కూదల్మాణిక్యం దేవాలయం
| కూదల్మాణిక్యం ఆలయం | |
|---|---|
| భౌగోళికం | |
| భౌగోళికాంశాలు | 10°20′48″N 76°12′04″E / 10.3466°N 76.2012°E |
| దేశం | |
| రాష్ట్రం | కేరళ |
| జిల్లా | త్రిశూర్ |
| ప్రదేశం | ఇరింజలకుడ |
| ఎత్తు | 27.76 m (91 ft) |
| సంస్కృతి | |
| దైవం | భరతుడు |
| వాస్తుశైలి | |
| నిర్మాణ శైలులు | ద్రావిడ శైలి నిర్మాణకళ (కేరళ శైలి) |
కూదల్మాణిక్యం ఆలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రం, త్రిశూర్ జిల్లా లోని ఇరింజలకుడ మున్సిపాలిటీలో ఉన్న ఒక హిందూ ఆలయం.[1] ఈ ఆలయంలో ప్రధాన ఆలయ నిర్మాణం, గోడలతో చుట్టబడిన ప్రాంగణం, కోటల వంటి నిర్మాణాలు ఉండగా, ప్రధాన ఆలయం చుట్టూ నాలుగు చెరువులు ఉన్నాయి. వాటిలో ఒక చెరువు ఆలయ ప్రాంగణం లోపల ఉంది.
భారతదేశంలో రామాయణంలోని భరతుడికి అంకితమైన ఏకైక ప్రాచీన ఆలయం ఇదే. అయితే, ఇక్కడ ప్రతిష్ఠించబడిన విగ్రహం మాత్రం విష్ణువుదిగా భావిస్తారు. కూదల్మాణిక్యం ఆలయంలోని దేవుడిని “సంగమేశ్వరుడు” (అంటే “సంగమానికి అధిపతి”) అని కూడా పిలుస్తారు.
ఈ ఆలయం కేరళలో ఉన్న నాలుగు ఆలయాల సమూహంలో ఒకటి. ఈ సమూహాన్ని “''నాలంబలం''” అని పిలుస్తారు. ఈ నాలుగు ఆలయాలు రామాయణంలోని నలుగురు సోదరులైన రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడులకు అంకితమై ఉన్నాయి.[2]
కూదల్మాణిక్యం ఆలయానికి సంబంధించిన ఆధ్యాత్మిక అధిపతి, ఆలయ ఆస్తులపై లౌకిక అధికారాన్ని కలిగినవారు తాచుడయ కైమల్ గారు. ఆయనను “మాణిక్యం కేరళర్” అని కూడా పిలుస్తారు.[3] ఈ వంశ పరంపర ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ వస్తోంది, పవిత్రమైన స్కంద పురాణంలో కూడా ప్రస్తావించబడింది. ఆలయంపై లౌకిక హక్కులు అంటే “కైమల్” పదవి (మాణిక్యం కేరళర్‌కు భిన్నంగా), “మెల్కోయ్మ” అనే హక్కులు ఉన్నాయి.
చరిత్ర
[మార్చు]కూదల్మాణిక్యం ఆలయానికి సంబంధించిన తొలితర చారిత్రక ప్రస్తావన 854/55 క్రీస్తుశకానికి చెందిన ఒక శిలాశాసనంలో కనిపిస్తుంది. ఈ శాసనం చేర పెరుమాళ్లు వంశానికి చెందిన రాజు స్థాణు రవి కులశేఖరుడు కాలానికి చెందింది. ఆ శాసనంలో ఆలయానికి విస్తారమైన భూములను లీజుకు ఇచ్చినట్టు పేర్కొనబడింది. అందువల్ల, ఈ ఆలయం ఆ కాలానికి ముందే నిర్మించబడి ఉండి, అప్పటినుంచే కేరళలోని ముఖ్యమైన ఆలయాల్లో ఒకటిగా ఉన్నట్టు భావించవచ్చు.
1971 వరకు ఇరింజలకుడ పరిసర ప్రాంతాలలోని ఎక్కువ భూమి కూదల్మాణిక్యం ఆలయానికి, ట్రావెన్స్ కోర్ చెందిన తాచుడయ కైమల్ల ఆధీనంలోనే ఉండేది.[4] ఈ ఆలయం భక్తులతో పాటు పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది.
ఆచారాలు, పండుగలు
[మార్చు]- సాధారణంగా కేరళలోని చాలా ఆలయాలలో రోజుకు ఐదు పూజలు, మూడు శివేలీలు నిర్వహిస్తారు. కానీ కూదల్మాణిక్యం ఆలయంలో మాత్రం రోజుకు కేవలం మూడు పూజలే జరుగుతాయి, శివేలీలు ఉండవు. ఈ ఆలయంలో ఉషా పూజ, పంతీరాడి పూజలు నిర్వహించరు.
- వార్షిక ఉత్సవ సమయంలో మాత్రమే దేవుడిని ఊరేగింపుగా బయటకు తీసుకువస్తారు. ఈ ఆలయంలో దీపారాధన ఉండదు. దీపారాధన లేని ఏకైక ఆలయం ఇదే.
- పూజకు అగరబత్తులు, కర్పూరం ఉపయోగించరు. దేవునికి సమర్పించే పుష్పాలలో తామర, తులసి, తెచ్చి పువ్వులు ఉంటాయి. అయితే, వాటిని ఆలయ ప్రాంగణంలో పెంచరు. పూజ కోసం లేదా దండలు కట్టడానికి మరే ఇతర పువ్వును ఉపయోగించరు. తామర పూల దండ దేవునికి సమర్పించే ముఖ్యమైన నైవేద్యం. దేవునికి సమర్పించే దండలో 101 కంటే తక్కువ తామర పువ్వులు ఉండవు..[5]
వార్షిక ఆలయ పండుగ
[మార్చు]- ప్రతి సంవత్సరం మలయాళ క్యాలెండర్ ప్రకారం మేడం (ఏప్రిల్/మే) నెలలో ఈ ఆలయ ప్రధాన వార్షిక పండుగను పది రోజుల పాటు నిర్వహిస్తారు. ఉత్రం నక్షత్రం దర్శనంతో పండుగ ప్రారంభ తేదీ నిర్ణయించబడుతుంది, ధ్వజారోహణతో ఉత్సవం మొదలవుతుంది. ఈ పండుగ ప్రారంభం సమీపంలోని త్రిశూర్ పూరం పండుగకు ఒక రోజు తర్వాత జరుగుతుంది.
- పండుగ రోజుల్లో ప్రతి రోజూ ఉదయం, రాత్రి రెండుసార్లు శివేలీ (అలంకరించిన ఆలయ ఏనుగుల ఊరేగింపు) నిర్వహిస్తారు. దీనికి పంచారి మేళం సంగీత వాయిద్యాలు తోడుంటాయి. మొత్తం పదిహేడు ఏనుగులు పాల్గొంటాయి.
- ఈ శివేలీలో రెండు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మొదటిది, దేవుడిని మోసే ఏనుగుకు ఇరువైపులా రెండు చిన్న ఏనుగులు ఉంటాయి. రెండవది, ఏడు ఏనుగుల నెట్టి పట్టాలు స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడతాయి, మిగతా వాటి నెట్టి పట్టాలు స్వచ్ఛమైన వెండితో తయారు చేస్తారు.
- ఉత్సవం చివరి రెండు రోజుల్లో పంచవాద్యం వాయిద్య ప్రదర్శన జరుగుతుంది, మలయాళ క్యాలెండర్లోని తిరువోణం నక్షత్రంతో ఉత్సవం ముగుస్తుంది.
ఆలయ చెరువులు
[మార్చు]దేవాలయం లోపల, చుట్టుపక్కల నాలుగు చెరువులు ఉన్నాయి. ఈ నాలుగింటిలో అతిపెద్దవి తూర్పు వైపున ప్రాంగణం వెలుపల ఉన్న "కుట్టన్ కుళం", ప్రాంగణం లోపల ఉన్న "కులిపిణి తీర్థం". కులిపిణి తీర్థం వద్ద మహర్షి కులిపిణి ఒక గొప్ప యజ్ఞం నిర్వహించడం ద్వారా దానిని పవిత్రం చేశారని నమ్ముతారు. ఈ జలాశయం నుండి తీసిన నీటిని ఆలయంలోని పూజలు, వేడుకల కోసం ఉపయోగిస్తారు.
పూజారులు ఆలయం వెలుపల ఉన్న కుట్టన్ కుళంలో స్నానం చేసి శుద్ధి చేసుకున్న తర్వాతే వేడుకలలో పాల్గొనడానికి అనుమతిస్తారు, ఆ తర్వాత గర్భగుడిలోకి ప్రవేశించే ముందు కులిపిణి తీర్థంలో మునగాలి. ప్రాంగణం వెలుపల పశ్చిమ వైపున ఉన్న చెరువును "పడింజారే కుళం" అని, దక్షిణ వైపున ఉన్న చెరువును "తెక్కే కుళం" అని పిలుస్తారు. ఈ మూడు జలాశయాలు ఆలయం పరిమాణానికి సమానమైన గణనీయమైన ప్రాంతాన్ని ఆక్రమించి ఉన్నాయి. కులిపిణి తీర్థం మినహా మిగిలిన మూడు జలాశయాలు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Koodalmanikyam Irinjalakkuda". Manorama Online. The-week.com. 29 November 2005. Retrieved 2014-01-18.
- ↑ "Nalambala Darsanam from July 17". The Hindu. Thrissur. 2007-07-15.
- ↑ Epistles by Ananthakumara Swami, Thachudaya Kaimal Stanom, Published 1927 Irinjalakkuda India Office Records, London IOR/R/2/882/104
- ↑ ":: Daily News with the Gulf Today on GoDubai, Middle East, Dubai, UAE Online News::". Archived from the original on 15 April 2016. Retrieved 30 March 2016.
- ↑ [మూలం అవసరం]