కమ్యూనిస్టు మేనిఫెస్టో
![]() జర్మన్ భాషలో మొదటి ఎడిషన్ | |
రచయిత(లు) | కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ |
---|---|
దేశం | యునైటెడ్ కింగ్‌డమ్ |
భాష | జర్మన్ |
ప్రచురించిన తేది | 21 ఫిబ్రవరి 1848 |
కమ్యూనిస్టు మేనిఫెస్టో లేదా కమ్యూనిస్టు ప్రణాళిక కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాసిన ఒక రాజకీయ కరపత్రం. ఇది కమ్యూనిస్టు లీగ్ ద్వారా 1848లో లండన్లో ప్రచురించబడింది. "ఇప్పటి వరకు ఉన్న సమాజపు చరిత్ర, వర్గ పోరాటాల చరిత్ర", అందులో ఉత్పత్తి సాధనాలతో ప్రజలకు ఉన్న సంబంధం ద్వారా సామాజిక వర్గాలు తయారవుతాయనే చారిత్రక భౌతికవాదం ఆలోచనను విస్తృత వినియోగంలోకి తీసుకురావాడానికి మార్క్స్, ఎంగెల్స్ చేసిన మొదటి, అత్యంత క్రమబద్ధమైన ప్రయత్నం ఈ రచన. ఐరోపాలో 1848 నాటి విప్లవాల మధ్య ప్రచురించబడిన ఈ ప్రణాలిక ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన రాజకీయ పత్రాలలో ఒకటిగా ఉంది.[1]
సారాంశం
[మార్చు]ఒక పీఠిక, నాలుగు విభాగాలుగా కమ్యూనిస్టు మానిఫెస్టో విభజించబడింది. పరిచయం ఇలా మొదలవుతుంది: "ఐరోపా ఖండాన్ని ఒక భూతం వెంటాడుతోంది - కమ్యూనిజం అనే భూతం". రాజకీయ నాయకులు - ప్రభుత్వంలో ఉన్నవారు, ప్రతిపక్షంలో ఉన్నవారు, తమ ప్రత్యర్థులను కమ్యూనిస్టులుగా ముద్ర వేయడం విస్తృతంగా ఉందని, అధికారంలో ఉన్నవారు కమ్యూనిజాన్ని ఒక శక్తిగా అంగీకరిస్తున్నారని రచయితలు ఎత్తి చూపారు.[2] కమ్యూనిస్టులను వారి అభిప్రాయాలను, లక్ష్యాలను బహిరంగంగా ప్రచురించమని ప్రోత్సహిస్తూ పరిచయం ముగుస్తుంది. ఈ మ్యానిఫెస్టో యొక్క లక్ష్యం కూడా ఇదే.[3]
మొదటి విభాగం, "బూర్జువాలు, శ్రామికులు", చారిత్రక భౌతికవాదాన్ని వివరిస్తూ, "ఇప్పటి వరకు ఉన్న సమాజం యొక్క చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర" అని పేర్కొంది.[4] రచయితల అభిప్రాయం ప్రకారం, చరిత్రలో అన్ని సమాజాలలో, అణచివేసే మైనారిటీ ద్వారా మెజారిటీ అణచివేయబడి, దోపిడీకి గురైయ్యారు. మార్క్స్, ఎంగెల్స్ కాలంలో, పెట్టుబడిదారీ విధానంలో, పారిశ్రామిక కార్మిక వర్గం లేదా 'శ్రామిక వర్గం', ఉత్పత్తి సాధనాల యజమానులైన 'బూర్జువా' కు వ్యతిరేకంగా వర్గ పోరాటంలో పాల్గొంటుందని చెబుతారు.[5] "ఉత్పత్తి విధానాలను నిరంతరం విప్లవాత్మకంగా మార్చడం ద్వారా, సమస్త సామాజిక పరిస్థితులను నిరంతరం కలతపెట్టడం ద్వారా" బూర్జువా వర్గం సమాజంలో అత్యున్నత వర్గంగా ఉద్భవించి, భూస్వామ్యం యొక్క పాత శక్తులన్నింటినీ అంతమొందిస్తుందని చెప్పారు.[6] "బూర్జువా వర్గం శ్రామిక వర్గం యొక్క కార్మిక శక్తి కోసం శ్రామిక వర్గాన్ని నిరంతరం దోపిడీ చేస్తూ, తమకు లాభాలను సృష్టించుకుని, మూలధనాన్ని కూడబెట్టుకుంటుంది". అయితే, అలా చేయడంలో, బూర్జువా వర్గం "తమ గొయ్యిను తామే తవ్వుకునేవారు" గా మార్క్స్, ఎంగెల్స్ అభివర్ణించారు. ఎందుకంటే, శ్రామికులు తప్పనిసరిగా తమ సొంత సామర్థ్యం గురించి స్పృహలోకి వస్తారని, బూర్జువాను పడగొట్టి విప్లవం ద్వారా అధికారంలోకి వస్తారని వారు విశ్వసించారు.
రెండవ విభాగం "శ్రామికులు, కమ్యూనిస్టులు", కమ్యూనిస్టులమని అనుకునేవారు, మిగిలిన కార్మిక వర్గంతో ఉన్న సంబంధాన్ని పేర్కొనడంతో ప్రారంభమవుతుంది. కమ్యూనిస్టు పార్టీ ఇతర కార్మికవర్గ పార్టీలను వ్యతిరేకించదు కానీ, వాటికి భిన్నంగా, ఇది అన్ని జాతీయతలకు అతీతంగా, మొత్తం ప్రపంచ శ్రామికవర్గం యొక్క సాధారణ సంకల్పాన్ని వ్యక్తపరిచి, ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుతుంది. ఈ విభాగం కమ్యూనిజాన్ని వివిధ అభ్యంతరాలు, వాదనల నుండి సమర్థిస్తుంది. సామూహిక వ్యభిచారాన్ని సమర్థిస్తుందని లేదా పని చేయకుండా ప్రజలను నిరుత్సాహపరుస్తుందని వాదనలు ఇందులో కొన్ని. ఈ విభాగం స్వల్పకాలిక డిమాండ్ల కొన్నిటిని వివరిస్తూ ముగుస్తుంది - వాటిలో వృద్ధిక్రమానుసారంగా ఆదాయపు పన్ను; వారసత్వాలు, సొంత ఆస్తి రద్దు; బాల కార్మికులను రద్దు చేయడం; ఉచిత ప్రభుత్వ విద్య; రవాణా, కమ్యూనికేషన్ సాధనాల జాతీయీకరణ; జాతీయ బ్యాంకు ద్వారా క్రెడిట్ కేంద్రీకరణ; ప్రభుత్వ యాజమాన్యంలోని భూమి విస్తరణ, సాగులోకి తీరుకురావడం, మొదలైనవి - వీటిని అమలు చేయడం వలన రాజ్యం లేని, వర్గరహిత సమాజానికి నాంది పడుతుందని వాదించారు.
మూడవ విభాగం, "సోషలిస్టు, కమ్యూనిస్టు లిటరేచర్", ఆనాటి సమయంలో ప్రబలంగా ఉన్న ఇతర సోషలిస్టు సిద్ధాంతాల నుండి కమ్యూనిజాన్ని వేరు చేస్తుంది. వీటిని విస్తృతంగా ఫ్యూడల్ సోషలిజం - సంప్రదాయరక్షక లేక బూర్జువా సోషలిజం - విమర్శనాత్మక, ఊహాజనితమైన సోషలిజం, కమ్యూనిజంగా వర్గీకరించారు. ఈ దృక్పథాల పట్ల విమర్శల స్థాయి మారుతూ ఉన్నప్పటికీ, సంస్కరణవాదాన్ని సమర్ధించినందుకు, కార్మిక వర్గం యొక్క విప్లవాత్మక పాత్రను గుర్తించడంలో విఫలమైనందుకు అన్నిటినీ కొట్టిపారేసారు.
నాలుగవ ముగింపు విభాగం, "వివిధ ప్రతికూల పక్షాలపట్ల కమ్యూనిస్టుల స్థానం", పందొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, పోలాండ్, జర్మనీ వంటి దేశాలలో పోరాటాలపై కమ్యూనిస్ట్ వైఖరిని క్లుప్తంగా చర్చిస్తుంది. జర్మనీ "బూర్జువా విప్లవానికి" దగ్గరగా ఉందని, వెను వెంటనే శ్రామిక విప్లవం వస్తుందని అంచనా వేసారు. సోషల్-డెమోక్రాట్లతో పొత్తు ప్రకటించి, ఇతర కమ్యూనిస్టు విప్లవాలకు ధైర్యంగా మద్దతునిస్తూ, ఐక్య అంతర్జాతీయ శ్రామిక పోరాటానికి ఇలా పిలుపునిస్తూ ముగుస్తుంది - "ప్రపంచ కార్మికులారా, ఏకంకండి!"
రచన
[మార్చు]
ఈ మానిఫెస్టో 6 నుండి 7 వారాల పాటు వ్రాయబడింది. సహ రచయితగా ఎంగెల్స్ పేరు పొందినప్పటికీ, తుది ముసాయిదాను మార్క్స్ మాత్రమే రాశాడు.
ప్రచురణ
[మార్చు]ప్రధమ ప్రచురణ, అస్పష్టత 1848-1872
[మార్చు]ఫిబ్రవరి 1848 చివరలో, మానిఫెస్టోను లండన్ నగరంలో కమ్యూనిస్ట్ వర్కర్స్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ అనామకంగా ప్రచురించింది.[7] జర్మన్ భాషలో రాసిన 23 పేజీల కరపత్రం మానిఫెస్ట్ డెర్ కమ్యూనిస్టిస్చెన్ పార్టీ అనే పేరుతో ఆకుపచ్చ రంగు కవర్లో ప్రచురించబడి. మూడుసార్లు పునర్ముద్రించబడింది. మార్చి 4న కార్ల్ మార్క్స్ ను బెల్జియం పోలీసులు బహిష్కరించారు. రెండు వారాల తరువాత, మార్చి 20న, వెయ్యి కాపీలు పారిస్కు చేరుకుని, అక్కడ నుండి ఏప్రిల్ ప్రారంభంలో జర్మనీకి చేరుకున్నాయి. ఏప్రిల్-మేలో ముద్రణ, విరామ చిహ్నాల తప్పిదాల కోసం సరిదిద్దారు-మార్క్స్, ఎంగెల్స్ ఈ 30 పేజీల ప్రతిని మానిఫెస్టో యొక్క భవిష్యత్తు సంచికలకు ఆధారంగా ఉపయోగించారు.
ప్రాచుర్యం 1872-1917
[మార్చు]1870ల ప్రారంభంలో, మానిఫెస్టో ఇంకా దాని రచయితలు ప్రాచుర్యం పొందారు. హాబ్స్బావ్ దీనికి మూడు కారణాలను గుర్తించాడు. మొదటిది ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్స్ అసోసియేషన్ (ది ఫస్ట్ ఇంటర్నేషనల్) లో మార్క్స్ పోషించిన నాయకత్వ పాత్ర. రెండవది, మార్క్స్ 1871 నాటి పారిస్ కమ్యూన్ మద్దతు ఇచ్చినందుకు సోషలిస్టులలో చాలా ప్రాముఖ్యత పొందాడు. చివరగా, బహుశా మానిఫెస్టో యొక్క ప్రజాదరణలో అత్యంత ముఖ్యమైనది, సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ ఆఫ్ జర్మనీ (SDAP) నాయకుల రాజద్రోహం విచారణ. విచారణ సమయంలో ప్రాసిక్యూటర్లు మానిఫెస్టోను సాక్ష్యంగా బిగ్గరగా చదివారు- ఇలా చదవటంతో జర్మనీలో చట్టబద్ధంగా ప్రచురించే అవకాశం ఏర్పడింది. 1872లో మార్క్స్, ఎంగెల్స్ ఒక కొత్త జర్మన్-భాషా సంచికను విడుదల చేసి, అందులో ఒక ఉపోద్ఘాతం రాశారు. అందులో భాగంగా అసలు ప్రచురణ అయినప్పటి నుండి రెండున్నర దశాబ్దాలలో పాతవి అయిన అనేక భాగాలను గుర్తించారు. ఈ సంచిక మొదటిసారిగా ది కమ్యూనిస్ట్ మానిఫెస్టో (దాస్ కమ్యూనిస్టిస్చే మానిఫెస్టో) గా కుదించబడి, భవిష్యత్ సంచికలకు ఆధారంగా మారింది. 1871- 1873 మధ్య, మానిఫెస్టో ఆరు భాషలలో తొమ్మిది సంచికలలో ప్రచురించబడింది. 1871 డిసెంబరు 30న ఇది మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్ లో వుడ్హల్ & క్లాఫ్లిన్స్ వీక్లీ ఆఫ్ న్యూయార్క్ సిటీలో ప్రచురించబడింది.[8]

తరువాతి నలభై సంవత్సరాలలో, ఐరోపా ఇంకా ప్రపంచం అంతటా కొన్ని ప్రాంతాలలో సోషల్-డెమోక్రటిక్ పార్టీలు పెరగడంతో, వాటితోపాటు మానిఫెస్టో ప్రచురణ కూడా ముప్పై భాషలలో వందలాది సంచికలలో జరిగింది. మార్క్స్, ఎంగెల్స్ 1882 రష్యన్ సంచికకు కొత్త ఉపోద్ఘాతం రాశారు. అందులో రష్యా నేరుగా కమ్యూనిస్టు సమాజం మారగలదా లేదా ఇతర యూరోపియన్ దేశాల మాదిరిగానే మొదట పెట్టుబడిదారీ అవుతుందా అని వారు సందేహపడ్డారు. 1883లో మార్క్స్ మరణం తరువాత, 1888-1893 మధ్య ఐదు సంచికలకు ఎంగెల్స్ ముందుమాటలు ఇచ్చాడు. వీటిలో 1888 ఆంగ్ల సంచిక ఉంది, దీనిని శామ్యూల్ మూర్ అనువదించగా, ఎంగెల్స్ ఆమోదించాడు. అప్పటి నుండి ఇది ప్రామాణిక ఆంగ్ల భాషా సంచికగా ఉంది.[9]
మూలాలు
[మార్చు]- ↑ "కార్ల్ మార్క్స్ చెప్పిన ఈ నాలుగు సిద్ధాంతాలకు నేటికీ తిరుగులేదు". BBC News తెలుగు. Retrieved 2025-03-03.
- ↑ Marx & Engels 1977, p. 34.
- ↑ Marx & Engels 1977, p. 34.
- ↑ Marx & Engels 1977, pp. 35–48.
- ↑ Marx & Engels 1977, p. 36.
- ↑ Marx & Engels 1977, pp. 36–7.
- ↑ Bosmajian, Haig A. "A RHETORICAL APPROACH TO THE COMMUNIST MANIFESTO" (PDF). dalspace.library.dal.ca. Retrieved 2022-06-12.
- ↑ (30 December 1871). "German Communism – Manifesto of the German Communist Party". Archived 2023-04-18 at the Wayback Machine
- ↑ Ford, Thomas H. (July 2021). "Atmospheric Late Romanticism: Babbage, Marx, Ruskin".