కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కృష్ణ శాస్త్రి జగేశ్వర్ భీష్మ

కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ మంచి పండితుడు . యితడు బోరీ గ్రామంలో 1854 లో జన్మించి ,నాగ్పూర్ లో పెరిగి స్కూల్ ఎకౌంట్స్ శాఖలో పనిచేశాడు . తర్వాత గాంధీగారి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని ఉద్యోగం వదిలి వ్యవసాయం చేశాడు . అతనికి 1908 సం : లో శరీరం నిండా చందనము ,ముఖం మీద త్రిపుండ్రాలు ,పాదాల వద్ద పూలు ఉన్న ఒక నల్లటి బ్రాహ్మణుడు స్వప్న దర్శనమిచ్చి 'సచ్చిదానంద ' అనే పెద్ద అక్షరాలు , 'మంత్ర్ -వ -శికావా ' ( ఆ మంత్రం నేర్చుకో ) అని వ్రాసి ఉన్న ఒక వార్తాపత్రిక చూపించి అదృశ్యమయ్యాడు . కానీ భీష్ముని కేమీ అర్ధం కాలేదు .

ఒకసారి దాదాసాహెబ్ ఖాపర్దే భీష్మకు బాబా గురించి తెల్పి శిరిడీ తీసుకెళ్ళాడు . బాబా భీష్మను చూసి చేతులు జోడించి ,"జై సచ్చిదానంద " అన్నారు . వెంటనే అతనికి తన స్వప్నం గుర్తు వచ్చింది . కానీ తనకు స్వప్నంలో బాబాయే ఆ బ్రాహ్మణ రూపంలో దర్శనమిచ్చారో లేదో అతనికి అర్ధంకాలేదు .

ఒకసారి బాబా చిలిం త్రాగి భీష్మునికిచ్చి పొగపీల్చమన్నారు . బాబా భీష్మునితో ,"నేనెప్పుడూ అన్ని చోట్లా తిరుగూతుంటాను . బొంబాయి ,పూణే ,సతారా ,నాగపూర్ మొ : న నగరాలన్నింటిలో రాముడే నిండి ఉన్నాడు . అర్ధమైందా !" అన్నారు . కొద్దిసేపాగి ,"ఎప్పుడూ నాకు పెట్టకుండా తింటావెందుకు ? ఇప్పుడైనా ఐదు లడ్డూలివ్వు " అన్నారు . ఆ మాటలు వినగానే తనకు స్వప్నంలో కనిపించిన బ్రాహ్మణుడే సాయి అనే భావన అతడికి కలిగింది . అతడు భక్తితో ఆయన పాదం తీర్ధం తీసుకుని నమస్కరించాడు .

కానీ బాబా తనను ఐదు లడ్డూలనే ఎందుకడిగారో భీష్మునికి బోధపడలేదు . అతడెప్పుడూ ఏ పాటలూ వ్రాయలేదు . అలాంటిది మరునాడు తెల్లవారగానే బాబా మీద పాటలు స్పురించసాగాయి . అతడు ఐదు పాటలు వ్రాయగానే ఇక ఆ కవిత్వపు ప్రవాహం అతనిలో ఆగిపోయింది . ఆ ఐదు పాటలను వ్రాసి బాబాకు సమర్పించాడు . ఐదు లడ్డూలంటే ఐదు పాటలని భీష్మకు అర్ధమైంది . బాబా ఆదేశం పై అతడు ఆ పాటలను ఎంతో భక్తితో పాడి వినిపించాడు . బాబా కరుణతో అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు . వెంటనే అతనికి కవిత్వం స్పురించి 'శ్రీ సాయినాథ సగుణో పాసన అక్కడికక్కడే వ్రాశాడు . దాదాసాహెబ్ ఖాపర్దే దానిని ముద్రించాడు.

భీష్మ తరచుగా శిరిడీ వచ్చి ఎక్కువ సమయం సాయి సన్నిధిలోనే ఉండేవాడు . శ్రీరామనవమికి శిరిడీలో బాబా సన్నిధిలో సంకీర్తన చేశాడు . అతనికి కీర్తనకారుడుగా మంచి పేరు వచ్చింది . ఆ తర్వాత అతడు ఎన్నో భక్తిపరమైన గ్రంధాలు వ్రాశాడు . శిరిడీ హారతులు , 'శ్రీ సాయినాథ్ సగుణోపాసన' సాయి ఆశీస్సులతో రచించి మనకందించిన భాగ్యవంతుడు భీష్మ .