కాతంత్ర వ్యాకరణము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాణిని రచించిన గ్రంథము అష్టాధ్యాయి. శబ్ద శాస్త్రమును సూత్ర రూపమున బోధించి కృతకృత్యుడయిన వారిలో ఈతడే ఉత్తమోత్తముడు. వ్రాసినవి నాలుగువేల సూత్రాలు. వానికి అనుకూలపడుటకు, అధికారము లనియు అనువృత్తు లనియు మరికొన్నిటిని స్వీకరించెను. అష్టాధ్యాయికి పిదప వైయాకరణులు అనేకులు పాణినీయ తంత్రమునకు వ్యాఖ్యానాలు రచించారు. అష్టాధ్యాయిలో సూత్రాలను ఉన్నవి ఉన్నట్టు ఉంచి ఆ క్రమమున వ్యాఖ్యానములొనర్చినవారు కొందరు. విషయమంతకు ఒకవిధముగ ప్రణాళిక ఏర్పరచుకొని తదనుకూలముగ శీర్షికలను గావించి చక్కగా బోధించువారు కొందరు. ఇటువంటి వ్యాకరణములలో ఒకటి ఈ కాతంత్ర వ్యాకరణము. ఇది చాలా విభిన్న మతములకు సరిపోవునట్లు ఉంది. కౌమార వ్యాకరణమని దీనికి పేరు. ఇందు తెలుపబడిన వర్ణ క్రమము తెలుగు వర్ణక్రమముతో సరిపోవుచున్నది. విషయ క్రమమున భట్టోజీ కౌముదీకి సరిపడును. వైదిక ప్రక్రియాదులు లేవు. 887 సూత్రాలు ఉన్నాయి. ఈ వ్యాకృతికి హెచ్చు ప్రచారము కలదు. పూర్వ వ్యాకరణములన్నియు పండితుల కొరకు వ్రాయగా దీనిని సామాన్యులను ఉద్దేశించి వ్రాయబడినది. దీనికి 17, 19వ శతాబ్దములలో పెక్కు వ్యాఖ్యానములు వ్రాయబడినవి.

కాతంత్ర రచనకు మూల భూతమైన కథ

[మార్చు]

కాతంత్ర రచనకు మూల భూతమైన కథ బృహత్కథలోనూ, కథా సరిత్సాగరం లోనూ ఇలా ఉంది: పూర్వం ప్రతిష్థానపురం (నేటి పైఠన్) ఆంధ్ర దేశానికి రాజధానిగా ఉండేది. దానికి రాజు దీపకర్ణి. అతనికి సంతానం లేదు. ఆతని భార్య శక్తిమతి పాము కరిచి చనిపోయింది. రాజు ఆమెయందే మనసు నిలిపి బ్రహ్మచర్యం అవలంబించాడు. కాని తన సంతానహీనతకు ఆతడెంతో సంతాపం పొందుతుండేవాడు. ఒకనాటి రాత్రి కలలో శివుడు కనబడి "అడవిలో సింహం మీద ఎక్కి తిరుతుండే బాలుడు కనబడుతాడు. సింహాన్ని చంపి వాణ్ణి తెచ్చి పెంచుకో. అలాగే దీపకర్ణి ఒకనాడు వేటకు వెళ్ళగా ఒక పద్మసరస్తీరంలో ఒక బాలకుణ్ణి వహించికొని వచ్చిన సింహం కనబడింది. అది బాలుణ్ణి దింపి నీరు తాగడానికి కొలనిలోనికి దిగుతున్నది. దీపకర్ణి ఒక్క బాణంతో దాన్ని కొట్టాడు. అప్పుడా సింహం ఒక యక్షుడిగా మారి రాజుతో నేను సాతుడనే యక్షుడను కుబేరుణ్ణి మిత్రుడిని. గంగానదిలో స్నానం చేస్తున్న ఒక ఋషికన్యకను చూసి మోహించాను. ఆమె నన్ను మోహించింది. ఇద్దరం గాంధర్వ వివాహం చేసుకున్నాము. ఆమె బంధువు లీసంగతి తెలుసుకొని కామచారులైన మీరిద్దరూ సింహాలు కండి అని శపించారు. ఈ బాలుడు మాకుమారుడు- వీని జన్మతో ఆమె శాపం తీరిపూయింది. వీడు పరాక్రమవంతుడు. నీవంశం నిలుపుతాడు. తీసుకువెళ్ళి పెంచుకో" అని చెప్పి తనదారిని తానుపోయాడు.మహా తేజస్వియైన ఆబాలుణ్ణి తీసుకువెళ్ళి దీపకర్ణి అలారుముద్దుగా పెంచుకున్నాడు.క్రమంగా ఆబాలుడు దినదిన ప్రవర్ధమానుడై మహాపరాక్రమవంతుడని పేరుపొందాడు.సాతునిచేత వహింప బడనివాడగుటచేత అతడు శాతవాహననామంతో ప్రసిద్ధుడైనాడు.

కొంతకాలానికి దీపకర్ణి శాతవాహనుడికి రాజ్యం అప్పజెప్పి వానప్రస్థుడైనాడు. నిజపరాక్ర మాతిశాయం చేత శాతవాహనుడు సార్వభౌముడై అనేక విలాసినీ రతుడై కాలం గడుపుతున్నాడు. వసంతోత్సవ సమయంలో ఒకనాడు శాతవాహనుడు భార్యలతో జలకేళి పలుపుతున్నాడు. శిరీష కుసుమ కుమరాంగియైన ఒక రాణి అలసిపోయి, హెచ్చుగా నీళ్ళు జల్లుతున్న రాజుతో సంస్కృతంలో "దేవ మా మోదకై స్తాడయ " అని వేడుకుంది. రాజు సంస్కృత భాషాభిజ్ఞడు కాకపోవడం చేత "మా+ఉదకైః" అనే సంధిగతార్ధం గ్రహించలేక మోదకములనే మాటమాత్రం గ్రహించి వెంటనే పరికారులచేత గంపెడు మోదకాలు తెప్పించాడు. అని చూసి ఆరాణి "నీళ్ళతో కొట్టవద్దంటే మోదకాలు తెప్పించావేమిటి? ఇంతమాత్రం సంస్కృతం తెలియదా నీకు?" అని గేలిచేసింది. రాణులంతా గొల్లున నవ్వారు, సేవకులంతా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. శాతవాహన సార్వభౌముడు అవమానంతో క్రుంగిపోయాడు.

ఇంతకాలం తాను పరాక్రమపరాయుణుడై సంస్కృతం నేర్చుకోనందువల్లకదా ఇంత అవమానం ఒక స్త్రీ చేతిలో కలిగింది. ఈ వయస్సులో తనకు సంస్కృతం ఎలా అబ్బుతుంది? ఈ అవమానం ఎలా భరిస్తాను? ఈవిధమైన ఆలోచనలతో క్రుంగిపోతూ రాచకార్యాలు మాని మందిరంలోంచి బయటకు రాకుండా బాధపడుతున్నాడు శాతవాహనుడు.

శాతవాహనుడి మంత్రులు సర్వవర్మ, గుణాఢ్యుడూను. వాళ్ళు రాజుగారి ఆంతర్యం తెలుసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళి ఎంతో ప్రాధేయ పడ్డారు. తుదకు విషయం తెలుసుకొని ఓస్ ఇంతేనా, మీరు బెంగపడకండి. నేను మిమ్మల్ని ఆరేళ్ళలో సంస్కృత వ్యాకరణ పారంగతులుగా చేస్తాను. నిజానికది పన్నెండేళ్ళ నిరంత రాధ్యయనం వల్ల గాని సాధ్యపడేది కాదు. కాని నేను ప్రయత్నించి మీకు 6 ఏళ్ళ వ్యవధిలో నేర్పుతాను. భాషకు ముఖ్యం వ్యాకరణం. అది సాధించిన తరువాత భాషలో మీరు సాధించలేనిది ఉండదు. విచారం వీడి రాచకార్య ప్రవర్తులు కండి అని గుణాఢ్యుడు రాజును ఓదార్చాడు. అది విని సర్వవర్మ "సుఖోచితుడైన సార్వభౌముడు అంతకాలం ఎలా క్లేశ మనుభవించ గలడు? అలా కాదు నేను అప్పటి వరకూ అసంభావ్యమైన ఈ ప్రతిజ్ఞ విని గుణాఢ్యుడు పౌరుషంతో "ఆరు నెలల్లో నీవు రాజుగారికి వ్యాకరణం నేర్పగలిగితే నేను సంస్కృతం, ప్రాకృతం, దేశభాషా వదిలిపెట్టేస్తాను" అన్నాడు. సర్వవర్మ పట్టుదలతో "నేను గనుక చెప్పినట్టు చెయ్యలేకపోతె పన్నెండేళ్ళు నీ పాదుకలు శిరస్సుతో మోస్తాను" అని బదులు పలికాడు. సర్వవర్మ అందరిదృష్టిలోను అసంభావ్యమైన పనికిపూనుకున్నాడని అంతా నవ్వుకొన్నారు.

సర్వవర్మ ఇంటికివెళ్ళి తన ప్రతిజ్ఞ భార్యకు వినిపించగా ఆమె కుమారస్వామిని ఆరాధిస్తే కాని దేముంది? అని ధైర్యం పలుకుతుంది. సర్వవర్మ నిరాహారుడై తపస్సు చేసి కుమారస్వామిని ఆరాధించాడు. కుమారస్వామి ప్రత్యక్షమై నీ సంకల్పం సిద్ధిస్తుంది అని అభయమిచ్చి "సిద్ధో వర్ణ సమామ్నాయః" అనే సూత్రం చెప్పాడు. స్వామి దర్శనంతో సరస్వతి సర్వవర్మ ముఖంలో ప్రవేశించింది. మొదటి సూత్రం వినగానే సర్వవర్మ మానన చాపల్యం చేత తరువాత సూత్రాలు ఊహించుకొని " తత్ర చతుర్ధ శాజౌ స్వరాః దశ సమానాః..." అని వరుసగా చెప్పుకోపోయాడు.అప్పుడు కుమారస్వామి నేను చెప్పేదాని కడ్డువచ్చి నీవు చెప్పకుండా వుంటే ఈవ్యాకరణం పాణినీయ వ్యాకరణానికి ఉపమర్దకమై ఉండేది. ఇప్పుడిది లఘుశాస్త్రం మాత్రమే అయింది. అయినా నీకోరిక ప్రకారం శాతవాహనుడికి ప్రయోగవిజ్ఞానం కలిగించగలవు. అతడూ సామాన్యుడు కాడు. పూర్వజన్మలో భరద్వాజ శిష్యుడు మహాతపస్వీ అయిన కృష్ణుడనే ఋషి కుమారుడు. అతడు సులభంగానే విద్య అవలంబించుకో గలడన్నాడు. సర్వవర్మ ఈ సూత్రాలు కుమారస్వామి వాహనమైన నెమలి ఈకలమీద వ్రాసుకొన్నాడు. అందుచేత ఈ వ్యాకరణానికి ''' కలాపర్యారకము ''' అను పేరువచ్చింది. ఇది బృహత్తంత్రం కాక లఘుతంత్రం కావటంచేత దీనికి కాతంత్ర వ్యాకరణమనే పేరు వచ్చింది.

సర్వవర్మ ప్రతిజ్ఞానుసారంగా 6 మాసాలలోనే శాతవాహనుడిని సంస్కృత వ్యాకరణంలో ప్రజ్ఞ కలవానిగా చేశాడు.ఒకనాడు శాతవాహనుడు కొలువు తీరి ఉండగా ఒక బ్రాహ్మణుడు తాను రచించిన శ్లోకమొకటి చదివాడు. రాజు స్వయంగా సంస్కృతంలో వ్యాఖ్యానించి స్వారస్యం వివరించాడు. అంతా మిక్కిలి సంతోషించారు. గుణాఢ్యుడు భాషాత్రయం త్యజించి మౌనియై అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడ పిశాచ భాష నేర్చుకొని మౌనం త్యజించి ఆ భాషలోనే బృహత్కథ రచించాడు.

ఈ కథలో సత్యాసత్యాలెలా వున్నా పాణినీయం అభ్యసించటం క్లేశకరంగా ఉందని భావించబడిందనీ, ఆ క్లేశాన్ని తొలగించి సులభంగా వ్యాకరణం నేర్పటానికి ప్రయత్నం జరిగిందనీ దీని ఫల స్వరూపమే కాతంత్రవ్యాకరణం అని విశదమౌతున్నది. పాణినీయం నేర్చుకోవడానికి 12 ఏళ్ళు పడుతుందనీ, కొదరు బుద్ధిమంతులు 6 ఏళ్ళలో నేర్చుకోగలరనీ తెలుస్తుంది.

ఈ కథలో పేర్కొనబడిన శాతవాహనుడే ఆంధ్ర శాతవాహనులు వంశానికి మూలపురుషుడని ప్రసిద్ధి. ఈ వంశంలోని వాడైన సిముకుడు మగధ సామ్రాజ్యాన్ని జయించాడు.(క్రీ.పూ. 230) శాతవాహనుల కాలం కొన్ని ఉపపత్తులను బట్టి క్రీ.పూ.సుమారు 450 ప్రాంతమని చెప్పవచ్చును.

మూలాలు

[మార్చు]

1. భారతి మాస సంచిక.