కామద ఏకాదశి
| కామద ఏకాదశి | |
|---|---|
కామద ఏకాదశి రోజున కృష్ణుడిని పూజిస్తారు | |
| జరుపుకొనేవారు | హిందువులు |
| రకం | హిందూ |
| ప్రాముఖ్యత | ఉపవాస దినం |
| వేడుకలు | ప్రార్థనలు, మతపరమైన ఆచారాలు, విష్ణువు అవతారమైన కృష్ణుడికి పూజ చేయుట |
కామద ఏకాదశి (कामदा एकादशी)[1] అనేది హిందూ పండుగ. ఇది హిందూ మాసం చైత్రం (మార్చి-ఏప్రిల్) శుక్ల పక్షంలోని 11వ చంద్ర రోజున (ఏకాదశి) వస్తుంది. హిందూ చాంద్రమాన నూతన సంవత్సరం చైత్ర నవరాత్రి తర్వాత వచ్చే మొదటి ఏకాదశి ఇది. పేరుకు తగ్గట్టుగానే భక్తుల కోరికలన్నీ ఈ రోజున నెరవేరుతాయని విశ్వసిస్తారు.[2]
పురాణ కథ
[మార్చు]కామద ఏకాదశి గురించిన పురాణ కథను వశిష్ఠ మహాముని దిలీప మహారాజుకు చెప్పినట్లుగా, వరాహ పురాణంలో పాండవ రాజు యుధిష్ఠిరుడికి కృష్ణుడు వివరించాడు. ఒకప్పుడు రత్నపురం అనే నగరంలో లలిత్, అతని భార్య లలిత అనే యువ గంధర్వ జంట నివసించేవారు. బంగారం, వెండితో అలంకరించబడిన అత్యంత సంపన్నమైన ఈ నగరాన్ని పుండరీక రాజు పాలించాడు. లలిత్ ప్రముఖ గాయకుడు కాగా లలిత రాజ దర్బారులో ప్రసిద్ధ నర్తకి. ఒకరోజు రాజ దర్బారులో లలిత్ పాడుతున్నప్పుడు, దర్బారులో లేని తన భార్యపైకి అతని దృష్టి మళ్లింది. ఫలితంగా అతను పాట లయను తప్పి తన ప్రదర్శనను తప్పుగా ముగించాడు. పాతాళ ప్రాంతానికి చెందిన కర్కోటక అనే నాగుడికి ఈ పరిస్థితికి కారణం తెలిసి రాజుకు ఫిర్యాదు చేశాడు. లలిత్ తన యజమాని అయిన రాజు కంటే తన భార్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని చెప్పాడు. కోపంతో పుండరీక రాజు లలిత్‌ను అరవై నాలుగు మైళ్ల ఎత్తు ఉండే క్రూరమైన నరభక్షకుడిగా మారాలని శపించాడు. అతని మెడ పర్వతంలా, చేతులు ఎనిమిది మైళ్ల పొడవు, నోరు భారీ గుహ పరిమాణంలో మారాయి. పాపకార్యాలకు పాల్పడే తన రాక్షస భర్తతో కలిసి అడవుల్లో తిరుగుతున్న లలితకు ఇది ఎంతో బాధ కలిగించింది.[3]
వింధ్యాచల పర్వతాల చుట్టూ తిరుగుతుండగా లలితకు శృంగి మహాముని కనిపించాడు. మహామునికి నమస్కరించి తన సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంది. ఆమె భర్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి కామద ఏకాదశి వ్రతం ఆచరించాలని శృంగి మహాముని ఆమెకు చెప్పాడు. లలిత ఎంతో భక్తితో ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించి మరుసటి రోజు మళ్ళీ ఆ మహామునిని సందర్శించి కృష్ణుడికి నమస్కరించింది. ఉపవాసం ద్వారా పొందిన పుణ్య ఫలంగా తన భర్తను రాజు శాపం నుండి విముక్తుడిని చేయాలని ఆమె కృష్ణుడిని అభ్యర్థించింది. కృష్ణుడి ఆశీర్వాదంతో లలిత్ తన అసలు గంధర్వ రూపాన్ని తిరిగి పొందాడు. ఆ తర్వాత వారిని దివ్య విమానంలో స్వర్గానికి తీసుకెళ్లారు.[4][2]
ఆచారాలు
[మార్చు]కామద ఏకాదశి ఉదయం స్నానం ఆచరించిన తర్వాత భక్తులు ఉపవాసం ఉంటారు. సమీపంలోని ఆలయంలో విష్ణువు రూపమైన కృష్ణుడికి పూజలు చేస్తారు.[2][5]
ఈ వ్రతం ద్వారా పొందే పుణ్యం అన్ని కోరికలను తీరుస్తుందని, చేసిన అత్యంత హేయమైన పాపాన్ని కూడా ప్రక్షాళన చేస్తుందని, భక్తుడిని లేదా అతని కుటుంబ సభ్యులను శాపాల నుండి విముక్తులను చేస్తుందని నమ్ముతారు.[2][4]
మూలాలు
[మార్చు]- ↑ www.wisdomlib.org (2009-04-12). "Kamada, Kāmada, Kāmadā, Kama-da: 22 definitions". www.wisdomlib.org (in ఇంగ్లీష్). Retrieved 2022-11-13.
- 1 2 3 4 Melton 2011, p. 490.
- ↑ "Kamada Ekadashi 2025 కామద ఏకాదశి విశిష్టతలేంటి.. శుభ ముహుర్తం, పూజా విధానం గురించి తెలుసుకోండి..." Samayam Telugu. Retrieved 2026-05-15.
- 1 2 "Kamada Ekadasii". ISKCON. Archived from the original on 7 February 2013. Retrieved 24 November 2012.
- ↑ Dwivedi 2006, p. 148.
గ్రంథ పట్టిక
[మార్చు]- Lochtefeld, James G. (2002). The Illustrated Encyclopedia of Hinduism: A-M. ABC-CLIO. ISBN 9781598842050. Retrieved 22 November 2012.
- Melton, J. Gordon (2011), Religious Celebrations: An Encyclopedia of Holidays, Festivals, Solemn Observances, and Spiritual Commemorations, ABC-CLIO, ISBN 9781598842050, retrieved 24 November 2012
- Dwivedi, Dr. Bhojraj Dwivedi (2006), Religious Basis Of Hindu Beliefs, Diamond Pocket Books (P) Ltd, ISBN 9788128812392, retrieved 24 November 2012