కాగడా (వారపత్రిక)
| సంపాదకులు | తాపీ ధర్మారావు నాయుడు |
|---|---|
| వ్రాయసగాళ్ళు | సెట్టి ఈశ్వరరావు, తాపీ మోహనరావు |
| తరచుదనం | వార పత్రిక |
| ప్రచురణకర్త | తాపీ మోహనరావు నాయుడు |
| మొదటి సంచిక | జనవరి 10, 1940 |
| ఆఖరి సంచిక | 1942 |
| దేశం | భారతదేశం |
| కేంద్రస్థానం | మద్రాసు |
| భాష | తెలుగు |
కాగడా సచిత్ర వారపత్రిక 1940, జనవరి 10వ తేదీన తాపీ ధర్మారావు సంపాదకత్వంలో వెలువడింది. ఈ పత్రిక 16 పేజీలతో ప్రతి బుధవారం వెలువడేది. పత్రిక వెల ఒక అణా. వార్షిక చందా 4 రూపాయలు. ఈ పత్రిక కార్యాలయం 43, అచారప్పన్ వీధి, జార్జి టౌన్, మద్రాసులో ఉండేది. పత్రిక బి.ఎన్.కె. ప్రెస్‌లో అచ్చయ్యేది.
ఈ పత్రికను సమీక్షిస్తూ భారతి మాసపత్రిక "దేశవిదేశాల వార్తలతో, చట్పటీల వంటి వ్యాసాలతో, చక్కని కథలతో మరి అనేక సంగతులతో పత్రిక యావత్తూ ప్రకాశిస్తూ ఉంది" అని పేర్కొంది.[1]
చరిత్ర, నేపథ్యం
[మార్చు]ఈ పత్రిక ప్రారంభం అయ్యే సమయానికి రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. తాపీ ధర్మారావు ఈ పత్రికలో కమ్యూనిస్ట్ రాజకీయాలను, సోషలిస్ట్ రాజకీయాలను ప్రతిబింబించాడు. నవంబర్ 7 గురించిన వ్యాసం, సోషలిస్టు రాజ్యాల గురించి, రెడ్ ఆర్మీని కీర్తిస్తూ వ్యాసాలనూ, హిట్లర్ నాశనం కాంక్షిస్తూ చరిత్రలో రక్తముద్ర అనే వ్యాసాన్నీ ప్రచురించి ఈ పత్రిక ధోరణిని బయటపెట్టాడు.[2] ఈ పత్రిక స్త్రీ ఉద్యమాన్ని, విద్యార్థి ఉద్యమాన్ని, రైతు ఉద్యమాన్ని, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని బలపరిచింది. 1942లో మద్రాసులో బాంబులు పడటంతో ఈ పత్రికను నిలిపివేసి తాపీ ధర్మారావు చల్లపల్లికి వెళ్ళిపోయాడు.
రచనలు
[మార్చు]ఈ పత్రికలో ప్రచురితమైన కొన్ని రచనలు.
- తప్తాశ్రుకణం (నాటిక) - తాపీ ధర్మారావు నాయుడు - పునర్ముద్రణ[2]
- అవన్నియూ నీ కనులేనా? (నాటిక) - తాపీ ధర్మారావు నాయుడు - పునర్ముద్రణ[2]
- ఇనప కచ్చడాలు (వ్యాసాలు) - తాపీ ధర్మారావు నాయుడు
- పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు - తాపీ ధర్మారావు నాయుడు
శీర్షికలు
[మార్చు]- గాలివిసురు
- ఈ శీర్షికలో రాష్ట్రంలో నిత్యం జరుగుతున్న వాటిలో ముఖ్యాంశాలపై నిర్వాహకుల అభిప్రాయం ఉండేది. ఇవి చక్కని తెలుగులో వ్యంగ్యంగా, సూటిగా, విమర్శనాత్మకంగా ఉండేవి. దీనిని తాపీ ధర్మారావు నాయుడే తడాకా అనే మారుపేరుతో నిర్వహించేవాడు.
- పర్యాలోకనం
- ప్రపంచ రాజకీయ దృశ్యాలను సంపాదకుల దృష్టి నుండి సవిమర్శకంగా సమీక్షా రూపంలో పాఠకులకు అందించే శీర్షిక.
- యుద్ధం
- యుద్ధానికి సంబంధించిన వార్తలు
- యుద్ధశ్రవణం
- యుద్ధానికి సంబంధించిన విమర్శలు
- పిట్టచూపు
- భారతదేశ రాజకీయరంగాన్ని పాఠకులకు అందించేందుకు నిర్వహించిన శీర్షిక
- పద్యభిక్ష
- దేశంలోని ప్రజల జీవన స్థితిగతులను ఒక చిన్న గీతంలోకానీ, నాలుగు చరణాలలో కానీ పాఠకులు వ్రాసి పంపిన పద్యాలను ఈ శీర్షికలో ప్రచురించారు.
- పరాక్
- ఈ శీర్షికలో ప్రాచీన కవులు అప్పుడప్పుడూ చెప్పిన పద్యాలను, శ్లోకాలను తీసుకుని వాటికి సంక్షిప్త వ్యాఖ్యను ఈ శీర్షికలో చెప్పేవారు.
- మెదడుకు మేత
- ఈ శీర్షికలో అంతర్జాతీయ రచయితల భావాలను, సూక్తులను ప్రచురించారు.
- పెద్దల సుద్దులు పిన్నల పెన్నిధులు
- ఈ శీర్షికలో చలం, కృష్ణశాస్త్రి, గురజాడ, కుటుంబరావు, వీరేశలింగం, అబ్బూరి, పింగళి, కాటూరి, కట్టమంచి, ఇంద్రగంటి, వేదుల, రాయప్రోలు, బసవరాజు అప్పారావు, వేంకట పార్వతీశ కవులు మొదలైన తెలుగు రచయితలు అనేక విషయాలమీద అప్పుడప్పుడు తమ తమ రచనలలో వెలువరించిన అభిప్రాయాలను ప్రకటించేవారు.
- ఏమిటీ మాటలు
- జనం తరచూ వాడే నానుడులను, మాటలను (ససేమిరా, నందో రాజా భవిష్యతి వంటివి) ఇచ్చి వాటిని వివరించమని పాఠకులను అడిగే శీర్షిక.
రచయితలు
[మార్చు]ఈ పత్రికలో రచనలు చేసిన కొందరు రచయితలు: బి. సి. సింగరాచార్య, అడివి బాపిరాజు, భాగవతుల శంకరశాస్త్రి, తుమ్మల సీతారామమూర్తి చౌదరి, పన్యాల రంగనాథరావు, సముద్రాల, కొసరాజు రాఘవయ్య చౌదరి, శ్రీవాత్సవ, నార్ల చిరంజీవి, ఇనుమర్తి వీరభద్రరావు, చలసాని రామారాయ్, మధునాపంతుల వెంకట సూర్యనారాయణమూర్తి, చెన్నాప్రగడ తిరుపతిరావు, పులుపుల శివయ్య, చదలవాడ పిచ్చయ్య మొదలైనవారు.
మూలాలు
[మార్చు]- ↑ సంపాదకుడు (1 February 1940). "పత్రికా స్వీకారము - కాగడా". భారతి. 17 (2): 257. Retrieved 17 February 2025.
- ↑ 2.0 2.1 2.2 ఏటుకూరి ప్రసాద్ (1989). తాపీ ధర్మారావు జీవితం - రచనలు (1 ed.). హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. ISBN 81-7098-156-5. Retrieved 17 February 2025.