కాంకేర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాంకేర్ జిల్లా
कांकेर जिला
ఛత్తీస్‌గఢ్ పటంలో కాంకేర్ జిల్లా స్థానం
ఛత్తీస్‌గఢ్ పటంలో కాంకేర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
డివిజనుబస్తర్
ముఖ్య పట్టణంకాంకేర్
మండలాలు7
Government
 • లోకసభ నియోజకవర్గాలు1
 • శాసనసభ నియోజకవర్గాలు2
విస్తీర్ణం
 • మొత్తం5,285 కి.మీ2 (2,041 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం6,51,333
 • జనసాంద్రత120/కి.మీ2 (320/చ. మై.)
ప్రధాన రహదార్లుN.H.-30

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జిల్లాలలో కాంకేర్ జిల్లా ఒకటి. ఇది 20.6-20.24 డిగ్రీల ఉత్తర అక్షాంశంలోను, 80.48-81.48 డిగ్రీల తూర్పు రేఖాంశంలోనూ ఉంది. జిల్లా వైశాల్యం 5285.01 చ.కి.మీ. జనసంఖ్య 651,333.

బుడేల్ మహానది వంతెన

చరిత్ర

[మార్చు]

[1] కాంకేర్ చరిత్ర రాతియుగంలోనే ఆరంభం అయింది. రామాయణం మహాభారతం కాలంలో ఈ ప్రాంతం గురించిన ప్రస్తావన ఉంది. ఒకప్పటి దండకారణ్యమే, తరువాతి కాలంలో కాంకేర్ రాజాస్థానమని విశ్వసించబడుతుంది. ఇది అనేకమంది ఋషులు తపమాచరించిన ప్రాంతమని భావిస్తున్నారు. లోమేష్, అంగీరసుడు మొదలైన వారు ఇక్కడ నివసించారని విశ్వసిస్తున్నారు. క్రీ.పూ 6వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో బౌద్ధం వికసించింది. కాంకేర్ ఎప్పటికీ స్వతంత్రంగానే ఉందని దాని చరిత్ర తెలియజేస్తోంది. క్రీ.పూ. 106 లో కాంకేర్ ప్రాంతం శాతవాహన వంశానికి చెందిన రాజా శాతకర్ణి ఆధీనంలో ఉండేది. ఈ విషయాన్ని అప్పటి చైనా యాత్రికుడు హూయన్‌త్సాంగ్ వర్ణించాడు. శాతవాహనుల తరువాత ఈ ప్రాంతం నాగాలు, వాకాటకులు, గుప్తులు, నల్, చాళుక్య వంశస్థులు పాలించారు. సింగ్ రాజ్ సోమరాజ వంశం ఆవిర్భానికి పునాది వేశాడు. ఈ వంశస్థులు ఈ ప్రాంతాన్ని 1125-1344 వరకు పాలించారు. సోములు పతనం తరువాత శక్తివంతమైన ధర్మదేవ్ ఈ ప్రాంతానికి పాలకుడయ్యాడు. 1385 నుండి ఈ ప్రాంతాన్ని కంద్రా వంశస్థులు పాలించారు. పురాణ కథనాలను అనుసరించి కంద్రా వంశానికి చెందిన మొదటి రాజు వీర్ కంహర్ దేవ్ ఈ ప్రాంరంతాన్ని పాలించాడని భావిస్తున్నారు. కంద్రా వంశస్థులు ఈ ప్రాంతాన్ని 1802 వరకు పాలించారు.

కాంకేర్ రాజాస్థానం

[మార్చు]

కాంకేర్ ప్రాంతం తరువాత నాగపూర్ సామ్రాజ్యానికి చెందిన భోసలేలు పాలించారు.1809 - 1818 వరకు ఈ ప్రాంతాన్ని బూప్ దేవ్ పాలించాడు. నరహరి దేవ్ పాలనా కాలంలో ఈ ప్రాంతం బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది. నరహరిదేవ్ బ్రిటిష్ సామంతరాజుగా ఈ ప్రాంతాన్ని పాలిస్తూ బ్రిటిష్ వారికి కప్పం చెల్లించాడు. 1882 నుండి ఈ ప్రాంతం రాయ్‌పూర్ కమీషనర్ ఆధీనంలోకి వచ్చింది. నాహర్ దేవ్ సమయంలో గాడియా పర్వతప్రాంతంలో ఉన్న రాజభవనంలో ముద్రణాలయం, గ్రంథాలయం, రాధాకృష్ణ ఆలయం, జగన్నథ్ ఆలలయం, బాలాజీ ఆలయం నిర్మించబడ్డాయి. 1904లో కోమల్ దేవ్ కాంకేర్ రాజయ్యాడు. ఆయన పాలనా కాలంలో ఒక ఆంగ్ల పాఠశాల, ఒక బాలికల పాఠశాల, 15 ప్రాథమిక పాఠశాలలు స్థాపించబడ్డాయి. అలాగే కాంకేర్, సంబల్ పూర్ వద్ద రెండు ఆసుపత్రులు నిర్మించబడ్డాయి. ఆయన కాంకేర్ సమీపంలో సరికొత్త పట్టణం నిర్మించాడు. అలాగే అయన రాజధానిని కాంకేర్ నుండి గోవిందపూర్‌కు మార్చాడు. 1925 జనవరి 8న ఆయన మరణించాడు. ఆయన మరణించిన తరువాత భానుప్రతాప్ దేవ్ కాంకేర్ చివరి రాజయ్యాడు. ఆయన కాలంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భానుప్రతాప్ దేవ్ 2 సార్లు అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికయ్యాడు.

రాజులు[2]

[మార్చు]
  • 5 Dec 1853 డిసెంబరు 5- May 1903 మే నరహర్ దేవ్
  • 1903 - 1925 జనవరి 5 లాల్ కమల్ దేవ్
  • 1925 జనవరి 8 - 1947 ఆగస్టు 15 భానుప్రతాప్ దేవ్ (బి. 1922)

1944- 1972 చంపాల్ చోప్డా (జమీందార్) ముల్లా, చౌగెల్, భానూప్రతాప్‌ పూర్, ఘోటియా, ఒట్టెకస.

స్వతంత్రం తరువాత

[మార్చు]

ప్రస్తుత కాంకేర్ జిల్లా ఒకప్పుడు పాత బస్తర్ జిల్లాలో భాగంగా ఉండేది. 1999లో కాంకేర్ స్వతంత్ర జిల్లాగా ప్రకటించబడింది. ప్రస్తుతం ఈ జిల్లా సరిహద్దులలో కొండగావ్, ధమ్తారి, బాలడ్, అస్సాం రాష్ట్రం లోని నారాయణపూర్, రాజానందగావ్ జిల్లాలు ఉన్నాయి..[3] ఇది ప్రస్తుతం రెడ్ కారిడార్‌లో భాగంగా మారింది.[4]

సాధారణ సమాచారం

[మార్చు]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 748,593, [5]
ఇది దాదాపు. గయానా దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. అలాస్కా నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 493వ స్థానంలో ఉంది.[5]
1చ.కి.మీ జనసాంద్రత. 115 [5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 15%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 1007:1000[5]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 70.97%.[5]
జాతియ సరాసరి (72%) కంటే.

వాతావరణం

[మార్చు]
విషయ వివరణ వాతావరణ వివరణ
శీతాకాలం గరిష్ఠ ఉష్ణోగ్రత ° సెల్షియస్
శీతాకాలం కనిష్ఠ ఉష్ణోగ్రత ° సెల్షియస్
అత్యంత శీతల మాసం డిసెంబరు
వాతావరణ విధానం పొడి వాతావరణం
వేసవి కాలం గరిష్ఠ ఉష్ణోగ్రత ° సెల్షియస్
వేసవి కాలం కనిష్ఠ ఉష్ణోగ్రత ° సెల్షియస్
అత్యంత ఉష్ణ మాసం మే మాసం
వర్షపాతం 1492 మి.మీ
అత్యధిక వర్షపాతం జూన్-అక్టోబరు 90%
అక్షాంశం ఉత్తరం
రేఖాంశం తూర్పు

భౌగోళికం

[మార్చు]

జిల్లాకు కేంద్రంగా ఉన్న కాంకేర్ పట్టణం జాతీయరహదారి 30 పక్కన ఉంది. జిల్లాలో 5 నదులు ప్రవహిస్తున్నాయి: మహానది, దూద్ నది, హాత్కుల్ నది, సొందూర్ నది, తురు నది. ఈ జిల్లాలో చిన్న చిన్న కొండలు ఉన్నాయి. జిల్లాకేంద్రంగా కాంకేర్ పట్టణం జాతీయ రహదారి 43 పక్కన ఉంది. జాతీయ రహదారి 43 ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిన రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్, జగదల్‌పూర్ (బస్తర్ జిల్లా కేంద్రం) మద్య నిర్మించబడింది. కాంకేర్ రాయ్‌పూర్‌కు 140 కి.మీ. జగదల్‌పూర్‌కు 160 కి.మీ దూరంలో ఉంది.

భూవర్ణన

[మార్చు]

కాంకేర్ ప్రాంతం మైదాన ప్రాంతంగా ఎగుడు దిగుడుగా కొండలతో ఉంది. అత్యధికమైన భూభాగం సముద్రమట్టానికి 300 నుండి 600 మీ. ఎత్తులో ఉంది. జిల్లాలోని 80% భూమి చదరంగా ఉంటుంది. ఈ భూభాగం మహానది మైదానం, కోర్తి మైదానంగా విభజించబడింది. ఈశాన్య భాగం కాంకేర్ మహానది మైదానంలో ఉంది. ఇక్కడి ప్రాంతంలో అత్యధిక భాగం సముద్రమట్టానికి 500 మీ ఎత్తులో ఉంది. ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్న నదులలో ప్రధానమైనది మహానది. హత్కుల్, దూద్, సెదూర్, నక్తి, తురి నదులు కూడా ఈ ప్రాంతలో ప్రవహిస్తున్నాయి. తొత్రి మైదానం భానూపూర్ ప్రాంతంలోకి వస్తుంది.

  • ప్రాతం భూభాగం 3 వర్గాలుగా విభజించబడ్డాయి :
  • వింధ్యాహిల్ గ్రూపు : కాంకేర్ ఆగ్నేయ భూభాగంలో ఉన్నాయి. ఇక్కడ మట్టి 6 విధాల రాళ్ళు, ఇసుకతో ఉంటుంది.
  • అర్చియన్ హిల్ గ్రూప్ : కాంకేర్ లోని 95% భూభాగం అర్చియన్ హిల్ గ్రూప్‌కు చెంది ఉంది. ఈ ప్రాంతంలో గ్రానైట్, నెయిస్ రాళ్ళు ఈ ప్రాంతం అంతటా పరచుకొని ఉన్నాయి.
  • ధార్వార్ హిల్ గ్రూప్ : ఈ గ్రూప్ చాలా కఠినంగా ఉంటుంది. ఇది కిల్లా ఉత్తరప్రాంతంలో అధికంగా ఉన్నాయి. ఇవి అధికంగా సంబల్పూర్, భానుపూర్ ప్రాంతంలో ఉన్నాయి.

మట్టి

[మార్చు]

కాంకేర్ మట్టిలో గ్రానైట్, నెయిస్, ఇసుక, ఖెదర్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో అధికభాగం ఎర్రమట్టితో నిండి ఉంది. ఎత్తైన ఎర్రని మట్టికొండలలోని నదీ లోయలు మెత్తగా సారవంతమై ఉంటాయి. ఈ ప్రాంతం నేలలను 4 రకాలుగా విభజించవచ్చు.

  • కన్‌హర్: ఈ తరహా మట్టి నల్లని వర్ణంతో చమురుగా ఉంటుంది. ఈ తరహా మట్టి నీటిని అత్యధికంగా పీల్చుకుంటుంది. ఖరీఫ్, రబీ పంటకు ఇది అధికంగా ఉపకరిస్తుంది. ఈ తరహా మట్టి కోర్తి నది, మహానది ప్రాంతంలో కనిపిస్తుంది.
  • దోర్సా : ఈ తరహా మట్టి మధ్యతరహాకు చెందింది. ఇది దాదాపు మటాసికి, కంహర్ తరహా మట్టికి దగ్గరగా ఉంటుంది. ఈ తరహా మట్టి కాంకేర్ జిల్లా ఈశాన్యంలోని భానుప్రతాప్ భూభాగంలో ఉంది.
  • మతసి : ఈ తరహా మట్టి కన్‌హర్ కంటే ఎత్తైన ప్రదేశం, భత కంటే దిగువ ప్రాంతంలో ఉంటుంది. ఈ మట్టి వరి పంటకు అనుకూలమైనది. కాంకేర్ జిల్లాలోని అధిక భూభాగంలో ఈ మట్టి కనిపిస్తుంది.
  • భత: భత మట్టి ఎరుపు, పసుపు వర్ణాలతో ఉంటుంది. ఈ తరహా మట్టి జిల్లాలోని ఎగువభూముల్లో ఉంటుంది. ఈ నేలలు మొక్కజొన్న, కొడొ, కుల్తి, కుత్కి పంటలకు అనుకూలంగా ఉంటాయి.

అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లు

[మార్చు]

కాంకేర్ జిల్లాలో 7 బ్లాకులు / తాలూకాలు ఉన్నాయి. అవి:

  • కాంకేర్
  • చర్మా
  • నరహరిపూర్
  • భానుప్రతాప్‌పూర్
  • దుర్గుకొండల్
  • అంతగర్
  • పఖంజూర్ / కోయలిబెడ .

జిల్లాలో 389 గ్రామ పంచాయితీలు, కాంకేర్ జిల్లాలో 995 గ్రామాలు ఉన్నాయి.

ఆర్ధికం

[మార్చు]

జిల్లాలో ప్రజలు అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో అత్యధికులు గిరిజన తెగలకు చెందినవారు. వ్యవసాయం వీరికి సంవత్సరంలో అత్యధిక భాగం జీవనాధారంగా ఉంది. గిరిజన ప్రజలకు గృహేతర అవసరాలకు అవసరమైన కలప కూడా అదనపు ఆదాయ వనరుగా ఉంది. భూభాగంలో అత్యధిక భాగం ఇంకా అరణ్య ప్రాంతంగా ఉంది. గిరిజన ప్రాంతాలలో ఇప్పటికీ మారథాన్ లేక డిప్పా ఆచారం కొనసాగుతుంది. అరణ్యాలలో నివసించే ప్రజలు వర్షాకాలానికి ముందుగా చెట్లను నరికి వ్యవసాయ భూములుగా మార్చి పంటను పండిస్తుంటారు. 2 సంవత్సరాల తరువాత పాత భూమిని విడిచి కొత్త భూమిని వ్యవసాయ భూమిగా మార్చుకుంటారు. మైదాన భూములలో ప్రతిసంవత్సరం పంటలు సాధారణంగా పండింపబడుతూ ఉంటాయి. జిల్లాలో వరి ప్రధానంగా పండిస్తున్నప్పటికీ గోధుమ, చెరుకు, పప్పుధాన్యాలు, కొడొ, పెసర, నువ్వులు, మొక్కజొన్న పంటలకు కూడా ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. అంతేకాక, ప్రజలు కూరగాయలు, మామిడి, అరటి వంటి పండ్లు కూడా పండిఇస్తున్నారు.[1][8]

కాంకేర్ జిల్లాలో సగం మంది పేదరికానికి దిగువన జీవిస్తున్నారని అధికారిక నివేదికలు తెలియజేస్తున్నాయి.[1] జిల్లా మొత్తం కరువు బాధిత ప్రదేశంగా గుర్తించబడింది. 80% మంది శ్రామికులు వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత వృత్తులను ఆధారం చేసుకుని జీవిస్తున్నారు. జిల్లాలోని ప్రజలు తక్కువ ఆదాయంతో బాధపడుతున్నారు. జనాభా, అభివృద్ధి సమస్య వలన ఉపాధి కల్పన సమస్యాత్మకంగా మారింది. 2.95 లక్షల మందిని అధిక ఉత్పత్తి శక్తిని కలిగించే వ్యవసాయ పద్ధతుల ద్వారా ప్రోత్సాహపరచి ఉపాధిని కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల అత్యవసర అవసరాలను తీర్చే దిశగా ఆర్థికాభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఉపాధిని పెంచడం, వైవిధ్యమైన పంటలను పండించడం, పంటలలో అత్యధిక ఉత్పత్తి సాధించడం వంటి విధానాల ద్వారా అభివృద్ధిచేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఖనిజాలు

[మార్చు]

కాంకేర్ జిల్లా ఖనిజ సంపదతో సుసంపన్నమై ఉంది. ఇనుము, క్వార్జైట్, గార్నెట్ ఖనిజాలు ఉన్నాయి. ఈ ఖనిజాల కొరకు వాణిజ్య పరంగా త్రవ్వకాలు ఇంకా ఆరంభించపడలేదు.

  • కాంకేర్ దక్షిణ ప్రాంతంలో క్వార్జైట్, గార్నెట్ ఖనిజాలు ఉన్నాయి. భానుప్రతాప్‌పూర్ తాలూకాలో ఉన్న హహలడ్డి భూభాగంలో 100 మిలియన్ టన్నుల ఇనుము ఖనిజం కనిపెట్టబడింది.
  • కాంకేర్ జిల్లాలో నల్లని, తెల్లని గ్రానైట్ పుష్కలంగా కనిపెట్టబడ్డాయి. ఇది భవనిర్మాణంలో ఉపయోగిస్తారు. మార్కతొల, బర్కెగొండి భూభాగంలో సిలిమనైట్ లేక నైట్ ఖనిజాలు

కనిపెట్టబడ్డాయి.

  • భానుప్రతాప్‌పూర్ మిచ్గొయాన్, కొన్ని ఇతర ప్రాంతాలలోని సోనా దేహి వద్ద బంగారు నిల్వలు కూడా కనిపెట్టబడ్డాయి. ప్రస్తుత కాలంలో జిల్లాలో కొన్ని బాక్సైట్ట్ ఆధారిత పరిశ్రమలు పనిచేస్తున్నాయి.

వృక్షజాలం

[మార్చు]

కాంకేర్‌ జిల్లాలో అరణ్యం అధికంగా పొడిగా ఉండే ఆకురాల్చే జాతికి చెందినది. కాంకేర్ జిల్లాలో సాల్, టీక్, మిశ్రిత అరణ్యాలు కనిపిస్తుంటాయి. జిల్లా తూర్పు భూభాగంలో సాల్ అరణ్యాలు కనిపిస్తుంటాయి. భానుప్రతాప్పూర్‌లో టీక్ అరణ్యాలు విరివిగా కనిపిస్తుంటాయి. మిగిలిన భూభాగంలో అత్యధికంగా మిశ్రిత అరణ్యాలు కనిపిస్తుంటాయి. మిశ్రిత అరణ్యాలలో ఔషధ మొక్కలు, సజా, తెండు, ధౌరా, బిజా, హర్రా, మహుయా వంటి ఆర్థిక ప్రయోజనాలు కలిగించే వృక్షాలు ఉన్నాయి.

సాంఘిక సాంస్కృతిక ఆచారాలు

[మార్చు]

జిల్లాలోని మొత్తం ప్రజలలో 50% గిరిజన జాతులకు చెంది ఉన్నారు. అందువలన కాంకేర్ జిల్లాలో గిరిజన జాతిల ఆధిక్యం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఇతర సంస్కృతులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

భాషలు

[మార్చు]

కాంకేర్ జిల్లాలో ప్రధానంగా హింది, చత్తీస్‌గఢీ, గొండి, హల్బి భాషలు వాడుకలో ఉన్నాయి. హల్బి కొతకాలం అధికార భాషగా ఉండి అన్ని రాజ్యకార్యక్రమాలు అన్ని హల్దీ భాషలో సాగాయి. హిందీలో నుండి జనించిందే హల్ది.

  • భత్రి భాష హల్దీ భాషలోని ప్రధానశాఖ. ఈ భాష సంస్కృతం, హిందీ, అరబిక్, ఫార్సీ మొదలైన భాషలలోని పలు పదాలు ఈ భాషలో వాడుకున్నారు.
  • బంగ్లా, తెలుగు, ఒరియా భాషలు కూడా జిలాలో ఆధిక్యతలో ఉన్నాయి. కాంకేర్ జిల్లాలో వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలలో ఈ భాష వాడుకలో ఉంది.

నాల్ రాజవంశంలో ప్రజలు 4 విభాగాలుగా (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర) ఉన్నారు. నాల్ రాజవంశం పతనం తరువాత వెలుపలి నుండి పలువురు ఈప్రాంతానికి వచ్చారు. ప్రధాన కులాల నుండి పలు ఉపకులాలు ఏర్పడ్డాయి. కాంకేర్, బస్తర్ రాజాస్థానాలలో దాదాపు 62 కులాలు ఉన్నాయి.

గిరిజన జాతులలో మరియా, మురియా, భత్రా జాతులు శాన్ భత్రా, పిత్ భత్రా, అమ్నిత్ భత్రా, అమ్నిత్ ఉన్నతవర్గాలకు చెంది ఉన్నారు. పర్జా, గద్వా, హల్బా, గండా, మహ్రా, చండై, ఘుర్వా, డోం, లోహర్, మత్రిగొండ్, రాజ్‌గొండ్, దొర్ల, నహర్, నయిక్‌పాడ్, కుదుక్, అంద్కుర్తి, కుమార్, కొస్త, చమర్, కెంవత్, ధకద్ ముఖ్యమైనవి. ఇతరంగా బ్రాహ్మణ, వైశ్య, కస్యప, తెలి, కలర్, క్షత్రియ, ధొబి, మరాఠి, మొహమ్మదిన్, పఠాన్, తెలంగ, ఒర్రియ, రొహిల్ల మొదలైనవి ప్రధానమైనవి. కాంకేర్ జిల్లాలో 50% గిరిజన ప్రజలు ఉన్నారు.అందువలన కాంకేర్ జిల్లాలో గిరిజన ఆధిక్యం అధికంగా ఉంటుంది. ఆధునిక యుగంలో గిరిజన సంస్కృతిలో కొంత ఆధునికత ప్రవేశించింది.

కుటుంబ నిర్మాణం

[మార్చు]

జిల్లాలో అన్ని కులాల ప్రజలు సాధారణంగా ఉమ్మడి కుటుంబంలో ఉంటారు. కుటుంబాలన్ని పురుషుల ఆధిక్యంతో నడుస్తుంటాయి. కుటుంబ పెద్ద ఆజ్ఞలను కుటుంబ సభ్యులందరూ పాటిస్తుంటారు. కుటుంబంలో వయసైన పురుషుడు ఆర్థికాధికారం కలిగి ఉంటాడు. ఆస్తిలో కుటుంబంలోని కుమారులందరికీ సమాన భాగం ఉంటుంది. కుమార్తెలకు ఆస్తిలో భాగం ఉండదు. గిరిజన ప్రజల్లో కుటుంబానికి స్త్రీలు ఆధిక్యత వహిస్తారు.

వివాహం

[మార్చు]
  • కాంకేర్‌లో అన్ని సంస్కృతులకు చెందిన ప్రజల వివాహవేడుకలు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నవే.
  • హల్బాలలో 2 వివాహ విధానాలు ఉంటాయి: క్లుప్తమైన వివాహాలు : సంపూర్ణ వివాహాలు.
  • భత్రాలలో 4 వివాహ విధానాలు ఉంటాయి : పెద్దలు కుదిర్చిన వివాహాలు, ప్రేమ వివాహాలు, విధవా వివాహాలు, ధారియా వివాహాలు.
  • మురియాలలో 3 వివాహ విధానాలు ఉంటాయి : పెద్దలు కుదిర్చిన వివాహాలు, ప్రేమ వివాహాలు, రాక్షస వివాహం.
  • గోండులందరిలో 3 వివాహ విధానాలు ఉంటాయి : పెద్దలు కుదిర్చిన వివాహాలు, ప్రేమ వివాహాలు, రాక్షస వివాహం.
  • గిరిజనప్రజలలో ఏ స్త్రీ అయినా కొత్తగా భర్తను ఎన్నిక చేసినందంటే కొత్త భర్త ఆమె పాత భర్తకు నష్టపరిహారం ఇవ్వలి. ఈ నష్టపరిహారం కుల పెద్ద చేత నిర్ణయించబడితుంది.
  • గిరిజన వివాహాలలో భర్తను కోల్పోయిన స్త్రీకి కూడా ముఖ్యత్వం ఉంటుంది. హ్లబాలలో కోల్పోయిన స్త్రీ అవివాహితుని చేసుకోకూడదు. గిరిజనులలో గోకుల్ అనే సంప్రదాయం ఉంది.
  • గోకుల్ అంటే గోండులు, మురియాల సంప్రదాయక కేంద్రం.

మరణ సంస్కారం

[మార్చు]

గిరిజన ప్రజల మద్య మరణ సంస్కారం వైవిధ్యంగా ఉంటుంది.

  • మరియా సంప్రదాయం : మరియా సంప్రదాయంలో మరణానంతరం శరీరాలను పూడ్చిపెట్టడం ఆచారం. గర్భవతులు మరణించినప్పుడు వారి శరీరాలు పూడ్చిపెట్టబడతాయి. 5 సంవత్సరాల లోపు పిల్లలు మరణించినప్పుడు వారి శరీరాలు మతుయా చెట్టు కింద తల తూర్పు వైపు ఉంచి పూడ్చి పెడతారు. మరణించిన వారి గుర్తుగా ఆప్రదేశం మీద చిన్న సమాధి కడతారు.
  • గోండు సంప్రదాయం : గోండు ప్రజలు మరణించిన వారి శరీరాలను కాళ్ళు దక్షిణం వైపు ఉండేలా పూడ్చి పెడతారు.
  • కొన్ని గిరిజన జాతులు మరణించిన వారి శరీరాలను పూడ్చిన ప్రదేశంలో ఒక కొయ్య స్తంభం పూడ్చిపెడతారు.

పండుగలు

[మార్చు]

కాంకేర్, బస్తర్ ప్రజలు మాదై పండుగను జరుపుకుంటారు. పూర్ణిమ రోజున మదై ఉత్సవంలో " కెషర్పాల్ కెషర్పాలిందేవికి జరిపే ఆరాధన, పూజలు నిర్వహించబడుతుంటాయి. జనవరిలో కాంకేర్ ప్రజలు, పరిసర ప్రాంతాలలో ఉన్న చరమ, కుర్నా ప్రాంతాలలో మాదై ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవం బస్తర్ ప్రాంతంలో ఫిబ్రవరి మాసంలో జరుపుకుంటారు. బస్తర్ ప్రజలు చెరి-చెర్- కిన్ దేవతకు ఈ ఉత్సవం జరుపుకుంటారు. ఫిబ్రవరి మాసం చివరలో ఈ ఉత్సవం అంతగర్‌, నారాయణపూర్, భానుప్రతాప్‌పూరు ప్రజలు జరిపుకుంటారు. మార్చి మాసంలో ఈ ఉత్సవాన్ని కొండగావ్, కెష్కల్, భోపాల్‌పట్టణం ప్రజలు జరుపుకుంటారు. ఇలా ఒకరి తరువాత ఒకరు జరుపుకునే ఈ ఉత్సవం దిసెంబర్ మాసంలో ఆరంభమై మార్చి బరకు కాంకేర్, బస్తర్, దంతేవాడ ప్రాంతాలలో జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో ఆయా ప్రాంతాలలో ఉన్న దేవుడు, దేవతకు ఆరాధన, పూజలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవం వేలాది భక్తులు కూడగలిగిన బహిరంగ ప్రదేశంలో ఆయాదేవతల సమక్షంలో నిర్వహించబడ్తుంది. అయాదేవతలకు ఆరాధన జరిగిన తరువాత ఉత్సవం మొదలౌతుంది. ఈ ఉత్సవంలో దుకాణాలు, ఆహారశాలలు, నృత్యాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయి.ఇది గిరిజనుల పండుగ అయినా ఈ ఉత్సవంలో సమాజంలో పాల్గొంటారు. జిల్లాలో అదనంగా మాతి-తియర్, గోబర్-బొహరాని, రామనవమి, నవకాని ఉత్సవాలు జరుపుకుంటారు. అలాగే భారతీయులు సాధారణంగా జరుపుకునే దసరా, దీపావళి, హోళి పండుగలను విశేషంగా జరుపుకుంటారు.

హస్తకళలు

[మార్చు]

కాంకేర్ గిరిజన ప్రజలు హస్తకళలలో నిపుణులు. వీరు హస్త కళాఖండాలలో వివిధ డిజైన్లు, ఆకారాలలో తయారుచేస్తారు. హస్త కళాఖండాలు కొయ్య శిల్పాలు, కంచు బొమ్మలు, టెర్రాకోటా బొమ్మలు, వెదురు బొమ్మలు మొదలైనవి ఉంటాయి. కాంకేర్ అరణ్యాలలో నాణ్యమైన కొయ్య లభించడం వలన చాలా ఆకర్ష్ణీయమైన శిల్పాలు, గృహోపకరణాలు తయారు చేయబడుతుంటాయి. నిపుణులైన గిరిజన ప్రజల చేతులతో తయారు చేయబడుతున్న ఈ కళాఖండాలు ప్రాంతీయు అభిమానమే కాక దేశీయ, అంతర్జతీయులు అభిమానం కూడా చూరగొంటుంది.

కొయ్య , వెదురు కళాఖండాలు

[మార్చు]

జిల్లాలో ప్రఖ్యాతమైనవి, అనదమైనవి అయిన కొయ్య శిల్పాకలు ప్రసిద్ధి. వీటిని ఇక్కడి గిరిజన ప్రజలు తయారు చేస్తుంటారు. ఈ బొమ్మలు చక్కని టేకు, వైట్ వుడ్‌లతో తయారు చేయబడతాయి. వుడెన్ కళాఖాండాలలో మోడెల్స్, విగ్రహాలు, కుడ్యాలంకరణలు, గృహాలంకరణ, ఉపయోగ వస్తువులు ఉంటాయి. వీటిని దేశంలోని నలుమూలలకు ఎగుమతి చేయడమే కాక విదేశాలలో కూడా వీటికి గిరాకీ అధికం. గిరిజనులు కూడా వెదురు కళాఖండాలను తయారు చెయ్యడంలో సిద్ధహస్థులు. వెదురు కళాఖండాలలో కుడ్య అలంకారాలు, టేబుల్ ల్యాంపులు, టేబుల్ మ్యాట్లు తయారుచేయబడుతుంటాయి.

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]

కాంకేర్ జిల్లాలోని పర్యాటక ఆకర్షణలు:- [9]

కాంకర్ ప్యాలెస్ [10]

[మార్చు]

ఈ ప్రాంతం రాజభవనం ఉన్నందున ప్రఖ్యాతి చెందింది. జిల్లాలో గిరిజన ప్రజలు, దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. 12వ శతాబ్దంలో ఈ ప్రాంతం మొత్తం రాజకుటుంబానికి స్వాధీనంలో ఉంది. 2002 వరకు రాజభవనంలో మహారాజాధిరాజ్ ఉదయ్ ప్రతాప్ దేవ్ నివసించాడు. ప్రస్తుతం ఈ భవనంలో కొంత భాగం హోటల్‌గా మార్చింది.

ది గడియా మౌంటెన్

[మార్చు]

కంద్రా సామ్రాజ్యం కాలంలో గడియా పర్వతం వెలుగులోకి వచ్చాయి. కంద్రా కింగ్ ధర్మదేవ్ కాంకేర్‌ను జయించిన తరువాత ఆయన గండియా పర్వతాన్ని తన రాజధానిగా ప్రకటించాడు. ఇది సహజసిద్ధమైన కోటగ ఉండడం అందుకు కారణం. ఈ పర్వతం మీద ఒక సరసు ఉంది. ఈ సరసు ఎప్పటికీ ఎండదు. ఎప్పుడూ నిండుగా ఉండే ఈ సరసులో ఒక భాగాన్ని సోనై మరొక భాగాన్ని రూపై అంటారు. వాస్తవానికి సోనై, రూపై అనేవారు కంద్రామాహారాజు ధర్మదేవ్ కుమార్తెలు. సరసు దక్షిణ ప్రాంతంలో చురుపాగర్ అనే ఒక గుహ ఉంది. ఈ గుహ ముఖద్వారం చాలా ఇరుకుగా ఉంటుంది. కోట మీద శత్రువులు దాడి చేసిన సమయంలో మహారాజు తన కుటుంబంతో ఇక్కడ సురక్షితంగా ఉండేవాడు. ఈ గుహలో ఏకకాలంలో 500 మంది నివసించవచ్చు. ఈ గుహ నుండి వెలుపలికి వెళ్ళాడానికి పశ్చిమ దిశలో ఒక ద్వారం ఉంది. గాడియా ఆగ్నేయభాగంలో మరొక 50 మీ పొడవైన గుహ ఉంది. పురాతన కాలంలో అనేకమంది మునులు ఇక్కడ తపమాచరించారు. ఈ గుహలో ఒక చిన్న మడుగు ఉంది. ఈ గుహనుడి ప్రవహించే నీరు జలపాతంలా కిందకు పడుతుందని భావిస్తున్నారు. గాడియా పాదాల వద్ద దూద్ నది ప్రవహిస్తుంది.

పురాణం

[మార్చు]

చాలాకాలం ముందు గాఢియా పర్వతం మీద ఒకరాజు నివసించేవాడు. అక్కడ ఒక సరసు ఉంది. ఆయనకు సోనై, రూపై అనే కుమార్తెలు ఇద్దరు ఉన్నారు. రాకుర్తెలు ఇరువురు ఆ సరసు వద్ద ఆడుకుంటూ సరసులో పడి మరణించారు. తరువాత ఈ సరసుకు సోనై రూపై అనే పేరు వచ్చింది. ఆసరసులో రెండు చేపలు ఉన్నాయని అందులో ఒకటి బంగారు వర్ణంలో మరొకటి రజిత వర్ణంలోనూ ఉంది. ఇవి రెండూ ఇప్పటికీ సజీవంగా ఉన్నాయని భావిస్తున్నారు. కాంకేర్ ప్రజలలో పలువురు వాటిని చూసామని చెప్తుంటారు. ఈ సరసులోని నీరు ఎప్పటికీ ఎండదని విశ్స్వసించబడుతుంది. పర్వతం మీద ఉన్న శీతలాదేవి ఆలయం వెనుక రెండు రాళ్ళు ఉన్నాయి. వాటి మద్య సన్నని మార్గం ఉంది. ఆమార్గం ద్వారా లోనికి ప్రవేశిస్తే లోపల 300 మంది కూర్చోవడానికి వీలుకలిగిన విశాలమైన ప్రాంగణం ఉంది. మహారాజు యుద్ధసమయాలలో విపత్కర సమయాలలో తన సైన్యంతో ఇక్కడ ఉండేవారని భావిస్తున్నారు.

మలాంఝ్‌కుడుం జలపాతం

[మార్చు]

మలాంఝ్‌కుడుం జలపాతాన్ని కాంకేర్ నగరానికి 15కి.మీ దూరంలో ఉన్న పర్వతంలోని నీలే గొండి వద్ద ప్రవహిస్తున్న దూద్ నది సృష్టించింది. దూద్ నది నీలే గొండి నుండి 10 కి.మీ ప్రవహించిన తరువాత మలాంఝ్‌కుడుం వద్ద 3 జలపాతాలను సృష్టించింది. జలపాతం వరుసగా ఎత్తు 10 మీ- 15 మీ - 9 మీ ఉంది. నిచ్చెనలా ప్రవహిస్తున్న ఈ జలపాతం ఆకర్షణీయంగా ఉంది. విహారానికి అనువైన ఈ ప్రదేశాన్ని రహదారి మార్గంలో సులువుగా చేర్చుకోవచ్చు.

చెర్రి- మెర్రి జలపాతం

[మార్చు]

ఈ సుందర జలపాతం కాంకేర్ జిల్లాలో ఉంది. ఈ జలపాతం కాంకేర్ జిల్లాలోని అంతగర్ బ్లాక్‌కు 17 కి.మీ దూరంలో ఉంది. అంతగర్ నుండి అమబెరా మార్గంలో చర్రె-మర్రే వద్ద ఉంది. ఈ జలపాతం 16 మీటర్ల ఎత్తునుండి కిందకు పడుతూ ఉంటుంది. మాత్లా లోయనుండి ప్రవహిస్తున్న జోగిదహరా నది ద్వారా ఈ జలపాతాన్ని సృష్టిస్తుంది.

షివాని ఆలయం

[మార్చు]

షివానీ ఆలయం కాంకేర్ నగరంలో ఉంది. ఈ ఆలయాన్ని షివానీమా ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రధాన మూర్తిగా షివానీ మా అద్భుతమైన మూర్తి దర్శనం ఇస్తుంది. పురాణకథనం అనుసరించి ఈ మూర్తి కాళీ, దుర్గ మాతల కలయిక అని తెలుస్తుంది. విగ్రహంలో సగం కాళీరూపం మిగిలిన సగం దుర్గా రూపం ఉంది. ఇలాంటి మూర్తులు ప్రపంచణ్లో రెండే ఉండగా ఒకటి కొలకత్తాలో మరికటి కాంకేర్‌లో ఉంది.

కొన్ని ప్రసిద్ధ ఆలయాలు

[మార్చు]
  • సంతోషి ఆలయం - సమీప కొత్త బస్ స్టాండ్
  • మా శీతలా దేవి ఆలయం - షితల్పరా
  • జగన్నాథ్ ఆలయం - రాజ్పరా
  • శివ్ దేవాలయం - అప్ డౌన్ రోడ్
  • హనుమాన్ ఆలయం - అప్ డౌన్ రోడ్
  • కృష్ణ టెంపుల్ - సమీప డైలీ మార్కెట్
  • బాలాజీ ఆలయం - రాజ్పరా
  • త్రిపుర సుందరి ఆలయం - నతియ నవ గావ్
  • శనిదేవుని దేవాలయం సమీపంలో రోజువారీ మార్కెట్
  • కంకలీన్ దేవాలయం దగ్గర ఎం.జి. వార్డ్
  • సాయి దేవాలయం దగ్గర శీతల్పరా

ఆకర్షణ ఇతర ప్రదేశాల్లో

[మార్చు]
  • పర్వతం మీద ట్యాంక్
  • కెష్కల్ ఘాట్
  • ఇషాన్ వాన్
  • భండారీ పారా ఆనకట్ట
  • అప్ డౌన్ రోడ్
  • ఖరకట్ట ఆనకట్ట
  • మనకెశ్రీ ఆనకట్ట

ఎడ్యుకేషన్

[మార్చు]
  • కేంద్రీయ విద్యాలయ కాంకేర్
  • సెయింట్. మైఖేల్ హయ్యర్ సెకండరీ స్కూల్
  • పారడైజ్ స్కూల్
  • మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్
  • నర్హర్దెవ్ స్కూల్
  • బృహస్పతి ప్రపంచ పబ్లిక్ స్కూల్
  • ఉషోదయ పబ్లిక్ స్కూల్
  • విత్తనాల ప్రభుత్వ పాఠశాల
  • ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల
  • ప్రభుత్వ బుహారీ ఉన్నత పాఠశాల
  • ప్రభుత్వ ఉన్నత పాఠశాల ( సింగర్భత్)

2 ప్రసిద్ధ కళాశాలలు:

  • భానుప్రతాప్‌దేవ్ కాలేజ్ (పేయింగ్ కళాశాల)
  • ఇందుకెవత్ ప్రభుత్వం గర్ల్స్ కాలేజ్

మూలాలు

[మార్చు]
  • Dr.Sanjay Alung-Chhattisgarh ki Riyaste/Princely stastes aur Jamindariyaa (Vaibhav Prakashan, Raipur1, ISBN 81-89244-96-5)
  • Dr.Sanjay Alung-Chhattisgarh ki Janjaatiyaa/Tribes aur Jatiyaa/Castes (Mansi publication, Delhi6, ISBN 978-81-89559-32-8)
  1. 1.0 1.1 1.2 http://planningonline.gov.in/data/report/DP2010-2011_381Merge.pdf[permanent dead link]
  2. http://rulers.org/indstat2.html
  3. "Kander District Website". Retrieved 2006-09-22.
  4. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Guyana 744,768
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Alaska 710,231
  8. "Resources and Economy". Archived from the original on 2006-11-15. Retrieved 2006-09-22.
  9. "Tourism". Archived from the original on 2012-10-08. Retrieved 2012-03-31.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-12. Retrieved 2014-07-20.

వెలుపలి లింకులు

[మార్చు]