Jump to content

కృష్ణమ్మాళ్

వికీపీడియా నుండి
కృష్ణమ్మాళ్
కృష్ణమ్మాళ్ , శంకర లింగం
జననంకృష్ణమ్మాళ్
1926
తమిళనాడు లోని పట్టివీరన్‌పట్టి
ఇతర పేర్లుకృష్ణమ్మాళ్
భార్య / భర్తశంకర లింగం

కృష్ణమ్మాళ్ జగన్నాథన్ (జననం: 1926) తమిళనాడు సామాజిక కార్యకర్త, మధురై జిల్లా మొదటి మహిళా గ్రాడ్యుయేట్. ఈమె శ్రామిక ప్రజల అభ్యున్నతి కోసం, భూమిలేని వ్యవసాయ కూలీలకు భూమిని ఇప్పించడం, కాలుష్య పరిశ్రమలకు వ్యతిరేకంగా పోరాడుతూ పేద ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. ఆమె మొదట్లో భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంది, తన భర్తతో కలిసి వినోబా భావే భూదానోద్యమం పాల్గొంది. ఈమె చేసిన సేవలకు గాను 2020లో భారత ప్రభుత్వం మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ తో సత్కరించింది.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

కృష్ణమ్మాళ్ 1926 జూన్ 16వ తేదీన రామసామి-నాగమ్మాళ్ దంపతులకు దిండిగల్ జిల్లా పట్టివీరన్‌పట్టి గ్రామంలో దేవేంద్ర వంశం వెలలార్ కుటుంబంలో జన్మించింది. ఈమెతో పాటు మొత్తం 12 మంది పిల్లలు ఉన్నారు. పట్టివీరన్‌పట్టి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు, ఆ తరువాత మదురై లో చదివింది. ఈమె తల్లి నాగమ్మాళ్ పడే కష్టాలు, పేదరికం ఈమెకు సామాజిక న్యాయం పట్ల ఆసక్తిని కలిగించాయి. 1946లో గాంధీజీ మధురైకి వచ్చినప్పుడు, ఆమె గాంధీచే ప్రేరణ పొంది గాంధేయ, సర్వోదయ ఉద్యమంలో పాల్గొంది. అక్కడ సర్వోదయ ఉద్యమంలో పనిచేస్తున్న శంకరలింగం జగన్నాథన్‌ని కలుసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. శంకరలింగం జగన్నాథన్ సంపన్న కుటుంబానికి చెందినప్పటికీ, 1930లో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. అతను 1958లో మార్టిన్ లూథర్ కింగ్‌ను కూడా కలిశాడు. కృష్ణమ్మాళ్, శంకరలింగం జగన్నాథన్‌ 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. స్వతంత్ర భారతదేశంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న శంకరలింగం, కృష్ణమ్మాళ్ 1950లో జూలై 6వ తేదీన వివాహం చేసుకున్నారు. తర్వాత 2006లో వేదారణ్యంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహ ప్లాటినం జూబ్లీ ఫంక్షన్ కి అధ్యక్షత వహించారు. ఆమె, శంకరలింగం జగన్నాథన్ ఇద్దరూ గాంధేయ మార్గంలో సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడారు. కృష్ణమ్మాళ్‌ వ్యక్తిత్వం మీద నిరాడంబరమైన జీవనశైలి మీదా మడమతిప్పని సిద్ధాంతశక్తి మీదా ప్రభావం చూపిన వ్యక్తులు చాలామందే ఉన్నారు. తమిళకవి రామలింగ వల్లలార్‌ బోధనలు ఆమెకు మానవతా పాఠాలు నేర్పాయి. పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన సుందర రామచంద్రన్‌ అమ్మలా అభిమానించారు. కృష్ణమ్మాళ్‌లోని ఆత్మవిశ్వాసం ఆమెకు బాగా నచ్చింది. ఓసారి ప్రార్థన సమావేశంలో మహాత్ముడి పక్కనే కూర్చున్న కృష్ణమ్మాళ్‌ను చూపిస్తూ 'ఆ అమ్మాయి ఎవరు?' అనడిగారట రాజాజీ. 'నా కూతురే..' అని చెప్పారు సుందర రామచంద్రన్‌. అంత ప్రేమ! పైచదువుల ఖర్చంతా తనే భరించాడు.

భూదానోద్యమం

[మార్చు]

1950 - 1952 మధ్య రెండు సంవత్సరాలు, శంకరలింగం జగన్నాథన్ ఉత్తర భారతదేశంలో వినోబా భావే భూదాన ఉద్యమంలో పాల్గొన్నాడు. అప్పుడు వినోబా భావేతో కలిసి పాదయాత్ర చేసాడు, భూస్వాములు తమ భూమిలో ఆరవ వంతు భూమి లేని వారికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఈలోగా కృష్ణమ్మాళ్ చెన్నైలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసింది.[2]

కార్యకలాపాలు

[మార్చు]
  • ల్యాండ్ ఫర్ ది టిల్లర్స్ ఫ్రీడం (LAFTI) పథకం: ఇది 1981లో ప్రారంభించబడింది. దీని ముఖ్య ఉద్దేశం గ్రామీణ పేదల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, భూమిలేని పేదలకు భూమిని అందించడం.
  • 25-12-1968న నాగై జిల్లా కిజా వెణ్మణి గ్రామంలో 42 మంది అణగారిన కమతాల కార్మికులు సజీవదహనమయ్యారు. ఈ క్రూరత్వాన్ని చూసిన వారు "ప్లోమాన్స్ ల్యాండ్ రైట్స్ మూవ్‌మెంట్" (LAPTI) అనే సంస్థను ప్రారంభించారు.
  • రొయ్యల ఫామ్ కోసం వ్యవసాయ భూముల సేకరణకు వ్యతిరేకంగా పోరాడారు.
  • 2013 ఫిబ్రవరిలో భర్త మరణించిన తర్వాత కూడా కృష్ణమ్మాళ్ సేవే జీవితమంటూ పనిచేస్తోంది.[3] అతని పేరు కూడా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయబడింది.
  • ఈమె గాంధీగ్రామ్ ట్రస్ట్ అండ్ యూనివర్శిటీ, మధురై యూనివర్శిటీ సెనేట్ సభ్యురాలు. ఆమె అనేక స్థానిక, రాష్ట్ర సాంఘిక సంక్షేమ కమిటీలలో సభ్యురాలు, జాతీయ కమిటీ, భూ సంస్కరణల కమిటీ, ప్రణాళికా కమిటీ సభ్యురాలు.

డాక్యుమెంటరీ

[మార్చు]

కృష్ణమ్మాళ్-జగన్నాథన్ దంపతుల సేవను దృష్టిలో ఉంచుకుని అరవింద్ మాగ్ దర్శకత్వంలో సయ్యద్ యాస్మీన్ నిర్మించిన 'దట్ ఫైర్డ్ సోల్' అనే షార్ట్ ఫిల్మ్ చెన్నై ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014లో ప్రదర్శించబడింది.

అవార్డులు

[మార్చు]
  • స్వామి ప్రణవానంద శాంతి పురస్కారం (1987)
  • జమ్నాలాల్ బజాజ్ అవార్డు (1988)
  • పద్మశ్రీ అవార్డు (1989)
  • భగవాన్ మహావీర్ అవార్డు (1996)
  • సమ్మిట్ బాట్జెన్ అవార్డు --స్విట్జర్లాండ్ (1999)
  • ఓపస్ ప్రైజ్ --సీటెల్ యూనివర్సిటీ (2008)[4]
  • రైట్ లైవ్లీహుడ్ అవార్డు (ప్రత్యామ్నాయ నోబెల్‌)
  • పద్మభూషణ్ (2020)

అందరికీ ఇళ్లు!

[మార్చు]

ఏ అవార్డు అందుకోడానికి వెళ్లినా ఏ అంతర్జాతీయ సదస్సుకు హాజరైనా ఆమె చేతిలో ఓ ఇటుక ఉంటుంది. అందరికీ ఆ కథేమిటో చెబుతారు. ఊరిచివర పూరిగుడిసెల కష్టాలు వివరిస్తారు. కృష్ణమ్మాళ్‌ బాల్యం అలాంటి పాకలోనే గడిచింది. వానాకాలం వస్తే ఇల్లంతా జల్లెడవుతుంది. తలదాచుకోడానికి చోటుండదు. పెనుదుమారం రేగిందంటే పైకప్పు గాలిపటమై ఎగిరిపోతుంది. నిరుపేద బతుకులు వీధులపాలు అవుతాయి. వేసవిలో అయితే అగ్నిప్రమాదాల భయం. తేడావస్తే, వాడవాడంతా బూడిదైపోతుంది. అసలా ఇరుకిరుకు జీవితమే నరకం. హుందాగా భద్రంగా బతకడానికి ప్రతి దళిత కుటుంబానికీ ఓ ఇల్లంటూ అవసరం. అందుకే, కృష్ణమ్మాళ్‌ వూరిచివరి బతుకులకు వెచ్చని నీడ అందించే ప్రయత్నం వెుదలుపెట్టారు. నిజానికి ఆ నిరుపేదలు పూరిపాకలు వేసుకున్న జానెడు జాగా కూడా వాళ్లది కాదు. ఏ సర్కారు భూమినో అయి ఉంటుంది. పెత్తందార్లకు ఆగ్రహం వస్తే ఆ కాస్త నీడా చేజారిపోతుంది. కృష్ణమ్మాళ్‌ చొరవతో.. దళితులు గుడిసెలు వేసుకున్న స్థలాల మీద వారికే హక్కులు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇళ్లు కట్టుకోవడమే తరువాయి. అందుకు అవసరమైన ఇటుకల తయారీకి కుత్తూర్‌లో ఓ కార్ఖానా ప్రారంభించింది. చమురు, సహజవాయువుల సంస్థ (వోఎన్‌జీసీ) యంత్రాల్ని ఇచ్చింది. మరో ప్రభుత్వరంగ సంస్థ ఇటుకల తయారీకి పారిశ్రామిక వ్యర్థాల్ని ఇవ్వడానికి ముందుకొచ్చింది. దాంతోనే పర్యావరణానికి నష్టంకాని పద్ధతుల్లో అక్కడ ఇటుకలు తయారుచేస్తున్నారు. తొలి ఇటుక...పెనుమార్పుకు సూచిక! అందుకే కృష్ణమ్మాళ్‌ దాన్ని అందరికీ చూపిస్తారు. ప్రత్యామ్నాయ నోబెల్‌గా పేరున్న 'రైట్‌ లైవ్‌లీహుడ్‌ అవార్డు' విజేతగా మూడులక్షల అమెరికన్‌ డాలర్లలో తనవాటా వెుత్తాన్ని కూడా ఆమె గృహనిర్మాణాలకే కేటాయించారు.

అమ్మ మనసు

[మార్చు]

తొలిపొద్దే నా గురువు. తొలిపొద్దే నా దైవం. తెల్లవారుజామున నాలుగింటికే లేవడం నాకు అలవాటు. కాసేపు ఆకాశంవైపు చూస్తూ కూర్చుంటాను. నా మనసులో పేరుకుపోయిన సందేహాల్ని ఎవరో శుభ్రంగా కడిగేస్తున్న భావన కలుగుతుంది. ఆరోజుకు అవసరమైన శక్తి నాకు అందేది అప్పుడే.

ఈ పూట ఏ ఒక్కరు ఆకలితో పడుకున్నా ఈ సృష్టికి అర్థంలేదు. మానవత్వానికి అర్థంలేదు....సుబ్రహ్మణ్యభారతి కవిత్వం నాకెంతో స్ఫూర్తినిచ్చింది. మిత్రులారా! రండి...మనమంతా ఒక్కటై ఆకలిని గెలుద్దాం. పేదరికాన్ని గెలుద్దాం.

నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అయినా కోట్ల రూపాయల విలువైన కార్యక్రమాలు ప్రారంభిస్తాను. నా మీద నాకున్న నమ్మకం, అంతకుమించి కరుణాసముద్రుడైన దేవుడిమీదున్న నమ్మకం... నన్ను ముందుకు నడిపిస్తోంది.

మహాత్మాగాంధీ, వినోబా భావే, జయప్రకాశ్‌ నారాయణ్‌... నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఈ ముగ్గురూ. వినోబా ప్రభావం మరీ ఎక్కువ. ఆయనో మహర్షి. పేరు గురించి ప్రచారం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నిత్యం పేదల మధ్యే గడిపేవాడు. పేదల గురించే ఆలోచించేవాడు. ఏకాస్త తీరిక ఉన్నా ప్రార్థనలో లీనమైపోయేవాడు.

ఈ విజయాలు అవార్డులు నాకు దారిచూపిన మహాత్ములకు నివాళుల్లాంటివి. పర్యావరణ సమస్యలకు, జాతులు మతాలపేరిట జరుగుతున్న మారణహోమాలకు గాంధీజీ, మార్టిన్‌ లూథర్‌కింగ్‌, మదర్‌థెరిసా, మండేలా వంటి మహానుభావుల బోధనల్లో పరిష్కారం ఉంది. చిత్తశుద్ధితో అనుసరించడం మన కర్తవ్యం.

దేవుడు ఈ భూమి మీదికి పంపింది మన బతుకు మనం బతకడానికి మాత్రమే కాదు. మన పొట్ట మనం నింపుకోడానికి మాత్రమే కాదు. నలుగురికీ సాయం చేయడానికి. మనకు ఉన్నదే పదివేలు. దాన్నే అందరితో పంచుకుందాం.

పోచంపల్లిలో...

[మార్చు]

వినోబాభావే వెనకాలే జగన్నాథన్‌, కృష్ణమ్మాళ్‌ అతని అనుచరులుగా వారు దేశమంతా తిరిగారు. కొన్నివేల మైళ్లు పాదయాత్రలు చేశారు. అందులో భాగంగా హైదరాబాదు‌ కూడా వచ్చారు. దాదాపు మూడువందల మైళ్ల ప్రయాణం! 1951లో సర్వోదయ వార్షిక సమావేశం హైదరాబాదు‌ శివార్లలోని శివరాంపల్లిలో జరిగింది. కమ్యూనిస్టు ఉద్యమాలు, రజాకర్ల గొడవలతో రక్తసిక్తమైన తెలంగాణ ప్రాంతంలో శాంతిసందేశాన్ని వినిపించాలని వినోబా ఆలోచన. ఏప్రిల్‌ 18న ఆయన నల్గొండ జిల్లాకు వచ్చాడు. నిర్వాహకులు పోచంపల్లిలో బస ఏర్పాటు చేశారు. అతను నేరుగా దళితవాడకు వెళ్లాడు. కనీస వసతుల్లేని పరిస్థితులు. అంతా జానెడు భూమైనా లేని నిరుపేదలే. 'మాకూ కాస్త భూమి ఉంటే, మా జీవితాలు ఇలా తెల్లారేవి కాదు' అని బాధపడ్డారు అక్కడి జనం. 'భూమి మాత్రమే వాళ్ల జీవితాల్ని మార్చగలదు. ఆ పేదలకు అవసరమైన పొలం ఇవ్వడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా?' ... ప్రార్థన సమావేశంలో గ్రామస్థుల్ని ప్రశ్నించారు వినోబా. 'నేనున్నాను. వంద ఎకరాలు ఇవ్వడానికి సిద్ధం' .. రామచంద్రారెడ్డి అనే భూస్వామి ప్రకటించాడు. ఆ వితరణ వినోబాలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. భారతదేశంలో భూసమస్యకు ఓ పరిష్కారం దొరికింది. ఆ సంఘటన భూదాన ఉద్యమానికి నాంది పలికింది. పరోక్షంగా కృష్ణమ్మాళ్‌ జీవితానికీ దిశానిర్దేశం చేసింది.[5]

మూలాలు

[మార్చు]
  1. "Arun Jaitley, Sushma Swaraj, George Fernandes given Padma Vibhushan posthumously. Here's full list of Padma award recipients". The Economic Times. 2020-01-26. ISSN 0013-0389. Retrieved 2023-05-24.
  2. "Krishnammal Jagannathan: गरीबों को जमीन का मालिकाना हक दिलाने वाली कृष्णम्माल जगन्नाथन के बारे में जानें". Amar Ujala. Retrieved 2023-05-24.
  3. "Krishnammal and Sankaralingam Jagannathan / LAFTI". Right Livelihood. Retrieved 2023-05-24.
  4. "Krishnammal Jagannathan". Opus Prize. Retrieved 2023-05-24.
  5. "కృష్ణమ్మాళ్ జగన్నాథన్: మహిళకు భూయాజమాన్యం అందించిన ధీశాలి". BBC News తెలుగు. 2021-07-02. Retrieved 2023-05-24.

యితర లింకులు

[మార్చు]