Jump to content

కుమార్ గంధర్వ

వికీపీడియా నుండి
పండిట్ కుమార్ గంధర్వ
భారత తపాలాబిళ్ళపై కుమార్ గంధర్వ
భారత తపాలాబిళ్ళపై కుమార్ గంధర్వ
నేపథ్య సమాచారం
జననం
శివపుత్ర సిద్ధరామయ్య కొంకలిమఠ్

(1924-04-08)1924 ఏప్రిల్ 8
సుళేభావి, బెల్గాం జిల్లా, కర్ణాటక, భారతదేశం
మరణం1992 జనవరి 12(1992-01-12) (వయసు: 67)
దేవాస్, భారతదేశం
ప్రక్రియలుభారతీయ శాస్త్రీయ సంగీతం
వృత్తులుగాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1934–1992

పండిట్ కుమార్ గంధర్వ (8 ఏప్రిల్ 1924-12 జనవరి 1992) అని పిలువబడే శివపుత్ర సిద్ధరామయ్య కొంకలిమఠ్ ఒక భారతీయ శాస్త్రీయ గాయకుడు. తన ప్రత్యేకమైన స్వర శైలికి, ఏ ఘరానా సంప్రదాయానికి కట్టుబడి ఉండటానికి నిరాకరించినందుకు ఇతడు ప్రసిద్ధి చెందాడు. కుమార్ గంధర్వ అనేది ఇతనికి చిన్నతనంలో ఇచ్చిన బిరుదు. గంధర్వుడు హిందూ పురాణాల ప్రకారం ఒక సంగీత స్ఫూర్తి.[1]

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

కుమార్ గంధర్వ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రానికి చెందిన బెల్గాం సమీపంలోని సులేభావి అనే గ్రామంలో కన్నడ మాట్లాడే ఒక లింగాయత్ కుటుంబంలో జన్మించాడు. ఐదు సంవత్సరాల వయస్సులోనే ఇతడు తన సంగీత ప్రతిభను కనబరచాడు. 10 సంవత్సరాల వయస్సులో మొదటిసారి వేదికపై ప్రదర్శన ఇచ్చాడు. తన 11 సంవత్సరాల వయసులో, ఇతని తండ్రి ఇతడిని ప్రసిద్ధ శాస్త్రీయ గురువు బి. ఆర్. దేవధర్ వద్ద సంగీతం అభ్యసించడానికి పంపాడు. సంగీత పరిజ్ఞానం మీద ఇతడి ప్రావీణ్యం ఎంత వేగంగా ఉందంటే, కుమార్ గంధర్వ తనకు 20 ఏళ్లు రాకముందే ఇతరులకు సంగీత పాఠాలను బోధించేవాడు. తన యవ్వనదశ ప్రారంభంలోనే ఇతడు సంగీత ప్రపంచంలో ఒక తారగా వెలుగొందాడు. విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు.

వృత్తి

[మార్చు]

40వ దశకం చివరలో, ఇతడు క్షయవ్యాధి బారిన పడ్డాడు. మళ్లీ పాటలు పాడడం అసాధ్యం అని వైద్యులు చెప్పారు. తన ఆరోగ్యం కోసం మధ్యప్రదేశ్‌లోని దేవాస్ పొడి వాతావరణానికి వెళ్లాలని సూచించారు. తరువాతి ఆరు సంవత్సరాలు, కుమార్ గంధర్వ అనారోగ్యంతో నిశ్శబ్దంగా కాలం గడిపాడు. పాడటానికి ప్రయత్నించడం ప్రాణాంతకం కావచ్చని, కోలుకునే ఆశ చాలా తక్కువగా ఉందని వైద్యులు ఇతడికి చెప్పారు.[2] ఈ కాలంలో కుమార్ గంధర్వ మంచం మీద పడుకుని, తన చుట్టూ ఉన్న ప్రకృతి శబ్దాలు-పక్షులు, గాలి, వీధి గాయకుల పాటలు తనలో తాను కూనిరాగాలు తీసుకునేవాడు. నిర్గుణి భజన్ అనే ఇతని క్రొత్త ప్రక్రియకు ఇది దోహద పడిందని హెస్ ఊహించాడు.

1952లో, స్ట్రెప్టోమైసిన్ అనే మందు క్షయవ్యాధికి చికిత్సగా ఉద్భవించింది,కుమార్ గంధర్వ దీనిని తీసుకోవడం ప్రారంభించాడు. క్రమంగా, అద్భుతమైన వైద్య సహాయం, భార్య భానుమతి సంరక్షణలతో ఇతడు కోలుకుని మళ్లీ పాడటం ప్రారంభించాడు. అయితే, ఇతని స్వరం, గాన శైలిలో అనారోగ్యం కారణంగా మార్పులు కనిపించాయి. ఇతని ఊపిరితిత్తులలో ఒకటి పనికిరానిదిగా మారింది, కాబట్టి ఇతడు ఒకే ఊపిరితిత్తితో పాడేవాడు.

కోలుకున్న తరువాత ఇతడి మొదటి కచేరీ 1953లో జరిగింది. ఈ అనారోగ్యం తరువాతి సంవత్సరాల్లో ఇతని గానం మీద తీవ్ర ప్రభావం చూపింది.ఇతడు శక్తివంతమైన చిన్న పదబంధాలకు, చాలా ఉన్నత స్వరానికి ప్రసిద్ధి చెందాడు.

ఇతడు నిర్గుణి భజనలు (భక్తి పాటలు), జానపద పాటలలో రాగాలతో, ప్రదర్శనతో ప్రయోగాలు చేశాడు, ఒకే రాగాన్ని వేగంగా మొదలుపెట్టి నెమ్మదిగా తక్కువ స్థాయిలో పాడేవాడు. సంప్రదాయాన్ని పూర్తిగా తిరస్కరించకుండా ప్రశ్నించడం, ఫలితంగా భారతీయ సంస్కృతి యొక్క మూలాలతో, ముఖ్యంగా మధ్యప్రదేశ్ జానపద సంగీతంతో సన్నిహితంగా ఉండటం వంటి చర్యల ద్వారా ఇతడు గుర్తుండిపోతాడు. సంగీతం పట్ల ఇతడి వినూత్న విధానం పాత రాగాల కలయికల నుండి కొత్త రాగాల సృష్టికి దారితీసింది.[3]

ఇతడు పాడే శైలి గురించి గణనీయమైన వివాదాలు చెలరేగాయి. ప్రముఖ గాయకుడు మొగుబాయి కుర్దికర్ ఇతని విలంబిత్ (స్లో టెంపో) గానం ఆసక్తికరంగా లేదని విమర్శించాడు. ఇతని స్వంత గురువు దేవధర్ కూడా కుమార్ గంధర్వం గానంలోని కొన్ని అంశాలను విమర్శించాడు. విమర్శలు ఎక్కువగా ఆయన విలంబిత్ గానంపై కేంద్రీకృతమై ఉన్నాయి. వేగవంతమైన టెంపోలలో పాడటం, ముఖ్యంగా మధ్య-లయపై ఇతడికున్న పాండిత్యం విస్తృతంగా గౌరవించబడింది.

కుమార్ గంధర్వ రెండవ భార్య, శిష్యురాలు అయిన వసుంధర కొంకళి, భజన గానం లో ఇతడితో కలిసి పాడింది. కొన్నిసార్లు, ఈమె ఇతని శాస్త్రీయ సంగీత ప్రదర్శనలలో స్వరాన్ని అందించింది. వారి కుమార్తె కళాపిని కొంకలిమఠ్ తరువాతి కాలంలో తన తల్లిదండ్రులిద్దరితో కలిసి తంబుర సహకారాన్ని అందించింది.

ఇతడి సంగీత జ్ఞానాన్ని ఇతడి కుమారుడు ముకుల్ శివపుత్ర, కుమార్తె, అలాగే మధుప్ ముద్గల్, విజయ్ సర్దేశ్ముఖ్, సత్యశీల్ దేశ్పాండే వంటి విద్యార్థులు ముందుకు తీసుకువెళ్ళారు. ఇతని విద్యార్థి పరమానంద్ యాదవ్ ఏర్పాటు చేసిన కుమార్ గంధర్వ ఫౌండేషన్ (ముంబై), హిందూస్థానీ సంగీతం , కర్ణాటక సంగీతాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. కుమార్ గంధర్వ మనవడు భువనేష్ (ముకుల్ కుమారుడు) కూడా శాస్త్రీయ గాయకుడిగా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు.

సుదీర్ఘకాలం పాటు, సంగీతకారుడిగా కుమార్ గంధర్వ కార్యకలాపాలను అతని స్నేహితుడు, తబలా సహచరుడు అయిన వసంత్ ఆచరేకర్ నిర్వహించాడు. ప్రముఖ మరాఠీ సాహిత్య జంట పు లా దేశ్పాండే, సునీతా దేశ్పాండే లతో ఇతడికి స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి.

ఇతడు సంగీత విద్వాంసుడు కూడా. అనారోగ్యం సమయంలో, ఇతడు పూర్తి విశ్రాంతి తీసుకున్నప్పుడు, ఇతడు సంగీతంలోని వివిధ అంశాలను ఆలోచిస్తూ సమయాన్ని గడిపాడు. అనేక విభిన్న రాగాలు, శైలులు, వివిధ రకాల కూర్పుల గురించి ఇతడికి తన స్వంత ఆలోచనలు ఉండేవి.

కుమార్ గంధర్వకు 1977లో పద్మభూషణ్, 1990లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ప్రదానం చేయబడ్డాయి.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఇతడు 1946లో భానుమతి కాన్స్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమె బి. ఆర్. దేవధర్ పాఠశాలలో విద్యార్థినిగా చేరినప్పుడు కుమార్ గంధర్వను ఆమె ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. ఇద్దరూ ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. 1947లో దేవాస్కు వెళ్లారు. ఇది జరిగిన వెంటనే కుమార్ గంధర్వ క్షయవ్యాధి బారిన పడ్డాడు. కానీ కొత్త మందులు, అంకితమైన వైద్యులు, భానుమతి పరిచర్యల సహాయంతో కోలుకున్నాడు.

కుమార్ గంధర్వ మొదటి కుమారుడు ముకుల్ శివపుత్ర 1956లో జన్మించాడు.[5] వారి రెండవ కుమారుడు యశోవర్ధన్ 1961లో జన్మించాడు, కాని ప్రసవ సమయంలో భానుమతి మరణించింది. ఆమె మరణించిన తరువాత, ఇతడు దేవధర్ పాఠశాలలో తన తోటి విద్యార్థులలో ఒకరైన వసుంధర శ్రీఖండేను వివాహం చేసుకున్నాడు. వారి కుమార్తె కళాపిని కొంకళి ప్రముఖ గాయని.

మరణం

[మార్చు]

దశాబ్దాలుగా ఊపిరితిత్తుల సంక్రమణ వ్యాధితో మధ్యప్రదేశ్లోని దేవాస్ నివాసంలో 1992 జనవరి 12న కుమార్ గంధర్వ మరణించాడు. ఇతని భౌతిక కాయానికి పూర్తి ప్రభుత్వ గౌరవాలతో అంత్యక్రియలు జరిగాయి, ఇతని అంత్యక్రియలకి దేశం నలుమూలల నుండి వందలాది మంది సంగీత ప్రేమికులు హాజరయ్యారు.[6]

ఇతర విశేషాలు

[మార్చు]
  • సంగీత రంగంలో అత్యుత్తమ ప్రతిభకు వార్షిక జాతీయ గౌరవంగా 1992లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రీయ కుమార్ గంధర్వ సమ్మాన్ ను స్థాపించింది.[7]
  • షబ్నమ్ విర్మాని రూపొందించిన కబీర్ ప్రాజెక్ట్ లోని నాలుగు చిత్రాల పరంపరలో చివరి చిత్రం కుమార్ గంధర్వ, ఇతని శిష్యుల జీవితం, వృత్తి "నిర్గుణ్" గానంవైపు ఇతడి ప్రయాణాన్ని చూపిస్తుంది. ఈయన పాట 'సున్‌తా హై' 'కోయి సున్‌తా హై "గా ఈ చిత్రానికి శీర్షిక అయ్యింది.[8]
  • 'హన్స్ అకేలా' అనేది కుమార్ గంధర్వపై 78 నిమిషాల డాక్యుమెంటరీ. దీనిని ఫిల్మ్స్ డివిజన్ ఆఫ్ ఇండియా రూపొందించింది. ఇందులో భార్య, స్నేహితులు, విద్యార్థులు వంటి వివిధ వ్యక్తులతో ఇంటర్వ్యూలు ఉన్నాయి.[9]
  • 2014 సెప్టెంబరులో, హిందూస్థానీ సంగీతానికి ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ గంధర్వుని కలిగి ఉన్న తపాలా బిళ్ళను ఇండియా పోస్ట్ విడుదల చేసింది.[10]

మూలాలు

[మార్చు]
  1. ↑ Pandit Kumar Gandharva Biography – Childhood, Life History, Contribution Archived 31 మే 2023 at the Wayback Machine. Culturalindia.net. Retrieved 28 December 2018.
  2. ↑ Jha, Fiza (2020-04-08). "Kumar Gandharva, the musical prodigy inspired by his battle with tuberculosis & Kabir". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-24.
  3. ↑ Sreeram, Lakshmi (2017-01-12). "Kabir's verses in Gandharva's stark notes". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-03-09.
  4. ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.
  5. ↑ Banerjee, Shoumojit (2018-03-31). "Vocalist Mukul Shivputra to tour south India". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-02-24.
  6. ↑ "Hindustani classical music maestro Kumar Gandharva dies". India Today (in ఇంగ్లీష్). June 20, 2013. Retrieved 2021-03-09.
  7. ↑ Paul, G. s (2017-04-29). "Continuing a thousand-year-old tradition". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-04-24.
  8. ↑ Koi Sunta Hai Archived 10 జూన్ 2023 at the Wayback Machine. Kabirproject.org. Retrieved 28 December 2018.
  9. ↑ Hans Akela Archived 27 సెప్టెంబరు 2013 at the Wayback Machine Films Division.
  10. ↑ Govind, Ranjani (3 September 2014). "Four of eight commemorative stamps feature musical legends from State". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 22 December 2022.

గ్రంథ పట్టిక

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]