కాముని పౌర్ణమి నాటి ఉత్సవాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామీణ ప్రజలకు కాముని పౌర్ణమి అనందదాయకమైన పండుగ. వెన్నెల రాత్రులలో గుంపులు గుంపులుగా పౌర్ణమి ఇంకామూడు రోజులుందనగానే ఈ వినోద కార్యక్రమాలు ప్రారంభ మౌతాయి. కాముని పున్నమి ఒక్క తెలంగాణా లోనే కాక భారత దేశమంతటా, ముఖ్యంగా ఉత్తర హిందూస్థానంలో హోళీ పండుగ రూపంలో జరుగుతుంది. వరుసా వావీ లేకుండా ఒకరి మీద మరొకరు వసంతాలు విరజిమ్ముకుంటూ, ఒడలు మరచి తన్యయత్వంలో ఈ వినోదాలను జరుపుకుంటారు. కులభేదాలు, వైషమ్యాలూ, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భేద భావం లేకుండా ఈ వినోదాలు ఎంతో అన్యోన్యంగా సాగుతాయి. ఆంధ్ర దేశంలో ఈ వసంతాలు ముఖ్యంగా వివాహానంతరం కంకణాలు విప్పే రోజున ఏంతో ఉల్లాసంగా జరుగుతాయి.

ఊరంతా వసంత వేడుకలు[మార్చు]

పెద్ద పెద్ద దేవాలయ క్షేత్రాలలోనూ, పల్లెల్లో దేవాలయ కళ్యాణోత్సవాలలో ముఖ్యంగా సీతా కళ్యాణ సమయంలో బండ్ల మీద పెద్ద పెద్ద గంగాళాలలో రంగు రంగుల నీళ్ళతో నింపి, మేళ తాళాలతో ఉత్సవంగా బయలుదేరి వీధుల్లో కనిపించిన వారందరి మీదా వసంతాలు జల్లేవారు. అంతేకాదు, తలుపులు మూసుకుని ఇళ్ళలో వున్న వారిని కూడా ఇళ్ళలో జొరబడి స్త్రీ పురుష భేదం లేకుండా అందర్నీ వసంతంతో ముంచి వేసేవారు. ఈ సందర్భంలో కొంత మంది మీద గులామునూ, పిడకలనూ, కప్పలనూ, మామిడి టెంకలనూ దండలుగా కట్టి మెడలో వేసేవారు. ఇలా వూరంతా మేళ తాళాలాతో వినోదాలతో పిన్నలు పెద్దలు కలిసి ఆటలతో పాటలతో సంతోషంగా ఈ వసంతోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండువుగా నిర్వహించేవారు. ఊరి వారందరినీ ఇలా రంగుల వసంతంతో ముంచినప్పుడు స్త్రీలు గానీ, పురుషులు గానీ ఎవరూ కోపగించుకునే వారు కారు. అదొక పవిత్ర కార్యంగా భావించేవారు. దానిని ఒక పవిత్ర వుత్సవంగా సంతోషంగా ఆమోదించే వారు. ఈ వసంతోత్సవాలు కులమతాలకు అతీతంగా ధనిక పేద ఐక్యతకు చిహ్నంగా, అరమరికలు లేకుండా బ్రతికే గ్రామ ప్రజల జీవితాలకు దర్పణగా జరిగేవి.

కోలాటాల కోలాహం[మార్చు]

కాముని పున్నమి సందర్భంలో తెలంగాణా అంతటా జరగక పోయినా ముఖ్యంగా హైదరాబాదు, సికిందరాబాదు, వరంగల్లు మొదలైన నగరాలలో వసంతాలు జరుగుతూ వుంటాయి. పల్లె ప్రాంతాలలో రకరకాల వినోదాలతో ఆట పాటలతో ఈ వుత్సవాలు జరుగుతాయి. కాముని పున్నమి సందర్భంలో వెన్నెల పాటలు, అల్లో నేరేళ్ళు, కోలాటపు పాటల్నీ, జాజర పాటల్నీ స్త్రీలు పాడుతూ వుంటే పురుషులు కోలాటాల్ని ప్రదర్శించే వారు. ఈ కోలాటాన్ని స్త్రీలు, పురుషులూ ప్రదర్శించినా పురుషుల కోలాటం వుధృతంగా వుంటే స్త్రీల కోలాటం లాలిత్యంగా వుంటుంది. కోలాటపు చిరుతల్ని కోల లంటారు. ఒక్కొక్కరూ రెండేసి చిరుతల్ని రెండు చేతులా ధరించి ఒకరి కొకరు లయ ప్రకారం అడుగుల ననుసరించి ఆయా పాటల గమకాల మేరకు ఒకడు ప్రధానుడై పాట పాడితే మిగతా బృందం వారందరూ అతనిని అనుసరిస్తారు. ఆంధ్ర దేశంలో కోలాటాల ప్రభావం ఎంత ఎక్కువగా వుందో తెలంగాణా అంతటా కూడా అంత ప్రచారంలో ఉన్నాయి. కోలాటపు పాటలు ఎక్కువగా సంవాదం రూపంలోనూ, శృంగారరస ప్రధానాలుగాను వుంటాయి. మరి కొన్ని పచ్చి శృంగారంతొ నిండి వుంటాయి. స్త్రీల కోలాటపు పాటల్లో గోపికలు, చిలిపి కృష్ణుని దుందుడుకు చేష్టలకు సంబంధించి వుంటాయి. కోలాటాన్ని గూర్చి కోలాటం శీర్షికలో వివరంగా చర్చించ బడింది.

ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమితిథినాడు కాముని పున్నమి పండుగ జరుపుకొనే సంప్రదాయం భారతదేశం అంతటా ఉంది. ఐతే ఉత్తరాది రాష్ట్రాలలో ఈ పండుగ రంగుల పండుగగా జరుపుకొంటారు. దీనినే హోలీ / హోళీ పండుగ అని వ్యవహరిస్తారు. హోళిక ఒక రాక్షసిపేరు (మానీర్‌ మానీర్‌ - విలియమ్స్‌ సంస్కృత నిఘంటువు) ఆమె పేరుతో ఈ పండుగను జరుపుకోవడం వింత అనిపిస్తుంది. డుంఢ అనే రాక్షసి పిల్లలను పీడిస్తుందనీ ఆమెను హోళిక హతమార్చి పిల్లలను కాపాడినదని ఒక కథనం ఉంది. పరమశివుడు మన్మథుడిని దహనం చేసిన రోజు కనుక కాముని పున్నమి అన్నారని మరొక కథనం ఉంది. వీథుల కూడలిలలో ఎండిన కొమ్మలను, మొద్దులను వేసి తగులబెట్టడం అనే సంప్రదాయం దీనికి చిహ్నంగానే కావచ్చు. ........పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు)

మూలాలు[మార్చు]

  • డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి వ్రాసిన తెలుగువారి జానపద కళారూపాలు నుండి.

యితర లింకులు[మార్చు]