కలిమిలేములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలిమిలేములు
(1962 తెలుగు సినిమా)
Kalimileamulu.jpg
దర్శకత్వం జి. రామినీడు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
కృష్ణకుమారి
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ నవశక్తి ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. కలలోని గాలిమేడ కానరాని నీలి నీడ - ఎం. సునంద - రచన: శ్రీశ్రీ
  2. కొమ్మలమీద కోతికొమ్మచ్చులాడింది తెల్లతెల్లాని - ఎస్.జానకి, కె.రాణి - రచన: మల్లాది
  3. గాలిలో తేలే పూలడోలలో పన్నీరు చల్లే వెన్నెల తీవె - ఘంటసాల, ఎస్.జానకి - రచన: మల్లాది
  4. చిలిపి చిలకమ్మ ఆగు నా చేతిలొ ఉయ్యాలలూగు - ఘంటసాల, ఎస్.జానకి - రచన: ఆరుద్ర
  5. చూడచక్కని చక్కనయ్యా ఓర చూపులే చూసేవు - జిక్కి, ఎస్.జానకి - రచన: మల్లాది
  6. చేయకే దుబారా నేను చెప్పినట్టు చెయ్యకుంటే - మాధవపెద్ది, స్వర్ణలత - రచన: ఆరుద్ర
  7. తప్పదులే తప్పదులే ఎన్నటికైనా తప్పదులే - ఘంటసాల,పి.లీల - రచన: కొసరాజు
  8. నొసట వ్రాసిన వ్రాలు తప్పదులే చెరిపివేసిన - వైదేహి బృందం - రచన: కొసరాజు

కథ[మార్చు]

చిత్రంలో అక్కినేని, మిక్కిలినేని

రామయ్య కుమ్మరివృతీ చేసుకుంటూ ఉన్న రెండెకరాల పొలంతో సుఖంగా కాలం గడుపుతూ ఉంటాడు. తల్లి లక్ష్మమ్మ తమ్ముడు రాజు భార్య మాణిక్యమ్మ, చిన్నకొడుకు రామయ్య కుటుంబ సభ్యులు. రామయ్య బావమరిది సుబ్బయ్య కూడా ఆ గ్రామంలోనే ఉంటున్నాడు. అప్పులతో మునిగిపోయాడు. బ్రతుకుతెరువు లేక నరకయాతన పడుతున్నాడు. అతణ్ణి ఎలాగైనా కష్టాలనుంచి తొలగించాలని రామయ్య అనుకుంటాడు. తన ఇల్లు, రెండెకరాల భూమి షావుకారు నరసయ్యకు తనఖాపెట్టి రెండు వేల రూపాయలు అప్పు తెచ్చి సుబ్బయ్య రుణాలన్నీ తీర్చివేస్తాడు. ఒక నూనె గానుగ కూడా కొనియిస్తాడు. సుబ్బయ్య చిక్కులు తొలిగిపోయి డబ్బు సంపాదిస్తాడు. రామయ్య తమ్ముడు రాజు, సుబ్బయ్య కుమార్తె విమల బాల్యస్నేహితులు. ఆ స్నేహం వయసు పెరిగి యౌవనం అంకురించడంతో అనురాగంగా మారుతుంది. తమ్ముణ్ణి రామయ్య పట్నంలోని వృత్తి శిక్షణాలయానికి పంపిస్తాడు. సుబ్బయ్య నాలుగు రాళ్ళు సంపాదించగానే నరసయ్య అతనిని కలుసుకుని ఒక్క షరతు మీద తన అల్యూమినియం వ్యాపారంలో వాటా ఇస్తానంటాడు. రామయ్యను బాకీ కోసం ఒత్తిడిపెట్టి అతని ఆస్తిని కబళిస్తాననీ, తను ఏమీ అభ్యంతరం చెప్పరాదనీ ఆ షరతు. సుబ్బయ్య బాధపడతాడు. తన వ్యాపారం మీద వచ్చే లాభాలలో రామయ్యకు సగం వాటా ఇస్తానని అంతకు ముందే పదిమంది సమక్షంలో వాగ్దానం చేసిన సుబ్బయ్య కొంచెం తటపటాయించి ఎట్టకేలకు ఒప్పుకుంటాడు. నరసయ్య తన బాకీ యిమ్మని రామయ్యపై ఒత్తిడి పెడతాడు. "నీకోసం చేసింది కదా ఈ ఋణం. ఆ డబ్బు ఇవ్వ"మని రామయ్య సుబ్బయ్యను హెచ్చరిస్తాడు. సుబ్బయ్య దొంగలెక్కలు వేసి రామయ్య వాటాకు వచ్చింది రెండువేల రూపాయల నష్టమని తేల్చి వంచనకు పాల్పడ్డాడు. గత్యంతరం లేక తన భూమి, ఇల్లు నరసయ్యకు అప్పగించి ఊరిబయట పాకవేసుకుని యాతనామయమైన జీవితం ప్రారంభించాడు. ఆ గ్రామంలోనే దేవయ్య, ఆదెమ్మ అనే దంపతులు ఉంటారు. దేవయ్య ధనికుడే కాని లుబ్దాగ్రేసర చక్రవర్తి. సంతానంలేని బాధ ఆ దంపతులను పీడిస్తూ ఉంటుంది. వీరికి ఒక కపట సాధువు తారసపడి వారి ఇంట్లోనే తిష్టవేసి పూజలు, మంత్రాలు, తంత్రాలు తంతుపెట్టి డబ్బుదోచుకుంటూ చివరకు మంచి సమయం రాగానే ఆదెమ్మ నగలతో పలాయన మంత్రం పఠిస్తాడు. వృత్తి శిక్షణాలయం నుండి తిరిగి వచ్చిన రాజు అన్నగారి జీవితంలో జరిగిన మార్పుకు ఖిన్నుడై కుటీరపరిశ్రమ స్థాపనకు అవసరమైన సామాగ్రి తెప్పిస్తాడు.నరసయ్య కన్నుకుట్టి తనకు ఇంకా రావలసిన పైకం క్రింద ఆ సామాగ్రి జప్తుచేయిస్తాడు. ఈ క్షోభ భరించలేక రామయ్య కొండమీదినుంచి దూకి ప్రాణం తీసుకుంటాడు. ఇల్లరికంలో ఉండే పద్దతిలోనే కుమార్తె విమలనిచ్చి పెళ్లి చేస్తానని సుబ్బయ్య రాజుతో చెబుతాడు. వదిన మాణిక్యం కూడా ఇల్లరికంవెళ్లమని హితోపదేశంచేస్తుంది. అన్న కుటుంబానికి ద్రోహం చేయనంటాడు రాజు. సంక్షుభిత చిత్తంతో ఆత్మత్యాగానికి పూనుకోగా మిత్రుడు కోటయ్య వారిస్తాడు. నరసయ్య తన అల్యూమియం ఫ్యాక్టరీకి కుమారుడు శేఖర్‌ను మేనేజరుగా నియమిస్తాడు. అతని కఠిన ప్రవర్తన సహించలేక పని నుంచి బయటపడి తప్పుకొని బయటకొచ్చిన పనివారు రాజును కుటీరపరిశ్రమలు స్థాపించమని బ్రతిమాలుతారు. కోటయ్య, దేవయ్య కూడా తోడ్పాటు నిస్తామంటారు. ఫ్యాక్టరీ రూపొందుతుంది. దొంగసాధువును దేవయ్య పట్టుకొని పోలీసులకు అప్పగిస్తాడు. సుబ్బయ్య తనకుమార్తె విమలను రాజశేఖర్‌కిచ్చి పెళ్ళి చేయడానికి నిశ్చయిస్తాడు. ముహూర్తం సమీపిస్తున్న సమయంలో తన ఫ్యాక్టరీలోని కార్మికులు సమ్మెచేయగా కృద్ధుడైన నరసయ్య రాజును, అతని ఫ్యాక్టరీని నాశనం చేయడానికి పన్నాగం పన్నుతాడు. విమల ఈ సంగతి విని రామయ్య భార్య మాణిక్యంతో రాజు ఫ్యాక్టరీ వద్దకు కొందరు కార్మికులను వెంటబెట్టుకొని పరిగెడుతుంది. అప్పటికే రాజు ఫ్యాక్టరీ అగ్నిజ్వాలలకు ఆహుతి అవుతూవుంటుంది. విమల, మాణిక్యం మంటలో చిక్కుపడిపోతారు. కుమార్తెకోసం సుబ్బయ్య కూడా ఆ మంటలోనికి దూకుతాడు. పతాక సన్నివేశంలో వారందరినీ రాజు రక్షించి, విమలతో వివాహం చేసుకొంటాడు[1].

మూలాలు[మార్చు]

  1. సంపాదకుడు (29 June 1962). "చిత్ర సమీక్ష కలిమిలేములు". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 23 February 2020. CS1 maint: discouraged parameter (link)[permanent dead link]

బయటి లంకెలు[మార్చు]