్రయోగాలూ కూడా ఉన్నాయి. కళింగాంధ్ర మాండలికాలకు ఉదాహరణలు “చెప్పాను కానా?”, “నా ఆబోరుండదండీ”, “గుంటవెధవ”, “కనిష్టీబు”, ”నాను ఉంది”, “అనాడీ చేస్తున్నారు”, “వగుస్తున్నారు”, “కొసాకి విను” మొదలైనవి.

పాత్రోచితంగా అగ్నిహోత్రావధాని “మానా! మానులా వున్చానంచావూ? గూబ్బగల గొడతాను.” వెంకమ్మ “మీకు మాత్రం అబ్బిమీద ప్రేఁవ లేదా యేవిషి?” గిరీశం “నేనే దాని హజ్బన్డై ఉంటే నిలబడ్డపాట్ననీ తండ్రిని రివాల్వర్తో షూట్‌ చేసి ఉందును.”

మాట్లాడే భాషకి చాలా దగ్గరగా ఉన్న పదాల్ని ప్రయోగించి సహజత్వానికి అద్దం పట్టాడు గురజాడ. ఉదాహరణకి,సాన్దీ, యవరో, జంఝప్పోస, సమ్మంధం, నాలుగ్గింజలు మొదలైనవి ఇలాంటివే. “కుంచం నిలువుగా కొలవడానికి వీలులేనప్పుడు,తిరగేసైనా కొలిస్తే నాలుగ్గింజలు నిలుస్తాయి”, “ఒపీనియన్స్‌ అప్పుడప్పుడు చేన్జి చేస్తూంటేగాని పొలిటీషియన్‌ కానేరడు” వంటి కొత్త సూక్తులు కనిపిస్తాయి.

మానవత్వాన్ని చాటి చెప్పి, మానవుడిని క్రియాపరునిగా ప్రేరేపించగల శక్తి గలది ఉత్తమ సాహిత్యమైతే, “కన్యాశుల్కం” ఉత్తమ సాహిత్యరూపం. ఉదాత్తమైన నాటకం. తెలుగు వాడు గర్వించదగ్గ నాటకం.

ప్రదర్శనలు

[మార్చు]

నాటకం మొదటి కూర్పు 1892లో తొట్టతొలిగా విజయనగరం మహారాజు పోషణలోని జగన్నాథ విలాస నాటక సంస్థ వారు ప్రదర్శించారు. ఈ ప్రదర్శన నాటికి, నాటకం మొదటి ముద్రణ కూడా కాలేదు, ఆ పైన 5 సంవత్సరాల తర్వాత మొదటి కూర్పు తొలిగా ప్రచురితమైంది. జగన్నాథ విలాస నాటక సంస్థ అప్పటివరకూ కేవలం సంస్కృతభాషలోని నాటకాలనే ప్రదర్శించేవారు, అయితే విజయనగరం మహారాజుకు ఈ నాటకం అన్నివిధాలుగా నచ్చివుండడంతో ఆయన కోసం దీన్ని ప్రదర్శించారు. గురజాడ అప్పారావు రచనలో లేని సంస్కృత ప్రవేశికను చేర్చి ప్రదర్శించారు.

కన్యాశుల్కం రెండవ కూర్పు మాత్రం చాలా పెద్దది కావడంతో మొదటి కూర్పుతో పోలిస్తే ప్రదర్శనకు చాలా కష్టంగా తయారైంది. గురజాడ నాటకాన్ని, మరీ ముఖ్యంగా రెండవకూర్పును, రచించేప్పుడు ప్రదర్శనపై పెద్దగా దృష్టిలో పెట్టుకోలేదు లేదా నాటక ప్రదర్శనలో అనుభవం అయినా లేకపోయివుండవచ్చు అని విమర్శకుడు వెల్చేరు నారాయణరావు భావించాడు. నాటకం పొడవు, సుదీర్ఘమైన స్వగతాలు, చాలా ఎక్కువ పాత్రలు, రంగస్థలంపై ప్రదర్శించే వీలు లేని సన్నివేశాలు వంటివి పూర్తి నాటకాన్ని ప్రదర్శించడం దాదాపు అసాధ్యం చేసేశాయి. నాటకం రెండవ కూర్పు ప్రచురితమైన 15 సంవత్సరాల పాటు ప్రదర్శనకు నోచుకోలేదు.
అయితే ఈలోపుగా నాటక ప్రతులు బాగా అమ్ముడై, చాలామంది చదివారు. గిరీశం, మధురవాణి వంటి పాత్రలు తెలుగువారి మాటల్లోకి వచ్చిచేరాయి. ఈ దశలో 1924లో తెనాలిలో ప్రాచుర్యం పొందిన రంగస్థల నటులతో మొదటిసారిగా పూర్తి నాటకం ప్రదర్శితమైంది. ఆపైన పలువురు రంగస్థల నటులు, సినీనటులు రామప్పంతులు, లుబ్ధావధాన్లు, గిరీశం, మధురవాణి వంటి పాత్రల్లో నటించి పేరుతెచ్చుకున్నారు. మధురవాణి పాత్రలో స్థానం నరసింహారావు, అయితం రాజకుమారి, సావిత్రి వంటివారు పేరొందారు.

1932లో సాహిత్యకారుడు అబ్బూరి రామకృష్ణారావు నాటకాన్ని ప్రదర్శనకు అనుకూలమైన సమయానికి కుదించి రాశాడు. అంతేకాక తాను కుదించిన కూర్పుతో 100సార్లకు పైగా ఆంధ్రదేశమంతటా ప్రదర్శించాడు. తర్వాతికాలంలో జె.వి.సోమయాజులు, జె.వి.రమణమూర్తి, ఎ.ఆర్.కృష్ణ వంటి దర్శకులు తమదైన శైలిలో మార్పులు చేసుకుని ప్రదర్శించారు. రంగస్థలంపై వృత్తి కళాకారులు కాకుండా ఔత్సాహికులు, విద్యార్థులు వేర్వేరు వేదికలపై అసంఖ్యాకంగా ప్రదర్శించారు. అయితే ఇవేవీ పూర్తిస్థాయిగా నాటకమంతటినీ ప్రదర్శించినవి కావు. తాము ఎంచుకున్న సన్నివేశాలను కానీ, తమవైన కుదించిన కూర్పులను కానీ ప్రదర్శించారు. 1982లో పెమ్మరాజు వేణుగోపాల రావు తాను కుదించిన కూర్పుతో అమెరికాలోని అట్లాంటాలో ప్రదర్శించాడు. ఆపైన అమెరికా లోని పలు నగరాల్లో ఆయన తెలుగువారి కోసం తన కూర్పును నిర్మించి ప్రదర్శనలు ఇచ్చాడు.
పూర్తి నాటకాన్ని 1939లో విశాఖపట్టణం ఆంధ్ర విశ్వకళాపరిషత్తు లోనూ, 1948, 1956 సంవత్సరాల్లో ఒడిశా కు చెందిన పర్లాకిమిడి లో ప్రదర్శించారు. పూర్తి నాటకం ప్రదర్శించేందుకు ప్రదర్శన సమయం, రంగస్థలంపై ప్రదర్శించడానికి కష్టమైన దృశ్యాలు వంటివి ఇబ్బంది కలిగించేటట్లు ఉండడంతో ఈ పూర్తి నాటకం ప్రదర్శనలు విస్తృతంగా సాగలేదు. 2006లో పూర్తినాటకాన్ని ఏ మార్పులూ లేకుండా టెలివిజన్ కోసం చిత్రీకరించి వారాలపాటు ప్రదర్శించారు.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "నూటపాతికేళ్ల కన్యాశుల్కం నాటకం". Sakshi. 2017-08-14. Archived from the original on 2017-09-16. Retrieved 2022-04-29.
  2. గురజాడ, అప్పారావు (1961). Wikisource link to కన్యాశుల్కము. కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు. వికీసోర్స్. 
  3. వెల్చేరు, నారాయణరావు (2007). "Performing Kanyasulkam". Girls for Sale Kanyasulkam, a Play from Colonial India (in English). Bloomington: Indiana University Press. pp. 195, 196. ISBN 9780253116932. Archived from the original on 31 October 2015. Retrieved 28 October 2015 – via Project MUSE.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: