కర్నాటి లక్ష్మీనరసయ్య
కర్నాటి లక్ష్మీనరసయ్య | |
---|---|
జననం | కర్నాటి లక్ష్మీనరసయ్య అక్టోబరు 5, 1927 కృష్ణా జిల్లా తిరువూరు తాలూకా తునికిపాడు |
మరణం | నవంబర్ 5, 2019 విజయవాడ |
మరణ కారణం | వృద్ధాప్యం |
నివాస ప్రాంతం | కృష్ణా జిల్లా తిరువూరు తాలూకా తునికిపాడు |
ఇతర పేర్లు | కర్నాటి లక్ష్మీనరసయ్య |
ప్రసిద్ధి | నటుడు, ప్రయోక్త, దర్శకుడు |
తండ్రి | వెంకయ్య |
తల్లి | రాజమ్మ, |
కర్నాటి లక్ష్మీనరసయ్య (అక్టోబరు 5, 1927 - నవంబర్ 5, 2019) రంగస్థల నటుడు, ప్రయోక్త, దర్శకుడు. జానపద కళా బ్రహ్మగా పేరుగాంచిన ఈయన చిరకాలం కళారంగానికి సేవ చేశాడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఈయన కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలం, తునికిపాడు గ్రామంలో 1927, అక్టోబరు 5 వ తేదీన జన్మించాడు.[2] వ్యవసాయ కుటుంబం. రాజమ్మ, వెంకయ్యలు తల్లిదండ్రులు. బాల్యం మధిర తాలూకా దెందులూరులో గడచింది. ఉన్నత విద్యాభ్యాసం ఖమ్మం హైస్కూలులో ఉర్దూ మీడియంలో చదువు మధ్యలో ఆగిపోయింది.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]లక్ష్మీనరసయ్య షేక్ నాజర్ బుర్రకథ దళంలో చేరి, బృందంలో హాస్యాన్ని, రాజకీయాన్ని కూడా ప్రజలు మెచ్చేలా నిర్వహించాడు. ముందడుగు నాటకంలో గరికపాటి రాజారావు కథానాయకుడి పాత్రకు లక్ష్మీనరసయ్యను ఎంపికచేశాడు. తరువాత లక్ష్మీనరసయ్య, కోడూరు అచ్చయ్య, పెరుమాళ్లు వంటి వారి శిక్షణలో రాటుదేలాడు. నటుడిగానే కాక, ప్రయోక్తగా, దర్శకునిగా ఎదిగారు. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నాగభూషణం, రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప్, కె.వి.ఎస్.శర్మ వంటి రంగస్థల, సినిమా నిపుణుల ఆధ్వర్యంలో అనేక ప్రదర్శనలు, పోటీలలో పాల్గొన్నాడు. చెక్కభజన, కోలాటం, గొల్లసుద్దులు, చిత్ర విచిత్ర వేషాలు వంటివి నేర్చుకొని విరివిగా ప్రదర్శించాడు. అల్లీముఠా నాటకాన్ని ప్రపంచ తెలుగు మహాసభలో ప్రదర్శించారు. అంతా పెద్దలే అనే రెంటాల నాటకాన్ని తన దర్శకత్వంలో రూపొందించి రాష్ట్రంలో అన్ని ముఖ్యపట్టణాల్లోనూ ప్రదర్శించాడు.
సినిమారంగం
[మార్చు]పుట్టిల్లు, అగ్గిరాముడు, భలేబావ, లవ్ మ్యారేజ్, నీడ, పూలపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, ఇదికాదు ముగింపు, ఈ చదువులు మాకొద్దు వంటి సినిమాల్లో లక్ష్మీనరసయ్య నటించాడు.
ఇతర వివరాలు
[మార్చు]విజయవాడలో జానపద కళాకేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఆ సంస్థ అధ్యక్షులుగా ఉంటూ నూట ఇరవైమంది కళాకారులను తీర్చిదిద్దాడు. విజయవాడ పురప్రముఖులు (1983)లో ప్రజానటుడు బిరుదంతో సత్కరించారు. 1987లో షష్టిపూర్తి మహోత్సవం జరిగింది. డాక్టర్ నందమూరి తారక రామారావు 1988 ఏప్రిల్ పదిహేనో తేదీన కర్నాటి లక్ష్మీనరసయ్యను సత్కరించారు. 2008లో తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డును స్వీకరించాడు. 2015లో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా రంగస్థల రత్న పురస్కారంతో సత్కరించింది.
మరణం
[మార్చు]లక్ష్మీనరసయ్య 2019, నవంబరు 5వ తేది ఉదయం 8 గంటలకు విజయవాడలో మరణించాడు. మరణానంతరం ఆయన పార్థివ శరీరాన్ని సిద్ధార్థ హాస్పిటల్ కు అందజేసారు.
ఇతర లంకెలు
[మార్చు]- 'ప్రజాకళల పితామహుడు' పేరుతో ముత్తేవి రవీంద్రనాథ్ 05.10.2014 నాడు ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం[permanent dead link]
- 'కళ నా శ్వాస' పేరుతో యు.రామకృష్ణ 02.10.2014 నాడు ప్రజాశక్తిలో రాసిన వ్యాసం
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు వెలుగు, ఈనాడు. "ప్రజాపక్షం కానిది కళకాదు!". www.teluguvelugu.in. Archived from the original on 5 నవంబరు 2019. Retrieved 5 నవంబరు 2019.
- ↑ కందిమళ్ల, సాంబశివరావు (2008). నాటక విజ్ఞాన సర్వస్వం (1 ed.). హైదరాబాదు: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. pp. 537–538.