కాట్రగడ్డ బాలకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాట్రగడ్డ బాలకృష్ణ
జననం1906, సెప్టెంబర్ 26
గుంటూరు జిల్లా ఇంటూరు గ్రామము
మరణం1948, డిసెంబర్ 18
ప్రసిద్ధికమ్యూనిస్ట్ సిద్దాంత తత్వవేత్త
తల్లిదండ్రులుకాట్రగడ్డ కోటయ్య, లక్ష్మీదేవమ్మ దంపతులకు

కాట్రగడ్డ బాలకృష్ణ (1906- 1948) కమ్యూనిస్ట్ సిద్దాంత తత్వవేత్త. మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి పరిశోధనాత్మక రచనలు చేసిన ఒక అసాధారణ మేధావి. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని, జైలుకు వెళ్ళిన మానవతావాది. స్వాతంత్ర్య యోధుడు.

జననం, విద్య[మార్చు]

కాట్రగడ్డ బాలకృష్ణ గుంటూరు జిల్లా ఇంటూరు గ్రామములో కోటయ్య, లక్ష్మీదేవమ్మ దంపతులకు సెప్టెంబర్ 26, 1906 న జన్మించాడు.[1] ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరులో జరిగింది. తరువాత బాపట్ల బోర్డు పాఠశాలలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. మద్రాసు వెళ్ళి 1921లో వెస్లీ కళాశాలలో చదువు పూర్తి చేశాడు. విద్యార్థి సంఘముల కార్యకలాపాలలో విశేష శ్రద్ధ చూపించాడు. బ్రిటన్ వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చేరారు. ఏకాగ్రత కుదరకపోవడంతో అమెరికా వెళ్ళి హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రం అధ్యయనం చేసారు.[2] వరుసగా ఈ విశ్వవిద్యాలయంలో రెండు సార్లు ఫెలోషిప్ పొందిన తొలి భారతీయుడుగా గుర్తింపు పొందారు.[3] రూపర్ట్ ఎమర్సన్ వద్ద పిహెచ్.డి. (1932-37) చేశారు. ఎమర్సన్ ఆసియా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలవారు.బాలకృష్ణ స్థానికంగా బోస్టన్ లో విద్యార్థి సంఘాల సమావేశాల్లో పాల్గొని, 1933 నుండి బోస్టన్ రచయితల సంఘానికి అధ్యక్షుడుగా పనిచేసాడు. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి వారికి వివరించేవాడు. బ్రిటీషు వారి సామ్రాజ్య వాదాన్ని తీవ్రంగా విమర్శించేవాడు.

ద్రావిడ సాహిత్యంలో రాజకీయాల గురించి బాగా అధ్యయనం చేశారు. భారత జాతీయవాదాన్ని కూలంకషంగా పరిశీలించారు.బౌద్ధ సాహిత్యంలో రాజకీయ సామాజిక విషయాలను లోతుగా అవగాహన చేసుకున్నాడు. పిహెచ్.డి. పూర్తి చేసిన తరువాత 1937లో ఇండియాకు తిరిగి వచ్చి బ్రిటిష్ వ్యతిరేక కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నారు.

స్వాతంత్ర పోరాటం[మార్చు]

1939 సెప్టెంబర్ లో చిదంబరంలో జరిగిన విద్యార్థి సమావేశములో పతాక ఆవిష్కరణ చేశాడు. 1941 జనవరిలో తమిళనాట పాల్ఘాట్, కొయంబత్తూరు లలో జరిగిన విద్యార్థి సమావేశాలలో పాల్గొని, దేశ స్వాతంత్ర్య సమరానికి సమాయత్తము కావల్సిందిగా ప్రబోధించాడు. బాలకృష్ణ కార్యకలాపాలు నచ్చని బ్రిటిష్ ప్రభుత్వం 1941 మార్చి 3న అరెస్ట్ చేసి వెల్లూరు కారాగారంలో నిర్బంధించింది. జైళ్ళలో కాంగ్రెస్, సోషలిస్టు పార్టీలవారుండేవారు. కె.బి.కృష్ణ జైళ్ళలో రాజకీయ పాఠశాలలు పెట్టి డిటెన్యూలకు పాఠాలు చెప్పేవాడు.

రచనలు[మార్చు]

మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి బోధించేవాడు. 64 మౌలిక పరిశోధనాత్మక రచనలు చేసి Father of Marxist Ideology గా పరిగణించబడ్డాడు. భౌతికవాదం పాశ్చాత్యదేశాలనుండి చేసుకున్న దిగుమతి కాదనీ, భారతీయ భావనా సంప్రదాయములో ఒక ముఖ్య భాగమనీ Hindu Materialism అనే పుస్తకములో వ్రాశాడు. 1941 జూన్ 21న హిట్లర్ సోవియట్ యూనియన్ పై దాడిచేసిన తరువాత యుద్ధరీతిలో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ 300 పుటల బృహత్ గ్రంథాన్ని పది రోజులలో రచించాడు. 1942 జూన్ 24న జైలు నుండి విడుదలైన తరువాత బెల్గాం విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రం బోధించాడు. తరువాత బొంబాయిలోని అఖిల భారత పరిశ్రమల సంస్థలోనూ, లక్నో విశ్వవిద్యాలయం, టాటా సాంఘిక సంస్థలలోనూ పనిచేసి అచట ఇమడలేక మానేశాడు. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఫెలోషిప్ తో రెండు సంవత్సరాలు అమెరికాలో పనిచేశాడు. తిరిగి వచ్చిన తరువాత గ్రంథ రచన చేబట్టి అనేక పుస్తకాలు రచించాడు.హిందూ ముస్లిం సమస్యలపై, అల్పసంఖ్యాకుల విషయాలపై అతను రచనలు యునెస్కోవారు ఉత్తమమైనవిగా స్వీకరించారు.

ఆంగ్ల రచనలు[మార్చు]

  • Theories of kingship in ancient India,
  • The Problem of Minorities; or, Communal representation in India
  • The Second World War and Industrialization in India
  • Political Thought in Dravidian Literature
  • Class and Class Struggle
  • Economic Planning in India

మరణం[మార్చు]

ఆరోగ్యం క్షీణించి 42వ ఏట 1948, డిసెంబరు 18 న పొన్నూరులో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట. 183
  2. Stoddart, Brian (2014-03-14). Land, Water, Language and Politics in Andhra: Regional Evolution in India Since 1850 (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-317-80974-6.
  3. ఆంధ్ర శాస్త్రవేత్తలు (krishnaveni publishers,vijayawada ed.). శ్రి వాసవ్య. 1 August 2011. p. 407.