కూరెళ్ల విఠలాచార్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య
Vitalacharya sir.jpg
డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య
జననంజూలై 9, 1938
నీర్నేముల గ్రామం, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ
నివాస ప్రాంతంఎల్లంకి గ్రామం, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా , తెలంగాణ 508113
వృత్తితెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకులు, సామాజిక వేత్త
పదవి పేరుఅభినవ పోతన, మధురకవి, సుధీతిలకం, సాహిత్యబ్రహ్మ, ఆచార్య, ఎల్లంకి వేమన్న, నల్లగొండ కాళోజీ, అక్షర కళా సమ్రాట్, కవితాశ్రీ
మతంహిందూ
భార్య / భర్తయమున
పిల్లలునర్మద, తపతి, సరస్వతి
తండ్రివేంకటరాజయ్య
తల్లికూరెళ్ళ లక్ష్మమ్మ
సంతకంSign of kurella.JPG

డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకులు, సామాజిక వేత్త, గ్రంథాలయ స్థాపకుడు. సాహిత్యమే ఊపిరిగా ఐదు దశాబ్దాలుగా రచనలు సాగిస్తున్నాడు.[1] కవిగా 22 పుస్తకాలను వెలువరించిన విఠలాచార్య, పదవీ విరమణ అనంతరం తన స్వగ్రామంలోని తన గృహంలో సుమారు రెండు లక్షల గ్రంథాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశాడు.[2]

ప్రధానమంత్రి మోడీ 2021, డిసెంబరు 26 ఆదివారం రోజున రేడియో కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’లో కూరెల్ల విఠలాచార్య గురించి ప్రస్తావిస్తూ ‘‘కలలను నిజం చేసుకోవాడానికి వయసు అడ్డుకాదని, ఈ విషయంలో తెలంగాణకు చెందిన 84 ఏళ్ల డాక్టర్ కూరెల్ల విఠలాచార్య మనందరికీ  ఆదర్శం. ఆయనకు చిన్నతనం నుంచి ఒక పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేయాలనే కోరిక ఉండేది. చదువుకుని లెక్చరర్‌‌గా ఉద్యోగం చేసిన విఠలాచార్య.. పుస్తకాలను కలెక్ట్ చేస్తూ వచ్చి ఈ రిటైర్మెంట్‌ తర్వాత లైబ్రరీని ఏర్పాటు చేశారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని, వయసుతో సంబంధం లేదని ఆయన నిరూపించారు” అని ప్రశంసించాడు.[3][4][5]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

పేర్వారం జగన్నాధం గారిచే సన్మానం

ఆబాల్యకవియైన డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య 1938 జూలై 9న యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని అతని మాతామహుల గ్రామమైన నీర్నేములలో కూరెళ్ల వెంకటరాజయ్య - లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆ కాలంలో ఇతని తండ్రి కూరెళ్ల వేంకటరాజయ్య గొప్ప స్వర్ణకారుడని ప్రతీతి. అంతేకాకుండా మంచి చిత్రకారుడు కూడా.అతను చేసిన అపురూపమైన చక్కని చొక్కపు ఆభరణాలు ఊళ్ళో వాళ్ళు విఠలాచార్యులకు చూపించి పొంగి పోతుంటారు. అయితే దురదృష్టవశాత్తూ తండ్రి వెంకటరాజయ్య అనారోగ్యానికి గురైనాడు.వెంకటరాజయ్య అన్నదమ్ములు అతని ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోలేదు. శివుడు మీది భారంతో జైకేసారం అనే ఊరి చివరి శివాలయంలో విడిదికి వెళ్ళాడు. రోగం ముదిరి ఇతని తండ్రి వెంకటరాజయ్య1938లో మరణించారు. అప్పటికీ కష్టజాతకుడైన కవి విఠలాచార్య వయస్సు 5 నెలలు మాత్రమే. బాల్య వివాహాలు జరిగే ఆనాటి సమాజంలో అతని అమ్మ లక్ష్మమ్మ వయస్సు ఆనాటికీ 15 సంవత్సరాలు మాత్రమే. జీవిత సుఖాలు త్యాగం చేసి అష్టకష్టాలుపడి తల్లి లక్ష్మమ్మ విఠలాచార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచింది. చిన్ననాటి ఆ పరిస్థితులు కవిహృదయంపై చెరగని ముద్రవేశాయి.[6]

ఏను జనించినట్టి తరియెట్టిదొ? నేనిల నేలపైన కా
లూనగ లేనె లేదు జనకుండు గతించెను, నాదు తల్లి నా
నాన కొరంతనేమియు కనంబడ నీయక లెస్సపెంచె, కా
నీ నను బాధపెట్టెగ అనిష్ఠము లెన్నియొ విఠ్ఠలేష్వరా!
మైత్రి విద్యాలయంలో ఆచార్యులవారికి పుష్పాభిషేకం చేస్తున్న దృష్యం

విఠలాచార్య నాన్నగారు వెంకటరాజయ్య చనిపోయిన తర్వాత వీరిని పెంచటానికి ఎవరూ లేరని గ్రహించి వీరి మాతామహులైన బేతోజు లక్ష్మీనారాయణ గారు కవి గారి పితామహుల గ్రామమైన ఎల్లంకి నుండి నీరునెములకు తీసుకెళ్ళారు. విఠలాచార్యుల వారి విద్యాభ్యాసం అక్కడే ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలలు అంతగా లేని ఆ కాలంలో మహాసూల్‌దార్ అనే ప్రైవేట్ టీచరు వద్ద వీరికి అక్షరాభ్యాసం జరిగింది. అప్పుడు తెలంగాణా ప్రాంతం నిజాం ఏలుబడిలో ఉండేది. ఉర్దూ మాధ్యమంగా విద్యాభ్యాసం కొనసాగేది. ఆ రోజుల్లో పొడగాటి చెక్క పలకమీద ఇసుక పోసి అక్షరాలు దిద్దించేవాళ్ళు. నీర్నేములలోని వీరి అమ్మమ్మ ఈశ్వరమ్మ గారి ఆప్యాయత ఎంత అపూర్వమైందంటే "ఎప్పుడైన విఠలాచార్య గారు తమ పితామహుల గ్రామమైన ఎల్లంకికి వెళ్ళవలసి వస్తే వీరి రెండు పాదాలను ఆమె జాజులో ముంచి వారి పాదముద్రలను గోడకు కొట్టుకొని తిరిగి ఆచార్యులవారు వచ్చే వరకు వాటిని చూసుకుంటూ మురిసేది" ఆ యమ్మ చూపిన అనన్య ప్రేమను ఆచార్యులవారు ఈ నాటికీ మరచిపోకుండా నీరునెముల గ్రామములోని ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రతి సంవత్సరము 7వ తరగతిలో తెలుగు సబ్జెక్టులో ఉత్తమ మార్కులు సంపాదించిన విద్యార్థికి బేతోజు లక్షీనారాయణ ఈశ్వరమ్మల పేరిట స్మారక పురస్కారాలు అందిస్తుంటారు.

నీరునెములలో పెరుగుతున్న విఠలాచార్యులవారు క్రమంగా తమ ఉనికిని స్థిరపరచుకోవడానికి తమ పితామహుల గ్రామమైన ఎల్లంకికి వచ్చి వెళ్ళేవారు. ఎల్లంకిలో వీరికి 3 ఎకరాల భూమి ఉండేది. అయితే వీరి పెదనాన్న గారైన కనకయ్య గారు ఆచార్యుల వారిని, వారి మాతృమూర్తిని అనేక బాధలకు గురిచేశారు. ఆ బాధలను తల్లి గుండెలో దాచుకొని కొడుకును ఒడిలో కాపాడుకుంటూ ఆచార్యులవారిని పెంచింది. వీరి తల్లి పడ్డ బాధాతప్తాదృశ్యాలు కవి హృదయంపై చెరగని ముద్రను వేశాయి. అందుకే ప్రతి పుస్తకంలో ఆచార్యులవారు మరచిపోకుండా మాతృవందనం చేస్తూవుంటారు.

పుట్టుకలోనే తండ్రి చనిపోయెను, తల్లియె నన్ను పెంచె, ఇ
క్కట్టులనెన్నొ పొందెను, సుఖంబననేమొ ఎరుంగదాయె, న
న్నెట్టులో వీధి బళ్ళొ చదివించెను, మేధకు వన్నెపెట్టె, నే
నట్టి దయార్థ్ర మాతృ చరణాలకు మ్రొక్కెద విఠ్ఠలేశ్వరా!
జానపద సాహిత్య పితామహులు ఆచార్య శ్రీ బిరుదురాజు రామరాజు గారు ఆచార్య కూరెళ్ళ గారిని సన్మానిస్తున్న దృష్యం

విఠలాచార్యుల ఎల్లంకి వచ్చిన తర్వాత షేక్ అహ్మద్ అనే ప్రైవేట్ ముస్లీం టీచర్ వద్ద చదువు ప్రారంభించాృు. ఆ రోజుల్లో ఈ గురువుకు అతని దగ్గర చదువుకునే పిల్లవాళ్ళు ప్రతిఫలంగా ఒకటో, రెండో రూపాయలు ఇచ్చేవాళ్ళు. అయితే విఠలాచార్య ఆ ఒక్క రూపాయి కూడా చేల్లించలేని ఆర్థిక పరిస్థితి. రూపాయి చెల్లింపు బదులుగా రోజూ బడిని ఊడ్చి శుభ్రం చేసేవాడు. స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో ఎల్లంకి గ్రామానికి ఆ ఊరి దేశ్‌ముఖ్ అనుముల లక్ష్మీనరసింహరావు కృషివల్ల ఒక ప్రభుత్వ పాఠశాల మంజూరైంది. అప్పట్లో దానిని ధర్మబడి అనేవారు. ఆ బడికి తుల్జారాంసింగ్ అనే ఉపాధ్యాయుడు వచ్చాడు. అతడే ఆ పాఠశాల మొట్టమొదటి ఫౌండర్ హెడ్మాస్టరు. అప్పట్లో బల్తాఖైదా (శిశు తరగతి), అవ్వల్ (మొదటి తరగతి), ధువ్వం (రెండవ తరగతి), సువ్వం (మూడవ తరగతి) అని తరగతి శ్రేణులు పిలిచేవారు. ఆనాటి పాఠ్యపుస్తకాల అట్టల మీద, మొదటి పేజీల మీద నిజాం రాజు ఫొటో ఉండేది. ప్రతి రోజు ఉదయం పిల్లల చేత పాఠశాలలో నిజాం రాజు చల్లగా ఉండాలని ప్రార్థన చేయించేవాళ్ళు. క్రమంగా ఆనాటి ప్రైవేట్ ఉపాధ్యాయుడైన షేక్ అహ్మద్కు కూడా ఈ బడిలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. విచిత్రం ఏమిటంటే ఆ ధర్మబడికి ఫౌండర్ స్టూడెంట్ అయిన ఆచార్యుల అదే స్కూల్‌కు తర్వాతి కాలంలో హెడ్మాస్టర్‌గా వచ్చాడు.

గౌ.శ్రీ దానం నాగేందర్ గారిచే ఉత్తమ సీనియర్ సిటిజన్ రాష్ట్ర పురస్కారం ప్రదానం

ఎల్లంకిలో సువ్వం చదివిన తరువాత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ నీర్నేములకు వెళ్ళిపోయాడు. అప్పుడే విఠలాచార్యుల జీవితం ఒక మలుపు తిరిగింది. ఆ ఊరి కరణం బసవరాజు లక్ష్మణారావు రెండవ కుమారుడైన శ్రీహరి రావు అప్పట్లో భువనగిరిలో చదువుకుంటుండేవాడు. ఆయన ఎండాకాలం సెలవుల్లో నీర్నేములకు వచ్చి ఉచితంగా "బేసిక్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్" చెప్పేవారు. ఆచార్యుల అత్యంత ఆసక్తితో ఆంగ్ల భాష నేర్చుకున్నాడు. చదువు పట్ల విఠలాచార్యులుకు ఉన్న ఆసక్తిని గమనించి శ్రీహరిరావు, ఇతనిని భువనగిరి 'ఫోఖానియా'లో (ఉన్నత పాఠశాల) చేర్పించడానికి తీసుకెళ్ళాడు. అయితే అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల వీరికి సీటు దొరకలేదు. ఇక విధిలేక రామన్నపేటలోని కోటిచింతల పురుషోత్తం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో 1950-51లో చారుం (4వ తరగతి)లో చేరాడు. అక్కడే పంజుం (5వ తరగతి), చెస్సుం (6వ తరగతి), అఫ్‌తుం (7వ తరగతి) చదివాడు.

స్వాతంత్ర్యానంతరం తెలుగు వారి వికాసం ప్రారంభమైంది. 1954-55 ప్రాంతంలో విశ్వకర్మలంత కలసి భువనగిరిలోని ఒక కిరాయి యింట్లో విశ్వకర్మ హాస్టల్ ప్రారంభించారు. ఆచార్యులు రామన్నపేటలో 7వ తరగతి పూర్తి చేసుకొని 8వ తరగతి నుండి "ఫోఖానియా" (ఉన్నత పాఠశాల)లో చేరటానికి భువనగిరికి వచ్చి విశ్వకర్మ హాస్టల్‌లో ప్రవేశాన్ని పొందాడు. అప్పట్లో ఆ హాస్ట్లలు నెల ఫీజు 6 రూపాయలు. ఆ మాత్రపు ఆర్థిక పరిస్థితి కూడా ఆచార్యులుకు లేదు. చిట్టోజు రామయ్య. చొల్లేటి వీరాచారి, మల్లాచారి, వలబోజు రంగయ్య, భోగోజు కృష్ణమాచారి మొదలైన బంధువులు తలా కొంత మెత్తం ఆర్థిక రూపంలో ఇచ్చి ఇతని హాస్టల్ ఫీజు చెల్లించారు.తెలుగురాని ముస్లీం వకీళ్ళకు తెలుగు చెప్పడం వల్ల వాళ్ళు కూడా కొంత సహకరించేవారు. ప్రధానంగా బేతోజు బ్రహ్మయ్యనే అన్ని చూచేవాడు. హాస్టల్ కూడా సరిపోని ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కష్టంగానే నడిచేది. హాస్టల్ యాజమాన్యం వారు హాస్టల్‌లో చదువుకునే పిల్లలకు కమ్మరి, వడ్ల, స్వర్ణకారుల ఇండ్లు చూపేవారు. హాస్టల్ పిల్లలు వారికి కేటాయించిన ఇండ్లలోకి వెళ్ళి వారు పెట్టిన భిక్ష తెచ్చుకొని హాస్టల్‌లో తిని కాలం గడిపేవారు. ఈ హాస్టల్‌కు కొల్లోజు వెంకటాచారి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు.అతనిని ఆచార్యుల తన శిల్పాచార్యుల గ్రంథంలో ఇలా స్మరించుకున్నాడు.

పల్లె పల్లెల నుంచి పంచబ్రహ్మల కూర్చి
మంచిదౌ సంస్థ స్థాపించినావు
బడి చదువులకయి బాధపడెడి పేద
పిల్లలకు భృతి కల్పించినావు
రంగులు మార్చు ఈ రాజకీయాలలో
పిత గాంధిజీనే జపించినావు
విఙ్ఞులు ప్రాఙ్ఞులు విశ్వఙ్ఞులందరూ
ప్రియముగా నుండ తపించినావు
లోకమున మీరు మీదు కొల్లోజు వంశ
ఘనత విశ్వకర్మలకు ప్రఖ్యాతమయ్యె
ఆర్య ధన్యులు వేంకటాచార్య మీకు
నర్పణము సేతు నాదు శ్రద్ధాంజలిదిగొ!

వీధులు తిరిగి భిక్ష తీసుకొనిన ఈ విషయాన్ని ఆచార్యులు "శిల్పాచార్యులు" అనే గ్రంథంలో తన సతీర్ధ్యుడు బ్రహ్మచారితో చెప్పినట్టు "మధురానుభవం" శీర్షిక కింద ఇలా పేర్కొన్నారు.

వారవారము మనవాళ్ళ వాడకేగి
కూర్చుకొనిన సాహిత్యము, కోరి కోరి
అడుగుకొనిన విరాళాల ఆప్తధనము
అది మరవరాని ఓ మధురానుభము

ఎంత దయార్ధ్ర హృదయంతో ఆ తల్లులు భిక్ష పెట్టారో కానీ వారి భిక్ష తిన్నవారందరూ వారి జీవితంలో చాలా పెద్దవారయ్యారు.

ఏ జనని భిక్షపెట్టి దీవించినాదొ?
ఏ వదాన్యుడు దీవెనలిచ్చినాడో?
భువనగిరి విశ్వకర్మల పుణ్య ఫలమొ?
మనకు సకల శుభముల జీవనం గలిగె
పుస్తక పఠనం చేస్తున్న ఆచార్య కూరెళ్ళ

ఉన్నత పాఠశాల స్థాయిలో ఐచ్ఛిక భాషగా సంస్కృత భాషను అప్పుడే కొత్తగా ప్రవేశపెట్టారు. సంస్కృతం పై మక్కువతో ఆచార్యులు ఐచ్ఛికంగా సంస్కృతం తీసుకున్నాడు. సుప్రసిద్ధ పండితులు కోవెల సంపత్కుమారాచార్యులు, అప్పలాచార్యులు ఇతనికి సంస్కృతం బోధించారు. ఛందో వ్యాకరణాలను వంటబట్టించుకున్నాడు. సహజంగానే కవియైన విఠలాచార్యులు ఈ సంస్కృత వాతావరణం చక్కగా తోడ్పడి వారిలోని కవి వికసించసాగాడు.

1955లో భువనగిరి విశ్వకర్మ హాస్టల్‌కు డోకూరు బాలబ్రహ్మాచారి అనే సుప్రసిద్ధ అవధాని వచ్చాడు. ఆయన పుట్టు అంధుడు. ఆయనకు అపూర్వమైన ఏకాగ్రత శక్తి ఉండేది. ఆయనకు ఆచార్యుల రామాయణ, భారత భాగవత పద్యాలను చదివి వినిపించేవాడు. అతనితో జరిగిన సాహిత్య చర్చలు ఆచార్యులను కవిగా ఎదగడానికి ఎంతగానో తోడ్పడ్డాయి. ఆచార్యుల చిన్ననాటి నుండి దయార్ధహృదయులు, తాను బాధపడుతూ కూడా తోటివారికి సహకరించేవాడు. ఆ కాలంలోనే పర్యాయం మెరిట్, పూర్ స్కాలర్స్ రెండూ వచ్చాయి. రెండు స్కాలర్‌షిప్స్ తనకు వద్దని ప్రధానోపాధ్యాయులు ఎస్.వ్.రామకృష్ణారావు పూర్వ జిల్లా విద్యాధికారి, నల్లగొండకు వెన్నవించుకొని తాను మెరిట్ స్కాలర్‌షిప్ తీసుకొని పూర్ స్కాలర్‌షిప్ తన తోటి విద్యార్థి పూర్ణయ్యకు ఇచ్చాడు. భువనగిరిలో నున్న సమయాన ట్యూషనులు నేర్పాటుచేసి సహృదయుడు బద్దం లక్షారెడ్డి సహకరించాడు.

బాల్యంలో పెదనాన్న చూపిన భయంకరమైన ఆదిపత్య ధోరణి ఆనాటి సమాజంలో ప్రదర్శింపబడే అభిజాత్యాహంకార ధోరణి సహజంగా బీదవాడైన ఆచార్యుల వారి హృదయంపై ఎదురొడ్డి నిలిచే తత్త్వాన్ని ప్రేరేపించాయి. ఈ క్రమంలో ఆయన కొంతమేరకు వామపక్ష భావాలపైపు సహజంగానే ఆకర్షితులయ్యాడు.

విశ్వకర్మ హాస్టల్‌లో ఉంటూ విశాలాంధ్ర పత్రికను చదివేవాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఆయనపై నిఘా పెట్టారు. ఆ పత్రికను చదువవద్దని ఆంక్షలు పెట్టారు. వాటిని తట్టుకుంటూనే ఒక సారి ఓ సభలో పాల్గొనడానికి రావి నారాయణ రెడ్డి ఎల్లంకి దగ్గరగా ఉండే సిరిపురం గ్రామానికి వస్తే గొంగళి కప్పుకొని రహస్యంగా వెళ్ళి 1957లో వారిని చూసి వచ్చారు. అప్పటికీ పదవ తరగతి పరీక్ష కేంద్రంగా భువనగిరి లేకపోవడం వల్ల మథర్సే ఆలీయా హైదరాబారులోని హెచ్.ఎస్.సి. పరీక్ష రాసి ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.

దయనీయమైన ఆర్థిక పరిస్థితి వల్ల ఆదరణీయమైన అనేక గురువుల ఆధరాభిమానాల వల్ల ఆటుపోట్లను తట్టుకొని ఆయన విద్యాభ్యాసం అతికష్టంతో ఓ ఒడ్డుకు చేరుకుంది.

ఒక్క గురుండు కాదు నొక ఊరును కాదిల ఎందరెందరో
చక్కగ విద్య నేర్పిరిగ శ్రద్ధగా నేర్చితి శక్తి కొద్ది, ఏ
దిక్కును లేక ఇల్లిలును తిర్గి భుజించితి వీరిలోన నే
నొక్కరినైన నేమరును నూరు విధమ్ముల విఠ్ఠలేశ్వరా

ఆచార్య 1967లో ప్రైవేట్‌గా బి.ఏ డిగ్రీ పొందాడు, ఉన్నత విద్యను అభ్యసించాలనే కాంక్ష అతనిలో ఎప్పుడూ వెన్నాడుతూ ఉండేది ఆ కోరిక 1972లో ప్రైవేట్‌గా యం.ఏ. పరీక్ష రాసి ఉత్తీర్ణుడయి తీర్చుకున్నాడు. పైగా హిందీలో విశారద పరీక్ష రాసి దానిలో కూడా సఫలీకృతుడయ్యాడు. ఏదో ఒక అంశం తీసుకొని డాక్టరేట్ పట్టా పొందాలనే ఆశతో కాక ఒక ఉన్నతమైన ఆశయంతో రీసెర్చ్ చేయాలనే తపనతో 1977లో ఎం.ఫిల్. పరిశోధనకై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరాడు. తెలుగులో గొలుసుకట్టు నవలలు అనే కష్టతరమైన అంశాన్ని పరిశోధనకు తీసుకున్నాడు. దాని కొరకై ఎందరో సాహితీ వేత్తలను కలిసి నిర్విరామ కృషిచేశాడు. ఒక ప్రామాణికమైన ఎం.ఫిల్. సిద్దాంత వ్యాసాన్ని 1980లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించాడు. న్యాయ నిర్ణేతల, ఉన్నత సాహితీ వేత్తల ప్రశంసలకు పాత్రుడయ్యాడు. ఇతని ఎం.ఫిల్. పరిశోధన ద్వారా ప్రపంచ సాహిత్యంలో లేని తెలుగు సాహిత్యంలో మాత్రమే ఉన్న 24 మంది రచయిత (త్రు)లు రాసిన "ముద్దు దిద్దిన కాపురం" అనే గొలుసుకట్టు నవలను వెలుగులోకి తీసుకురావడం విశేషం. "తెలుగు నవలల్లో స్వాతంత్ర్యోద్యమ చిత్రణం" అనే అంశంపై సాధికారిక పరిశ్రమ చేసి 1988 సంవత్సరంలో డాక్టరేట్ పట్టా పొందాడు.[7]

ఉద్యోగం[మార్చు]

90 ఏళ్ళ వృద్ధుడికి అక్షర స్వీకారం చేయిస్తున్న ఆచార్య కూరెళ్ళ
తన ఆధ్వర్యంలో చదువుకుంటున్న వికలాంగురాలికి పుస్తకాలు అందజేస్తున్న ఆచార్య కూరెళ్ళ

1957లో హెచ్.ఎస్.సి (higher secondary certificate) పరీక్ష పాసు కాగానే ఆచార్యులవారు వీరి బంధువైన దాసోజు విశ్వనాధాచారి పేషకార్ తమాసిల్‌క చేరి రామన్నపేట గారి సహాయంతో రామన్నపేటలోని తహశిల్దారు ఆఫీసులో 20 రూపాయల జీతంతో కాపేరైటర్‌గా ఉద్యోగాన్ని పొందాడు. ఇది చేస్తుండగా కో-ఆపరేటివ్‌లో సూపర్‌వైజర్ పోస్టు ఖాళీగా ఉంటే తన మిత్రుడైన లవణం సత్యనారాయణ ద్వారా ఆ ఉద్యోగంలో చేరాడు. అప్పట్లో ఆ ఉద్యోగ జీతం 80 రూపాయలు. అయితే కో-ఆపరేటివ్ కార్యాలయంలో జరిగే అవినేతి కార్యక్రమాలు, లంచాలు ఆచార్యులవారి హృదయానికి బాగా ఇబ్బంది కల్గించాయి. అది నచ్చక ఈయన ఆ ఉద్యోగాన్ని వదిలేసి దొరికిన ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోసాగాడు. కొంతకాలానికి అలీమొద్దిన్, అబ్బాస్ అలీ వకీల్ల సహాయంతో భువనగిరి న్యాయస్థానంలో కాపీరైటర్‌గా చేరాడు. ఆ తర్వాత కొంతకాలానికి వరంగల్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసు నుండి పిలుపు వచ్చి మిర్యాలగూడ సేల్స్-టాక్స్ ఆఫీసులో ఎల్.డి.సి.గా ఉద్యోగం పొందాడు. ఆచార్యులవారికి అవినేతితో నిండిన ఆ ఉద్యోగం నచ్చక రాజీనామా చేసాడు. తరువాత కొంత కాలానికి భువనగిరి ఎలక్ట్రిసిటి ఆఫీసులో ఎల్.డి.సి స్థాయి ఉద్యోగం చేయసాగాడు.

ఈ సమయంలో తన స్నేహితుడైన గుర్రం బుచ్చిరెడ్డి ఉపాధ్యాయ శిక్షణ కోసం మేడ్చల్ వెళ్ళాడు. అక్కడ ఇంకా రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. నీవు కూడా వచ్చి ప్రవేశం తీసుకోగలవు అని బుచ్చిరెడ్డిగారు ఆచార్యులవారికి లేఖ రాశాడు, వెంటనే ఆచార్యులవారు మేడ్చల్ వెళ్ళి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో ప్రవేశించాడు. శిక్షణ కాలంలో అక్కడే బహుబాషా కవి సమ్మేళనం ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సమ్మేళనానికి తెలుగు కవిగా ప్రసిద్ధులైన ఉత్పల సత్యనారాయణాచార్య గారు హాజరయ్యారు. వారి కమ్మని పధ్యపఠన ధోరణి ఆచార్యుల వారి హృదయంపై చెరగని ముద్ర వేసింది. ఈ నాటికీ ఆచార్యులవారు ఉత్పల వారి ధోరణిలోనే కావ్యగానం చేస్థుంటారు. అయితే ఆ కవి సమ్మేళనంలో విఠలాచార్య వారు కూడా ఆశువుగా పద్యాలను చెప్పారు. వాటిని విని ఆ కళాశాల ప్రిన్సిపాల్ పి.వి. రామకృష్ణరావు ఉత్సాహం తట్టుకోలేక తన మెడలో వేసిన పూలమాలను తీసి ఆచార్యులవారి మెడలో వేసి అభినందించాడు. ఉపాధ్యాయ శిక్షణలో ఆచార్యుల వారికి రాష్ట్ర ఉత్తమస్థానం లభించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌ. భీంసేన్ సచారా ద్వారా షీల్డు బహుకరించబడింది.

ఒక సభలో కూరెళ్ళవారి ప్రసంగాన్ని వింటున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు
ఆచార్య సి.నారాయణ రెడ్డి గారిచే జీవన సాఫల్య పురస్కారం

ఆచార్యులవారికి మొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగం 29-08-1959న మునిపాన్పుల గ్రామంలో ఉపాధ్యాయుడిగా దొరికింది. ఆ తర్వాత ఆయన 1960లో భువనగిరి సమితి క్రింద ఉన్న వడాయిగూడెం గ్రామానికి బదిలీ అయ్యారు. ఇక్కడే ఆయన "అక్షరాస్యత ఉద్యమాన్ని" ప్రారంభించారు.[8] ఇల్లిల్లు తిరిగి అక్షరాలు నేర్పించారు ఆ గూడెం ప్రజలను చైతన్య పరిచారు. ఆ రోజుల్లో రాయగిరిలో జరిగిన నాటకోత్సవాల్లో కోలా అంజయ్య, మాటూరి రాజయ్య మొదలైన రారలతో "సింగిసింగడు" నాటిక వేయించి బహుమతులను పొందాడు. ఆ తర్వాత 1962లో పరస్పర బదిలీ ద్వారా ఆచార్యులు సంగెం గ్రామానికి వచాడు. 4వ తరగతి వరకే ఉన్న ఆ పాఠశాల స్థాయిని గ్రామ పెద్దలతో కలిసి 5వ తరగతి స్థాయి వరకు పెంచాడు. మంచి ఉపాధ్యాయునిగా అందరి మన్ననలను అందుకోసాగాడు. ఇంతలో గోకారం పాఠశాల సరిగా నడపటం లేదని తెలియడంతో సమితి అధ్యక్షులు గుమ్మి అనంతరెడ్డి గారు సమర్ధులైన విఠలాచార్య గారిని అక్కడికి బదిలీ చేశారు. అనేక కష్టాలుపడి ఆ పాఠశాలను ఒక దారిలోకి తెచ్చాడు. 5వ తరగతి వరకు ఉన్న ఆ పాఠశాలలో 6వ తరగతిని మంజూరు చేయించాడు. గోకారంలో ఉన్నప్పుడు 1961లో "బాపూభారతి" అనే చిన్న లిఖిత పత్రికను ప్రారంభించాడు. అలాగే అదే పాఠశాలలో ఒక గదిలో "బాపూ గ్రంథాలయం" పేర ఒక గ్రంథాలయాన్ని కూడా స్థాపించి గ్రామస్థుల అభిమానానికి పాత్రులైనారు. తర్వాత ఆచార్యులవారు తన స్వగ్రామమైన ఎల్లంకికి విదిలీ అయ్యారు. అప్పుడు ఎల్లంకిలో 5వ తరగతి వరకే ఉండేది. గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ఎల్లంకిలో 6,7,8,9, 10వ తరగతుల వరకు పాఠశాల స్థాయిని పెంచి గ్రామంలోని ఆబాలగోపాల హృదయాలలో ఆదర్శనీయమైన స్థానాన్ని పొందాడు. ఇన్ని పనులు చేస్తూనే తాను ఉన్నత విద్యను సాధించాలనే కాంక్షతో ఆచార్యులవారు ప్రైవేట్‌గా 1963లో పి.యు.సి పరీక్ష రాసి పాసయ్యాడు. ఎల్లంకి పాఠశాలలోనే ఉండగానే "మా తెలుగు తల్లి" (1963) అనే కుడ్య పత్రికను ప్ర్రారంభించారు.

రచనా ప్రస్థానం[మార్చు]

తేజ ఆర్ట్స్ క్రియేషన్స్ అవార్డు తెలుగు విశ్వవిధ్యాలయ వైస్ చాన్స్‌లర్ ఆచార్య మంజుల గారు అందజేస్తున్న దృష్యం
మా అమ్మ గ్రంథ తొలి ప్రతిని ఆచార్య శ్రీ సి నారాయణ రెడ్డి, పొత్తూరి వెంకటేశ్వర రావు, ఆచార్య ఎన్.గోపి గార్లు డాక్టర్ కూరెళ్ళ గారికి అందజేస్తున్న దృష్యం
ఙ్ఞానపీఠ పురష్కృతులు డాక్టర్ రావూరి భరద్వాజ గారు ఆచార్య కూరెళ్ళ గారిని సన్మానిస్తున్న దృష్యం
మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారిచే ఆచార్య కూరెళ్ళ గారికి సన్మానం

విద్యార్థి దశలోనే తన రచనావ్యాసాంగానికి శ్రీకారం చుట్టారు. తెలుగులో గొలుసుకట్టు నవలలు, స్వాతంత్ర్యోద్యమం-ఆంధ్రప్రదేశ్‌లో దానిస్వరూపం, విఠలేశ్వరశతకం, శిల్పాచార్యులు (పద్యకవితాసంకలం), స్మృత్యంజలి (పద్యగద్యకవితాసంపుటి), వెల్లంకి వెలుగు (గ్రామచరిత్ర), సహస్రసత్యాలు, కూరెళ్ల పద్యకుసుమాలు వంటి రచనలు బాగా ప్రాచుర్యం పొందాయి. 12 ఏండ్ల ప్రాయంలో ఆచార్యులవారు 7వ తరగతి చదువుచున్నప్పుడు (1953-54) వారి తాతగారు బేతోజు లక్ష్మీనారాయణ గారు మరణించారు. ఆ వయస్సులోనే కవి గారు వారి మీద "స్మృతికావ్యం" రాశారు. ఆ పద్యాలను ఆయన స్నేహితుడైన దొంతరబోయిన, చెలమంద మొదలైనవారికి వినిపించేవారు. ఈ సమయంలోనే నీరునెములలో స్నేహితులతో కలిసి ఒక సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేశారు వివిధ పండుగల సందర్భాలలో ఆయా పండుగలపై పద్యాలు వ్రాసి స్నేహితులకు వినిపించేవారు. ఓ పర్యాయం నీరునెములలోని హనుమదాలయంలో మిత్రులతో కలిసి సహపంక్తి భోజన కార్యక్రమం నిర్వహించడం వల్ల ఆ గ్రామంలోని అగ్రవర్ణాల వారి ఆగ్రహానికి గురి అయ్యడు. ఈ దశలోనే ఆచార్యులవారు నీరునెములలో "విద్యాడ్రామా" అనే నాటికను రాయడమేగాక అందులో సుగంధరెడ్డి అనే పాత్రను కూడా ధరించి ప్రదర్శించాడు. అలాగే "గురుదక్షిణ", "లంకాదహనం", భక్త కన్నప్ప అనే నాటకాలలో ఏకలవ్య, హనుమంతుడు, కన్నప్ప పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ రకంగా ప్రాథమిక విద్యా స్థాయిలోనే ఆచార్యుల వారి కవితా వ్యాసంగం వెలుగులోకి వచ్చి సమకాలీన లబ్ధి ప్రతీష్ఠ సాహితీపరులను ఆశ్చర్య పరిచింది.

1954లో అధికవృష్టి వల్ల జనగామ దగ్గర రఘునాథపల్లిలో రైలు పడిపోయింది. ఆ సంఘటనకు బాలకవియైన ఆచార్యుల వారి హృదయం స్పందించి "అధికవృష్టి" అనే పేర కవిత ప్రవాహమై సాగింది. అందులో ఒకటి

ఉరుము మెఱుపులు నొకసారి ఉద్భవించె
గాలి, సుడి గాలి మేఘముల్ గప్పుకొనెయె
సరవిధారగ వర్షంబు కురియచుండె 
అల్ల తెలగాణ రఘునాథపల్లియందు

9వ తరగతి చదువుచున్నప్పుడే ఆచార్యుల వారు పాఠశాల కుడ్య పత్రికయైన "ఉదయ"కు సంపాదకుడిగా ఎన్నికయాడు. ఆయన సంపాదకత్వంలో "ఉదయ"ను చక్కటి వార్షిక పత్రికగా వెలువరించినందుకు ఉపాధ్యాయులు ఆచార్యుల వారికి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్థ్రి రాసిన "ఉదయశ్రీ" కావ్యాన్ని బహుమతిగా ఇచ్చారు. అందులోని పుష్పవిలాప ఘట్టం ఆచార్యులవారిని బాగా ఆకట్టుకుంది. దాని స్ఫూర్తితో ఆచార్యులవారు 9వ తరగతిలోనే "గోవిలాపం" అనే ఖండికను రచించారు. అందులో గోవుకు పాలు పితకడానికి వెళ్ళిన పిల్లవాడికి మధ్యన జరిగిన సంభాషణను రమణీయంగా వర్ణించారు. అందులో గోవు పిల్లవాన్నితో ఇలా అంటుంది.

చిక్క గున్నంతకాలము చితుక గొట్టి
చేత చేయించుకొందురు చేరదీసి
బక్కపడగానే మమ్ముల బాహ్యపరిచి
కోతకమ్ముదురయ్య మీ కులమువారు
అంటె అనరాదు మానవులయ్య మీరు
ఙ్ఞానులని పేరు పొందిన ఘనులు మీరు
ప్రేమ గలదని చెప్పెడి పెద్దవారు
కాని మీకన్న క్రూరమృగాలు మేలు
తర్వాత లేగ పాలు త్రాగుతుంటే పిల్లవాడు:
అన్నిపాల నీ మురిపాల ఆవుదూడ
పీల్చి నట్లైతే నేనేమి పితుకగలను
పితుకనట్లైతె నేనేమి గతుకగలను
గతుకనట్లైతె నేనెట్లు బ్రతుకగలను

ఈ "గోవిలాపం" కావ్య ఖండిక 1955-56లో వెలువడిన పాఠశాల వార్షిక సంచిక కుడ్య పత్రిక "ఉదయ"లో ప్రచురింపబడింది. ఈ మద్యనే బాలసాహిత్యమునకు ఎన్నుకోబడింది.

తెలంగాణ ఉద్యమం[మార్చు]

తొలిదశ ఉద్యమంలో భాగంగా 1952లో జరిగిన నాన్ ముల్కి ఉద్యమంలో విఠలాచార్య విద్యార్థిగా పాల్గొని హర్తాళ్ తదితర కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టారు. మలిదశ ఉద్యమంలో భాగంగా 1969లో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగిగా చురుకైన పాత్ర పోషించారు.

తుది సమరంలో భాగంగా 2001 నుంచి విశ్రాంత ఉద్యోగిగా పాల్గొంటూ కవిగా, రచయితగా, వక్తగా తనదైన ముద్రను ఉద్యమంలో చూపెట్టాడు. తన సహిత్య ప్రతిభతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమంపై కాంక్షను పెంచడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

గ్రంథాలయ స్థాపన[మార్చు]

గ్రంథాలయ ప్రారంభోత్సవం
ఆచార్య కూరెళ్ళ గ్రంథాలయం, ఎల్లంకి

ఆచార్యులవారు చదువుకుంటున్న రోజుల్లో సెలవులకో, పండుగ పబ్బాలకో స్వగ్రామమైన ఎల్లంకి వెళ్ళేవారు. ఎల్లంకి గ్రామంలో 1955వ సంవత్సరంలో తిమ్మాపురం వీరారెడ్డి, కణతాల నరసింహారెడ్డి, పోలు నరసింహారెడ్డి, రావీటి విఠలేశ్వరం, పున్న నరసింహ మొదలగు మిత్రులతో కలసి శ్రీ శంభులింగేశ్వరస్వామి పేర ఒక గ్రంథాలయం స్థాపించారు. దీనిని ఆ ఊరి దేశ్‌ముఖ్ అనుముల లక్ష్మీనరసింహరావు గారిచే ప్రారంభం చేయించారు. మిత్రులతో కలసి ఇల్లిల్లు తిరిగి గ్రంథాలు సేకరించేవారు ఈ గ్రంథాలయమే యువ నాయకత్వానికి ఆ ఊళ్ళో ఎంతో స్పూర్తినిచ్చింది.

కాని ఈ గ్రంథాలయం ఎక్కువ కాలం నిలువలేదు. ఆనాటి నుండి ఆచార్యుల వారికి తన సొంతూరు ఎల్లంకిలో గ్రంథాలయాన్ని నెలకొల్పాలని ఆకాంక్ష బలంగా ఉండేది ఆ తపనతోనే "ఆచార్య కూరెళ్ళ ట్రస్టు"ను ఏర్పాటు చేసి ఆ సంస్థ ఆధ్వర్యమున సుమారు నాలుగు వేల గ్రంథాలతో పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుపెట్టిన రోజు (13 ఫిబ్రవరి 2014) న "ఆచార్య కూరెళ్ళ గ్రంథాలయం", సాయి సాహితీ కుటీరము, ఎల్లంకి అనే పేరున తాను నివసిస్తున్న ఇంటినే గ్రంథాలయంగా మార్చి, జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ టి.చిరంజీవులు గారిచే మహావైభవంగా ప్రారంభోత్సవం చేసి గ్రామానికి అంకితం చేసారు.[1][9]

సేవాకార్యక్రమాలు[మార్చు]

  • సాహిత్యంతోపాటు సమాజసేవలోనూ కూరెళ్ల తనదైనశైలిని కొనసాగించారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రోజుల్లో ప్రభుత్వానికి ఆలోచనరాకముందే 1961లో భువనగిరి తాలుకా వడాయిగూడెంలో అక్షరాస్యతా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
  • 1960 నుండి 1980 వరకు రాష్ట్రోపాధ్యాయ సంఘంలో సమితి స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వివిధ పదవులు నిర్వహించి, ఉపాధ్యాయులకు సేవలందించారు. చౌటుప్పల్ రామన్నపేట మండలాల స్థానికంగా ఉపాధ్యాయ సంఘ భవనాల నిర్మాణం కోసం కృషి చేసారు.
  • రామన్నపేట మండలం, నీరునెముల గ్రామంలో రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం పక్షాన ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య ఆధ్వర్యాన రెండు మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మాణం చేయబడి ఈ గ్రామ ప్రజల రాకపోకలకు మిక్కిలి అవరోధంగా ఉన్న బురుజును ( 1991 జూన్ 18- 1991 జూన్ 23) తొలగించి స్థానిక ప్రజలకు, ప్రత్యేకంగా పాఠశాలకు సౌకర్యం కలిగించనైనది.
  • కూరెళ్ళ వారు కొంతమంది విద్యార్థులకు తన ఇంటిలోనే ఆశ్రయం ఇచ్చి దాతల సహకారంతో ఉన్నత సదువులకు ఆర్థిక వనరులు కల్పించారు. ప్రత్యేకంగా వికలాంగులైన విద్యార్థినీ విద్యార్థులను ఆదరించారు. కొందరికి ఉద్యోగాలు చేయించి మరికొందరికి పాఠశాలలు పెట్టించి జీవనోపాధి చూపించారు.
  • కూరెళ్ళవారు స్వగ్రామమైన ఎల్లంకిలో 6 ఎకరాల భూమిని నామమాత్రం రేటు తీసుకొని ఇండ్లు లేనివారికి ఇండ్ల వసతి కల్పించదానికి ప్రభుత్వానికి అప్పగించారు. ఊరివారు ఆచార్యులవారి తల్లి పేరుతో ఆ కాలనీకి "లక్ష్మీనగర్" అని పేరు పెట్టారు.
  • కులాల పట్టింపులు భలంగా ఉన్న రోజుల్లోనే (1954) నీర్నెములలోని హనుమదాలయంలో కూరెళ్ళ వారి ఆధ్వర్యాన తన తోటి విద్యార్థులందరితో సామూహిక భోజనం ఏర్పాటు చేయడమైనది. అప్పుడు కూరెళ్ళవారు, ఆయన మేనమామ బేతోజు బ్రహ్మయ్యగారు అగ్రకులాల ఆగ్రహానికి గురిఅయ్యారు.
  • నగరాల్లో స్థిరపడి గ్రామాలను మరిచిపోతున్న చాలామంది చదువుకున్న వాళ్ళవలె కాకుండా తన ఊరు ఎల్లంకిలోనే "సాయి సాహితీ కుటీరం" ఏర్పరచుకొని వివిధ సంస్థలు స్థాపించి, గ్రామంలో విద్యావ్యాప్తికి, సాహిత్యవ్యాప్తికి అహర్నిశలు కృషి సలుపుతున్న ఆత్మీయులు డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గారు. ప్రత్యేకంగా పల్లెపట్టులను అక్షరాలకు ఆటపట్టులుగా చేయాలని అహర్నిశలు ఆరాటపడుతున్న సాహిత్య సమరయోధులు ఆచార్య కూరెళ్ళగారు.

రచనలు[మార్చు]

  1. తెలుగు నవలల్లో స్వాతంత్ర్యోద్యమ చిత్రణం. (పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథం)
  2. తెలుగులో గొలుసుకట్టు నవలలు (ఎం.ఫిల్. సిద్ధాంత గ్రంథం)
  3. స్వాతంత్ర్యోద్యమం ఆంధ్రప్రదేశ్‌లో దాని స్వరూపం
  4. విఠలేశ్వర శతకము (సామాజిక స్పృహ నిండిన సచిత్ర పద్యకృతి)
  5. మధురకవి కూరెళ్ళ పీఠికలు (సేకరణ: దాసోజు ఙ్ఞానేశ్వర్)
  6. స్మృత్యంజలి (పద్య గద్య కవితా సంకలనం)
  7. కవితా చందనం (పద్య కవితా సంకలనం)
  8. తెలంగాణా కాగడాలు- సీస మాలిక (తెలంగాణ ప్రముఖులు)
  9. కూరెళ్ళ వ్యాసాలు
  10. వెల్లంకి వెలుగు (ఎల్లంకి గ్రామ చరిత్ర)
  11. కవిరాజు ఏలె ఎల్లయ్య - సంక్షిప్త జీవిత చరిత్ర
  12. చద్దిమూటలు
  13. దొందూ దొందే
  14. సింగి - సింగడు (అక్షరాస్యత ప్రచార నాటిక)
  15. మనకథ (బుర్రకథ)
  16. శిల్పాచార్యులు (పద్య కవితా సంకలనం)
  17. హైదరాబాదు సంస్థానం : నల్లగొండ జిల్లాలో రజాకార్ల దూరంతాలు
  18. కాన్ఫిడెన్షియల్ రిపోర్టు (గద్య కవితా సంకలనం)
  19. వంద శీర్షికలు-వంద సీసాలు (పద్య కవితా సంకలనం)
  20. తెలంగాణ ఉద్యమ కవితలు (పద్య గద్య కవితా సంకలనం)
  21. నానీల శతకము (పద్య కవితా సంకలనము)

పురస్కారాలు సన్మానాలు[మార్చు]

సాహిత్యంతోపాటు సామాజికరంగంలో విశేషమైన కృషిచేసినందుకుగాను పలుసాహిత్యసంస్థలు పురస్కారాలను అందజేశాయి.

  • తేజ ఆర్ట్ క్రియేషన్స్ ఆలేరు వారి జీవిత సాఫల్య పురస్కారం.
  • వాస్తుశిల్పి బి.ఎన్.రెడ్డి పురస్కారం.[10]
  • ప్రజాకవి సుద్దాల హనుమంతు పురస్కారం.
  • 1979 నల్లగొండ జిల్లా ఉత్తమ ప్రధానాచార్య పురస్కారం
  • రాష్ట్రోపాధ్యాయసంఘం స్వర్ణోత్సవ పురస్కారం.
  • అంబడిపూడి పురస్కారం.
  • తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను, కీర్తి పురస్కారం[8]
  • భూదానోద్యమ స్వర్ణోత్సవ పురస్కారం, పోచంపల్లి
  • విఙ్ఞానవర్ధిని ఎడ్యుకేషనల్ అకాడమీ రామన్నపేట వారి పుష్పాభిషేకం
  • మైత్రీ విద్యాలయం ఎల్లంకి వారి పుష్పాభిషేకం
  • పంచానన ప్రపంచం నల్లగొండ కూర్మిసరం పురస్కారం.
  • నల్లగొండ జిల్లా స్వాతంత్ర్య సమరయోధులచే "ఆచార్య" బిరుదు ప్రదానం.
  • ప్రజాస్పందన పత్రికా పురస్కారం, నల్లగొండ.
  • విశ్వకర్మ తేజస్విని, విశ్వకర్మ యువజన సమితి పురస్కారములు, నల్లగొండ.
  • సంతకం పత్రికా పురస్కారం మిర్యాలగూడ.
  • "భారతరత్న" అంబేద్కర్ ప్రబుద్ధ భారతి ఉత్తమ కవితా పురస్కారం, హైదరాబాదు.
  • కవిరత్న అంబడిపూడి వెంకటరత్నం పురస్కారం, సాహితీమేఖల, చండూరు.
  • 2006 నల్లగొండ జిల్లా విశిష్ట సాహితీ పురస్కారం.
  • మహాకవి పోతన పురస్కారం, మోత్కూరు.
  • నల్లగొండ జిల్లా ఆలేరు గ్రామ పంచాయతి పౌర సన్మాన పురస్కారం.
  • గీతా జయంత్యుత్సవ ఆధ్యాత్మిక పురస్కారం, ఇంద్రపాలనగరం (తుమ్మలగూడెం)
  • అక్షర కళాభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ విశిష్ట సాహితీ పురస్కారం, చౌటుప్పల్.
  • షబ్నవీసు శత జయంత్యుత్సవాల పురస్కారం, నల్లగొండ.
  • 2006 జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రదానం చేసిన నల్లగొండ జిల్లా సాహితీ పురస్కారం.
  • శత వసంతాల నీలగిరి సాహిత్య పురస్కారం నల్లగొండ జిల్లా కలెక్టర్ గారిచే ప్రధానం
  • శ్రీమద్విరాట్ విశ్వకర్మ యఙ్ఞ మహోత్సవ పురస్కారం, నల్లగొండ.
  • ఉత్తమ సీనియర్ సిటిజన్ పురస్కారం ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం నల్లగొండ జిల్లా కలెక్టర్ గారిచే ప్రదానం.
  • పోతన విఙ్ఞానపీఠం పురస్కారం, వరంగల్.
  • శ్రీ శ్రీ వేదిక పురస్కారం ఎల్లంకి.
  • "యక్షగాన కళా బ్రహ్మ" శ్రీ గంజి అనంతరాములు పంతులు గారి స్మారక పురస్కారం, చౌటుప్పల్.
  • శ్రీ బడుగు రామస్వామి సేవా సమితి సాహితీ పురస్కారం, చౌటుప్పల్
  • పురోహితరత్న శ్రీ రాచకొండ అనంతాచార్య స్మారక రాచకొండ పురస్కారం లక్కారం
  • అక్షర కళాభారతి చౌటుప్పల్ వారిచే అక్షర కళా సమ్రాట్ బిరుదు, జీవన సాఫల్య పురస్కారం ప్రధానం.
  • తెలుగు రక్షణ వేదిక, హైదరాబాదు వారిచే రాష్ట్రస్థాయి పురస్కారం, కవితాశ్రీ బిరుదు ప్రధానం
  • తెలంగాణ రాష్ట్ర ( 2014 జూన్ 2) అవతరణ సందర్భంగా తెలంగాణ పురస్కారం నల్లగొండ జిల్లా కలెక్టర్ గారిచే ప్రదానం
  • రాచమళ్ళ లచ్చమ్మ పురస్కారం.
  • మాతృకవి రాధేయ మాతృశ్రీ రాచమళ్ళ లచ్చమ్మ పురస్కారం
  • యోగాచార్య పైళ్ళ సుదర్శన్‌రెడ్డి గారి మాతా పితరులు పైళ్ళ మల్లమ్మ-వీరారెడ్డి స్మారక పురస్కారం
  • విశ్వజ్యోతి సంక్షేమ సంఘం హైదరాబాదు రజతోత్సవ పురస్కారం
  • ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 సత్కారం (తెలుగు విశ్వవిద్యాలయం, 16.12.2017)[11]
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దాశరథి సాహితీ పురస్కారం (రవీంద్ర భారతి, 22.07.2019)[12][13]
  • తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం - 2018 (తెలుగు విశ్వవిద్యాలయం, 12.12.2021)[2][14]

స్థాపించిన-స్థాపించడానికి ప్రముఖ పాత్ర వహించిన సంస్థలు[మార్చు]

  1. సత్యగాయత్రి ఆశ్రమం - ఎల్లంకి (1982)
  2. చైతన్య కళాస్రవంతి - రామన్నపేట (1985)
  3. సాహితీ స్నేహితులు - రామన్నపేట (1986)
  4. స్పందన - రామన్నపేట (1987)
  5. స్ఫూర్తి -సిరిపురం (1993)
  6. అక్షర కళాభారతి - చౌటుప్పల్ (1994)
  7. కళాభారతి - వలిగొండ (1994)
  8. పూర్వ విద్యార్థుల సమితి - ఎల్లంకి (1996)
  9. గీతా జయంతి ఉత్సవ సమితి - ఇంద్రపాలనగరం (1997)
  10. శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ స్థాపనం, ఎల్లంకి (2000)
  11. మిత్రభారతి - నల్లగొండ (2000)
  12. ఆత్మీయులు - రామన్నపేట (2002)
  13. భువనభారతి - భువనగిరి (2003)
  14. ప్రజాభారతి- మోత్కూర్ (2005)
  15. అరుంధతి సేవా సంస్థ-ఎల్లంకి (2006)
  16. సీనియర్ సిటిజన్స్ సమాఖ్య (రామన్నపేట నియోజకవర్గం) (2006)
  17. సిరిపురం డెవలప్‌మెంట్ ఫోరం (2007)
  18. మల్లెల భారతి (కొండ మల్లెపల్లి, దేవరకొండ) (2008)
  19. బతుకమ్మ తల్లి కళాబృందం, ఎల్లంకి (2010)
  20. ఏ.వి.యం ఉన్నత పాఠశాల - రామన్నపేట (1983)
  21. మైత్రీ విద్యాలయం - ఎల్లంకి (1988)
  22. విద్యాభారతి ఉన్నత పాఠశాల - రామన్నపేట (1988)
  23. రామకృష్ణ విద్యాలయం - సిరిపురం (1988)
  24. శ్రీ శ్రీ విద్యాలయం చిట్యాల (1989)
  25. విఙ్ఞానవర్ధిని ఉన్నత పాఠశాల - రామన్నపేట (1991)
  26. విశాలభారతి - చౌటుప్పల్ (1991)
  27. అల్ఫా ఉన్నత పాఠశాల - రామన్నపేట (1993)
  28. సంతోష్ విద్యా మందిర్ - ఎల్లంకి (1994)
  29. కె.ఎం. జాన్ మెమోరియల్ స్కూల్ - రామన్నపేట (1997)
  30. ఆచార్య కూరెళ్ళ ట్రస్ట్, ఆచార్య కూరెళ్ళ గ్రంథాలయం సాయి సాహితీ కుటీరం (2014)

విధ్యాలయాల్లో నెలకొల్పిన పత్రికలు[మార్చు]

  1. బాపు భారతి ప్రాథమిక పాఠశాల, గోకారం (1961)[15]
  2. మా తెలుగుతల్లి ఉన్నత పాఠశాల, ఎల్లంకి (1963)
  3. వలివెలుగు ఉన్నత పాఠశాల, వలిగొండ (1967)
  4. మన పురోగమనం రాష్ట్రోపాధ్యాయ సంఘం, రామన్నపేట (1974)
  5. చిరంజీవి ఉన్నత పాఠశాల, సిరిపురం (1977)
  6. ప్రియంవద ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల, నల్లగొండ (1982)
  7. ముచికుంద ప్రభుత్వ జూనియర్ కళాశాల, రామన్నపేట (1987)
  8. లేఖిని గ్రంథాలయం, చౌటుప్పల్ (2005)

చిత్ర మాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక). "ఇల్లే గ్రంథాలయం మనసే మమతాలయ!". పసుపులేటి వెంకటేశ్వరరావు. Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.
  2. 2.0 2.1 నమస్తే తెలంగాణ, తెలంగాణ (4 December 2021). "కూరెళ్ల విఠాలాచార్య, కళాకృష్ణకు తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాలు". Namasthe Telangana. Archived from the original on 4 December 2021. Retrieved 7 December 2021.
  3. "శెభాష్‌ విఠలాచార్య..!". andhrajyothy. Archived from the original on 2021-12-27. Retrieved 2021-12-27.
  4. "మోదీ నోట.. కూరెళ్ల మాట". Sakshi. 2021-12-27. Archived from the original on 2021-12-27. Retrieved 2021-12-27.
  5. Velugu, V6 (2021-12-26). "మన్‌ కీ బాత్‌లో తెలంగాణ వక్తిని పొగిడిన మోడీ". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2021-12-26. Retrieved 2021-12-27.
  6. Prajasakti (16 December 2021). "పుస్తకాలే ఆయన ప్రపంచం..." Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
  7. "Dr Kurella Vittalacharya: Telangana's 84-year-old marvellous Mr Words". The New Indian Express. Archived from the original on 2021-12-12. Retrieved 2021-12-12.
  8. 8.0 8.1 నమస్తే తెలంగాణ, తెలంగాణ (20 December 2017). "ఆయన ఇల్లే గ్రంథాలయం". Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.
  9. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్-వివిధ (22 July 2019). "సంప్రదాయ విప్లవకారుడు". ఏనుగు నరసింహారెడ్డి. Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.
  10. మన తెలంగాణ, ఎడిటోరియల్ (26 June 2016). "పద్య శిఖరం డా॥ కూరెళ్ళ విఠలాచార్య!". నర్రా ప్రవీణ్ రెడ్డి. Archived from the original on 23 జూలై 2019. Retrieved 23 July 2019.
  11. నమస్తే తెలంగాణ (8 December 2017). "అక్షర సైనికుడికి అరుదైన గౌరవం". Retrieved 11 December 2017.
  12. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (23 July 2019). "దాశరథి ఉద్యమస్ఫూర్తి". Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.
  13. ఆంధ్రజ్యోతి, తెలంగాణ వార్తలు (23 July 2019). "తెలంగాణ ప్రజల గొంతుక దాశరథి". Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.
  14. ఈనాడు, ప్రధానాంశాలు (4 December 2021). "విఠలాచార్య, కళాకృష్ణలకు తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారాలు". EENADU. Archived from the original on 5 December 2021. Retrieved 7 December 2021.
  15. నవ తెలంగాణ, సోపతి (15 July 2018). "ఊరూరా గ్రంథాలయ ఉద్యమస్ఫూర్తి కూరెళ్ళ". సాగర్ల సత్తయ్య. Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.

ఇతర లంకెలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.